Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-26

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

64. బ్రాహ్మణ బ్రహ్మచారుల కథ!

ఒకానొక గ్రామంలో కొందరు బ్రాహ్మణ బ్రహ్మచారులు తమ కులధర్మము వీడి అడవులకు వెళ్లారు. ఇంద్రుడు వారిని చూచి జాలిపడి ఒక పక్షి రూపము ధరించి, వారి దగ్గరికి వచ్చాడు. “మీరెన్నుకున్న మార్గం మంచిది కాదు” అని సెలవిచ్చాడు. ‘ఈ పక్షి ధర్మము తెలిసినది’ అనుకొని ఆ బ్రాహ్మణులు “ఓ పుణ్యాత్మా! సన్మార్గము బోధించుము” అన్నారు.

అప్పుడు ఆ పక్షి “నాలుగు కాళ్ళున్న జంతువులలో గోవు, అనంత శబ్దరాశిలో మంత్రం, లోహజాతిలో బంగారం, మానవులలో బ్రాహ్మణుడు అధికము అని వేదవిదులు అంటారు. కావున బ్రాహ్మణుడు ఉత్తమ మంత్రాలను ఆశ్రయించిన యోగ్యమైన కర్మలను అనుష్ఠించటం వలన రత్నానికి, బంగారానికి పొత్తు కుదిరినట్లు ప్రశంసాపాత్రమవుతుంది.

అలసత్వం వలన, క్రోధం వలన, శోకం వలన ఆ కర్మలను చేయకుండా వదలబం పాపం. అజ్ఞానులైన అర్ధహీనులు సన్న్యాసం ఎపుడు తీసుకోవాలో తెలియక త్వరపడి యిహపరాలకు భ్రష్టులవుతారు. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించి అతిథులను, దేవతలను, పితృదేవతలను సంతృప్తి పరస్తూ శిష్టాహారాన్ని భుజిస్తూ జీవించే పుణ్యాత్ములకు పుణ్యలోకాలు కరతలామలకాలు. బ్రహ్మార్పణ భావంతో చేసే సత్కర్మలు ఆనందాన్ని కలిగిస్తాయి” అని తెలిపింది.

వారు ఆ మాటలు విని, తాత్పర్యాన్ని గ్రహించి, గృహస్థాశ్రమ ధర్మములను ఆచరించటానికి ఇండ్లకు వెళ్ళారు.

ధర్మరాజు యుద్ధానంతరం జరిగిన నష్టాన్ని చూచి దుఃఖించి ఆడవులకు వెళ్ళాలనుకున్నాడు. “యే ప్రయోజనం లేని కర్మరాహిత్యమే మోక్షాన్ని కలిగించేదయితే కొండలు, చెట్లు ముక్తిని పొంది ఉండేవి. కాబట్టి అడవిలో ఉండటమే మోక్షం కలిగించేది కాదు. విధ్యుక్త కర్మలను ఫలము మీద కోరిక లేకుండా బ్రహ్మర్పణ భావంతో సాగించాలి. ఆత్మతత్త్వజ్ఞాన సాధనకు పూనుకుంటే కర్మరాహిత్యం దానంతట అదే కలుగుతుంది. కాబట్టి కర్మలు చేయకపోవటం వలన మోక్షం సిద్ధించదు” అని భీమార్జునులు ధర్మరాజుకు పై కథను చెప్పినారు.

మహాభారతం అడుగడుగునా గృహస్థాశ్రమ ప్రాధాన్యమును మానవ జాతికి బోధిస్తూ, మానవజాతి ప్రగతికి గృహస్థాశ్రమమే పట్టుగొమ్మయని ఎలుగెత్తి చాటింది.

శాంతిపర్వం ప్రథమాశ్వాసం లోనిది.

– Three things are necessary for the Salvation of man to know what be ought to believe, to know what be ought to desire, and to know what be ought to do. -Thomas Aquinas.

– No one without knowledge and asceticism, not without restraint the senses, not without complete renunciation does one find emancipation. – Mahabharatha.

65. సుద్యుమ్న చరిత్ర!

బాహుదా నది తీరములో ధర్మమార్గ ప్రవర్తనలైన శంఖుడు, లిఖితుడు అను బ్రాహ్మణులు ఉండేవారు. వారి ఆశ్రమాలు పూలతో, పళ్ళతో నిండిన చెట్లుతో అలరారుతున్నాయి. ఒకసారి శంఖుడు ఇంట లేనప్పుడు లిఖితుడు అక్కడికి వెళ్ళి ఒక చెట్టున ఆర మ్రగ్గిన పళ్ళమ చూచి, ముచ్చటపడి కోసుకొని తిన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన శంఖుడు “ఆ పళ్ళెక్కడివి” అని ప్రశ్నించాడు.

లిఖితుడు ఆచమించి, అన్నకు నమస్కరించి “ఇచటివే” అని జవాచ్చాడు. దానికి శంఖుడు “అనుమతి లేకుండా పళ్ళను కోయవచ్చా? ఆది దొంగతనము కాదా? పాపం చేసినట్లు నిర్ధారణ అయింది. రాజు చేత శిక్షించబడి పాపాన్ని పోగొట్టుకొనుము. రాజు వద్దకు తక్షణమే వెళ్ళి, నీవు చేసిన పని చెప్పి, దండించమని అడుగుము” అని తమ్ముడితో అన్నాడు.

లిఖితుడు తన తప్పు తెలుసుకున్నవాడై రాజును కలవడానికి రాజు దగ్గరకి వెళ్ళాడు. ప్రతిహారులు బ్రాహ్మణుడి రాకను గూర్చి రాజుకు తెలిపారు. రాజు తన’ మంత్రులతో లిఖితుడున్న చోటికి వచ్చి, “మీరిక్కడికి యే ప్రయోజనాన్ని ఆశించి వచ్చారు? మీరు చెప్పినట్లు నడుచుకుంటాను” అన్నాడు. అపుడు లిఖితుడు, “రాజదండాన్ని ధరించిన వారిలో శ్రేష్ఠుడయిన వాడా, నేను చెప్పినట్లు చేస్తానని ఒప్పుకున్నావు. మాట తప్పరాదు” అన్నాడు. “ఆజ్ఞాపించండి” అని రాజు పలికాడు. “నేను నా అన్న అనుమతి లేకుండా, అతడి చెట్లు పళ్ళు కోసుకోని తిన్నాను. అట్లా చేయటం దొంగతనమే కనుక నన్ను దొంగలను శిక్షించే రీతిలో దండించి, పాపరహితుడిని చేయుము. అట్లా చేస్తే నీకు దండధారిపై కర్తవ్యం నుండి తొలగిన పాపం అంటకుండా ఉంటుంది”‘ అని తెలిపాడు లిఖితుడు.

రాజు “నన్ను ఆ విధంగా ఆజ్ఞాపించటం భావ్యం కాదు” అని మంత్రులతో ఎంతగానో వేడుకున్నా, అంగీకరించకపోవతాతో, చివరికి దండనీతిని చక్కగా అమలు పరిచే సుద్యుమ్నుడు లిఖితుడి చేతులను రెండింటిని ఖండించాడు. అన్నగారి దగ్గరికి వెళ్ళి, లిఖితుడు తెగిన చేతులను చూపించాడు. “చక్కగా దండనను అనుభవించావు. ధర్మ మార్గమును ఎవరూ తప్పకూడదు. కనుక నీకు ప్రాయశ్చిత్తము అవసరమైనది. తప్పు చిన్నదైనా, పెద్దదైనా పాపము సోకుతుంది. దానిని తొలగించుకొని పునీతము కావాలి. వెళ్ళు. వెళ్ళి బాహుదానదిలోని పుణ్యప్రదమైన నీటితో దేవతలకు, మునలకు, పితరులకు తర్పణనిమ్ము” అని శంఖుడు తమ్ముడిని ఆశీర్వదించి తెలిపాడు.

అఖరుడు బాహుదానదికి వెళ్ళి, అన్న చెప్పిన పని చేయగానే చేతులు, మొలిచాయి. అన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని కోరి అద్భుతాన్ని చూపాడు. శంఖుడు “దీనికి ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇది నా తపోవిభవ కారణంగా భగవంతుడు చేసిన అద్భుతం. నీవు పరిశుద్ధుడవని పరమాత్మకు తెలిసింది. సుద్యుమ్నుడు కూడా తన పితరులతో సహా పునీతుడయ్యాడు.” అని తెలిపాడు.

సుద్యుమ్నుడు అనే రాజు దండనీతిని అనుసరించి మోక్షాన్ని పొందాడు అని వ్యాసుడు తెలుపగా, ధర్మరాజు ఆ కథను వినాలని కోరగా వ్యాసుడు చెప్పిన కథ శాంతిపర్వము ప్రథమాశ్వాసములోనిది.

– Punishment brings wisdom. It is the healing heart of wickedness -Plato

66. వ్యాఘ్రగోమాయువు కథ!

పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. అతడు క్రూర కార్యాలు చేయటంలో పేరు పొందాడు. కాలవశాన చచ్చిపోయి పూర్వజన్మ జ్ఞాపకాలతో నక్కగా మరొక జన్మ ఎత్తాడు. ఆ రోజులలో నక్కగా రూపం

ఎత్తి మాంసం ముట్టుకోనని, సాటి జంతువులను చంపనని వ్రతం పట్టింది. అడవిలో రాలిపడిన ఫలాలు, ఆకులు తింటూ బ్రతకసాగింది. ఇది చూచి తోటి నక్కలు “ఇదెక్కడి న్యాయం? మేము మాంసం తెచ్చిపెడతాము తిని సుఖంగా జీవించుము” అన్నాయి. కాని నక్క వారి మాటలు వినలేదు.

ఇదంతా ఆ అడవిలోని పులిరాజు విని, నక్క దగ్గరికి వచ్చింది. వచ్చిన పులి నక్కతో “ఓ పుణ్యాత్ముడా! నీవు చాలా మంచివాడవని విన్నాను. నీవు నాతో సఖ్యతగా నుండుము. లోకము నన్ను క్రూర జంతువు అనుకుంటున్నది. దానిని నీ ఉపదేశాలతో తరిమి కొట్టుము” అన్నది. “పులిరాజా! నీవు ఆశ్రయించదగిన వాడివే. కాని, నా మనసు సుఖాల మీదికి పోకుండా ఉన్నది. అందువలన నీ మాటలు నాకు నచ్చటం లేదు. సౌఖ్యలు అనుభవించక పోతేనేమి? నాకు తెలిసినంత మట్టుకు నీకు మంచీ చెడ్డలు తెలుపుతూ స్నేహంగా ఉంటాను. అయితే మన స్నేహాన్ని భృత్యులు ఓర్వలేరు. నిన్ను నన్ను నిందిస్తారు. కలవర పరచి వైరం పెట్టుకుంటారు. వారి మాటలు వినకుండా ఉంటేనే నీ దగ్గర ఉంటాను. అట్లాగని బాస చేసి నన్ను ఆదరించుము” అన్నది. దానికి పులి అంగీకరించింది.

నక్కను పులి ఆప్యాయంగా ఆదరించటము, నక్క ఎంతో విచక్షణతో మంత్రిత్వాన్ని నిర్వహించటము మూల భృత్యులకు గిట్టలేదు. వారంతా ఒకనాడు సమావేశమయ్యారు. పులికి నక్కకు వైరం తెచ్చే పథకం పన్నారు. ఒకనాడు పెద్దపులి తినే మాంసాన్ని మూల భృత్యులు ఎంతో చాకచక్యంగా ఎత్తుకు వెళ్ళారు.. నక్క ఉండే కొండగుహలో ఒక మూల దాచిపెట్టారు. రాజు తినే పదార్థాన్ని భద్రపరిచే పని నక్కదే, కనుక ఎప్పటివలె మాంసాన్ని దాచబోగా కనిపించలేదు. ఎవరో ఎత్తుకు పోయి ఉంటారని గ్రహించుకొని ఆ సంగతి పులి దృష్టికి తెచ్చింది.

పులి వెంటనే వెదకటానికి పురమాయించింది. అది పసికట్టిన సేవకులు కుట్ర పన్నిన వారై మాంసం వెదికే వారికి అది కంటబడేటట్లు చేశారు. దీనితో పులికి నక్క మీద మనసు విరిగిపోయింది.

అది కనిపెట్టి సేవకులు, “నక్క ఏమిటి? వ్రతమేమిటి? నీ మాంసం కాజేసినపుడే చేతికి అందుబాటులో ఉన్నట్లయితే సంకోచించకుండా ఇంకా ఏమైనా చేసేది. ఈ నక్క పాప భయము కలది. ధర్మమనే మాయ తొడుగు తొడుక్కున్నది. ‘నక్క అట – మాంసాహారి కాదట’. ఇంతకాలం ఎంత మోసగించింది. ‘ఈ నక్క అన్ని రాచకార్యాలు చూచుకుంటుంది కదా’ అని మేము మీ శాసనానికి కట్టుబడి పల్లెత్తు మాట అనాలంటే భయపడే వారము” అని పలికారు. ఆ మాటలు విన్న పులి కోపంతో మండిపడుతూ, “నక్కను వెంటబెట్టుక రండి, చంపండి” అని ఆదేశించింది. ఇదంతా విన్న పులి తల్లి కుమారుడి దగ్గరికి వచ్చి “నీవెంతటి మూర్ఖుడివి. ఇట్లాంటి లేని పోని కల్పితాలు కల్పించటం నక్కకు చేతనవుతుందా? సేవకులు పుట్టుకతో వంచకులు. వారు ఎన్నైనా చేస్తారు. అయ్యో నీ తెలివి తెల్లారింది.

“బుద్ధిమంతునివలన దుర్బుద్ధు లధికు
వలన హీనులు రూపసివలనఁ గొనటి
వా రసూయలు సేయుదు రీరసమున
నింత యెఱుఁగంగవలవదే? యీవు గొడుక!” (12-3-70)

మంచివారిని చూచి చెడ్డవారు, గొప్పవారిని చూచి తక్కువవారు, అదరగాళ్ళను చూచి అందంగా లేనివారు సహించరు. లేనిపోని దోషాలు ఆరోపిస్తారు. ఈపాటి విషయాలి. నీకు నీవు గ్రహించుకోవద్దా.

“ధర్మ మధర్మము భంగి న
ధర్మము ధర్మంబు మాడ్కిఁ దనయా! తోఁచున్‌
నిర్మలమతి నరయవలయు
ధార్మికతన కోరువాఁడు తన కేర్పడఁగన్‌.” (12-3-71)

“ధర్మము అధర్మము వలె, అధర్మం ధర్మమువలె అనిపించవచ్చును. ‘ధర్మం ఇది’ అని తెలుసుకొన దలంచినవాడు తనకు తేటతెల్ల మయ్యేదాక మంచి మనసులతో ఆలోచించుకోవాలి.

ఈ నక్కు వచ్చిన దగ్గరి నుండి చేసిన ఉపకారాన్ని చూసి యైనా ఇట్లాంటి వాడు ఎట్లా చేస్తాడు? అని ఒక్కక్షణం యోచించుకోవద్దు?

“హితుఁ డగు మంత్రిం గుటిలుల
యతి కపటోపాయములకు నగపడి చెఱుపన్‌
మతిఁ దలఁతురె? పతి సుపరీ
క్షితంబు గావింప కొకటి సేయం దగునే? (12-3-73)

వంచకుల మాయ మాటలలో పడి మన మంచిని కోరే మంత్రిని చంపాలనుకోవటం భావ్యమేనా? రాజు అయిన వాడు వెనుక మందు పరిశీలించకుండా హాని చేయ పూనుకోవటం సరైన నిర్ణయం కాదు, ప్రతి పని విచారించి అమలు పరచాలి” అని పలికింది. పులికి జ్ఞానోదయమైనది నక్కను అక్కున చేర్చుకున్నది. నక్క “ఓ పులిరాజా! ఒక విషయం వినుము. నీవు ఒకనాడు సభలో అందరి ముందు మెచ్చుకొని, నేడు అవమానించి, నా పరువును చివరంతా చెరిపివేశావు. తెలిసియో, తెలియకో మరొకడిని చిన్నబుచ్చి ఆ తరువాత స్నేహితుడిగా చేసుకొనటం ధనవంతుడికి మంచిదేనా? అట్లా అవమానించబడిన తరువాత బ్రతికేవాడికి మంచి జరుగుతుందా?” అని పలికి అడవుల్లోకి వెళ్ళిపోయింది.

ప్రతి వ్యక్తి పరిశీలించుకొనకుండా ఇతరులకు హాని చేయ పూనుకొనటం సరైన నిర్ణయం కాదు. ప్రతి పని విచారించి అమలు పరచాలి అని ఈ కథ తెలుపుతుంది. రాజుకు, అధికారులకు చెవులే కాక కళ్ళు కూడా ఉండాలి. చెప్పుడు మాటలు వినకుండా ప్రతీది చూచి, తెలుసుకొని, ఆలోచించి నిర్ణయించాలి. లేకుంటే దుష్టులు, కొండేలు చెప్పేవారు, ఈర్ష్యాళువులు చుట్టూ చేరి రాజుకు, ప్రజలకు హితులైన వారిని దూరం చేసి, రాజ్యానికి చెడు చేస్తారు. కావున ‘అధికార స్థానంలో ఉన్నప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి యేపనైనా చేయాలి’ అని ఈ కథ తెలుపుతుంది.

“ఓ తాతా! సౌమ్యులు అసౌమ్యులుగానూ, అసౌమ్యులు సౌమ్యులుగా కనిపిస్తుంటారు. మనసుకు అంతు పట్టుకనున్నది. వీరు ఇట్లాంటి వారని వేర్పాటు చేసి తెలుసుకోవాలంటే మార్గమేమున్నది” అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు వ్యాసుడు చెప్పిన కథ యిది.

శాంతి పర్వం తృతీయాశ్వాసం లోనిది

– రాజా పశ్యతి కర్ణాభ్యాం – A king perceives by his ears.

– One man’s word is no man’s word; we should quietly hear both sides. – Goethe

(ఇంకా ఉంది)

Exit mobile version