Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత్రి, సంపాదకురాలు శ్రీమతి కలవల గిరిజారాణి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘వేదసాక్షిగా’ అనే గొలుసుకట్టు నవలకి సంపాదకురాలిగా వ్యవహరించిన శ్రీమతి కలవల గిరిజారాణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం కలవల గిరిజారాణి గారూ.

కలవల గిరిజారాణి: నమస్కారం.

~

ప్రశ్న 1: వేదసాక్షిగా అనే గొలుసుకట్టు నవలని ప్రచురించినందుకు భావుక బృందానికి అభినందనలు. గొలుసుకట్టు నవల వ్రాయించాలన్న ఆలోచన ఎవరికి ఎలా ఎప్పుడు వచ్చింది?

జ: మా భావుక సమూహములో ఏ నిర్ణయం తీసుకున్నా, రచనలలో కొత్తగా ఏ ప్రక్రియ చేపట్టినా కూడా, భావుక గ్రూపు ఫౌండర్ శ్రీమతి కళ్యాణి గౌరి మరియు అడ్మిన్ల బృందం యావత్తు కలిసి నిర్ణయించుకుని, నిర్వహిస్తారు. గతంలో కూడా మా భావుకలో ఇటువంటి గొలుసుకట్టు కథలని వ్రాయించాము. అయితే అప్పట్లో కేవలం ఐదారుగురు చేత మాత్రమే వ్రాయించాము. కానీ, ఇప్పుడు మాత్రం ఇరవై ఐదు మందితో వ్రాయించడం జరిగింది. ఇలా ఎక్కువ మంది చేత వ్రాయించడం వలన ఇది ఒక గొలుసు నవలగా రూపు దిద్దుకుంది. 2025 మే నెల నుంచి ప్రారంభం అయిన ఈ గొలుసుకట్టు నవల ప్రతి సోమవారం నాడు 25 వారాలపాటు భావుక గ్రూపులో రచయితల చేత పోస్ట్ చేయబడింది.

ప్రశ్న 2: నవల రాయడానికి రచయితలు/రచయిత్రులని ఎలా ఎంపిక చేసుకున్నారు?

జ: భావుక అడ్మిన్ బృందం ఇటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే, ఈ వివరాలతో ఒక పోస్ట్ ప్రకటన రూపంలో పెట్టడం జరిగింది. అక్కడ వెంటనే ముందుగా స్పందించి, వ్రాయడానికి ఒప్పుకున్న మొదటి 25 మందిని ఎంపిక చేసుకున్నాము.

ప్రశ్న 3: 202 పేజీల నవలకి 25 మంది రచయితలు ఎక్కువని అనిపించిందా? ఇంతమందిని ఎలా సమన్వయం చేసుకున్నారు?

జ: మా సభ్యులలో కొందరు మాత్రం.. ఇంతమందిని సమన్వయం చేసుకుంటూ వ్రాయించడం సాధ్యం కాకపోవచ్చు అనే సందేహం వెలిబుచ్చారు. కానీ మా అడ్మిన్ బృందం మాత్రం ధైర్యంతో ముందడుగు వేసాము. ఇలా 25 మందిని ఎంపిక చేసుకున్నాక వారందరితోను, అడ్మిన్ బృందం తోనూ ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసుకుని, వారం వారం అందరితోనూ నేను పర్శనల్ గా మాట్లాడుతూ, వారి వంతు భాగంలో అవసరమైన సూచనలు ఇస్తూ వ్రాయించడం జరిగింది. రచయితలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, వారు అనుకున్నవిధంలోనే కథని ముందుకు జరపడం జరిగింది.

ప్రశ్న 4: గొలుసుకట్టు నవల రాయించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రస్తుత ఇతివృత్తం కాకుండా మరేవైనా అంశాలను పరిశీలించారా?

జ: అసలు ముందుగా మేము ఒక జానపద గొలుసు కథని వ్రాయిద్దామని అనుకుని రెండు మూడు భాగాలు వ్రాయించడం జరిగింది. అయితే అది సంతృప్తికరంగా లేదనిపించి, ఆ జానపద గొలుసు కథ స్థానే ఈ ‘వేదసాక్షి’ అనే గొలుసు కథాంశం ఎంపిక చేసుకున్నాము.

ప్రశ్న 5: ఎవరెవరు ఎన్ని పేజీలు వ్రాయాలన్న నియమం ఏదైనా విధించారా?

జ: కాస్త అటూఇటూగా.. ఒక్కొక్కరూ 1500 పదాలు తమ వంతు భాగాన్ని వ్రాయాలని నిబంధన విధించాము.

ప్రశ్న 6: నవల కాన్సెప్ట్‌ని, ప్లాట్‌ని, చాప్టర్ వైజ్ డివిజన్‌ని ఎవరు నిర్ణయించారు?

జ: ఈ నవల కాన్సెప్ట్ మరియు ప్లాట్ అనేది, మా భావుక అడ్మిన్ బృందంలో ఒకరైన శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ సూచించారు. ప్రస్తుతం సమాజంలో యువత, భారతీయ సాంప్రదాయం అయిన వివాహ వ్యవస్థకి విరుద్ధంగా సహజీవనం అనే వికృత మనుగడ వేపు మక్కువ చూపుతున్నారు. అది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తోందీ, దానిలోని నష్టాల్ని, దాని వలన కలిగే దుష్పరిణామాలని తెలియచేస్తూ.. చివరికి వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని, విలువని తెలుసుకుని మళ్లీ వివాహ వ్యవస్థ వేపుకు దారితీసేటటువంటి ఒక కథా ప్లాట్ వారు సూచించారు.

ఈ స్టోరీ లైన్ ను మేము ముందుగా ఈ 25 మంది రచయితలకి తెలియచేసాము. ఆ ప్రకారంగా వారు వ్రాయడం జరిగింది.

అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ 25 మందికి కేవలం స్టోరీ లైన్ మాత్రమే తెలుసు. ఎవరు ఏ భాగం ఎలా వ్రాసేది? తమ కన్నా ముందు వారు ఏం రాస్తున్నది, కొత్తగా ఎవరు ఏయే పాత్రలని ప్రవేశ పెడుతున్నది, అనేది ఎవరూ కూడా ఒకరితో మరొకరు సంప్రదించుకోలేదు. చర్చించుకోలేదు. ఇలా చేయకూడదు అనేది కూడా ఈ గొలుసు కథ వ్రాయడానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఒక నిబంధన కూడా.

ప్రశ్న 7: ఎవరు ఏ భాగం రాయాలని ఎలా నిర్ణయించారు? రచయితలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారా? లేక అడ్మిన్స్ నిర్దిష్టమైన సూచనలు చేశారా?

జ: ఈ గొలుసు కథ వ్రాయడానికి ముందుకి వచ్చి 25 మంది పేర్లు లాటరీ వేసి, అందులో వచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారంగా వారందరికీ ఆయా భాగం వ్రాయాలని మా అడ్మిన్ బృందం నిర్ణయం చేసి, వారికి ఆయా భాగాలు చెప్పడం జరిగింది.

ప్రశ్న 8: సాధారణంగా రచయితలకి భిన్న శైలులు ఉంటాయి. కథ చెప్పే పద్ధతి ఒకరికొకరికి ఒకేలా ఉండదు. అలాంటప్పుడు 25 మందితో నవలని ఒకేలా రాయించటం ఎలా సాధ్యమైంది?

జ: నిజమే. ఒక్కొక్కరికీ ఒక్కొక్క శైలి. కానీ ఈ గొలుసు కథ లో ఎవరి శైలిని వారు అనుసరిస్తున్నా, తమ ముందు భాగం కథతో పాటుగా మొదటి నుంచి కూడా క్షుణ్ణంగా చదువుకుని, ఎవరికి వారు చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ, ముందు భాగాల్లో ప్రవేశపెట్టిన పాత్రలని అక్కడితో వదిలేయకుండా, తర్వాత భాగాలలో ఆయా పాత్రల ప్రాముఖ్యత తమ తమ భాగాల్లో వాడుకుంటూ కథని మొత్తం ఒకే తాటి మీద నడిపించగలిగారు. ఈ 25 మందిలో అనుభవజ్ఞులైన సీనియర్ రచయితలతో పాటుగా కొత్తగా రచనలలో పాలుపంచుకునే ఔత్సాహిక యువ రచయిత్రులు కూడా ఉన్నారు. అందరూ కూడా చాలా బాగా వ్రాసారు.

ప్రశ్న 9: ఈ నవల రచించటం కోసం ఏవైనా శిక్షణా సమావేశాలు.. అంటే గ్రౌండ్ వర్క్ మీటింగ్స్ లాంటివి పెట్టుకున్నారా?

జ: ప్రత్యేకంగా శిక్షణ సమావేశాలలాంటివి ఏవీ కూడా జరగలేదు.

ప్రశ్న 10: తన ముందు భాగం రాసిన రచయిత/రచయిత్రి ఎవరో – నవల రాస్తున్నప్పుడు – తరువాతి రచయిత/రచయిత్రికి తెలుసా? అలా తెలియడం వారి రచనశైలిపై ఏదైనా ప్రభావం చూపిందా?

జ: తమ ముందు భాగం వ్రాసేది ఎవరన్నది వారి పేరు మాత్రమే తర్వాత వారికి తెలుసు కానీ, ముందు వారు ఏది వ్రాసినది మాత్రం భావుకలో పోస్ట్ చేసేవరకూ అది తెలియదు. అందువలన ఎవరి రచనా శైలి మీదా కూడా మరొకరి రచనా శైలి ఏమాత్రం ప్రభావం చూపించలేదు.

ప్రశ్న 11: ఎవరైనా రచయిత/రచయిత్రి – తను వ్రాసిన దానికి, తన ముందు భాగంలో ఉన్నదానికి కథనంలో ఇంటెన్సీటీ లేదా బిగి మ్యాచ్ అవలేదని భావించారా? అలా జరిగితే, సంపాదకులు ఆయా రచయితలు నొచ్చుకోకుండా ఎలా సవరించారు?

జ: అటువంటిది రాలేదు కానీ..ఇద్దరు వ్రాసినది, జరుగుతున్న కథకి ఏమాత్రం పొంతన లేకపోవడంతో, వారికి తెలియపరచి, ఏ మాత్రం నొచ్చుకోకుండా వారిని ఒప్పించి, వారి స్థానంలో భావుక అడ్మిన్ల బృందంలోని నేను, శ్రీ సుసర్ల శాస్త్రి గారు అప్పటికప్పుడు ఆ రెండు భాగాల్ని వ్రాయడం జరిగింది.

ప్రశ్న 12: అలాగే, ఒక భాగం వ్రాసిన రచయితకి తరువాత భాగం నచ్చని పరిస్థితి లేదా రచయిత/రచయిత్రి రాసిన విధంగా కాకుండా మరోలా ఉంటే బాగుంటుంది అని అనిపించిన సందర్భాలని ఎలా డీల్ చేశారు?

జ: ఇటువంటి పరిస్థితి మాకు అసలు ఎదురవలేదు.

ప్రశ్న 13: ఏ రచయిత/రచయిత్రి రాసిన ఎపిసోడ్ ఏదైనా సరిగా రాలేదని భావిస్తే రీరైట్ చేయించిన సంఘటనలు ఉన్నాయా?

జ: పూర్తిగా రీరైట్ కాదు కానీ, అక్కడక్కడ మార్పులు మాత్రం మేము సూచించడం జరిగింది.

ప్రశ్న 14: ఈ నవల ఎప్పుడు మొదలుపెట్టారు? ఎప్పటికి ముగిసింది? ఎడిటింగ్, ప్రింటింగ్‌ పూర్తయి పుస్తక రూపంలో విడుదలవటానికి ఎంత కాలం పట్టింది?

జ: 2025 సంవత్సరం మే నెలలో ఈ గొలుసు కథని ప్రారంభించి , అక్టోబర్ నెలలో ముగించడమైనది. ఈ నవలని పుస్తకం రూపంలో తీసుకువచ్చి, ఆ సంవత్సరం డిసెంబర్ లో జరిగే భావుక సదస్సులో ఆవిష్కరణ చేద్దామన్న ఆలోచన మా బృందానికి రాగానే.. సమయం సరిపోదనిపించి, మొదట్లో ప్రతి సోమవారం భావుకలో పోస్ట్ చేయించి.. తర్వాత వారానికి రెండు సార్లు, సోమ/గురువారాల్లో రచయితల చేత వ్రాయబడి పోస్ట్ చెయ్యబడింది.

మొత్తం పూర్తవగానే ఎడిటింగ్, ప్రింటింగ్ ఒకనెల లోపుగానే పూర్తయి డిసెంబర్ 14 న భావుక సదస్సులో ఈ ‘వేదసాక్షి’ ఆవిష్కరణ జరిగింది.

ప్రశ్న 15: ఈ నవల సిద్ధమవటానికి సంపాదకులుగా మీరు కాకుండా, భావుక గ్రూప్ అడ్మిన్స్ ఎవరెవరు ఏయే బాధ్యతలని నిర్వర్తించారు?

జ: ఈ పుస్తకం ప్రచురణ అయి, పుస్తక రూపంలో రావడానికి, శ్రీమతి భమిడిపాటి కళ్యాణిగౌరి గారు, శ్రీ సుసర్ల శాస్త్రి గారు, శ్రీ ఎమ్మెస్వీ గంగరాజు గారు, ఎడిటింగ్, ప్రింటింగ్ విషయంలో తమ సహకారం అందించారు. శ్రీ తెన్నేటి వెంకట కృష్ణమూర్తిగారు, శ్రీమతి రాజీ కోడూరు, శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ, శ్రీమతి పద్మజా ముడుంబై, శ్రీమతి అభినేత్రి వంగల ఈ మా అడ్మిన్ బృందం మరియు రచయితల సహాయ సహకారాలతో సహాయ సహకారాలతో ఈ పుస్తకం ప్రచురణ జరిగింది. మా అందరి సమిష్టి కృషి వలనే ఇది సాధించగలిగాము.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం తెలియచేయాలి. ఈ గొలుసు కథ ప్రారంభం అయినప్పటి నుంచి  చివరి వరకూ కూడా ఎటువంటి శీర్షిక పెట్టబడలేదు. మొత్తం 25 భాగాలు పూర్తయ్యాక సరైన శీర్షికని సూచించినవారికి 500/- రూపాయలు బహుమతి ఇస్తామని భావుక అడ్మిన్ బృందం ప్రకటించింది.

ఈ ప్రకటనకి స్పందించిన భావుక సభ్యులు, ఈ గొలుసు నవలకి అనుగుణంగా ఉండే ఎన్నో శీర్షికలని సూచించారు.

అయితే ఈ కథాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, భావుక సభ్యురాలైన శ్రీమతి సరస్వతి కరవది గారు సూచించిన ‘వేదసాక్షి’ అనే శీర్షికను ఎంపిక చేయడం జరిగింది. అలాగే ముఖచిత్రం సంగతికి వస్తే.. యువ చిత్రకారుడు యష్ విహారి చేత, మేమందరమూ సమిష్టిగా నిర్ణయించుకుని, మాకు కావల్సిన విధంగా, కథాంశానికి అనుగుణంగా చెప్పి వేయించుకున్నాము. ఊహించిన దానికన్నా కూడా ముఖ చిత్రం అద్భుతంగా వచ్చింది.

ప్రశ్న 16: సహజీవనం అనేది భారతీయ సమాజానికి నప్పని విధానమనీ, వివాహ వ్యవస్థే గొప్పదని చాటాలన్న మీ ఉద్దేశం నెరవేరినట్టేనని భావిస్తున్నారా?

జ: విదేశీ సంస్కృతి నుంచి దిగుమతి అయిన సహజీవనం అనేది మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకి పూర్తిగా వ్యతిరేకం. మన వివాహ వ్యవస్థ, వేదసాక్షిగా జరిగే వివాహ తంతు, మంత్రాలు వాటి పరమార్థం ఇలా ఇటువంటి వాటికి కట్టుబడి, మనుగడ సాగించాలనే మా అభిమతం మేరకు ఈ గొలుసు కథ వ్రాయించడంలో మా ఉద్దేశం పూర్తిగా నెరవేరిందని చెప్పగలను.

ప్రశ్న 17: ఈ పుస్తకం కేవలం భావుక గ్రూప్ సభ్యులకు మాత్రమేనా? ఎందుకంటే, ప్రతులు లభ్యమయ్యే చోటు, ధర తదితర వివరాలు పుస్తకంలో లేవు.

జ: భావుక సదస్సు నాడు ఆవిష్కరణ జరిగిన ఈ పుస్తకం, ఈ కథ వ్రాసిన 25 మంది రచయితలకి ఇతర భావుక సభ్యులు కొరకు అని అనుకున్నాము. అందుచేతనే తతిమా వివరాలు తెలుపలేదు.

ప్రశ్న18: భావుక గ్రూప్‍కి చెందని పాఠకులు ఈ పుస్తకం పొందాలంటే ఎలా? డిజిటల్ వెర్షన్ ఏదైనా అమ్మకానికి అందుబాటులో ఉంచుతారా?

జ: ప్రస్తుతం డిజిటల్ వెర్షన్ అనుకోలేదండి.

ప్రశ్న19: కేవలం భావుక సభ్యులకు మాత్రమే పరిమితం అయితే, ఓ మంచి నవలని సాధారణ పాఠకులకు దూరం చేస్తున్నట్టే కదా?

జ: ఈ పుస్తకం కేవలం భావుక సభ్యులు కోసమే అని అనుకోలేదండీ. ఇప్పుడు ఇలా మీ ద్వారా ఈ పుస్తకం మరింతమంది పాఠకులకు పరిచయం అయి, చదవాలనికుంటున్నాము అని ఎవరైనా తెలియపరుస్తే, మా భావుక అడ్మిన్ బృందం సంప్రదించుకుని మళ్లీ తిరిగి ప్రచురణ చేయగలము.

ప్రశ్న20: భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మళ్ళీ చేసే ఆలోచనలేమైనా ఉన్నాయా?

జ: భావుక ముఖ పుస్తక సమూహం, ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూనే వుంటుంది. వాటిని వెంటనే అమలుపరుస్తూనే వుంటుంది. ప్రస్తుతం చిన్న కథలని వ్రాయించాలి అనే తలంపుతో నెలలో మొదటి ఆదివారం నాడు కేవలం 116 పదాలతో మాత్రమే కథలు వ్రాయించి, వాటిలోని రెండు ఉత్తమ కథలని ఎంపిక చేసి వాటికి చెరొక 116/- రూపాయలని శ్రీమతి లక్ష్మీ రాఘవ, శ్రీ బాపురం నరహరిరావు గారు స్పాన్సర్లగా ఇప్పించడం జరుగుతోంది. ఇలా రకరకాల ప్రక్రియలని భావుక చేపడుతోంది అని చెప్పడానికి చాలా గర్వంగా అనిపించింది.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు కలవల గిరిజారాణి గారూ.

కలవల గిరిజారాణి: ధన్యవాదాలు.

***

‘వేదసాక్షిగా’ గొలుసుకట్టు నవల సమీక్ష:
https://sanchika.com/vedasaakshigaa-book-review-kss/

Exit mobile version