Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవయిత్రి, రచయిత్రి శ్రీమతి పసుమర్తి పద్మజ వాణి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘బతుకు రాదారిలో..’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి పసుమర్తి పద్మజ వాణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం పద్మజ వాణి గారూ.

పద్మజ వాణి: నమస్కారం.

~

ప్రశ్న 1: ‘బతుకు రాదారిలో..’ కథాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. తొమ్మిది కథలున్న ఈ సంపుటికి ఈ పేరుని శీర్షికగా పెట్టడంలో మీ ఆలోచన ఏమిటి?

జ: నా కథలకి వెన్నుముకగా నా వృత్తిజీవితం నిలబడుతుంది. ఏ కవి/రచయిత అయినా తనకు తెలిసిన, తాను అనుభవించిన, తన అవగాహనలోకి వచ్చిన ప్రపంచం గురించి మాత్రమే రాస్తాడు. అలాంటి రచనలే పాఠకుడి ఉద్వేగాలను పట్టుకోగలుగుతాయి. పొద్దున్నే లేచి ప్రతి వేకువనీ కిలోమీటర్ల లెక్కన కొలిచే కూలీజనం నా కథల్లో నాయికానాయకులు. తొమ్మిది కథల్లో మూడు కథలలో నేపథ్యం రహదారుల నిర్మాణమే కాబట్టి ఈ పుస్తకానికి ‘బతుకు రాదరిలో..’ అనే శీర్షిక సరిగ్గా సరిపోతుందని అనిపించింది.

ప్రశ్న 2: మీ కథారచన ప్రయాణం గురించి చెప్పండి.

జ: ఈ సంపుటిలో ‘ఎత్తుగుండెలు’ కథ 1981లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. 2009 ఏప్రిల్ ఆదివారం ఆంధ్రపభలో ‘ఆధునిక కథానికకు జయహో, జయహో’ శీర్షికన ప్రసిద్ధ విమర్శకులు శ్రీ విహారిగారు పై కథానికను ప్రస్తావించి ‘మొదటి కథలోనే వస్తు, శైలి, శిల్పాలను ముప్పేటగా అల్లార’ని ప్రశంసించారు. వారికి మీ ద్వారా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రశంసలు నేను కథలు రాయగలననే విశ్వాసాన్ని కలిగించినా పెద్దలు డా. ఆవంత్స సోమసుందర్, డా. అద్దేపల్లి రామమోహనరావు వంటివారు నన్ను కవిత్వం రాయమని ప్రోత్సహించారు. అందువల్ల అప్పుడప్పుడూ మాత్రమే అదీ పై ప్రశ్నలో చెప్పినట్లు నేను చూసిన జీవితంలోని సంఘటనలు రాయక తప్పని స్థితి కల్పించినపుడు కథలు రాశాను.

ప్రశ్న 3: మీ కథలకు ప్రథాన ప్రేరణ ఏమిటి?

జ: నేను కథ రాసినా, కవిత్వం రాసినా – నెత్తిమీద కాంక్రీట్ గమేళాలు మోస్తూ ఆడవాళ్ళు, రోడ్డు రోలర్ నడుపుతూ, ఛావెల్‌తో తారు చిప్సు సరిచేస్తూనో, పుళ్ళుపడ్డ చేతులతో తారుజల్లుతూ మగకూలీలు కళ్ళముందుకి వస్తారు. దేశం అభివృద్ధి నమూనా చూపించే క్రమంలో భూముల్ని కోల్పోయి, నిరాశ్రయంగా కుటుంబాలను వెంటబెట్టుకుని కన్నీళ్ళతో కదలి వెళ్ళిపోయే రైతు కుటుంబాలు కనిపిస్తాయి. రహదారుల నిర్మాణం కోసం ఎక్కడెక్కడి నించో గుంపులుగా వచ్చే బంటాలు, సరయిన వసతి, వైద్య సౌకర్యాలు, సెలవులు లేని స్థితి. స్వంత వూళ్ళో కోల్పోయిన ఆకుపచ్చని మడిచెక్కలు తలపుకి వచ్చినప్పుడు, సొంత ఊర్లలో ఉన్న తల్లిదండ్రులను, పిల్లలను తలచుకుని ఏడవడం కళ్ళారా చూడడం. ఇవన్నీ నన్ను అనుక్షణం బాధించేవి. వీటి చుట్టూనే నా కథలన్నీ తిరుగుతాయి.

బతుకు రాదారిలో.. పుస్తకావిష్కరణ

ప్రశ్న 4: ఇప్పటి తరం యువతలో పెళ్ళి, పిల్లలు పట్ల అంత సుముఖత వ్యక్తం కావటం లేదు. వీళ్ళకి ‘చేజారని స్వర్గం’ కథ ఏ మేరకు అర్థం అవుతుందని మీరు అనుకుంటున్నారు?

జ: దాదాపుగా 20 సంవత్సరాల క్రితం మన దేశానికి వచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఒక విధంగా యువతలో స్వేచ్ఛ అనే భావనకి పదునుపెట్టాయి. ఈ సంప్రదాయాలు వివాహ వ్యవస్థకు సంకెళ్ళు అనే ఆలోచన, క్రమంగా ఆడపిల్లలకి కూడా ఆర్థిక స్వేచ్ఛ ఇస్తోన్న ఈ ఉద్యోగాలు, ఆకర్షించే పబ్‌లు, వీకెండ్ విహారాలు – కొండొకచో డ్రగ్స్.. బాధ్యత అవసరం పడని సహజీవనాలు.. ఇంటికి దూరంగా ఉద్యోగాల మూలంగా అదుపు చెయ్యలేని తల్లితండ్రుల నిస్సహాయత.. ఇన్ని అవకాశాలు గంపగుత్తగా ఎదురుగా పెట్టుకుని యువతని అని ఏం లాభం? అయితే ‘చేజారని స్వర్గం..’ కథని ఈ సంకలనంలో చేర్చటానికి ముఖ్య కారణం.. ఆంగ్ల కవి, రచయిత టి.ఎస్. ఇలియట్ “కవి తన రచనల్లో తన కాలాన్ని లిఖించిపోతాడు” అని చెప్పినట్లు – కాలం ఎప్పడూ ఒకేలా వుండదు. చక్రంలా తిరుగుతున్నప్పుడు పైన ఉన్న ఇరుసు కిందకి వస్తుంది కదా. అలా జరిగినప్పుడు మళ్ళీ కళకళలాడుతూ ఎక్కువ మంది పిల్లలు.. సంప్రదాయంగా వివాహ వ్యవస్థ పునః ప్రతిష్ఠితమవుతాయి.

మాతృవందనం పురస్కారం అందుకుంటూ

ప్రశ్న 5: ‘ఒక ఆకుపచ్చదనం కోసం..’, ‘ఈ అమృతం చాలుతుందా’ – ఈ రెండు కథల్లోనూ కొన్ని పాత్రలు అనే పేర్లతో కల్పిస్తాయి, రెండింటి ఇతివృత్తాలూ రోడ్డు నిర్మాణమే. ఒక పెద్ద కథ రాసుకుని తర్వాత దానిని రెండు కథలుగా విభజించారా?

జ: ‘ఒక ఆకు పచ్చదనం కోసం’ కథ 2013 జనవరిలో రాశాను.. చినుకు మాస పత్రికకి పంపించాను. 2013 ఏప్రియల్ ఉగాది ప్రత్యేక సంచికలో ప్రచురితమయింది. రోడ్డు నిర్మాణమే కథకి ఆలంబన. కానీ అందులో చర్చకి వచ్చిన అంశాలు చాలా ప్రత్యేకమైనవి. ప్లయ్ యాష్, చేపల చెరువులు, సెల్ టవర్లు, రోడ్లు ధ్వసం చేసే దమ్ము ట్రాక్టర్లు, థర్మల్ పవర్ ప్లాంట్లు ఇలా..

చాలా తాజాగా 2025 అక్టోబరులో వండిన కథ ‘ఈ అమృతం చాలుతుందా’. ఈ కథకి జవసత్వాలు కూర్చినది మాత్రం అడవి దారి. అపూర్వ శాంతి సౌందర్యాలను అజస్రధారలుగా వర్షింప చేసే అడవులు క్రమంగా అంతరించిపోవటం గురించి ఎంతో ఆర్తితో ‘అరణ్యక’ నవలని బిభూతి భూషణ్ బందోపాధ్యాయ రాశారు. ఆ నవలని నా కథలో వాడుకుంటూ రాయాలనిపించింది.

ఇంక ఇంజనీరింగ్ స్టాఫ్ విషయానికి వస్తే వాళ్ళు ముగ్గురు టీమ్‌గా నాకు చాలా ఇష్టమైన కారక్టర్లు. ఎందుకంటే నా ఉద్యోగ జీవితంలో నాకలాంటి ఆసిస్టెంట్స్ దొరకలేదు.

లేడీ బాస్‌ని కిందవాళ్ళు అహంకారంతో అంగీకరించరు. పై వాళ్ళు మన వల్ల ఉపయోగం లేదని పంపించెయ్యాలని చూస్తారు.

ప్రశ్న 6: ‘ఎత్తు గుండెలు’ కధ రాసిన నాటికీ, మీ పదవీ విరమణ నాటికి (2007) రోడ్ల నిర్మాణంలో మీరు గమనించిన మార్పులు ఏమైనా ఉన్నాయా? అ మార్పులని ఇతివృత్తంగా చేసుకుని మరో కథ రాసే ఆలోచన ఏమైనా వుందా?

జ: 1981 లో నేను కథలో రాసినట్లే వుండేది రహదారి నిర్మాణం.

కానీ 2007లో నేను రిటైర్ అయ్యాను. నిజానికి 1990 దశకంలోనే జాతీయ రహదారి నిర్మాణం లోకి బాహుబలి లాంటి యంత్రాలు దిగుమతి అయిపోయాయి. పాతవాటికీ వీటికీ అసలు పోలికే లేదు.

ఊళ్ళకి దూరంగా ప్లాంట్లు పెట్టి అక్కడే కొండల్ని తొలిచి తెచ్చిన రాళ్ళని కావాల్సిన సైజుల్లో క్రష్ చేసి ఇచ్చే యంత్రాలు.. భారీగా నిలవచేసిన తారు డబ్బాలు, కొండలా తయారు చేసిన రాంప్ మీద మెటల్ వేసిన బిన్స్, కన్వేయర్ బెల్ట్ మీంచి, అగ్నిగోళంలా మండిపోయే హట్ మిక్స్‌ని రోడ్డుకి మోసుకుపోయే టిప్పర్లు.. కూలీలు.. వంటవాళ్ళు, వర్కర్లు ఉండడానికి తాత్కాలిక షెడ్లు.. ఒక ప్రపంచం అక్కడ వెలిసిందా అన్నట్లుండేవి. కానీ మనిషి మేధస్సు అడ్డదారులని వెతుకటంలో అగ్రగామిత్వం కూడా అక్కడే కన్పించేది. అత్యంత ఆధునిక యంత్రాల్ని వైర్లు పీకి పారేసి వాటిని పనిచేయనిచ్చేవారు కాదు..

ఇది ఒక్క ఇంజనీరింగ్ రంగానికే పట్టిన తెగులు కాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క ఎక్స్‌రే మిషిన్నీ పనిచెయ్యనివ్వరు. అందువల్లనే కదా వీధికో నాలుగు డయాగ్నాస్టిక్ సెంటర్లు పుట్టుకొచ్బాయ్ పుట్టగొడుగుల్లా.

ఆరుద్ర గారితో రచయిత్రి

ప్రశ్న 7: మిగిలిన కథల కన్నా ‘వల’ కథ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కథ వెనుక కథ ఏమైనా ఉందా?

జ: ఉద్యమాలు, హక్కుల కోసం పోరాటాలు అంటూ జనాన్ని ఉరకలెత్తించి రాత్రికి రాత్రి సూట్‌కేసులు అందగానే.. “ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మళ్ళీ సావకాశంగా మరోసారి చర్చలు కొనసాగుతాయి. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్ట్రయిక్ కాలాఫ్ చేస్తున్నాం” అని ప్రకటించి చేతులు దులుపుకుంటోన్న నాయకుల్ని చూశాక రాసిన చిన్న కథ ప్రత్యేకంగా వుందని ప్రశంసలు అందుకోవడం నాకు సంతోషం.

ఆవంత్స సోమ సుందర్ గారితో రచయిత్రి

ప్రశ్న 8: బహుశా రహదారి నిర్మాణం నేపథ్యంలో ఇన్ని అంశాలను కథలుగా మలచిన వారు మీరే కావచ్చు. పాఠకులకు ఒక కొత్త అంశం పట్ల ఇన్ని విషయాలను కథగా మలచి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు, అభినందనలు. ఇతర అంశాలపై రాసిన కథల నేపథ్యాన్ని వివరించండి.

జ: ‘చేజారని స్వర్గం’ ఒకప్పటి అధిక సంతానం వలన ఇబ్బందులు పడ్డ కుటుంబాల కథ. మా ఇంట్లో కూడా అయిదుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు మొత్తం ఎనిమిది మంది తోబుట్టువులం. కాబట్టి ఆ సాధక బాధకాలన్నీ మా తరానికి కొత్తకాదు.

సాయి అనే పిల్లాడు సామాజికంగా, ఆర్థికంగా అణగారిన కులవ్యవస్థలోనుంచి తన ఆవేదనాంతరంగాన్ని ఉద్యమంగా ఉరకలెత్తించినాగానీ నాలుగు డబ్బులు చేతిలో పడగానే, రంగుల లోకం వల వేసి అతడిని ఎలా లాగిందో చెప్పిన కథ ‘వల’.

‘సహజమే కానీ’ ఒక విధంగా నా స్నేహితురాలి కూతురు జీవితం.

ఇక నా కాలేజీ రోజుల్లో ‘యద్దనపూడి’గారి రచనల మత్తులో ఉన్నపుడు రాసిన కథ ‘కళ్ళలో పెళ్ళిపందిరి’. అప్పట్లో మా సోదరుడు ‘అదృష్ట దీపక్’ సినిమా పాటను ఈ కథకు టైటిల్‌గా పెట్టాను.

ప్రశ్న 9: మీ కథలు పత్రికలలో ప్రచురింపబడినపుడు పాఠకులు లేదా సాహితీవేత్తల నుండి పొందిన ప్రశంసల గురించి తెలియజేయండి.

జ: ఆలిండియా రేడియో, విశాఖపట్నంలో కథ చదివినపుడు అక్కడ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆశ్చర్యంగా “ఆర్ & బి ఇంజనీర్లు కవిత్వం కూడా రాస్తారా?” అని ఎంతో ప్రశంసించారు. పైన ప్రస్తావించిన ‘ఎత్తు గుండెలు’ రచయిత నేనని చెప్పినపుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు “..అవునా! నేను ఎవరో పురుష రచయిత స్త్రీ పేరుతో రాసి పంపారు అనుకున్నాను. నిజంగా ఫీల్డ్‌లో పనిచెయ్యకపోతే ఇలా రాయలేరు. ఐతే మీరు సైట్ వర్క్‌కి వెళతారా?” అని ఆశ్చర్యపోయారు. ‘ఒక ఆకుపచ్చదనం కోసం’ కథను చినుకు పత్రికకు పంపినపుడు సంపాదకులు శ్రీ రాజగోపాల్ ఫోన్ చేసి కథ ఎంతో బాగుందని ప్రశంసించి 2013 ఉగాది ప్రత్యేక సంచికలో ప్రచురించారు.

ప్రశ్న 10: పదవీవిరమణ అనంతరం మీరు పాల్గొంటున్న సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి.

జ: ప్రసిద్ధ వైద్యురాలు, రచయిత్రి డా. ఆలూరి విజయలక్ష్మి గారు స్థాపించిన ‘రోటరీ ఆశ్రయ’ బాగోగులలో గత ఆరు సంవత్సరాలుగా పాలుపంచుకుంటున్నాను. ఆలిండియా విమెన్స్ కాన్ఫరెన్స్ అనే డిల్లీ కేంద్రంగా పనిచేసే NGOకి కాకినాడ శాఖ ట్రెజరర్‌గా ఉన్నాను. సాహితీ స్రవంతి కాకినాడ ట్రెజరర్‌గా ఉన్నాను. ఈ సంస్థలు నిర్వహించే అనేక సాంఘిక, సేవ, సాహిత్య కార్యక్రమాలలో నా శక్తిమేరకు పనిచేస్తూ ఉంటాను.

స్థానికంగా మునిసిపల్ అధికారులతో మాట్లాడి మా చుట్టుపక్కల అంతా రోడ్లు వేయించాను, డ్రైయినేజ్‍లు ఏర్పాటు చేయించాను. మంత్రిగారితో మాట్లాడి ఎండోమెంట్స్ వారి స్థలంలో, రామాలయం కట్టించాను.

పోలీసు వారి ఫామిలీ కౌన్సిలింగ్ సెషన్స్‌లో ఒక కౌన్సిలర్‍గా వ్యవహరించి, ఎందరో దంపతులకు కౌన్సిలింగ్ చేసి విడిపోకుండా చూశాను.

ఆలిండియా విమెన్స్ కాన్ఫరెన్స్ అనే డిల్లీ కేంద్రం తరఫున కాకినాడ స్త్రీల కోసం సర్వైకల్ కాన్సర్ అవగాహన సదస్సులు నిర్వహించాము. ఈ సంస్థ చెన్నై శాఖలో ఒక సమావేశానికి హజరైనప్పుడు మేము చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పినప్పుడు ఒక మహిళ అప్పటికప్పుడు రెండు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఆ నిధులతో, కాకినాడలో ప్రభుత్వంవారి కంటే ముందుగా 70 మంది యువతులకు స్వర్వైకల్ కాన్సర్ నివారణ వాక్సిన్‌లు వేయించాం. జిల్లా కలెక్టర్ గారు మా చొరవని ఎంతగానో ప్రశంసించారు.

మా గవర్నమెంట్  పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థిగా హాస్టల్‌కి మంచాలు, సిమెంట్ బెంచెస్, మెయిన్ గేట్ లైటింగ్, జిమ్ సెట్స్, ONGC వారి CSR ఫండ్స్ నించి లక్షల రూపాయల సహయం ఏర్పాటు చేయగలిగాను.

 

ప్రశ్న 11: ఏడు పదులు దాటిన వయస్సులో ఇంత క్రియాశీలంగా పనిచేస్తూ సమాజోపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమాలలో పాల్గొన్నపుడు ఎదురైన అనుభవాలు ముఖ్యంగా వృద్ధుల సమస్యల వంటి నేపథ్యంలో మీరు కథలు రాయలేదా?

జ: ఆశ్రమంలో ఎవరి జీవితం విన్నా ఒక నవలకు సరిపడినంత సమాచారం దొరుకుతుంది. అందరూ చెప్పుకోరు. చెబితే సాంత్వనగా ఉంటుందని కొందరు తమ విషయాలు పంచుకుంటారు. వాటిని శ్రద్ధగా విని ఓదార్పుగా నాలుగు మాటలు కాస్త ధైర్యం చెబితే ఎంతో ఊరటపొందుతారు. యథాతథంగా కాకుండా ఆ సమస్యలను చర్చిస్తూ ఏమైనా రాయాలనే ప్రయత్నం చేస్తున్నాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు పసుమర్తి పద్మజ వాణి గారూ.

పసుమర్తి పద్మజ వాణి: ధన్యవాదాలు.

***

బతుకు రాదారిలో.. (కథలు)
రచన: పసుమర్తి పద్మజ వాణి
పేజీలు: 144
వెల: ₹ 150/-
ప్రతులకు:
విశాలాంధ్ర,
నవోదయ,
నవ చేతన,
నవ తెలంగాణ బుక్ హౌస్
~
రచయిత్రి ఫోన్: 8247499024

 

~
‘బతుకు రాదారిలో..’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/batuku-radarilo-book-review-msb/

Exit mobile version