Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-21

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ద్వితీయాశ్వాసము:

298.
చం.:
నముచి పులోమ విప్రజితనాములు యాతని ఆంతరంగికుల్
సముచిత గౌరవంబున శంఖసుకర్ణులు యేగుదెంచి, తా
మమిత ముదంబునన్ దనుజవల్లభుతో నిటు పల్కిరా ఘనుల్
సుమహిత ఘోర దివ్య తప శోభితు జూచి ప్రశంస చేయుచున్

299.
సీ.:
నీదైన తేజంబు నిఖిల దానవ కోటి
తల ఎత్తుకొనుచును నిలువ జేసె
అప్రతిమానమౌ యనఘ తపస్ఫూర్తి
దైత్యవంశమ్మది ధన్యమాయె
మన మీద నిరతంబు మత్సరగ్రస్థులై
సురలెల్ల క్షీణించి శోభ బాసి
నీ పరాక్రమ వహ్ని నిచ్చలు దలపోసి
సకల లోకంబుల శాంతి దూలె
తే.గీ.:
యజ్ఞముల వారు పొందిన యన్నములను
గుడిచి క్రొవ్వెక్కి యుండిరి; కోమలులగు
దేవకాంతల నాట్యంబు తీయనైన
యమృత పానము మదమును అతిశయింప

300.
వచనము:
బ్రహ్మదేవ కరుణాలబ్ధ అప్రతిహత ప్రభావా! దైత్యప్రభూ! ఇక నా సురేంద్రుండు..

301.
కం.:
శ్రీహరి తమ రక్షణలో
అహరహమును నుండు, బ్రహ్మ, అభవుడు శివుడున్
అహితుల దైత్యుల గావరు
మహి స్వర్గము మాదె యనును బలగర్వమునన్

302.
సుగంధి:
ఏలుమింక దైత్యనాథ ఎల్ల లోకముల్ నినున్
పోలలేరు ఎవ్వరైన పూని బ్రహ్మదేవునిన్
శీల నిష్ఠ తృప్తు చేసి శ్రేష్ఠమౌ యభీష్టముల్
చాల పొంది నిల్చినావు సర్వశక్తిరూపమై

303.
ఉ.:
మేమిక సిద్ధమీవు మము ప్రేరణ చేసి విధుల్ వచింపుమా
నేమము మీరి తాపసుల నిర్జరవ్రాతమునెల్ల, శిష్టులన్
భీమ పరాక్రమంబునను భీతుల జేయుదు మాజ్ఞ చేయుమా!
నీ మది బొంగ లోకముల మేలది క్రుంగ, మహా తపోధనా!

304.
వచనము:
వారి మాటలు వినిన హిరణ్యకశిపుండు మిక్కిలి సంతసించి వారి కర్తవ్యదీక్షను ప్రశంసించి, అసుర గురుండైన శుక్రాచార్యుని అచటికి సగౌరవంబుగ రప్పించి, అతనితో నిట్లు పలికె.

305.
కం:
సురగురు సత్తమ! మీదగు
వర యాదేశంబు తోడ పటుతర తపమున్
సరసిజనాభుని కరుణను
వరముల నొందితిని, లేదు మరణము నాకున్

306.
తే.గీ.:
అనుచు గురువర్యు పాదముల్ వినయ మొప్ప
మ్రొక్కె దైత్యాధినాథుండు మోదమునను
అసుర గురుడును యాశీస్సులందజేసె
చిర యశస్సును సాధించి వరలు మనుచు

307.
మ.:
వర రత్నంబులు ముత్యముల్ మణులునున్ మాణిక్యముల్ తాపగా
సిరులన్ శోభిలు దివ్య భవ్య ఘనమౌ సింహాసనారూఢుడై
సురగంగాది సమస్త తీర్థములతో సుస్నాతుడై శుద్ధుడై
పురమెల్లన్ పణవాది కాహళధ్వనుల్ మోగించ మించెన్ కడున్

308.
తే.గీ.:
అసురవీరుల జయజయ ధ్వానములను
దిక్కులన్నియు నప్పుడు పిక్కటిల్లె
అష్టదిక్పాలులందరు నమిత భయము
నంది క్రుంగిరి తమ తమ డెందములను

309.
తే.గీ.:
దానవేశ్వరు డౌదల దాల్చు గొడుగు
దివ్య శశి కాంతిపుంజము ధిక్కరించె
సూర్యమండలమును పోలి, సురల సతుల
కలువ కన్నులు వాడగ వెలిగె ఛత్రి

310.
వచనము:
ఆ హిరణ్యకశిప ప్రభుని అవక్ర పరాక్రమము సమస్త ప్రకృతిని ప్రభావితము చేసి, అతలాకుతలము గావింపసాగె.

311.
ఉ.:
చిచ్చును బోలె దిక్కులను చేరుచు నుల్కలు భీతి గూర్పగన్
పెచ్చగు నుద్ధతిన్ యవని భీకర కంపములొంద, సూర్యుడున్
అచ్చెరువంది వాడ, ఘనసంద్రము ఘోష యొనర్చ, శైలముల్
విచ్చెను, వేడిగాలులవి వీచెను క్రమ్మెను చిమ్మచీకటుల్

312.
దత్తగీతి:
దేవతలు భీతిగొని దీనముగ చూడన్
ఏ వెతలు లేవనుచు దైత్యులటు పొంగన్
కావలయు యుద్ధమని, గౌరవము పొందన్
రావలె హిరణ్యుని సురాజ్యమని యసురుల్

313.
కవిరాజ విరాజితము:
చనె దితిపుత్రుడు సర్వసుఖంబుల సంచిత ధామము సాయుధమున్
ఘన వరనామము కామిత భోగమఖండ మహాపురి కాయుతుడై
మణిమయ రాజిత మంజుల సౌధమ మాత్య చమూపతు లందరి తోన్
అనితరసాధ్యుడటంచును దైత్యులు, ఆతని మెచ్చగ రత్నపురిన్
~

లఘువ్యాఖ్య:

పద్యం 298లో హిరణ్యకశిపుని ఆంతరంగికులు, సైన్యాధిపతులు, ఆయనను స్వాగతించి, తమ ఏలిక ఘోర తపస్సును ప్రశంసిస్తారు. పద్యం 299లో తమ రాక్షసవంశము అతని వల్ల ధన్యమైనదని అంటారు. దీనితో దేవతల కొవ్వు అణగుతుందని అంటారు. పద్యం 301, 302 లో కూడ అదే ప్రశంస కొనసాగుతుంది. పద్యం 303లో తమకు ఆదేశమిస్తే, తాపసులను, శిష్టులను భయభ్రాంతులను చేస్తామంటారు. పద్యం 304లో రాక్షసపతి, తమ గురువైన శుక్రాచార్యుని రప్పించి, పద్యం 305లో అతని పాదములకు సవినయముగా నమస్కరిస్తాడు.

పద్యం 306 నుంచి రాక్షసేంద్రుని వైభవమును కవి వర్ణిస్తున్నారు. అతని దివ్య సింహసనం, పుణ్యతీర్థ స్నానం, అసురవీరుల జయజయ ధ్వానాలతో, దిక్కులు పిక్కటిల్లగా, ఆ దిక్పాలకులు భయముతో క్రుంగారట. పద్యం 309లో సూర్యమండలమును బోలిన ఆయన ఛత్రం ప్రకాశించగ, దేవతల భార్యల కలువ కన్నులు వాడగ, శోభించాడు. పద్యం 309లో విరోధాభాసాలంకారం ఉంది. పద్యం 311లో రాక్షసనాథుని పరాక్రమం వల్ల భూమి కంపించింది, సూర్యుడు వన్నె తగ్గాడు, సముద్రాలు ఘోషించాయి, పర్వతాలు పగిలాయి. పద్యం 312 లో కూడా ‘విరోధాభాసము’ ఉన్నది. దేవతలు దీనంగా చూస్తున్నారట. ఏ వెతలూ లేవని రాక్షసులు పొంగిపోతున్నారట.

పద్యం 313లో హిరణ్యకశిపుడు రత్నపురి అనే దివ్య పట్టణము లోనికి ప్రవేశిస్తాడు. దానిలో మంజుల సౌధాలున్నాయి. అన్ని సుఖాలకు అది ఆలవాలము, సాయుధ సంపన్నము అని చెప్తారు కవి.

(సశేషం)

Exit mobile version