Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథా, నవలా రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘అసంగత’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి మణి వడ్లమాని గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం మణి వడ్లమాని గారూ.

మణి వడ్లమాని: నమస్కారం.

~

ప్రశ్న 1: ‘అసంగత’ కథాసంపుటి వెలువరించినందుకు అభినందనలు. ఇది మీ ఎన్నో కథాసంపుటి? ఇతర ప్రక్రియలతో కలిపి ఎన్నో పుస్తకం?

జ: ఇది నా ఆరవ పుస్తకం. నాలగవ కథా సంపుటి.

ప్రశ్న 2: కథా/నవలా రచయిత్రిగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు?

జ: అక్షరాలతో ప్రేమలో పడ్డ నేను రచనా వ్యాసాంగం మటుకు చాలా ఆలస్యంగా మొదలు పెట్టాను.

మొట్టమొదటి కథ ‘కృష్ణం వందే జగద్గురుం’ 2012 డిసెంబర్, అంతర్జాల మాసపత్రిక ‘కౌముది’లో ప్రచురించారు.

ప్రశ్న 3: అబ్సర్డ్ కథలు వ్రాయాలన్న ఆలోచన ఎప్పుడు, ఎలా వచ్చింది? ప్రేరణ ఎవరు? అబ్సర్డ్ అనే పద ప్రయోగం నెగెటివిటీని ధ్వనించే అవకాశం ఉందని అనిపించిందా?

జ: అబ్సర్డ్ కథలు రాయాలనే ఆలోచన కన్నా, ముందు అలాంటి కథలు చదవడం ఇష్టంగా ఉండేది. బుచ్చిబాబు గారు వ్రాసిన ‘చివరకు మిగిలేది’, కొమ్మూరి వేణుగోపాల రావు గారి ‘వ్యక్తిత్వం లేని మనిషి లేని మనిషి’, ఆ తరువాత 2013 నుంచి నాకు కినిగె పత్రిక పరిచయం అయినప్పుడు అందులో కథలు, పరిచయాలు వ్యాసాలు గానీ చాలా ఆకట్టుకునేవి. అప్పుడే కాఫ్కా, నీషే, త్రిపుర, కాశీభట్ల గార్ల పేర్లు విన్నాను. వాళ్ళ రచనలు గురించి తెలుసుకున్నాను..

కుటుంబ కథలు రాస్తూనే ఏదైనా కొత్త తరహాగా అంటే out of the box అంటారు కదా అలా రాయనిపించేది.

అంతర్జాలం వల్ల నాకు ప్రపంచ సాహిత్యం గురించి తెలిసింది. ఆ విధంగా నాలో కొత్త ఆలోచనలు రూపు దిద్దుకున్నాయి.

అబ్సర్డ్ అనే పదానికి సందర్భాన్ని బట్టి నెగెటివ్ అర్థం వచ్చే అవకాశం ఉంది.

కానీ ఒక రచయితగా, నేను ఈ పదాన్ని జీవితంలోని ‘వైరుధ్యాలను’ (Paradoxes) చిత్రించడానికి వాడతాను. ఒక్కోసారి లాజిక్‌కు అందని కొన్ని జీవిత సత్యాలు, నమ్మలేని పరిస్థితులు మన కళ్లముందే జరుగుతుంటాయి. అయితే ఇది వ్యక్తిగతం కాదు కాబట్టి, రచయితగా ఒక పరిస్థితిని వివరించడానికి రాసాను కాబట్టి ఆ అర్థం రాదని అనుకుంటున్నాను.

ప్రశ్న 4: మీ మొదటి అబ్సర్డ్ కథ ఎప్పుడు రాశారు? ఈ పుస్తకంలోని కథలు ప్రచురితమైన పత్రికల పేర్లు ఇచ్చారు కానీ, తేదీలు ఇవ్వలేదు. ఎందుకని? తేదీలు ఇచ్చి ఉంటే, కథా పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేది. ఒక్కో కథకీ మీ రచనా సంవిధానం, కాలాన్ని బట్టి ఎలా మారిందో పాఠకులకు తెలిసేది కదా?

జ: ‘ది వాల్’ అనే చిన్న ఆంగ్ల కథను అనువదించి, ‘ఇనుప చువ్వల దడి’ కథను రాసాను. కినిగె పత్రికలో ప్రచురించారు. అది నా మొదటి absurd కథ అనుకోవచ్చు, ఆ తరువాత ‘వాడు – నేను’ అని రాసాను. ఇక తేదీల గురించి కన్నా పత్రిక ముఖ్యం అనుకున్నాను.

దానికి ప్రేరణ చిన్నతనంలో విన్న కథ, పేరు, రచయిత తెలియదు. అయితే మానవ సంబంధాల కథలు, కొన్ని స్త్రీ కోణం నుంచి రాసిన కథలు, మరి కొన్ని పూర్తిగా భక్తి కథలు రాస్తూనే వాటితో పాటుగా ఈ అబ్సర్డ్ కథలు కూడా సమాంతరంగా రాసాను. అంటే నాకు ‘ఇవే కథలు రాస్తారు అనే ముద్ర పడటం కన్నా, వస్తు వైవిధ్యం తో రాయాలని అనిపించడం వల్ల’.

ప్రశ్న 5: 12 కథల ఈ సంపుటికి ‘అసంగత’ అని శీర్షిక పెట్టడం వెనుక మీ ఆలోచన ఏమిటి? కాశీభట్ల వేణుగోపాల్ గారి నవల ‘అసంగతం’ ప్రేరణ ఉందా?

జ: సంపుటి లోని కథల పేర్లు పెట్టకుండా ఏదయినా భిన్నంగా ఉండాలని అనుకున్నాను. అప్పుడు absurd అన్న పదానికి అర్ధాలలో ‘అసంగత’ అని వస్తే దాన్ని శీర్షికగా ఎంచుకున్నాను.

ప్రశ్న 6: అబ్సర్డ్ కథలు మామూలు కథల కన్నా ఏ రకంగా భిన్నం? వీటిని రచించాలంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు?

జ: నేను ముందుమాటలలో రాసుకున్నట్లు నిజానికి కొన్ని ప్రశ్నలకు సమాధానమే ఉండదు.. మనిషి వాటిని తెలుసుకోవాలనుకునే క్రమంలోనే, మరింత గందరగోళంలో పడతాడు. అయితే అన్ని లేదా కొన్ని కథలు, సమాధానాలు ఇవ్వవు. పద్ధతులు, సాంప్రదాయాలు, సందేశాలు పాటించవు. మగింపులు కూడా కచ్చితంగా ఉండవు.

కానీ…………… ప్రశ్నలను మేల్కొలుపుతాయి. అంతర్మథనం, జరిగేలా చేస్తాయి.

ఇక జాగ్రత్తలు చెప్పేంత పెద్ద రచయితను కాదు. అయితే అబ్సర్డ్ కథలు జీవితంలోని అంతర్లీన వైరుధ్యాలను అబ్సర్డ్ కోణంలో ఆవిష్కరించడంతో పాటు పాఠకుడిని ఆలోచింపజేసేలా విభిన్నంగా రాయాలని మటుకు అనుకున్నాను.

ప్రశ్న 7: అబ్సర్డ్ కథలకి వస్తువు, శిల్పం, శైలి లలో ఏది ముఖ్యం? ఎందువల్ల?

జ: ముఖ్యంగా ఆపకుండా ఆసక్తిగా కథను చదివించే గుణం ఉండాలి.

ప్రశ్న 8: Abstract Stories కీ Absurd Stories మీ దృష్టిలో ప్రధానమైన వ్యత్యాసాలేమిటి?

జ: నాకు తెలిసినంతలో abstract కథలు మనిషిలోని లోతైన భావాలను ఆలోచనలను సింబాలిక్‌గా చెబుతాయని, అదే Absurd stories జీవితంలో లాజిక్‌కు అందని పరిస్థితులను గురించి ఉంటాయని అనుకుంటున్నాను.

ప్రశ్న 9: తెలుగులో మీ పుస్తకం కన్నా ముందు వేరే అబ్సర్డ్ కథల సంపుటి వచ్చినట్టు మీ దృష్టికి వచ్చిందా?

జ: నిశ్చయంగా రాసే ఉండచ్చు. అయితే నాకు తెలియలేదండి.

ప్రశ్న 10: నైరూప్యకథని సెకండ్ పర్సన్ నెరటివ్‍లో చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఆ కథ నేపథ్యం చెప్పండి.

జ: ఒక డిఫరెంట్ లేదా ప్రయోగాత్మక ప్రయత్నం, అంతే! కొంత కోవిడ్ backdrop గా తీసుకున్నాను. ఇద్దరూ ముగ్గురు రచయితలు రాసిన విధానం చదివినప్పుడు అనిపించింది.

ప్రశ్న 11: సోలోలొక్వీకి కథ వెనుక కథ ఏదైనా ఉందా? ఉంటే దాని గురించి వివరిస్తారా?

జ: కథ వెనుక కథ ఏమి లేదు, అలా కుదిరింది అంతే.

ప్రశ్న 12: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: ‘రహస్య’ కథ! మత్స్యకారుల జీవితాలు గురించి వాస్తవాలు వింటున్నప్పుడు.

ప్రశ్న 13: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ‘వర్ణ’ కథ అనిపించింది. ఇంకొంచెం వివరాలు తెలుసుకుని ఉంటే బాగుండేదేమో, కష్టం అనిపించిన కథ ‘రియాలిటీ పారడాక్స్’, Cannibalism గురించి కదా! అందుకు.

ప్రశ్న 14: అసంగతపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: ప్రముఖ పత్రికల అన్నింటి లోను చాలా చక్కటి సమీక్షలు వచ్చాయి.

ప్రశ్న 15: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?

జ: రచనలు కొన సాగిస్తూనే ఉండాలని, అవునండీ! మరో కథల సంపుటి సిద్ధం అవుతోంది.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు మణి వడ్లమాని గారూ.

మణి వడ్లమాని: ధన్యవాదాలు.

***

అసంగత (అబ్సర్డ్ కథలు)
రచన: మణి వడ్లమాని
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 86
వెల: ₹ 120/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
అచ్చంగా తెలుగు ప్రచురణలు
8558899478 (వాట్సప్ మాత్రమే)

 

 

~
ఆన్‌లైన్‌లో:
https://books.ataka.in/products/asangata-%E0%B0%85%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%A4?

~
‘అసంగత’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/asangata-book-review-kss/

Exit mobile version