Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-8

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ప్రథమాశ్వాసము:

శ్రీహరి దివ్య మందిర వర్ణనము

97.
వ:
పిదప, దేవశ్రవమునీంద్రుడు, క్షీరాబ్ధినందలి శ్వేత ద్వీపమున వెలసిన వైకుంఠపురము లోని మహా విష్ణు భవ్య మందిరమును వర్ణింప సాగె.

98.
ఉ:
గావల మౌని! విన్ము! యురగాధిపశాయి వసించు ప్రోలు, ది
వ్యావరణా ప్రభాకలిత వస్తు విశేష సమూహ యుక్తమై
కేవల దివ్యయోగిసుర కిన్నర యక్ష సుసేవితంబు నై
దీవెన గోరు భక్తులకు దివ్య సుకామిత లాభమిచ్చెడున్

99.
వ:
మరియు నా సుందర శయనమందిరంబున..

100.
సీ:
బంగారు స్తంభాల మణి సంచయము జూడ
దీప కాంతుల తోడ దీప్తిగనగ
కర్పూర వాసనల్ కమనీయముగ సాగి
ఆనందదాయియై అలముకొనగ
పడక నల్మూలలు పరదాలు కదలుచు
పరమాత్మ మేనిని పలకరింప
మౌక్తిక మణినీల మణిహరములు జారి
కాంతిచ్ఛటల సౌరు సంతరింప
తే.గీ.:
మేటి ఉపహార సామగ్రి, సాటి లేని
భవ్య సౌభాగ్యముద్రలు భాసురిల్ల
చక్రధారికి నెలవైన శయనగృహము
తనరు వైభోగ వైరాగ్య ఘన యశంబు

101.
సుగంధి:
కల్ప వృక్షరాజి భవ్య గంధ భూతి వెల్వడన్
శిల్ప వైభవంబు శౌరి శ్రీల దెల్పి నిల్వగన్
అల్పమైన దేది జూడ నా మనోజ్ఞ ధామమున్
కల్పనా సమర్థుడైన కృష్ణదేవు వాసమున్

102.
మ:
మునులా శ్రీహరి సంస్తుతింతురు సదా మోదంబుతో కేశవున్
పనులన్ జేసెద రెల్ల దేవతలు సంభావించుచున్ నమ్రులై
అను నిత్యంబును దేవకాంతలు హరిన్ ఆనంద నృత్యంబులన్
తనియింపన్, కమనీయ గాన పటిమన్ ధన్యాత్ములై కిన్నరుల్

103:
సీ:
అష్టదంష్ట్రులు చతుష్షష్టి దంతులు దివ్య
వైకుంఠమును జాగురూకులుగను
చండప్రచండాది భండన దక్షులు
పూర్వద్వారంబును పూనికగను
గణపతియములను కార్యదక్షులు తాము
పశ్చిమ ద్వారంబు పట్టి నిలువ
పద్మాక్ష దుర్గేంద్ర ప్రముఖులు నిత్యమున్
ఉత్తరద్వారంబు నుద్ధరింప
తే.గీ.:
పరగు దక్షిణ ద్వారంబు కోరకులును
రక్ష సేయగ జగదేక సాక్షి భూతు
డైన పరమాత్మ వైకుంఠమున రహించు
కరుణ చిలికించు దేవుడు సిరిని గూడి

104
తే.గీ.:
ఇట్టి గణముల కెల్లను మేటి జోదు.
డలరు విష్వక్సేనుడు హరిహితుండు
దివ్యసువిమాన శతములన్ తిరుగుచుండు
అఖిల గణకోటి కాతండు యధిపుడగుచు

విష్ణుదేవుని మహిమాతిశయ వర్ణన

105.
ఉ:
పట్టపుదేవి పద్మముఖి పావని శ్రీసతి, సృష్టికర్తయే
పట్టి, విహంగనాథుడును వాహనశ్రేష్ఠుడు, నందకంబునున్
పట్టిన పాంచజన్యమును, పాలిత సిద్ధమునీంద్ర వ్రాతముల్
ఇట్టివి విష్ణుదేవుని విశేష విలాస మహాప్రకాశముల్

106.
ఆ.వె.:
సురలకైనను ఘనయోగి వరులకైన
దేవ దేవుని మహిమంబు దెలియ వశమె
తనదు మహిమంబు విష్ణుడే తానె యెఱుగు
ఎఱుగ నన్యుల కది సాధ్య మెపుడు గాదు

107.
పంచ చామరము:
రజో గుణంబు చేత సృష్టి రాజిలంగ జేయుచున్
సజీవమైన సత్త్వ భావ సార రక్ష లోకముల్
విజేతయై తమో గుణాన విశ్వనాశకారియై
నిజప్రభావ కేవలాత్మ నిర్ణయించు సర్వమున్

108.
తే.గీ.:
కమల నేత్రయు గరుడుడు కౌస్తుభంబు
తులసి పేరులు శంఖమ్ము వెలయు చక్ర
మమర, నాభిని పద్మంబు, పచ్చయుడుపు
శాశ్వతంబైన ముక్తినొసగు విభుడు

109.
సీ:
తపము లెన్నియు జేయ తప్పని పాపాలు
హరినామస్మరణతో నణగిపోవు
జవముల నారని సర్వమాలిన్యములు
ఎద మాధవుని నిల్ప నెగిరిపోవు
దానాలబోవని ఘన దోషములు నెల్ల
ఆర్తి కేశవు గొల్వ నంతరించు
క్రతువులు చేసినన్ కదలని వెతలెల్ల
వైకుంఠు ధ్యానము వలన తొలగు
తే.గీ.:
తేట నీటిని బోలిన మేటి మనసు
బద్మనాభుని నిలుపుచు మహిత భక్తి
సర్వశరణాగతిని బొంద సాధ్యపడును
దురిత దుఃఖంబులవి ఎల్ల మాను త్రోవ

110.
మ:
అనుకంపామృత వర్షకారి, తనపై ఆత్మాను సంధాయులై
మనమున్ తత్పరతన్ ఘటించిన మహా మార్గంలో సాగుచున్
అనయంబున్ శృతి పూజ్యుడౌ విభుని కామాసక్తి వర్జించి, పా
వన చిత్తంబుల సంచరించు జనులన్ పాలించు వ్యగ్రాత్ముడై

111.
కం.
నలువను జేసెను స్పష్టికి
కలుషాంతకి గంగ జేసె కాచెను జగముల్
పులకింప జేసె యోగుల
నలినాక్షుడు కృపను, హరి వినాశరహితుడై

~

లఘువ్యాఖ్య:

ఈ భాగములో కవి శ్రీహరి దివ్యమందిరమును మనోహరముగా వర్ణించుచున్నారు. పద్యం 100లో దాని వైభవాన్ని వివరించారు. కర్పూర వాసనలు అలముకున్నాయి. ‘పడక కోసమర్చిన పరదాలు పరమాత్మ మేనిని పలకరించుతున్నాయి’. ఇందులో వృత్యనుప్రాస’ అనే అలంకారం ఉంది. ‘వైభోగ వైరాగ్య’ అన్న ప్రయోగం భిన్నం. అందులో ‘విరోధాభాసం’ అనే అలంకారం ఉంది. పద్యం 103 లో ఆ విష్ణ మందిరమునకు గల రక్షణ వ్యవస్థను కవి చెబుతున్నారు. అష్టదంష్ట్రులు, 64 ఏనుగులు, చండప్రచండులు, గణపతి, యముడు, పద్మాక్షుడు, దుర్గేంద్రుడు వరుసగా నాలుగు దిక్కులలోని ద్వారములకు రక్షగా ఉన్నారు.

ఇక విష్వక్సేనుడు విమానంలో తిరుగుతూ ‘ఏరియల్ సర్వే’ చేస్తున్నాడు. ఆయన ముఖ్య భద్రతాధికారి అన్న మాట. వైష్ణవ సాంప్రదాయములో గణపతిని విష్వక్సేనుడు అంటారు. శివగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. విష్ణు గణాలలోఅధిపతి విష్వక్సేనుడు. గణేశుడు ఏకదంతుడు. విష్వక్సేనునికి రెండు దంతాలు!.

పద్యం 105లో స్వామి వారి వైభవం- వాహనం, శంఖం, ఖడ్గం మొదలగు వాటిని కవి ప్రస్తావించారు. పద్యం 107 ‘పంచ చామరము’ అని విభిన్న వృత్తం. అందు ఆ నారాయణుడు తనను తాను సత్త్వరజస్తమో గుణములకు ప్రతినిధిగా అవిష్కరించుకోవడం కవి చెప్పారు. పద్యం109లో విష్ణువును పూజించి, స్మరించి, ధ్యానించడం సర్వపాపహరి అని, దాని వల్ల తప, జప, దాన, క్రతువులతో అవసరం ఉండదని కవి చెబుతున్నారు. ‘తేట నీటిని బోలిన మేటి మనసు’ ఉంటే చాలు! ఈ ప్రయోగంలో ఉపమ, వృత్యనుప్రాస రెండూ ఉన్నాయి.

(సశేషం)

Exit mobile version