Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-28

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

70. సుమిత్ర రాజ చరితము!

ఆశకు అంతూ పొంతూ ఉండదు. ఆశ తీరకపోతే దాని కన్నా మించిన బాధ ఉండదు. హైహయ వంశపు రాజు సుమిత్రుడు. అతడు ఒకనాడు వేటాడబోయాడు. అక్కడ ఒక జంతువును బాణంతో కొట్టాడు. అది బాణంతో ఎటో పారిపోయింది. రాజు దాని వెంట పడ్డాడు. అది చేతి కందినట్లే అందుతూ చాలా దూరం పోయేది. మరి కొంత సేపటికి కంటికి కనబడకుండా వెళ్లేది. కాలి గిట్టలను బాట్టి దాని జాడను తెలుసుకుంటూ పరుగెత్తగా, చిటికెలో కంటపడి ఆశ పెడుతూ కారడవిలో కలిసిపోయింది. అట్లా ఆ జంతువు వెంట పడి బాగా అలిసిపోయాడు. రాజు దగ్గరలో ఉన్న ఒక ముని పల్లెకు చేరుకున్నాడు.

ఆ మునులు పళ్ళూ నీళ్ళూ ఇచ్చారు. అపుడు ఋషభుడు అనే ముని రాజుతో “నీవు ఒంటరిగా ఆరణ్యంలోకి ఎందుకు వచ్చావు? బాగా దిగులుగా కనిపిస్తున్నావు?” అని అడిగాడు. రాజు,  “ఒక జంతువు నేను కొట్టిన బాణంతో పాటు పారిపోగా దాని వెనుకపడి, ఎంతో ఆశగా దాని వెంబడి వచ్చాను. అది నన్ను నానా తిప్పలు పెట్టి అడవిలో కలిసిపోయింది. వేటాడితే జంతువు చేయదాటిపోతే ఆ వేటగాడు ఎంతో నొచ్చుకుంటాడు. ఆశ ఇంత తప్పించుకోలేనిదా” అన్నాడు.

అప్పుడు ఋషభుడు, నేను ఒకప్పుడు తీర్థయాత్ర చేస్తూ, బదరికాశ్రమములో  ‘తనుడ’నే పేరుగల ఒక తాపసిని చూశను. మునిని చూడగానే నమస్కరించాను. అతడు చక్కని అతిథ్యము ఇచ్చాడు. అతడి దగ్గర ధర్మోపదేశాలు వింటుండగా ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ముఖం ధుఃఖంతో నున్నది. వెంట భార్యా, పరిజనము ఉన్నారు. ముని రాజుకు అతిథి మర్యాదలు చేశాడు. ‘ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. రాజు, ‘నాకు ఒక్కడే కొడుకు చాలా బుద్ధిమంతుడు. ఆడుకోవడానికి ఆడవిలోకి వెళ్ళాడు. తిరిగి రాలేదు. నేను వెతకడానికి వచ్చాను. ఎక్కడా కనబడలేదు. ఆశ తీర లేదనే కలవరపాటుతో ఆదుర్దా పడుతూ వచ్చాను’ అన్నాడు.

ముని మౌనం వహించాడు. మౌనంగా ఉన్న మునితో రాజు, ‘బాగా ఆశ పడినపుడు ఆ ఆశ అడియాస అయితే మనసు ఇంతగా తట్టుకోలేని దవుతుందా?’ అన్నాడు. అప్పుడు ఋషి,
‘ఏ నరుఁడు మానసము ధృతి | నూన నుచితవృత్తి నుండు నుదిలగొనక యెం
దైనను నెయ్యది యేనియు | వానికి దుర్లభములేదు వసుధాధీశా!’ (12-3-161)

‘ఎపుడైనా, ఎక్కడైనా ఏ విషయంగానైనా మనసుని దిటవు పరుచుకొని తగిన రీతిలో నడుచుకుంటే అతడికి లభ్యం కానిది ఉండదు. డబ్బు ఆశించే యాచకుడిని చిన్న బుచ్చకుండా కోరుకున్నది సులభంగా పొందేటట్టు సహాయ పడేటట్లు సహాయపడే ధన్యుడు అన్ని లోకాలలో వెదికినా దొరకదు’ అని పలికి, మునుపటి జీవన సరళి గుర్తుకు రాగా ఇట్లా అన్నాడు. ‘ఒక గుణవంతుడు తన తండికీ, బట్టకు కావలసిన డబ్బును సాయం చేయమని ఒక ధనవంతుడైన రాజును అడిగాడు. ఆ రాజు యొక్క మూర్ఖత్వం చవి చూసి, ఆశ తీరని వాడై, పైరాస వదులుకున్నాడు. ఎవరినీ ఎట్ట కోరికలు కోరనని వ్రతం పట్టినాడు. ఒక సారి నేను, ఆ రాజును డబ్బు అడిగినా ఫలితం దక్క లేదు. దానితో విరక్త కలిగి మునిన్యయాను’ అని స్ఫష్టపరిచాడు. మరలా ‘ఇస్తానని ఇవ్వని వాడి మీద, కృతఘ్నడైన దుష్టుని మీద, మనసును ఆశకు వశం చేసిన పేదరాలైన నీచ స్త్రీ పట్ల ఆశలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా ఎన్నో విషయాలలో పరుగులు పెట్టే అన్ని ఆశలు వదలుకొనుము. సుఖ పడతావు.   ఆశ చంపుకుంటే సుఖము’ అని పలికి ఆ వీరద్యుమ్నుడిపై జాలి పడి తన తపోబలంతో అతడి కొడుకు భూరిద్యుమ్నుని రప్పించాడు. వీడ్కోలుతో సాగనంపాడు” అని చెప్పాడు. ఆ విధంగా ఋషిభుడు సుమిత్రుని మనసు మళ్ళీ వేట మీదకు మళ్ళకుండా ఉండేట్లు చేశాడు. ఆశ నెరవేరకపోయినా బాధ పడకుండా  సుఖంగా ఉండాలి అని  భీష్ముడు ధర్మజునికి చెప్పినది.

శాంతి పర్వము తృతీయాశ్వాసము లోనిది.

వళిభిర్ముఖమాక్రాంతం పలితేనాంకితం శిరః।
గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే॥.

71. కాపవ్యోపాఖ్యానము!

పారియాత్ర పర్వతం మీద ఒక బోయవాడు ఉండేవాడు. అతడు న్యాయపరుడు. విలువిద్యలో మంచి నేర్పరి. జంతువుల తీరు తెన్నులు బాగా ఎరిగిన వాడు. అడవులలో తిరగటానికి అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులంటే ఎంతో భక్తి. వాళ్ళు తృప్తి పడేటట్లు వాళ్ళకు కావలసిన పండ్లు కందమూలాలు, తేనెలు, మాంసము, అన్నము కూరలు అన్నీ సమకూర్చి పెట్టేవాడు.

వాళ్ళు ఇష్టపడేట్ట్లు పడుకోవటానికి పక్కలూ, కూర్చువటానికి పీటలు అన్నీ ఏర్పాటు చేసేవాడు. అక్కడ ఉండే మునులందరికీ కావలసిన ఆహార పదార్థాలు ఆందించేవాడు. పగవాడనిపిస్తే చాలు యుద్ధములో రుద్రుడై ఒక్కడే వేయిమందిని చంపేవాడు. ఆ బోయవాడి పేరు కాపవ్యుడు.

అతడి పరాక్రమాన్ని చూచి ఆ కొండ మీద ఉండే దొగంలంతా కూడా మన కందరికీ ఒక రక్షకుడు కావాలని అనుకొని, తమందరికీ నాయకుడిగా ఉండటానికి కాపవ్యుడిని కోరాలనే నిర్ణయానికి వచ్చి దొంగలంతా కలసి సంతోషంగా అతడి దగ్గరికి వెళ్ళారు. ఎంతో మర్యాదగా అతడితో, “నీవు బలపరాక్రమాలు, మంచి ప్రవర్తన కలవాడివి. మా అందరికీ నాయకుడవై మమ్మల్ని కన్న కొడకుల వలె కాపాడుకో. మా చేత కావలసిన పనులు చేయించుకో” అన్నారు. అపుడు కాపవ్యుడు “స్త్రీలను, ప వాళ్ళను, మునులను చంపకూడదు. మన మీదికి రాని వాడి మీద పోవటం మహా పాపం. ఆడవారిని చెర పట్టరాదు. క్రూర సాధు జంతువులన్నిటిలో ఆడ జంతువు ప్రాణం తీయకూడదు. ఆవులను, బ్రహ్మణులను కష్టపెట్టకూడదు. వారి మేలు కోరి యుద్ధం చేస్తే పుణ్యము. పంట పొలాలన్నీ నాశనం చేయటం పాపము. ప్రజలను బాధించి తన పొట్ట నింపుకునే వాడు శవాన్ని దొలిచే పురుగు. శవం నశించగానే తాను నాశనమయినట్లు ఆ లబ్ధి నశించగానే తాను నశిస్తాడు. మీరంతా న్యాయాన్యాయాలు తెలుసుకొని నేను చెప్పినట్లు బ్రతకండి. మీకు నాయకుడినై మీతో సౌఖ్యము పెంచుతాను. మీ మంచీ చెడులు కనుక్కుంటాను” అని చెప్పాడు.

ఇట్లా ఆ కాపవ్యుడు మంచి వారికే మేలు జరిగేటట్లు దొంగలను పాపపు పనుల నుండి మళ్లించాడు. తానూ, వాళ్ళు ఇహ పరలోక సౌఖ్యాలు సాధించుకుని ఎంతో మేలు పొందారు.

దొంగలైనా, విరోధులైనా ఎవరైనా అతిధర్మపరులైతే గౌరవింపబడతారు అని తెలిపే ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

శాంతి పర్వము తృతీయాశ్వాసము లోనిది.

The wise man deals with virtue and faults as Shiva (dealt with) the moon and the poison. He praises the former with his head and keep the latter in his throat.

72. మూడు చేపల కథ!

ఒక మడుగులో మూడ చేపలు ఉండేవి. దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు వాటి పేర్లు.  ఈ మూడు ఎంతో స్నేహంగా ఉండేవి. ఇంతలో వేసవి కాలం వచ్చింది. దీర్ఘదర్శి (రాబోవు దానిని ముందుగా చూచువాడు) తన మిత్రులైన ప్రాప్తకాలజ్ఞుడు(కాలం ప్రాప్తించినపుడు ఉపాయం తెలుసుకునేవాడు), దీర్ఘసూత్రుడు (నెమ్మదిగా పనులు చేసేవాడు) దగ్గరికి వచ్చింది.

వచ్చి “మనము నవిసించే చెరువు ఎండిపోవుచున్నది. నీరు ఇంకిపోతే మరొక చోటికి వెళ్ళలేము. ఇట్లాంటి సమయంలోనే ఎప్పుడు నీళ్ళు నిండుగా ప్రవహించే చెరువులోకి చేరుకోవటం మంచిది” అన్నది. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు, “ఏది సంభవిస్తుందో దాని తీరు తెలుసుకోవాలి. ఏ మాత్రం ఏమరకుండా అప్పటికప్పుడు దానికి తగ్గట్టుగా ఎంతో ఉపాయంగా ఆ పనిని సాధించుకోవాలి” అన్నది. దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుల మాటలు విన్న దీర్ఘసూత్రుడు, “ఏమిటి ఈ తొందరపాటు? చెరువు యిపుడేమయినా ఎండిపోయిందా ఏమి? సముద్రం వలెనున్నది. పనికిమాలిన అతి ఆలోచనలు కట్టి పెట్టిండి. అవసరాన్ని బట్టి అపుడు చూసుకుందాం” అన్నది.

దీర్ఘదర్శి, ‘ఇంకా ఈ చెరువులో ఉంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. దీపం ఉండగానే ఇల్ల చక్కదిద్దుకోవాలి’ అనుకొని నీటి జాలు వెంబడి నిర్భయంగా వెళ్ళి పెద్ద చెరువును సంతోషంగా చేరుకున్నది. మిగలిన రెండు చేపలు ఆ మడుగులోనే ఉన్నాయి. కొంత కాలం గడిచింది. వేసవి ముదిరినది. మిగిలిన రెండు చేపలు ఆ మడగులోనే ఉన్నాయి. చెరువులోకి పారే నీళ్ళు ఆగిపోయి తగ్గుముఖం పట్టాయి. చెరువులో నీళ్ళు కూడా ఇంకిపోసాగాయి. అంతలో చేపలు పట్టే జాలరులు చెరువును ఉత్సాహంగా చుట్టుముట్టారు.

చేపలు పట్టే బుట్టలతో, అడ్డు వలలతో, విడి చేతులతో ఎంతో నేర్పుగా జాలరులు చేపలను పట్టుకున్నారు. ఎంతో సంతోషంగా తాళ్ళను కూర్చుతున్నారు. అంతలో ప్రాప్తకాలజ్ఞుడు చేపలు కూర్చిన తాళ్ళలో చక్కగా గుచ్చిన చేప వలె ఒక తాడును కరిచి పట్టుకున్నది. జాలరులు చేపలు పట్టుతాం అనగానే చటుక్కున తాడును వదిలి మడుగు చేరుకోవాలని అనుకొని, చేపల గుత్తలోకి దూరి, రెండు దవడలతో తాడు కరిచి పట్టుకున్నది. గుచ్చిన చేపల వలె సొమ్మసిల్లిన దాని వలె నుండగా, ఆ చేపల గుత్త పట్టుకున్న జాలరివాడు చేపలు పట్టటము ఆపి, మంచి నీళ్ళలో బురద పోయేటట్టుల జాడించేటప్పుడు తాడును వదలి పెట్టి ఆపద నుండి తప్పించుకున్నది. ప్రమాదాన్ని దాటి తత్తరపడుతూ, కనీసం కాలానికి తగిన విధంగా చైతన్యాన్ని తెచ్చుకొని ప్రాణాలను కాపాడుకున్నది.

ప్రంపంచలోని వ్యక్తులు దీర్ఘదర్శుల వలె భవిష్యదర్ధులై ప్రణాళికాబద్ధంగా పని చేస్తూ తమ కార్యరంగంలో విజయాలు సాధించి, ఎప్పుడూ అభివృద్ధి పథంలో నడుస్తారు. ప్రాప్తకాలజ్ఞలు సమయోచితంగా వ్యవహరిస్తూ, వచ్చిన ఆపదలను ఎట్లో గట్టెక్కుతూ దిన దిన గండం దీర్ఘాయుషు అనుకుంటూ యేదో విధంగా విజయవంతమైన చోటును చేజిక్కించకుంటారు.

ఇక మిగిలినది దీర్ఘసూత్రుడు వంటి వారు. వీరు సోమరులు. మూర్ఖులు. వారికి తెలియదు, చెబితే వినరు. ‘ఎపుడో వచ్చే కష్టానికి ఇప్పుడు ఆలోచించడము దేనికి, ఇప్పుడు బాగానే ఉన్నాము కదా. ఇప్పుడు సుఖాలు వదిలి కష్టాలు పొందటం దేనికి’ లాంటి ఆలోచనలు కలిగి ఉంటారు.

చాపక్రిందకి నీరు వచ్చినా మేలుకొనరు. ఇట్టివారు వ్యవస్థలకు అదృష్ట వశాత్తువనో, మారే రంకంగానో అధిపతులైతే, నాయకులైతే వారు నష్టపోతారు, వారిని నమ్మినవారిని నట్టేట ముంచుతారు. ఇందులో దీర్ఘదర్శులే ప్రశాంత జీవనాన్ని గడిపేవారు.  ప్రాప్తకాలజ్ఞులు ధైర్యవంతులైనా చివరి వరకూ వారి వ్యవహారము వారికీ, ఇతరులకూ సందేహస్పదమే, ఎందుకంటే ఎపుడూ మన మనుకున్నట్లు జరుగదు కదా.

ఇక జాలర్లు చుట్టుముట్టగా తన కర్మకు తనను తాను నిందించుకుంటూ తన యీ దుస్థితికి ఇతరులనూ నిందిస్తూ ఎటూ పోయే వీలు లేక, ఆపత్కాలమునకు ఉపాయం తట్టక ఒక జాలరి చేతిలో దీర్ఘసూత్రుడు చిక్కింది. వెంటనే దానికి భయంతో శరీరం స్వాధీనం తప్పింది. గుండె పట్టు తప్పింది. జాలరి దానిని త్రాడుకు గుచ్చేలోగానే కన్నుమూసింది.

“విను దౌదవ్వులఁ గార్యము | గనికొని వలయుపని మున్న కావింపఁగ నే
రనిజడుఁడు దీర్ఘసూత్రుం | డను నమ్మత్స్యంబు భంగి నాపద నొందున్‌” (12-3-199)

దూరదృష్టితో తన పనిని ముందుకు తెలుసుకొనాలి. అలా ముందుగా పనిని చక్కదిద్దు కొనలేని మూర్ఖుడు దీర్ఘసూత్రుడనే చేప వలె ఇబ్బంది పడతాడు.

“అప్పటికిఁ దోఁచినట్టులు దప్పకుండ | ననువుతో ధృతి గల్గి కార్యంబు నడపు
నతఁడు ప్రాప్తకాలజ్ఞాఖ్యు నట్లపోలెఁ | బరమ సంశయ మయ్యెడు బ్రదుకు గాంచు” (12-3-200)

అప్పటికి తోచినట్లు ఉపాయంతో ధైర్యంగా పనిచేసుకొనేవాడు ప్రాప్తకాలజ్ఞుడు వలె ఎప్పుడు సందేహంతో కూడిన బ్రతుకు బ్రతుకుతాడు.

“ధుర్యత ననాగతము లగు | కార్యము లూహించి పని తగం జేయు నయా
చార్యుఁడు సౌఖ్యముఁ బొరయును | నార్యస్థితి దీర్ఘదర్శి యను మీను క్రియన్‌” (12-3-201)

రాబోయే పనిని ముందుగా ఊహించుకొని సమర్థవంతంగా ఆ పనిని యుక్తిగా చేసుకొనే నీతి మందుడు దీర్ఘదర్శి అనే చేపవలె సుఖంగా ఉంటాడు.

మానవులు తమ కార్యములలో విజయవంతంగా దూసుకెళ్ళాలంటే భావిదృష్టిగల దీర్ఘదర్శులు అవ్వాలని తెలిపే యీ కథ ధర్మరాజునకు భీష్ముడు చెప్పినది.

శాంతి పర్వము తృతీయాశ్వసములోనిది.

A danger foreseen is half avoided – Thomas Fuller

Where there is no vision the people perish – Bible.

(ఇంకా ఉంది)

Exit mobile version