[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
61. తొందరపాటు తెచ్చిన పాటు!
తాత్కాలికాశావేశం, తొందరపాటు, ఆలోచనా రాహిత్యం, అపజయాలు వెంటాడినపుడు వచ్చే వైరాగ్యం – ఎంతటి వారినైనా అనాలోచిత కార్యాలకు ప్రేరిపిస్తాయి. విజ్ఞత, విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. మాటను తూలేలా, చేతలు సిగ్గుపడేలా చేస్తాయి. దీనికి ఎవరూ మినహాయింపు కాదు.
ధర్మవర్తనుడు, అజాత శత్రువైన ధర్మరాజు, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పడు కర్ణుడు సైన్యాధ్యక్షుడుగా ఉండి కౌరవసైన్యములను నడుపుతున్నపుడు ఘోరంగా రణరంగంలో అవమానించబడ్డాడు. చావు తప్పి గౌరవం నశించి గుడారం చేరుకున్నాడు. ధర్మరాజు అర్జునుడి బలమును చూసి, కర్ముడిని తప్పుడు చంపుతాడని తలచి యుద్ధం మొదలు పెట్టాడు. కానీ కర్ణుడు పాండవ సైన్యాన్ని అస్తవ్యస్తం చేశాడు. దానితో ధర్మరాజుకు అర్జునుడిపై పట్టరాని కోపం వచ్చింది. “నిన్ను నమ్ముకొని యుద్ధానికి దిగినాను. శత్రువుల వద్ద నన్ను పై కెత్తి క్రిందకి పడద్రోశావు. నీ బేలతనం చేత పాంచాల మత్స్య పాండ్యాదులైన బంధుమిత్రులు నిష్ప్రయోజనముగా చంపబడినారు. భీముని వలన చావు తప్పినది. నిన్ను గడ్డిపోచగా భావించి నన్ను ఆ దురాత్ముడు బంధుహీనుని వలె పరాభవించినాడు. నీ శౌర్యమెక్కడికి పోయినది? నీకు యీ గా౦డీవమెందుకు? నీవు కుంతికి కొడుకుగాక బిడ్డగా పుట్టినా బాగుండేది” అని రకరకాలుగా అనరాని మాటలతో అర్జునుడిని ధర్మరాజు నిందించినాడు. దానితో అర్జునుడికి పట్టరాని కోపం వచ్చింది.
అన్నను దైవంగా భావించే అర్జునుడు ఖడ్గము తీసి ధర్మరాజు పైకి వెళ్ళబోయాడు. కృష్ణుడది గమనించి, “అర్జునా! నీవెవరిని చంపబోతున్నావు. రాజు క్షేమమరయ ఇక్కడికి వచ్చాము. అతడు క్షేమమును చూచి సంతోషించాము. ఇది క్రోధానికి సమయం కాదు. ఎవరిని చంపాలనుకుంటున్నావు?” అన్నాడు.
దానికి అర్జునుడు, “నా గాండీవమును ఎవరైతే తూలనాడుతారో వారిని చంపుతానని ప్రతిన పూనాను. ఈ రాజెంతటి ధర్మాత్ముడైనా యగుగాక! యితనిని చంపవలెను. అట్లు చేయకున్నచో ప్రతిజ్ఞ నెరవేర్చని అసత్యదోషము పట్టును” అని ఆవేశకావేము పొందెను. కాని అతడి పట్ల దైవముండుట చేత మరలా “నీకు ధర్మాధర్మములు తెలుసు. లోకుల కర్తవ్యములు ఎరిగిన వాడవు. నీవు ఎట్లా చెప్పిన అట్లు నడుచుకుంటాను” అన్నాడు.
దానికి కృష్ణుడు “భలేవాడవు అర్జునా?” అని అతడిని అదిల్చి, “వ్యర్థముగ మిడిసి పడుకుము. ధర్మం తెలిసిన వారు యిట్లు చేయరు. ధర్మాయత్తచిత్తుడు, నానా యోగ్య స్థలముల నెరిగి ప్రవర్తిల్లును. సత్యం, అహింస యనునవి శ్రేష్ఠమైన ధర్మములు. విజ్ఞులయినవారు అహింసతో సత్యమును రక్షించుట ధర్మమనియు; అసత్యముచే అహింసను రక్షించుట ధర్మమనియు చెప్పిరి. కర్మ సుక్ష్మము తెలుసుకొనక సత్యమును రక్షించుటకై అన్నను, ధర్మపరుని, మహాత్ముని చంపుట ధర్మమార్గము కాదు. నీవు బాల్యంలో అనుచిత ప్రతిన చేపట్టావు. సత్యాసత్యముల గూర్చి యిట్టి విషయమున ధర్మజ్ఞులు పట్టించుకొనరు. ప్రాణహాని కలుగు సమయమున, సకలధనాపహరణావసరమున చెప్పెడు సత్యము సత్యము కాదనియు. అసత్యమైన నిట్టి సమయమున సత్యమేయగును. నీవు సత్యవాది కౌశికుడి వలె మూర్ఖుడివై ప్రవర్తించకుము.” అంటూ – అజాత శత్రుడు వద్యుడు కాడని తెడుపెను.
“కృష్ణా! నన్ను అనుచితకార్యము నుంచి తప్పించి మేలు చేశావు, కృతజ్ఞుడను. ప్రజలు నన్ను వృథాప్రతిజ్ఞుడని నిందించకుండా, మా అన్న సుఖముగా ఉండేట్లు కార్యము నుపదేశించుము” అన్నాడు. దీనితో కృష్ణుడు, “ఈ ధర్మజుడు యుద్ధములో మిక్కల బాధింపబడుటచే నిన్ను కోపడించుకున్నాడే తప్ప, నీపై కోపముతో కాదు. అతడి మాటలకు నీవు బాధపడకు. నీ ప్రతిన తీరుటకు నీవు మీ అన్నగారిని బాగుగా నిందించి, అదియే అతడిని చంపుటగా తలచుము. పిదప ధర్మరాజునకు నమస్కరించి అతని చిత్తము నలరింపుము. ఇట్లు చేసిన అసత్యదోషము, గురు వధ పాతకము తొలగును” అన్నాడు.
కృష్ణుడు చెప్పినట్లుగా అర్జునుడి ధర్మజుడిని బాగుగా నిందించినాడు. కానీ అన్నగారిని నిందించిన తరువాత తన చేష్టలకు చింతించి, ఒరలో పెట్టిన బాకును తీసుకోని తనను తాను చంపుకోబోయాడు. కృష్ణుడు వారించి, “యిది యేమి పిచ్చిపని” అన్నాడు. “అన్నను నిందించినందుకు ప్రాయశ్చిత్త మిదియె” అన్నాడు అర్జునుడు. దానికి కృష్ణుడు “ఆత్మప్రశంస చేసుకో, అదియే మరణముతో సమానం” అన్నాడు. అర్జునుడు అలాగే చేసి, సవినయంగా చేతులు జోడించి, “అన్నా! నా మాటలు పెడచెవిన పెట్టి, నన్ను ప్రసన్నదృష్టితో చూడుము. దయతో వేరుగా తలంపకుము. యుద్ధానికి పంపుము. కర్ణుని చంపుతాను లేదా నేను చనిపోతాను!” అన్నాడు.
అప్పుడు ధర్మజుడు, “భుజబలహీనుడు, యుద్ధభీరుడు రాజుగా ఉండడానికి వీలులేదు. నా వల్ల మీకు కష్టాలు వచ్చాయి. మన కులానికి అప్రియము కలిగించిన పాపాత్ముడినైన నా తల బద్దలు కావలిసినదే. నీవు నాపై దయచూపి చంపకున్నా నేనిక్కడ ఉండను. అడవులకు పోతాను. భీముడికి పట్టం గట్టండి” అని పలికి శయ్య దిగి వెళ్ళబోతూండగా కృష్ణుడు అతడి పాదలకు దండం పెట్టి, “ఓ రాజా! నరుడింతకు ముందు చేసిన ప్రతిన గూర్చి నాకు తెలియదు. ఇపుడు అతడు పలికిన పలుకులు కోపముతో నున్న నీ మనసుకు ఎక్కుట లేదు. గాండీవమును తక్కువ చేసి పలికిన వానిని వధించునని యీతడు ప్రతిన పట్టినాడు. నీవు భావ్యము కాని మాటలాడితివి. పరమ ధర్మమైన సత్య నిష్ఠకు హాని కలుగుటకు ఓర్వక నేను ఆలోచించి యిట్లా నిందించుమని యర్జునునితో చెప్పితిని. పెద్దలను దూషించుట, వధించుట వంటిదన యిట్లు చెప్పితిని. నేను నీ పాదము లంటెదను. మమ్ము కాపాడుము. మా తప్పు పైరింపుము. యేనాడు కర్ణుని కోపించినావో అనాడే అతడు చనిపోయెను. నేను నిజము చెబుతున్నాను. నేడు విజయుడు కర్ణుడిని చంపగలడు. చింత, వంత కోపము విడిచి నాపై ప్రసన్నుడవై మమ్ము నడుపుము” అన్నాడు.
అంతట ధర్మరాజు ప్రసన్నుడయినాడు. కృష్ణుడు అర్జునునితో “ఇంకా నీవు తప్పు చేశావని, అన్న పైకి కత్తి నెత్తావని, దూషించావని బాధపడకు. మీ అన్నగారి అనుమతి పొంది వెంటనే యుద్ధోన్ముఖుడవై కర్ణుడిని చంపుము. ఇతడిన్ని కఠినపు మాటలు మాటలాడినంతనే యీ స్థితికి వచ్చినావే, యిక అతడిని చంపితే యెట్లుండేదో కదా. దైవానుగ్రహమున నీవు యీ ఘోర పాతకము నుండి బయలు పడినావు” అన్నాడు.
అర్జునుడు అన్నగారి పాదములపై పడి కన్నీరుతో అభిషేకించాడు. ధర్మరాజు అతవిని అక్కున చేర్చుకున్నాడు. అటుపై అన్నదమ్ములు పరస్పరం కౌగిలించుకొని సాంత్వన వచనములు పలుకుకొని ఊరడిల్లారు. అంతటి యుద్ధమును ముందు పెట్టుకొని అంతర్యుద్ధము తెచ్చుకున్నందుకు చాలా తొందరపాటు తెచ్చిన పాటును చూసి సిగ్గుపడ్డారు, చింతించారు. తాత్కాలిక కోపావేశాలు తెచ్చే చిక్కులను గ్రహించారు.
చేయవలసిన యుద్ధం వదిలివేసి, చేస్తున్న యుద్ధమునకు తమలో తాము గర్హించి, కృష్ణ ప్రేరితులై కురుక్షేత్ర యుద్ధమనే సముద్రములో వచ్చిన సంయమన రాహిత్యమనే సుడిగుండాన్ని కృష్ణుడనే నావ నధిరోహించి యుద్ధోన్ముఖులయి విజయతీరాలు చేరే ప్రయత్నం చేశారు.
మహాత్ముల నింద, ఆత్మప్రశంస మరణముతో సమానమని సంయమన రాహిత్యం సమస్యలను ఆస్పదమని, తొందరపాటు అసహనం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తెలిపే ఈ అందమైన కథ శ్రీమహా భారతం కర్ణ పర్వము లోనిది.
-No man who is in hurry quite civilized. – Will Durant
-Haste in every business brings failure – Herodotus.
62. అశ్వత్థామ!
మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు భీముడి గదా ఘాతానికి కూలాడు. చివరికి ఒంటరిగా మడుగు దగ్గర రక్తసిక్తమై దీనంగా పడియున్న దుర్యోధనుడిని చూచి జాలిపడి, అశ్వత్థామ అపాండవం చేస్తానని అతనికి మాట ఇచ్చాడు. మాట యిచ్చినట్టుగా కృపాచార్యులు, కృతవర్మకు తన మనసులోని మాటను చెప్పాడు. వారు అధర్మమనమును అంగీకరించ లేదు. కాని అశ్వత్థామ రాత్రివేళ చెట్టుపైన గుడ్లగూబ పక్షి పిల్లలను చంపుట చూచి, అట్లే పాండవ సైన్యమును చంపాలని నిర్ణయించుకున్నాడు.
అదే రాత్రి పాండవ శిబిరం చేరి దుష్టద్యుమ్నుడిని పశువును చంపినట్లు చంపాడు. శిఖండిని, ఉపపాండవులను సంహరించాడు. ఆ తరువాత పాండవ శిబిరాన్ని అల్లకల్లోలం చేశాడు. పాండవులకు విజయం తాలూకూ ఆనందం లేకుండా చేశాడు. ఆ విషయం తెలుసుకొని ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు, భీముడు అశ్వత్థామను వెంబడించారు. తన తండ్రి చావుకి పగ తీర్చుకొన్న అశ్వత్థామకు ఇంకా పగ చల్లారలేదు. అపాండవం చేయాలని నిశ్చయించుకున్నాడు.
లోకహితము మరిచి, వేదవిద్య నేర్పిన మానవత్వాన్ని విడిచి బ్రాహ్మణజన్ముడై పుట్టి పొందిన సంస్కారాన్ని మరిచి, భావోద్వేగానికి గురియై బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు.
దానితో తప్పనిసరియై దానిని నిరోధించుటుకు అర్జునుడు కూడా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే “గురు పుత్రుడికి హాని చేయకు, పాండవులకు క్షేమం కలుగుతూ అస్త్రమును అస్త్రము నివారించుటకు మాత్రమే ప్రయోగించుచున్నాను” అని స్మరించి ప్రయోగించాడు. వ్యాసుల వారు కోరగానే అర్జునుడు దానిని ఉపసంహరించాడు. అశ్వత్థామకు వ్యాసుడు చెప్పినా ఉపసంహరించలేదు. అశ్వత్థామ “నా యస్త్రము పాండవులకు ప్రేమాస్పదులగు కాంతల గర్భములకు హాని కావించి తనకై తను శమించుగాక” అన్నాడు. కాని అశ్వత్థామ పాండవుల సంతానమునకు చెందిన కాంతలయు గర్భముల కెల్ల విధ్వంసం గావించెదనని అస్త్రము ప్రయోగించెను. కృష్ణుడు ఉత్తర గర్భమున నున్న పరీక్షిత్తును అశ్వత్థామ అస్త్రం నుండి కాపాడెను. అధ్వర్థమా మొనర్చిన అకృత్యములకు, గురుపుత్రుడు. బ్రాహ్మణుడు కావటంతో పాండవులు అతడిని చంపక, అతడి శిరోమణిని స్వీకరించి పంపిరి.
వ్యాసులవారు “బాలఘాతివైన నీవు తినుటకు కరువై, ఒళ్ళంతా రక్తం పూసుకుని మూడువేల ఏండ్లు తిరుగుము” అని అశ్వత్థామను శపించెను.
బ్రహ్మజ్ఞానము, అపార శాస్త్ర జ్ఞానము కలిగియు విచక్షణా జ్ఞానము, మానవత్వమూ లేని వాడెట్టి వాడగునో తెలుపునది అశ్వత్థామ కథ.
మహాభారతం సౌప్తికపర్వం లోనిది.
-Men loved darkness rather than Light, because their deeds were evil – Bible.
– Hatred is the coward’s revenge for being intimidated – G. B. Shaw
ఉత్తమే క్షణ కోపస్య మధ్యమే ఘటికాద్వయం।
అధమేస్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతకం॥
63. సంసారము కథ!
ఒకానొక దుర్గమమైన అరణ్యంలో బ్రాహ్మణుడు పోవుచున్నాడు. అక్కడ ఉన్న శరభసింహ మృగములను చూచి భయపడినాడు. భయము కలిగి, దోవ తప్పాడు. ఇంతలో అతడికి దొంగలు కనిపించారు. అదడికి గగుర్పాటు కలిగినది. మేను కంపించినది. కాళ్ళు తొట్రుపడగా, ప్రాణభయం కలుగగా మరింత దూరం వెళ్ళాడు. అడవికి ఎంతము అంతము కనబడలేదు. అతడికి ఆ భయంకరమైన అడవిలో ఎక్కడ చూచినా ఒడ్డిన వలలు కనబడినాయి. ఘోరమైన ఆకారముతోనున్న ఒక పడతి అతడిని కౌగిలించుకున్నది. అయిదు తలలుగల యేనుగులు అక్కడ తిరుగసాగాయి. ఆ ప్రదేశమున ఒక కూపము తీగలచే ఆవరించబడి, మీద గడ్డి మొలుచుటచే కనబడకుండా ఉంది.
ఆ బ్రాహ్మణుడు ఆ బావిలో పడి ఒక బలమైన తీగను బట్టి, తలక్రిందై వ్రేళ్ళడుచూ, కొమ్మనున్న పనసపండు వలెనుండెను. ఆ కూపమున ఒక భయంకరమైన సర్పము నాలుకలు చాచుచున్నది. ఆరు తలలు, పన్నెండు కాళ్ళు గల యేనుగు నూతి యొడ్డున నున్న చెట్టును సమీపించి యున్నది. అందు శాఖోపశాఖల యందు నానా వర్ణములగు తేనేటీగలు తేనెను నిలవ చేసి యున్నవి. నలుపూ తెలుపూ గల యెలుకలు చెట్ల వేళ్ళను నరుకుచుండెను. తేనె ధారలు కారుచుండగా, అతడు ఉత్సాహంతో త్రాగుచూ, అట్టి దుస్థితిలో కూడా తృప్తి పొందలేదు.
ఆ గజములను, దొంగలను, భయంకర కామినిని, కూపము నున్న సర్పమును, నూతి దరి నున్న యేనుగు చూపెడి ఘోరత్వమును, ఎలుకలా చెట్టు వేళ్ళను కొరికి దానిని పడగొట్టుటను – చపలమగు తేనెటీగల బాధను చూచియు అతడు వికల చిత్తుడై యుండియు జీవితాశ విడవక యుండెను.
ఈ కథంతా విన్న దృతరాష్ట్రుడు విదురునితో “వివేకవంతుడా! మనసులో జాలి పుడుతుంది. ఆ స్థితిలో అతడికెట్లు విముక్తి కలుగుతుందో తెలుపుము” అన్నాడు. విదురుడు “ఆ దుర్గమారణ్యం సంసార గహనము. సింహశరభాలు చోరులును, రోగములు. కామిని వృద్ధాప్యం. అయిదు తలల యేనుగులు పంచేంద్రియములు. బావిలో నున్న పాము యముడు. తీగ జీవితాశ. నూతి యొడ్డున ఉన్న చెట్టు ఆయువు. దాని దెస నడుచు యేనుగు సంవత్సరం, దాని ఆరు తలలు ఋతువులు, దాని కాళ్లు పన్నెండు నెలలు.. వృక్ష మూలమును కొరికెడు ఎలుకలు రాత్రింబివళ్ళు. తుమ్మెదలు కామములు. మధుధారలు కామరసములు. తేనెతుట్ట ఆయువు. దాని వలన మానవులు ఆసక్తులవువారం. అట్టివారు సంసార పాశములను తెంపజాలరు!!” అని ధృతరాష్ట్రునకు హితమును ఉపదేశించెను.
మహాత్ములు జనులకు మోక్షేచ్ఛ కలుగుటకై ఆదర్శపూర్వకముగా సంసారమునకు అద్దం వంటి యీ కథను చెప్పిరి.
మహా భారతం స్త్రీపర్వములో విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పినది.
~
ఆయువు వీచి చంచలము, యౌవన మల్ప సుఖోదయంబు, పు
ష్పాయుధ కేళిజన్యసుఖమస్థిర, మర్ధము వాంఛవోలె సా
పాయము, భోగముల్ మెళపులట్లు చలంబు భావాబ్దిలంఘనో
పాయము బ్రహ్మ చింతనము బ్రాయక సేయుండు సజ్జనోత్తముల్
– భర్తృహరి/ఏనుగు లక్ష్మణకవి
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
