[‘కలల ప్రపంచం’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి పినపాల కాశి విశాలాక్షి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం పినపాల కాశి విశాలాక్షి గారూ.
పినపాల కాశి విశాలాక్షి: నమస్కారమండీ.
~
మీ తొలి కథాసంపుటి ‘కలల ప్రపంచం’ వెలువరించినందుకు అభినందనలు. ఈ పుస్తకం ప్రచురణ నేపథ్యం వివరిస్తారా?
మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు?
జ: నిజం చెప్పాలి అంటే నేను 10వ తరగతి చదివేటప్పుడు రాసేదాన్ని. కానీ తరువాత మానేశాను. కారణం తెలీదు!
2007వ సంవత్సరంలో అనుకోకుండా దాదాపు 35 సంవత్సరాల తర్వాత, మొదటగా ఒకరోజు FB లో కవితలు చూసి కవితలు రాయటం మొదలుపెట్టాను. అవి నాకే నచ్చేవి కాదు.
కవి అయిన శిల్పా జగదీష్ గారి ప్రోత్సాహంతో, గురువు గారు అని నేను పిలిచే PN మూర్తి గారి ప్రోత్సాహంతో ముందడుగు వేశాను.
నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. నా కథలను అందరూ తిప్పి పంపినపుడు, FB లో చూసి నా కథలకు తన పత్రికలో స్థానం కల్పించడమే కాకుండా.. ప్రతి నెల నాకు రెండు పేజీలు కేటాయించారు. పత్రికలో నా కథలను చదివిన నలుగురు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అంటూ ఇంటికి వచ్చి వారి కలలను పంచుకున్నారు. ఇంత గుర్తింపును ఇచ్చిన వారు మహిళా విజయం మాస పత్రిక సంపాదకురాలు శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం గారు. ఆవిడకి సదా కృతజ్ఞురాలిని.
మీరు కవయిత్రి, రచయిత్రి, చిత్రకారిణి. వీటిలో ఏ ప్రక్రియపై మీకు మక్కువ ఎక్కువ?
జ: నాకు ఏ ప్రక్రియ ఇష్టం అంటే చెప్పటం కష్టమే.. నేను 7వ తరగతి నుండి డ్రాయింగ్, కుట్లు, అల్లికలు చేసేదాన్ని. పెళ్ళి తరువాత దాదాపు 30 సంవత్సరాలు సెంటర్ నడిపాను. అందులో దాదాపు 25 రకాలు నేర్పేదాన్ని. నేను మొదటగా FB లో నా ఆర్ట్స్ కోసమే పేజీని మొదలుపెట్టాను. ఇప్పటికీ నాకు ఆర్ట్స్& క్రాఫ్ట్స్ అంటే ప్రాణం. వాటికి తోడుగా రచనలు చేరాయి అని చెప్పొచ్చు.
ఒకటో రెండో తప్ప, ఈ పుస్తకంలోని కథలన్నీ కలలపైనే. స్వప్నాలపై కథలు వ్రాయాలని ఎందుకు అనిపించింది? మీ దృష్టిలో మానవ జీవితంలో కలలకున్న ప్రాముఖ్యత ఏమిటి?
జ: కలలు అందరం కంటాం. కానీ కొంతమంది మాత్రమే గుర్తుంచుకుంటారు. కలలు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. మరెన్నో సందేశాలు ఇస్తాయని నమ్ముతాను నేను.
కలల గురించి ఎన్నో నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. కలలో వచ్చే దృశ్యాలకు భయపడేవారు ఉన్నారు. నాకు కలలు కనడం ఇష్టం. కొన్ని కలలు నిజం అవుతాయి కూడా.
సృష్టిలో మనల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళే శక్తి ఒక్క కలలకే ఉంది. అలాంటి కలలు మన జీవితంలో ఒక భాగం. విశ్వంలో ఎన్నో ఉన్నాయి అన్నింటినీ రంగరించాలనే నా ప్రయత్నం. దానికి ఆధారం నా కలలు.
Ex: ఆకాశం, చంద్రుడు, ప్రకృతి, భూమి, సముద్రం, ఇలా అన్ని మనకి సందేశాలు ఇచ్చేవే.. మనం గమనించం అంతే.
“ఈ కథలు చదువుతుంటే ఇవి ‘మ్యాజిక్ రియలిజం (Magic Realism)’ ఉన్న కథలు అనిపిస్తుంది. ఈ రచయిత్రి conscious గా మ్యాజిక్ రియలిజం కథలు రాయడానికి ప్రయత్నించిందా? లేక వాటంతటే అవే రియలిజమ్ కథలుగా మారాయా? అన్న సందేహం కల్గింది నాకు” అని వ్యాఖ్యానించారు డా. అంపశయ్య నవీన్ గారు తమ ముందుమాటలో. దీనికి మీ స్పందన ఏమిటి?
జ: ఈ ప్రశ్నకు సమాధానం మీ ప్రశ్నలోనే ఉంది. అందరం రియలిజంలో మాజిక్ చేసేవాళ్ళమే. ఒక్కొక్కరి అనుభవం ఒక్కోరకంగా బయటికి వస్తుంది. నా ఆలోచనలకు రూపం ఈ మాజిక్ రియలిజం అని మాత్రం చెప్పగలను.
నిజానికి అంపశయ్య నవీన్ గారు ముందుమాట రాసేముందు ఫోన్ చేసి, “అమ్మా మీరు మానసికశాస్త్రం చదివారా..” అన్నారు. “లేదండి” అని సమాధానం ఇచ్చాను. దానికి ఆయన “అమ్మా మీరు ఇంగ్లీషు నావెల్స్ చదువుతారా!” అని అడిగారు.
“నాకు ఇంగ్లీష్ రాదండి” అన్నాను. నా కథలని ఇంగ్లీష్ రచయిత ‘సిగ్మండ్ ఫ్రాయిడ్’ రచనలతో పోల్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
“ఈ ‘కలల ప్రపంచం’లో రచయిత్రి ఒక పాత్ర. చదివే పాఠకుడు పాత్రే. ఈ కథాకథనంలో ఆ శిల్పముంది. ఆ అనుభూతి పాఠకుడు పొందేట్టు చేసే శిల్పం ప్రతి కథలో ఉంది.. ఇక పఠనీయశైలి ఈ కథలకున్న ప్రత్యేక గుణం.” అని తమ ముందుమాటలో పేర్కొన్నారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ సందర్భంగా, కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారో చెప్తారా?
జ: ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందుగా ఆయన నన్ను అడిగిన ప్రశ్న.. “అమ్మా మీరు ఏం చదువుకున్నారు..?” అని, ఆ ప్రశ్నకు నేను “అంతగా చదువుకోలేదు అండి” అని చెప్పాను. దానికి ఆయన “జీవితాన్ని బాగా చదివినట్టున్నారు” అంటూ మెచ్చుకున్నారు. నా పుస్తకానికి ముందు మాట రాసిన అంతటి గొప్ప వ్యక్తులు నన్ను మెచ్చుకోవడం నేను ఊహించలేదు.
నా ఉద్దేశం ప్రకారం కథకి వస్తువు, శిల్పం, శైలి మూడు ముఖ్యమే అండి.
“నేను చేసిన పరిశోధనలో కలలలో వచ్చే దృశ్యాలను క్రోడీకరించి, కొంతమంది అభిప్రాయాలను తీసుకుని ముందుకు సాగాను” అని మీ ముందుమాటలో వ్రాశారు. ఈ పుస్తకం కోసం ఎటువంటి పరిశోధన చేశారో పాఠకులకి వివరిస్తారా?
జ: నేను చేసిన పరిశోధన గురించి చెప్పాలి అంటే చాలా పెద్దది అనే చెప్పొచ్చు. ముందుగా మా నాయనమ్మ చిన్నప్పుడు చెప్పిన కథలు, వాటిని వివరించిన తీరు, ఇంకొకరు మా నాన్నగారు, నా కథలకు మొదటి శ్రోత అయిన మా అమ్మ, ఇంకొకరు సైకాలజీ చదివిన నా స్నేహితురాలు. మా ఇంట్లో ఉన్న మా బుజ్జి కుక్కపిల్లలు, సమాజం ఇలా చాలా మంది, చాలా అనుభవాలు అన్ని కలిసి నా పరిశోధనలో భాగం అయ్యాయి.
దాదాపు అన్ని కథలనీ ఫస్ట్ పర్సన్ నెరటివ్లో చెప్పడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఎందుకా పద్ధతిని ఎంచుకున్నారు?
జ: ప్రత్యేకత అని ఏమీలేదు. నేను కవిత రాసినా, కథ రాసినా అలా రాయడం వల్ల నాకు తేలికగా చెప్పొచ్చు అనిపిస్తుంది. నేను అనో నా అనో మొదలు పెట్టినప్పుడు నాలోని భావాలకు ప్రాణం పోసినట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఏమి లేదు అండి.
ఎక్కువ కథల్లోని కలలు సాయంత్రం పూట/మధ్యాహ్నం పూట నిద్రలో వచ్చినట్టు రాశారు. దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? వివరించండి.
జ: ప్రొద్దునపూట వచ్చినట్టు కూడా రాసాను అండి. సామాన్యంగా ఇంటిపట్టున ఉండేవారికి మధ్యాహ్నం నడుంవాల్చటం అలవాటు. అలా వాల్చినప్పుడు ఒక్కోసారి సాయంత్రం వరకు మెలుకువా రాదు. నాకైతే నా కల నన్ను లేవనివ్వదు. కారణాలు కలలు వెతుక్కోవు అని.
‘వెన్నెల పూలు’ కథ కవితాత్మకంగా, భావుకతతో సాగుతుంది. చక్కని పదబంధాలను వాడారు. ఈ కథలో మీలోని కవయిత్రి మీలోని రచయిత్రిని డామినేట్ చేశారని అనిపించింది. మీరేమంటారు?
జ: ‘వెన్నెల పూలు’ ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు నచ్చినవాళ్ళు ఉంటారు. వాళ్ళు కలవాలని, మాట్లాడుకోవాలనేమీ లేదు. మనం చూస్తున్నట్టు అవతలివారి తెలియకపోవచ్చు కూడా.. ఇది ఒక అనుభవం అని కూడా అనుకోవచ్చు.
నేను ముందుగా కవయిత్రిని తరువాతే రచయిత్రిని అండి. కాబట్టి ఇద్దరు ఒకరే అనుకోవచ్చు. దీన్ని తీసేయలేము.
‘భూశ్రూరాలు’ కథ పేరు విభిన్నంగా ఉంది. ‘పుట్ట’ని సంస్కృతంలో ‘భూశ్రవాః’ అని అంటారు. దాన్నే కాస్త మార్చి ఈ పేరు పెట్టారా? లేక వేరే అర్థమేదైనా ఉందా?
జ: వేరే అర్థం ఏమి లేదండి. పేరు ఏం పెట్టాలి అని ఆలోచించినప్పుడు పాముల గురించి కాబట్టి పేరు కూడా దానికి తగ్గట్టు ఉంటే బాగుంటుంది అనిపించి ‘భూశ్రవాః’ అనే పేరునే కాస్త మార్చి పెట్టాను.
“ఒక్కోసారి కల కూడా మనకి పాఠాలు చెబుతుంది. మనం దాన్ని పట్టించుకోం” అనుకుంటుంది ‘మిణుగురు పురుగు’ కథలోని ప్రధాన పాత్ర. ఈ కథ నేపథ్యం వివరిస్తారా?
జ: ఈ ప్రశ్నకి సమాధానం అనుభవాల్లోంచి వస్తుంది. దీన్ని సిక్త్ సెన్స్ అని కూడా అనుకోవచ్చు. మనం ఎంతో నమ్మిన వ్యక్తులు మనల్ని మోసం చెయ్యరు అని అనుకుంటూ వుంటాము. కానీ ఒక్కోసారి ఆ అభిప్రాయం తప్పవుతుంది. మనం ఆలోచించకపోయినా ఒక్కోసారి మన కలలో కొన్ని మనం ఊహించనివి వస్తాయి. వాటిని మనం ‘ఛ ఇలా వచ్చింది ఏమిటి..? అలా ఏం జరగదు’ అనుకుని పట్టించుకోము. కానీ అదే కలని కొంచం ఆలోచించి చూస్తే విషయం చూచాయగా తెలుస్తుంది. మిణుగురు పురుగు కూడా అలాగే జాగ్రత్త చెబుతుంది. పాత్ర ఆలోచనలో పడుతుంది. చివరికి బయపడానికి అవకాశం కోసం చూసి తప్పించుకుంది. ‘తెలిసినవాళ్ళు కూడా మోసం చేస్తారు జాగ్రత్త’. అదే ఈ కథ సారాంశం అండి.
నాదొక మాట.. ఎవరిని నమ్మొద్దు.. అందరిని నమ్మాలి.
‘శిల – శిల్పం’ కథలో ఓ చిత్రకారిణిగా మీ ముద్ర కనబడుతుంది. పసుపు రంగు మీద పడడం, చామంతి పూల వాన కురవడం వంటివి artistic expressions లా అనిపిస్తాయి. ఆలోచనలకి రంగులద్దాలని మీకెలా అనిపించింది?
జ: ‘శిల – శిల్పం’ కథలో పాత్రకి కష్టం విలువ తెలీదా, లేక తెలుసుకోవాలని లేదా, లేకపోతే అన్నితెలిసి పట్టించుకోకుండా తన లోకంలో తాను విహరిస్తోందా..!
ఒక ఆర్టిస్టుగా రంగులు మన మనస్తత్వాన్ని చూపుతాయి. ఎన్ని రంగులు కలిపినా చివరికి అన్ని కలిసి తెలుపురంగుని చూపుతాయి. పాత్ర ఎన్ని రంగుల లోకాల్లో తేలియాడినా చివరికి తానొక రాయిలా ప్రవర్తించాను అని తెలుసుకోవడమే నా ఆలోచనతో రంగులు అద్దాను అండి.
సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: నాకు ఇష్టమైన కథ ‘భూశ్రూరాలు’. నాకు ప్రకృతి అంటే ఇష్టం. పాములకి మనిషి యొక్క మానసిక స్థితికి, మనిషి వెన్నుపూసకి, మనిషి డి.ఎన్.ఏ.కి సంబంధం ఉంటుందని నా చిన్నప్పుడు ఒక బైరాగి చెప్పాడు. నాకు కలలో కూడా ఎక్కువగా పాములు జరగబోయే విషయాన్ని చూచాయగా ముందు జాగ్రత్త తెలుపుతాయి. అలా నేను చాలాసార్లు కొన్నింటిని తప్పించుకున్నాను. అందువలన నాకు పాములు అన్నా, దెయ్యాలు, ఆత్మలు అన్నా ఇంట్రెస్ట్.
ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: నేను రాసిన కథల్లో అన్నింటికంటే కష్టం అనిపించింది ‘శిల – శిల్పం’. ఈ కథ మనుషుల మానసిక ప్రవర్తనకు చాలదగ్గరగా ఉందని నమ్ముతాను. ఇంకా మెరుగ్గా రాసివుంటే బాగుంటుంది అని చాలాసార్లు నన్ను నేనే తిట్టుకున్నాను. ఎప్పటికైనా అలాంటి కథ ఇంకోటి ఇంకా మెరుగ్గా, మనస్తత్వాలను ప్రతిబింబించేలా రాస్తాను.
‘కలల ప్రపంచం’ పుస్తకం కవర్ పేజీ చాలా బావుంది. మీరు గీసారా? లేక వేరే చిత్రకారులతో గీయించారా? లేక ఎఐ తో డిజైన్ చేశారా?
జ: నా ‘కలల ప్రపంచం ‘ పుస్తకం కవర్ పేజీ నేను గీసిందే అండి. దానికి వాటర్ కలర్స్ వాడాను. దానికి మూలం గూగుల్లో వెదికినప్పుడు కనిపించిన ఒక చిత్రం.
‘కలల ప్రపంచం’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: నేను ఊహించని విధంగా పుస్తకాన్ని మా ఇద్దరు పిల్లలు కలిసి వేయించారు. నా కథలని ఎడిట్ చేసింది మా పెద్దమ్మాయి. అదే నా ప్రత్యేకమైన అనుభవం అండి. వేయాలి అని అనుకోవడానికి కారణం మాత్రం మహిళా విజయం మాస పత్రిక సంపాదకురాలు శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం గారు. మా తమ్ముళ్ళు, మరదళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అక్కలు, బావలు, స్నేహితులు అందరూ నన్ను ప్రోత్సహించటం వల్ల కూడా సాధ్యం అయింది.
ఇప్పటివరకు 90 పుస్తకాల వరకు అమ్ముడు అయ్యాయి. అందరికీ కలల ప్రపంచం నచ్చింది అని చెప్పారు. కొంతమంది కొత్తగా ఉంది అన్నారు. రచయితలకు ప్రశంసను మించిన బహుమతి ఉండదు కదండి.
సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?
జ: సాహిత్య రంగంలో భవిష్యత్తు గురించి నేను ఆలోచించలేదు. ప్రణాళికలు అనేవి కాకతాళీయకంగా జరిగిపోతూ ఉంటాయి. నేను రాయటమే ఒక కాకతాళీయకం. నేను సాహిత్యంలో ఇంత ప్రయాణం చేస్తున్నానని ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు.
కవితల పుస్తకం తేవాలనే యోచనలో ఉన్నాను. ఇంకా ఇంకో ‘కలల ప్రపంచం’లో ఆత్మల మీద రాయాలనే ప్రయత్నం చేస్తున్నాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు పినపాల కాశి విశాలాక్షి గారూ.
పినపాల కాశి విశాలాక్షి: ధన్యవాదాలు.
***
రచన: పినపాల కాశి విశాలాక్షి
ప్రచురణ: తపస్వీ మనోహరం పబ్లికేషన్స్
పేజీలు: xvi+98
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు
~
రచయిత్రి: 9908435805
~
‘కలల ప్రపంచం’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/kalala-prapancham-book-review-kss/
