[‘అద్దాల భరిణ’ అనే పుస్తకం వెలువరించిన శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం నండూరి సుందరీ నాగమణి గారూ.
నండూరి సుందరీ నాగమణి: నమస్కారమండీ.
~
ప్రశ్న 1: మీ 4వ కథాసంపుటి ‘అద్దాల భరిణ’ వెలువరించినందుకు అభినందనలు. 15 కథల సంపుటికి శీర్షికగా మొదటి కథ పేరునే ఎందుకు ఎంచుకున్నారో తెలియజేస్తారా?
జ: అలాగేనండి. ‘అద్దాల భరిణ’ కథ ఒక వాస్తవిక సంఘటనకు కథారూపం. ఇది మన ‘సంచిక’లోనే ప్రచురితం అయింది. ఈ సంపుటిలోని పదిహేను కథలలోనూ ఇది ఎక్కువగా నాకు నచ్చిన కథ. ఈ కథలోని పెద్దాయనను గురించి నేను విన్నాను. అప్పుడే దీనిని కథగా వ్రాయాలని నిర్ణయించుకున్నాను.
ప్రశ్న 2: పద్యకవయిత్రిగా, కథా/నవలారచయిత్రిగా మీ సాహితీప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్యవ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు?
ప్రశ్న 3: పద్యం/కథ/నవల వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?
జ: నిజానికి ఏదీ సులభం కాదండీ, అన్నీ కష్టమే. మనసుపెట్టి ఆలోచించాలి, పదాల కూర్పు చేయాలి, ఆపై దోషరహితంగా వ్రాయాలి. ఆ రచన ముందుగా రచయితకే మనసుకు హత్తుకునేలా ఉండాలి. అప్పుడే అది విజయం సాధిస్తుంది. ఇప్పుడు నాకు పద్యం వ్రాయటం బాగా అలవాటు అయి, మిగిలిన ప్రక్రియలకన్నా అదే సులభం అని అనిపిస్తుంది. అలా అలవాటు కావటానికి చాలా సాధన చేసాను.
ప్రశ్న 4: “నిత్యజీవితంలో అనునిత్యం ఎదురయ్యే చిన్నచిన్న సంఘటనల్ని, మంచిమంచి కథలుగా మలచగల నేర్పరి సుందరీ నాగమణి” అని వ్యాఖ్యానించారు మంథా భానుమతి గారు. కథలకి మీరు ఇతివృత్తాలను ఎలా ఎంచుకుంటారో వివరిస్తారా?
జ: శ్రీమతి మంథా భానుమతి గారు, శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు, స్వర్గీయ శ్రీమతి వాసా ప్రభావతి గారు వీరంతా నన్ను ఎంతగానో ఆదరించి, తమ వాత్సల్యంతో పెంచి పెద్దచేసారు. ఇందుకు ‘లేఖిని’ సంస్థతో పాటుగా ముఖపుస్తకం కూడా చాలావరకు దోహదం చేసింది.
భానుమతి గారి అభిప్రాయంతో చాలావరకూ ఏకీభవిస్తాను. అంత నేర్పరితనం ఉందో లేదో తెలియదు కానీ, ప్రతి కథ వెనుక ఒక నిజజీవిత సంఘటన ఉండటం మాత్రం వాస్తవమే. నేను బ్యాంకులో పనిచేయటం వలన, అది ప్రజల సేవాకార్యకలాపాలకు సంబంధించిన సంస్థ కనుక, నేను నిత్యం ఎంతోమందితో మాట్లాడుతూ ఉండేదాన్ని. వారిలో బ్యాంకు ఖాతాదారులు, సహోద్యోగులు, ఆఫీసు డ్రైవర్లు, బ్యాంకు బయట దుకాణాదారులు – వీరితో సంభాషణలలో తెలిసిన కొన్ని సంఘటనలు, సమస్యలు, సమాచారం వీటిని నేను కథలుగా వ్రాసేదాన్ని. అలాగే నా ఎదురుగా జరిగిన కొన్ని సంఘటనలు కూడా. అలాగే మా కుటుంబంలో జరిగే నిత్యకృత్యాలపై, మనుషుల మనస్తత్వాల పైన కూడా కథలు వ్రాసాను. అయితే ఏ కథలోనైనా సాధ్యమైనంత వరకూ, సామరస్యాన్ని, సానుకూల దృక్పథాన్ని నా పాత్రల ద్వారా చెప్పించి, కథను ఒక పరిష్కారంతో ముగించటానికి ప్రయత్నిస్తాను.
ప్రశ్న 5: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలిలలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఎందువల్ల?
జ: శైలి గురించి పెద్దగా నేను శ్రద్ధ వహించను. ఎందుకంటే నాకు తెలియకనే ఒక శైలి నాకు అలవాటు అయిపోయింది. ఆలోచన వచ్చిన వెంటనే కథ వ్రాసుకుంటూ వెళ్ళిపోవటమే. అయితే పైన రచయిత్రిగా నా పేరు లేకున్నా మిత్రులు అది నా కథగా గుర్తు పడతారు. అంటే, నాకంటూ ప్రత్యేకమైన శైలి నాకు ఏర్పడింది అనే కదా. కథావస్తువు గురించి చాలా ఆలోచిస్తాను. దాన్ని అక్షరీకరించినపుడు అవసరమైన అంశాల గురించి, అలాగే కథను ముగించే విషయంలోనూ బాగా జాగ్రత్త వహిస్తాను. కథ వ్రాసాక, కనీసం నాలుగైదు సార్లు దానిని సవరిస్తాను. అంటే దోషాలు కాదు, అవి వ్రాస్తున్నప్పుడే సరిచేసేసుకుంటాను. కథాగమనం విషయంలో నిడివి ఎక్కువైనా, అనవసరమైన విషయాలు ఉన్నా, తీసేస్తాను. అవసరమైన విషయాలు చేర్చుకుంటాను. అందువలన శిల్పం దానంతట అదే అమరిపోతుంది. ప్రత్యేక జాగ్రత్తలు ఏమీ వహించను.
ప్రశ్న 6: “పాత్రలలో వైవిధ్యం, సన్నివేశాలలో వాస్తవికత, కథనంలో ఏకబిగిన చదివించే గుణం ఈమె సంపదలు” అని కీ.శే. శ్రీమతి ఆర్. శాంతసుందరి గారు అభిప్రాయపడ్డారు. ఈ తరహా రచనాపద్ధతిని మీ కథనశైలిగా భావించవచ్చా?
జ: అవునండీ, అలాగే భావించవచ్చు. అది దైవికంగా నాకు లభించిన ఒక వరమని నా నమ్మకం.
ప్రశ్న 7: ఈ సంపుటికి శీర్షికగా నిలిచిన ‘అద్దాల భరిణ’ కథకి నేపథ్యం ఏమిటి? ఎలా, ఎందుకు వ్రాశారు?
జ: ఒకసారి మేము తిరుమల దర్శనానికి వెళ్ళాము. తిరుపతిలోని ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకుని, ఉదయమే లేచి, తయారయి దర్శనానికి కొండపైకి వెళ్ళాము. దర్శనం ముగిసాక క్రిందికి రావటం కోసం అని ఒక టాక్సీ బుక్ చేసుకున్నాము. అక్కడ టాక్సీ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనికి తెలుగు రాదు. అతను మాట్లాడే భాష వీళ్ళకి తెలియటం లేదు. ఏదో చెబుతున్నాడు, కానీ అక్కడున్నవారికి అర్థం కావటం లేదు. అతను ఎవరితో వచ్చాడో వాళ్ళనుంచి తప్పిపోయాడు. మా టాక్సీ డ్రైవరు చెప్పాడు, తిరుమలలో అంతకు ముందు అలాగే ఒక ముసలాయన తప్పిపోయి, భాష తెలియక అవస్థ పడితే, అక్కడివారు అతన్ని వెతుక్కుంటూ ఆయన కుటుంబసభ్యులు వచ్చేవరకూ భోజనం పెట్టి, ఆశ్రయం ఇచ్చి సహాయం చేసారని.
నా కథలో కూడా ఒక ముసలాయన జ్వరతీవ్రతలో రైలు ఎక్కి, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక పల్లెకు వచ్చేస్తాడు. అతనికి భాష తెలియదు, నిరక్షరాస్యుడు. ఒక కూరగాయలు అమ్మే స్త్రీ అతనికి పల్లెలోని తన ఇంట్లో ఆశ్రయం ఇస్తుంది. పత్రికలలో ప్రకటనలు వేయిస్తుంది. తమిళం తెలిసినవారిని తీసుకువచ్చి, అతనితో మాట్లాడించి, అతని ఊరును కనుక్కుంటుంది. చివరికి ఆ ఊరి పోలీస్ స్టేషన్ ద్వారా అతని కొడుకులకు కబురు వెళ్ళి, వారు వచ్చి ఈయనను తీసుకుని వెళతారు. ఆయన వెళుతూ ఉంటే, ఆ మహిళ పూజగదిలోంచి ఆయన రోజూ ధరించే అమ్మవారి కుంకుమ ఉన్న అద్దాలభరిణను తీసుకువచ్చి ఆయనకు ఇస్తుంది. ఆయన సంతృప్తిగా కొడుకుతో కారెక్కుతాడు.
ప్రశ్న 8: ‘శిశిరమెరుగని వనాలు’ కథకి చక్కని శీర్షిక చక్కగా అమరింది. ఈ కథ నేపథ్యం వివరించండి.
జ: అయ్యో, ఈ కథానేపథ్యాన్ని తలచుకున్నప్పుడు నాకు కన్నీరు ఆగదు. నాకు బాగా తెలిసిన ఒకావిడను, వృద్ధాప్యంలో ఆమె ఏకైక పుత్రుడు ఒక హోమ్‌లో వదిలిపెట్టేసాడు. తల్లి చనిపోతే కొడుకు మాత్రమే వచ్చి, అంత్యక్రియలు నిర్వహించాడు. ఇంటికి ఆమె దేహాన్ని తీసుకుని వెళ్ళలేదు. కారణం అతని భార్యకు భయం అట. కానీ ఆమె చనిపోయిన తరువాత పన్నెండవ రోజును ఒక పండుగలాగా జరిపారట. పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి, మంచి మంచి భోజనాలు పెట్టి, ఖరీదైన రిటర్న్ గిఫ్ట్‌లు కూడా ఇచ్చారట. ఆరోజు కోడలు పొగిలి పొగిలి ఏడ్చిందట. ఈ విషయం కొంతమంది ప్రత్యక్షసాక్షుల వల్ల తెలిసాక, చాలా వేదన పడ్డాను. చాలా విషాదమైన మనోస్థితిలో ఆ కథను వ్రాసాను.
ప్రశ్న 9: కథలపోటీలో ప్రథమబహుమతి పొందిన ‘అన్ డూ’ మంచి కథ. ఒక గొప్ప జీవితసత్యాన్ని అత్యంత సరళంగా చెప్పింది. ఈ కథలోని సదాశివ నిజజీవితంలో మీకు తెలిసిన వ్యక్తా? లేక కల్పించి సృష్టించిన పాత్రా? ఈ కథ నేపథ్యం వివరిస్తారా?
జ: ‘అన్ డూ’ కథ నా వృత్తిలోంచి పుట్టినదే. నేను 2008 నుంచి, ఇంట్లోనూ, ఆఫీసులోనూ పర్సనల్ కంప్యూటర్స్ వాడుతున్నాను. 2001 లోనే ఆఫీసులో ఎమ్మెస్ వర్డ్, దాని కమాండ్స్ నేర్చుకున్నాను. అందువలన ఇంట్లో కథలు వ్రాసుకోవటానికి దానిని ఉపయోగించటం వలన, రచన నాకు చాలా సులభం అయింది. పేపర్ల మీద కష్టపడి వ్రాయటం, కొట్టివేతలు, దిద్దుబాట్లు వస్తే మళ్ళీ వ్రాయవలసి రావటమనే అవస్థలు తప్పాయి.
అన్ డూ అనేది ఎమ్మెస్ వర్డ్‌లో ఒక కమాండ్. అందరికీ తెలిసినదే. మనం పొరపాటున ఏదైనా తొలగిస్తే, దానిని మళ్ళీ రప్పించటానికి (రిట్రీవ్) కంట్రోల్+జెడ్ అనే రెండు కీలనూ ఒకేసారి ఒత్తితే, మనం తీసేసిన మ్యాటర్ మళ్ళీ వస్తుంది. (ఇప్పుడు మనం చేసిన చర్య రద్దయి, పూర్వం ఎలా ఉందో అలా వచ్చేస్తుంది.) నేను ఈ కమాండ్ ఉపయోగించిన ప్రతిసారీ, ‘ఇది జీవితానికి కూడా ఆపాదించుకుంటే ఎంత బాగుంటుంది, ఎన్నో అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి కదా, మనుషుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి కదా..’ అని ఆలోచించేదాన్ని. కొత్తగా పెళ్ళయిన జంట మధ్య అపార్థాలు వస్తే ఇలాంటి కమాండ్ (సారీ) వలన వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు అనే ఆలోచనతో వ్రాసిన కథ ఇది.
సదాశివ పూర్తిగా కల్పితపాత్ర. ఒకరకంగా నేనే ఆ సదాశివను.
ప్రశ్న 10: ‘రాలిన పువ్వులు రెండు – పూసే గుత్తులు మూడు’ శీర్షిక విభిన్నంగా ఉంది. ఈ కథకి ఆ పేరే పెట్టాలని ఎందుకు అనిపించింది? ఈ కథ గురించి వివరిస్తారా?
జ: మనకందరికీ తెలిసిన ఒక పాట ఉంది. ఆ పాటను నేను రేడియోలో చిన్నతనం నుంచీ వింటున్నాను. 1966 లో విడుదల అయిన రంగులరాట్నం అనే చిత్రంలో, టైటిల్స్ పడుతున్నప్పుడు ఒక నేపథ్యగీతం వస్తుంది. దాన్ని ఘంటసాల మాస్టారు పాడారు. ఒక తత్త్వంలా సాగే ఈ గీతాన్ని భుజంగరాయ శర్మ గారనే కవి వ్రాసారు. ఇది ఆయన వ్రాసిన ఏకైక సినీగీతం.
‘కలిమి నిలవదు, లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు,
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా, వాడిన బ్రతుకే పచ్చగిల్లదా?
ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగులరాట్నము, బ్రతుకే రంగులరాట్నము!’
అనే పల్లవితో సాగుతుంది.
చరణాలలో ఒకచోట,
‘ఇరుగింటిలోన ఖేదం, పొరుగింటిలో ప్రమోదం;
రాలిన పువ్వులు రెండూ, పూసే గుత్తులు మూడు!’
అని వస్తుంది.
ఈ కథకు సరిగ్గా సరిపోతుందని అనిపించి, ఈ శీర్షికను పెట్టాను. నాకిష్టమైన పాట. ప్రతిపంక్తీ ఇలాగే ఉంటుంది, ఏదీ (సుఖం కానీ, దుఃఖం కానీ) శాశ్వతం కాదని. ఈ శీర్షిక (పంక్తి) అయితే ఎంతో ఆశను రేకెత్తించేదిగా, నిరాశను నిర్మూలించేదిగా అనిపిస్తుంది.
ప్రశ్న 11: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: అద్దాల భరిణ. ఇందులోని సత్తెవ్వ పాత్ర చాలా గొప్పది. ఎంతోమంది చదువుకున్న, సంఘసంస్కర్తలైన మహిళల కన్నా ఈమె మంచితనం, సేవాదృక్పథం చాలా గొప్పవి. దారితప్పిన భర్తతో తెగతెంపులు చేసుకుని, స్వశక్తితో జీవిస్తూ, వృద్ధురాలైన అత్తగారిని కూడా తన బంధువుల సహాయంతో చూసుకుంటూ, తన సంపాదనలో కొంతభాగాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇస్తూ.. ఒక సంతృప్తికరమైన శ్రామికజీవనాన్ని గడుపుతూ ఉంటుంది. పాండ్యన్ కోసం ఆమె పడిన ఆరాటం, ఆయన్ని వారి దగ్గరకు చేర్చేవరకూ పడిన తపన అనిర్వచనీయం. ఇంతకన్నా గొప్ప మహిళ ఉంటుందా? ఒక చక్కని స్త్రీరత్నాన్ని సృష్టించగలిగినందుకు ఈ పాత్ర, ఈ కథ నాకు చాలా ఇష్టమైనవి.
ప్రశ్న 12: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: రెండు కథలు బాగా కష్టంగా అనిపించాయి. అవి, ‘స్వీట్ బాక్స్’, ‘మీరు నిజంగా దేవుడండీ!’ మొదటికథ నేను నిజామాబాద్‌లో పనిచేసినప్పటి అనుభవం. ఆ కథలో గంగవ్వ పాత్ర సంభాషణలు ఖచ్చితంగా తెలంగాణ మాండలికంలోనే వ్రాయాలి. నేను నా వివాహం ద్వారా తెలంగాణ ఇంటి కోడలిగా అయిన, కోస్తాజిల్లాలో పుట్టి పెరిగిన అమ్మాయిని. హైదరాబాద్‌కి వచ్చిన తరువాతే తెలంగాణ మాటలు వినటం, అనటం అలవాటు అయింది. నిజామాబాద్ లోని భాషకు, హైదరాబాద్ లోని భాషకు కూడా చాలా తేడా ఉంటుంది. అక్కడి మాటలు వ్రాయటం నాకు చాలా కష్టం అయింది, కానీ వ్రాయగలిగాను. చాలామంది పెద్దలు మెచ్చుకున్నారు కూడా. ఆ తరువాత, ‘అద్దాల భరిణ’ కథలో కూడా తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించాను.
రెండవది ఒక దొంగ కథ. ఇదికూడా ఒక నిజజీవిత అనుభవమే. ఒకసారి ఒక కవితాసమ్మేళనం కోసం అనంతపురం వెళ్ళాము కొంతమంది కవయిత్రులం కలిసి. అర్ధరాత్రి మా త్రీ టైర్ స్లీపర్ కంపార్ట్మెంట్లో దొంగతనం జరిగినది. చలికాలం కావటంతో అందరూ ముసుగులు పెట్టి నిద్రపోయారు. దొంగ దుప్పట్లు కత్తిరించి, ఆడవారి మెడల్లో నగలు, మగవారి బ్యాగులను కోసి, డబ్బు పట్టుకుని దూకేసాడట. రైలు చాలాసేపు ఆగిపోయింది, బహుశా ఆ దొంగ కోసం కాబోలు. (ఆ దొంగ చివర ఉన్న నా సైడ్ లోయర్ బర్త్ అంచున చాలాసేపు ఒదిగి కూర్చున్నాడు, పక్క స్టేషన్లో దిగిపోతానంటూ.) అతను వేగంగా వెళుతున్న రైలు దూకేసాడన్న మాట వినగానే, నాకు ప్రాణం ఉసూరుమంది. నగలు, డబ్బు పోగొట్టుకున్నవారి మీద జాలి, బాధ కలిగాయి. కానీ, ‘ఆ దొంగ ఒకవేళ దూకుతున్నప్పుడు చనిపోతే.. అతని కుటుంబసభ్యులు ఏమైపోతారు?’ అన్న ఆలోచన నన్ను కలవరపెట్టింది. ఈ ఆలోచనలోంచి వచ్చిందే, ‘మీరు నిజంగా దేవుడండీ!’ కథ. నిజానికి దొంగతనం మహాపాపం. ఆ దొంగల పట్ల సానుభూతి ఉండకూడదు. ‘కానీ అతనూ మనిషే కదా, అతని ప్రాణం సైతం విలువైనదే కదా’ అన్న ఆలోచన నన్ను ఈ కథను వ్రాయించింది. కథలో ప్రసాద్ (దొంగ) పాత్ర గురించి వ్రాసినప్పుడు నేను చాలా సంఘర్షణకు లోనయ్యాను. దొంగను సమర్థించకూడదు. కానీ ప్రసాద్ జీవనవిధానాన్ని మార్చాలి. ఈ స్ట్రెస్ కథ పూర్తి అయ్యేవరకూ నన్ను వెంటాడుతూనే ఉంది.
ప్రశ్న 13: ‘అద్దాల భరిణ’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: అవునండీ, ఈ పుస్తకప్రచురణలో నాకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారి పాక్షిక ఆర్థిక సహాయం లభించింది. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం. పుస్తక ప్రచురణావ్యయం ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలుసు కదా.. కేవలం ఇరవై రోజుల్లో అచ్చువేసి పుస్తకాలు తెప్పించారు శ్రీమతి జ్యోతి వలబోజు (జెవి పబ్లికేషన్స్ అధినేత) గారు.
అలాగే, ఈ సంపుటికి వచ్చిన ఆదరణ నిజంగా అసామాన్యం. బుక్ ఫెయిర్‌లో ఇంచుమించు 25 కాపీలు అమ్ముడుపోయాయి. రివ్యూల ద్వారా ఆర్డర్స్ కూడా బాగానే వచ్చాయి. అందరినీ ‘అద్దాల భరిణ’ అనే శీర్షిక ఆకర్షించిందని విన్నాను. పుస్తకం యొక్క ముఖచిత్రం కూడా బాగుందని అన్నారు అందరూ.
ప్రశ్న 14: తప్పులు లేని తెలుగుని వ్యాప్తి చేయలనే లక్ష్యంతో మీరు ఫేస్బుక్ మాధ్యమంగా విశేష కృషి చేస్తున్నారు? దీనికి స్పందన ఎలా ఉంది? ఎప్పుడైనా నిరాశ కలిగిన సందర్భాలున్నాయా?
జ: ఈ విషయంలో నేను సంచికకు సర్వదా కృతజ్ఞురాలిని. నా వ్యాసాలను వెలుగులోకి తెచ్చింది సంచికే. ఫేస్బుక్లో నేను ఈ విషయమై పెట్టే పోస్ట్‌లకు నిజంగానే మంచి స్పందన వచ్చింది. సరియైన తెలుగులో వ్రాయాలని తపించేవారు, సానుకూలంగా స్పందించే వారు తొంభై శాతం ఉంటే, కోపం తెచ్చుకునేవారు, ‘నువ్వా నాకు చెప్పేది?’ అన్నవారు ఒక పదిశాతం వరకూ ఉన్నారు. మొదట్లో నిరాశ కలిగినా ఇంకా పాఠాలు చెబుతూనే ఉన్నాను. కొంతమందైనా అనుసరిస్తారు కదండీ. ఇప్పుడు పెద్దగా నిరాశ పడటం లేదు.
ప్రశ్న 15: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధం అవుతున్నాయా?
జ: ఈ మధ్యనే ఉగాదికి ప్రారంభించబడిన ‘సంపంగి’ అనే మాసపత్రికకు ఉపసంపాదకురాలిగా వ్యవహరిస్తున్నాను. దీనికి సంపాదకురాలు శ్రీమతి సరస్వతి కరవది గారు. మరో ఉపసంపాదకురాలు, శ్రీమతి గిరిజారాణి కలవల గారు. వారిద్దరూ నాకు మంచిమిత్రులు. రవళి మాసపత్రికకు, కథామంజరి మాసపత్రికకు ప్రూఫ్ రీడర్‌గా ఉన్నాను.
త్వరలో నా ఎనిమిదవ పుస్తకం – ఐదవ కథాసంపుటి రాబోతుంది. ఇంకా శీర్షిక నిర్ణయించలేదండీ. బహుశా మరో రెండునెలల్లో విడుదల అవుతుంది. సమయం దొరికితే మంచి నవల వ్రాయాలని ఉంది.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు నండూరి సుందరీ నాగమణి గారూ.
నండూరి సుందరీ నాగమణి: ధన్యవాదాలు.
***
రచన: నండూరి సుందరీ నాగమణి
ప్రచురణ: జెవి పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 132
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 9000413413
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/products/addala-bharina
~
‘అద్దాల భరిణ’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/addala-bharina-book-review-kss

