[‘ఆవిష్కరణ, నా హాలీవుడ్ డైరీ, వేదాంత దేశికులు’ అనే మూడు పుస్తకాలు వెలువరించిన శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం శ్రీదేవి మురళీధర్ గారూ.
శ్రీదేవి మురళీధర్: నమస్కారం.
~
ప్రశ్న 1. విభిన్నమైన రచనలు మీరు చేస్తున్నారు. అభినందనలు. ‘ఆవిష్కరణ, ఆల్కహాలిక్ల పిల్లలు-ఒక అవగాహన’ పుస్తక రచనకు ప్రేరణ ఏమిటి?
జ: ధన్యవాదాలు. 1990 ప్రాంతాలలో ఒక ఆప్తమిత్రుల కుటుంబం ఈ సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారమార్గంగా మద్రాసు టి. టి. కె. ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లినప్పుడు నేను ఆ కుటుంబంతో కలిసి ప్రయాణించాను. అక్కడ ఈ సమస్య గురించి, దీనిని ఎదుర్కుంటున్న అనేకానేక కుటుంబాల గురించీ తెలుసుకున్నాను. అదే చికిత్సాకేంద్రంలో సోషల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించే కోర్సులో చేరి ప్రాథమిక అవగాహన పొందాను. అప్పుడే ఈ సమస్య గురించి విస్తృత చర్చ జరిగితే ఉపయోగం అని భావించి అనేక పుస్తకాలు చదివాను. తమ తప్పు లేకుండా, ప్రమేయం లేకుండా బలై పోయే ఆల్కహాలిక్ ల పిల్లల గురించి రాయాలని సంకల్పం ఆ సమయంలో ఏర్పడింది. దాని ఫలితమే ఈ పుస్తకం, బుజ్జి అనే మరొక బొమ్మల పుస్తకం.
ప్రశ్న 2: ఈ పుస్తక రచన కోసం ఎలాంటి పరిశోధన చేశారు?
జ: పరిశోధన అనలేను కానీ, చాలా విస్తృతమైన సమాచారం పోగు చేసుకున్నాను. ఆల్కహాలిక్ సమూహాల కోసం నడిపే స్వచ్చంద సంస్థ ‘ఏఏ’ (ఆల్కహాలిక్స్ ఎనానిమస్) లో పిల్లల విభాగం ఉంటుంది. దాన్ని ఆల్- అటీన్ అంటారు. ఆల్కహాలిక్ ల భార్యల కోసం కూడా ఆల్-ఎనాన్ అని ఉంటుంది. ఇక్కడ తమ వ్యక్తిగత సమస్యలను నిస్సంకోచంగా, బహిరంగంగా చర్చించుకుని ఓదార్పు పొందుతారు. సమస్యను ఎదుర్కొని విజయం సాధించవచ్చనే ఆశను, అందుకు తగిన విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఈ సమావేశాలు నా అవగాహనకు, నేను చదివిన పుస్తకాలు నా రచనకు ఎంతగానో ఉపకరించాయి.
తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, మద్యపానపరుల పిల్లలు తాము కూడా మద్యపానపరులుగా మారడం ఖాయం. ఈ భయంకర వాస్తవమే నన్ను పిల్లల కోణం నుంచి ఆలోచించేలా చేసింది. ఎందరో పిల్లలు ఈ పుస్తకాన్ని వాడుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. అందరికీ అందుబాటులో సమాచారం ఉండాలనే ఈ ప్రయత్నం. ఈ పుస్తకాలలో ఏఏ సమావేశాల చిరునామాలు మొదలైనవి వివరంగా పొందుపరచాను.
ప్రశ్న 3: ఈ పుస్తకానికి ఎలాంటి ఆదరణ లభించింది? పుస్తకంలో సమాచారాన్ని ఆసక్తికరంగా అందరికీ అందుబాటులో వుండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
జ: వార్తాపత్రికలు ఎంతో మంచి సమీక్షలు రాశాయి. ఎన్నో కుటుంబాలు తమ సమస్యలు చర్చించటానికి ముందుకు వచ్చాయి. ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో, గ్రంథాలయాల్లో ఉచితంగా వితరణ చెయ్యటం జరిగింది. 5000 పుస్తకాలు, మూడు సార్లు ప్రచురణకు నోచుకున్నాయి. మొదటిసారి ప్రచురించినప్పుడు IGNOU తమ విశ్వవిద్యాలయం పేరు ఈ పుస్తకానికి జోడించింది. రెండేళ్ల క్రితం తమిళం, హిందీ, కన్నడ భాషలలో అనువదించి ప్రచురించటం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు, గ్రంథాలయాలకు పంపిణీ చేసింది. ఇదంతా ఇతోధిక సేవ. డబ్బు ప్రసక్తి లేదు.
పుస్తకంలో కీర్తిశేషులు శ్రీ బాలిగారు ప్రతి అధ్యాయానికి బొమ్మలు వేశారు. బొమ్మలు అక్షరాలకు జీవం పోస్తాయి కదా. పుస్తకంలో వ్యాసాల లాగా కాకుండా వ్యక్తిగత కథనంగా సమస్యలను చర్చించటం వల్ల పుస్తకం చదవటానికి ఆసక్తికరంగా అనిపించి ఉండవచ్చు.
ఆవిష్కరణ పుస్తకం కన్నడ అనువాదాన్ని ఆవిష్కరించిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ యడ్యూరప్ప
ప్రశ్న 4: మీకు వ్యక్తిగతంగా ఎవరయినా ఆల్కహాలిక్స్తో పరిచయం వుందా? మీ అభిప్రాయం ప్రకారం మనుషులు ఎందుకని ఆల్కహాలిక్స్గా మారతారు? వారిని ఈ దురలవాటు నుంచి తప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి కుటుంబ సభ్యులు?
జ: చాలా మంది తెలుసు, స్నేహవర్గాలలోనే ఎందరో తెలుసు. సరదాగా మొదలైనది త్వరితంగా ఒక అలవాటుగా, తరువాత ఒక అవసరంగా మారుతుంది. మలేరియా రాకూడదంటే దోమల నుండి దూరంగా ఉండాలి. ఇదైనా, ఏ దురలవాటైనా మహావృక్షంగా మారకముందే మేలుకోవాలి. సాధ్యమైనంత వరకు అటువంటి తాగే అవకాశం, పరిస్థితుల నుండి దూరంగా ఉండటమే ఉత్తమం. అయితే ఇది ఎవరికీ వాళ్ళు వ్యక్తిగత ప్రణాళిక వేసుకుని తీనుకునే జాగ్రత్త మీద ఆధారపడి ఉంటుంది. చెప్పినంత, అనుకున్నంత సులభం కాదు. ఎంతో సంకల్పబలం, సంయమనం కావాలి.
తాగుడు మానాలనుకునే వాళ్ళు ఏఏ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావటమే సర్వోత్తమ మార్గం. ఈ సమావేశాలు అన్ని ఊళ్ళల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నిర్వహిస్తారు. ఆ సమావేశాలకు ఎటువంటి రుసుము చెల్లించనక్కరలేదు. అక్కడ పేరు చెప్పవలసిన అవసరం కూడా లేదు. పూర్తి గోప్యత పాటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇది మంచి ఫలితాన్నిచ్చే మార్గం, వైద్యులు కూడా ఆమోదించిన మార్గం ఇది. ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిన వాళ్ళు ఆసుపత్రిలో చేరక తప్పదు. గూగుల్ వెదికితే అన్ని ఊళ్లలో ఏఏ (AA) సమావేశాల చిరునామాలు, ఫోన్ నంబర్లు దొరుకుతాయి.
మీరు సంచిక లో ఈ సమావేశాల వివరాలు పెడితే సహాయకారిగా ఉంటుందేమో ఆలోచించగలరు.
ప్రశ్న 5: నా హాలీవుడ్ డైరీ రచనకు ప్రేరణ ఏమిటి?
జ: ఆ గొప్ప చిత్రాలే, వాటిని చూడటమే ప్రేరణ.
ప్రశ్న 6: ఇందుకు సినిమాలను ఎంచుకోవటంలో ఎలాంటి ప్రామాణికాలు పాటించారు?
జ: ఆంగ్ల చిత్రాలలో ఉత్తమమైనవి, మొదటి వరుసలో ఉన్నవాటిని ఎన్నుకుని, వాటిని చూచి, మళ్ళీ చూచి, వాటి వివరాలు చదివి, తెలుసుకుని రాశాను.
ప్రశ్న 7: మీ దృష్టిలో ఉత్తమ సినిమా లక్షణాలేమిటి?
జ: కాలాతీతమైనవి, ఎప్పటికీ నిలిచిపోయే విలువ కలిగినవి, అన్ని కాలాలకు ప్రాసంగికమైనవి ఉత్తమ చిత్రాలు.
ప్రశ్న 8: మీరు ప్రతి వ్యాసాన్ని భిన్నంగా ఆసక్తికరంగా రూపొందించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
జ: నిజానికి అలాంటి ప్రణాళిక వేసుకోలేదు. ఏదో రాసుకుంటూ, రాసినదాన్ని దిద్దుకుంటూ పుస్తకరచన కొనసాగింది.
ప్రశ్న9: మీరు ఈ పుస్తకంలో యాభై అయిదు సినిమాలను పరిచయం చేశారు. వీటిలో కొన్ని క్లాసిక్స్ గా గుర్తింపు పొందాయి. కొన్ని సినిమాలు ది హైరెస్, టీచెర్స్ పెట్, లేడీ ఫర్ ఎ డే వంటి సినిమాలు అంతగా తెలియవు. ఇలాంటి అంతగా తెలియని సినిమాలను ఎంపిక చేయటంలో కాస్త వెరపు ఏమైనా కలిగిందా? ఈ వ్యాసాల రచనలో ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా?
జ: ఒక చిత్రంగా, అపురూపమైన కథాంశంగా ఆసక్తి కలిగించిన చిత్రాలనే నేను ఎన్నుకున్నాను. మీరు గమనిస్తే అన్నీ ప్రత్యేకమైన చిత్రాలే. విభిన్నమైనవే. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినవే.
హాలీవుడ్ డైరీ పుస్తకం త్రివిక్రమ్ గారికి అందిస్తూ తనికెళ్ల భరణి గారు
ప్రశ్న 10: మీరు పరిచయం చేసిన సినిమాల్లో కొన్ని తరువాత కాలంలో రిమేక్ అయ్యాయి. కేప్ ఫియర్, విల్లివాన్కా అండ్ ది చాకొలేట్ ఫాక్టరీ వంటివి.. పాత సినిమాలతో పోలిస్తే రిమేడ్ సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: కొత్త కేప్ ఫియర్ చాలా బాగుంది. పాత చిత్రంలోని నటులు ఈ కొత్త చిత్రంలో వేరే పాత్రలలో కనిపించటం చాల బాగుంది. కొత్తది మార్టిన్ స్కార్సెసీ దర్శకత్వంలో అద్భుతంగా ఉన్నది. అయితే పాత బ్లాక్ అండ్ వయిట్ చిత్రంలో ఉన్న భయపెట్టే గుణం కొత్తదానిలో అంతగా లేదు. విల్లీ వాంకా కొత్త చిత్రం నాకు నచ్చలేదు.
ప్రశ్న11: మీరు పరిచయం చేసిన సినిమాల్లో మీకు వ్యక్తిగతంగా అన్నిటికన్నా గొప్పగా నచ్చిన సినిమా ఏమిటి? ఎందుకు?
జ: అన్నీ ఎంతో నచ్చినవే. ఏవి చెప్పను, ఏవి మానను? సిటిజన్ కేన్, ది కిడ్, టు కిల్ ఎ మాకింగ్ బర్డ్, కేప్ ఫియర్, డ్రీమ్ వైఫ్, టీచర్స్ పెట్..
ప్రశ్న12. ఏ సినిమా పరిచయానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు?
జ: కష్టమంటూ ఏమీ పడలేదు. ఇష్టం ఉన్నచోట కష్టం ఉండదు. సైకో గురించి రాయటానికి చాలా సమయం పట్టింది. బెన్ హర్ కూడా.
హాలీవుడ్ డైరీ పుస్తకం విశ్వనాథ్ గారికి అందిస్తూ తనికెళ్ల భరణి గారు
ప్రశ్న13. ఇంకా ఏవైనా సినిమాలు పరిచయం చేయలేదన్న లోటు వుందా?
జ: ఉన్నదండి. కానీ ఇప్పుడు చాలామంది నాకంటే ఎంతో బాగా రాస్తున్నారు. అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. రెండవ భాగం ఇంకొక రకంగా తీసుకువస్తానేమో.
ప్రశ్న14. వేదాంత దేశికుల గురించి పుస్తకం రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
జ: చాలా కాలం క్రితం హంస సందేశం గురించి చదివినప్పుడు ఆ మహానుభావుడి గురించి సవివరంగా ఒక పుస్తకం తీసుకువస్తే బాగుండు అనే సంకల్పం కలిగింది.
ప్రశ్న15. మీకు విశిష్టాద్వైతంతో పరిచయాన్ని వివరిస్తారా?
జ: వేదాంత దేశికులు మా ఆచార్యులు. మేము శ్రీవైష్ణవులం కావటం చేత సహజంగానే ఆ అంశం మీద శ్రద్ధ కలిగింది. ఫలితంగా తిరుప్పావై, వారణం ఆయిరం, గోదాదేవి, ఆమె జీవితం, సాహిత్యం, ముకుందమాల, శ్రీమన్నారాయణీయం (నృసింహావతారము) వ్యాఖ్యానాలు, వేదాంత దేశికుల హంస సందేశం వ్యాఖ్య కూర్చటం జరిగింది.
ప్రశ్న16. ఈ పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకూ ఎంతో శ్రద్ధతో, పవిత్రంగా తీర్చిదిద్దారు. ఇందుకు మీరు పడ్డ శ్రమ, తీసుకున్న జాగ్రత్తలు, అందుకున్న సలహాలూ, సూచనల గురించి తెలియచేస్తారా?
జ: ధన్యవాదాలు. వేదాంత దేశికులు అనే గ్రంథం ఇవాళ నేను ప్రయత్నించినా రాయలేను. ఆ పుస్తక రచన సమయంలో ఎన్నెన్నో అనుభవాలు అయినాయి. అదొక దివ్యప్రేరణ. అదొక్కటే చెప్పగలను.
ప్రశ్న17. వేదాంత దేశికుల జీవితం గురించి తెలుసుకునేందుకు చేసిన పరిశోధన వివరాలు చెప్తారా?
జ: ఆయన జీవితం గురించి సాహిత్యం గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. ప్రామాణికమైన పుస్తకాలు. సత్యవ్రత సింగ్ గారి పుస్తకం నుండి ఎంతో సమాచారం లభించింది. ముఖ్యంగా మా గురువుగారు కీర్తిశేషులు శ్రీమాన్ మద్రాస్ శ్రీనివాసన్ గారు శ్రద్ధగా మార్గదర్శనం చేశారు.
ప్రశ్న19. మీరు ఈ పుస్తకంలో వేదాంత దేశికుల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించారు. మీ పుస్తకం చదువుతూంటే, వారు తమ సిద్ధాంత ప్రచారంలో, సిధ్దాంతానికి ఒక పటిష్టమైన భూమికను అందించటంలో విశిష్టమైన పాత్రను పోషించారని సమర్ధవంతంగా ఈ పుస్తకంలో నిరూపించారు. ఆయన వ్యక్తిత్త్వం గురించి పాఠకులకు వివరిస్తారా?
జ: ఆ సమయం తురుష్కులు ఆలయాలను ధ్వంసం చేస్తున్న విపత్కర సమయం. సరైన అవగాహన లేని పండితులు అపసిద్ధాంతాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న సమయం. శ్రీవైష్ణవానికి దేశికుల సేవ, విశిష్టాద్వైత ప్రచారానికి వారు పీఠాధిపతిగా చేసిన సేవ ఎంతో గొప్పవి. వారు వినమ్రంగా చూపించింది భగవానుడిని చేరే మార్గం. కీర్తి కండూతి, ధనాపేక్ష లేని మహానుభావుడు. రాజాశ్రయాన్ని లెక్క చెయ్యక, తిరస్కరించి వైరాగ్య పంచకం లోకానికి ప్రసాదించారు. శ్రీ వేంకటేశ్వరుని ఘంటావతారంగా ప్రసిద్ధులు. వారి గౌరవార్థం తిరుమలలో శ్రీ వారి సన్నిధిలో ఘంట ఉండదు. ఇంకా చెప్పటం సూర్యునికి దివిటీ చూపటం లాంటిది.
ప్రశ్న20. అనుకున్నప్పటినుంచి ఎంత కాలం పట్టిందీ పుస్తక రచన పూర్తి చేసేందుకు?
జ: ఏడాది.
ప్రశ్న21. వ్యయాన్ని పట్టించుకోకుండా పుస్తకాన్ని భక్తి శ్రధ్దలతో అత్యుత్తమ ప్రామాణికాలతో ఉత్తమంగా తీర్చి దిద్దారు. ప్రచురణలో మీ అనుభవాలు చెప్పండి.
జ: నా పుస్తకాలన్నీ నా కోసమే అన్నట్లు ఉంటాయి. అదొక వెఱ్ఱి అంతే. ఖర్చు పెట్టిన డబ్బు రావాలని అనుకుంటే పుస్తకాల విషయంలో రాజీ పడవలసి వస్తుంది.
ప్రశ్న22. పేజ్ మేకప్ అద్భుతంగా ఉంది. బొమ్మలు అసాధారణంగా వున్నాయి. ఈ బొమ్మల సేకరణ, పేజ్ మేక్ అప్ గురించి చెప్పండి?
జ: ధన్యవాదాలు. పేజ్ డిజైన్, బొమ్మల కోసమే ఎక్కువ సమయం, శ్రమ వెచ్చించవలసి ఉంటుంది. ఆ పుస్తకం ఉనికి పొందటం ఒక దైవికమైన ప్రేరణ, అనుభవం అని చెప్పగలను.
ప్రశ్న23. ఈ పుస్తకానికి ఆదరణ ఎలా వుంది?
జ: 2017 లో ప్రచురించిన పుస్తకానికి ఇప్పుడు ఆదరణ లభిస్తున్నది. బ్రహ్మాండమైన అమ్మకాలు ఎప్పుడూ లేవు, కానీ ఇప్పటికీ అడపాదడపా అమ్ముడు పోతూనే ఉన్నాయి.
ప్రశ్న24. మీ రచనా జీవితం గురించి చెప్తారా?
జ: నేనొక సాధారణ గృహిణిని. సమయం ఉన్నప్పుడు ఏవైనా రాస్తాను. గొప్ప సాహిత్యాన్ని సృష్టించలేదు. ఉపయోగకరమైన జీవితం గడపటమే నా ఉద్దేశం. అంతకు మించి కోరికలు లేవు.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీదేవి మురళీధర్ గారు.
శ్రీదేవి మురళీధర్: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.
***
ఆవిష్కరణ – ఆల్కహాలిక్ల పిల్లలు- ఒక అవగాహన
పేజీలు: 67
వెల: అమూల్యం
~
నా హాలీవుడ్ డైరీ
పేజీలు: 364
వెల: ₹ 550/-
~
వేదాంత దేశికులు
పేజీలు: 311
వెల: అమూల్యం
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
శ్రీదేవీ మురళీధర్ గారి ‘ఆవిష్కరణ, నా హాలీవుడ్ డైరీ, వేదాంత దేశికులు’ అనే మూడు పుస్తకాల సమీక్ష
https://sanchika.com/shridevi-muralidhar-moodu-vibhinnamaina-pustakalu-book-review/