Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము-4

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ప్రథమాశ్వాసము:

కథాప్రారంభము

నాచే కథనంబగుచున్న ‘శ్రీలక్ష్మీనృసింహ మాహత్మ్యము’ అన్న దివ్యకావ్యము ఇటుల మొదలయ్యె. నైమిశ కాననము అనంత పవిత్రము. తపశ్శీలురగు ఎందరో మహర్షులకు నెలవై యలరారుచుండును. అచట రోమహర్షుడను పౌరాణిక శ్రేష్ఠుండు గలడు. ఆ మహనీయుడు ఋషిపుంగవులకు సమస్త పురాణంబులను, ఇతిహాసములను వినిపించుచుండును. ఒక శుభదినమున వారు ఆయనను గదిసి, అత్యంత కుతూహలాంతర్గత హృదయులై ఆయనతో ఈ విధముగా పల్కుచున్నారు:

44.

ఉ:
శోధిత సర్వ శాస్త్ర పరిశోభిత మానస! రోమహర్ష! నీ
బోధలనెన్నియో కథల పుణ్యము గంటిమి, మాకు దెల్పరే!
ఈ ధర నెట్టి క్షేత్రమది యెప్పుడు మానవ, దేవ, యోగులున్
మాధవ ధామమంచు జని బాధల బాయుదురంచు బల్కినన్

45.

సీ:
ఏ తీర్థమున తాను ఈశుండు శ్రీహరి
మాయుక్తుడై సతము మహి వసించు
ఏ క్షేత్రమును దలప నిల భక్త గణములు
పాపాలు నశియించి బడయు ముక్తి
ఏ దివ్యధామంబు ఎటువంటి వెతలను
భగ్నంబు జేసెడు మహిత భూమి
ఏ తీర్థమును గన్న నిహలోక బంధముల్
ముక్తంబులై యమిత ముదము గూర్చు

తే.గీ.:
అట్టి మహనీయస్థానంబు అవనిగలదె?
దాని వివరింపు మతిలోక దర్శనీయ
దివ్యనారాయణావాస భవ్యదీప్తి
నీదు యమృతంబు పలుకుల సాధుశీల

46.

చం:
వినయము మూర్తిమంతమగు విస్తృత జ్ఞాన ధనుండు, నిత్యమున్
తన మనమందు దైత్యరిపు దాల్చెడు ధన్యుడు, రోమహర్షుడా
మునివరు లెల్ల సంతసము బొందగ జెప్పెను, మాట లర్థముల్
పెనగొని విష్ణుతత్త్వ సుమ పేశల భావము లుగ్గడించుచున్

47.

కం:
నా గురుపాదుడు వ్యాసుడు
ఈ గరిమను జెప్పె నాకు నియ్యది మీకున్
ఆగమ సిద్ధ రహస్యము
వేగమె తెల్పెదను వినుడు విమలపు శ్రద్ధన్

48.

వ:

నిరంతర హరి సేవాతత్పరుండును, సతత పుణ్యతీర్థ దర్శనా కుతూహలచిత్తుండును, భక్తివిజిత దామోదర దయాలబ్ధ వినయశీలుండును, భూప్రదక్షిణా క్రమానుగత భూరి విశేషజ్ఞుడును, పరిపూర్ణపుణ్యవర్తనా వశీకృత ముక్తిశేముషీ ప్రాప్తుండును యగు గాలవుడను మునిశ్రేష్ఠుడు, తన తీర్ధయాత్రా సందర్శనంబున, ఈక్రింది పుణ్యభూములను దర్శించి ధన్యుడయ్యె.

49.

శా:
గంగన్ మున్గెను కాశికాపురపతిన్ కన్నార వీక్షించె, చా
లంగా కౌతుక మా ప్రయాగ గనియెన్, లక్షించె భక్తిన్ గయన్
అంగీభూత వరాహ రూపుగనె సింహాద్రీశు, గోదావరీ
సంగాసక్త పవిత్ర మానసుడుగా సాధించె పుణ్యార్థముల్

50.

తే.గీ.:
వేంకటాద్రిని దర్శించె వేడ్క తోడ
నెక్కి సహ్యాద్రి పర్వతపంక్తి గనియె
రంగనాథుని పొడగనె రమ్యదేహు
పండరీశుని గొల్చెను భక్తి దనర

51.

కం:
గోకర్ణ క్షేత్రము దా
సాకలముగ జాచెన భవ సామ్రాజ్యము సత్
శ్రీకరమగు ద్వారకయు, న
నేకంబగు క్షేత్రరాజి నెంతయు తనివిన్

52.

వ:

ఆ విధంబుగా భారత ఖండమండితయఖండమహిమాన్విత దివ్యక్షేత్రముల దర్శించుచు, ఆ గావల మహర్షి, నారసింహ కరుణాలవాలమగు నహోబల క్షేత్రంబును జేరె.

53.

ఉ:
స్నానము చేసెముందు భవనాశని తీర్థమునందు, స్వచ్ఛమై
మేనున బుల్కలన్ వొడుము వెన్నెల కాంతుల బోలు నీరమున్
తానతి భక్తి గ్రోలె, దళితాంబుజ పత్రపు తేనియల్, సదా
పూనిక తోడ త్రాగు మధుపోజ్వల ధ్వానము నిండ నెమ్మదిన్

54.

సుగంధి:
గావలుండు జూచె మోక్షకారి యైన క్షేత్రమున్
దేవదేవు నారసింహ దివ్యధామ రాజమున్
చేవ గల్గు వృక్షరాజ శ్రేష్ఠమైన యౌషధుల్
ఆవహించి నట్టి దుర్గ మాద్రి జీవధాత్రికిన్

~

లఘు వ్యాఖ్య:

ఈ భాగములోనే అసలు కథ మొదలవుతుంది. ‘ప్రథమాశ్వాసము’లో కథాప్రారంభం. మొదట వచనములో నైమిశారణ్యంలో, రోమహర్షుడను పౌరాణికుడిని, కొందరు బుషులు సమీపించి, ‘స్వామీ, ఈ భూమిలో ‘మాధవ ధామమని’ మానవులు, దేవతలు, యోగులు, ఏ క్షేత్రాన్ని భావించి, దర్శించి, పునీతులవుతారో చెప్పు’మని అడుగుతారు (ప 44). పద్యం 47లో, తన గురువైన వ్యాసుడు తనకు ఈ క్షేత్రమహిమను తెల్పినాడని, (వ. 48) గాలవుడను మహర్షి తీర్థయాత్రలు చేస్తూ వివిధ క్షేత్రములు దర్శించినాడని, రోమహర్షుడు చెబుతాడు. పద్యాలు 49, 50, 51 లలో కాశీ, ప్రయాగ, గయ, సింహచలం, గోదావరీ నది, తిరుపతి, సహ్యాద్రి, రంగనాథ క్షేత్రం, పండరీపురం, గోకర్ణం, ద్వారక మున్నగు క్షేత్రాలను దర్శించాడని చెబుతాడు. తర్వాత శ్రీమహదహోబిల క్షేత్రానికి వస్తాడు (వ 52) భవనాశనీ తీర్థమందు స్నానమాచరించి (ప 53), నిర్మలమైన దాని నీటిని త్రాగుతాడు. ఆ నది లోని పద్మాలలోని తేనెను త్రాగుతూ, ఝుంకారం చేస్తున్న తుమ్మెదలను చూస్తాడు. పద్యం 54 లో ‘సుగంధి’ అన్న విభిన్న వృత్తమును కవి ప్రయోగించినారు. దీనిలో చక్కని ‘లయ’ ఉంటుంది. “గాలవుండు జూచె మోక్షకారి యైన క్షేత్రమున్”.

(సశేషం)

Exit mobile version