[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
73. పలితరోమశుల కథ!
అనేక మంది శత్రువులచే చిక్కి బలము కోల్పోయి ఆపదలలో పడిన వ్యక్తి ఆపద నుండి ఎట్లా గట్టెక్కుతాడో తెలిపే కథ.
ఒక అడవిలో ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు తొర్రలో పలితుడు అనే ఎలుక ఉండేది. ఆ చెట్టు పైన రోమశుతుడు అనే పిల్లి ఉంటుండేది. ఆ చెట్టుకు దగ్గరలోనే ఒక కిరాతుడు నిత్యం సాయంకాలం వేళలో జంతువులకు ఉచ్చులు పన్నేవాడు. ఆ ఉచ్చులో చిక్కుకున్న వాటిని తెల్లవారగానే వచ్చి తీసుకొని వెళుతుండే వాడు. ఒకనాడు పిల్లి తిండి కొరకు వచ్చి ఆ ఉరిలో చిక్కుకున్నది.
దీనిని పొంచి చూచిన ఎలుక నిర్భయంగా తన ఆహారం కొరకు తిరుగసాగింది. అంతలో చంద్రకుడునే గుడ్లగుబ, హలకుడనే ముంగీస ఎలుక కంటపడ్డాయి. ఇక వాని దారి నుండి తప్పించుకొని పోయే వీలు లేదని గ్రహించుకున్నది. భయపడింది, కాని ధైర్యం కూడదీసుకున్నది. ఏం చేయాలో ఊహించుకున్నది.
మెల్లగా పిల్లిని సమీపించి “ఓ రోమశా! నేను నా నేర్పుతో నీ ఉరులను తెగ కొరికి నిన్ను విముక్తుడిని చేస్తాను. నేను ఇట్లా చేయటానికి పూనుకోవటం నీ అదృష్టంగా భావించుము. మనసు లోపల పగను మానుకోనుము. స్నేహభావం పెంచుకొనుపము. ముంగీస, గుడ్లగూబ కంటబడిన దగ్గర నుండి నా శరీరం అంతా వణుకుతున్నది. నాతో నీవు జట్టు కట్టితే, నీ ఒడిలో ఉండి భయం పోగొట్టుకుంటాను” అన్నది. ఎలుక అలా అనగానే, “నీవు ఆపదలో ఉన్న వాళ్ళకు ఆదుకునేవాడివి. నీకు సహాయం చేయల్సిందే. దేవుడు సాక్షిగా నిన్ను కాపాడాలనుకున్నాను. భయపడకుండా నా దగ్గరికిరా. గుడ్లగూబ, ముంగీస నన్ను చూస్తే భయపడతాయి. అవి నా దరిదాపులకు రావు” అన్నది పిల్లి. అలా అనగానే ఎలుక “అట్లా అనుకోనే కదా, నీ పొత్తు ఎంచుకున్నాను. దీని వలన నేను బ్రతకటం, నీవు విడుదల అవటం రెండు తీరుతాయి అని నిర్ణయించుకొని నిన్ను చేరాను” అని పలికింది. పిల్లి పొదిగినట్లోకి ఎలుక పోవటం చూచిన గుడ్లగూబ, ముంగీసలు అక్కడి నుండి వెళ్ళిపోయాయి.
అవి రెండు వెళ్ళిపోవడం చూచి ఎలుక ఎంతో సంతోషించింది. అనుకున్నట్లుగా కాక పిల్లి ఉచ్చులను గబగబ కొరకకుండా మెల్లిగా కొరుకుతూ జాప్యము చేయసాగింది. పిల్లి అది పసికట్టి, “నా వలన ప్రయోజనం పొందిన ఇది నీకు తగునా? ఉరులను కొరకక జాప్యం చేయటం తగునా? చేసిన మేలు మరిచి పోవటం న్యాయమా? కీడు తల పెట్టను, పట్టుదలతో కొరుకుము” అన్నది. పిల్లి మాటలకు ఎలుక “ఆశ్రయించిన వారిని కాదనకుండా కాపాడే స్వభావము నీది. అలాంటి నీకు ఆపద కలిగిస్తానా? కీడు తలపెట్టటం మంచిది కాదు. నా భయం కొద్ది నిను నేను నమ్మలేక ఉరులు తెంపలేకపోతున్నాను. తప్పు పట్టకు. కిరాతుడు చూడగానే తాళ్ళు కొరుకుతాను. నీవు ఉచ్చు నుండి బయట పడి పగవలన ఏమి ఆలోచిస్తావో. ఒక మాట వినుము, బలవంతుడైన వాడితో ఉపాయంగా పొత్తు పెట్టుకున్నా, అతడి మీద ఎక్కువ నమ్మకం ఉంచుకోనటం నీతి కాదంటారు తెలిసిన వాళ్ళు. కిరాతుడి రాకను చూచి చెట్టు పైకి పోతావు నేను కలుగు పోకి పోతాను. అది ఉపకారానికి సరైన సమయం. ఇది నిజానికిక నేను చేయదగిన పని. నీకు తెలియనిది కాదు” అన్నది. దీనికి పిల్లి “ఓ పుణ్యాత్ముడా! నీవు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు. నేను నీ ప్రాణాలు కాపాడాను కదా. నీవు అలాగే ఆపద నుండి కాపాడాలి కదా” అన్నది. అపుడు ఎలుక, సరైన తరుణములో చేసిన ప్రయత్నమే సంపుర్ణంగా సఫలమవుతుంది. మరోకటి ఆలోచించకుండా ఉరులను కొరుకుము అన్నది.
ఇలా సంభాషణ జరుగుతుండగా, కొంతమంది వేటగాళ్లు వేటకుక్కలతో మరియు కిరాతుడు కరకు కత్తి పట్టుకొని ఆర్భాటంగా వచ్చారు. ఆ కిరాతుడి పేరు పరిఘుడు. ఆ పాపిష్టిని చూచిన పిల్లి “యమకింకరుడి వలె కిరాతుడు ఇటే గబగబా వస్తున్నాడు. ఇంక నేనేమి చేసేది?” అని మరింత భయపడసాగింది. ఎలుక అదంతా విన్నది. భయపడకుమని పిల్లితో చెప్పి చకచకా ఉచ్చులు కొరికి తెంపివేసింది. కలవరపడ్డ మనసుతో పిల్లి చకచకా చెట్టు మీదికి ఎక్కంది. ఎలుక కలుగులోకి దూరింది. ఇంతలో పరిఘుడు ఎంతో సందడి చేస్తూ వచ్చాడు. ఉచ్చులన్నీ నుగ్గుకావటం చూసి, బాధపడుతూ వెనుదిరిగి పోయాడు. అపుడు పిల్లి ఎలుకతో గౌరవభావంతో
“మేలుసేసి తగిన మిత్త్రునిఁ బడసి త
త్సుచరితముల వచ్చు సుఖము లనుభ
వింపఁ జూచుటుడిగి వేర్పడి యుండుట
యరయ నీతివిదుల తెరువుగాదు (12-3-223)
మంచి ఉపకారము చేసి మంచి మితృడిని సంపాదించుకొని, అతడి నడత వలన కలిగే సౌఖ్యాలు అనుభవించకుండా వేరు వేరుగా ఉండటం నీతి కాదు. ఓ పుణ్యాచ్ముడా ! భయం కలగటం అనేది ఆలోచిస్తే అది పిరికితనమే, నన్ను నమ్మి భయాన్ని పోగొట్టుకొని మేలు చేశావు. ఇప్పుడు నమ్మకపోటం భావ్యమేనా! నీవు నా కలిమి అనుభవించదగిన వాడవు. ప్రీతితో రా. బలవంతులైన చుట్టాలూ, నేను నీకు మంచి చేస్తాము. నాతో కలసి మెలిసి ఉండుము. చక్కగా బ్రతుకుదాము. సందేహించకు నీ కోరికలను తీర్చుకో” అన్నది.
అపుడు ఎలుక “నీ పలుకులు ఉచితమే. నా మాట కూడా వినుము. వీడు శత్రువు వీడు మిత్రుడు అని తెలుసుకోవటం సూక్ష్మమైన విషయమే. ఆ నేర్పు అందరికీ లభించదు. శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా కావటం చూస్తున్నాము. కావున నిన్ను చేరరాదు. అడవులలో ఏనుగులను పట్టుకొనటం కొరకు ఉంచిన ఎరల వలన చిక్కుకొని లొంగినట్లు పగవాళ్ళు తమ స్వార్థం కొద్ది లోబడుతుండారు. పామును పట్టుకొనేటప్పుడు దానిని నమ్మక దాని నోటి నుండి చేయిని తొలగించే మనిషి వలె ఉపాయంతో ఉండాలి. నీవు కోరితే ఎపుడైనా మేలు చేస్తాను. నీవు మాంసాహారివి. నీతో చేరితే ఎపుడైనా నీ మనసు మారవచ్చు. నాపై హింసా భావం కలుగవచ్చు. నీవారు నన్ను చూచి ఓర్వకపోవచ్చు. నన్ను మన్నించు. రాత్రల్లా ఉచ్చులో చిక్కుకొని ఆకలితో ఉన్నావు. చద్దికై పిలుస్తున్నావు. నీకు ఇది తగునా? నీ మాటలు నమ్మి వస్తానా?” అన్నది.
పిల్లి “ఓ పాపరహితుడా! నీవు చేసిన మేలు మరచిపోతానా? పౌరుషం, కృతజ్ఞతా కలిగిన వాడిని. నా ప్రాణాన్ని కాపాడిన నిన్ను విరోధిగా భావిస్తానా? భయపడకుము” అన్నది. ఎలుక “నీ వలన నేను బ్రతికాను, ఈపాటి స్నేహం చాలును. ఇక ముందు నీ దగ్గరకు రాకూడదు.
బలవంతుఁ డైన శత్రుని
వలనఁ బ్రయోజనము గలిగి వలను కలిమిఁ దాఁ
గలిసియు నది గడచనఁగాఁ
దొలఁగ వలయు; నమ్మెనేనిఁ దుదిఁ గీడొలయున్ (12-3-238)
నమ్మఁ దగనివారి నమ్మక యున్నది,
తగిన వారి నైనఁ దద్ద నమ్మి
యుండఁ దగదు; తన్ను నొరులు నమ్మెడు నట్ల
యుండి యొరుల నమ్మకునికి నీతి (12-3-239)
బలవంతుడైన శత్రువుతో అవసరం కొద్దీ స్నేహం చేసినా, ఆ అవసరం తీరగానే అతడి స్నేహాన్ని వదులుకోవాలి. ఒకవేళ నమ్మితే కడకు ఆపదల పాలవక తప్పదు. నమ్మతగ్గని వాళ్ళను నమ్మనేకూడదు. నమ్మదగిన వారినైనా తగినంత నమ్మాలి. ఇతరులు తనను నమ్మేటట్టు నడుకుంటేనే తాను వారిని నమ్మకపోవడం నీతి. నిన్ను నమ్మకుండానే బ్రతుకుతాను. నీవు కూడా యే కిరాతుడి మాయలో పడకుండా బ్రతుకుము. ఇక వెళ్ళము” అన్నది. పిల్లి చాలా సిగ్గు పడి వెళ్ళిపోయింది. ఎలుక తన కలుగులోనికి వెళ్ళి, తననడవడితో సౌఖ్యంగా ఉంది. బలం గల శత్రువు వలన కలిగే ఆపదలను తొలగించుకోనడానికి, అల్పడైన శత్రువునైనా తనతో కలుపుకుపోవాలని
జీవితానికి తగిన ఉపాయాన్ని ఎలుకా పిల్లి తెలిపాయి. స్నేహం చేసేప్పుడు సందర్భానుసారంగా కాక చిత్తవృత్తులు, గుణశీలాలు చూసుకోవాలని ఈ కథ తెలుపుతుంది.
భీష్ముడు ధర్మరాజుకి చెప్పినది. శాంతి పర్వం తృతీయాశ్వాసం లోనిది.
అతి స్నేహః పాపశంకే – Excessive friendship (causes) doubts of Sin.
74. బ్రహ్మదత్తుడు పూజని సంవాదము!
పూర్వం బ్రహ్మదత్తుడనే ఒక రాజు ఉండేవాడు. అతడి పట్టణములో పూజని అనే గోరువంక ఉండేది. అది మంచి మాటకారి. అది ఒక పిల్లను పెట్టింది. ఆ పిల్లకు ప్రతి దినము తీయటి పచ్చళ్ళను తెచ్చి పెట్టేది. వాటిలో మంచివి ఎంచి రాజు కొడుకుకు పెట్టేది. వాడు ఆ పిల్లను మచ్చిక చేసుకొని ఆడుకునేవాడు. ఒకనాడు ఆ పిల్లవాడు దాది దగ్గర లేనప్పుడు, ఆ పిట్ట పిల్లను తలను పగలకొట్టి చంపాడు. కాసేపటికి ఆ పిల్ల తల్లి పూజని వచ్చి చూచి విలవిలలాడింది.
‘అయ్యో! నా పిల్ల, ఆ రాజబిడ్డ, కలిసి మెలిసి తిరిగేవారు. ఏది పెట్టినా అరమరికలు లేకుండా తినేవాడు. ఆడుకునేవారు. అయినా ఈ పాపి నా పిల్లను పొట్టన పట్టుకున్నాడు. రాచబడ్డ కదా! రాజుల సేవ నరకప్రాయం కదా. రాచమూకను నమ్మరాదు. ఇంక వారికి జాలి ఉండదు. చేసిన మేలును మరిచే కృతఘ్నులు, గర్వపోతులు, కఠినులు. పగ తీర్చుకోవలసినదే’ అంటూ గోరువంక తన గోళ్ళతో రాకుమారుడి రెండు కళ్ళూ ఊడ బెరికింది. ఎంతో వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది.
ఆకాశంలో నుండి బ్రహ్మదత్తుడు వినేటట్లుగా “ఓ రాజా! నీ బిడ్డ నా బిడ్డను చంపివేశాడు.. ఫలితంగానే కళ్ళు పోగొట్టుకున్నాడు. అంతే కాని నీ కొడుకు పట్ల నేనేమి క్రూరంగా నడుచుకొనలేదు. చేసిన దానికి ప్రతీకారం చేశాను. నన్ను యే పాపం అంటదు” అని పూజని చెప్పింది.
అపుడు రాజు “నీవు అన్నది నిజమే. నీలో యే దోషం లేదు. అయినదేదో అయింది. కనుక వెనుకటి వలెనే స్నేహంగా ఇక్కడే ఉండుము” అన్నాడు. అపుడు గోరువంక “ఒకరి నొకరం నొప్పించుకున్న ఈ పెను పగ తేలికగా చల్లారిపోదు. అయినా నీ కమ్మని మాటలలో పడి మోసపోయి మళ్ళీ కలిసి ఉండటం తగినది కాదు” అన్నది.
అపుడు బ్రహ్మదత్తుడు, “నా బిడ్డ చేసిన దానికి ప్రతిగా నీవు కనుగుడ్లు బీకావు. ఆ పగ అంతటితో తీరిపోతున్నది. ఎట్లాంటి నీచులైనా దగ్గరకు చేరిన బుద్దిమంతుల మేలును మరిచి నిందమోపుతారా” అని అనగానే బ్రహ్మదత్తుడితో శారిక,
“నెయ్యము సెడినను మాటల
తియ్యఁదనము వట్టి పగ మదిన్ మఱచినఁ జా
వయ్యెం జేటయ్యె గలఁక
యయ్యె నొకటి మూఁడుఁగాక యది మే లగునే? (12-3-256)
వినుము! నేల దోఁచికొనినను దాయాదు
లైన మాట మాటకేని నాఁడు
వారి యెడను గీడు వారక చేసినఁ
బగ జనించు నిట్లు భంగు లైదు (12-3-257)
పగయుఁ గల్గెనేని పాయునె గూఢమై
మ్రాన నగ్నియున్న మాడ్కి నుండుఁ
గాన నమ్మి బేల కాలాంతరంబున
నైనఁ జెడును సందియంబు వలదు (12-3-258)
స్నేహము చెడిపోయినా తియ్యటి మాటలలో పడిపోయి ఆ పగను మరిచిపోవచ్చును. కానీ, దాని వలన చావు కలుగవచ్చును. కలత పుట్టవచ్చు. కీడు పొందవచ్చు. అంతే కాని మంచి జరగదు. భూదురాక్రమణం వలన, దాయాదుల వలన, ఆడవారి వలన, మాటా మాటా వచ్చినందు వలన, అడ్డూ ఆపూ లేని చెడు తలపెట్టటం వలన పగ పుట్టుతుంది. పగ పుట్టాక ఒక పట్టాన పోదు. ఇది చెట్టులో దాగి ఉండే నిప్పు వలె. మనస్సులో దాగి ఉంటుంది. కాబట్టి నమ్మకున్న వెర్రివాడు ఎప్పటికైనా చెడిపోతాడు. ఇందులో సందేహం లేదు. కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను, కన్న సంతానాన్ని, స్నేహితులను నమ్మకూడదు అంటున్నది నీతి శాస్త్రము. కనుక మనసు నిండా పగ పెట్టుకున్న వాళ్ళను నమ్మవ్చచునా? ఇక నీ చతురోక్తులు చాలించుము” అన్నది గోరువంక.
“కాలాన్ని బట్టి జనానికి మంచి చెడులు కలుగుతుంటాయి. వాటిని దాటి చేయటం మన వశమా? నిన్ను వదులుకోవడానికి నేనే మయినా వెర్రివాడనా” అన్నాడు బ్రహ్మదత్తుడు.
ఆ మాటలు విన్న గోరువంక అతడిని చూచి “నీ చల్లని మాటల మాటున దాగిన కోపము సముద్రము లోపల ఎప్పుడూ కణకణమండే బడబాగ్ని వలె మండుతూ ఉంటుంది” అని పలికి రాజు పట్ల తనకు గల అపనమ్మకాన్ని బయట పడనీయక, ఆ రాజు మాటలకు లొంగకుండా ఎంతో ఉపాయంగా తనకు అనువైన చోటుకు వెళ్ళిపోయింది.
ఎవరినీ నమ్మకపోతే మనసుకు ఊరట కలుగదు. నమ్మితే పాపాలు సంభవిస్తాయి. నమ్మటం, నమ్మకపోవటం ఆనే రెండింటిలో ఏది ముఖ్యంగా ఆచరించ తగినదో నిర్ణయానికి రావడానికై, మనము చేయాల్సిన పనిని తేట తెల్లము చేసే కథ ఇది.
భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది. శాంతి పర్వము తృతీయశ్వాశంలోనిది.
అంతస్తాపోబహిశ్శేతం – Inward heat, out word coolness
“దుర్జనః ప్రియవాదీతి నైతద్విశ్వాసకారణం
మధు తిష్టతి జిహ్వాగ్రే హృదయేతు హాలాహలం”
Though a bad man speak soft words that are no ground for confidence him. It is honey on the hip of the tongue and poison in the heart.
75. విశ్వామిత్ర చండాల సంవాదము!
క్షుద్బాధ క్షోభ మాన్యుడినైనా, సామాన్యుడినైనా విడిచిపెట్టదు. ఆకలి ఆదర్శాలను, అన్ని నియమాలను పక్కన పెట్టేలా చేస్తుంది.
త్రేత, ద్వాపర యుగాల సంధి కాలంలో జనం చేసుకున్న పాపం కొద్దీ ఒక కరువు వచ్చింది. ఇది ప్రజలను పన్నెండేళ్ళ పాటు వేధించింది. ఏరులు, చెరువులూ అడుగు పట్టాయి. సేద్యం ఆగిపోయింది. చెట్లూ చేమలు ఎండిపోయాయి. నేల బీడు వారిది. పశువులు చచ్చిపోయాయి. రాజులు మర్యాద తప్పి, ప్రజలను కొల్లగొట్టిసాగారు. అధర్మం అంతకంతకూ మితిమీరిపోయింది. బలవంతులు బలహీనులను పీడించారు. యజ్ఞయాగాదులను, దేవతార్చనలను మానివేశారు. బ్రహ్మణాదులు కుల ధర్మములు తప్పారు. తిండీ తిప్పలు లేని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోయారు. బ్రతికి ఉన్న వాళ్ళు భయపడేటట్లు ఎక్కడ పడితే అక్కడ పీనుగుల కుప్పలు పేరుకుపోయాయి. అట్టి తరుణములో, ముని శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు ఆకలికి తట్టుకోలేక ఎక్కడెక్కడో తిరిగాడు. ధైర్యం సడలింది. అన్నం, మాంసం, కందమూలాలు, పండ్లూ అన్నీ అందరినీ అడిగాడు. ఎక్కడా ఏమీ దొరకలేదు. దప్పికతో తూలిపడిపోతున్న వాడై ఒక మాల పల్లెకు చేరుకున్నాడు. అక్కడ గొడ్ల ఎముకలు గుట్టలు పడి ఉన్నాయి. పందుల డొక్కలూ, కుక్కల పుర్రెలు నేల పరుపుగా దట్టంగా కప్పి వేశాయి. మనసులో కొంచెమైనా ప్రేమ లేకుండా అన్ని రకాల జంతువులను అక్కడ చంపి వేస్తుంటారు. అట్టి పల్లెకు చేరుకున్న విశ్వామిత్రుడు బాధ పడుతూ యిటు అడుగు తీసి అటు వేయలేక నేల మీద సొమ్మసిల్లి పడిపోయాడు. ఊపిరిపోతుంటే ఊరుకోరాదు అనుకొని, ప్రాణము నిలుపుకొనటమే ఉత్తమ ధర్మమని దానికి తగిన ఉపాయం ఆలోచించుకున్నాడు. అపుడే చంపి తోలు తీసి, గాలిలో ఆర బెట్టిన కుక్క మాంసాన్ని చూశాడు. ‘ప్రాణము కాపాడుకొనటానికి కుక్క మాంసము తప్ప నాకు మరొకటి దొరకదు. దీనిని దొంగతనమైనా చేసి దక్కించుకొన వలసిందే’ అనుకున్నాడు.
ప్రాణములు వోవకుండంగఁ బరిహరింప
నొం డుపాయ మెయ్యదియు లేకుండెనేని
మ్రుచ్చిమియు ధర్మ మగు; నధముని ధనంబు
గొనుట యెందును ముఖ్యమై చనుట గలదు (12-3-287)
ప్రాణము పోకుండా తప్పించుకునేందుకు మరే ఉపాయం లేనప్పుడు దొంగతనము చేసి ఊపిరి నిలుపుకోనటం ధర్మమే అవుతుంది. అపుడు నీచుడి సొమ్మైనా పుచ్చుకొనుట ప్రశస్తమైనదే అవుతుంది. కాబట్టి చండాలుర సొత్తు అయినా సరే. ఈ కుక్క మాంసాన్ని దొంగలించి చావును తప్పించుకుంటానని నిర్ణయించుకున్నాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. పల్లె నిదురపోయింది. ఆ సమయంలో మెల్లగా లేచి వెళ్ళి ఆ మాంసాన్ని గట్టిగా పట్టి గుంజాడు. ఆ పక్కనే కునుకు తీస్తున్న చండాలుడు మేలుకున్నాడు. “నీవెవ్వడవు? మాంసాన్ని దొంగలిస్తున్నావు. నేను నిద్రపోవటం లేదు. నిన్ను చంపేస్తాను” అనగానే విశ్వామిత్ర ముని భయపడినాడు. “నేను విశ్వామిత్రుడిని” అన్నాడు. దానితో చండాలుడు ఎంతో వినయంగా మంచం దిగాడు. జాలితో కంటితడి పెట్టుకుంటూ, చేతులెత్తి మ్రొక్కుతూ “మహాత్మా! ఇట్లా చేయటంలో నీ ఉద్దేశమేమిటి?” అన్నాడు. అపుడు ముని “ఆకలి మంటతో శరీరం దహించుకు పోతున్నది. ప్రాణం నిలుపుకోవాలనే కోరిక వలన కుక్క మాంసం తినటం పాపమే అయినా, ఇష్టపడే ఈ కుక్క మాంసాన్ని దొంగిలిస్తున్నాను. అగ్ని పావనుడే అయినా అన్నీ తింటుంటాడు. అలాగే నన్ను భావించు” అన్నాడు.
అపుడు చండాలుడు, “జంతువులన్నింటిలోకి కుక్క చాలా నీచ జంతువు. కుక్క మాంసాన్ని తిని ధర్మానికి ముప్పు కలిగిస్తావు ఎందుకు? మరేదైనా ఉపాయాన్ని వెదుకుము” అనగానే చండాలుడితో విశ్వామిత్రుడు “బ్రహ్మాగ్ని నాకు పెద్ద అండగా ఉండగా నేను భయపడను. ఎలాగైనా ఈ బొందిలో ప్రాణం నిలబెట్టుకోనటయే న్యాయం సుమా. నేను ప్రాణాలతో ఉంటే యీ పాపాన్ని తపస్సు వలన, జ్ఞానం వలన పొగొట్టుకొనగలను. కనుక ప్రాణాధారం అయినా యీ మాంసాన్ని తినకుండా ఉండను” అన్నాడు విశ్వామిత్రుడు. దానికి చండాలుడు. నవ్వి “అయ్యా! అది నీచమన పని కాక న్యాయమైనదా? మీ బోటి ముని సాములు ఇల్లా చేయవచ్చా?” అన్నాడు.
దానికి ఆ ముని, “ఎన్నో పొగడ్తలు పొందిన అగస్త్యముని రాక్షస మాంసం తినలేదా? ఆ ముని తేజానికి, గౌరవానికి హాని కలిగిందా?” అన్నాడు. అపుడు చండాలుడు.
“పరహితము సేయఁ బూనిన
పురుషుఁడు పాపంబు సేసి పొందఁడు కీడుం;
బరమముని యగు నగస్త్యుఁడు
పరోపకారార్థ కృతి నభవ్యుం డగునే? (12-3-296)
మరొకడికి ఉపకారం చేయాలనుకున్న వాడు పాపం చేసినా వాడికి ఏ కీడు అంటకపోగా పరమముని అవుతాడు. లోకోపకారంగా చేసిన పనుల వలన అగస్త్యుడు దుష్టుడువుతాడా?” అన్నాడు. అపుడు ముని “నా దేహం బ్రాహ్మాణ ధర్మానికీ, ఇల్లు బ్రహ్మజ్ఞానానికి ఆలవాలమైనది. కనుక దేహం కొరకే నేను యీ పని చేయాలనుకున్నాను. యే పాపం చొరబడదు. ఈ మాంసం తినటానికి నీవు అడ్డు పడకుము” అన్నాడు. దానికి అంత్యజుడు “మాంసం వదులుకొనటం ఇష్టం లేక ఇట్లా అంటున్నాననుకోకుము. నీ తేజస్పంపద నష్టమవుతుంటే ఎవరికైనా జాలి పుట్టదా?” అనగా; విశ్వామిత్రుడు, “ఓ మహత్మా! నా మీద నిజంగా జాలి కలిగితే బ్రతకాలనుకుంటున్న నాకు ఈ కుక్క మాంసాన్ని యివ్వుము. అలాగైతే నాకు దొంగతనం అంటదు. అబద్ధం ఆడకుండా పొందే వస్తువు వలన ఏ పాపం కలుగదు” అన్నాడు. ముని మాటలకు చండాలుడు “ఎంతో పుణ్యాత్ములైన మీరు ఒక అధముడి నుండి దానం పుచ్చుకోవాలని, ఆలోచన మనసులోనైనా అనుకోవచ్చునా? మహర్షీ! ఇంతకంటే కటువుగా మాట్లాడటానికి జంకుతున్నాను. నీకు నచ్చినట్లు చేసుకో” అంటూ చండాలుడు కుక్క మాంసాన్ని ఇచ్చాడు.
దాన్ని పుచ్చుకొని విశ్వామిత్రుడు ప్రాణాలు కాపాడుకొని వెళ్ళిపోయాడు. మాన్యుల మాటే ఇలాగైతే సామాన్యులేమి కావాలి అని ప్రకృతి తలచింది కాబోలు. ఇంతలో వర్షాలు కురిసాయి. ప్రజలందరి తాపం తీరింది. ఆ తరువాత విశ్వామిత్రుడు తన తపో మహిమతో పాపం పోగొట్టుకొన్నాడు. పండితులు మెచ్చుకోనేలా నిత్య వ్రతాలు చేశాడు.
ధర్మం సరిగ్గా నడవకపోతే తప్పించుకొనలేని కరువు కాటాకాది పాపాలు తొలగి పోతాయి. కనుక తిండి దొరకదు. అపుడు మాన్యుల దగ్గర నుండి సామాన్యుల వరకు బ్రతకడానికి ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇటువంటి ఆపత్కాలములో మానవులందరూ ఒకేలా ఆలోచిస్తారని తెలిపే కథ.
ఆకలి మహాత్మ్యం ముందు బ్రహ్మర్షులు కూడా తల వంచాల్సిందేనని తెలుపుతున్న యీ కథ భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది. శాంతి పర్వము తృతీయా శ్వాసము లోనిది.
ఆహారే వ్యవహారే చ త్యక్తలజ్జః సుఖీ భవేత్
In eating and in business he who discards modesty will be best off.
క్షుధాతురాణాం నరుచిర్నపక్వం.
The strength of men is rooted in food.
స్వానుష్ఠానస్య సమయే మునయోపి న పండితాః
In their own actions even sages are not wise.
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
