[‘అమ్మణ్ని కథలు’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి నంద్యాల సుధామణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం నంద్యాల సుధామణి గారూ.
నంద్యాల సుధామణి: నమస్కారం.
~
జ: అమ్మణ్ని కథలు రాయడానికి ప్రేరణ ఏంటంటే.. మొదటగా నాలోని జర్నలిస్టిక్ తపన.. జిజ్ఞాస! అంటే నాకు నచ్చిన భావాన్ని పదిమందికీ చెప్పాలనే తాపత్రయం. అది లేనిదే ఏ రచ(యిత్రీ)యితా కూడా ఏమీ రాయలేరు.
తరువాత ప్రేరణలు శ్రీమతి సోమరాజు సుశీల గారి ‘ఇల్లేరమ్మ కథలు’, పొత్తూరి విజయలక్ష్మి గారు తమ బాల్యంలోని సంఘటనలు వివరిస్తూ హాస్యరసస్ఫోరకంగా రాసిన కథలు అని చెప్పొచ్చు. అదీగాక మా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు సంబంధించిన వాట్సాప్ పేజిలో నేను తరచుగా మావూరి గురించి, మా అమ్మానాన్నల గురించి, మా చిన్నప్పుడు జరిగిన సరదా సంఘటనల గురించి తమాషాగా రాసేదాన్ని. మా వాళ్లందరూ చాలా ఎంజాయ్ చేస్తూ.. ఆ అనుభూతులలో వాళ్లకూ భాగస్వామ్యం వుంది కనుక ఆనందంతో ఉర్రూతలూగేవారు. ఇంకా రాయమని ప్రోత్సహించేవారు. అప్పుడే నాకు అనిపించింది.. వీటిని కథలుగా రాస్తే బావుంటుందని!
నేను మా వూరు గురించి వర్ణిస్తూ రాసిన వ్యాసం చదివి ప్రేరణ పొంది మా చిన్నతమ్ముడు నాగార్జున ‘నా కోవెలకుంట్ల ధరిత్రి’ అనే పుస్తకం రాశాడు. అది మొత్తం మావూరి గురించిన విజ్ఞానసర్వస్వం వంటిది. అది వేరే విషయం అనుకోండి.
‘మాల్గుడీ డేస్’ టీవీ సీరియల్ చూసేటప్పుడు కూడా ‘మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా వున్నాయి కదా..’ అనిపించేది. ‘ఇంత మామూలు విషయాలను కూడా కథలుగా రాయొచ్చా..’ అని ఆలోచనలు ముసురుకునేవి.
కథ అంటే గంభీరమైన కథావస్తువు, ఉదాత్తమైన వ్యక్తిత్వాలు గల నాయికా నాయకులు, ఆశ్చర్యపరిచే మలుపులు, కొసమెరుపులు, ఆలోచనాత్మక సంభాషణలు ఇవన్నీ వుండాలేమోనన్న నా ఊహను చెల్లాచెదురు చేసింది ‘మాల్గుడీ డేస్’ టీవీ సీరియల్.
సుశీల గారి ‘ఇల్లేరమ్మ కథలు’ చదివాక మనమూ మన అనుభవాలను, అనుభూతులను సులభశైలిలో ఇలా రాయొచ్చు కదా.. అనే భావం వేళ్లూనుకుంది. నిజానికి వాస్తవ సంఘటనలే కల్పన కంటే మనసుకు హత్తుకునేలా వుంటాయి. వాటికి చిరుహాస్యం, వ్యంగ్యం అనే మెరుపులు అద్దితే ఇంక చెప్పక్కర్లేదు.
నేను తరచుగా మా మనవలు, మనవరాళ్లతో నా చిన్నప్పటి అనుభవాలను చెప్పేదాన్ని. మా వూళ్లో సినిమా బండిలో అనౌన్స్‌మెంట్లు ఎలా నాటకీయంగా వుంటాయి.. సినిమా టెంటులో జరిగే తమాషాలు, జోకులు వంటివి యాక్షన్‌తో సహా చెప్పితే పడీపడీ నవ్వేవారు పిల్లలు. ఇవన్నీ కథలుగా రాస్తే బాగుంటాయి అనే భావనలే ‘అమ్మణ్ని కథలు’ ఆవిర్భావానికి పునాదులయ్యాయి.
ప్రశ్న 2. మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? ఎప్పుడు ఏ ప్రక్రియతో మొదలయింది?
జ: నా సాహితీ ప్రయాణం గురించి చెప్పాలంటే.. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక చక్కటి సాహితీ వాతావరణం వుండేది. అక్కలు, అన్నలు.. వాళ్లు చదివిన పుస్తకాలు, వారపత్రికలలోని సీరియల్స్, కథలు, సినిమాలు వీటి గురించి చర్చలు, విశ్లేషణలు చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు మావూరి లైబ్రరీకి సెక్రెటరీగా వుండేవారు. దానివల్ల పుస్తకాలు విరివిగా అందుబాటులో వుండేవి. అలా అర్థమైనా, కాకున్నా పుస్తకం కనిపిస్తే చదివేయడం అలవాటు అయింది. అక్కా వాళ్ల వల్ల విశ్లేషణాత్మకంగా ఆలోచించడం అలవాటయింది.
ఒక జర్నలిస్టును పెళ్లాడినందువల్ల, ఆయన ప్రభావం వల్ల పత్రికారచన గురించి అవగాహన వొచ్చింది. ఆయన ఏదైనా పుస్తకం చదవాలంటే ఆయనకు ఒక శ్రోత వుండాలి. అది ఆయన అలవాటు. అలా ఆయనకు శ్రోతగా మారి అనేక పుస్తకాలను విన్నాను. ఆంధ్రప్రభ దినపత్రికలో కొన్ని పుస్తక సమీక్షలు చేయడం, ఆకాశవాణిలో కొన్ని వ్యాసాలు రాయడం, చదవడం జరిగింది.
అకస్మాత్తుగా మావారు 1992లో స్వర్గస్తులు కావడం వల్ల జీవికను కొనసాగించడం కోసం ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో సబ్-ఎడిటర్‌గా చేరాను. నా శైలి, నా రచనా విధానం చాలా బాగుందని అప్పటి ఎడిటర్ శ్రీ వాకాటి పాండురంగారావు గారు మెచ్చుకున్నారు. నేను కథ రాయగలననీ, ప్రయత్నించమనీ ప్రోత్సహించారు. నాకు ఏ సబ్జెక్టు మీద రాయాలో తోచలేదు. అప్పటి దాకా నా సంసారం , ఇల్లూ పిల్లలూ తప్ప బయటి ప్రపంచం తెలీదు. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. సరే.. నా భర్తృవియోగ దుఃఖాన్నే ‘వెలితి’ అనే కథగా రాశాను. అది వాకాటి గారి వంటి గొప్ప రచయిత, ఎడిటర్ మెప్పు పొందింది. తరువాత ‘నిచ్చెన’, ‘ఆటోసజెషన్’ వంటి కొన్ని కథలు రాశాను. పత్రికా రచయిత్రిగా ఎన్నో వ్యాసాలు, ఇతర రచనలు చేశాను.
అయితే ఇది ఎనిమిదేళ్లు మాత్రమే కొనసాగింది. తరువాత మా అబ్బాయికి ఉద్యోగం రావడం వల్ల నా సంపాదన అవసరం లేదనిపించింది. ఇక ఉద్యోగం మానేసి విశ్రాంతిగా వుండమని పిల్లలు కోరడం వల్ల, అనారోగ్యం వల్ల గృహిణిగా వుండిపోయాను. ఇరవయ్యేళ్ల పాటు అసలు ఏమీ రాయలేదు. పిల్లల పెళ్లిళ్లు, మనవలు, మనవరాళ్ల పెంపకంతో సరిపోయింది. ఏదైనా రాద్దామని అనిపించినా, ‘పెద్ద రచయితలు ఎందరో వుండగా మన కథలు ఎవరు వేసుకుంటారులే..’ అనిపించేది.
2022 తరువాత సంచిక ఆన్‌లైన్ మాగజైన్ చదవడం ప్రారంభించాను. సంచిక ఎడిటర్ మురళీకృష్ణ గారి ప్రోత్సాహంతో తిరిగి రాయడం మొదలుపెట్టాను. సంచికలో ఏడెనిమిది కథలు రాశాను. అమ్మణ్ని కథలు 25 భాగాలు రాశాను.
ప్రశ్న 3. ఆంధ్రప్రభ వారపత్రికలో సబ్-ఎడిటర్‍గా కొన్నేళ్ళపాటు పనిచేశారు కదా, ఆ అనుభవం రచనలలో మీకెలా ఉపకరించింది?
జ: నిజం చెప్పాలంటే, ఆంధ్రప్రభలో చేరాకనే నా రచనాయాత్ర ఊపందుకుంది. అక్కడ చక్కటి సాహితీ వాతావరణం నెలకొని వుండేది. ప్రచురణకు వొచ్చిన కథలు, నవలలు, కవితల గురించి నిరంతరం చర్చ జరుగుతూ వుండేది. ఫలానా కథ ఆ విధంగా కాకుండా మరో విధంగా ఎలా రాసి వుండవచ్చు అన్నదాని గురించి, అంతెందుకు.. మొత్తం కథను ఈకలు పీకలు పీకి విశ్లేషించేవారు మా సహోద్యోగులు. పదబంధాల గురించి, ఏ పదం ఎలా వొచ్చింది అన్నదాని గురించి విస్తృతంగా చర్చ జరిగేది. ఇక కథలు, నవలల పోటీల సమయంలో వందలాది కథలు, నవలలు వొచ్చేవి. వాటిని చదవి అభిప్రాయాలు పంచుకునేవాళ్లం. బాగున్న వాటిని గురించి విస్తృత సమీక్షలు జరిగేవి. వాకాటి గారి ‘మిత్రవాక్యం’ వంటి శీర్షికలు విజ్ఞానదాయకంగా వుండేవి. మధురాంతకం రాజారాం వంటి ఎందరో గొప్ప రచయితలు, విమర్శకులు, కవులు, సాహితీవేత్తలు ఆఫీసుకు వస్తూ వుండేవారు. వాళ్లతో మాట్లాడే అవకాశం అంతగా లేకపోయినా వాళ్లను చూడటమే ఎంతో అదృష్టంగా భావించేదాన్ని. ఎందరినో ఇంటర్వూలు చెయ్యడం, కొన్ని కథా వర్క్‌షాప్‌లకు వెళ్లడం చక్కని అనుభూతులను మిగిల్చాయి. నా రచనా వ్యాసంగానికి ఒరవడి దిద్దింది నా ఆంధ్రప్రభలో ఉద్యోగానుభవం.
చిన్ననాటి మిత్రులు, కజిన్స్‌తో రచయిత్రి
ప్రశ్న 4. ఈ కథలు ఎందుకు వ్రాసారో చెబుతూ, ‘వాటిని అందరికీ చెప్పి ఆశ్చర్యపరచాలనే జర్నలిస్టిక్ తపన’ అని అన్నారు. ఈ పాత్రికేయ కుతూహలం గురించి వివరిస్తారా?
జ: ఎవరైనా ఓ కథో, నవలో, వ్యాసమో, కవితో రాస్తున్నారంటే వారిలో ఎంతో కొంత ‘జర్నలిస్టిక్ తృష్ణ’ తప్పక వుంటుంది. దాన్నే ‘జర్నలిస్టిక్ దురద’ అని అని కూడా అంటుంటారు. అదేంటంటే తాను చూసిన, విన్న, తెలుసుకున్న విషయాలను ఏదో ఒక సాహిత్య ప్రక్రియలో రాసి, అందరికీ తెలియ జేయాలనే ప్రగాఢమైన కోరిక అన్నమాట. దాని వలన తానెంత గాఢంగా ప్రభావితం అయ్యాడో, చదివినవారు కూడా అంతే లోతుగా స్పందించాలన్న కోరిక అన్నమాట!
ఈ తపన వ్యక్తుల మానసిక పరిణతిని బట్టీ, అభిరుచులను బట్టీ వివిధ స్థాయిల్లో వుండవచ్చు. ఇది కేవలం రాయడానికే పరిమితం కాదు. చాలామంది తమకు తెలిసిన విషయాలను పూసలో దారమెక్కించినట్టుగా చెబుతుంటారు. వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది.
సాధారణంగా ఈ జర్నలిస్టిక్ తహతహ ఉన్నవాళ్లకు మెదడులో ఒక ప్రత్యేక విభాగం, మామూలు వాళ్ల కంటే అదనంగా వుంటుందని నా అభిప్రాయం. అది ఎన్నో భావోద్వేగాలతో, ఊహలతో, రసవత్తరమైన విషయాలతో నిండి వుంటుంది. మామూలు వాళ్లు విని మరిచిపోయే చాలా విషయాలను వీళ్లు అపురూపమైన జ్ఞాపకాల రూపంలో ఈ విభాగంలో దాచుకుంటారు. అంటే మామూలు వాళ్లు రాళ్లనుకుని వదిలేసే విషయాలను వీళ్లు రత్నాలలాగా దాచుకుంటారు. వాటిని వాళ్లు జీవితాంతం మరిచిపోరన్నా ఆశ్చర్యం ఏమీలేదు. ఇలా దాచుకున్న విషయాలను వీళ్లు కొన్ని గుంపులుగా చేసుకుని నిల్వ చేసుకుంటారు. అవసరమైనప్పుడు ఆ ఫైల్స్ లోని సమాచారాన్ని తమ రచనలలో వినియోగించుకుంటారు. ఏదైనా రాస్తున్నప్పుడు మెరుపు లాంటి భావాలు ఉద్భవించేది ఈ విభాగంలో నించే అనుకోవొచ్చు.
అరవయ్యేళ్ల కిందటి విషయమైనా వారి మనసులో అప్పుడే పూసిన పువ్వులా తాజాగా వుంటుంది. ఆ సమాచారానికి మరిన్ని అనుభూతులు, అనుభవాలు కొత్తదనాన్ని తెచ్చిపెడుతూ వుంటాయి. ఆ ఫైలు అలా పెరిగి, ఆ తాపత్రయం బలీయమై వారిని రాసే దాకా నిలవనీయదు.
మీరు చెప్పినట్టు ఆ పాత్రికేయ కుతూహలం ‘కథన కుతూహలం’గా మారి వారిలోని సాహితీ సౌరభాలను మన దాకా తీసుకొచ్చేదాకా వదలదన్నది నిజం!
ప్రశ్న 5. శ్రీ అంబాళం పార్థసారథి గారు తమ ముందుమాటలో ఈ కథల గురించి చెప్తూ, “ఒక్కొక్క కథ ఒక్కో జీవన నిర్వచనాలుగా మలచబడ్డాయి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాన్ని అమ్మణ్నికి మాత్రమే కాకుండా, ఇతర పాత్రధారులకి అన్వయిస్తే, జీవన విస్తృతి గోచరిస్తుంది. వారి ఈ వ్యాఖ్యని మీరెలా విశ్లేషిస్తారు?
జ: “అమ్మణ్ని కథల్లో ఒక్కో కథ ఒక్కో జీవన నిర్వచనంగా మలచబడింది” అన్న అంబాళం పార్థసారథి గారి మాట చాలా పెద్దది. బరువైనది కూడా! కానీ అమ్మణ్ని పాత్ర విస్తృతిని ఇతర పాత్రలకు కూడా ఇస్తే కథ పెద్దదై దాని సమతుల్యతను కోల్పోతుంది కదా! కథలో ముఖ్యపాత్రకు మిగిలిన పాత్రలన్నీ సహాయకారులుగా వుండాలి. కథను నడిపించాలి. అవి ముఖ్యపాత్ర కంటే కూడా విలక్షణమైనవి కావొచ్చు. కానీ కథ పరిమితి దృష్ట్యా అన్ని పాత్రలూ ముఖ్యపాత్రకున్న విస్తృతిని పొందలేవు అన్నది నా అభిప్రాయం. అలా పెంచుకుంటూ పోతే కథకున్న క్రిస్పీనెస్ పోతుందని నాకనిపిస్తుంది.
ప్రశ్న 6. కథకి సంబంధించి వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారో చెప్తారా?
జ: కథకు కథావస్తువే ముఖ్యమని నాకు అనిపిస్తుంది. శైలి,శిల్పం కూడా ప్రధానమే! కానీ, కథలో బలం లేకుండా కేవలం శిల్పం, శైలితోనే నడపడం అందరు రచయితలకూ, అన్నివేళలా సాధ్యం కాదు. అలా ఒక చిన్న సంఘటనను తీసుకుని అద్భుతమైన శిల్పంతో రచించిన వాళ్లు చాలామంది వున్నారు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప అది సాధ్యం కాదేమో నాకనిపిస్తుంది. దానికి హాస్యం, వ్యంగ్యం వంటివి బాగా దట్టించాలి. కరుణ, మానవీయ కోణాలు బలంగా వుండాలి. చెప్పదలచిన విషయంపై సాధికారత వుండాలి. సంభాషణలలో సత్తా వుండాలి. అలాంటి ఎన్నో అదనపు అర్హతలు వుండాలి. ఎన్నో కథలు చదివాను గానీ, ఇప్పుడు గుర్తు రావడం లేదు. వాకాటి గారి ‘గోమెన్నసాయ్’ అలాంటి కోవలోకి కథే! కాఫీ గురించి ఆయన మొత్తం కథంతా నడిపించారు. ముఖే ముఖే సరస్వతీ.. అన్నారు కదా!
“ఒక పత్రికలో వెలువడిన సంపాదకీయాన్ని తీసుకొని కూడా నేను ఒక సినిమా నిర్మించగలను” అన్నారు ఒకసారి నాటి ప్రముఖ చిత్ర దర్శకుడు సత్యజిత్ రాయ్. అంతటి శక్తి ఆయనది! మరి అది అందరికీ సాధ్యం కాదు కదా?
కథ, శిల్పం, శైలి అన్నీ సమపాళ్లలో కలిస్తే ఆ కథలు చిరకాలం గుర్తుండిపోతాయి. కథాదృష్టితో చూస్తే.. మన రామాయణం, భారతం అలాంటివేనని నేననుకుంటాను.
ప్రశ్న 7. మీ బాల్యానికి, మీ పిల్లల బాల్యానికి, మీ మనుమలు/మనుమరాళ్ళ బాల్యానికి మధ్య కాలంలో సామాజికంగానూ, కుటుంబపరంగాను ఎన్నో మార్పులు వచ్చి ఉంటాయి. వాటిని తట్టుకుంటూ, బాల్యాన్ని ఒక మధురమైన అనుభూతిగా మలచుకోవడంలో మీ తరువాతి రెండు తరాలలో మీరేదైనా ప్రధానమైన మార్పుని గమనించారా?
జ: నిజం చెప్పాలంటే నా బాల్యానికీ, మా పిల్లల బాల్యానికీ, మా మనవలూ, మనవరాళ్ల బాల్యానికీ హస్తిమశకాంతరం తేడా వుంది.
నేను పెరిగింది వ్యవసాయాధారిత కుటుంబం. పదకొండు మంది పిల్లలు, వచ్చీపోయే బంధువులూ, జీతగాళ్లు, వ్యవసాయ కూలీలు, ఆవులూ, గేదెలూ, లంకంత ఇల్లూ ఇదొక వైపు. మరోవైపు చుట్టూ ఎంతో పేదరికం తాండవిస్తూండేది. ఆ జీవితంలో ఎంతో సర్దుబాటు, ఇచ్చిపుచ్చుకునే పద్ధతులూ వుండేవి. మనమేమీ ప్రయత్నించకుండానే రకరకాల మనస్తత్వాలు, జీవనవిధానాలూ, పేదరికంలోని కష్టనష్టాలు ఇవన్నీ అవగతమయ్యేవి. అవన్నీ అర్థం చేసుకోవడానికి తగినంత తీరుబడి వుండేది.
చెల్లెలు జయతో రచయిత్రి చిన్నప్పటి ఫోటో
మా పిల్లల వరకూ వొచ్చేసరికి హైదరాబాద్ లాంటి సిటీలో చిన్న ఇంట్లోనే చాలామంది సర్దుకోవడం, చాలీచాలని ఆదాయం, ఉమ్మడి కుటుంబ వాతావరణంలో, ఎంతో సర్దుబాటు చేసుకుంటూ పదిమందిలో పెరిగారు మా పిల్లలు.
మా మనవలు మనవరాళ్ల పరిస్థితి కొచ్చేసరికి అమెరికా వాసాలు, వాళ్ల నాన్నల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, కార్లు, కంఫర్టులూ, పెద్ద ఇల్లూ, అందరికీ సెపరేట్ బెడ్రూములూ ఇదీ సీన్.
ఈనాటి జీవితంలో సకల వసతులతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ పరిమిత కుటుంబం వల్ల, ఎవరికి వాళ్లు వారి గదుల్లో, ఎవరి ఫోన్లలో వాళ్లు తలదూర్చేసి బతుకుతుండటం వల్ల నా జీవితంలోనూ, మా పిల్లల జీవితాల్లోనూ వున్న సందడి ఇప్పుడు లేదు. అందరం కూర్చుని గలగలా మాట్లాడే సందర్భాలు తగ్గిపోయాయి.
అక్కడికీ భోజనాలు సమయంలో మాటలు కలిపి, ఏదో ఒక విషయం పైన చర్చ మొదలుపెడతాను నేను. తెలుగులో మాట్లాడితే.. నేను మాట్లాడే మాటల పైన పిల్లలకు తగినంత శ్రద్ధ వుండదు. సగం తెలుగు మాటలు అర్థం కావు. అక్కడికీ అన్నింటికీ అర్థాలు చెబుతూనే వుంటాను. బడిలో తెలుగు సెకెండ్ లాంగ్వేజ్ అందరికీ. అయినా తెలుగు పేపర్ చేత్తో కూడా ముట్టుకోరు. ఇప్పటి పిల్లలకు పేపర్ చదివే అలవాటే లేదు. రాజకీయాలు, దేశ పరిస్థితుల పట్ల అవగాహన అంతంత మాత్రమే. భోజనాల వేళ ఏదైనా సంభాషణ మొదలు పెట్టినా, ఎప్పుడు భోజనం పూర్తయితే లేచి వెళ్లిపోయి లాప్‌టాప్ ముందు కూర్చుందామనే ఆలోచనతోనే వుంటారు మా మనవలు. అలా అని వాళ్లేమీ చెడు మనస్తత్వం వున్నవారు కారు.. వాళ్ల ప్రాధాన్యాలు వేరు. మన సమస్యలు, భావాలు వాళ్లకు అంతగా పట్టవు.
అదీగాక వాళ్లు చిన్నతనంలో అమెరికాలో పెరగడం వల్ల.. ప్రతీ విషయాన్నీ ఇంగ్లీష్‌లో ఆలోచించి, తెలుగులో అనువదించుకొని మాట్లాడాలి. ఇదొక అడ్డంకి.. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించారనుకోండి.
ఈ కాలంలో మరో సమస్య ఏంటంటే.. పిల్లలతో గానీ, పెద్దలతో గానీ ఆచితూచి మాట్లాడాలి. కొంచెం విమర్శను గానీ, మందలింపును గానీ తట్టుకోలేరు. పిల్లల ఫీలింగ్ ఎలా వున్నా వాళ్ల తల్లిదండ్రులు విలవిల లాడిపోతారు. దీనివలన పిల్లలు సూపర్ సెన్సిటివ్‌గా తయారవుతున్నారు. ఇది ఆందోళన కలిగిస్తోంది.
మా చిన్నతనంలో అయితే ఎవరైనా ఒక తప్పుచేస్తే ఇంట్లో అందరూ కలిసి దండించేవారు. అప్పటికి అది కష్టం కలిగించినా, అందరూ నావాళ్లే.. నా గురించి ఇంతమంది ఆలోచిస్తున్నారు అనే భావం వుండేది.
నా అనుభవంలో ఇప్పటి ఆడపిల్లలు, మగపిల్లలు కంటే చాలా చక్కగా మాట్లాడుతూ, వారి భావాలను బాగా చెప్పగలుగుతున్నారు అనిపిస్తుంది. కొంత ఎక్కువ కమ్యూనికేటివ్‌గా వున్నారనిపిస్తుంది.
తెలుగు చదువకపోవడం, రాయకపోవడం, తెలుగు పూర్తిగా అర్థం కాకపోవడం.. సామెతలు, జాతీయాలు ఉపయోగిస్తూ సజీవ తెలుగును మాట్లాడలేకపోవడం ఇలా మన భాష ప్రాధాన్యం తగ్గిపోవడం చాలా బాధాకరం!
ప్రశ్న 8. బాల్యానుభూతులను కథలుగా మలిచేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు?
జ: బాల్యానుభూతులను కథలుగా రాయాలంటే.. కథా కాలం ఎప్పటిదో, నాటి పరిస్థితుల గురించీ, ఆయా ప్రాంతాల గురించి పఠితలకు కొంత పరిచయం చెయ్యాలి. మనం చెప్పే విషయాలు అందరికీ నచ్చుతాయా.. లేదా అని పరిశీలించాలి. సమకాలీన రాజకీయ, సామాజిక పరిస్థితులలో మనం చెప్పబోయే విషయాలు ఇముడుతాయా.. లేదా అని పరీక్షించుకోవాలి.
మనం బంధువులు, స్నేహితుల తాలూకు అనుభవాలు రాసేటప్పుడు వాళ్లకు అయిష్టమేమీ లేదు కదా.. అని ధృవీకరించుకోవాలి.
తరువాత కొన్ని ఇళ్లలో మాట్లాడే విషయాలు, భావాలలో కొంత అభ్యంతరకరమైన వ్యక్తీకరణలు వుంటాయి. వాటన్నింటినీ వడబోయాలి. వాటికి సభ్యత అనే మేకప్ వేయాలి. అంతే.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. ఎవరైనా తమ బాల్య స్మృతులను కథలుగా రాసేయవచ్చు.
ప్రశ్న 9. ‘అమ్మణ్ని జిజ్ఞాస’ కథలో అమ్మణ్ని నాన్న గురించి చెబుతూ, “ఆయన తన ఇంట్లో తానే అతిథిగా ఉండటం ఎలాగో అప్పటికే ప్రాక్టీసు చేస్తున్నారేమో!” అని అన్నారు. పైకి వ్యంగ్యంగా తోచినా, ఈ వాక్యాలలో చాలా అంతరార్థం ఉందని అనిపిస్తుంది. మరింత వివరంగా చెప్తారా?
జ: మా నాన్నగారు మంచి భక్తులు. వేదాంత ధోరణి కలవారు. ఆదర్శ భావాలు వున్నవారు. అబద్ధాలు చెప్పవలసి వస్తుందని చిన్న వయసులోనే లాయరు వృత్తి మానేసి, వ్యవసాయం మీదనే ఆధారపడి జీవించారు. అంతటి ధర్మనిరతి ఆయనది. ఎంతో సమాజసేవ చేశారు. దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులుగా వుండేవారు. వేదాంతాధ్యయనంలో కాలం గడిపేవారు. దానిలో భాగంగానే “తన ఇంట్లో తానే అతిథిగా వుండాలి” అనే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఆ భావన మానసికంగా మాత్రమే వుండాలనీ, లౌకికంగా చేయవలసిన పనులన్నింటినీ తు.చ తప్పకుండా చేసి తీరాలనే అంశాన్ని ఆయన విస్మరించారు. అది మాకందరికీ బాధాకరంగా పరిణమించింది.
ఇంకోవైపు మా అమ్మ ఇంటి నిర్వహణలో, పిల్లలు పెంపకంలో సిద్ధహస్తురాలు. ఇంట్లో వుంటూనే, పొలంలో, కళ్లంలో ఏమి జరుగుతుందో తెలుసుకుని పరిస్థితులను సర్దుబాటు చేసేది. ఒక్కమాటలో చెప్పాలంటే మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉదాహరణకు 98 ఏళ్ల వయసులో ఆమె గతించే వరకూ రోజూ గళ్ల నుడికట్టు (పాత వాటినే జిరాక్స్ చేసి ఇచ్చేవాళ్లు మా తమ్ముళ్లు. నిన్న నింపిన పజిల్ అయినా ఈరోజు మరిచిపోతూ వుండేది), సుడోకు పజిల్స్ ను పూర్తి చేస్తుండేది.
మా అమ్మ పనులన్నింటినీ చక్కబెట్టేది కాబట్టి నాన్నగారు ఇంటి విషయాలను పెద్దగా పట్టించు కోనవసరం లేకుండా పోయింది. పొలం పనులు కొంచెం చూసుకుంటే చాలు!
కానీ, ఆయన ఈ సాధనేమో గానీ, నాన్నగారు మిమ్మల్ని పట్టించుకోవలసినంతగా పట్టించుకోవడం లేదనే బాధ, నిష్ఠూరం మా అందరికీ వుండేది. అందరం అమ్మ మీదనే ఆధారపడేవాళ్లం.
కానీ, మా నాన్నగారు చెప్పిన ‘నీ ఇంట్లో నీవే అతిథిగా వుండటం’ అన్నది పిల్లల పెళ్లిళ్లయ్యాక, వయసు మీద పడుతున్న వేళలో అందరూ ఆచరించాల్సిన అవసరం చాలా వుంది. ఇప్పుడు నేనూ, మా అక్కాచెల్లెళ్లు అదే బాటలోనే నడుస్తూన్నాము.
అడిగితే గానీ మన పిల్లలకైనా సలహాలు చెప్పకపోవడం, ఇంట్లో ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించకుండా మసులుకోవడం, అనవసరంగా మాట్లాడకపోవడం, మన మందుమాకుల కోసం, మన ఖర్చులు కోసం మనకంటూ కొంత డబ్బును దాచుకొని, పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం, ఏదైనా తినాలంటే అందరూ తిన్నారా లేదా..అని తెలుసుకొని తినడం, మన పనులు మనం చేసుకుంటూ, ఇంట్లోని పనుల్లో సాధ్యమైనంత సహాయపడటం.. అనవసరమైన ఆరాలు తీయకుండా మన పరిధిలో మనం ఒదిగి వుండటం.. ఇలా ఇంట్లో శాంతిని నెలకొల్పే సాధనం.. పైన చెప్పిన ‘నీ ఇంట్లో నువ్వు అతిథిగా వుండు’ అనే సాధన! ఇది పెద్ద వాళ్లకే కాకుండా చిన్నవయసు దంపతులకు కూడా కొంతవరకూ ఆచరణీయమే! అప్పుడే ఇంట్లో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. మనం అందరితో కలిసిమెలిసి వుండాలి కానీ, కొన్ని పరిమితులను మనకు మనమే విధించుకోవాలి.
మా నాన్నగారు చెప్పిన అనేక వేదాంత బోధలు మా అందరి జీవితాలలో అడుగడుగునా ఆసరా అయ్యాయి. ఇదైతే మరీ ఉపయోగంగా వుంది ఇప్పుడు.. ఈ వయసులో.
ప్రశ్న 10. ‘చందమామకి అన్నం ఎవరు పెడతారు’ కథలో ఇంటి మిద్దె మీద రాత్రిపూట కురిసిన వెన్నెల వర్ణన అద్భుతంగా ఉంది. పాఠకుల హృదయాలను ఆ వెన్నల స్పర్శ మృదువుగా తాకుతుంది. దాదాపు అరవై ఏళ్ళ నాటి జ్ఞాపకాన్ని మనసులో భద్రపరుచుకుని, ఇంత సజీవంగా అందించడం ఎలా సాధ్యమైంది మీకు?
జ: ‘చందమామకు అన్నం ఎవరు పెడతారు?’ అన్ని కథలో నేను వర్ణించిన వెన్నెల.. నేను చిన్నప్పటినుండి ప్రతీ వేసవి కాలంలో అనుభవించినదే! పగలంతా విపరీతమైన ఎండ.. వేడి.. మమ్మల్ని సాయంత్రం కోసం ఎదురు చూసేలా చేసేది. రాత్రిపూట ఏ చేల మీది నుంచి వీచేవో ఏమోగానీ, చల్లని గాలులు వీచేవి. గాలి లేకపోయినా చల్లగా వుండేది. అందరం పరుపులు, జంబుఖానాలు పరుచుకొని వరుసగా పడుకునే వాళ్లం.
అప్పట్లో ఆంధ్రప్రభలో నక్షత్రాలను, గ్రహాలను గురించి పరిచయం చేస్తూ ‘విశ్వదర్శనం’ అనే శీర్షిక వొచ్చేది. దాని సహాయంతో వృశ్చికరాశి, తులారాశి, ఆయా రాశులలో వున్న నక్షత్రాలను కూడా గుర్తించి మా వాళ్లకు చెప్పేదాన్ని. ఇంక రాత్రంతా వెన్నెలలో నానుతూ నిద్రపోవడమే! భాషకు అందని భావాలను అందిస్తూ ఊరించే వెన్నెలలో స్నానం చేస్తూ వుండి పోవడమే! అలాంటి అద్భుతమైన అనుభూతులను మరిచిపోవడం ఎవరికైనా సాధ్యమా? అలాగే నేనూ ఆ మధురానుభూతులను పదిలంగా మనసు పొరల్లో భద్రపరచుకున్నాను.
ఇక అమెరికాలో నేను చూసిన వెన్నెల రాత్రులు ఎంతో మహత్తరమైనవి. మంచు కురిసే రాత్రుల్లో, పైనుంచి కురుస్తున్న వెన్నెల.. మంచుకు మరింత ధవళ వర్ణాన్ని పులుముతుంది. వెన్నెల వల్ల మంచుకు తెల్లరంగు వొచ్చిందా.. మంచు వల్ల వెన్నెలకు ధవళత్వం వొచ్చిందా.. చెప్పడం కష్టం! ఆకాశం భూమిపైన మంచు తలంబ్రాలు పోస్తున్నట్లుగా వుంటుంది. ఉదయమంతా కురిసిన మంచు మేటలు వేసి, పాలసముద్రం పొంగి, మన ఇంటి దాకా వచ్చి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ ధవళవర్ణపు అందం మాటల్లో చెప్పలేను.
వెన్నెల రాత్రులు ఇంత ఆనందభరితంగా వుంటే.. ఇంక అమావాస్య రోజుల్లో అందం చెప్పతరమా? ఆకాశంలో ఎక్కడా సందు లేకుండా తారలు నిండిపోయి వుంటాయి. మాంత్రికుడి గుహలో చెల్లాచెదురుగా పడివున్న నవరత్నాల కుప్పల్లా వుంటాయి నక్షత్రాలు! నల్లని మఖమల్ గుడ్డ పైన అల్లిబిల్లిగా కుట్టిన తళుకులలా వుంటాయి తారలు! రాజస్థానీ సుందరి ఎవరో పొరబాటున మరిచిపోయి వదిలేసిన జలతారు కుట్టుపూల మేలి ముసుగులా వుంటుంది తారలతో నిండిన ఆకాశం!
మనకేసి కళ్లప్పగించి చూస్తున్నట్లుంటాయి నక్షత్రాలు. ఇప్పుడు ఆ తారలన్నీ ఎక్కడికి పోయాయో.. యేమో! ఆ మధ్య ఐదారేళ్ల కిందట మా వూరి వైపు కారులో వెళుతున్నప్పుడు.. మధ్యలో ఘాట్ సెక్షన్‌లో ఊళ్లూ, లైట్లూ లేని చోట మళ్లీ దర్శనమిచ్చాయి.. నా చిన్ననాడు తప్పిపోయిన నక్షత్రాలన్నీ. మా మనవలైతే ఆకాశంలో అన్ని నక్షత్రాలుంటాయని జీవితంలో మొదటిసారి చూశారు. ఇప్పుడు చూద్దామన్నా ఒక్క నక్షత్రమూ కనబడటం లేదు. ఎంతో బాధాకరం!.
ప్రశ్న11. “పని చేసి చేసి గరుకుగా మారిన పెద్దమ్మ చేతుల్లోనించి ఆప్యాయత, సానుభూతి, అనునయం, దయ, ప్రేమ, కరుణ వంటి ఎన్నో భావాలు పొంగులువారుతూ నా మనసు లోకి, నా శరీరంలోకి అలలు అలలుగా ఇంకిపోయిన అనుభూతి కలిగింది” అన్నారు ‘అమ్మణ్ని అసూయ’ కథలో. ఇంట్లో పెద్దల నుంచి పిల్లలు నేర్చుకునే పద్ధతిని గొప్పగా చెప్పారు. ఇలాంటివే మీరు మీ పిల్లలకి నేర్పాల్సి వచ్చినప్పుడు మీకు మీ పెద్దమ్మ గారు గుర్తొచ్చే ఉంటారు కదా? అలాంటి అనుభావాలు ఒకటి రెండు చెప్తారా?
జ: పెద్దమ్మ మాకు చూపిన ప్రేమకు సాటి మరేదీ వుండదేమో! అయినా ఆవిడ అడుగుజాడల్లో నడిచి, ఆమె చెప్పిన కథలు చాలా వరకూ గుర్తుపెట్టుకొని, మా మనవరాళ్లు, మనవలకు చెప్పాను నేను. చాలా తరచుగా నాకు గుర్తుకొస్తుంటుంది ఆవిడ.
2004లో అమెరికాలో ఏడాది పాటు వుండి, మా పెద్ద మనవరాలు మనోజ్ఞను పెంచే అవకాశం వొచ్చింది నాకు. అప్పుడు తనకు నాలుగేళ్లు. పొద్దున్నే లేవాలంటే తనకు రామాయణం కథ చెప్పాల్సిందే! స్నానాలవేళా అదే కథే.. భోజనాలప్పుడూ రామాయణమే! “పొద్దున్నే ఈ పాచి పురాణాలు ఏమిటత్తయ్యా?” అనేవారు మా అల్లుడు గారు. మేం ఆ మాటలు పట్టించుకుంటేనా?
రామాయణం కథను నాటకంగా అభినయించేవాళ్లం ఇద్దరం. అన్ని పాత్రలూ మా ఇద్దరివే! నేను రాముడైతే తాను సీత. నేను దశరథుడైతే తాను కైకేయి. చివరికి సీతారామ కల్యాణం కూడా అభినయించే వాళ్లం. సీత పాత్ర మాత్రం ఎప్పుడూ తనదే. సీతారామ కల్యాణం అప్పుడు సిగ్గుపడుతూ ఒక మెరిసే తాడును నా మెడలో వేసేది.
అశోకవనంలో సీతాదేవిలా ఏడుపు అభినయిస్తూ కూర్చునేది. ఆంజనేయుడికి(నాకు) చూడామణిగా తను ఆటకు ఉపయోగించే ప్లాస్టిక్ బిళ్ల లాంటి దానిని తలలో నించి తీసి నాకు ఇచ్చేది.
ఇలా రోజూ సీతారామ కల్యాణం చేసీ చేసీ మనోజ్ఞకు ఎవరినో ఒకరిని అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలనే కోరిక పెరిగిపోయింది. “అమ్మా.. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నిన్నా? నాన్ననా? అమ్మమ్మనా?” అని అడగడం మొదలుపెట్టింది.
మా అమ్మాయికి చిర్రెత్తుకొచ్చింది. “అమ్మా.. చాలించు తల్లీ రామాయణ ప్రవచనం! దీనికి లేనిపోని ఆలోచనలొస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలంట దానికి!” అని దండం పెట్టేసింది మా అమ్మాయి. దాంతో రామాయణానికి బదులుగా వేరే కథలు చెప్పడం మొదలుపెట్టాను.
అలానే అన్ని కథలనూ నాటకాలుగా చేసుకునేవాళ్లం. డైలాగులు నేను చెబుతూ వుంటే చిలకలా పలికేది. నేను చీమనైతే తాను చిలక. నేను వేటగాడినైతే తాను పావురం. ఇలా కథలన్నీ పాపకు రంగరించిపోశాను.
“మీరు చెప్పిన కథలన్నీ నాకు గుర్తున్నాయి అమ్మమ్మా..” అంటుంది మను.
తనకు డాన్సు నేర్పించాలని ఒకరోజు డాన్సు స్కూలుకు తీసికెళ్లాము. “కూచిపూడా.. భరతనాట్యమా.. ఏ డాన్సు నేర్చుకుంటావు పాపా?” అని అడిగింది ఆ డాన్స్ టీచర్.
“మా అమ్మమ్మ నేర్పించే డాన్సే నాకిష్టం మామ్” అని చెప్పింది మను. టీచర్ అయోమయంగా నావైపు చూసింది. నేను లోలోపలే నవ్వుకోలేక చచ్చాను. వాళ్లమ్మ చెప్పాక కూచిపూడిలో చేరింది.
ఆ తరువాత కాలంలో వాళ్లు హైదరాబాద్‌కు వొచ్చినప్పుడు, మా అక్కా వాళ్ల మనవరాళ్లు, పక్కింటి పిల్లలు ఏడెనిమిది మంది తయారయ్యేవారు. పిల్లలందరికీ అన్నాలు పెట్టీ, కథలు చెప్పి, వాళ్ల చేత వాటిని నాటకాలుగా వేయించేదాన్ని. పాటలు, పద్యాలు, నాట్యాలు, నాటకాలు, నవ్వులతో మారుమోగిపోయేది మా ఇల్లు.
తరువాత ఆ కథలన్నీ మా మనవళ్లకూ చెప్పి, అవన్నీ రాసి పెట్టాను. మా వాళ్లందరం కలిసి ఆ కథలను ‘పెద్దమ్మ చెప్పిన కథలు’ అనే పుస్తకంగా ప్రచురించాము.
మనవలు,మనవరాళ్ళతో రచయిత్రి
మా మనవల కోసం నా మంచాన్ని, గదినీ ప్లేస్కూలులా మార్చేశాను. నా మంచంపైన రకరకాల బొమ్మలు, పుస్తకాలు అన్నీ చక్కగా అమర్చి వుంచేదాన్ని. ఇవి చాలక పేపర్లలో, మ్యాగజైన్ లలో వొచ్చే రంగురంగుల బొమ్మలతో ఆల్బమ్స్ తయారు చేశాను. దేవుళ్ల ఫోటోలతో ఒక ఆల్బమ్ తయారు చేశాను. పిల్లలు ఆడుకున్నంతసేపు ఆడుకొని వెళ్లిపోయేవారు. ఇప్పుడు వాళ్లు టీనేజర్లు అయిపోయారు.
పద్యాలు, పాటలు, కథలూ ఇవేగాక తెలుగు నేర్పించాను. అమరం రెండు సర్గలు, స్తోత్రాలు, శ్లోకాలు నేర్పాను. ఇలా వాళ్ల బాల్యాన్ని రసరమ్యంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాను.. నా శక్తి మేరకు. మరి తమ స్మృతి పథంలో తాము ఎన్నింటిని నిక్షిప్తం చేసుకున్నారో వాళ్లే చెప్పాలి.
ప్రశ్న12. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. పైగా ఈ సంపుటిలోనివన్నీ మీ స్వీయ మధురానుభవాలే. అయినా మీ మనసుకు బాగా దగ్గరయిన ఓ కథని ఎంచుకోమంటే దేనిని ఎంచుకుంటారు? ఎందువలన?
జ. నేను రాసిన కథలన్నీ నా పిల్లల వంటివే. ప్రతి కథా ఎంతో శ్రమపడే రాస్తాను. ప్రతి కథ వెనుకా ఎంతో కృషి వుంటుంది. అయినా నాకు ప్రత్యేకంగా అనిపించే కథలు కొన్ని వుంటాయి. అలాంటిదే ‘అమ్మణ్ని నవనిధులు పెట్టె’ అన్న కథ! అలానే ‘ఆవుకు సీమంతం, గానసాధన’ వంటి కథలు నాకు చాలా నచ్చిన కథలు. అలాగే ‘చందమామకు అన్నం ఎవరు పెడతారు?’ అన్ని కథ కూడా చాలా ఇష్టమైనదే!
‘అమ్మణ్ని నవనిధుల పెట్టె’ కథలో ప్రత్యేకత ఏమిటంటే, మనం మంచి వనుకున్నవీ, మనకు నచ్చినవీ అన్ని వస్తువులను పోగుచేసి దాచుకోవాలనీ, వాటిని తాను చూసుకొని మురిసిపోయి, ఎదుటివారికి చూపి గొప్పలు పోవాలనే మనిషి యొక్క సహజ కాంక్ష కనిపిస్తుంది. అది చిన్నతనంలోనే అమ్మణ్నిలో వేళ్లూనుకున్నది. అది ఆథ్యాత్మిక దృష్టితో చూస్తే అభిలషణీయం కాకపోవొచ్చు కానీ, ముందు జీవితంలో గృహిణి కాబోయే అమ్మాయికి ఆ మాత్రం జాగ్రత్త అవసరమే! అబ్బాయిల కైనా అంతే! ఇది జీవితం పైన ఆశావహ దృక్పథాన్ని, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తుంది. పాలపిట్ట ఈక కోసం అమ్మణ్ని పడిన తపన, తీరని కోరిక జీవితాంతం ఎలా వెంటాడుతుందో చెబుతుంది.
‘ఆవుకు సీమంతం’ కథ.. సమాజంలోని ఒక వర్గంలోని ఆశ్చర్యంగా తోచే కొందరి విపరీత భక్తిని చూపుతుంది.
ఆ కాలంలో అది వింతే గానీ.. ఇప్పుడు పెంపుడు కుక్కలకు కూడా బర్త్ డేలు, సీమంతాలు, వాటి పిల్లలకు నామకరణాలు చేయడమే కాక, భోగిపళ్లు కూడా పోస్తున్నారు. భక్తి కీ, ప్రేమకు హద్దులు మనం నిర్ణయించలేము.
గాన సాధన, చందమామ కథలు పిల్లల్లోని అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
ప్రశ్న13. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ఏ కథైనా రాయడం రచయితకు అంత సులభమే మీ కాదు. ఒక్కొక్క కథకూ అన్ని హంగులూ సరిగ్గా అమర్చుకోవాలి. చెప్పదలచుకున్న ప్రతీ విషయాన్నీ సరిగ్గానే చెప్పామా..లేదా అని సరిచూసుకోవాలి. ప్రత్యేకంగా ఒక్క కథ కోసం ఇబ్బంది పడిందేమీ లేదు. ఎప్పుడు చదివినా.. ఇప్పుడైతే ఇంకా బాగా రాసేదాన్నేమోననిపిస్తూనే వుంటుంది.
ప్రశ్న14. ‘అమ్మణ్ని కథలు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ పుస్తకం గురించి ఎక్కువమందికి తెలిసేలా చేయడానికి ఏవైనా కొత్త ప్రయత్నాలు ఆలోచించారా?
జ: ఈ పుస్తకాన్ని మా తమ్ముడు, ‘గాయత్రీ పిక్సర్ కామ్’ ఓనరూ అయిన పాణ్యం నాగార్జున గారే ప్రింట్ చేశాడు కాబట్టి, ఆ బాధ్యతలూ, బరువులూ అన్నీ అతనే చూసుకున్నాడు. కాబట్టి ప్రత్యేక అనుభవాలేమీ లేవు. చాలావరకూ అందరికీ ఉచితంగానే పంచుతున్నాము కాబట్టి పెద్ద ప్రణాళికలూ ఏమీ వేసుకోలేదు.
ప్రశ్న15. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధమవుతున్నాయా?
జ: నేను నిజజీవితంలో ఎదురైన అనుభవాలను మాత్రమే, కొంత కల్పన జోడించి కథలుగా రాస్తాను. కాబట్టి మనసుకు హత్తుకునే సందర్భాలు ఏవైనా తారసపడితే కథలుగా రాసే అవకాశం వుంది. మా అత్తగారు నాకు చెప్పిన ఆమె గతానుభావాలు ఎన్నో వున్నాయి. అవి నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక సీరీస్ లాగా రాయాలనిపిస్తుంటుంది. పాత విషయాలను కొత్తగా చెప్పాలనిపిస్తుంటుంది. నాకు కాలం, నా ఆరోగ్యం సహకరిస్తే తప్పక రాస్తాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు నంద్యాల సుధామణి గారూ.
నంద్యాల సుధామణి: ధన్యవాదాలు.
***
రచన: నంద్యాల సుధామణి
పేజీలు: 196
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000413413
~
నంద్యాల సుధామణి,
ఫ్లాట్ నెం.1906, సి-బ్లాక్,
పిబిఎల్ సిటీ,
పీరంచెరువు, రాజేంద్రనగర్ (మండలం)
హైదరాబాద్. 500091
ఫోన్: 9440683750, 6302318191
~
ఆన్‌లైన్‌లో
https://www.telugubooks.in/products/ammanni-kathalu?
~
‘అమ్మణ్ని కథలు’ కథాసంపుటిని సమీక్ష
https://sanchika.com/ammanni-kathalu-book-review-kss/

