Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-14

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

35. సౌకన్యకోపాఖ్యానం!

భృగుమహర్షి కుమారుడైన చ్యవనముని ఎన్నో వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేశాడు. అతడిపై పుట్టలు మొలిచాయి. తోటలు, పొదలు పుట్టను అలుముకున్నాయి. దానితో ఆ ప్రాంతమంతా అరణ్యసీమగా మారిపోయింది. ఒకనాడు శర్యాతి మహారాజు తన నాలుగు వేలమంది భార్యలతో, తన కూతురైన సుకన్యతో ఆ ప్రాంతానికి విహారానికి వచ్చాడు. రాజు కూతురు, పుట్ట కట్టిన ముని ఉన్న ప్రాంతంలో తిరుగాడుతూ, అక్కడ దివ్యంగా వెలుగుతున్న పుట్టలో ఉన్న చ్యవనుడి కన్నులు చూచి మిణుగురు పురుగుల మెరుపులుగా భావించి, తొందరపాటుతో, సేవకులను ఆదేశించి పుట్టను త్రవ్వించింది. అందుకు చ్యవన మహర్షికి కోపం వచ్చింది. కన్నులు మూసుకొని శర్యాతి సైన్యాలకు, మూత్ర పురీషాలు బంధించేటట్లు చేశాడు

రాజు దానికి చాలా విచారించాడు. కూతురు అక్కడికి వచ్చి, “రెండు వెలుగులు ఒక పుట్టలో కనిపించాయి. దానిని మిణుగురు పురుగులుగా భావించి, పుట్టను త్రవ్వించాను. అక్కడ వెలుగుల పొడ గానక, ప్రయత్నాన్ని విరమించాను” అని జరిగింది చెప్పింది. రాజు వెంటనే తన సైన్యానికి పట్టిన దుర్గతికి విచారించి, ఈ సంఘటనకు కారణం ఇదై ఉండవచ్చునని భావించి, పుట్ట దగ్గరికి వెళ్ళాడు. క్రుంగి కృశించిపోయి, అస్థి పంజరంలా మిగిలిన చ్యవనునికి నమస్కరించాడు.

“మీ తపో మహాత్మ్యం తెలియక, మా అమ్మాయి తప్పు చేసింది. ఆమె అపరాధాన్ని క్షమించండి దయచేసి నా సైన్యానికి అడ్డు తొలగించండి. యెఱుక గలరె తరుణులు ధరణిన్” అని అన్నాడు. చ్యవనుడికి రాజుపై దయ కలిగింది. అయితే “పడుచుదనముతో పొగరెక్కిన రాజపుత్రిక సుకన్యను పెండ్లాడి కాని క్షమించను” అన్నాడు. శర్యాతి తన కూతురుని మునికి కానుకగా ఇచ్చి, ముని కోపాన్ని తప్పించుకున్నాడు

సుకన్య భర్తకు భక్తిశ్రద్ధలతో సేవ చేయసాగింది. ఒకనాడు అశ్విని దేవతలు (దేవతల వైద్యులు) భువికి వచ్చి. సుకన్య వద్దకు చేరి, ఆవిడ చేత పరిచయాలు పొందిన తరువాత “ఇంతటి సౌందర్యరాశివి, ముసలివాడిని పెళ్ళి చేసుకొని యౌవనాన్ని వృథా చేసుకున్నావు. నీవు సరైన వరుడినెవరినైనా కోరుకొనుము. సమకూర్చెదము” అని అన్నారు. ‘మగవాళ్ళు వార్ధక్యంలో వివాహం చేసుకుంటే పొరుగు వారికి ఆనందదాయకం’ అన్న ఆంగ్ల సామెత విన్నాం కదా. వారి చులకన మాటలకు సుకన్య కోపించింది. సరైన విధంగా బదులిచ్చింది. విషయాన్ని తన భర్తకు చెప్పింది. సుకన్య పతిభక్తికి చ్యవనుడు సంతోషించి, ‘వారు చెప్పిన విధంగా చేయుమ’ని నియోగించాడు. సుకన్య భర్త ఆజ్ఞాపించిన విధాన అశ్వినులతో, “నాకు యావనం గల పెళ్ళికొడుకును సమకూర్చండి” అన్నది. వారు ప్రక్కనే ఉన్న కొలనులో ప్రవేశించారు. చ్యవనుడు కూడా కొలనులోకి ప్రవేశించాడు. ఆ ముగ్గురు నవ యావనులై కొలను నుండి బయటకు వచ్చి, “మాలో నీకు నచ్చిన వాడిని ఎన్నుకొనుము” అన్నారు. సుకన్య చ్యవనుడినే వరించింది.

చ్యవనుడు సంతోషించి, అశ్వినులతో, “మీ మూలాన నేను యవ్వనం పొంది, కృతార్థుడైనైనాను, శర్యాతి చేసే యజ్ఞంలో దేవేంద్రుడు చూస్తుండగా మీకు సోమ రసాన్ని త్రాగిస్తాను” అని అన్నాడు. వారు సంతోషించి వెళ్ళిపోయారు. అన్నట్లుగానే చ్యవనుడు సకల సంభారాలతో శాస్త్రోక్తంగా ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞంలో అశ్వినులకు సోమ రసాన్నివ్వడానికి చ్యవనుడు సంకల్పించగా, దేవేంద్రుడు కోపంతో వచ్చి, “ఈ ఇరువురు దేవతల వైద్యులు. సోమరసానికి అర్హులు కారు. ఇది చేయకూడని పని” అన్నాడు. యజ్ఞంలో సోమ రస పానానికి సంప్రదాయ సిద్ధమైన యోగ్యుడు ఇంద్రుడు, దేవతల సమక్షాన పరిగ్రహించి త్రాగుతాడు. ఇక అశ్వినులు ఇంద్రుని భృత్యులు. ఇంద్రునికి సేవకులకు తనతో సమానమైన ప్రతిపత్తి యివ్వటం యిష్టం లేదు. ఇంద్రుని మాటలు చ్యవనుడు వినలేదు. ఇంద్రుడు కోపించి వజ్రాయుధమెత్తాడు. చ్యవనుడు రౌద్రాకారుడై, ఎత్తిన చేతిని ఎత్తినట్లుగా స్తంభింపచేశాడు. కోపం చల్లారక హోమం చేశాడు. అందులోనుండి భయంకరాకారుడైన మదుడు అనే రాక్షసుడు పుట్టి దేవేంద్రుని వైపు వెళ్ళాడు. దేవేంద్రుడు భీతిల్లి, తన పైకి వస్తున్న రాక్షసుడిని చూచి, “ఓ మహర్షి! నన్ను క్షమించు. అశ్వినులు సోమపానానికి అర్హులు. నా తప్పు మన్నించి నన్ను కాపాడండి” అన్నాడు చ్యవనుడు శాంతించాడు. దేవేంద్రుడు యథావిధిగా స్వర్గానికి వెళ్ళినాడు. అశ్వినులు సోమరసార్హత పొంది వారూ స్వర్గాన్ని వెళ్ళారు. చ్యవనుడు మదుడిని కల్లు లోనూ, స్త్రీలలోను, వేటలోను, జూదంలోను ఉండమని ఆజ్ఞాపించాడు. చ్యవనుడి ఆదేశం ప్రకారం మదుడు మద్యం, మహిళ, మృగయలో, పాచికల్లో ప్రవేశించాడు. అంటే జగత్కంటకమైన మకారత్రయం మహిళ, మద్యం, మృగయ – మహారాక్షస ప్రవృత్తికి ఆకరములయినాయి. మహాత్ములేమి చేసినా మానవ జాతి కల్యాణానికే కదా. కర్మ ప్రధానమైన యజ్ఞయాగాదులకంటె, తపస్సువలన కర్మ, భక్తి, జ్ఞాన ఫలాలను పొందవచ్చునన్నది తాత్పర్యం. మరియు ఈ కథ తరుణుల చాపల్యం, సద్ధర్మపత్నుల నడవడి, సాంఘిక అసమానతలకు వ్యతిరేక పోరాటం వంటి అంశాలు కలగలిసినది.

బ్రహ్మజ్ఞానులకు, మహాత్ములకు ఉచ్చనీచజీవాలు, తక్కవఎక్కువలు ఉండవు. అందరికీ న్యాయం చూపుతూ, దురహంకారులకు బుద్ధి ఎలా చెప్పాలో వారికి తెలుసు, అందుకే పంక్తి బాహ్యులుగా పరిగణించబడుతున్న అశ్వినీ దేవతలకు సమాన ప్రతిపత్తి కల్పించి, సోమరసాన్ని ఇవ్వటం చ్యవన మహర్షి ప్రవేశపెట్టిన కొత్త మర్యాద. ఇలాంటి మహాత్ముల గాథలే, భారతదేశంలో సంఘసంస్కర్తలకు ప్రేరణలుగా మారి, సామాజిక రుగ్మతల పట్ల ఎలుగెత్తేలా చేసాయి. సంఘ సంస్కరణలో, సమానత్వ సాధనలో ఇతోధికంగా తోడ్పడ్డాయి.

నర్మదానదిలో పవిత్రస్నానానంతరం ధర్మరాజుకు రోమశుడు, అరణ్యపర్వం తృతీయాశ్వాసంలో చెప్పిన కథ.

“He attains excellence who looks with equal regard upon well-wishers, friends, foes, neutrals, mediators, the hateful, the relatives, and upon the virtues and the sinful alike.” Gita 6.9.

36. మాంధాతృ చరిత్ర!

తనను ప్రేమగా చూసుకొన్న దేవేంద్రుడితో సహితం ప్రజల కొరకు యుద్ధం చేసిన వాడు, తన భుజబలంతో వర్షాలను కురిపింపచేసి, భువిపై కరువుకాటకాలు రూపుమాపినవాడు చక్రవర్తి మాంధాతృడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టి వేయి అశ్వమేధము లొనర్చిన అమిత కీర్తివంతుడు మాంధాతృడు.

ఉత్తముడైన యువనాశ్వుడనే రాజుకు సంతానం లేదు. రాజ్యభారం మంత్రులపై విడిచి, పుత్రసంతానంకై భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అతడిని ఆశ్రయించాడు. భృగుమహర్షి రాజు పట్ల వాత్సల్యంతో పుత్ర కామేష్టి జరిపాడు. అందులో మంత్రాల చేత పవిత్రమైన జలము కలిగిన పాత్రను పొంది, ఋత్విజులకు భద్రపరచమని యిచ్చాడు. యజ్ఞం చక్కగా ముగిసింది. ఆ రాత్రి అందరూ అలసిసొలసి నిద్రించారు. రాత్రివేళ యువనాశ్వుడి దాహం వేసింది. నిద్ర మేలుకొని కలశంలోని మంత్రపూతమైన యజ్ఞోదకాన్ని పొరపాటున త్రాగాడు. నిజానికి ఆ పాత్ర జలాన్ని భృగుమహర్షి రాజు భార్యకై తీసి ఉంచాడు. విషయం తెలుసుకున్న ముని “దైవఘటనను ఎవరూ తప్పించలేరు. నీ భార్యకై దాచి ఉంచిన పవిత్ర మంత్రజలాన్ని నీవు త్రాగావు. దీని వలన నీవు కడుపుతో ఉండగలవు. నీకు ఇంద్ర సమానుడైన కొడుకు పుడతాడు” అని పలికాడు

రాజు రాజధానికి వెళ్ళిపోయాడు. వంద సంవత్సరాలు గడిచిన తరువాత రాజు యొక్క ఎడమభాగం చీల్చుకొని కుమారుడు పుట్టాడు. ఆ శిశువును చూడటానికి దేవేంద్రుడు వచ్చాడు. ఆ శిశువు నోట్లో చూపుడు వేలు ఉంచి “ఇది అమృతమయం, దీనిని చీకుము” అన్నాడు. “అయం (ఇతడు) మాం (నన్ను) ధాస్యతి (పానం చేయును)” అన్నాడు. ‘మాంధాస్యతి ఇతి మాంధాతా’ అను వ్యుత్పత్తి ప్రకారం బాలుడికి దేవతలు ‘మాంధాత’ అని నామకరణం చేశారు.

ఆ విధంగా మాంధాతృడు దేవేంద్రుడి చేత పోషించబడిన వాడయ్యాడు. మాంధాత చతుర్వేదాలను, ధనుర్విద్యను అభ్యసించాడు. త్రిలోక పూజితు డయ్యాడు. భూమండలానికి రారాజుగా దేవేంద్రుని చేత పట్టాభిషేకం చేయించుకున్నాడు. దేవేంద్రుని సింహాసనాన్ని ఇంద్రుడితో పాటుగా అధివసించాడు. అజగవం అనే విల్లును చేతబట్టుకొని, సకల లోకాలు జయించి, జగదేకవీరుడై యమునా నదీ తటమున పెక్కు యాగాలు, దానధర్మాలొనర్చి, ప్రజలను తన ఆజ్ఞాబద్ధులుగా చేసుకున్నాడు. ఇంతలో పుడమిపై కరువు కాలుకాలు వచ్చాయి. మంధాతృడు ఆగ్రహించి, దేవేంద్రుడితో యుద్ధం చేసి, తన మంత్రయుత బాణాలు మేఘాలపై కురిపించి, భూమి సస్యశ్యామలం అయ్యేట్లుగా వానలు కురిపించాడు.

ప్రజాక్షేమం కొరకు దేవతలను, దేవతల రాజును లెక్కచేయకుండా వారితో యుద్ధం చేసి, ప్రకృతిని సహితం తన చెప్పుచేతుల్లో ఉంచుకొనేవాడు ప్రజారంజకుడైన పాలకుడు అని చెప్పే కథ.

అరణ్యపర్వం తృతీయాశ్వాసం లోనిది. రోమశుడు ధర్మజునికి చేప్పిన కథ.

37. సోమకుడను రాజర్షి చరిత్ర!

సోమకుడను రాజు గొప్ప యజ్ఞాలు చేసి, జంతుడనే కొడుకును పొందినాడు. అతడికి వందమంది భార్యలు. ఆ రాణులందరూ, జంతుడిని తమ సొంత బిడ్డగా, ప్రజలు ఆశ్చర్యపడే విధంగా లాలించి పెంచారు. ఒక రోజు బాలుడికి గండుచీమ కుట్టి ఏడుస్తుంటే, వంద మంది తల్లులు ఏడవసాగారు. ఆ ధ్వని విని సోమకుడు అంతఃపురం వెళ్ళి వారిని ఉదార్చాడు. ఆపై సభకు వచ్చి మంత్రులతో, ఋత్విజులతో “నాకు వంద మంది భార్యలున్నారు. కాని ఒక్కడే కొడుకు. ‘కోరి యొక్క కొడుకుఁ గొడుకుగా నే నెట్లు నమ్మియుండనేర్తు?’“ అన్నాడు.

దానికి ఋత్విజులు, “నీకు గల నూరు మంది రాణులకు నూరు మంది కొడుకులు కావాలంటే, యజ్ఞం చేయుము. ఇది తగదు. ఇది తగినది అనరాదు” అన్నారు. దానితో “నేనేమి చేయాలి” అన్నాడు రాజు. దానికి ఋత్విజులు, “నీ ఏకైక పుత్రుడైన జంతుడిని యజ్ఞపశువు చేసి సంహరించి, అతడి కడుపులోని వసను హవ్యంగా చేసి, అగ్నిహోత్రుడికి సమర్పిస్తే నీ నూరుగురు భార్యలకు నూరుగురు కొడుకులు పుడతారు. వారిలో ముందు పట్టిన జంతుడు ఎడమ పక్క దేహం బంగారు లక్షణాలతో శోభిల్లుతాడు” అన్నారు. రాజుకు ‘ఒకటికి వంద’ అన్న మాటపై ఆశ కలిగి యజ్ఞానికి ఒప్పు కున్నాడు. పిల్లవాడిని యజ్ఞంలో సంహరించాడు. దానికి రాణులు ఆడగొర్రెలు బాధతో అరిచినట్లు అరిచారు. ఆ హోమం యొక్క పొగ పీల్చిన రాణులు, గర్భిణులై తొమ్మిడో నెలలో జంతుడితో సహా వందమంది కొడుకులను ప్రసవించారు. అట్లా పుట్టిన వంద మంది పుత్రులను ఇంతకు పూర్వం జంతుడిని చూసుకున్నట్లు గానే ప్రేమతో చూసుకున్నారు. వారం పెరిగి సమర్థులుగా పేరు తెచ్చుకొన్నారు. కాలం గడిచింది. యజ్ఞం చేయించిన ఋత్విజుడు మరణించాడు. అతడు నరకానికి వెళ్ళి భయంకరమైన అగ్నిలో మలమలా మాడుతున్నాడు. ఇంతలో సోమకుడు గతించాడు. యజ్ఞయాగాలు చేసిన పుణ్యానికి స్వర్గానికి పోయాడు. స్వర్గానికి వెడుతూ, వెళుతూ, తనకి యజ్ఞం చేసిన ఋత్విజుడు నరకములో బాధపడుతూండటం చూశాడు. ఈ బాధకు కారణమేమని అడిగాడు. “నరమేధములో ఋత్విజుడిగా పని చేయటం చేత ఇది సంభవించింది. నీవే నన్ను కాపాడాలి” అని ఋత్విజుడు పలికాడు. దానికి సోమకుడు యముడి వద్దకు వెళ్ళి “ఈ ఋత్విజుడు నా మూలాన కదా ఈ నరకములో మగ్గుతున్నాడు. అతడిని నాతో స్వరానికి తీసుకువెళతాను” అని పలికి, ఒప్పించి అతడిని తన వెంట పుణ్యగతికి తీసుకు వెళ్ళాడు. స్వర్గ లోకం రాజును ప్రస్తుతించింది.

ఈ కథను గమనిస్తే, ఇందులో నరవేధం జరిగింది. చేసిన రాజుకు స్వరం, చేయించిన ఋత్విజుడికి నరకం ప్రాప్తించాయి. అయితే తప్పు చేసినవాడి కన్నా చేయించినవాడిదే పాపమెక్కువ అని తెలుస్తుంది. ఆ రాజు తను స్వర్గానికి వెళుతూ కూడా, తన స్వార్థాన్ని వదిలి తన మూలాన నరకములో మగ్గుతున్న ఋత్విజుడిని ఉద్ధరించాడు. ఒక పని చేసినపుడు దాని వల్ల వచ్చే ఫలితం అది మంచైనా, చెడైనా అందరూ పంచుకుంటేనే ధర్మం. లోకంలో వ్యక్తులు మంచీచెడులు, జయాపజయాలు సంభవించినప్పుడు సాధారణంగా అందరూ మంచి, జయాలవైపు వెళ్ళి; చెడును, అపజయాన్ని ఒంటరి చేస్తారు. మంచి నాకు, చెడు నీకు అనడం అక్రమం. రాజు తనతో పాటు ఋత్విజుడిని స్వర్గానికి తీసుకొని వెళ్ళి ఆదరించాడు. అయితే ఈ కథలో నరమేధం ఖండించాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే పుత్రుడిని యజ్ఞం చేసి పొందాలి కాని, పుత్రుడిని యజ్ఞ పశువుగా చేసి యజ్ఞం చేయరాదు. కురుక్షేత్రంలో సరస్వతీ నదీ తీరాన జరిగిన ఈ కథను రోమకుడు ధర్మరాజుకు చెప్పాడు. అరణ్యపర్వం తృతీయాశ్వాసం లోనిది.

(ఇంకా ఉంది)

Exit mobile version