[‘ప్రతిబింబాలు’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి కస్తూరి అలివేణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం కస్తూరి అలివేణి గారూ.
కస్తూరి అలివేణి: నమస్కారం.
~
మీ రెండవ కథా సంపుటి ‘ప్రతిబింబాలు’ వెలువరించినందుకు అభినందనలు. సాధారణంగా సంపుటాలకు అందులోని ఏదో ఒక కథని శీర్షికగా ఎంచుకుంటున్నారీ మధ్యకాలంలో. మీ ఈ సంపుటిలో ప్రతిబింబాలు అనే పేరుతో కథలేదు. 15 కథల మీ సంపుటికి ఆ శీర్షికనే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
కవయిత్రిగా, కాలమిస్ట్‌గా, కథా, వ్యాస రచయిత్రిగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? ఎప్పుడు, ఎలా మొదలైంది? తొలి రోజుల్లో మీకు మార్గదర్శకులు ఎవరు?
జ: నా సాహితీ ప్రస్థానం 30 ఏళ్ల క్రితం వైజాగ్‌లో మొదలైంది. మేము అక్కడ ఉన్నప్పుడు సహృద సాహితి, విశాఖ సాహితీ లాంటి సంస్థలలో సభ్యురాలిగా ఉండేదాన్ని. సాహితీ సభలకు వెళుతూ ఉండేదాన్ని. నిజానికి నేను కవయిత్రి గానే రచనా రంగంలో అడుగు పెట్టాను. కవితలు ఎక్కువ రాస్తూ ఉండేదాన్ని. కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ ఉండేదాన్ని. అప్పుడు రాసిన కవితలు దాచుకోవాలని ప్రచురించుకోవాలని గాని నాకు అనిపించలేదు. నిజానికి నాకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు. సాహిత్య బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం కాదు మాది. సాహిత్య మీద అభిమానం నాకు స్వతహాగా పుట్టుతోనే వచ్చింది. చిన్నతనం నుంచి బాలమిత్ర చందమామల దగ్గర నుంచి ఏవో పుస్తకాలు చదువుతూనే ఉండేదాన్ని. రచయిత్రిని అవ్వాలనే కోరిక మాత్రం ఉండేది. అయితే కొసనా గారు పోర్ట్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయనకు లలిత సంగీత అకాడమీ ఉండేది. స్వతహాగా పాటలు మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో దాంట్లో కూడా నేను సభ్యురాలిని అయ్యాను. సాహిత్యంతో పాటు సంగీత కార్యక్రమాలలో కూడా పాలుపంచుకునేదాన్ని. సంగీత పోటీలకు జడ్జి కింద వెళ్లేదాన్ని. లోకల్ కేబుల్ చానల్స్‌లో సంగీత కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. విశాఖపట్నం రేడియో స్టేషన్లో మహిళా కార్యక్రమాలలో పాల్గొనేదాన్ని. నేను రాసిన ఒక దేశభక్తి గీతానికి సంగీత సమకూర్చి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఇండిపెండెంట్ కార్యక్రమాలలో నా పాట వినిపించారు. చాలామంది మెచ్చుకున్నారు ఆ పాటని. ఆ తర్వాత 1996 లేదా 97 జ్ఞాపకం లేదు కూరల సోమేశ్వరరావు గారు ఒక అంతర్జాతీయ రచయిత్రుల కథానికలు పోటీ పెట్టారు. అప్పుడు నేను రాసిన మొట్టమొదటి కథ ‘కొత్త కోడలు’ కు అవార్డు వచ్చింది. మొత్తం పదిమంది రచయిత్రులను సెలెక్ట్ చేశారు. దాంట్లో నా పేరు ఉండడం గర్వంగా అనిపించింది. 500 రూపాయల పారితోషకం. అది గొప్ప అనుభూతి. ఆ కథలన్నీ పుస్తక రూపం లోకి తీసుకు వచ్చారు. నా కధా రచన అప్పుడే ప్రారంభమైంది. వ్యాసాలు రాయడానికి కాలమ్స్ రాయడానికి వివిధ పత్రికలలో అవకాశాలు వచ్చాయి. ఈ విధంగా నా రచనా వ్యాసాంగం ఇప్పటివరకు సాగుతూనే ఉంది.
‘ప్రతిబింబాలు’ కథాసంపుటి ఆవిష్కరణ దోహాలో
మీరు చక్కని గాయని. భక్తి గీతాలు కూడా రచించారు. సంగీతంలో ప్రావీణ్యం ఉండడం సాహిత్యంలో ఏ రకంగానైనా ఉపకరించిందా?
జ: సంగీతం సాహిత్యం ఈ రెండు ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. తమ సంగీతంతో సాహిత్యానికి వన్నెతెచ్చిన వాగ్గేయకారులు ఎంతోమంది ఉన్నారు జయదేవుడు, త్యాగయ్య, పురంధారదాసు, అన్నమయ్య ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది ఉన్నారు. పాట రాయాలంటే ఒక రచయిత ఒక ట్యూన్ అనుకునే వ్రాస్తాడు. నేను కూడా అలాగే రాశాను. షిరిడి సాయిబాబా మీద గీతాలు రాసి ఒక సిడి చేశాను. పేరు పొందిన గాయని గాయకులు పాడారు. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కూడా పాటలు రాశాను. నాకు తెలిసిన చిన్న జీయర్ స్వామి శిష్యులు ఒకాయన ఆ పాటలలో నాలుగు పాటలు ట్యూన్ చేసి జీయర్ స్వామి ఎదురుగా పాడడం జరిగింది. అందులో అలివేలు మంగమ్మ పాట పవళింపు సేవ గీతం ఈ రెండు బాగా నచ్చాయి. సాహిత్యం బాగుందని ఆయన ఆశీస్సులు అందాయి. అయితే ఎందుకో ఆ పాటలు ఇప్పటి వరకు ఆల్బమ్ రూపంలో రాలేదు. వాటిని టీటీడీ దేవస్థానానికి పంపాలని అనుకుంటున్నాను.
కవితలు/భక్తిగీతాలు/వ్యాసాలు/కథలు.. వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?
జ: రచన చేయడం వస్తే ఏ ప్రక్రియలోనైనా రాయడం వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రక్రియ ఎన్నుకుంటారు. నా వరకు వ్యాసాలు కథలు రాయడం సులభంగా ఉంటుంది. కవిత అనగానే మన చెప్పే విషయం క్లుప్తంగా నిగూఢమైన అర్థంలో రాయవలసి వస్తుంది. కానీ ఈ రోజుల్లో అన్ని ప్రక్రియలలోను రాయడం జరుగుతోంది.
‘ప్రతిబింబాలు’ కథాసంపుటి ఆవిష్కరణ సందర్భంగా దోహాలో
కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల?
జ: కథకి సంబంధించి నేను శిల్పానికి ప్రాముఖ్యత ఇస్తాను. కథా వస్తువు ఏదైనా దానికి కథారూపం ఇవ్వడంలోనే రచయిత నైపుణ్యం ఉంటుంది. శైలి అనేది ఎవరికి వారికి సంబంధించింది. రచయితకి రచయితకి మధ్య తేడా ఉంటుంది. శైలి గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ పాఠకులని చదివించే రీతిలో శైలి ఉండాలి. ముఖ్యంగా కథకు తీసుకునే వస్తువు వర్తమానానికి సంబంధించినదై ఉండాలి. నేను ఈ విషయాన్ని పాటిస్తాను. అలాగే కథా గమనం కూడా ముఖ్యం. ఒకసారి వేదిక మీద నా కథ ఒకటి చదివినప్పుడు, మునిపల్లె రాజు గారు నా కథా గమనం బావుందని మెచ్చుకున్నారు.
కథలకై మీరు సమాజంలోని మనుషులని, వారి సమస్యలని అత్యంత సమీపంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?
జ: చిన్నతనం నుండి నాకు పరిశీలనా దృష్టి ఎక్కువ. ఏదైనా తెలియని విషయాన్ని లోతుగా తెలుసుకోవాలని ఆకాంక్ష ఎక్కువ. ఒక విషయం నా మైండ్ లోకి వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను. నేను చెప్పే విషయం కొత్తగా ఉండాలి అనుకుంటాను. కథకు ఒక వస్తువుని ఎన్నుకున్నప్పుడు ఎత్తుగడ ముగింపు ముఖ్యం. నేను ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తాను. కథ మధ్య భాగం ఎలాగైనా మలుచుకోవచ్చు. కథ రాయాలి అనుకున్నప్పుడు వస్తువుని ఎన్నుకున్న తర్వాత దాని గురించి ఒక వారం పది రోజులు ఆలోచిస్తాను. కథలోని పాత్రలు డైలాగులతో సహా అన్ని ఆలోచించి పెట్టుకుంటాను. తర్వాత ఒకటి రెండు రోజుల్లో కథ పూర్తిగా రాస్తాను. ఏదో ఒకటి రాసేద్దాం అనే తీరులో నేను ఉండను. నిజానికి కథ రాయడానికి మానసికంగా నేను చాలా శ్రమ పడతాను. కథ రాసేసిన తర్వాత తిరిగి వెనక్కి చూసుకోవడం, పదాలు డైలాగ్స్ సరిదిద్దుకోవడం ఉండదు. ఈ సృజనాత్మకత నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను.
‘ప్రతిబింబాలు’ కథాసంపుటి ఆవిష్కరణ విశాఖపట్టణంలో
‘మాతృదేవోభవ’ కథలో, “కారణాలు చెప్పక్కర్లేదు. కారణాలు వినిపించాయి” అని తల్లితో అనిపించడం వెనుక గొప్ప పరిశీలన ఉంది. ఈ కథ నేపథ్యం వివరిస్తారా?
జ: నేపథ్యం అంటే నేడు సమాజంలో వృద్ధాశ్రమాల కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇది అవసరమా అవకాశమా తెలియటం లేదు. ఈ రోజుల్లో న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థలో ఇద్దరు ముగ్గురు ఉన్న సభ్యులు ఉన్న కుటుంబం తప్పితే ఇంకొక మనిషి ఎక్కువ ఉన్న భరించలేని పరిస్థితి. మనిషిలో పెరుగుతున్న స్వార్థం అనలేము, కానీ ఎవరి అవసరాలు వారి దృష్ట్యా కుటుంబంలో నలుగురు వ్యక్తులు మధ్య కూడా ప్రేమాభిమానాలు ఉండటం లేదు. ఒకరి గురించి ఒకరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులలో కుటుంబానికి మూలాధారమైన వృద్ధ కుటుంబ సభ్యుల గురించి పట్టించుకోవడం, శ్రద్ధ తీసుకునే పరిస్థితి లేదు ఎవరికీ. ఇంకోపక్క కుటుంబ పరిస్థితులు దీంతో ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటారు లేదా ఉండొచ్చు అనే మనోభావన పెరుగుతోంది. ఇంట్లో ఆడైనా మగైనా వృద్ధులు ఉన్నప్పుడు వారి గురించి కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం సహజం. అవి ఎప్పుడో అప్పుడు ఎలాగో అలాగా వృద్ధుల చెవిని పడటం కూడా సహజం లేదా వృద్ధులు వినాలి అని మాట్లాడుకునే వాళ్లు కూడా ఉంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగేదే అందుకే ‘కారణాలు చెప్పక్కర్లేదు వినిపించాయి’ అని రాశాను. పిల్లలు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా వృద్ధుల పరిస్థితి. ఇంతే ఇది నేను విన్న సంఘటన అనుభవంతో ఈ కథ రాయడం జరిగింది.
‘బడుగు నీడ’ కథకి ఆ పేరు చక్కగా కుదిరింది. కథ వ్రాశాకా శీర్షిక తట్టిందా లేక శీర్షిక అనుకున్నాకా వ్రాసిన కథా? ఈ కథ గురించి మరింత చెప్పండి.
జ: ఏదైనా ఒక అంశం మీద కథ అనుకున్నప్పుడు ఆ కథకు అనుగుణంగా పేరు పెట్టేసుకుంటాను. పేరు పెట్టాకనే కథ రాస్తాను. ఇది నా అలవాటు. ఇక నా కథ ‘బడుగు నీడ’ నేపథ్యం ఏమిటంటే అట్టడుగు వర్గాల కుటుంబాలు బ్రతుకు పోరాటం చేస్తూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వచ్చాక వండుకోవడం తినడం విశ్రమించడం తిరిగి మర్నాడు పనుల్లోకి వెళ్లిపోవడం. కన్న పిల్లలు గురించి పట్టించుకునే పరిస్థితి వారికి ఉండదు. పైగా ఆ కుటుంబాలలో మగవారు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. అప్పుడు పిల్లలు తమ మార్గాన్ని తమ ఎన్నుకుంటారు. ఈ కథలో సత్తెమ్మ తన ఇద్దరు కొడుకులను తమలా కష్టపడకుండా చదివించాలని అనుకుంటుంది. కానీ విధి ఇంకో విధంగా నిర్ణయించింది. భర్త తాగుబోతు సంపాదించింది ఒక పైసా ఇంటికి ఇవ్వడు. సత్తెమ్మ తన పాచిపనులతోనే ఇంటిని నడిపిస్తుంది. పెద్ద కొడుకును సత్తెమ్మ భర్త ఎక్కడికి వెళ్ళినా తన కూడా తిప్పుకోవడంతో వాడికి చదువు అబ్బలేదు, చెడు దారులు పడతాడు. ఒకరోజు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి నక్సలైట్లలో చేరిపోతాడు. ఇక చిన్న కొడుకు తెలివైనవాడు, చక్కగా చదువుకుంటున్నాడు. ఇంతలో పోలియో వచ్చి కాళ్లు చచ్చుపడిపోతాయి. పిల్లల జీవితాలు అలా అయిపోవడం చూసి సత్తెమ్మ బాధపడుతుంది. కానీ బ్రతకడం, బ్రతికించడం తప్పదు కదా. బ్రతుకు బండి లాగుతూ ఉంటుంది. ఒకప్పుడు తల్లి బాగా చూడలేక డబ్బు సంపాదించి తల్లికి సాయంగా ఉండాలనుకుంటారు పిల్లలు కానీ అనుకున్నది జరగలేదు పెద్ద కొడుకు నక్సలైట్లలో చేరి అప్పుడప్పుడు తల్లికి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఒకరోజు చిన్న కొడుకు రాజకీయ పార్టీ సభలకి వచ్చిన వారికి 500 ఇస్తున్నారని తల్లిని ఒప్పించి స్నేహితుడి సాయంతో సభకు వెళ్తాడు. కానీ ఆ సభలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఈ సన్నివేశం సంఘటన ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లలో పెట్టిన సభలలో తొక్కిసలాట జరిగి నలుగురు ఐదుగురు ప్రాణాలు పోతాయి ఈ వార్త నేను పేపర్లో చదివాను. ఆ సంఘటన ఈ కథలో నేను పెట్టడం జరిగింది. పెద్ద కొడుకు కూడా డబ్బులు పంపించినప్పుడు ఇక ముందు కలవగలనా లేదో డబ్బులు పంపగలనా లేదో అని కబురు పెడతాడు. తొక్కిసలాటలో చనిపోయిన వారికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని రాజకీయ పార్టీ వాళ్లు ప్రకటిస్తారు. ఈ రెండు సంఘటనలు సత్తెమ్మ జీవితాన్ని కుదుపువేస్తాయి. డబ్బు రాక, కొడుకులు పోక, ఎందుకు ఎవరి కోసం బతకాలి అని గుండె బద్దలయ్యేట్టు ఏడుస్తుంది సత్తెమ్మ. చివరగా నాకు నచ్చిన వాక్యం ‘నీడలో మొక్క ఎదగదు, బడుగు నీడలో బడుగు బతుకులు ఎదగవు దీనికి కారణం ఎవరు వ్యవస్థా రాజకీయ నాయకులా’.
“నేడు మనిషి జీవితం కూడా పక్షి జీవితం లానే ఉంది” అని ‘మూడు గదుల ఇల్లు’ కథలో సుభద్రమ్మ అనుకునే సన్నివేశం పాఠకుల కళ్ళకు కడుతుంది. ఈ కథలోనూ, ఇతర కథల్లోనూ సంభాషణలు కీలకంగా ఉన్నాయి. సంభాషణల ద్వారా కథను నడిపించడం గురించి మరింత వివరించండి.
జ: నా కథల సంపుటిలో వృద్ధాశ్రమాల నేపథ్యంతో మూడు కథలో రాశాను. మూడు కథలు కూడా వేరు వేరు కుటుంబ నేపథ్యంతో ఉంటాయి. కథలు ఎంత కల్పితాలైనా వాస్తవానికి దగ్గరగానే ఉంటాయి. ఒకప్పుడు రెండు గదుల ఇంట్లో రెండేసి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు మూడు గదుల ఇల్లు నాలుగు గదులు ఇల్లు ఉన్నా కూడా ఒక చిన్న కుటుంబానికి సరిపోవటం లేదు. నా కథ మూడు గదుల ఇల్లు కూడా ఇదే కోవకు చెందుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటికి పెద్దవాళ్లే సర్దుకుపోవడం జరుగుతుంది. ఇక కథకు వస్తే అప్పటివరకు అద్దె ఇంట్లోనే కాలం గడిపిన కుటుంబం. తన కొడుకు మూడు గదుల అపార్ట్మెంట్ కొన్నాడని తెలిసి చాలా సంతోషిస్తుంది సుభద్రమ్మ కానీ కొత్త ఇంటికి వచ్చాక అందరూ తలో గది తీసేసుకుంటారు. మామ్మకి గది ఇవ్వండి అని కోడలు చెప్పినా పిల్లలు వినలేదు, చెరొక గది తీసేసుకుంటారు. కొడుకు కోడలికి ఒక గది. సరేనని సుభద్రం హాలులో దివాన్ మీద సర్దుకుపోతుంది. భోజనం చేయడానికి వెళ్లడం, తిరిగి వచ్చి దివాన్ మీద పడుకోవడం, ఎక్కడికి తిరగడానికి లేదు. కోడలికి కొత్త పరిచయాలు – ఫోన్లో మాట్లాడుకోవడానికి. అత్తగారితో మాట్లాడడానికి టైం లేదు. కొడుకు కూడా తల్లితో మాట్లాడడం తగ్గించేసాడు. పాత ఇంట్లో అత్తా కోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పిల్లలు బామ్మ అంటూ తన చుట్టూ తిరిగేవారు. తన కొడుకు ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి రాగానే తల్లితో కాసేపు కూర్చొని మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఆ ఛాయలు లేవు. రాను రాను టీవీ చూడడానికి ఫ్రెండ్స్ వస్తే కూర్చుని కబుర్లు చెప్పడానికి సుభద్రమ పడక దీవాను అడ్డం వచ్చింది. ఒకరోజు కోడలు కొడుకుతో పిల్లలు చదువులు అయ్యి బయటకు వెళ్ళిపోయే వరకు మీ అమ్మగారిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెడదాం ఆవిడకి పెన్షన్ వస్తుంది కదా అనే సలహా ఇవ్వడం సుభద్రమ్మ వింటుంది తనకు తానే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడే నేను రాశాను ఈరోజుల్లో మనిషి జీవితం పక్షి జీవితం లాగా ఉందని ఎందుకంటే ఒక పక్షి గుడ్లు పెట్టాక అవి పెళ్లయి వాటికి రెక్కలు వచ్చి ఎగరడం వచ్చాక తలో దారిని వెళ్లిపోతాయి తల్లి బాధ పడుతుందని పట్టించుకోవు. అలాగే తల్లి కూడా తన పిల్లల గురించి పట్టించుకోదు. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఈరోజు కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరూ స్వేచ్ఛగా జీవితంలోకి ఇంకొకరు కలగజేసుకోకూడదు. ప్రేమాభిమానాలకు తావు లేదు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా యాంత్రికమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెద్దవాళ్ళు కూడా నిజాలు తెలుసుకుని తమకు తామే వానప్రస్తాశ్రమానికి చేరుకుంటున్నారు. అక్కడైనా కాస్త స్నేహితుల్యమైన అభిమానం కనిపిస్తుందని. నా కథలలోని సంభాషణలు గురించి చెప్పాలంటే కథకు పాత్రలకు అనుగుణంగా సందర్భానికి అనుకూలంగా సంభాషణలు ఇలా రాయాలి అని అనుకోను. నేను రాసేటప్పుడు ఆ పాత్రలో ఆ సందర్భానికి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాను నేను మాట్లాడుతున్నట్టే ఊహించుకొని నా మనసులో ఉన్న మాటలు సంభాషణ రూపంలో కాగితం మీద పెడతాను. ఇది అతిశయోక్తి అనిపించినా ఇది మాత్రం నిజం.
సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: నిజమే, మీరు అన్నట్టు కథలన్నీ ఇష్టపడి రాసినా ఏదో ఒక కథ మాత్రమే మనసుని కదిలిస్తుంది. ఈ కథలలో మొదటి కథ ‘మాతృదేవోభవ’ నాకు బాగా నచ్చింది. అది రాస్తున్నప్పుడు, తిరిగి చదివినప్పుడు నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాయవరం భాస్కర్ గారు అమెరికా నుండి నిర్వహిస్తున్న ‘కథాకళ.. కథ చెప్పడం ఒక కళ’ అనే జూమ్ ప్రోగ్రాంలో ఈ కథ చదివినప్పుడు వారు కూడా ఇదే ఫీల్ అయ్యారు. తల్లిని గౌరవించలేని స్థితిలో నేటి సమాజం ఉంది. మనిషి పుట్టుకకు కారణమైన తల్లిని నిర్లక్ష్యం చేయడం అనేది క్షమించరాని నేరం. పిల్లల తల్లుల మధ్య ఉన్న అనుబంధం సాన్నిహిత్యం మాటల్లో చెప్పలేనిది. ఏ తల్లి అయినా కన్న పిల్లలకు దూరంగా ఉండాలని అనుకోదు. పిల్లల మనుమల మధ్య వారి అనురాగాల మధ్య జీవితం ముగిసిపోవాలని అనుకుంటుంది. కానీ ప్రతి తల్లి బలవంతంగా మనసుని రాయి చేసుకుని మనసులో వైరాగ్యాన్ని నింపుకొని దూరంగా ఉంటున్నారు. ‘బడుగు నీడ’ కథలో ఇద్దరి కొడుకులను పోగొట్టుకున్న తల్లి ఆవేదనను బాగా రాయగలిగాను. ఇది కూడా నన్ను కదిలించింది.
ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ఏ కథనైనా నేను అన్ని రకాలుగా అంటే పాత్రల విషయం, సన్నివేశాలు, సందర్భాలు, సంభాషణలు ఇలా ముందే ఆలోచించి పెట్టుకుంటాను. అప్పుడే పేపర్ మీద కలం పెడతాను. అందుకే రాయడంలో ఏ కథా నాకు కష్టమనిపించలేదు. రాసిన కథ గురించి తిరిగి ఆలోచించను. ప్రతి రచయితకి తన మీద తనకి కథ బాగా రాసాను అని నమ్మకం ఉంటుంది. అలాగే ఒక అంశానికి కథా రూపం తీసుకువచ్చినప్పుడు నేను కథకి అన్ని విధాలా న్యాయం చేశానని అనుకుంటాను.
‘ప్రతిబింబాలు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: పుస్తక ప్రచురణలు అనుభవాలు అంటే నేను అడగగానే సినీ గేయ రచయిత భువన చంద్ర గారు ముందుమాట రాయడానికి ఒప్పుకున్నారు. ఆయన చెన్నైలో ఉంటారు కాబట్టి కథలు పిడిఎఫ్‌లో పంపించాను. ముందుమాట రాయడమే కాకుండా నాకు ఫోన్ చేసి కథలు చాలా బాగున్నాయి అంటూ ప్రత్యేక అభినందనలు చెప్పారు. నా ‘ప్రతిబింబాలు’ పుస్తకం మొదటిసారి ఖతార్ రాజధాని దోహాలో చిట్టెన్ రాజుగారు ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఆవిష్కరణ జరిగింది. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు, జొన్నలగడ్డ వారు ఇంకా మిగిలిన ప్రముఖుల ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ జరిగింది. అయితే ముందుగా దీని గురించి ఆలోచించలేదు. అందుకే స్క్రిప్ట్ ని డిటిపి చేయించడంలో, ప్రూఫ్ చూసుకోవడంలో ఆలస్యం జరిగింది. దోహాలో పుస్తకావిష్కరణ అనుకున్న తర్వాత ప్రింటింగ్‌కి ఇవ్వడంలో ఆలస్యమైంది. దోహా ప్రయాణం టైమ్‌కి ప్రింట్ అయిన పుస్తకాలు అందుతాయా లేదో అని టెన్షన్ పడ్డాను. రేవు ప్రయాణం అనగా ముందు రోజు రాత్రికి నాకు పుస్తకాలు అందాయి. అప్పటి వరకు నేను ఆందోళన పడుతూనే ఉన్నా..
ఇంక ఆదరణ మాటకి వస్తే మొబైల్ వాడకంతో పుస్తకం చదవడం పూర్తిగా పోయింది. పుస్తకం ఎవరికైనా చదవాలని ఇచ్చిన ఎవరూ చదవడం లేదు. ఇంకొకరి వరకు ఎందుకు, మాలాంటి వాళ్ళం కూడా ఆ కోవకే వస్తాం. ఏదైనా అవసరానికి తప్పనిసరి అయితే. నా సన్నిహిత స్నేహితులు మాత్రం పుస్తకాలు చదివి కథలు బాగున్నాయి అన్నారు. కొందరు చదువుతారు కానీ రెస్పాండ్ అవరు.
నాకు వైజాగ్‌కి అవినాభావ సంబంధం ఉంది. నేను హైదరాబాదులో ఏ ఆవిష్కరణ చేసిన అది కచ్చితంగా వైజాగ్‌లో కూడా ఆవిష్కరిస్తాను. అంతకుముందు ‘అద్దం’ కథల సంపుటి, షిరిడి సాయిబాబా పాటల సిడి కూడా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. అలాగే నా ‘ప్రతిబింబాలు’ కథలు సంపుటి కూడా వైజాగ్‌లో ఆవిష్కరించాను. అక్కడ మాత్రమే నా పుస్తక విషయంలో పూర్తి సంతృప్తి కలిగింది. ఎందుకంటే వైజాగ్‌లో ఎంతో పెద్ద పెద్ద సాహితీవేత్తలు ఉన్నారు. వైజాగ్ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖ అధిపతి ప్రొఫెసర్ జర్రా అప్పారావు గారు నా పుస్తకం ఆవిష్కరించారు. అతిథులైన సాహితీవేత్తలు నా పుస్తకం గురించి మనస్ఫూర్తిగా మాట్లాడారు. చేయి తిరిగిన రచయిత్రి రాసిన నవరసాల షడ్రుచుల కలయిక ఈ కథలు అని అభినందించడం జరిగింది.
ప్రస్తుత కాలంలో రచనల మీద మీ అభిప్రాయం ఏమిటి?
జ: ఒక దశాబ్దాల కాలం అంటే పది సంవత్సరాల క్రితం వరకు కొంతమంది ప్రముఖుల రచనలు మాత్రమే కథ కానీ నవల కానీ ప్రతి పత్రికలో దర్శనం ఇచ్చేవి. కానీ ఇప్పుడు సమాజంతో పాటు పరిస్థితులు మారుతున్నాయి. వ్యవస్థలు మారుతున్నాయి. పాత తరం వారితో పోటీ పడుతూ ఈ తరం కూడా మంచి మంచి కవితలు, కథలు, నవలలు రాస్తున్నారు. సమాజ మార్పుకు అనుగుణంగా ఒక అంశాన్ని వివిధ కోణాలలో సమాజ హితవుకు అనుగుణంగా సందేశాత్మకంగా తమ రచనలను ఆవిష్కరిస్తున్నారు.
సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?
జ: అవకాశం ఉన్నంత వరకు నా రచన ప్రవాహం సాగుతూనే ఉంటుంది. ఈ సంవత్సరంలో ఒక కవితా సంపుటి, ఒక నవల పుస్తక రూపంలో తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య నా షార్ట్ నవలను తపస్వీ మనోహరం పత్రిక వారు పత్రికలో ప్రచురించడానికి తీసుకున్నారు. కొన్ని వ్యాసాలు రాసాను. అవి వెబ్ పత్రికలకు పంపిద్దాం అనుకుంటున్నాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు కస్తూరి అలివేణి గారూ.
కస్తూరి అలివేణి: మీకు కూడా నా ధన్యవాదాలు. నేను చాలామందికి తెలిసినా, నా గురించి తెలియదు. మీ సంచిక వెబ్ పత్రికలో నా గురించి ఇతరులకు చెప్పుకోవడానికి, తెలియటానికి అవకాశం కల్పించిన సంచిక యాజమాన్యానికి కృతజ్ఞతలు.
***
రచన: కస్తూరి అలివేణి
ప్రచురణ: వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్
పేజీలు: 113
వెల: ₹ 180/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు, హైదరాబాద్
ఫోన్: 8558899478 (వాట్సప్ మాత్రమే)
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్
ఫోన్: 040-24652387, 9000413413
శ్రీ వంశీ రామరాజు
ఫోన్: 9849023582
~
‘ప్రతిబింబాలు’ కథాసంపుటి సమీక్ష
https://sanchika.com/pratibimbaalu-book-review-mv/

