[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
తృతీయాశ్వాసము:
369.
కం.:
మధుకైటభులను ద్రుంచిన
విధముకు ననువైన తొడలు వివరించెను తా
మధముడు హేమకశిపునట
వధియింపగ బోవు తీరు బ్రకటితమగుచున్
370.
సీ.:
నాభికమలము నందు నవ్యకేసర రాశి
మొలత్రాడు రత్నముల్ చెలువమలర
కల్పాంతమున వచ్చు ఘన భువనమ్ములు
చెన్నొందు కౌను కృశింపజేయ
తనరు కౌస్తుభమున తన ప్రతిబింబము
గని లచ్చి వేరొక్క కాంత సవిని
చెంది ఆందోళించు డెందమ్మునన్ తన
సౌందర్యమొకపరి అరసి చూడ
తే.గీ.:
తులసిపేరుల సౌరులు వెలయు భుజము
అధిక శ్యామాయమానమై అలరు తనువు
సిరి కుచంబుల రాపిడి చేతకంది
లలిత శ్రీవత్సలాంఛను డతిశయించె.
371.
ఉ.:
నాలుగు జీవజాతుల సమంచిత స్పష్టిని జేయు హస్తముల్
నాలుగు వేద ధర్మముల మార్గము సుస్థిరమైన హేతువుల్
నాలుగు మోములున్న నజునాదర లాలన జేయు రాగముల్
నాలుగు చేతులన్ కమలనాభుడు వెల్గె వికుంఠవాసుడై
372.
సీ.:
మాణిక్యకాంతులన్ మహనీయముగ వెల్లు
అంగుళీయకములు అలరు చేయి
నలువ పుట్టినదైన జలరుహస్థానంబు
సూర్యచంద్రుల వెల్గు చూపు చేయి
పాంచజన్యము తోడ పటు సుదర్శన హేల
కౌమోదకీ నందకముల చేయి
కరకలిత శంఖమ్ము కమనీయ సిత కాంతి
చెలువము చూపెడు సిరుల చేయి
తే.గీ.:
మౌని వర్యుల వినుతుల, పరమయోగి
వరుల జోతల కాధారమైన చేయి
నిఖిల లోకాశ్రయం బౌచు మించు చేయి
వేదవేద్యుడు నరసింహు, విష్ణు చేయి
373.
కం.
ఆధారుడు పుణ్యములకు
బాధలకును విరుగుడతడు భవనాశనుడున్
సాధనము మోక్షమునకును
శ్రీధరుడే, హరియె, శౌరి, శ్రేయస్కరుడున్
374.
సీ.:
నీలవర్ణము తోడ వెలుగుచుండును గాని
దరహాసమున తెల్పు దనరువాడు
శ్రీసతి భార్యయై సిరులిచ్చు, ఐనను
పక్షివాహనమెక్కి పరగువాడు
నిర్గుణుండైనను నిఖిల యోగుల ప్రాపు
జన్మరహితమైన జనుల కాపు
పర్వతంబుల నెత్తు ప్రావీణ్యమున్నను
భూమిని భరియించు పురుషవరుడు
తే.గీ.:
సకల వేదార్థ సారుడు శాశ్వతుండు
మునులకభిగమ్య స్థానము మోక్షదాయి
యనఘు శ్రీహరి గని సురలమిత భక్తి
స్తోత్రముల జేసిరివ్విధి సూర్యతేజు
375.
చం:
అనితరసాధ్య! మాధవ! మహామహిమాన్విత సుప్రభావ! జీ
వనకర! విశ్వరక్షణ! నివారిత ఘోరయఘాళి! కేశవా!
దినకర చంద్ర నేత్ర! వర దీపిత తామర సేక్షణా! హరీ!
ఘనతర దివ్య భవ్య శుభ కారణ! మోహవిదారణా! ప్రభూ!
376.
మ.కో.:
ముక్తిసాధన! ధర్మరక్షణ! మోహనాంగ! దయామయా!
శక్తిహీనుల మమ్ము బ్రోవుము, సర్వదైత్యవినాశకా!
భక్తితో నిను గొల్వ, దుఃఖము బాయు, శ్రీపతి! భూపతీ!
భక్త పోషణ! పాపభంజన! ప్రాపు నీవె జనార్దనా!
377.
తరళము:
జననమొందె విధాత నాభిని సర్వసృష్టిని చేయగా
తన సుభావన జీవరాశులు తాము యున్కిని బొందగా
వినుతి చేయగ శక్యమే నిను విశ్వనాథ! దయానిధీ!
గుణగణంబుల నెన్నగా శత కోటి శేషులకైననున్
378.
పంచచామరము:
మహానుభావ! నిన్ను జూడ పారె శోక మెల్లయున్
సహస్ర భాను తేజ! శౌరి! సౌమ్యనాథ! శ్రీహరీ!
సహానుభూతి బొంది గావు సర్వదేవ శ్రేణులన్
మహోగ్రమైన శౌర్య దీప్తి మ్రందజేయు దైత్యులన్
379.
దత్తగీతి:
నీ యశము నీ బలము నీ దయయు చాలున్
మాయలను ద్రుంపగను మమ్ములను గావన్
శ్రీయుత! గదాధర! విశేష ఘనమూర్తీ!
చేయుము శుభంబులను స్నిగ్ధ దరహాసా!
380.
కం.:
నిను సేవించెడు వారలు
ఘనమగు పరమాత్మ యోగ కైవల్యముకై
అనితర భక్తియు సహనము
పెనగొని నిను చేరు పథము వీడరు ఎప్పుడున్
381.
తే.గీ.:
నదులు సాగరమును జేరునట్లు జనులు
పూర్వజన్మ వాసన పోగ ద్రోచి
కర్మయోగముతో నిన్ను కాంతు రనఘ
నీదు పరతత్త్వ భావన యాదరువుగ
382.
కం.:
విద్యలకెల్లను నీవే
ఆద్యుడవో పంకజాక్ష! ఆశ్రితరక్షా!
సద్యోజాతము నీ దయ
అద్యంతము లేని దేవ! ఆత్మస్వరూపా!
383.
ఉ.:
రేగి, మనశ్శరీరగత రేచక కుంభక వాయు బంధముల్
సాగెడునట్లు చేసెడు విశాల విధాన సమాశ్రయా! నినున్
వేగమె జేర, జీవపరమేశ్వర భావమభేదమై చనన్
రాగము ద్వేషమున్ విడిచి, లక్ష్యము నీవుగ దాంతు లౌదురే!
384.
తే.గీ.:
పంచ భూతములు తను జుట్ట బంధములుగ
భ్రమను చరియించు జీవుడు పరమగురుని
నిన్ను జేరెడి మార్గము నెన్ని, సకల
వెతల దొలగించు శివునిగ నుతులు జేయు
~
లఘువ్యాఖ్య:
ఇందులో దేవతలు దర్శించిన శ్రీమహావిష్ణువు దివ్యస్వరూపమును కవి వర్ణించుచున్నారు. పద్యం 369లో స్వామి తొడలు, మధు కైటభ రాక్షసులను ద్రుంచిన విధానానికి అనువుగా, హిరణ్యకశిపుని చంపబోవు తీరు ప్రకటిస్తున్నాయట. దీనిని ‘కావ్యార్థ సూచన’ అంటారు. పద్యం 370 లో స్వామివారి నాభికమలాన్ని, సన్నని నడుమును, వర్ణించారు కవి. కౌస్తుభమణిలో తన ప్రతిబింబమును తానే చూచి, ఇంకో స్త్రీ అనే భ్రమను లక్ష్మి పొందిందట. దీనిని ‘భ్రాంతిమదాలంకారం’ అంటారు. పద్యం 371లో ‘నాలుగు’ అన్న పదమును నాల్గుసార్లు వాడి, వేదాలు, జీవజాతులు, బ్రహ్మ ముఖాలు, చేతులు, వర్ణించారు కవి. పద్యం 372 లో స్వామివారి అభయహస్తాన్ని మనోహరంగా వర్ణించడం జరిగింది. పద్యం 373 లో విరోధాభాసాలంకారాన్ని కవి ఉపయోగించాడు. స్వామి నలుపు, కాని ఆయన చిరునవ్వు కాంతి తెలుపు. భార్య సకల సంపదలనిచ్చు లక్ష్మి, కాని పక్షినెక్కి తిరుగుతాడు, ఇలా. పద్యం 374 లో అందరు దేవతలు విష్ణువును రకరకాలుగా సంబోధిస్తూ ప్రార్థిస్తారు. పద్యం 375 మత్తకోకిలా వృత్తము. చక్కని లయతో కూడి ఉంటుంది. పద్యం 376 తరళము. 377 పంచచామరము. ఇవన్నీ చక్కని ఛందో వైవిధ్యాలు. అన్నింటిలో స్వామివారి మహిమాతిశయ వర్ణనమే. పద్యం 378 ‘దత్తగీతి’. ఇది కవి స్వంతంగా సృష్టించిన ఛందస్సు. పద్యం 383లో స్వామి యోగవిద్యకు ఎలా ఆధారమో చెప్పబడింది. పద్యం 384లో పంచభూతాల బంధాలను భ్రమను వీడి స్వామిని చేరాలని కవి చెపుతున్నారు.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.