Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-30

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

తృతీయాశ్వాసము:

హేమకశిపుడు మధుపాన లోలుడగుట

442.
చం.
భవనపు నగ్రభాగమున భామినులందరి గూడి, మత్తుడై
నవమధు పానరక్తుడయి, నక్తచరాధిపుడెల్ల వేళలన్‌
చవులను ఊర జేసెడు రసంబుల, మద్య విశేషపానముల్‌
అవిరళరీతి జేసె తన యాశ్రితులందరు తృప్తి జెందగాన్‌

443.
ఉ.
హేమపు దొన్నెలందు నతిహేలగ లేమలు తేనెబోలు, నా
కామము వృద్ధి జేయు సుఖగమ్యమునౌ సురనింప, సౌరభం
భామధుపాత్రలందు ద్రవమైన విధంబున నుర్గుతేలగన్‌
మోముల తన్మయత్వము కపోలములన్‌ ప్రసరింప త్రాగుచున్‌

444.
కం.
ఎల్లరు మధువును గ్రోలగ
నుల్లాసము తోడ తానునున్‌ బ్రియురాలున్‌
త్రుళ్లుచు నేకపుపాత్రను
సల్లీలను గ్రోలిరపుడు సరసము చెలగన్‌

445.
సీ.
మధుపాత్రలను వెల్గు, మహిత శశి యప్డు
పరిమళ కర్పూర భంగి దోచె
ఇంద్ర నీలపు పాత్ర నింపు జూపెడు శశి
రాహుగ్రస్తుండైన రకము జూపె
యువతి మధువు పాత్ర నున్న చంద్రుడచట
ఆమె పద్మముఖము ననుకరించె
ఆలేమ మధుపాత్ర నవతరించిన రాజు
కలచి తేర్చిన వెన్నకల్లు దోచె
తే.గీ.
మగువ నోటికి జేర్చిన మధువునందు
మునిగి నా మచ్చబాయుదు ననుచు చంద్రు
డామె కనకపు మధుపాత్ర మునిగెననగ
పడతులందరి చేతుల మధువు మెరిసె

446.
కం.
శశి బోలిన సతి మోమది
శశి తన మధుపాత్రలోన చక్కగ నమరన్‌
విశదంబగు స్నేహంబును
నిశిపతి రమణీయ రీతి నింపెను మిగులన్‌

447.
తే.గీ.
మద్య పరవశులైనట్టి పడతులచట
మధుజలంబున బీజంబు లంకురింప
ముఖపు కెంపులు చివురుల పొలుపు చూప
కనులు పూలుగ తరులనగా వెలుంగ

448.
వ.
ఇట్లు విశృంఖల విహారశీలురైన ముదితలు, తమ ప్రభువైన హిరణ్యకశ్యపుతోగూడి, నిరంతర మధుపానాసక్తులై, నృత్యగీత, వాద్యకళాలోలులై, సుఖపరమావధిని బొందుచుండిరి, అంత,

లీలావతి స్వప్నము

449.
తే.గీ.
గంగపులినంబు బోలిన యంబురాశి
మీద పవళించె దైత్యుడు, ప్రియసఖీ స
హితుడుగా సురపురి, తెల్ల యేన్గువోలె
ముఖ్యభవనపు పైభాగమునను వేడ్క

450.
మ.
కలలో నొక్క విశేషమున్‌ గని మహా కౌతూహలావర్తయై
అలనాశ్చర్యము, తొట్రుబాటు, మదిలో నాత్రంబు గల్గింప, వ్యా
కులమైనట్టి మనస్సు సంచలితమై కొంగ్రొత్తవౌ భావనల్‌
చెలరేగన్‌ వెసమేలు కాంచె మదిలో చెన్నొంద సత్సూచనల్‌

451.
వ.
అట్లు స్వప్నములోనొక అచ్చెరువుం గనిన దైత్య ప్రభుని పట్టమహిషి లీలావతి సంభ్రమాశ్చర్యములు మనమున ముప్పిరిగొనిన, నింతలో ప్రాణనాథుడగు హిరణ్యకశింపుడును మేలుకొనెను.

452.
తే.గీ.
పతికి చెప్పగ భయపడి పడతి యపుడు
చలిత షట్పద యుతమైన నళిన దళము
ముడుచుకొను రీతి ముఖ పద్మమునను భావ
మణచుకొనియెను ఆ రాత్రి మగని చెంత

453.
వ.
అంత, దినకరుండుదయించె.

454.
తే.గీ.
రాతిరంతయు కలువల రతిని గూడి
అలసిసొలసిన హిమకరు డస్తమించె
నిజ వికాసము లుప్తమై తేజమడగి
పశ్చిమాంబుధి శయనించె పంచిసుఖము

455.
ఉ.
ఆతని వెంట తారకలు మాయమునయ్యెను శీఘ్రమే, మహా
శీతలుడైన చంద్రుని విశేషపు పాలన హాయినుండగా
భీతిని తీవ్ర రశ్మి కురిపించెడు సూర్యుడు అన్యతేజముల్‌
సైతునెయంచు వచ్చెనని, సఖ్యము నాతనితోడ సాధ్యమే?

456.
మ.
శశిబింబంబది యస్తమింప తనదౌ స్థానంబునన్‌ సూర్యుడున్‌
విశదంబైన గభస్తి సంచయముచే విశ్వంబు మేల్కొల్పుచున్‌
దిశలన్‌ తెల్లగ జేసె, పద్మములు సద్దీప్తిన్‌ బొందె ఫుల్లంబులై
నిశనిద్రించిన యెల్ల ప్రాణతతియున్‌ మేల్కొంచె సూర్యప్రభన్‌

457.
చం.
ఉదయపు గాలి వీచె తన యూర్పుల ఫుల్ల సరోజ గంధముల్‌
అదనుగ స్వీకరించి, తరువాటిక జేరుచు తేటులన్నియున్‌
చెదరగ, రాజ హంసలను ప్రీతిగ లాలన జేసి, జంటలన్‌
ముదమున సేదదీర్చి, వరపూర్ణముగాన్‌ శిఖిపింఛరాజియున్‌

458.
తే.గీ.
ప్రాగ్దిశాసతి యింటికి ప్రాంగణమున
కుంకుమపు నీరు చల్లిన పంకము గతి
అరుణకాంతులు విలసిల్లె నంబరమున
దినకరుండటు బొడ్వ దీప్తుడగుచు

459.
సీ.
దీపాల కాంతులు తెల్లబోవ, సతుల
నేత్రకాంతులు వెల్గె మిక్కుటముగ
కామినీ నేత్రాలు కలిసెను సరసపు
తైలంబులను నిండి మేలమాడి
వత్తులు వెల్గగా మత్తును కలిగించి
కాటుకలను దిద్ది కమ్రశోభ
ప్రియమైన వారల వీడ్కోలు బల్కగ
దిగులొందు సుదతుల భంగినటుల
తే.గీ.
గృహములందలి దీపాలు నహమునందు
కాంతి తఱుగగ వెలవెల గనియెనపుడు
రతిని తనిసిన కాంతల రక్తనేత్ర
ములవి వెలిగెను దేదీప్యముగను మిగుల
~

లఘువ్యాఖ్య:

పద్యాలు 442, 443, 444, 445 లలో రాక్షసపతి భామినిలతో గూడి నిరంతర మధుపాన రక్తుడైనాడు. బంగారు దొన్నెలలో విలాసినులు ఆయనకు మధువును అందిస్తున్నారు మధువు యొక్క పరిమళం ద్రవరూపం దాల్చిందా? అన్నట్లుంది. కానీ పరిమళానికి రూపం లేదు. దీనిని Personification లేదా objectification’. ఆ మధు పాత్రలలో చంద్రుడు కర్బూరంలా ప్రకాశిస్తున్నాడు. పద్యం 449లో రాత్రి లీలావతీ దేవికి ఒక కల వస్తుంది. ఆమెకు ఆశ్చర్యం, ఆతృత, తొట్రుబాటు కలిగాయి. ఈలోపు హిరణ్యకశిపుడు  కూడా లేచాడు. ఆ కలను భర్తకు చెప్పడానికి ఆమె భయిపడింది (పద్యం 452). చంద్రుడు అస్తమించి, నక్షత్రాలు మాయమయ్యాయి (పద్యం 454). పద్యం 455లో చల్లని పాలన పోయి, వేడి పాలన వస్తుంది. సహించలేని తారకలు వెళ్లిపోయాయి. సూర్యోదయమైంది (పద్యం 456) ‘గభస్తి’ అంటే కిరణం. దిక్కులు తెల్లబడ్డాయి. పద్మాలు వికసించాయి. పద్యం 458 లో  తూర్పుదిక్కు అనే ఇల్లాలి ఇంటి ముందు కొందరు నీరు కళ్లాపి చల్లినట్లుగా ఎర్రుని కాంతులు విస్తాయించాయి. పద్యం 459 లో దీపాలు వెలవెలబోయాయని తెలిపారు కవి.

(సశేషం)

Exit mobile version