[‘జన్మించడమే కవిత్వం’ అనే కవితాసంపుటి, ‘వష్టి’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి శైలజామిత్ర గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం శైలజామిత్ర గారూ.
శైలజామిత్ర: నమస్కారమండీ.
~
ప్రశ్న: ఇటీవల మీ పదవ కవితా సంపుటి ‘జన్మించడమే కవిత్వం‘ వెలువరించినందుకు అభినందనలు. కవయిత్రిగా, కథా నవలా రచయిత్రిగా, అనువాదకురాలిగా మీ రచనా ప్రస్థానం గురించి వివరించండి.?
జ: ముందుగా నా పదవ కవితా సంపుటి ‘జన్మించడమే కవిత్వం’ గురించి అభినందించినందుకు ధన్యవాదాలు.
అప్పటికే ఎన్నో కవితలు రాసి ఉండటంతో 1996లో ‘శంఖారావం’ అనే కవితా సంపుటితో నా ప్రచురణా ప్రస్థానానికి శ్రీకారం చుట్టాను. అనంతరం 1999లో ‘మనోనేత్రం’ వెలువడింది. ఈ సంపుటికి వచ్చిన ప్రోత్సాహం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. భారత్ భాషాభూషణ్, భోపాల్ వారు నాకు ‘సాహిత్యశ్రీ’ అనే బిరుదును అందించడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.
తర్వాత 2002లో ‘నిశ్శబ్దం’ కవితా సంపుటి వచ్చింది. నేను ఎం.ఏ. ఆంగ్లం చదువుతున్న సమయంలో పోతుకూచి సాంబశివరావు గారు ఒకసారి “నీ కవితలు ఆంగ్లంలో వస్తే మరింత విలువైనవిగా మారుతాయి” అన్నారు. ఆ మాట నాకు ప్రేరణగా మారి 2004లో ‘Silver Lines’ అనే ఆంగ్ల కవితా సంపుటిని తీసుకొచ్చాను. అయితే అవి నా తెలుగు కవితలకు అనువాదాలు కావు. నేను అప్పటికే ఆంగ్లంలో రాసిన కొన్ని కవితలకు మరికొన్ని జోడించి ఈ సంపుటిని రూపొందించాను. 2006లో ‘అంతర్మధన వేళ’ కవితా సంపుటి వెలువడింది. ఈ సంపుటికి శ్రీశ్రీ కవితా పురస్కారం లభించింది.
ఆ సమయంలోనే రావి రంగారావు గారు పంపిన మినీ కవితలు గ్రంథం నా చేతికి వచ్చింది. దాన్ని చదివినప్పుడు “మనమెందుకు ఇలాంటి కవితలు రాయకూడదు?” అనిపించింది. అలా సరదాగా కొన్ని మినీ కవితలు రాశాను. వాటికి ‘అగ్నిపూలు’ అనే పేరు పెట్టాను. 2011లో రావి రంగారావు గారు – మినీ కవితా పితామహులుగా పేరుగాంచిన వారు – వాటిని స్వీకరించి తమ సంస్థ ద్వారా ప్రచురించడం నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది.
అనంతరం స్త్రీలపై జరుగుతున్న హింస, మారణకాండ నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక కవిత రాద్దామనుకున్నాను. అది ఆవేశమో, ఆవేదనో తెలియదు కానీ నా నుంచి దాదాపు 45 పేజీల దీర్ఘకవిత వచ్చింది. దానికి ‘సృష్టికేతనం’ అనే పేరు పెట్టాను. స్త్రీలపై వచ్చిన తొలి దీర్ఘకవితల్లో ఇది ఒకటేమో అనిపించింది. కొందరు సాహితీ విజ్ఞులను కూడా సంప్రదించాను. వారు కూడా ఆ అభిప్రాయాన్ని సమర్థించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
ఆ తర్వాత కొంతకాలం కవిత్వానికి కావలసినంత రాసినా, నాలో ఒక రకమైన శూన్యత ఏర్పడింది. ఇక రాయలేనేమో అనిపించే స్థితి వచ్చింది. కానీ కొంతకాలానికి ఆ రాయలేని తనం నుంచే కవిత్వం మొదలైంది. అప్పుడు రాసిన కవితకే ‘జన్మించడమే కవిత్వం’ అనే పేరు పెట్టాను. నిజమే కదా—మనిషి జన్మే ఒక కవిత్వం అనిపించింది. ఇక కవిత్వం గురించి బయట వెదకడం ఎందుకు? అనే ఆలోచనతోనే ఈ సంపుటిని తీసుకొచ్చాను. నా వద్ద ఉన్న కొన్ని మినీ కవితలను పోగుచేసి, డాక్టర్ ఎన్. గోపి గారి ప్రోత్సాహంతో ‘నానీల సాక్షిగా’ అనే నానీల సంపుటిని కూడా వెలువరించాను. ఇది నా కవితా ప్రస్థానం.
కథా రచన
ఇంత కవిత్వం రాసిన నేను కథ ఎందుకు రాశాను? అని అనిపించవచ్చు. నిజానికి నేను కవిత్వంతోపాటే కథను కూడా ప్రారంభించాను. కాలేజీ రోజులలో రాసిన నా తొలి కవిత ‘సృష్టి సంకల్పం’ ఈనాడు పత్రికలో ప్రచురితమైంది. దాదాపు పదేళ్ల తర్వాత నా మరో కవిత ‘అవగాహన’ ఆంధ్రభూమి ప్రత్యేక కవితగా ప్రచురితమైంది. అప్పటివరకు నేను పంపిన అనేక కవితలను ఎవరో తీసి చూసారో ఏమో కానీ, ఆంధ్రభూమిలో ‘కోయిలా కోయిలా’ అనే శీర్షికతో వరుసగా పన్నెండు కవితలు ప్రచురితమయ్యాయి.
అలాగే నా తొలి కథ ‘ఆదర్శాల అంచుల్లో’ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. ఆశ్చర్యం ఏమిటంటే నా తొలి నవల ‘ఏ నావది ఏ తీరమో’ కూడా ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన ఉగాది నవలల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికై సీరియల్‌గా ప్రచురితమైంది. ఈ విధంగా నా రచనలను ఆదరించి, ప్రోత్సహించిన ఆంధ్రభూమి వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. నేను పంపిన రచనల్లో తిరిగి వచ్చినవి చాలా తక్కువ అని గర్వంగా చెప్పుకోగలను. ప్రతి ఒక్కరూ నా రచనలను ప్రోత్సహించారు, ప్రచురించారు. అలా నా కథా సంపుటులుగా ‘తరంగాలు’ (2005), ‘అడ్డా’ (2012), ‘ఆధునిక పంచతంత్ర కథలు’ (2022), ‘వష్టి’ (2023) వెలువడి పాఠకుల ఆదరణ పొందాయి.
‘ఏ నావది ఏ తీరమో’ ముగ్గురి ప్రేమకథ ఆధారంగా రాసిన నవల. దానికి మంచి స్పందన రావడంతో మరో నవల రాయాలనే ఉత్సాహం కలిగింది. అలా ‘ఆకుపచ్చని జాబిలి’ రచించాను. ఒక స్త్రీ జీవితాన్ని గురించి ఆలోచించే క్రమంలో పుట్టిన ఈ నవల విజయవాడ నుంచి వెలువడే ‘చిత్ర’ మాసపత్రికలో మధ్య పేజీల్లో నవలికగా ప్రచురితమైంది. చిన్నపిల్లల విషయంలో చిన్నప్పటి నుంచే నాలో కొన్ని ప్రశ్నలు ఉండేవి. పేద, ధనిక అనే తేడా తెలియని వయసులో—కొంతమందికి ఇళ్లు ఎందుకు ఉండవు? కొందరికి అమ్మానాన్న ఎందుకు ఉండరు? వాళ్లు ఎక్కడ నిద్రపోతారు? వాళ్లకు అన్నం ఎవరు పెడతారు? అనే ప్రశ్నలు నన్ను వెంటాడేవి. వాటికి నాకు అప్పట్లో సమాధానాలు దొరకలేదు. ఆ సందిగ్ధతల మధ్య తారాడే ఇద్దరు పిల్లల జీవితాలను ఆధారంగా చేసుకుని ఒక నవల రాశాను. అది తెలుగు పొయట్రీ. కామ్ అనే అంతర్జాల పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది.
అనువాద రచనలు
నేను సమయం ఎక్కువగా వెచ్చించి, కొంతవరకు నష్టపోయిన రంగం అనువాదం అని చెప్పాలి. ఇతర రచయితలు, కవుల రచనలు ఆంగ్లంలోకి రావాలనే తపనతో నేను అనువాదాలు చేశాను. నెలల తరబడి శ్రమించి కొన్ని గ్రంథాలను అనువదించాను. నేను చేసిన పదకొండు అనువాద గ్రంథాల్లో ఒకరిద్దరు మాత్రమే నాకు పారితోషికం ఇచ్చారు. మిగిలినవారు రుసుము చెల్లించకపోవడం నన్ను చాలా బాధించింది. ఏళ్ల తరబడి సాహిత్యంలో ఉన్నప్పటికీ నాకు పరిచయాలు ఎక్కువగా లేకపోవడంతో ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో, ఎవరిని అడిగితే సమస్య పరిష్కారమవుతుందో కూడా తెలియని పరిస్థితి. వేదన పడ్డాను కానీ ఏమీ చేయలేకపోయాను.
ఒక గ్రంథంలో అయితే అనువాదకురాలిగా నా పేరు కూడా వేయలేదు. దాని గురించి అడిగితే “ప్రింటింగ్ మిస్టేక్” అని చెప్పడం మరింత కృంగదీసింది. అంతేకాదు, వారు అనామకులు కాదు – ప్రముఖ కవివర్యులే. నేను అనువదించిన రెండు గ్రంథాల్లో నా పేరు లేకపోవడంతో వాటి పేర్లను కూడా ఇప్పుడు ప్రస్తావించలేకపోతున్నాను. ఇలాంటి అనుభవాలు నాలో సాహితీ సమాజం పట్ల కొంత విముఖతను, ఒక రకమైన దూరాన్ని పెంచాయి. బహుశా ఈ విషయాలను మరెక్కడా చెప్పుకోలేనేమో. అందుకే ఇక్కడైనా చెప్పుకుంటున్నాను.
సమీక్షలు, విమర్శలు, ఇతర రచనలు సమీక్షల విషయానికి వస్తే ముందుగా ‘నేటినిజం’ సంపాదకులు బైస దేవదాస్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. నాకు సమీక్ష అంటే ఏమిటో కూడా తెలియని రోజుల్లో, నా చేత కొన్ని సమీక్షలు చదివించి, కొన్ని గ్రంథాలు ఇచ్చి సమీక్షలు రాయించిన వారు ఆయనే. అలా దాదాపు 524 గ్రంథ సమీక్షలు ‘నేటినిజం’లోనే రాశాను. తర్వాత ఆంధ్రభూమి దినపత్రిక, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, పాలపిట్ట, నవతెలంగాణ, వార్త వంటి పత్రికలు కూడా నా చేత సమీక్షలు రాయించాయి. ఒక విధంగా ప్రస్తుతం నా నుంచి రాబోతున్న కవిత్వ విమర్శ వ్యాసాలు, కథా విమర్శ గ్రంథం రూపుదిద్దుకోవడానికి వీరందరి ప్రోత్సాహమే కారణం. అందుకే వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇవే కాక ‘ఉషోదయ వెలుగు’ పత్రికలో ‘మనిషి ప్రయాణం?’ అనే శీర్షికతో కొన్ని ఆధ్యాత్మిక వ్యాసాలు రాశాను. ‘నేను – నా మనసు’ అనే శీర్షికతో ‘భక్తి రంజని’ మాసపత్రికలో 22 వ్యాసాలు రాశాను. కొంతమంది సాహితీ ప్రముఖులతో చేసిన ఇంటర్వ్యూలు ‘వార్త’ దినపత్రికలో ప్రచురితమయ్యాయి. సమకాలీన సమస్యలను ఒక స్నేహితుడితో చెబుతున్నట్లుగా రాసిన దాదాపు 20 వ్యాసాలు ‘వింటున్నావా నేస్తం’ అనే శీర్షికతో మచిలీపట్నం నుంచి వెలువడే ‘భావ తరంగణి’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇన్ని రకాలుగా రాస్తూ, ఇన్ని ప్రక్రియలను దాటుకుంటూ వచ్చిన తర్వాత – నేను సాహిత్యం రాయడం కాదు, దాదాపుగా సాహిత్యమైపోయాననే అనిపిస్తుంది. అదే నా రచనా ప్రస్థానానికి అసలైన అర్థం.
ప్రశ్న: “ప్రసవవేదనల అనంతరమే కవన శిశువు జనియిస్తుందని అనటం పరిపాటి. కానీ, శైలజ ‘జన్మించడమే కవిత్వమ‘ని ఒక నవ్య భావనని ప్రతిపాదిస్తున్నది” అని వ్యాఖ్యానించారు డా. వోలేటి పార్వతీశం గారు తమ ముందుమాటలో. ఈ సంపుటికి ఈ పేరు పెట్టడం వెనుక మీ ఆలోచన ఏమిటి?
జ: నిజానికి ‘జన్మించడమే కవిత్వం’ అనే పేరు పెట్టే సమయానికి నా వద్ద మరో కవితా సంపుటికి సరిపడా కవితలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని గ్రంథరూపంలోకి తీసుకురావాలనుకున్నాను. కానీ ఉన్నట్లుండి నాలో ఒక ప్రశ్న మొదలైంది – నేనెందుకు రాస్తున్నాను? ఇంత రాయడం అవసరమా? అనే నిర్లిప్తత నన్ను ఆవరించింది. కొంతకాలం నా రైటింగ్ టేబుల్ దగ్గరకే వెళ్లలేదంటే అతిశయోక్తి కాదు. చాలాకాలం ఆ స్థితి నుంచి బయటపడలేకపోయాను. ఏ వస్తువూ దొరకనట్టుగా, ఏ భావమూ పలకనట్టుగా అనిపించింది. ఒక రకంగా నేను చాలా ఒంటరిగా అయిపోయాననే భావన కలిగింది.
అలాంటి సమయంలో ఉన్నట్లుండి నాకు ప్రసవ వేదన గుర్తుకొచ్చింది. ఒక శిశువుకు జన్మనివ్వడం ఎంతటి వేదనతో కూడుకున్న ప్రక్రియ! ఆ వేదనను భరించిన తర్వాతే ఒక జీవి ఈ లోకంలోకి క్షేమంగా వస్తుంది. అప్పుడు నాకు అనిపించింది – కవిత్వం కూడా అంతే కదా! ఒక కవిత పుట్టడానికి కూడా లోపల ఎన్నో సంఘర్షణలు, ఆలోచనలు, అనుభూతులు, వేదనలు, అన్వేషణలు జరుగుతాయి. చివరికి అవన్నీ ఒక రూపాన్ని సంతరించుకుని బయటకు వస్తాయి. అప్పుడు నాకు ఒక్కసారిగా అనిపించింది – “అసలు జన్మించడమే కదా కవిత్వం!”
మనిషి జన్మ ఒక అద్భుతమైన కవిత్వం. ఒక ఆలోచన జన్మించడం కవిత్వం. ఒక అనుభూతి జన్మించడం కవిత్వం. ఒక సంబంధం జన్మించడం కవిత్వం. చివరికి ఒక మనిషి తనలోని మనిషిని తాను కనుగొనడం కూడా కవిత్వమే అనిపించింది. ఆ ఆలోచన నుంచే ఈ సంపుటికి ‘జన్మించడమే కవిత్వం’ అనే పేరు పెట్టాను.
గ్రంథం పూర్తయ్యాక ముందుమాట ఎవరితో రాయించాలా అని ఆలోచిస్తున్న సమయంలో గౌరవనీయులు డాక్టర్ వోలేటి పార్వతీశం గారు గుర్తుకొచ్చారు. వారికి గ్రంథాన్ని ఇచ్చాను. కొంత సమయం తీసుకున్నా, వారు రాసిన ముందుమాటను చదివిన తర్వాత నాకు నిజంగా ఇంకేమీ అక్కర్లేదనిపించింది.
ప్రత్యేకంగా వారు “ప్రసవ వేదనల అనంతరమే కవన శిశువు జనియిస్తుందని అనడం పరిపాటి. కానీ శైలజ ‘జన్మించడమే కవిత్వం’ అనే నవ్య భావనను ప్రతిపాదిస్తున్నది” అని చెప్పడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
కవిగా ఇంతకాలం సాగించిన నా ప్రయాణానికి దొరికిన ఒక గొప్ప బహుమతిలా ఆ ముందుమాట నాకు అనిపించింది. నేను పెట్టుకున్న పేరుకు ఒక సాహితీవేత్త నుంచి ఇంతటి అర్థవంతమైన ఆమోదం లభించడం – నా ‘జన్మించడమే కవిత్వం’కు దొరికిన మరో జన్మగా భావిస్తాను.
ప్రశ్న: “సంవేదనా సంగమం నా కవిత్వానికి జీవం. ఒకానొకప్పుడు అనేక రకాల, అకాల, అశాంతి ముద్రలు నన్ను వెంబడించినప్పుడు, దానికి దొరకకుండా పారిపోయే క్రమంలో కవిత్వమై రూపాంతరం చెందాను” అని రాసుకున్నారు మీ ముందుమాటలో. ఈ మాటలని బట్టి మీ కవిత్వాన్ని ఆత్మాశ్రయ కవిత్వంగా పరిగణించవచ్చని భావించవచ్చా? లేక ఆత్మాశ్రయ, విషయ కవిత్వాల (సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్) మేళవింపుగా పరిగణించవచ్చా?
జ: ఖచ్చితంగా చెప్పాలంటే, నా కవిత్వం ఆత్మాశ్రయంతో ప్రారంభమైనప్పటికీ, క్రమంగా ఆత్మాశ్రయాన్ని దాటి సామాజిక సంవేదనతో మమేకమైంది. మొదట్లో నా వేదన నాది మాత్రమే అనుకునేదాన్ని. కానీ రాను రాను నేను ఎదుర్కొన్న సమస్యలు, సంఘర్షణలు, భావోద్వేగాలు నావి మాత్రమే కావని, సమాజంలో ఎంతోమంది అనుభవిస్తున్నవేనని తెలుసుకున్నాను. ఆ అవగాహనతో నా కవిత్వంలో కూడా మార్పు వచ్చింది. నా మొదటి కవితా సంపుటి ‘శంఖారావం’ను మహాకవి డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకునే అదృష్టం నాకు లభించింది. వారు నా కవిత్వాన్ని ఒకవైపు ఎంతో మెచ్చుకుంటూనే, చివర్లో ఒక మాట అన్నారు.
“చాలావరకు నీ కవిత్వం వేదనతో నిండి ఉంది. శైలజా! నీకు ఇంత చిన్న వయసులో ఇంత వేదన ఎందుకు? అవసరం లేదు. జీవితాన్ని మనం ఎలా చూస్తామో మనకు అలానే కనబడుతుంది. ఒక మాటను మనం ఎలా అర్థం చేసుకుంటామో, దాన్ని బట్టే మన బాట ఏర్పడుతుంది.” ఆ మాటలు నా హృదయంపై ఎంతో పనిచేశాయి. ఇప్పటికీ ఆ రోజును నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజుగా గుర్తుంచుకుంటాను.
నిజానికి చిన్నతనం నుంచీ నేను సమాజంలోనే ఉన్నప్పటికీ, ఒక రకంగా ఒంటరిగానే భావించేదాన్ని. మనుషుల మధ్య కపటపు మాటలు, ఒకరి ముందు మరొకరిని పొగిడి, వెనుక వారినే కించపరిచే మాటలు, లేని ప్రేమను ఉన్నట్లుగా చూపించడం, అన్నీ బాగున్నప్పటికీ ఇంకొకరు ఇంకా బాగున్నారని వారిపై నిందలు వేసుకుని ఆనందించడం, ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతని ఆస్తుల కోసం పోరాడటం – ఇలాంటి ఎన్నో విషయాలు చిన్నతనం నుంచే నా కళ్లముందు కనిపించాయి.
అందుకే ఇప్పటికీ పదిమంది ఉన్న చోట ఎక్కువసేపు ఉండలేను. ఎవరితోనూ మనస్ఫూర్తిగా స్నేహం చేయలేననే భావన నాలో ఉండేది. అదే సమయంలో ఎవరినీ పూర్తిగా నమ్మలేని ఒక అనుమానం కూడా ఉండేది. అయితే సినారె గారి మాటలు నాలో చాలా మార్పు తీసుకొచ్చాయి. వినడంలో మార్పు వచ్చింది. చూసే చూపులో మార్పు వచ్చింది. మనిషిని అర్థం చేసుకునే విధానంలో మార్పు వచ్చింది. మనిషి ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, అతని లోపల ఉండే మనిషి ఒక్కరేనని అనిపించడం మొదలైంది. దానికి ఒక అద్భుతమైన కొనసాగింపు పదేళ్ల తర్వాత జరిగింది.
2006లో నేను రచించిన ‘అంతర్మథన వేళ’ కవితా సంపుటిని కూడా సినారె గారే ఆవిష్కరించారు. ఆ రోజు ఆయన నన్ను ఉద్దేశించి ఇలా అన్నారు: “అప్పుడు వేదన నీదే అనుకున్నావు. ఇప్పుడు ఆ వేదన సమాజానిది కూడా అని గ్రహించావు. కవిత్వం నుంచి కవిత్వానికి వచ్చే మార్పే కవి ఎంత ఎదిగాడో తెలియజేస్తుంది. ఆ విధంగా కవిగా నువ్వు ఎదిగావు. సంతోషం.”
ఆ మాటలు విని నేను నిజంగా ఆశ్చర్యపోయాను.
పదేళ్ల క్రితం తాను చెప్పిన మాటను ఆయన ఇంతగా గుర్తుపెట్టుకున్నారా? పదేళ్ల తర్వాత అదే మాటకు కొనసాగింపుగా ఈ మాట ఎలా చెప్పగలిగారు? అనిపించింది. ఆయన పరిధి ఎంత విశాలమైనది! ఎందరో రచయితలు, కవులు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సందర్భాలు – అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని, అందులోనూ పదేళ్ల క్రితం చెప్పిన మాటను ఇంత స్పష్టంగా గుర్తుపెట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఆ రోజు నాకు మాటలు రాలేదు. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా బోధపడింది – గొప్పవారు ఊరికే గొప్పవారు అయిపోరు.
అందుకే నా కవిత్వాన్ని కేవలం ఆత్మాశ్రయ కవిత్వంగా నేను భావించను. నా కవిత్వం నా అంతరంగంలో మొదలై, సమాజాన్ని తాకుతూ, మళ్లీ నా అంతరంగాన్నే ప్రశ్నించుకునే ప్రయాణం. నా వేదనలోంచి పుట్టిన కవిత్వం, క్రమంగా సమాజపు వేదనను తనలోకి తీసుకుంది. నా అనుభవం నుంచి సామూహిక అనుభవానికి విస్తరించింది.
బహుశా అందుకే నా కవిత్వం నాకు ఒకే చోట నిలిచిపోయిన భావనగా కాకుండా, నిరంతరం ప్రవహించే నదీ ప్రయాణంలా అనిపిస్తుంది. ఆ నది ఎక్కడ పుట్టిందో నాకు తెలుసు. కానీ అది ఎక్కడెక్కడికి వెళ్లి, ఎన్ని ప్రవాహాలను తనలో కలుపుకుని, చివరికి ఏ సముద్రాన్ని చేరుతుందో మాత్రం ఆ ప్రయాణమే నిర్ణయిస్తుంది.
ప్రశ్న: మీ దృష్టిలో కవితకి సంబంధించి లయ, వస్తువు, భావ వ్యక్తీకరణలో ఏది ముఖ్యం? ఎందువలన?
జ: నా దృష్టిలో కవిత్వానికి సంబంధించి భావ వ్యక్తీకరణే అత్యంత ముఖ్యం. వస్తువు, లయ, భావం -మూడూ కవిత్వానికి అవసరమైనవే. కానీ ఒక కవితను ప్రత్యేకంగా నిలబెట్టేది, ఆ భావాన్ని కవి ఎంత సృజనాత్మకంగా, ఎంత నిజాయితీగా, ఎంత తనదైన స్వరంతో వ్యక్తీకరించాడన్నదే.
ఒకే వస్తువుపై కొన్ని వందల మంది కవులు రాయవచ్చు. కానీ అందరి కవిత్వం ఒకేలా ఉండదు. ఎందుకంటే వస్తువు ఒకటే అయినా, కవి చూసే చూపు వేరు; అనుభూతి వేరు; ఆ అనుభూతిని వ్యక్తీకరించే విధానం వేరు. అదే కవిత్వానికి ప్రత్యేకతను తీసుకొస్తుంది.
నా దృష్టిలో కవిత్వం అంటే కేవలం ఒక విషయాన్ని వర్ణించడం కాదు. ఆ విషయాన్ని కవి తన అంతరంగంలోకి తీసుకుని, తన అనుభూతిగా మార్చుకుని, మళ్లీ పాఠకుడి అనుభూతిగా మారేలా వ్యక్తీకరించగలగడం.
కొందరు ఒక పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తారు. మరికొందరు దాన్ని ఒక పోలికతో చెబుతారు. ఇంకొందరు తమ ఊహాశక్తిని జోడిస్తారు. ఇంకొందరు ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తారు. వీటన్నింటిలోనూ వస్తువు ఒకటే కావచ్చు. కానీ ఎవరు దాన్ని ఎలా అనుభవించారు? ఎలా చూశారు? ఎలా వ్యక్తీకరించారు? అన్నదే చివరికి ఆ కవితను గుర్తుండిపోయేలా చేస్తుంది.
నాకు అనిపించేది ఏమిటంటే, భావం లోతుగా ఉన్నప్పుడు, దానికి తగిన వ్యక్తీకరణ సహజంగానే వస్తుంది. ఆ వ్యక్తీకరణలో ఒక అంతర్గత లయ కూడా పుడుతుంది. అందుకే లయను కవితకు బయట నుంచి అమర్చిన అలంకారంగా నేను చూడను. భావానికి సరైన రూపం దొరికినప్పుడు, ఆ భావమే తన లయను వెతుక్కుంటుంది. కవిత్వంలో ఛందస్సు, లయ, పదాల అందం అన్నీ ముఖ్యమే. కానీ అవన్నీ కవిత్వానికి శరీరంలాంటివైతే, భావ వ్యక్తీకరణ దాని ప్రాణం అని నేను భావిస్తాను.
చివరికి పాఠకుడి మనసులో నిలిచిపోయేది కేవలం కవి ఏ వస్తువు గురించి రాశాడన్నది కాదు – ఆ వస్తువును అతను ఏ అనుభూతితో చూశాడు, ఆ అనుభూతిని ఏ భాషలో, ఏ స్వరంతో మనకు అందించాడు అన్నదే. అందుకే నా దృష్టిలో వస్తువు కవితకు ఆరంభం, భావం దానికి అంతరంగం, వ్యక్తీకరణ దాని అసలైన రూపం, లయ దానికి సహజమైన నడక. వీటన్నింటి సమన్వయమే మంచి కవిత్వం. అయితే వాటిలో ఒకదానిని ముందుగా ఎంచుకోవాల్సి వస్తే, నేను మాత్రం భావ వ్యక్తీకరణకే మొదటి స్థానం ఇస్తాను.
ప్రశ్న: మీ తొలి కవితా సంపుటి నాటికీ, ఈ కొత్త కవితా సంపుటి నాటికి కవయిత్రిగా మీలో ఏయే మార్పులు వచ్చాయని భావిస్తున్నారు?
జ: ఒక్క మాటలో చెప్పాలంటే – తొలి కవితా సంపుటి నాటి నేను వేరు, ఈరోజు నేను వేరు. నా తొలి కవితా సంపుటి వచ్చినప్పుడు నాలో ఒక రకమైన అమాయకత్వం ఉండేది. నేను రాసింది పుస్తకంగా రావడం, దానికి ప్రశంసలు రావడం, గుర్తింపు లభించడం – ఇవన్నీ నాకు అత్యంత ఆనందాన్ని కలిగించేవి. “నేనేదో సాధించాను” అనే భావన కూడా ఉండేది. కానీ ఈరోజు ఇన్ని కవితలు రాసి, ఇన్ని పుస్తకాలు వెలువరించిన తర్వాత కూడా నాలో “ఇంకా ఏదో లోపం ఉంది” అనే ఆవేదన ఉంది. “ఇంకా ఏమీ సాధించలేనా? ఇంకా రాయాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా?” అనే ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంటుంది.
బహుశా ఇదే జీవితం గురించి తెలుసుకోవడం అంటే. మనం ఎంత రాసినా, ఎంత సాధించినా, మనకు తెలియనిది ఇంకా ఎంతో ఉందని అర్థం చేసుకోవడం. ప్రారంభంలో రచయిత తన గురించి, తన అనుభూతుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. కొంతకాలం ప్రోత్సాహం కావాలనుకుంటాడు. మరికొంతకాలం గుర్తింపు కోరుకుంటాడు. కానీ ఆ దశలను దాటిన తర్వాత క్రమంగా సమాజం అర్థమవుతుంది.
ఏ కవి తన తొలి కవిత నుంచే సమాజోద్ధరణ గురించి ఆలోచిస్తాడని నేను అనుకోను. ముందుగా తనలోని భావాలను వ్యక్తీకరించాలనుకుంటాడు. తర్వాత తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం మొదలవుతుంది. ఆ తర్వాత సమాజానికి ఏది అవసరం? తన రచన వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? తాను రచయితగా ఎందుకు ఉండాలి? తన ఉనికి ఎంతవరకు అవసరం? అనే ప్రశ్నలు మొదలవుతాయి. నా విషయంలో కూడా ఇదే జరిగింది.
తొలినాళ్లలో “నేను రాస్తున్నాను” అనే ఆనందం ఉండేది. ఇప్పుడు “నేను ఎందుకు రాస్తున్నాను?” అనే ప్రశ్న ఎక్కువగా వెంటాడుతోంది. అప్పట్లో నా అనుభూతి ముఖ్యం. ఇప్పుడు ఆ అనుభూతి పాఠకుడిని ఎంతవరకు తాకుతుంది, సమాజంతో దానికి ఎలాంటి సంబంధం ఉంది అన్నది ముఖ్యం.
అందుకే ఈ రోజు నా రచనలో ఆనందం కంటే బాధ్యత ఎక్కువైంది; ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మపరిశీలన పెరిగింది; గుర్తింపు కోసం ఎదురుచూడడం కంటే రాయాల్సిన అవసరం ఏమిటన్నదే ముఖ్యమైంది. తొలి సంపుటి నాటి నేను కవిత్వాన్ని రాయాలనుకున్న కవయిత్రిని. ఈ రోజు నేను కవిత్వం నన్నెందుకు రాయిస్తోంది అన్నది తెలుసుకోవాలనుకునే కవయిత్రిని. బహుశా ఈ మార్పే నా కవితా ప్రయాణంలో నేను సాధించిన అసలైన ఎదుగుదల.
ప్రశ్న: ‘ఎంత కొత్త యుద్ధమైనా పాతదే‘ కవిత నేటి పరిస్థితుల పట్ల అమితమైన వేదనని అక్షరాలలో నింపుకుంది. ఈ కవితని ఎప్పుడు వ్రాశారు? ఈ కవిత ఇప్పటికీ ప్రాసంగిత కోల్పోకపోవడం పట్ల మీ స్పందన ఏమిటి?
జ: నా దృష్టిలో వేదనే కవిత్వానికి మూలకారణం. మనసుకైనా, మనిషికైనా దెబ్బ తగిలినప్పుడు ఆ అనుభవం ఒక సాంద్రతను సంతరించుకుంటుంది. ఆ సాంద్రతకు తగినట్టుగా భాష మారుతుంది. భాష పదును పెరుగుతుంది. ఆ పదును, ఆ వేదన, ఆ అనుభూతి చివరికి కవిత్వంగా మన ముందుకు వస్తాయి.
‘ఎంత యుద్ధమైనా పాతదే’ అనే కవితను రాసి చాలా కాలమైంది. కానీ ఈరోజు కూడా అది ప్రాసంగికంగా ఉండటం నాకు ఆనందం కలిగించే విషయం కాదు. ఒక కవిగా అది నన్ను మరింత కలచివేస్తుంది. ఎందుకంటే నేను రాసినప్పుడు ఏ వేదనను చూసి ఆ కవిత పుట్టిందో, అదే వేదన మరో రూపంలో ఇప్పటికీ మన చుట్టూ కనిపిస్తూనే ఉంది.
నేను యుద్ధాన్ని కేవలం కత్తులతో, తుపాకులతో జరిగేదిగానే చూడను. యుద్ధం అంటే మనిషి మరో మనిషిపై ఆధిపత్యం కోసం చేసే పోరాటం కూడా కావచ్చు. ఒకవైపు మన దేశాన్ని, మనల్ని, మన సరిహద్దులను రక్షించడానికి సైనికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతుంటారు. అది దేశం కోసం జరిగే యుద్ధం.
మరోవైపు మన సమాజంలో మనం ప్రతిరోజూ ఎన్నో చిన్న చిన్న యుద్ధాలు చేస్తూనే ఉన్నాం. భూమి కోసం, ఆస్తి కోసం, డబ్బు కోసం, ప్రేమ కోసం, అధికారం కోసం, గుర్తింపు కోసం, చివరికి ఆత్మీయత కోసం కూడా మనుషులు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు.
కొన్ని యుద్ధాలు మనుషుల జీవితాలను చిందరవందర చేస్తాయి. అయినా కాలం గడిచేకొద్దీ మనిషి వాటి నుంచి కోలుకుంటాడు. కానీ అత్యాశతో, స్వార్థంతో, ఆధిపత్య భావంతో మనిషికీ మనిషికీ మధ్య జరిగే యుద్ధాలకు మాత్రం అంతం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఆయుధాలు మారుతున్నాయి కానీ మనిషి స్వభావంలోని అత్యాశ మాత్రం మారడం లేదు. అందుకే ఈ కవిత రాసాను. ఈ కవిత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తన అర్థాన్ని కోల్పోకుండా ఉండటం ఒకవైపు కవిత్వానికి ఉన్న శక్తిని తెలియజేస్తే, మరోవైపు మన సమాజంలో మారాల్సినవి ఇంకా మారలేదనే బాధను కూడా గుర్తుచేస్తుంది.
కవి కోరుకునేది తన కవిత ఎప్పటికీ ప్రాసంగికంగా ఉండాలని కాదు. కవి రాసిన వేదనకు ఒకరోజు ముగింపు రావాలని. కానీ ఆ రోజు ఇంకా రాలేదనే బాధే ఈ కవిత ఇప్పటికీ నాతో మాట్లాడటానికి కారణం.
ప్రశ్న: “జీవితాన్ని జీవితంలా జీవించని జీవితానికి జీతంతోనే జీవితం” అన్న కవితా పాదాలు tongue twister లా అనిపించినా, చాలా లోతైన భావాన్ని ఇముడ్చుకున్నాయి. ‘ఎప్పటికప్పుడే..‘ కవిత నేపథ్యాన్ని వివరించండి.
జ: ‘ఎప్పటికప్పుడే’ అనే కవితకు ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. నిజానికి ఈ కవిత రాస్తున్నప్పుడు నా ముందున్నది ఒక వ్యక్తి కాదు – ఆధునిక మనిషి జీవన విధానం.
మనిషి ప్రతిరోజూ జీవిస్తున్నాడు. కానీ తాను అనుకున్నట్లుగా జీవిస్తున్నాడా? అనే ప్రశ్న నన్ను చాలాకాలంగా వెంటాడేది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక పని, ఒక బాధ్యత, ఒక లక్ష్యం, ఒక పరుగు – ఇలా మనిషి జీవితం నిరంతరం ఏదో ఒక దాని వెంట పరుగెడుతూనే ఉంది. కానీ ఆ పరుగులో తాను ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? తనకు నిజంగా ఏం కావాలి? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు.
అందుకే ఈ కవితను ‘ఎప్పటికప్పుడే’ అని ప్రారంభించాను. ఇప్పటికిప్పుడే, ఈ నిమిషం నుంచే, ఈ క్షణానికి ఒక ప్రత్యేకత ఉందని మనం గుర్తించాలి. ఎందుకంటే గడిచిపోయిన కాలం తిరిగి రాదు. రేపు మనకు మరో కొత్త ప్రయాణం. కానీ మనిషి మాత్రం నిన్నటి బాధలోనో, రేపటి భయంలోనో ఉండిపోయి, తన చేతిలో ఉన్న ఈ క్షణాన్ని జీవించడం మరిచిపోతున్నాడు. మనకు మన జీవితానికి సంబంధించిన ఎన్నో కారణాలు తెలిసినట్టే ఉంటాయి. అయినా ఏదో ఒక దశలో మనమే మనకు అర్థం కాని వ్యక్తులమైపోతాం. మనకు మనమే ఒక సమాధానం లేని ప్రశ్నగా, ఒక వివరణ లేని కలగా మిగిలిపోతాం. ఈ భావన నుంచే కవితలో ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు వచ్చాయి.
“రెండు ఉదయాల మధ్య ఉన్న విరామమే..” అన్న దగ్గర కూడా అదే ఆలోచన ఉంది. రెండు ఉదయాల మధ్య మనకు ఒక రోజు లభిస్తుంది. ఆ రోజును ఏం చేయాలో తెలియకపోతే, మన జీవితానికి మనమే ప్రశ్నార్థకంగా మారిపోతాం. కొన్ని సందర్భాల్లో మాత్రం మన జీవితం మనల్ని మనమే ఆశ్చర్యపరిచేలా చేస్తుంది – అందుకే ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం రెండూ వచ్చాయి.
మనిషికి కావలసినవి, అవసరమైనవి వేరు. కానీ మనం అవసరమైనదాన్ని వదిలేసి, అనవసరమైన దాని కోసం పరుగెడుతున్నాం. సంబంధం లేని వ్యక్తుల కోసం పాకులాడుతున్నాం. మనతో రాని వాటి కోసం వెంపర్లాడుతున్నాం. చివరికి కొట్లాట, పరుగులాట, వెంపర్లాటల మధ్య మనల్ని మనమే కోల్పోతున్నాం. ఈ కవితలో నాకు అత్యంత బాధ కలిగించిన ప్రశ్న ఇదే – “మనకేం కావాలో మనకే తెలియదు. మనకు ఏది అవసరమో అసలే తెలియదు.”
మనిషి రాత్రి నిద్రపోతున్నాడంటే అతను ప్రశాంతంగా ఉన్నాడని కాదు. కళ్ళు మూసుకున్నంత మాత్రాన మనసు కూడా నిశ్శబ్దంగా ఉండదు. బయట చీకటి ఉన్నా, లోపల వెలుగు ఉండకపోవచ్చు. శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా, మనసు మాత్రం వేల ప్రశ్నలతో పరుగెడుతూనే ఉండవచ్చు. అందుకే “కనిపించే శూన్యమే బతికున్న జీవితం” అనే భావన వచ్చింది.
అలాగే మనిషి సంబంధాలను కూడా కోల్పోతున్నాడు. పలకరించడం తెలియని ముఖానికి నవ్వు కూడా నటనగానే మిగులుతుంది. ప్రేమించడం తెలియని హృదయానికి సంగీతం కూడా ఒక ఆధునిక ఏడుపులా అనిపిస్తుంది. అంటే మనిషి తనలోని సహజమైన స్పందనలను కోల్పోతున్నాడనే బాధ ఇందులో ఉంది. చివర్లో వచ్చిన – “జీవితాన్ని జీవితంలా జీవించని జీవితానికిజీతంతోనే జీవితం!” అనే పాదాలు కూడా ఈ మొత్తం కవితకు కేంద్రబిందువులాంటివి.
మనిషి జీవితాన్ని జీవించకుండా, కేవలం ఉద్యోగం, జీతం, అవసరాలు, బాధ్యతలు, సంపాదనల చుట్టూ తిరుగుతూ ఉంటే – అది జీవితం కాదు కదా! జీతం జీవించడానికి ఒక సాధనం కావాలి కానీ, జీతమే జీవితంగా మారిపోకూడదు. ఈ వ్యత్యాసాన్నే ఆ పాదంలో చెప్పాలనుకున్నాను.
ఈ కవితను రాసేటప్పుడు నాకు ఒక వ్యక్తి మీద కోపం లేదు. ఒక వ్యవస్థ మీద మాత్రమే ఆగ్రహం లేదు. మనిషి తనను తాను కోల్పోతున్న విధానంపై ఒక ఆవేదన ఉంది. మనిషి తనకు తాను దూరమైపోతున్నాడన్న బాధ ఉంది. అందుకే ఈ కవితలో ఎక్కడ చూసినా ప్రశ్నలు, పరుగు, అయోమయం, నిశ్శబ్దం, ఆవేశం కనిపిస్తాయి. ఇవన్నీ బయట ప్రపంచంలో ఉన్నవే కాదు – మనిషి అంతరంగంలో జరుగుతున్న సంఘర్షణలు.
‘ఎప్పటికప్పుడే’ అనేది నాకు కేవలం ఒక కవిత కాదు. ప్రతి మనిషి తనను తాను ఒక్కసారి ఆపుకుని – “నేను నిజంగా జీవిస్తున్నానా? లేక కేవలం జీవితం అనే పేరుతో రోజులు గడుపుతున్నానా?” అని తనను తాను ప్రశ్నించుకోవాలనే ఒక ప్రయత్నం. అందుకే ఈ కవితకు ‘ఎప్పటికప్పుడే’ అనే పేరు పెట్టాను. ఎందుకంటే జీవితం ఎప్పుడో ఒకరోజు కాదు – ఎప్పటికప్పుడే మన చేతుల్లోంచి జారిపోతూనే ఉంటుంది. దాన్ని గుర్తించి జీవించడమే అసలైన జీవితం.
ప్రశ్న: సాధారణంగా రచయితలకు తామే రాసేవన్నీ నచ్చుతాయి. కానీ ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవిత ఏది? ఎందువల్ల?
జ: నిజమే. కవికి కవిత్వం అంటే కేవలం అక్షరాల సమాహారం కాదు. ప్రసవం తర్వాత తల్లి తన బిడ్డను చూసుకున్నట్లే, ఒక కవిత పుట్టిన తర్వాత కవి కూడా దాన్ని తన బిడ్డగానే భావిస్తాడు. కవితైనా, కథైనా, నవలైనా – అవి రచయిత మేధోపరంగా కన్న పిల్లలే. అందుకే తల్లికి తన పిల్లలందరూ ఎంత ప్రియమో, రచయితకు తాను సృష్టించిన ప్రతి రచన కూడా అంతే ప్రియంగా ఉంటుంది. అయితే ఈ సంపుటిలో నాకు ప్రత్యేకంగా ఇష్టమైన కవిత మాత్రం ‘బంధం’.
ఈ కవితను ఒక అమ్మాయిని పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే సమయంలో ఒక తల్లిగా నాకు కలిగిన అనుభూతితో రాశాను. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి తల్లి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుబంధంగా ఉంటుంది. ఆమె పెరుగుతున్న కొద్దీ ఆ అనుబంధం మరింత గాఢమవుతుంది. కానీ ఒకరోజు అదే కూతురిని పెళ్లి చేసి పంపించాల్సిన సమయం వస్తుంది. పంపాలని తల్లికి ఉండదు. వెళ్లాలని కూతురికి ఉండదు. అయినా వెళ్లక తప్పదు, పంపక తప్పదు. ఈ నిస్సహాయత నుంచే ‘బంధం’ పుట్టింది.
ఈ కవితలో నేను కేవలం ఒక తల్లి బాధను మాత్రమే చెప్పాలనుకోలేదు. పెళ్లి అనే ఒక సామాజిక సంప్రదాయం వెనుక దాగి ఉన్న తల్లీకూతుళ్ల భావోద్వేగ వియోగాన్ని పట్టుకోవాలనుకున్నాను.
“పంపించాలని నాకు లేదు
వెళ్లాలని తనకి లేదు..
కానీ తప్పదు తాను వెళ్లాలి..”
అనే నాలుగు పాదాల్లోనే ఆ మొత్తం పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఇద్దరికీ విడిపోవాలని లేదు. కానీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ విడిపోవడం తప్పనిసరి.
ఆ తర్వాత తల్లి – కూతుళ్లు భౌతికంగా దూరమైనా, వారి మధ్య సంభాషణలు ఆగవు. రాత్రిళ్లు
“అమ్మా! పిలిచావా?” అని కూతురు,
“ఏమ్మా! నిద్ర రావటం లేదా?”
అని తల్లి ఒకరినొకరు పలకరించుకోవడం – అది నిజానికి మాటలకంటే ఎక్కువైన బంధం. పెళ్లి చేసి పంపే ముందు కలిసి గడిపిన చిన్న చిన్న క్షణాలు కూడా ఆ తర్వాత జీవితాంతం జ్ఞాపకాలుగా మారిపోతాయి. అదే డాబా, అదే చందమామ, అదే వెన్నెల – కానీ కూతురు మాత్రం అక్కడ ఉండదు. అప్పుడే మనకు తెలుస్తుంది – మనతో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా అనిపించిన క్షణాలే, దూరమైన తర్వాత అత్యంత విలువైన జ్ఞాపకాలవుతాయని.
ఈ కవితలో నాకు ఎంతో ఇష్టమైన భావన ఒకటి ఉంది –
“నా రోజులన్నీ తన తలలో రోజాలై అలంకరింపబడ్డాయి
తన రోజులన్నీ నాకు జ్ఞాపకాలై అలరింపబడుతున్నాయి.”
కూతురి భవిష్యత్తు కోసం తల్లి తన వర్తమానాన్ని, తన ఆనందాన్ని కూడా అర్పించుకుంటుంది. కూతురు వెళ్లిపోయిన తర్వాత ఆమెతో గడిపిన రోజులే తల్లికి జీవించే జ్ఞాపకాలవుతాయి. స్టేషన్లో రైలు కోసం ఎదురుచూసే సమయంలో తల్లి గుండెచప్పుడు కూతురి వెంట వెళ్తుంది. కూతురు గమ్యం చేరేంత వరకు తల్లి మనసు ఆమెతోనే ప్రయాణిస్తుంది. శరీరాలు విడిపోయినా, బంధం మాత్రం విడిపోదు.
అందుకే చివర్లో –
“ఆడపిల్లంటే ‘ఆడ’ పిల్ల కాదని
అల్లంత దూరంలో ఉన్నా
గుండెకు అల్లుకునే బంధమని అచ్చంగా అమ్మకు ప్రతిరూపమని!” అని రాశాను.
ఆడపిల్లను ఒకరోజు ఎవరో ఒకరి ఇంటికి వెళ్లిపోయే వ్యక్తిగా మాత్రమే చూడకూడదు. ఆమె ఎంత దూరంలో ఉన్నా, తల్లి గుండెలకు అల్లుకున్న బంధమే. చాలా సందర్భాల్లో ఆడపిల్ల తన తల్లికి ప్రతిరూపంగా మారుతుంది. తల్లి తనను తాను ఆమెలో చూసుకుంటుంది. బహుశా అందుకే ఈ కవిత నాకు మిగతా కవితల కంటే కొంచెం ఎక్కువగా దగ్గరగా ఉంటుంది. ‘బంధం’లో నేను కవయిత్రిగా కంటే ఒక తల్లిగా ఎక్కువగా మాట్లాడాను. అందుకే ఈ కవిత నాకు నచ్చింది మాత్రమే కాదు – నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది.
ప్రశ్న: ఈ సంపుటిలో ఏదైనా కవిత రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే, ఎందుకని?
జ: కవిత రాయడం కష్టమనిపించడం అనేది నాకు సాధారణంగా ఉండదు. కొన్ని కవితలు చాలా త్వరగా కుదిరిపోతాయి. కొన్ని మాత్రం మనసులో, ఆలోచనల్లో చాలా రోజులు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు రాయాలనుకుంటాయో, అప్పుడు మాత్రమే కవితగా బయటకు వస్తాయి. కాబట్టి రాయడం కష్టం అనడం కంటే, కొన్ని కవితలు మనతో ఎక్కువకాలం ప్రయాణిస్తాయి అనడం నాకు సరైనదనిపిస్తుంది.
అయితే ఈ సంపుటిలో ఒక కవిత మాత్రం రాస్తున్నంతసేపూ నన్ను చాలా బాధించింది. రాస్తున్నప్పుడు కన్నీళ్లు కూడా వచ్చాయి. అది నా అత్యంత ఆప్తురాలు భారవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన తర్వాత రాసిన ‘నువ్వెలా అంత దూరం నడిచావు?’ అనే కవిత.
అంతకుముందు రోజు వరకూ ఆమె నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. ఎప్పటిలాగే మాట్లాడి వెళ్లిన మనిషి, తెల్లవారేసరికి ఇక లేరని తెలిసినప్పుడు ఆ వాస్తవాన్ని నమ్మలేకపోయాను. మరణవార్త కంటే కూడా “ఇంత దగ్గరగా ఉన్న మనిషి ఇంత దూరం వెళ్లిపోయేంత వరకు తనలో ఏం జరిగిందో నేను ఎందుకు గుర్తించలేకపోయాను?” అనే ప్రశ్న నన్ను లోపల నుంచి వేధించింది.
అక్కడి నుంచే ఈ కవిత మొదలైంది.
“దేనికి బాధపడాలి నేస్తం? దేనికి భయపడాలి?
దేనికోసం ఆరాటపడాలి? దేనికోసం వెంటపడాలి?”
అని ఆమెను ప్రశ్నిస్తూ రాశాను. నిజానికి అవి ఆమెను అడిగిన ప్రశ్నలు మాత్రమే కాదు – నన్ను నేను అడిగుకున్న ప్రశ్నలు కూడా. మనిషి జీవితంలో వేడి ఉంటుంది, వాన ఉంటుంది, చలి ఉంటుంది, గాలి ఉంటుంది. అలాగే సంతోషం, బాధ, కోపం, ఆవేశం, నిరాశ – అన్నీ ఉంటాయి. ఏదో ఒక భావనను మాత్రమే ఎంచుకుని మిగతావాటిని తప్పించుకుని జీవించడం సాధ్యం కాదు. అందుకే ఆమెతో నేను మాట్లాడుకున్నట్లుగా, జీవితం గురించి మనం ఎన్నిసార్లు చర్చించుకున్నామో గుర్తుచేసుకుంటూ ఈ కవిత రాశాను. మా మధ్య ఎన్నో మాటలు పంచుకున్నాం. ఎన్నో బాధలు చెప్పుకున్నాం. వివేకం, విచక్షణ, సంఘర్షణ, జీవితం – ఇలాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. అలాంటి మాటలన్నీ ఒక్కసారిగా అర్థరహితంగా మారిపోయినట్టనిపించింది.
అందుకే ఈ కవిత రాస్తున్నప్పుడు నా ముందున్నది కేవలం ఒక స్నేహితురాలి మరణం కాదు. సన్నిహితంగా ఉన్న మనిషి మనసులోని అంతరంగాన్ని మనం ఎంతవరకు తెలుసుకోగలం? అనే ఒక పెద్ద ప్రశ్న.
చివర్లో – “నాది సాహిత్యం! నీది సాన్నిహిత్యం! నాకు తెలిసీ రెండింటికీ అర్థాలు ఒకటే!” అని రాశాను. ఆమెతో నాకు ఉన్న సాన్నిహిత్యం, నా రచనతో నాకు ఉన్న అనుబంధం. రెండూ నా జీవితంలో అంతర్భాగాలే. అలాంటి మనిషి తన చివరి ప్రయాణాన్ని నా మాటలకైనా తోడు లేకుండా ఎలా మొదలుపెట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.
అందుకే కవిత చివరి ప్రశ్న –
“నేను లేకుండా పది అడుగులు నడవలేను అనే దానివి
అలాంటిది.. నా మాటైనా తోడు లేకుండా ఒంటరిగానువ్వెలా అంత దూరం నడిచావు?
నాకెందుకు జీవితకాలానికి సరిపడా శిక్షను వేసావు?”
ఇది కేవలం ఒక స్నేహితురాలిని కోల్పోయిన బాధ కాదు. ఆమెను కాపాడలేకపోయాననే ఒక స్నేహితురాలి అపరాధభావం, నిస్సహాయత, ఆవేదన. అందుకే ఈ కవిత నాకు రాయడం కష్టం కాలేదు. రాస్తున్నంతసేపూ దాన్ని తట్టుకోవడం కష్టం అయింది. కొన్ని కవితలు మనం రాస్తాం. కానీ కొన్ని కవితలు మన చేత రాయించుకుంటాయి. ‘నువ్వెలా అంత దూరం నడిచావు?’ అలాంటి కవితే.
ప్రశ్న: కవితల చివరన అవి ప్రచురితమైన పత్రిక పేరు, తేదీల వివరాలు లేవు. ఎందుకని ఇవ్వలేదు? అవి ఉండి ఉంటే పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేది కద?
జ: నిజమే. మీరు చెప్పింది వాస్తవమే. కవితల చివర అవి ఏ పత్రికలో, ఏ తేదీన ప్రచురితమయ్యాయో వివరాలు ఉంటే, ముఖ్యంగా పరిశోధకులకు, సాహిత్య విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉండేది. అది లేకపోవడం ఒక లోటుగానే నేను భావిస్తున్నాను. అయితే అందుకు కొన్ని అనివార్యమైన కారణాలు ఉన్నాయి.
2017 నుంచి 2024 వరకు నేను రాసిన కవితలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కథలు, విమర్శలు, సమీక్షలు, దీర్ఘకవిత వంటి అనేక ప్రక్రియల్లో కూడా రచనలు చేయడంతో, ఏ కవిత ఏ పత్రికలో ప్రచురితమైందో చాలావరకు గుర్తుంది. కానీ ఖచ్చితమైన తేదీలను మాత్రం ఇప్పుడు చెప్పడం కష్టమైంది. ఎంత వెదికినా ఆ కాలం నాటి పత్రికలు, కటింగులు, క్లిప్పింగులు అన్నీ దొరకలేదు. కొన్ని మాత్రమే నా వద్ద ఉన్నాయి.
అప్పటికే నా వద్ద ప్రచురణకు సిద్ధంగా ఉన్న 142 కవితలు ఉన్నాయి. నేను సాధారణంగా నా రచనలు ప్రచురితమైన వెంటనే వాటిని ఒక ఫోల్డర్లో భద్రపరుచుకునే అలవాటు ఉంది. కానీ అనుకోకుండా నా కంప్యూటర్ మదర్‌బోర్డు పాడైపోవడంతో అందులో ఉన్న డేటా మొత్తం దెబ్బతింది. చాలా ఫైల్స్ మిస్ అయ్యాయి. ఎన్నో రచనలు కూడా కనుమరుగయ్యాయి.
ఆ డేటాను తిరిగి పొందే అవకాశం ఉన్నప్పటికీ, అందుకు అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉండటంతో ఆ ప్రయత్నం చేయలేకపోయాను. దాంతో నా వద్ద మిగిలి ఉన్న కవితలు, దొరికిన పత్రికా క్లిప్పింగులు, పాత ప్రతులను ఆధారంగా చేసుకుని ఈ సంపుటిని తీసుకురావాల్సి వచ్చింది.
అయితే ఇందులో నాకు ఒక సంతృప్తి ఉంది. ఈ సంపుటిలోకి తీసుకున్న కవితలన్నీ ఏదో ఒక సందర్భంలో ప్రచురితమైనవే. ప్రచురణ పొందని కవితలను యథేచ్ఛగా చేర్చలేదు. అందుబాటులో ఉన్న వాటిని జాగ్రత్తగా ఏరి, ఒక సంపుటిగా తీసుకొచ్చాను.
భవిష్యత్తులో నా రచనలను మరింత పద్ధతిగా భద్రపరచాలని ఈ అనుభవం నాకు నేర్పింది. పరిశోధకులకు ఉపయోగపడే విధంగా రచనల ప్రచురణ వివరాలు, తేదీలు, పత్రికల పేర్లు వంటి సమాచారాన్ని కూడా సాధ్యమైనంతవరకు భద్రపరచడం అవసరమని ఇప్పుడు మరింతగా అనిపిస్తోంది. కొన్ని రచనలు మనం పోగొట్టుకున్నా, వాటి జ్ఞాపకాలను మాత్రం పోగొట్టుకోలేం. దొరికిన కవితలతో ఈ సంపుటి వచ్చింది; పోయిన కవితల జ్ఞాపకాలు మాత్రం నాలో అలాగే ఉన్నాయి.
♣
ప్రశ్న: మీ నాల్గవ కథా సంపుటికి శీర్షికగా 12వ కథ ‘వష్టి‘ పేరునే ఎంచుకోడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఇందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: అవును. అందుకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నాలో నాకు ఎప్పటినుంచో ఉన్న ఒక విచిత్రమైన అలవాటు ఏమిటంటే – నాకు మంచి పేరు, మంచి పదం, మంచి శీర్షిక ఎక్కడ కనిపించినా, ఎక్కడ వినిపించినా వెంటనే దాన్ని దాచుకుంటాను. ఎప్పుడో ఒక కథకు, కవితకు, పుస్తకానికి ఉపయోగపడుతుందేమోనని ఒకచోట రాసి పెట్టుకుంటాను.
నిజానికి నా రచనా ప్రక్రియలో శీర్షికకు చాలా ప్రాధాన్యం ఉంది. నాకు నచ్చిన శీర్షిక దొరకకపోతే కొన్నిసార్లు కథ కూడా మొదలవదు. అంటే ముందుగా శీర్షిక నాలోకి వస్తుంది; ఆ శీర్షిక చుట్టూ కథ రూపం తీసుకుంటుంది. ‘వష్టి’ విషయంలో కూడా అదే జరిగింది. ఒకరోజు పాత ‘హెరాల్డ్’ పత్రికలో ఒక చిన్న క్లిప్పింగ్ నా కంటపడింది. అందులో ఒక రాణి గురించి ఉంది. ఆమె పేరు వష్టి అని, దాదాపు డెబ్బై సంవత్సరాలు జీవించి, చివరికి ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకుందని చదివాను.
ఆ వార్త చదివిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. మన దేశం కాని వారు, మన సంస్కృతికి చెందని వారు మనలాగే ఆలోచిస్తారా? వారికి కూడా మనలాగే బాధ, ఆవేదన, ఒంటరితనం, ప్రేమ, అనుబంధం ఉంటాయా? అనే ప్రశ్న నాకు చాలాకాలంగా ఉండేది. ఆ చిన్న సంఘటన ఆ ప్రశ్నకు ఒక సమాధానం ఇచ్చినట్టనిపించింది. భాషలు వేరైనా, దేశాలు వేరైనా, సంస్కృతులు వేరైనా – మనిషి మనసు మాత్రం ఒక్కటే. మనిషికి కలిగే ఒంటరితనం, ప్రేమ, బాధ, ఆవేదనలకు సరిహద్దులు ఉండవు అనిపించింది. అయితే ఆ కథలోని సంఘటన కంటే ముందుగా నా దృష్టిని ఆకర్షించింది ఆ పేరు – ‘వష్టి’. వెంటనే ఆ పదానికి అర్థం ఏమిటో వెతికాను. అందమైన స్త్రీ అనే అర్థం తెలిసింది. ఆ పేరు నన్ను మరింత ఆకర్షించింది. ఇక ఆ పేరుతోనే ఒక కథ రాయాలనిపించింది. అలా ‘వష్టి’ కథ పుట్టింది.
ఆ కథ పూర్తయిన తర్వాత అదే పేరు కథా సంపుటికి కూడా సరిపోతుందని అనిపించింది. ఒకవైపు అది నా పన్నెండవ కథ పేరు. మరోవైపు వష్టి అనే పేరులోనే ఒక స్త్రీ జీవితం, ఆమె అందం, ఒంటరితనం, అంతరంగ సంఘర్షణ వంటి అనేక భావాలు నాకు కనిపించాయి. అందుకే నా నాల్గవ కథా సంపుటికి కూడా ‘వష్టి’ అనే పేరునే ఎంచుకున్నాను.
నాకు శీర్షిక అనేది కేవలం పుస్తకానికి పెట్టే పేరు కాదు. అది మొత్తం రచనకు తలుపు లాంటిది. ఆ తలుపు తెరిచిన తర్వాతే కథలోకి ప్రవేశిస్తాను. ‘వష్టి’ కూడా అలాంటి ఒక శీర్షికే. ఒక పాత పత్రికలో కనిపించిన చిన్న పేరు, చివరికి ఒక కథగా, ఆ కథ చివరికి ఒక కథా సంపుటి పేరుగా మారడం నాకు చాలా ఆసక్తికరమైన అనుభవం.
ప్రశ్న: “ఈ రచయిత్రి కొన్ని కథలకు పెట్టిన శీర్షికలు చాలా వైవిధ్యభరితంగా ఉండడంతో పాటు ఉత్కంఠ కలిగించేవిలా ఉన్నాయి. కథలోకి లాక్కుపోయే శీర్షికలు ఇవి. ఈ రచయిత్రి, మంచి కవయిత్రి కనుక ఇంత చక్కని శీర్షికలకు అవకాశం కలిగిందేమో అనిపించక మానదు” అని వ్యాఖ్యానించారు శ్రీ సలీం గారు తమ ముందుమాటలో. ఈ కథలకి శీర్షికలు పెట్టడంలో మీలోని కవయిత్రి పాత్ర ఏమిటి? ఇతివృత్తాన్ని బట్టి పేరు నిర్ణయించుకున్నారా?లేక అరుదుగా, పేరు తట్టి, దానికి కథ అల్లుకున్న సందర్బాలేవైనా ఉన్నాయా?
జ: ఈ ప్రశ్నకు సమాధానం కొంతవరకు నేను ఇంతకుముందు చెప్పిన మాటల్లోనే ఉంది. నా రచనల్లో శీర్షికకు నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను. అది కవిత అయినా, కథ అయినా, నవల అయినా – శీర్షిక కేవలం రచనకు పెట్టే పేరు మాత్రమే కాదని నా భావన. అది పాఠకుడిని రచనలోకి తీసుకెళ్లే మొదటి అడుగు.
కవిత్వం రాసే అలవాటు వల్ల కావచ్చు, ఒక పదం వెనుక దాగి ఉన్న అనేక అర్థాలను, దాని శబ్దాన్ని, భావాన్ని, దాని వల్ల కలిగే స్పందనను నేను కొంచెం ఎక్కువగా గమనిస్తాను. అందుకే కథకు శీర్షిక పెట్టేటప్పుడు అది కథను మొత్తం చెప్పేయకూడదు; అదే సమయంలో కథ గురించి పాఠకుడిలో ఒక ఆసక్తిని కూడా రేకెత్తించాలి అనుకుంటాను. కొన్ని కథలకు కథ పూర్తయిన తర్వాత, అందులోని ఇతివృత్తాన్ని బట్టి శీర్షికను నిర్ణయించుకున్న సందర్భాలు ఉన్నాయి. కథ ఏం చెప్పాలనుకుంటుందో స్పష్టంగా తెలిసినప్పుడు, ఆ కథకు సరిపోయే ఒక పదం లేదా వాక్యం కోసం వెతికి, చివరికి దాన్ని శీర్షికగా ఎంచుకుంటాను.
అయితే నా దగ్గర ఎక్కువగా జరిగేది దీనికి విరుద్ధం. ఒక మంచి శీర్షిక ముందుగా తడుతుంది. ఆ శీర్షిక చుట్టూ ఒక ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచన క్రమంగా పాత్రలను, సంఘటనలను, సంఘర్షణను తీసుకొచ్చి చివరికి కథగా మారుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా, మంచి పేర్లు ఎక్కడ కనిపించినా, ఎక్కడ వినిపించినా దాచుకోవడం నా అలవాటు. అవి ఎప్పుడో ఒకరోజు ఒక కథకు ప్రాణం పోస్తాయేమోనని అనిపిస్తుంది.
కొన్నిసార్లు ఒక శీర్షిక నన్ను ఎందుకు ఆకర్షించిందో కూడా మొదట నాకు తెలియదు. కానీ దాన్ని మళ్లీ మళ్లీ ఆలోచిస్తున్న కొద్దీ దాని వెనుక ఒక కథ కనిపిస్తుంది. అప్పుడు ఆ కథను నేను వెతకడం కాదు – ఆ శీర్షికే నన్ను కథ వైపు నడిపిస్తుంది. ‘వష్టి’ ఇందుకు ఒక మంచి ఉదాహరణ. ఒక పాత పత్రికలో ఆ పేరు కనిపించింది. ఆ పేరు నన్ను ఆకర్షించింది. దాని అర్థం తెలుసుకున్నాను. ఆ తర్వాత ఆ పేరులో దాగి ఉన్న స్త్రీ జీవితాన్ని, ఒంటరితనాన్ని, భావోద్వేగాన్ని ఊహించుకుంటూ కథ అల్లుకున్నాను.
అలాగే కొన్ని శీర్షికలు మొదట సాధారణంగా అనిపించినా, కథ పూర్తయ్యాక వాటిలో మరో అర్థం కనిపిస్తుంది. అందుకే నాకు శీర్షిక అంటే కథకు సారాంశం కాదు; కథకు సంకేతం. పాఠకుడికి అన్నీ చెప్పకుండా, “ఈ కథలో ఏముంది?” అని అతనిలో ఒక చిన్న ప్రశ్నను మిగిల్చాలి. ఆ ప్రశ్నే అతన్ని కథలోకి తీసుకెళ్లాలి.
ఇందులో నాలోని కవయిత్రి పాత్ర ఖచ్చితంగా ఉంది. కవిత్వం వల్ల పదాలను కేవలం అర్థం కోసం కాకుండా భావం, ధ్వని, ప్రతీక, అంతర్లీన అర్థం కోసం కూడా చూడటం అలవాటైంది. ఒక చిన్న పదంలో ఒక పెద్ద జీవితాన్ని దాచవచ్చని కవిత్వం నాకు నేర్పింది. ఆ అనుభవం కథల శీర్షికల విషయంలో కూడా నాకు ఉపయోగపడింది. అయితే ప్రతి కథకు కావాలనే కవితాత్మకమైన పేరు పెట్టాలని నేను ప్రయత్నించను. కథకు ఏది సహజంగా సరిపోతుందో అదే ముఖ్యం. కొన్నిసార్లు సాధారణమైన పేరు కూడా కథకు అత్యంత బలమైన శీర్షిక కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో అరుదైన పదం, ఒక వాక్యం, ఒక ప్రశ్న, ఒక ప్రతీక కథను మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు.
మొత్తానికి, కొన్ని కథలకు నేను పేరు పెడతాను; కొన్ని కథలకు పేరు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. మొదటిది రచయితగా నా ఎంపిక అయితే, రెండోది నాకు రచయిత్రిగా దొరికే అదృష్టం. నా కథల శీర్షికల్లో ఈ రెండు విధానాలూ కనిపిస్తాయి.
బహుశా అందుకే శ్రీ సలీం గారు చెప్పినట్లుగా, నా కథల శీర్షికల్లో కవయిత్రి ప్రభావం కనిపిస్తుందేమో. కవిత్వం నాకు పదాన్ని ఇచ్చింది; కథ ఆ పదానికి ఒక జీవితం ఇచ్చింది.
ప్రశ్న: మీ తొలి కథ నుంచి తాజా కథ వరకూ, సమాజంలోనూ సాహిత్యంలోనూ ఏయే మార్పులను గమనించారు? వాటికి తగ్గట్టుగా వస్తువు ఎంపికలో లేదా రచనాశైలిలో ఏవైనా మార్పులు చేసుకున్నారా?
జ: నా తొలి కథ నుంచి ఇప్పటి వరకు సమాజంలోనూ, సాహిత్యంలోనూ ఎన్నో మార్పులను గమనించాను. ఈ మార్పులు కేవలం కాలం మారడం వల్ల వచ్చినవి మాత్రమే కాదు. మనిషి ఆలోచనా విధానం, జీవన విధానం, సంబంధాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వేగం – ఇవన్నీ మారడంతో సాహిత్యం కూడా వాటి ప్రభావానికి లోనైంది.
నేను రచనలు ప్రారంభించిన రోజుల్లో కవులు, రచయితలు, రచయిత్రుల సంఖ్య ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. ఒక రచయిత రాసిన కథ, ఒక కవి రాసిన కవిత పత్రికలో ప్రచురితమైతే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. పత్రికలు, సాహిత్య సమావేశాలు, సాహితీ సంస్థలు రచయితల మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరచేవి. ఒకరి రచన మరొకరికి తెలిసేది. చర్చ జరిగేది. అభిప్రాయాలు పంచుకునేవారు.
ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. ఇంటికో కవి, ఇంటికో రచయిత, రచయిత్రి అన్నంతగా రచయితల సంఖ్య పెరిగింది. ఇది ఒక రకంగా సంతోషించాల్సిన పరిణామమే. ఎందుకంటే ఎక్కువమంది రాయాలనుకోవడం అంటే సమాజంలో సృజనాత్మకత పెరుగుతోందనే అర్థం. అయితే అదే సమయంలో వేలాది రచనలు వస్తుండటంతో ఎవరు ఏం రాస్తున్నారు? ఏ రచనలో కొత్తదనం ఉంది? ఏ రచన నిలిచే స్థాయిలో ఉంది? అన్నది గుర్తించడం కూడా కష్టంగా మారింది.
ముఖ్యంగా అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత రచనకు ప్రచురణ కోసం పత్రిక కోసం వేచి చూడాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు రచన పత్రికలో ప్రచురితమవడం ఒక పెద్ద ప్రక్రియ. ఇప్పుడు రాసిన వెంటనే పాఠకుడి ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇది రచయితకు ఒక గొప్ప అవకాశమే. కానీ అదే సమయంలో రచనను మెరుగుపరుచుకోవడానికి, సంపాదించుకోవడానికి, విమర్శను స్వీకరించడానికి అవసరమైన ఓర్పు కూడా కొంత తగ్గింది అనిపిస్తుంది.
అయితే దీనిని పూర్తిగా ప్రతికూలంగా నేను చూడను. ఎందుకంటే ఈ విస్తృతమైన రచనా వాతావరణం వల్ల ఇంతకుముందు సాహిత్యంలో పెద్దగా కనిపించని అనేక గొంతులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. స్త్రీల అనుభవాలు, అట్టడుగు వర్గాల జీవితాలు, వలస జీవితం, నగర జీవనం, ఒంటరితనం, వృద్ధాప్యం, కుటుంబ సంబంధాల్లో వస్తున్న మార్పులు, సాంకేతికత ప్రభావం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అనేక కొత్త విషయాలు సాహిత్యంలోకి వచ్చాయి.
సమాజం మారితే వస్తువులు మారక తప్పదు. ఒకప్పుడు కుటుంబం, వ్యవసాయం, గ్రామీణ జీవితం, సంప్రదాయ సంబంధాలు ప్రధానంగా కథలకు వస్తువులైతే, ఇప్పుడు నగర జీవితం, ఉద్యోగ ఒత్తిడి, ఒంటరితనం, ఆర్థిక అసమానతలు, మారుతున్న కుటుంబ వ్యవస్థ, పిల్లలపై ఒత్తిడి, వృద్ధుల సమస్యలు, స్త్రీల స్వతంత్ర ఆలోచనలు, సంబంధాల్లో వస్తున్న కొత్త సంక్లిష్టతలు వంటి అంశాలు కూడా కథల్లోకి వస్తున్నాయి.
నా రచనల్లో కూడా ఈ మార్పు సహజంగానే వచ్చింది. మొదట్లో నా చుట్టూ కనిపించిన జీవితమే నా కథలకు వస్తువయ్యేది. తర్వాత నేను సమాజాన్ని మరింత విస్తృతంగా చూడటం ప్రారంభించాను. ఒక వ్యక్తి సమస్య వెనుక ఉన్న సామాజిక కారణం ఏమిటి? ఒక కుటుంబంలో జరుగుతున్న సంఘర్షణ వెనుక ఉన్న మనస్తత్వం ఏమిటి? మనిషి తీసుకునే నిర్ణయం వెనుక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అనే కోణంలో ఆలోచించడం మొదలైంది. రచనా శైలిలో కూడా కొంత మార్పు వచ్చింది. మొదట్లో ఒక సంఘటనను కథగా చెప్పాలనే తపన ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సంఘటన కంటే ఆ సంఘటన మనిషిపై కలిగించే ప్రభావం, అతని అంతరంగంలో జరిగే సంఘర్షణ నాకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుంది.
అయితే కాలం మారిందని ప్రతి కొత్త పద్ధతినీ అనుసరించాలనే ఉద్దేశం నాకు లేదు. సాహిత్యంలో ప్రయోగాలు అవసరమే. కానీ ప్రయోగం కోసం ప్రయోగం చేయడం నాకు నచ్చదు. కథకు ఏ శైలి అవసరమో, ఆ కథను పాఠకుడికి ఎలా సహజంగా చేరవేయగలమో దానికి తగిన శైలినే ఎంచుకుంటాను.
ఇంకొక ముఖ్యమైన మార్పు – ఇప్పుడు నేను కథ రాసేటప్పుడు పాఠకుడిని కూడా దృష్టిలో పెట్టుకుంటాను. పాఠకుడు మారిపోయాడు. అతని చదివే సమయం తగ్గింది. అతని ముందున్న సమాచారం పెరిగింది. ఒకేసారి అనేక విషయాలు అతని దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి సమయంలో కథ మొదటి వాక్యం నుంచే అతన్ని పట్టుకోవాలి. అయితే ఆసక్తి పేరుతో కథలోని లోతును కోల్పోకూడదు అనేది నా జాగ్రత్త.
మొత్తానికి, సమాజం మారినప్పుడు సాహిత్యం కూడా మారుతుంది. కానీ మంచి సాహిత్యం మారుతున్న కాలాన్ని మాత్రమే నమోదు చేయదు – ఆ మార్పు వెనుక ఉన్న మనిషిని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. నా రచనల్లో కూడా నేను చేయాలనుకున్నది అదే. రచయితలు పెరిగినంత మాత్రాన సాహిత్యం గొప్పది అయిపోదు. రచనలు పెరగాలి, వాటిలో ఆలోచన పెరగాలి, కొత్త అనుభవాలు రావాలి, భిన్నమైన గొంతులు వినిపించాలి. వేలాది రచనల మధ్య ఒక రచన ప్రత్యేకంగా నిలవాలంటే రచయితకు తనదైన దృష్టి, తనదైన స్వరం, తనదైన నిజాయితీ ఉండాలి.
నా ప్రయాణంలో నేను నేర్చుకున్నది కూడా ఇదే – కాలానికి అనుగుణంగా వస్తువులు మారవచ్చు, శైలి మారవచ్చు; కానీ రచయిత తన మనిషితనాన్ని మాత్రం కోల్పోకూడదు.
ప్రశ్న: “మనకి కావల్సింది వర్తమానం. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకుంటూ వర్తమానాన్ని ఆవేదనలోకి నెట్టుకుంటామా?” మంచి ప్రశ్న! ‘వష్టి‘ కథ నేపథ్యం వివరిస్తారా?
జ: ‘వష్టి’ కథకు ప్రధాన నేపథ్యం ఒంటరితనం. ముఖ్యంగా వయసు పెరిగిన తర్వాత మనిషి ఎదుర్కొనే ఒంటరితనం, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, ఒక మనిషికి మరో మనిషి ఇచ్చే ఆత్మీయత ఎంత అవసరమో చెప్పాలనే ఆలోచనతో ఈ కథ రాశాను. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పెద్దవాళ్లు కుటుంబానికి కేంద్రంగా ఉండేవారు. వారి మాటకు విలువ ఉండేది. పిల్లలు, మనుమలు, మనవరాళ్లతో కలిసి ఉండటం ఒక సహజమైన జీవన విధానం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లలు తమ తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. కొందరు పెద్దవాళ్లు ఆశ్రమాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. మరికొందరు అదే ఇంట్లో ఉన్నా ఒంటరితనంతో జీవిస్తున్నారు.
నిజానికి మనిషికి పెద్ద పెద్ద సౌకర్యాల కంటే కొన్ని చిన్న చిన్న మానవీయమైన విషయాలు ఎక్కువ అవసరం. ఎవరైనా పలకరించడం, కాసేపు మాట్లాడటం, బాధలో ఉన్నప్పుడు ఊరడించడం, మంచి పని చేసినప్పుడు ప్రోత్సహించడం, చక్కగా తయారైనప్పుడు “బాగున్నావు” అని చెప్పడం – ఇవన్నీ మనిషి జీవించడానికి కావాల్సిన చిన్న చిన్న ఆప్యాయతలు. అవి లేకపోతే “నేను ఎలా ఉన్నా ఎవరు పట్టించుకుంటారు?” అనే నిర్లిప్తత మనిషిలోకి వచ్చేస్తుంది.
ముఖ్యంగా వయసు పెరిగిన తర్వాత స్త్రీల విషయంలో ఈ నిర్లక్ష్యం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. జీవితమంతా కుటుంబం కోసం పనిచేసిన ఒక స్త్రీ వృద్ధాప్యంలోకి వచ్చాక, ఆమెకు తనకంటూ ఎలాంటి కోరికలు ఉండకూడదన్నట్టుగా చూస్తాం. ఆమె బయటికి వెళ్లినా, తనను తాను అందంగా ఉంచుకున్నా, ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా కూడా “ఈ వయసులో నీకేం కావాలి?” అనే ప్రశ్న ఎదురవుతుంది.
కానీ పెద్దవాళ్లయినంత మాత్రాన వారు మనుషులు కాకపోతారా? వారికి ఆప్యాయత అవసరం లేదా? వారికి తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా గడపాలనే కోరిక ఉండకూడదా? ఈ ప్రశ్నల నుంచే ‘వష్టి’ కథ మొదలైంది. కథలో వష్టి వయసు మళ్లిన స్త్రీ. జీవితంపై విరక్తి చెందుతుంది. తనను తాను ఎవరికీ అవసరం లేని మనిషిగా భావిస్తుంది. ఇక ఈ జీవితం ఎందుకు? అని అనుకుని చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. అంతేకాదు, మళ్లీ ఇలాంటి జన్మ ఎత్తకూడదనే ఆలోచనతో తాను చనిపోవడానికి ఒక మంచి సమయాన్ని కూడా ఎంచుకుంటుంది. అంటే వష్టి జీవితాన్ని వదిలేయడానికి సిద్ధపడే స్థాయికి చేరిపోయింది.
అలాంటి సమయంలో అర్థరాత్రి ఆమె ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఈ సమయంలో ఎవరు వచ్చారో అని చూస్తే, ఎదురింట్లో ఉన్న గర్భిణీ అమ్మాయికి వాంతులు అవుతుండటంతో, పనిమనిషి భయపడి వష్టిని సహాయం కోసం పిలుస్తుంది.
ఇక్కడే కథలో అసలు మలుపు మొదలవుతుంది. తన జీవితాన్ని ముగించుకోవడానికి సిద్ధమైన వష్టి, మరో మనిషి జీవితాన్ని కాపాడటానికి వెంటనే ముందుకు వస్తుంది. తాను చేసుకున్న ఏర్పాట్లన్నింటినీ పక్కనపెట్టి ఆ అమ్మాయికి వైద్యం చేయిస్తుంది. ఆమెను ఓదారుస్తుంది. రాత్రంతా ఆమె దగ్గరే ఉంటుంది.
ఆ అమ్మాయి కూడా తన భర్తకు దూరంగా జీవిస్తుంటుంది. తన జీవితంలో జరిగిన తప్పులు, బాధలు, ఆవేశాలతో ఆమె కూడా జీవితాన్ని పాడుచేసుకునే స్థితిలో ఉంటుంది. అప్పుడు వష్టి ఆమెకు ఒక మాట చెబుతుంది – తప్పులు జరగవచ్చు, జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు. కానీ జరిగినదంతా కారణంగా ముందున్న జీవితాన్ని కూడా నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ఒక అద్భుతమైన వ్యత్యాసం ఉంది. జీవించాలనే ఆశ కోల్పోయిన వష్టి, మరో మనిషికి జీవితం విలువను నేర్పుతుంది.
ఆమె ఆ అమ్మాయికి జీవితం గురించి చెప్పే కొద్దీ, తానే చెప్పిన మాటలు తనకూ వర్తిస్తాయని గ్రహిస్తుంది. తాను కూడా ఇంకా ఎవరికో అవసరమైన మనిషినే కదా అనిపిస్తుంది. తనకు తాను అవసరం లేదనుకున్న జీవితంలో, కనీసం ఈ అమ్మాయికైనా తన అవసరం ఉందని తెలుసుకుంటుంది. అక్కడే వష్టిలో మార్పు మొదలవుతుంది.
“నేను ఎందుకు బతకాలి?” అన్న ప్రశ్నకు ఆమెకు సమాధానం దొరుకుతుంది – “కనీసం ఈ అమ్మాయి కోసమైనా నేను బతకాలి.” నిజానికి ఆ అమ్మాయికి వష్టి సహాయం చేసింది అనిపించినా, ఆ రాత్రి వష్టిని తిరిగి జీవితంలోకి తీసుకొచ్చింది ఆ అమ్మాయే.
అందుకే ఈ కథలో నేను చెప్పాలనుకున్నది కేవలం వృద్ధాప్యం గురించి కాదు. ఒక మనిషి జీవితానికి మరో మనిషి ఎంత అవసరమో. ఒక పలకరింపు, ఒక మాట, ఒక చిన్న సహాయం కూడా ఒక మనిషిని మరణం అంచు నుంచి జీవితంలోకి తీసుకురాగలదో చెప్పాలనుకున్నాను.
మనిషి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని కోల్పోతాడు. రేపు ఏం జరుగుతుందో, ఇక తనకు ఏమీ లేదో, గతంలో ఏం జరిగిందో ఆలోచిస్తూ ఈరోజు తన ముందున్న జీవితాన్ని చూడడు. కానీ జీవితం ఎప్పుడూ ఇప్పుడే ఉంటుంది.
అందుకే ‘వష్టి’ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే –
మనకు కావాల్సింది భవిష్యత్తు గురించి ఒక ఊహ కాదు; మన చేతిలో ఉన్న ఈ వర్తమానాన్ని మానవీయంగా జీవించడం. ఒక మనిషికి మరో మనిషి అవసరం ఉన్నంతకాలం ఏ జీవితం కూడా పూర్తిగా వ్యర్థం కాదు. మనకు మనమే అవసరం లేనివాళ్లమని అనిపించిన క్షణంలో కూడా, ఎక్కడో ఎవరికో మన అవసరం ఉండవచ్చు. ఆ ఒక్క కారణం కూడా ఒక జీవితాన్ని నిలబెట్టగలదు.
ప్రశ్న: ‘పునర్నవం‘ కథలో చైల్డ్ అబ్యూస్ గురించి రేఖామాత్రంగా ప్రస్తావించి, దాని భవిష్యత్ పరిణామాలపై దృష్టి సారించినట్టు అనిపిస్తుంది. పునర్నవం అంటే కత్తిరించినా మళ్ళీ పెరిగేది అని కదా అర్థం! అంటే ఎంత అణచినా, చైల్ ఎబ్యూస్ మళ్ళీ మళ్ళీ తలెత్తుతోందనే ఉద్దేశంతో ఆ శీర్షిక ఎంచుకున్నారా? మరేదైనా కారణం ఉందా?
జ: అవును. ‘పునర్నవం’ అనే శీర్షికకు చైల్డ్ అబ్యూస్‌తో ఒక అంతర్లీనమైన సంబంధం ఉంది. కానీ “ఎంత అణిచినా చైల్డ్ అబ్యూస్ మళ్లీ మళ్లీ తలెత్తుతుంది” అనే ఒక్క అర్థానికే నేను ఆ శీర్షికను పరిమితం చేయలేదు.
చైల్డ్ అబ్యూస్ అనేది మన సమాజంలో చాలా కాలంగా ఉన్న ఒక తీవ్రమైన సమస్య. ముఖ్యంగా చిన్నపిల్లలపై జరిగే లైంగిక వేధింపులు చాలా కాలం బయటకు రాకుండా కుటుంబాల లోపలే, భయాల మధ్యే, నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. ఇప్పుడు సామాజిక మాధ్యమాల వల్ల కొన్ని సంఘటనలు బయటకు వస్తున్నాయి. కానీ బయటకు వచ్చిన సంఘటనల కంటే, ఎప్పటికీ ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే మోస్తున్న బాల్య గాయాలు ఇంకా ఎన్నో ఉన్నాయనేది నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది.
చిన్నతనంలో జరిగిన ఒక అమానుష సంఘటన అక్కడితో ముగిసిపోదు. శరీరంపై గాయం కనిపించకపోయినా, మనసులో మాత్రం దాని ప్రభావం ఎన్నో సంవత్సరాలు ఉండవచ్చు. పెళ్లి తర్వాత కూడా, కొత్త సంబంధంలోకి వెళ్లిన తర్వాత కూడా, ఆ జ్ఞాపకం ఒక మనిషిని వెంటాడవచ్చు. అందుకే ఈ కథలో నేను చైల్డ్ అబ్యూస్ జరిగిన సంఘటనను విపులంగా వివరించడం కంటే, ఆ సంఘటన ఒక స్త్రీ భవిష్యత్ జీవితంపై ఎలాంటి ముద్ర వేస్తుందో చూపించాలనుకున్నాను.
ఈ కథలో స్వాప్నిక తన చిన్నతనంలో జరిగిన సంఘటనను తన భర్త గౌరవ్‌కు చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే ఆమె దాన్ని దాచుకోవడం కాదు – తన జీవిత భాగస్వామితో తన గతాన్ని పంచుకుని, అతని దగ్గర ఒక ఆత్మీయమైన అర్థం చేసుకోవడాన్ని కోరుకుంటుంది. కానీ గౌరవ్ ఆమె బాధను అర్థం చేసుకోకుండా, “ఈ విషయం ముందే చెప్పి ఉంటే బాగుండేది” అనే దృక్కోణంతో ఆమెను అవమానిస్తాడు. అక్కడ నాకు ముఖ్యంగా కనిపించినది చైల్డ్ అబ్యూస్ కంటే కూడా, ఆ సంఘటనకు గురైన వ్యక్తినే మళ్లీ నిందించే మనస్తత్వం.
“నీకెందుకు ఇంతకాలం తర్వాత చెప్పావు?”
“ముందే ఎందుకు చెప్పలేదు?”
“ఇలాంటి విషయం తెలిసినా నిన్ను ఎలా అంగీకరించాలి?”
ఇలాంటి ప్రశ్నలు బాధితురాలిని మరింత ఒంటరిగా చేస్తాయి. ఆమెకు జరిగిన తప్పుకు ఆమెనే బాధ్యురాలిగా చూడటం మరో అన్యాయం. కథలో గౌరవ్ తల్లి ద్వారా అసలు విషయం బయటపడుతుంది. “మీ అక్క కూడా చిన్నతనంలో ఇలాగే అనుభవించింది. ఆమె కూడా తన భర్తకు చెప్పుకుంది. కానీ నీ బావగారు జరిగినది ఎప్పుడో చిన్నతనంలో జరిగిన విషయం అని అర్థం చేసుకుని, ఆమెను ఓదార్చాడు” అని ఆమె చెప్పినప్పుడు గౌరవ్‌కు తన తప్పు అర్థమవుతుంది.
అక్కడే కథలో ఒక ముఖ్యమైన మార్పు వస్తుంది. గౌరవ్ తన భార్యను క్షమించమని అడుగుతాడు. అంటే కథలో కేవలం ఒక కుటుంబ సమస్య పరిష్కారం కావడం కాదు – ఒక మనిషి తన ఆలోచనా విధానాన్ని తిరిగి పరిశీలించుకోవడం జరుగుతుంది. అందుకే ‘పునర్నవం’ అనే పేరు నాకు మరింత అర్థవంతంగా అనిపించింది.
పునర్నవం అంటే కత్తిరించినా మళ్లీ చిగురించే మొక్క. మనిషి జీవితంలో కూడా కొన్ని అనుభవాలు మనల్ని లోపల నుంచి కత్తిరించినట్టే చేస్తాయి. కానీ అక్కడితో జీవితం ముగియదు. అర్థం చేసుకునే ఒక మనిషి దొరికితే, ఒక మాట ఓదార్పుగా మారితే, ఒక కుటుంబం బాధితురాలిని నిందించకుండా అండగా నిలిస్తే – ఆ మనిషి మళ్లీ జీవితాన్ని చిగురింపజేసుకోవచ్చు.
అందుకే ఈ శీర్షికలో రెండు కోణాలు నాకు కనిపిస్తాయి.
ఒకటి – ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా, ఆడపిల్లలను మనుషులుగా కాకుండా ఆటవస్తువులుగా చూసే వికృత మనస్తత్వం పూర్తిగా తొలగకపోతే, చైల్డ్ అబ్యూస్ అనే దురాచారం పునర్నవంలా మళ్లీ మళ్లీ చిగురిస్తూనే ఉంటుంది.
మరొకటి – ఎంతటి బాల్య గాయం ఎదురైనా, దాన్ని మోస్తూ జీవించాల్సిన అవసరం లేదనే ఆశ. ఆ బాధను నమ్మిన వ్యక్తితో పంచుకోవడం, కుటుంబం అర్థం చేసుకోవడం, సమాజం బాధితురాలినే నిందించకుండా ఆమెకు అండగా నిలవడం ద్వారా ఒక జీవితం మళ్లీ చిగురించవచ్చు.
నిజానికి ఈ కథలో నాకు ముఖ్యమైనది నేరం జరిగిన సంఘటన కాదు. ఆ సంఘటన తర్వాత మనుషులు ఎలా స్పందించారు అన్నదే. ఒక తప్పు మనిషిని జీవితాంతం శిక్షించకూడదు. ముఖ్యంగా ఆ తప్పు అతను చేసినది కాకుండా, అతనిపై జరిగినదైతే అసలే కాదు.
ఇలాంటి సంఘటనలు గతంలో జరిగిపోయినవని మర్చిపోవడం పరిష్కారం కాదు. అవి ఇప్పటికీ జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాలి. అంతేకాదు, బాల్యంలో జరిగిన గాయాలను మోస్తున్న మనుషులకు “అది ఎప్పుడో జరిగింది కదా” అని చెప్పకుండా, “అది నీ తప్పు కాదు” అని చెప్పగలిగే సమాజం కావాలి. అందుకే ‘పునర్నవం’ నాకు కేవలం ఒక కథ పేరు కాదు. ఒకవైపు సమాజంలోని వికృతులు పునరావృతం కాకూడదనే హెచ్చరిక; మరోవైపు గాయపడిన జీవితాలు మళ్లీ చిగురించగలవనే ఆశ.
చైల్డ్ అబ్యూస్ను అరికట్టడం చట్టాల బాధ్యత మాత్రమే కాదు. ఇంట్లో పిల్లల మాట వినడం, వారి భయాలను గౌరవించడం, జరిగిన దానికి పిల్లలనే నిందించకపోవడం, బాధితులకు భద్రత మరియు ఆత్మీయత కల్పించడం – ఇవన్నీ సమాజం నేర్చుకోవాల్సిన విషయాలు. అందుకే ఈ కథ చివరికి నాకు ఒక ప్రశ్నగా కూడా మిగులుతుంది – మన పిల్లలను కాపాడుతున్నామా? లేక వాళ్లు మనల్ని చూసి భయపడకుండా ఉండే వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నామా?
‘పునర్నవం’ ఆ ప్రశ్నకు సమాధానం వెతికే కథ.
ప్రశ్న: ‘రెండంచుల గుండె‘ కథ చాలా ఆర్ద్రంగా ఉంది. భర్త బలవన్మరణం వెనుక ఉన్న కారణాన్ని అన్వేషించే క్రమంలో నిస్సహాయతను తట్టుకుంటూ జీవన పోరాటం చేసిన హేమ – అన్నేళ్ళ స్నేహంలో శ్యామలని సరిగా అంచనా వేయలేకపోయిందా? ఎంతో పరిశోధన చేసిన హేమకి, శ్యామల విషయంలో సందేహం కలగకపోవడానికి కారణం ఆమె బాల్య స్నేహితురాలు కావడమేనా? ఈ కథకి ముగింపు వాక్యం చాలా బావుంది. ఈ కథ పత్రికలో ప్రచురితమైనప్పుడు ఎటువంటి స్పందన వచ్చింది?
జ: నిజమే. నా కథా రచనా ప్రస్థానంలో ‘రెండంచుల గుండె’ కథకు వచ్చినంత స్పందన మరే కథకూ రాలేదు అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ కథ ‘నవ్య’లో ప్రచురితమైనప్పుడు నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఇప్పటికీ గుర్తున్నాయి. కొందరు పాఠకులు ఫోన్లో మాట్లాడుతూనే ఏడ్చారు. కథలోని సంఘటన తమను ఎంతగా కదిలించిందో చెప్పేవారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఈ స్పందనల పరంపర కొనసాగింది. ఒక రచయితగా అంతకంటే గొప్ప బహుమతి మరొకటి ఉండదనిపించింది.
ఈ కథ హిందీలోకి, తమిళంలోకి కూడా అనువాదమైంది. ఇటీవల ఉడిపిలో ఉన్న ఒక వ్యక్తి ఈ కథ చదివానని ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. కథను ఎంతో ప్రశంసించారు. కథ ప్రచురితమైన చాలా కాలం తర్వాత కూడా ఎక్కడో ఒకచోట ఒక పాఠకుడు దాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఒక రచన పాఠకుడి మనసులో నిలిచిపోతే అదే దాని అసలైన విజయం అనుకుంటాను.
ఇక హేమ విషయానికి వస్తే, ఆమె శ్యామలను సరిగ్గా అంచనా వేయలేకపోవడానికి ప్రధాన కారణం శ్యామలతో ఉన్న బాల్య స్నేహం, ఆమెపై ఉన్న అచంచలమైన నమ్మకం. మనం చిన్ననాటి నుంచి ఒకరిని మనస్ఫూర్తిగా నమ్ముతూ వచ్చినప్పుడు, ఆ వ్యక్తి మన ఊహకు భిన్నంగా ప్రవర్తిస్తాడని అంగీకరించడం చాలా కష్టం. మనకు తెలిసిన వ్యక్తి ఒక రూపంలోనే మన మనసులో స్థిరపడిపోతాడు. ఆ రూపానికి భిన్నమైన నిజాన్ని చూడటానికి మనసు వెంటనే అంగీకరించదు.
అందుకే హేమ ఎంత పరిశోధన చేసినా, శ్యామల విషయంలో ఆ అనుమానం ఆమెకు రాదు. ఇది హేమ అమాయకత్వం మాత్రమే కాదు. అతి నమ్మకం కూడా ఒక్కోసారి మనిషి చూపును మూసేస్తుంది. మనం ప్రేమించే వ్యక్తిని, మనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిని అనుమానించడానికి మనసు ఇష్టపడదు. కథలో హేమ పాత్ర ద్వారా ఆ మానసిక స్థితినే చూపించాలనుకున్నాను.
ఈ కథ రాయడానికి ప్రధాన కారణం మాత్రం స్నేహం, విశ్వాసం, ద్రోహం అనే మూడు అంశాల చుట్టూ నేను గమనించిన కొన్ని సంఘటనలు. ఒక వ్యక్తి ఆడైనా, మగైనా – ఎవరైనా సరే – ఒక స్నేహితుడు తన జీవిత భాగస్వామిని పరిచయం చేసినప్పుడు, ఆ పరిచయం వెనుక ఉన్న విశ్వాసాన్ని గుర్తించాలి. ఒక స్నేహితురాలు తన భర్తను పరిచయం చేసినా, ఒక స్నేహితుడు తన భార్యను పరిచయం చేసినా, ఆ బంధానికి ఒక హద్దు, ఒక బాధ్యత ఉంటుందని నేను భావిస్తాను. కానీ ఆ హద్దులను దాటి స్నేహితుడి జీవిత భాగస్వామిపై ఆకర్షణ పెంచుకోవడం, దాన్ని సంబంధంగా మార్చుకోవడం, చివరికి ఒక కుటుంబాన్ని ఛిద్రం చేయడం వంటి సంఘటనలను మన చుట్టూ చూస్తున్నాం. ఇందులో స్త్రీ, పురుషుడు అనే తేడా నాకు లేదు. స్త్రీ అయినా, పురుషుడైనా, ఇతరుల జీవితాల్లోకి అడుగుపెట్టేటప్పుడు సంబంధాల పట్ల బాధ్యత, మనసాక్షి ఉండాలి. ఒకరి జీవితంలో మన ప్రవేశం వల్ల మరొకరి జీవితం నాశనం కాకూడదు.
ప్రేమ పేరుతో, ఆకర్షణ పేరుతో, తమకు నచ్చినదే జీవితం అనే భావనతో కొందరు తీసుకునే నిర్ణయాల వెనుక ఎన్నో జీవితాలు నలిగిపోతాయి. ఒక కుటుంబం విడిపోతుంది. పిల్లలు మానసికంగా దెబ్బతింటారు. ఒక వ్యక్తి నమ్మకం కోల్పోతాడు. కొన్నిసార్లు జీవితం మీదే విరక్తి చెందే పరిస్థితులు వస్తాయి.
నన్ను ఎక్కువగా కలచివేసే ప్రశ్న ఇదే – ఉన్నది ఒకటే జీవితం కదా! అలాంటి జీవితంలో మనకు నచ్చినదంతా చేసేయాలనే హక్కు ఉందని ఎవరు చెప్పారు? మన ఆనందం కోసం మరొకరి జీవితాన్ని నాశనం చేసే హక్కు మనకు ఉందా?
స్వేచ్ఛకు కూడా బాధ్యత ఉండాలి. ప్రేమకు కూడా పరిమితులు, విలువలు ఉండాలి. ఒక సంబంధాన్ని ప్రారంభించడం కంటే, ఒక సంబంధాన్ని కాపాడటం చాలా పెద్ద బాధ్యత. ముఖ్యంగా మనపై నమ్మకం ఉంచిన మనిషికి ద్రోహం చేయకుండా ఉండటం మనిషితనానికి సంబంధించిన విషయం.
‘రెండంచుల గుండె’లో నాకు చెప్పాలనిపించినది కేవలం ఒక కుటుంబంలో జరిగిన విషాదం కాదు. నమ్మకానికి రెండు అంచులు ఉంటాయి – ఒకటి మనం ఎదుటివారిపై ఉంచేది; మరొకటి ఎదుటివారు మనపై ఉంచేది. ఆ రెండింటిలో ఏ ఒక్కటి విరిగినా గుండెకు గాయం తప్పదు.
ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది – మనిషి తన కోరికలకు మాత్రమే జవాబుదారీ కాదు; తన వల్ల మరొకరి జీవితంలో కలిగే పరిణామాలకు కూడా జవాబుదారీ. మనం చేసే ఒక నిర్ణయం మన జీవితాన్నే కాదు, మన చుట్టూ ఉన్న అనేక జీవితాలను ప్రభావితం చేయవచ్చు.
అందుకే ఈ కథ ముగింపు నాకు కూడా చాలా ముఖ్యమైనది. మరణంతో సమస్యలు ముగిసిపోవు; మనం వదిలి వెళ్లినవారి జీవితాల్లో అవి మరింత పెద్ద ప్రశ్నలుగా మిగిలిపోతాయి. జీవితం ఎంత సంక్లిష్టమైనదైనా, దాన్ని ఎదుర్కొనే ధైర్యమే మనిషికి ఉండాలి. తప్పు జరిగితే దాన్ని అంగీకరించే నిజాయితీ, సంబంధాన్ని కాపాడే బాధ్యత, మరొకరి మనసును గాయపరచకూడదనే మానవత్వం ఉండాలి. అదే ఈ కథ వెనుక ఉన్న నా వేదన. అదే ‘రెండంచుల గుండె’ను రాయడానికి నన్ను ప్రేరేపించిన కారణం.
ప్రశ్న: “ఈ ప్రపంచంలో ఎక్కువగా జీవితంలో నలిగిపోయేది ఒక్క మధ్యతరగతే. ఎదగడానికి స్తోమత ఉండదు. అడుక్కోవడానికి మనసు రాదు. ఉండీ లేకుండా రేపటి పై ఆశతో జీవించే మధ్య తరగతి జీవితాలను ఎవరూ గుర్తించరు” అన్నారు ‘అంతర్లీనం‘ కథలో. ఈ కథ గురించి మరిన్ని వివరాలు చెప్తారా?
జ: అంతే కదా! మధ్యతరగతి జీవితంలో అత్యంత విషాదం అదే. అవసరాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. కానీ వాటిని తీర్చుకునే స్తోమత ఎప్పుడూ సరిపోదు. అడగడానికి ఆత్మగౌరవం అడ్డొస్తుంది. ఉన్నదానితో సరిపెట్టుకోవడానికి మనసు ఒప్పుకోదు. అయినా రేపు ఏదో ఒక అద్భుతం జరుగుతుందనే చిన్న ఆశతో జీవితం ముందుకు సాగిపోతుంటుంది.
‘అంతర్లీనం’ కథకు ఆ మధ్యతరగతి జీవితమే ప్రధాన నేపథ్యం. ఒకవైపు చాలీచాలని ఆదాయం, మరోవైపు అప్పులు, పిల్లల భవిష్యత్తు, ముఖ్యంగా పెళ్లిళ్ల బాధ్యత – ఇవన్నీ ఒక కుటుంబాన్ని లోపల ఎంతగా కుంగదీస్తాయో ఈ కథలో చూపించాలనుకున్నాను.
మన సమాజంలో ఆడపిల్ల పెళ్లి ఒక కుటుంబానికి ఎంత పెద్ద ఆర్థిక భారం అవుతుందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో మగపిల్ల పెళ్లి విషయంలో కూడా తల్లిదండ్రులపై ఎన్నో ఆశలు, ఒత్తిళ్లు ఉంటాయి. ఒకప్పుడు పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయికగా చూసేవారు. ఇప్పుడు కొన్నిసార్లు అది రెండు కుటుంబాల ఆర్థిక సామర్థ్యాల లెక్కలుగా మారిపోతోందేమో అనిపిస్తుంది.
ఈ కథలో కొడుకుకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరవు. అమ్మాయి తల్లిదండ్రుల కోరికలు ఒక్కొక్కటిగా పెరుగుతూనే ఉంటాయి. ఒక మధ్యతరగతి కుటుంబం తమ స్థాయికి మించి ఎంత చేయగలదో చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి చోటా ఒక కొత్త డిమాండ్, ఒక కొత్త లెక్క ఎదురవుతుంది. పెళ్లి జరిగిన తర్వాత కూడా కథ అక్కడితో ఆగదు. అత్తవారింటి సంబంధాలు ఎలా ఉండాలి? ఎవరి మాటకు ఎంత విలువ ఉండాలి? అనే విషయాల కంటే ఎవరి పెత్తనం ఎంత? ఎవరి హక్కు ఎంత? అనే లెక్కలు మొదలవుతాయి. కొన్నిసార్లు తల్లి తన కొడుకు కుటుంబ జీవితంలో అతిగా జోక్యం చేసుకోవడం, దాని వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరగడం, చివరకు విడాకుల వరకు వెళ్లడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి.
ఇంకొకవైపు, వివాహాన్ని బాధ్యతగా కాకుండా ఒక ఆర్థిక భద్రతగా చూసే ధోరణి కూడా నాకు బాధ కలిగించింది. కొందరు పెళ్లి కాకముందే భరణం, విడాకులు వంటి విషయాలను లెక్కల్లో పెట్టుకోవడం; మరికొందరు పెళ్లయిన వెంటనే భర్త ద్వారా వచ్చే ఆస్తులు, సౌకర్యాలు ఏమిటన్నదే ఆలోచించడం – ఇలాంటి దృక్పథాలు సంబంధాల్లోని ఆత్మీయతను తగ్గిస్తున్నాయి.
ఇది నేను స్త్రీలను లేదా పురుషులను తప్పుపట్టడానికి రాసిన కథ కాదు. సంబంధాలను లాభనష్టాల లెక్కలుగా మార్చే మనస్తత్వాన్ని ప్రశ్నించడానికి రాసిన కథ. ఎందుకంటే పెళ్లి అనేది ఒక ఒప్పందం మాత్రమే కాదు. ఇద్దరు మనుషులు కలిసి ఒక జీవితాన్ని నిర్మించుకోవాల్సిన బంధం.
ఈ పరిస్థితులన్నీ చూస్తున్న కథలోని తల్లికి ఒక దశలో “పిల్లలుగా ఉన్నప్పుడే ఎంత బాగుండేది!” అనిపిస్తుంది. అప్పటికి వాళ్ల మధ్య ఆస్తుల లెక్కలు లేవు. ఎవరి మీద ఎవరి పెత్తనం అనే ప్రశ్న లేదు. ఎవరు ఎంత తెచ్చారు, ఎవరి దగ్గర ఎంత ఉంది అనే ఆలోచన లేదు. వాళ్లకు కావలసింది తల్లిదండ్రుల ప్రేమ, ఒక చిన్న ఆనందం మాత్రమే.
అక్కడే ఈ కథలోని అసలు వేదన ఉంది.
మనిషి ఎదిగే కొద్దీ జీవితం అందంగా మారాలి. కానీ కొన్నిసార్లు మనిషి ఎదుగుతున్న కొద్దీ సంబంధాలు సంక్లిష్టమవుతున్నాయి. అవసరాలు పెరుగుతున్నాయి. ఆశలు పెరుగుతున్నాయి. వాటితో పాటు అసంతృప్తి, పోలికలు, లెక్కలు కూడా పెరుగుతున్నాయి.
‘అంతర్లీనం’ అనే పేరును కూడా అందుకే ఎంచుకున్నాను. బయటికి చూస్తే ఒక మధ్యతరగతి కుటుంబం సాధారణంగానే కనిపిస్తుంది. కానీ ఆ కుటుంబం లోపల – అంటే అంతర్లీనంగా – ఎన్ని ఆర్థిక ఒత్తిళ్లు, భయాలు, అవమానాలు, ఆశలు, నిరాశలు, సంబంధాల సంఘర్షణలు దాగి ఉంటాయో ఈ కథ చెబుతుంది.
మధ్యతరగతి మనిషి బాధ చాలా సందర్భాల్లో బయటకు కనిపించదు. అతను ఆకలితో ఉన్నా ఆకలిగా ఉన్నానని చెప్పడు. అప్పుల్లో ఉన్నా తన పరిస్థితిని చెప్పుకోడు. పిల్లల కోసం తన అవసరాలను వదులుకుంటాడు. రేపు బాగుంటుందనే ఆశతో ఈరోజు ఎన్నో రాజీలు పడతాడు. అందుకే నాకు మధ్యతరగతి జీవితం ఎప్పుడూ ఒక నిశ్శబ్ద పోరాటంలా అనిపిస్తుంది. ఆ పోరాటానికి పెద్ద శబ్దం ఉండదు. కానీ దాని వేదన మాత్రం చాలా లోతుగా ఉంటుంది.
‘అంతర్లీనం’ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే – సంబంధాలకు డబ్బు అవసరం కావచ్చు కానీ డబ్బే సంబంధంగా మారకూడదు. పెళ్లికి ఆర్థిక భద్రత అవసరం కావచ్చు కానీ పెళ్లి ఆర్థిక లావాదేవీగా మారకూడదు. మనిషి జీవితానికి అవసరాలు ఉండాలి కానీ ఆ అవసరాల కింద మనిషితనం నలిగిపోకూడదు. చివరికి మనిషి ఎంత సంపాదించాడు, ఎంత ఆస్తి సంపాదించాడు అన్నదానికంటే, తనతో ఉన్న మనుషులను ఎంతగా నిలబెట్టాడు, ఎంతగా ప్రేమించాడు, ఎంత ఆత్మీయతను మిగిల్చాడు అన్నదే జీవితానికి అసలైన కొలమానం అనిపిస్తుంది.
ప్రశ్న: ఈ సంపుటిలో ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే, ఎందుకని?
జ: నాకు ఏ కథ రచించినా కష్టం అనిపించదు. అన్నీ ఇష్టంగానే రాస్తాను. కథ రాయడం నాకు ఒక పనిలా కాకుండా, నా చుట్టూ కనిపించిన ఒక జీవితాన్ని, ఒక సంఘటనను, ఒక మనస్తత్వాన్ని అక్షరాల్లోకి తీసుకురావడంలా అనిపిస్తుంది.
కొన్ని కథలు ఒక్కసారిగా మనసులోకి వచ్చి చాలా వేగంగా పూర్తవుతాయి. మరికొన్ని కథలు మాత్రం కొంతకాలం నాలోనే తిరుగుతుంటాయి. పాత్రలు, సంఘటనలు, వాటి మధ్య సంబంధాలు నాలో రూపుదిద్దుకున్న తర్వాతే కాగితంపైకి వస్తాయి. అందుకే బయటికి చూస్తే ఒక కథ రాయడం నాకు సులభంగా అనిపించినా, ఆ కథ నా లోపల పూర్తిగా రూపుదిద్దుకోవడానికి మాత్రం కొంత సమయం పడుతుంది.
అయితే కొన్ని కథలు రాస్తున్నప్పుడు మాత్రం భావోద్వేగంగా చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న సంఘటనలు, మనుషుల నిస్సహాయత, ఒంటరితనం, సంబంధాల్లోని ద్రోహం, పిల్లల బాధ వంటి అంశాలపై రాసేటప్పుడు పాత్రలతో పాటు నేనూ ప్రయాణిస్తాను. అలాంటి సందర్భాల్లో కథను రాయడం కష్టం కాదు కానీ ఆ బాధను మళ్లీ అనుభవించడం మాత్రం కష్టంగా ఉంటుంది.
నాకు కథ అంటే కేవలం సంఘటన కాదు. ఒక మనిషి ఆ సంఘటనను ఎలా అనుభవించాడు? దాని తర్వాత అతనిలో ఏ మార్పు వచ్చింది? అనే విషయమే ముఖ్యంగా అనిపిస్తుంది. అందుకే కథ రాస్తున్నప్పుడు పాత్రలను తీర్పు చెప్పకుండా, వారి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను.
మొత్తానికి, కథ రాయడం నాకు కష్టం కాదు; కథలోని మనిషిని నిజాయితీగా పట్టుకోవడమే నాకు ముఖ్యం. ఒక కథ పూర్తయ్యాక “నేను చెప్పాలనుకున్న భావం పాఠకుడికి చేరుతుందా?” అనే చిన్న సందేహం మాత్రం ప్రతి కథకూ ఉంటుంది. అదే బహుశా రచయితను మరోసారి తన రచనను చూసుకునేలా చేస్తుంది. కష్టం అనిపించకపోవడానికి కారణం కూడా ఇదేనేమో – నేను కథలను బలవంతంగా రాయను. ఒక కథ నన్ను లోపల నుంచి రాయమని అడిగినప్పుడు మాత్రమే రాస్తాను. అందుకే ప్రతి కథ నాకు ఇష్టమైనదే.
ప్రశ్న: సాధారణంగా రచయితలకు తామే రాసేవన్నీ నచ్చుతాయి. కానీ ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కథ ఏది? ఎందువల్ల?
జ: నా మేధోపరమైన బిడ్డలే నా రచనలు. అందుకే నేను రాసిన ప్రతి కథతోనూ నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ప్రతి కథ వెనుక ఒక ఆలోచన, ఒక అనుభూతి, ఒక సందర్భం ఉంటుంది కాబట్టి ఏ కథను కూడా తక్కువగా చూడలేను. అయినా ఈ సంపుటిలో నాకు ప్రత్యేకంగా నచ్చిన కథ ‘శివోహం’.
ఈ కథకు సంబంధించిన ఒక సంఘటన కూడా నాకు చాలా గుర్తుండిపోయింది. ‘రచన’ పత్రికకు ఈ కథను పంపినప్పుడు, పత్రిక మూసివేయడం వల్ల ప్రచురించలేకపోతున్నామని సంపాదకులు తెలియజేశారు. ఒక కథ ప్రచురించలేకపోయినందుకు బాధపడటం సహజమే. కానీ నా కథను ప్రచురించాలనుకుని, పత్రిక మూసివేయడం వల్ల ప్రచురించలేకపోయామని సంపాదకులు చెప్పడం మాత్రం నాకు ఆనందాన్ని కలిగించింది. అంటే ఆ కథలో వారికి ఏదో ప్రత్యేకత కనిపించిందని నేను భావించాను.
‘శివోహం’ కథకు మూలమైన ఆలోచన ఒక పాడుబడిపోయిన శివాలయాన్ని చూసినప్పుడు కలిగింది. ఒకప్పుడు భక్తులతో కళకళలాడిన ఆలయం కాలక్రమంలో శిథిలమైపోతుంది. పాడుబడిన ఆలయాలు కేవలం దేవుడి నివాసాలుగా కాకుండా, ఆశ్రయం లేని మనుషులకు, బిక్షగాళ్లకు, కుక్కలకు, ఎలకలకు కూడా నిలయాలవుతాయి. అంటే మనం పవిత్రమైనదిగా భావించే ఒక ప్రదేశం, మరొకరి జీవితంలో ఇల్లుగా మారుతుంది.
అలాంటి ఒక పాడుబడిన గుడిలో ఒక బిక్షగాడు జీవిస్తుంటాడు. ఆ గుడి అతనికి కేవలం నీడ కాదు – అతని జీవితంలో మిగిలిన చివరి ఆధారం. కొంతకాలానికి ప్రభుత్వం ఆ పాత ఆలయాన్ని తొలగించి, అక్కడ కొత్త ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయిస్తుంది. దాంతో అక్కడ నివసిస్తున్న వారందరూ చెల్లాచెదురవుతారు. ఇన్నాళ్లు తమకు ఒక ఆశ్రయం ఉందనుకున్నవారు మళ్లీ వీధిన పడతారు.
కొత్త ఆలయం నిర్మాణం పూర్తవుతుంది. ఒకరోజు ఆ బిక్షగాడు అక్కడ ఉండగా, “ఏ నిమిషాన ఏమవుతుందో ఎవరికీ తెలియదు” అనే భావంతో ఒక మాట అంటాడు. అదే సమయంలో అనుకోకుండా ఆలయ గోడ కూలిపోతుంది. ఆ సంఘటనతో ప్రజలు అతన్ని సాధారణ బిక్షగాడిగా చూడటం మానేసి, ఏదో దైవశక్తి ఉన్న వ్యక్తిగా భావిస్తారు. చివరికి అతను స్వామీజీగా మారిపోతాడు.
అతనికి ఆలయంలోనే ఒక చోట ఏర్పాటు చేస్తారు. అతన్ని చూడటానికి ప్రజలు వస్తారు. అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. నిన్నటి వరకు బిక్షగాడిగా ఉన్న మనిషి, ఈరోజు స్వామీజీగా గౌరవించబడతాడు. అతని మాటలకు విలువ వస్తుంది. అతని చుట్టూ భక్తులు చేరతారు.
కానీ జీవితంలో ఎంత మార్పు వచ్చినా తన కొడుకు తనకు దూరమయ్యాడనే బాధ మాత్రం అతనిలో అలాగే ఉంటుంది. ఒకరోజు అతని కొడుకు తిరిగి వస్తాడు. తండ్రి ఇప్పుడు స్వామీజీగా మారి ప్రజల గౌరవాన్ని, డబ్బును పొందుతున్నాడని గమనిస్తాడు. కానీ కొడుకుకు కనిపించేది తండ్రి కాదు – ఆ వేషం ద్వారా సంపాదించగల అవకాశమే. “నువ్వు ఎలాగూ స్వామీజీగా మారావు కదా! నాతో వచ్చేస్తే ఈ వేషంతో ఇంకా ఎక్కువగా సంపాదించుకోవచ్చు” అన్నట్టుగా మాట్లాడతాడు.
ఆ ఒక్క మాట తండ్రి మనసులో ఇన్నాళ్లుగా కొడుకుపై ఉన్న ఆపేక్షను ఒక్కసారిగా చంపేస్తుంది. ఇక్కడ నాకు కథలోని అసలు విషాదం కనిపిస్తుంది. తండ్రి కొడుకును కోల్పోవడం కొత్త విషయం కాదు. కానీ కొడుకు తన తండ్రిని తండ్రిగా కాకుండా సంపాదనకు ఉపయోగపడే ఒక సాధనంగా చూడటం అతనికి తట్టుకోలేని విషయం. ఆ రాత్రే అతను చనిపోతాడు.
అయితే కథ అక్కడితో ముగియదు. అతను అదే గుడిలో శిలావిగ్రహంగా మారిపోతాడు.
ఇది నాకు కథలో అత్యంత ప్రతీకాత్మకమైన భాగం. మనం దేవుడి కోసం శిలావిగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. కానీ ఈ కథలో ఒక బిక్షగాడి జీవితాన్నే చివరికి సమాజం ఒక దేవుడి రూపంలో నిలబెడుతుంది. అతను బ్రతికున్నప్పుడు అతనికి ఆశ్రయం కావాలి, ఆప్యాయత కావాలి, కొడుకు కావాలి. కానీ అవి ఏవీ దొరకలేదు. చనిపోయిన తర్వాత మాత్రం అతనికి గౌరవం, భక్తి, పూజ అన్నీ లభిస్తాయి. బతికున్న మనిషికి కావాల్సిన ప్రేమను ఇవ్వకుండా, చనిపోయిన తర్వాత అతన్ని పూజించడం మన సమాజంలోని ఒక విచిత్రమైన విరుద్ధత.
‘శివోహం’ అనే పేరులో కూడా నాకు ఇదే భావం ఉంది. మనిషిలోనే దైవత్వాన్ని చూడాలి. కానీ మనం మనిషి బతికున్నంతకాలం అతని విలువను గుర్తించము. అతను ఏదో ఒక రూపంలో మనకు ఉపయోగపడితేనే గౌరవిస్తాం.
ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది దేవుడి గురించి కాదు; మనిషి గురించి. ఆశ్రయం కోల్పోయిన ఒక బిక్షగాడి జీవితం, అనుకోకుండా అతనికి వచ్చిన గౌరవం, ఆ గౌరవం వెనుక ఉన్న సమాజపు నమ్మకాలు, చివరికి కన్నకొడుకు చూపిన స్వార్థం – ఇవన్నీ కలిపి మనిషి విలువ ఎక్కడ ఉందో ప్రశ్నించే ప్రయత్నమే ‘శివోహం’.
మనిషి బ్రతికున్నప్పుడు అతనికి ఒక పలకరింపు, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత అవసరం. శిలగా మారిన తర్వాత పూజించడం కంటే, మనిషిగా ఉన్నప్పుడే మనిషిని గౌరవించడం గొప్పది. ఇదే ఈ కథ నాకు అత్యంత ఇష్టమైన కారణం.
ప్రశ్న: సాహిత్యం విషయంలో మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏవి? కొత్త పుస్తకాలు ఏవైనా రాబోతున్నాయా?
జ: దాదాపు ముప్పై ఏళ్లకు పైగా నా జీవితాన్ని సాహిత్యానికే అంకితం చేశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేసినందుకు ఆనందంగా ఉన్నా, ఒకవైపు కొంత అలసట కూడా అనిపిస్తోంది. నేను ఆశించినంత గుర్తింపు, ప్రోత్సాహం లభించలేదనే చిన్న అసంతృప్తి కూడా ఉంది. అయితే ఇవన్నీ నా రచనా ప్రయాణాన్ని ఆపేవి కావు. ఎందుకంటే నాకు సాహిత్యం కేవలం గుర్తింపు కోసం చేసే పని కాదు. అది నా జీవితంలో ఒక భాగంగా, చివరికి నా జీవితంగానే మారిపోయింది.
నా సాహితీ ప్రయాణం దాదాపుగా హైదరాబాద్ కేంద్రంగా సాగింది. కాలక్రమంలో ప్రాంతీయ భావనలు, వర్గీకరణలు, పరిచయాల పరిధులు పెరగడం వల్ల కొన్నిసార్లు సాహిత్యంలో కూడా మనుషుల మధ్య దూరాలు ఏర్పడుతున్నాయనే అనుభూతి కలిగింది. కులం, మతం, ప్రాంతం వంటి విభజనలు రాజకీయాలకు పరిమితం కావాలని మనం ఎంత చెప్పుకున్నా, వాటి ప్రభావం సాహిత్యరంగంలో కూడా అప్పుడప్పుడు కనిపించడం బాధ కలిగించే విషయం. సాహిత్యం మనుషులను దగ్గర చేయాలి; కానీ సాహిత్య ప్రపంచంలోనే కొన్ని గోడలు కనిపించడం ఒక రచయిత్రిగా నన్ను ఆలోచింపజేసింది.
అయినా నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నా రచనను ఆపుకోవాలని అనుకోలేదు. నాకు దక్కాల్సిన గుర్తింపు గురించి ఎదురు చూడటం కంటే, నేను చేయాల్సిన పనిని నేను చేసుకుంటూ పోవడమే నాకు ముఖ్యం. నా రచనను కాలమే నిర్ణయిస్తుందనే నమ్మకం నాలో ఉంది.
ప్రస్తుతం కూడా కొన్ని రచనలు సిద్ధమవుతున్నాయి. త్వరలో ‘కవిత్వ విమర్శ వ్యాసాలు’, ‘కథా విమర్శ వ్యాసాలు’ పుస్తకాలుగా రావాల్సి ఉన్నాయి. అలాగే ‘మూడు గదుల ఇల్లు’ అనే మినీ కథా సంపుటి, ‘శైలజామిత్ర సంపాదకీయాలు’ కూడా పాఠకుల ముందుకు రాబోతున్నాయి.
ఇన్ని సంవత్సరాలు కవిత్వం, కథ, నవల, అనువాదం, సమీక్ష, విమర్శ, సంపాదకత్వం – ఇలా సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో ప్రయాణించాను. ఇక ముందూ ఏదైనా రాయాలనే తొందర కంటే, రాయాల్సినదే రాయాలి, చెప్పాల్సినదే చెప్పాలి అనే స్పష్టతతో ముందుకు సాగాలనుకుంటున్నాను.
చివరికి సాహిత్యంలో మనం ఎంత రాశామన్నదానికంటే, మన తర్వాత కూడా మన రచనల్లో ఏదైనా ఒక భావం, ఒక ప్రశ్న, ఒక ఆలోచన మిగిలిందా లేదా అన్నదే ముఖ్యమని నేను నమ్ముతున్నాను. ఆ మిగిలిపోయే అక్షరం కోసం నా సాహితీ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.
నా సాహిత్య ప్రయాణాన్ని ఇంత లోతుగా పరిశీలించి, ఇన్ని ప్రశ్నల ద్వారా నా రచనా ప్రస్థానాన్ని, నా ఆలోచనలను, నా అనుభవాలను పాఠకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కల్పించిన ‘సంచిక’ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాధారణంగా ఒక రచయిత తన రచనల గురించి తానే మాట్లాడుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. కానీ మీ ప్రశ్నల ద్వారా నా రచనల వెనుక ఉన్న ఆలోచనలు, అనుభూతులు, బాధలు, ఆనందాలు, ఎదురైన అనుభవాలు అన్నింటినీ మరోసారి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం నాకు లభించింది.
ముప్పై ఏళ్లకు పైగా సాగిన నా సాహిత్య ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన పత్రికా సంపాదకులకు, ప్రచురణకర్తలకు, సాహితీ మిత్రులకు, నన్ను ప్రోత్సహించిన పెద్దలకు, నా రచనలను చదివి స్పందించిన పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రచయితను రాసేది అతని కలం అయితే, ఆ రచయితను కొనసాగించేది పాఠకుడి స్పందనే అని నేను నమ్ముతాను.
నా రచనల్లో ఏదైనా ఒక పాఠకుడిని ఆలోచింపజేసినా, ఒక మనసును కదిలించినా, ఒక ప్రశ్నను మిగిల్చినా అదే నాకు గొప్ప గుర్తింపు.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు శైలజామిత్ర గారూ.
శైలజామిత్ర: ఈ సంభాషణ ద్వారా నా సాహిత్య ప్రయాణాన్ని మరోసారి పలకరించే అవకాశం ఇచ్చిన ‘సంచిక’కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ – ఇక ముందూ నా అక్షర ప్రయాణం కొనసాగుతుందని, నాతో పాటు నా అక్షరాలు కూడా నడుస్తూనే ఉంటాయని చెప్పుకుంటున్నాను.
***
జన్మించడమే కవిత్వం (కవితా సంపుటి)
రచన: శైలజామిత్ర
ప్రచురణ: అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రై. లి.
పేజీలు: 214
వెల: ₹ 175/-
ప్రతులకు:
అన్వీక్షికి పబ్లిషర్స్
అజ్రా హౌస్, డోర్ నెంబర్: 8-2-293/82/C/59C,
ఎమ్మెల్యే కాలనీ, హనుమాన్ టెంపుల్ స్ట్రీట్,
హకీంపేట్ (బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 12),
హైదరాబాద్ 500096.
ఫోన్: 9705972222
~
వష్టి (కథా సంపుటి)
రచన: శైలజామిత్ర
ప్రచురణ: పాలపిట్ట ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 216
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
శైలజామిత్ర
#98, సౌజన్యా అవెన్యూ,
ఎస్.బి.ఐ. కాలనీ,
గాంధీనగర్,
హైదరాబాద్ 500080
ఫోన్: 9290900879

