Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ గురుభ్యోనమః

గురుబ్రహ్మః గురువిష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః

ఈ శ్లోకం మనకి గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. గురువును సాక్షాత్తు త్రిమూర్తులతో సమానంగా పోల్చడం జరిగింది. మనిషిలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించే వాడు గురువు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుకు ఇవ్వడం జరిగింది. ఉన్నతమైన ఆశయము, లక్ష్యము కల గురువు స్వార్థరహితమైన, నిష్పాక్షమైన శిక్షణతో వ్యక్తిని మహోన్నతునిగా తయారు చేయగలడు. ఆనాటి కృతయుగం నుండి నేటి వరకు ఎంతో మంది గురువరేణ్యులు ఎంతో మంది శిష్య పరమాణువులను ఉన్నతులుగా తయారు చేశారు. త్రేతాయుగంలో రామలక్ష్మణులు కులగురువైన వశిష్ఠుల వారి వద్ద ఎంతో వినయ, విధేయతలతో అన్ని రకాల విద్యలు అభ్యసించారు. అంతేగాక యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుని వెంట అరణ్యానికి వెళ్ళి అక్కడ వనవాసానికి కావలసిన బల, అతిబల విద్యలను నేర్చుకున్నట్లుగా రామాయణం మనకు తెలియజేస్తుంది. ద్వాపర యుగంలో విశ్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడితో కలసి సాందీపుని  వద్ద శిష్యరికం చేశారు. అంతటి పరమాత్మ సైతం సామాన్య శిష్యునిలా అడవులలో కందమూలాలు సేకరిస్తూ, గురువుకు శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం కొనసాగించాడు. కౌరవులు, పాండవులు సైతం ద్రోణాచార్యుని శిష్యరికంలో సకల విద్యలు అభ్యసించారు.

ఆ కాలంలోని మరో శిష్య చూడామణి ఏకలవ్యుడు. తనను శిష్యునిగా ద్రోణాచార్యుడు తిరస్కరించడంతో, గురువు స్థానంలో ఆయన ప్రతిమను ఉంచి తానే విద్య నేర్చుకుని, గురుదక్షిణగా బొటన వ్రేలు ఇచ్చి గురు భక్తిని చాటాడు.

పూర్వకాలంలో వేదధర్ముడనే ఋషి వద్ద అనేక మంది శిష్యులు ఉండేవారు. వారిని పరీక్షించాలనే ఉద్దేశంతో వేదధర్ముడు తను చేసిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం కుష్టు రోగిగా మారి కాశీలో ఉంటాననీ, తనకు సేవ చేయగల వారెవరైనా తనతో రావచ్చనీ శిష్యులతో చెప్పాడు. సేవాభంగం జరిగితే గురువుగారికి కోపం వస్తుందని ఇందుకు ఎవరూ సాహసించలేదు. కానీ వారిలో దీపకుడు మాత్రం తాను గురు సేవకు సిద్ధంగా ఉన్నానంటు ముందుకొస్తాడు. వేదధర్మడితో కలిసి కాశీకి చేరుకుని అక్కడ తన శుశ్రూషతో గురువును మెప్పించాడు. అతని గురుభక్తికి త్రిమూర్తులు ప్రత్యక్షమై గురు, శిష్యులిద్దరికీ మోక్షాన్ని ప్రసాదించారు.

అష్టాదశ పురాణాలు, వేదములు, ఉపనిషత్తులు రచించి సృష్టిలోని సమస్త జ్ఞానాన్ని మనకందించిన మన మొట్టమొదటి గురువు వ్యాస భగవానుడు. వీటి ద్వారానే మనం భగవంతుని లీలలను, అవతార విశేషాలను కొంత వరకైన తెలుసుకొనగలుగుతున్నాం. కురుక్షేత్రంలో అర్జునుడికి గీతోపదేశం చేసి కార్యోన్ముఖుడిని చేసిన శ్రీకృష్ణుడు లోకానికే గురువు. “ప్రాణులన్నీ జన్మించుటకు పూర్వం ఇంద్రియ అగోచరములు. మరణించిన తర్వాత అగోచరములే. కనుక వీటి గురించి దుఃఖించుట ఎందుకు? స్వధర్మ కర్తవ్యమే నీ కర్తవ్యం” అంటూ యోగశాస్త్రము ద్వారా లోకానికి, ఆత్మనిర్దేశనం చేసిన పరమాత్మ జగద్గురువు. అద్వైత సిద్ధాంతం ప్రకారం నిత్యసత్యమైనది ఒక్కటే. అదే పరబ్రహ్మ. అదే ఆత్మ. ఆ ఆత్మయే తల్లిగా, తండ్రిగా, శిశువుగా అనేక రూపాలలో దర్శనమిస్తుంది. అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన జగద్గురువు ఆది శంకరాచార్యులు. శంకరులు గురువు గోవింద భగత్పాదులు వీరికి మహాకావ్యాలైన ఉపనిషత్తుల సారాన్ని బోధించారు. అందువల్లనే శంకరులు ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు, భగవద్గీతకు భాష్యం రాశారు. భజగోవిందం శ్లోకాల ద్వారా అద్వైతాన్ని వివరించారు. జీవితం అశాశ్వతమనీ, దురాశ, అహంకారం విడిచి పెట్టాలనీ, ప్రాపంచిక సుఖాలను పరిత్యజించాలని అద్వైతం ద్వారా ప్రచారం చేసిన జగద్గురువు ఆది శంకరాచార్యులు.

ఇతిహాసకాలంలో ధౌమ్యమహర్షి వద్ద  ఆరణి, పైలుడు, ఉపమన్యువు అనే శిష్యులు ఉండేవారు. వీరు ప్రాణాలకు సైతం తెగించి గురువు ఆజ్ఞను శిరసావహించేవారు. చివరకు ధౌమ్యులవారి మెప్పు సాధించి గృహస్థాశ్రమం స్వీకరించి లోక ప్రశస్థులైనారు. అలాగే మన చరిత్రలో ఛత్రపతిగా పేరొందిన శివాజీకి, తన గురువు సమర్థ రామదాసు, యుద్ధవిద్యలే కాకుండా హిందూధర్మ పరిరక్షణకు కావలసిన నియమాలు కూడా నేర్పాడు. అందుకే శివాజీ చరిత్రలో మరపురాని చక్రవర్తిగా నిలిచిపోయాడు. విజయనగర సామ్రాజాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవారాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రసిద్ధిచెందాడంటే అందుకు కారణం ఆయన గురువు తిమ్మరుసు. తిమ్మరుసును మంత్రిగానే కాకుండా గురువుగా భావించి ఆయన సలహాతో రాజ్యాపాలన కొనసాగించేవాడు. తొలి తెలుగు మహారాణి రుద్రమకు కత్తిసాము గుర్రపస్వారీ నేర్పించి ఆమెను ధైర్యసాహాసాలకు మారు పేరుగ నిల్పిన ఆమె గురువు మహామంత్రి శివదేవయ్య.

ఇలా వ్యక్తిలోని సద్గుణాలను వెలికితీసి సత్పరుషునిగా తీర్చిదిద్దే గురువులు చరిత్రలో ఎందరెందరో. చరిత్రలో గురు, శిష్య సంబంధం ఇలా చెప్పుకుంటుపోతే అపూర్వంగా అనిర్వచనీయంగా మనకు కనిపిస్తుంది.

‘గురుని శిక్షలేక గుఱుతెట్లుగల్గున్
అజునకైన వాని అబ్బకైన’

అంటూ గురువు యొక్క గొప్పతనాన్ని ప్రజాకవి వేమన తన పద్యములో వర్ణించాడు.

విద్య వ్యాపారంగా మారిన నేటి కాలంలో గురుశిష్యుల మధ్య ఎలాంటి గౌరవాభిమానాలు లేవు. కేవలం పుస్తకం లోని పాఠాలను వివరించే వ్యక్తిగానే గురువు విద్యార్థులకు తెలుసు. కానీ, నేటి కాలంలోనూ తమ జ్ఞానసంపదనంతా విద్యార్థులకు ధారపోయాలనే సంకల్పం గల గురువులు ఉన్నారు. అలాంటి గురువులకు వందనాలర్పిద్దాం. గురుదేవోభవ.

Exit mobile version