Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత్రి, సంపాదకురాలు, ప్రచురణకర్త శ్రీమతి జ్యోతి వలబోజు ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘ధీర’ అనే పుస్తకం వెలువరించిన శ్రీమతి జ్యోతి వలబోజు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం జ్యోతి వలబోజు గారూ.

జ్యోతి వలబోజు: నమస్కారం.

~

ప్రశ్న 1: జె. వి. పబ్లికేషన్స్ తరఫున ‘ధీర’ పేరుతో కథలు/పరిచయాలతో సంకలనం వెలువరించడం వెనుక మీ ఆలోచన వివరిస్తారా? వెనుక అట్ట మీద ‘Anthology of 126 Telugu Real Stories’ అని అన్నారు. దీని గురించి వివరించండి.

జ: నేను ఇంతకుముందు తొమ్మిది సంకలనాలు చేసాను. ఇది పదవది. కథలు, కవితలు, పద్యాలు, ఉత్తరాలు, పిల్లలు, జ్ఞాపకాలు.. ఇటువంటి అంశాలతో సంకలనాలు తీసుకువచ్చాను. ఈసారి ఏం అంశం అయితే బావుంటుంది అని ఆలోచిస్తున్నాను. అందరూ నన్ను ధీర, గొప్ప వ్యక్తి, చాలామందికి ఇన్స్పిరేషన్ ఇస్తాను అని పొగుడుతుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే.. “నేనొక్కదాన్నే గొప్పదాన్ని కాదు. నాలాంటివారు, నన్ను మించినవారు ఎందరో ఉన్నారు. వారంతా పత్రికలలో, టీవీలలో కనపడరు. వారికి ఎవరూ బహుమతులు, అవార్డులు ఇవ్వరు. అటువంటి మహిళలు మన ఇంట్లోనే ఉన్నారు. మన చుట్టూనే ఉన్నారు. కుటుంబం, పిల్లలు, బందువులతోపాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నారు. కొందరు గెలిచారు. కొందరు ఓడిపోయారు. ఆ పోరాటపటిమను ఎంతమంది గుర్తించారు? ఆ ధీర మీ అమ్మ కావచ్చు, పిన్ని కావచ్చు, పెద్దమ్మ లేదా తోటికోడలు కూడా కావచ్చు. అటువంటి మహిళలను పరిచయం చేయండి.. ఊహించి రాయవద్దు. వాస్తవగాథలే రాయండి. మీ చుట్టూ గమనించండి. తెలుసుకోండి. కథలు రాయండి” అని ఆహ్వానించాను. అద్భుతమైన కథలు వచ్చాయి. భాష, వ్యాకరణ దోషాలను సరిచేసి పుస్తకంగా తయారు చేసాను. నేను కూడా అయిదుగురు మహిళల గురించి రాసాను. వారితో మాట్లాడి, వివరాలు తెలుసుకుని మరీ రాసాను. ఈ సంకలనంలో ఉన్న కథలన్నీ వాస్తవ గాథలే.

ప్రశ్న 2: సంకలనం వేయాలన్న ఆలోచనకి రూపం కల్పించడానికి ఏయే ప్రణాళికలు వేసుకున్నారు? ఆలోచనను ఆచరణలో పెట్టడంలో ఏయే సాధకబాధకాలెదుర్కున్నారు?

జ: సంకలనం వేయడం అంత కష్టమూ కాదు. అలాగని సులువూ కాదు. ముందుగా తీసుకోవలసింది మంచి అంశం. నేను ఎప్పుడూ చెప్తాను – “కల్పించి, ఊహించి రాయకండి. నిజంగా జరిగిన కథ లేదా సంఘటనను మీదైన శైలిలో కథగా మలచండి” అని. ఈ విషయంలో దాదాపు విజయం సాధించగలిగాను అనుకుంటాను. ముందుగా ఫేస్‌బుక్‌లో ఒక గ్రూపు మొదలుపెడతాను. వాట్సాప్ అయితే హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు. సంకలనంలో రాస్తాము, రాయగలరు అన్నవాళ్లని అందులో చేరుస్తాను. అంశం చెప్తాను. దానికి ఇచ్చే రూల్స్, రెగ్యులేషన్స్ చెప్తాను. ఆఖరి తేది కూడా అప్పుడే చెప్పేస్తాను. రెండు నెలల టైమ్ ఇస్తాను. ఏదైనా సందేహం ఉంటే నాతో మాట్లాడమని చెప్తాను. ఈ పుస్తకం కోసం విడిగా మెయిల్ క్రియేట్ చేస్తాను. మెల్లిగా కథలు వస్తాయి. ముందే చెప్తాను. ఎక్కువ తప్పులు ఉంటే తీసుకోను అని. మీకు రాకపోతే వేరేవాళ్లతో సరిచేయించుకుని కథలు పంపాలి అని. వీటన్నింటిని నా సిస్టమ్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ఎక్కువ వచ్చాయి అన్న తర్వాత పేజ్ మేకింగ్ మొదలుపెడతాను. రచయిత్రులను సమీకరించి, కొందరికి కాల్ చేసి మాట్లాడి చెప్తాను. శ్రమ పెట్టక తప్పదు.

ప్రశ్న 3: సంకలనంలో చేర్చే కథలను/రచయిత్రులను ఎలా నిర్ణయించుకున్నారు?

జ: నాకు పరిచయమున్న మహిళలలో బాగా రాస్తున్నారు, రాయగలరు అని గమనిస్తే, వారితో ఇదీ సంగతి అని చెప్పి రాయమంటాను. సరే అన్నవారిని గ్రూపులో చేరుస్తాను. ఇందులో ముందే రాసి, పేరు తెచ్చుకున్నవారే కాకుండా రాయగలరు అనిపించిన కొత్తవారిని కూడా చేరుస్తాను. నా ముఖ్య ఉద్దేశం కొత్తవారిని ప్రోత్సహించాలి. వారికి అవకాశం ఇవ్వాలి. సీనియర్ రచయిత్రులతో పాటుగా వాళ్ల కథలు, పేరు చూసుకుని మురిసిపోతారు, గర్వంగా, సంతోషంగా ఫీలవుతారు కొత్త రచయిత్రులు.

ప్రశ్న 4: విభిన్న ఇతివృత్తాల కథలను సంకలనంలో చేరుస్తున్నప్పుడు ఏదైనా ఏకసూత్రత కోసం చూశారా? కథలు/పరిచయాల ఎంపికకు మీరు పాటించిన ప్రమాణాలేమిటి?

జ: సంకలనాలు చేస్తున్నప్పుడు నేను చూసే ఒకే విషయం.. కథలు బావుండాలి. భాష, వ్యాకరణ దోషాలు తక్కువగా ఉండాలి. ఎందుకంటే రచయిత అనిపించుకోవాలంటే కథతోపాటు వ్యాకరణం, భాషాదోషాలను కూడా చూసుకోవాలి. పిచ్చిగా ఉంటే మాత్రం అంగీకరించను. కొత్తవారి కథలను చాలా జాగ్రత్తగా చదువుతాను. తప్పులుంటే చెప్తాను. వారినే సరిచేయమంటాను.

ప్రశ్న 5: సంకలనంలోని కథలకు పేజీల నిడివి పరిమితి విధించారా? లేదా నిడివితో నిమిత్తం లేకుండా, ఎంపిక చేసుకున్న కథలను ప్రచురించారా?

జ: పేజీల పరిమితి చాలా ముఖ్యమండి. ఎందుకంటే చదువరులు పెద్ద కథలు చదవట్లేదు. పది, ఇఱవైమంది కాదుగా, ఎక్కువమంది రాసినప్పుడు పేజీలు పెరుగుతాయి. పుస్తకం బరువు పెరుగుతుంది. ప్రచురణ ఖర్చు పెరుగుతుంది. అందుకే వర్డ్ ఫైల్‌లో మూడు పేజీలు అని చెప్తాను. కొంచెం అటుఇటుగా అయినా ఏమనను. కథ బావుందని కొన్ని ఎక్కువ పేజీలు ఉంటే కొన్నిసార్లు తీసుకున్నా.

 

ప్రశ్న 6: మీ కృషికి రచయిత్రుల సహకారం ఎలా ఉంటుంది? ఇంతమంది రచయిత్రులతో ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు?

జ: రచయిత్రుల సహకారం బావుంటుంది. లేకపోతే ఇన్ని సంకలనాలు ఎలా చేయగలిగేదాన్ని. ఫేస్‌బుక్ గ్రూపులో వీరందరితో మాట్లాడడం. డిస్కస్ చేయడం.. ఉదా: వారి ఫోటోలు, పరిచయాలు, ఫోన్ నంబర్లు మొదలైనవన్నీ గ్రూపులోనే ఇవ్వమంటాను. కథలు పంపినవారిని ఫైనల్ చేసిన తర్వాత పంపని వారిని గ్రూపు నుండి తీసేస్తాను. వారికి గ్రూపులో ఉండే అర్హత ఉండదు కదా. నేను చెప్పిన సూచనలు రచయిత్రులు పాటిస్తారు. వారు చెప్పినవి నేను కూడా ఆలోచించి, బావుంటే తీసుకుంటాను, మార్పులు చేసుకుంటాను.

ప్రశ్న 7: 640 పేజీలున్న ఈ సంకలనం తయారీలో మీరేవైనా ఇబ్బందులు ఎదుర్కున్నారా? వివరించండి. ఈ పుస్తకం ముద్రణకి వ్యయం కూడా అధికంగానే అయ్యుంటుంది. సంకలనానికి ఫండ్స్ ఎలా ఏర్పాటు చేసుకున్నారు?

జ: ఇష్టంగా చేసినప్పుడు ఇబ్బందులు అంతగా ఉండవు. ధీర చేసేటప్పుడు నాకు పరిచయమున్న నలుగురిని నా టీమ్‌గా చేసాను. లావణ్య బుద్ధవరపు, శ్రీ పేరి, కవితా బేతి, పావని.. వీరికి తలా ఒక పని అప్పజెప్పాను. మెయిల్ చూసి కథలు అన్నీ కరెక్షన్స్ చూసి నాకు పంపమని ఇద్దరికి, గ్రూపులో అప్పుడప్పుడు పోస్టులు పెట్టి సమాచారాన్ని సేకరించడం ఒకరు, ఫోటోలు, ఫోన్ నంబర్లు తీసుకోవడానికి ఒకరు.. ఇలా వారికి బాధ్యతలు అప్పజెప్పాను. దానివల్ల నాకు అంత కష్టం కాలేదు. ఫైనల్ బుక్ డిజైనింగ్ నా చేతిలోకి తీసుకున్నాను. ప్రచురణ ఖర్చు ఎక్కువే అయింది.

మొదటినుండి కూడా ఏ సంకలనం చేసినా దాని ఖర్చు అందులోని రచయిత్రులు కలిసి షేర్ చేసుకునేవాళ్లం. మొత్తం పెట్టుకోవడం నావల్ల సాధ్యమయ్యే పని కాదు. ధీర పుస్తకం కూడా అంతే.. అందరూ సమానంగా కాకుండా పేజీకి ఇంత అని నిర్ణయించి, ఆ ప్రకారంగా వాళ్లను డబ్బులు కట్టమనేదాన్ని. ఒక వంద కాపీలు నా డబ్బులతో ఎగస్ట్రా వేయించుకున్నాను. ఉన్న పుస్తకాలను రచయితలకు సమానంగా ఇచ్చేస్తాను. ధీర పుస్తకానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు, సర్టిఫికెట్ కూడా చేయించాను. కావలసినవాళ్లు తగినంత రుసుము చెల్లిస్తే వారి పేరుతో విడిగా సర్టిఫికెట్లు చేయించాను. ప్రచురణకర్తగా ఆవిష్కరణ సభ ఖర్చు మాత్రం నేనే పెట్టుకుంటాను.

ప్రశ్న 8: పుస్తకం తయారీ ఆలోచన వచ్చినప్పటి నుంచి, ముద్రితమై చేతికి వచ్చేవరకూ ఎంత కాలం పట్టింది? ఈ ప్రక్రియలో మీకు ఎవరెవరు సహకరించారు?

జ: ఆలోచన వచ్చినప్పటినుండి పుస్తకం చేతికి వచ్చేవరకు ఆరు నెలలు పట్టిందండి.. ఈ ప్రక్రియలో నాకు తోడుగా ఉన్నవాళ్లు. ప్రూఫ్ చూడడంలో సహకరించిన వ్యక్తి అందరికీ తెలిసిన నండూరి సుందరీ నాగమణి, మరియు పుస్తకం ఆలోచన చేసినప్పటినుండి ఆవిష్కరణ సభ పూర్తయ్యేవరకు నాకు పూర్తి సహకారం అందించినవారు లావణ్య బుద్ధవరపు, శ్రీ పేరి, కవితా బేతి, పావని. ఆవిష్కరణ సభ రోజు కూడా చాలా పనులుంటాయి. దానికి వీరు నలుగురూ తోడుగా ఉన్నారు. నాగోల్ లోని ఐఫోకస్ కార్యాలయంలో ఆవిష్కరణ జరిగింది.

ప్రశ్న 9: ఇప్పుడు వస్తున్న ఇతర సంకలనాలతో పోలిస్తే మీ సంకలనం ప్రత్యేకత ఏమిటి?

జ: ధీర ప్రత్యేకత అంటే.. ఇందులో ఉన్నవారందరూ మన పక్కనే, మన ఇంట్లో, మన స్నేహితులలో, బంధువులలో ఉన్న సామాన్య స్త్రీలే. వారిని, వారి పోరాటాన్ని గుర్తించి పరిచయం చేసారు. అసలు ఈ సంకలనంలో కొందరు ధీరలు ఆయా రచయితలే..

ప్రశ్న 10: ఈ సంకలనం ప్రచురణలో ఏదైనా మరపురాని సంఘటన లేక ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం ఏదైనా ఉంటే, తెలియజేస్తారా?

జ: సంకలనం కోసం కథలు చదువుతూ పేజ్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు కొన్ని కథలు చదువుతుంటే కంటనీరు ఆగలేదు. కాస్సేపు నా పని ఆపేసేదాన్ని. కొద్దిసేపు అలా మౌనంగా కూర్చుని కళ్లు తుడుచుకుని, మళ్లీ మొదలెట్టేదాన్ని. ఉదాహరణకు ఒక కథలో రచయిత తన స్వంత అనుభవమే రాసింది. నేనే రాయమన్నాను అనుకోండి. దీపావళి సందర్భంగా కుటుంబం మొత్తం టపాకాయల ప్రమాదంలో చిక్కుకున్నారు. తను కూడా తీవ్రంగా గాయపడింది. అయినా తన పిల్లల కోసం చాలా ఆరాటపడింది. తర్వాత కోలుకుని, అమెరికా వెళ్లి, గాయాల మచ్చలతోనే బ్యూటీ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచింది ఆ తల్లి. తర్వాతర్వాత ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమన్‌గా పేరు తెచ్చుకుంది.

ఇలాటి మరి కొన్ని కథలు చదువుతుంటే నాకు అనిపించింది.. ఇంతమంది, ఇంకెంతోమంది పడ్డ కష్టాలు మామూలువి కావు. వారందరికంటే మన జీవితమెంతో మెరుగ్గా ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకీ ఆరోపణలు, అసహనాలు అని పదేపదే అనుకున్నాను. కొందరు మిత్రులతో పంచుకున్నాను కూడా ఈ విషయం.

ప్రశ్న 11: ఈ సంకలనం గురించి పాఠకులకు తెలిసేలా ఈ పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు? కొందరు రచయితలు/ప్రచురణకర్తలు ఉపయోగించినట్టుగా రీల్స్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారా?

జ: రీల్స్, ఇన్స్టా వంటివి ఉపయోగించలేదండి. నాకు అవి తెలీవు కూడా. మామూలుగా పత్రికలలో సమీక్షలు, ఈనాడు ఎడిటర్‌తో మాట్లాడి మంచి వ్యాసం వచ్చేలా చేసాను. షాప్స్ వాళ్లతో మాట్లాడి బుక్స్ పెట్టాను.

ప్రశ్న 12: తెలుగులో పుస్తకాలకు ఆదరణ తగ్గిందని కొందరు ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు అంటున్నారు. ఎందుకనంటారు? పాఠకులు తగ్గారా? వారిని ఆకర్షించే రచనలు తగ్గాయా? లేక ఇంకా ఏదయినా కారణం వుందా?

జ: పుస్తక ప్రదర్శనలో స్టాల్ పెట్టడం, పుస్తక ప్రచురణ చేయడం వల్ల నాకు అర్థమైనది ఏంటంటే.. పుస్తకాలు చదివేవారు ఉన్నారు. లేకుంటే మన హైదరాబాదు పుస్తకప్రదర్శనలో లక్షల విలువైన పుస్తకాలు ఎలా అమ్ముడవుతాయి. సాంకేతిక విప్లవం అదేనండి ఇంటర్నెట్, తెలుగు టైపింగ్, ఫేస్‌బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఇలా సామాజిక మాధ్యమాల వలన రాయడం, ప్రచురించడం, ప్రచారం చేసుకోవడం అమ్మకాలు చేయడం బాగా పెరుగుతోంది. ఇప్పుడు AI కూడా చేరింది. మంచిదే.. కానీ, పుస్తకాల ప్రచురణ పెరిగినా ఆ ప్రమాణంలో పాఠకులు పెరగలేదు. క్వాలిటీ కూడా తగ్గిందని చెప్పవచ్చు. నా చిన్నప్పుడు రచయితలు తక్కువ, ప్రచురణకర్తలు చాలా తక్కువ కానీ పాఠకులు ఎక్కువగా ఉండేవారు. ప్రచురణకర్తలు డబ్బులు ఇచ్చి రచయితల పుస్తకాలు తీసుకుని ప్రచురించేవారు. ఇప్పుడు రచయితలు, పుస్తకాలు ఎక్కువయ్యాయి. ప్రచురణకర్తలు ప్రతీ పుస్తకాన్ని తమ స్వంత సొమ్ముతో ప్రచురించలేరు కదా. అమ్ముడవుతాయి అన్న పుస్తకాలకు మాత్రమే ప్రచురణకర్తలకు లాభసాటి కదా. అందుకే రచయితలు తమ పుస్తకాలను తమ స్వంత డబ్బులతో ప్రచురించుకుంటున్నారు. అదే విధంగా ఇతర స్టాల్స్, ప్రచురణకర్తలకు తమ పుస్తకాలను అమ్మకాలకు ఇచ్చి, డబ్బులు రావట్లేదని రచయితలు బుక్ ఫెయిర్‌లో కూడా రైటర్స్ స్టాల్‌లో టేబుల్ వేసుకుని కూర్చుంటున్నారు. అమ్మిన సొమ్మంతా వాళ్లదే. కాని ఇతర స్టాల్స్ వాళ్లు అమ్మకాలలో తమ వాటా తీసుకుంటారు కదా. వేలకు వేలు డబ్బులు కట్టి స్టాల్ తీసుకుని ఇతరుల పుస్తకాలు ఉచితంగా అమ్మి పెట్టలేరు కదా.

ప్రశ్న 13: జె. వి. పబ్లికేషన్స్ తరఫున మీరు ప్రచురించిన ఇతర సంకలనాల గురించి చెప్పండి. వాటి ప్రచురణకీ, ఈ పుస్తకం ప్రచురణకీ మధ్య పోలికలు/తేడాల గురించి వివరించండి.

జ: 2014 లో జె.వి.పబ్లికేషన్స్ ప్రారంభించబడింది. అప్పటినుండి నేను చేసిన సంకలనాలు..

  1. ప్రమదాక్షర్ కథామాలిక – తండ్రీ తనయ
  2. ప్రమదాక్షరి కథామాలిక – 2
  3. అష్టవిధ నాయికలు
  4. నవ్వుల నజరానా
  5. కథాకేళి
  6. ప్రియమైన నీకు
  7. పిల్లలు చెప్పిన పాఠాలు
  8. గుర్తుకొస్తున్నాయి
  9. ధీర

ప్రశ్న 14: సంపాదకురాలిగా, సంకలనకర్తగా, ప్రచురణకర్తగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ఏవైనా కొత్త పుస్తకాలు సిద్ధమవుతున్నాయా?

జ: భవిష్యత్తు ప్రణాళికలు అంటూ ఎప్పుడూ అనుకోను. ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను. సంకలనాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఈ శ్రమ తీసుకోవడం నా వల్ల కష్టం అనిపిస్తోంది. అదీ కాకుండా ఇటువంటి ప్రయోగాలు నేనే ఎందుకు చేయాలి. ఇంకా కొందరుముందుకు రావాలి. కొత్త కొత్త ఆలోచనలు చేయాలి. ఇదే మాట ‘ధీర’ పుస్తకావిష్కరణలో చెప్పాను. “ఎవరో ఒకరు ముందుకు రండి, బాధ్యత తీసుకోండి. నేను చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు.. మీకు ఎటువంటి సహాయమైనా నేను చేస్తాను అని. అసాధ్యమైనదేదీ లేదు” అని. కానీ కష్టమైన పనే..

‘ధీర’ పుస్తకమే ఒక స్పెషల్ ప్రయోగం అనుకుంటే నాకు సంబంధించిన ఒక పెద్ద విశేషం చెప్తాను. ఎంతోమంది, ఎన్నోసార్లు నాతో అన్నారు.. “జ్యోతిగారూ మీరు చాలా గొప్పవారండి. అందరికీ సాయం చేస్తారు. ప్రోత్సాహమిస్తారు. మీకు సన్మానం చేయాలండి” అని. “అంత లేదు. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడు సన్మానాలు గట్రా ఏమీ వద్దు” అనేదాన్ని. ఈ ‘ధీర’ ఆవిష్కరణరోజు మాత్రం అద్భుతంగా ముగిసింది. ఈ పుస్తకంలో రాసిన రచయిత్రులందరూ శ్రీ పేరి పర్యవేక్షణలో తలా కొంత డబ్బులు కూడబెట్టి నాకోసం నాకు ఇష్టమైన వస్తువులు బహుమతిగా ఇచ్చారు. మంచి పట్టుచీర, కాలికి పట్టీలు, కడియాలు, పెద్ద గాజుల బాక్సు, రేడియో, మెడిటేషన్ బౌల్. స్వీట్స్, పూలు, ఇచ్చారు అందరూ కలిసి. నాకు నోట మాట రాలేదు. కాని వారి ప్రేమను, అభిమానాన్ని ఎలా వద్దనగలను. ఒక రచయిత్రిగానే కాక, సంపాదకురాలిగా కాక, ప్రచురణకర్తగా కాకుండా మా జ్యోతి అని అక్కున చేర్చుకున్నారందరూ. ఇది వెలకట్టలేని అదృష్టం. ఇది నా సొంతం అని గర్వంగా చెప్పుకుంటాను ఎప్పటికీ.

ప్రశ్న 15: మీరు ప్రచురణకర్త మాత్రమే కాదు కథలు కూడా రాసారు కదా. అంతే కాదు వంటలు.. ముఖ్యంగా తెలంగాణ వంటల గురించి కూడా ఎంతో కృషి చేసారు. చేస్తున్నారు. ఆ వివరాలు చెప్తారా..

జ: నేను మొదట దినపత్రికలలో వ్యాసాలు రాసాను. అవి పండగలు, పండగ వంటలు, కుటుంబం, మహిళలు, పిల్లలకు సంబంధించిన వ్యాసాలు చాలా రాసాను. కథలు రాయడం చాలా ఆలస్యంగా మొదలుపెట్టాను. రెండేళ్ల క్రితం సంధాత్రి పేరుతో, ఈ సంవత్సరం సమన్విత పేరుతో కథాసంపుటాలు తీసుకువచ్చాను. రియల్ లైఫ్‌లో నాకు ఎదురైన సంఘటనలు, నా ఆలోచనలు, సంఘర్షణలే నా కథావస్తువులు. ప్రచురణ పనులలో తీరికలేకపోవడం వల్ల, రాయాలని ఉన్నా రాయలేకపోతున్నాను.

నాకు రాయడం, వంట చేయడం అనేవి ఇష్టం కంటే ఎక్కువ మక్కువ. అందుకే అన్ని వంటలతోపాటు నేను పుట్టి పెరిగిన తెలంగాణా ప్రాంతపు వంటకాలను ఈ తరం, రాబోయే తరాలకు ఉపయోగపడతాయని తెలంగాణా ఇంటివంటలు పేరుతో వెజ్, నాన్ వెజ్ రెండు పుస్తకాలు ప్రచురించాను. మూడేళ్ల క్రితం రాష్ట్రప్రభుత్వం తరఫున తెలంగాణా రుచులు పేరుతో పెద్ద పుస్తకం ప్రచురించబడింది. నేను రాసేదికానీ, చేసేది ఏదైనా నాకంటే ఎక్కువగా ఇతరులకు ఉపయోగపడాలని మొదటినుండి కోరుకుంటాను. అదే విధంగా ఉన్నాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు జ్యోతి వలబోజు గారూ.

జ్యోతి వలబోజు: ధన్యవాదాలు.

***

ధీర (అసమాన్య శూర)
Anthology of 126 Telugu Real Stories
సంపాదకత్వం: వలబోజు జ్యోతి
పేజీలు: 640
వెల: ₹ 400/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్, ఫోన్: 9000413413
అచ్చంగా తెలుగు: ఫోన్ 8558899478 (వాట్సప్ మాత్రమే)
జ్యోతి వలబోజు. ఫోన్: 8096310140
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/dheeraasamanya-shura?

 

 

~
“బతుకుని గెల్చినవారి గాథలు” అంటూ ‘ధీర’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. సమీక్షని ఈ లింక్ ద్వారా చదవవచ్చు.
https://sanchika.com/dheera-book-review-kss/

Exit mobile version