Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-30

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

76. జనమేజయుడు పాపం పోగొట్టుకున్న వైనము!

తెలిసి చేసినా, తెలియక చేసినా పాపము పాపమే. తెలియకుండా చేసిన పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలిపే ఒక కథ ఉంది.

భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

పరీక్షిత మహారాజు కొడుకు జనమేజయుడు. అతడు మనుపు తనకు తెలియకుండానే చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు. పాపం చుట్టుకోగానే ఆ రోజుకు ప్రజలు పట్టించుకొనలేదు. బ్రాహ్మణులు దోషివి అన్నారు. దానికి జనమేజయుడు లోలోపల క్రుంగిపోయాడు. నగరము విడిచాడు. ఒంటరిగా నట్టడవిలోకి చొరబడ్డాడు. అడవిలో శౌనకముని కుటీరానికి వెళ్ళాడు. శౌనకమునికి సాగిలబడి మ్రొక్కాడు. అది చూచి ముని, “నీ వద్ద నుంచి నీచు వాసన వస్తుంది. నిన్ను చూస్తుంటే పీనుగును చూస్తున్నట్టుంది. నీవు ఇక్కడికెందుకు వచ్చావు. మరి ఎక్కడికైనా వెళ్ళుము! బొంత కాకులు తూట్లు పొడుస్తుండగా తలక్రిందులుగా వేలాడుతుంటావు” అన్నాడు.

“మీరు ఇలా నిందించడం భావ్యమే. అందుకే మీ కాళ్ళకు మొక్కి ఈ దారుణమైన పాపాన్ని పోగొట్టుకోవాలని ఆశపడి వచ్చాను. నా మీద దయతో నన్ను స్వీకరించండి” అన్నాడు.

శౌనకుడు జాలిపడి “కొందరు తెలివితక్కువ వారు నన్ను గేలి చేసినా, వాళ్ళను లెక్కపెట్టను. పండితులైన బ్రాహ్మణులు, దేవతలు మెచ్చుకునేటట్లు నీతో చెబుతాను వినుము.

‘హీనప్రజ్ఞుఁ డకార్యము | లైనవి సేసి తుది వగచు నతులప్రజ్ఞా
సానుమదారూఢుఁడు వగ | నూనఁడు దురిత మను వఱితి కోడక యునికిన్‌’ (12-3-352)

తెలివితక్కువవాడు చేయకూడని పనులు చేసి, చివరకు విచారిస్తాడు. ఎక్కడ లేని తెలివితో ఉన్నతుడయ్యే వాడు మాత్రం పాపం అనేవరకూ భయపడడు, బాధపడడు. తెలివిగా పనులు చక్కబెట్టుకోవాలి. అసలు నీవు చేసిన పాపాలకు పశ్చాత్తాప పడుతున్నావా? నీకు ధర్మం పట్ల ఆసక్తి ఉన్నదా?” అన్నాడు.

ముని “నీవు నీ భయం కొద్దీ ఒక దానిని కోరుకుంటున్నావు. అందువలన దీనికి ఇది కారణమనే ఉపాయమే నీ ఆలోచనకు అందదు. నీకు తట్టిన పుణ్యకార్యము ఆచరించాలి తప్ప నిలకడగా వినుము. బ్రాహ్మణ జాతికి మంచి కలుగునట్లు నడుచుకొనుము. వాళ్ళకు ఎప్పుడూ అపకారం తలపెట్టకు. అట్లా ఒట్టు పెట్టుకొని నలుగురి మెప్పును పొందము” అన్నాడు.

రాజు “ధర్మంగా నడుచుకోవడం నాకు పుట్టుకతో వచ్చింది. పాపపు బ్రతుకు అంటే వణుకు. బ్రాహ్మణ జాతి ఎప్పుడూ నా ఆదరణకు తగనది. ఎప్పుడూ నేను వారికి కీడు తలపెట్టను. నీ పాదాల పై ఒట్టు” అని శపథం చేశాడు.

మునికి జాలి కలిగింది. ఆ రాజుతో “సంపన్నధీరుడా రాజ భోగాన్ని, అనుభవాన్ని వదలగొట్టుకొనుము. ధర్మాన్ని పాటించాలి. తపస్సు, దనాం వేదాధ్యయనం, యాగకర్మలు చేయాలి. పవిత్రనదులు సేవించాలి. పుణ్యక్షేత్రాలలో నడయాడాలి. మమకారం వదలాలి.” అని చెప్పి,

“అధ్యాయనం నందే ఏకాగ్రత, దానం, దయలు ఉండాలి. అపుడు పాపం పోతుంది. మరొక ముఖ్య విషయం.

‘దురితము సేసి తాపమునఁ దూలిన నిం కిటు సేయ నన్మతిం
బొరసిన ధర్మ సంచరణ బుద్ధియ మేలని యూఁదినం గ్రియా
పరుఁ డయి మేలుసేసినను బాదము పాదముగాఁ గ్రమంబునన్‌
విరియు సమస్తముం దదభివిష్టకళంకము నిర్భయంబుగన్‌.’ (12-3-363)

పాపం చేసి పరితపించినా, ఇక మీదట ఇలాంటి పాపాలకు ఒడిగట్టను అనుకున్నా, న్యాయంగా మెలగటం ఉత్తమం అని నిర్ణయించుకున్నా, పుణ్యం పొందాలని అపేక్ష పడి ఉపకారం చేసినా పుణ్యాల వలన – పాపాలు పోతాయి. ఈ సంగతి వేదం చెప్పింది. నేను చెప్పాను. నన్ను నమ్ముము” అన్నాడు.

జనమేజయుడు శౌనకుడు చెప్పిన పనులు చేసి పాపాలు పోగొట్టుకున్నాడు. పాపాలు చేయరాదు. చేస్తే ఇక ముందు చేయకూడదు అని నిర్ణయించుకోవాలి. తెలియక చేస్తే పాపాలకు పైన చెప్పిన పుణ్యకార్యాలు చేయాలి.

భీష్ముడు ధర్మరాజుకు చెప్పనది.

శాంతిపర్వము తృతీయాశ్వాసము లోనిది.

~

77. గృధ్రజంబుకోపాఖ్యానము!

పూర్వం విదిశానగరంలో ఒక పిల్లవాడు చచ్చిపోయాడు. వాడిని అతడి చుట్టాలు శ్మశానానికి తీసుకొని వెళ్ళారు. వారు విపరీతమైన దుఃఖముతో గోడు గోడుమని ఏడవసాగారు. ఇంతలో ఒక గద్ద అక్కడికి వచ్చింది. పిల్లవాడి బంధువులతో “మీరిలా వల్లకాటిలో యే భయం లేకుండా ఏడుస్తూ ఉండడం మంచిది కాదు. చీకటి పడుతున్నది. ఈ సమయంలో రాక్షసులూ, భూతాలూ, పిశాచాలూ పీనుగులను చీల్చుకొని తినటానికి వస్తాయి. చావు పుట్టకలు ఇంతకు ముందు లేనివా ఏమి? చచ్చిపోయిన బిడ్డతో మీరంతా చచ్చిపోతారా? ఏమిటీ మూర్ఖత్వం? వెళ్ళండి. త్వరగా పీనుగును పాతేసి వెళ్ళండి. చచ్చిపోయినవారు ఎంత ఏడ్చినా తిరిగి రారు. పిచ్చిగా ఏడవటం మానుకోండి. జాగు చేశారంటే మీరూ చావగలరు” అన్నది.

బంధువులు భయపడి పిల్లవాడిని చూచి వెళుతుండగా, అక్కడ అంత సేపూ పొంచి ఉండి, వెలుపలకి వచ్చిన నక్క “గద్ద మాటలకు భయపడతారెందుకు? ఇంత చక్కని పిల్లవాడిని ఇక్కడపాతి పెట్టి పోవడానికి మీకు కాళ్ళెలా వచ్చాయి. మీ కడుపు శోకం పోయే దాకాక ఏడవండి. ఇంతలో బ్రహ్మ దయ ఉంటే ఈ పిల్లవాడు మరలా బ్రతుకవచ్చు. మీకేమీ తెలుసు. ఇంకా సరిగ్గా ప్రొద్దు గ్రుంకనూ లేదు. మీరు భయపడకండి” అన్నది.

అప్పుడు అక్కడ ఉన్నవారికి దానికి సానుకూల దృక్పథముతో కూడిన మాటలకు ఆశ పుట్టింది. తిరిగి వచ్చారు. గ్రద్ద వారిని చూచి, “ఈ మందమతి నక్క మాటలు వినవచ్చునా? పీనుగు రూపము చెడింది. పోయిన ప్రాణాలు మళ్ళీ వస్తాయా యేమి? యముడు చాలా కఠినుడు. కుయ్యోమొర్రోమని బాధపడుతుండగా ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతాడు. మీ పిల్లవాడు తిరిగి వస్తాడని ఆశించకండి. వెళ్ళండి. వెళ్ళి దానధర్మాలు చేసి ఆ పిల్ల వాడికి పుణ్యగతులు కల్పించండి” అన్నది.

గ్రద్ద మాటలు నక్క త్రోసి పుచ్చి, “గద్దది రాతి గుండె. మీరు ఇలాంటి బిడ్డను చూస్తూ, చూస్తూ వదిలి వెళ్ళటానికి ఎట్లా తట్టకుంటారో. నాకే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.” అని యేడుస్తూ, “పంతం పట్టి తల పడండి. దైవం అనుకూలిస్తే ఆ పిల్లవాడు బ్రతుకుతాడు. అల్లా కాకపోతే అపుడే పోవచ్చును” అన్నది.

అప్పుడు గద్ద, “నేను పుట్టి పదిహేను వందల సంవత్సరాలైంది. ఇంత సుదీర్ఘ కాలములో చచ్చి తిరిగి బ్రతికిన పసివాళ్ళను, కుర్రవాళ్ళను, వయసు వచ్చిన వాళ్ళను, ముసలి వాళ్ళను ఎక్కడా చూడలేదు. ఒక సంగతి నిజము. చచ్చిపోయిన వారు మరు జన్మనెత్తుతారు. నక్క జిత్తులమారి. పీనుగు ఎక్కడైనా బ్రతుకుంతుందా? ఇలాంటి వింత ఎక్కడైనా ఉందా?” అన్నది.

గ్రద్ద అలా అనగానే, వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ పిల్లవాడిని అక్కడే పాతిపెట్టి వెళ్ళబోతున్న వారికి నక్క అడ్డుపడింది. పడి, “ఒక మాట వినండి. పూర్వము శ్రీరామచంద్రుడు ప్రాణం పోయిన బ్రాహ్మణుడి కొడుకును బ్రతికించలేదా? నారదుడు సృంజియుని కొడుకును బ్రతికించలేదా? అలాగే యే దివ్యపురుషుడి చెవికయినా మీ ఆక్రందన వినబడి, మీ పిల్లవాడికి ఊపిరి పోయవచ్చును. అప్పుడు మంచిదే కదా! వెళ్ళిపోతారే” అన్నది.

అలా అనగానే ఆ పీనుగు బంధువులు పీనుగు చుట్టూ చేరి పేరు పేరునా చెప్పుకుంటూ పెద్ద పెట్టున రాగాలు తీసుకుంటూ ఏడ్చారు. అంతలో సూర్యుడు అస్తమించాడు.

నిజానికి గ్రద్దకు కానీ, నక్కకి కానీ ఆ పిల్లవాడి మీద వాడి బంధువుల మీద ప్రేమ లేదు. అవి ఆకలితో నకనకలాడుతూ దేని మట్టుకు అది ఆ పిల్లవాడి పీనుగును పీక్కుతినాలని ఇలా మాటకారితనాన్ని చూపాయి. తమ తమ స్వార్థముతో వాళ్ళతో అనుకూలంగా మాట్లాడినాయి. చీకటి పడితే గ్రద్ద ఉండలేదు. కాబట్టి చీకటి పడకుముందే వారు తిరిగి వెళ్ళేటట్టు మాట్లాడింది. రాత్రి అయితే నక్కకు మేలు కాబట్టి వారు ఆలస్యం చేయటానికి అనువుగా చెప్పింది. ఇట్ల చెప్పటం ఆ జంతువుల స్వభావం.

పిల్లవాడి బంధువుల ఏడుపు విని, భూతాధిపతి శివుడు అక్కడికి వచ్చి, ఆ బంధువులతో మీకేమి కావాలో కోరుకోమనగా, ఈ పిల్లవాడి చావు అనే దుఃఖములో మునిగి పోకుండా రక్షించుమన్నారు.

‘నిండు నూరేళ్ళుగా బ్రతుకుతాడ’ని ఆశీర్వదించి, పిల్లవాడిని బ్రతికించి, ఆ గద్ద నక్కలకు ఆకలి తీరకుండా చేసి ఆదృశ్యమయ్యాడు. పిల్లవాడి బంధువులు సంతోషించి, పిల్లవాడిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళారు. గద్దా, నక్కా పట్టలేనంత సంతోషముతో పొంగిపోతూ తమ కులములో పేరుగాంచాయి.

ఆపద కాలంలో మనుషులున్నప్పుడు, వారి చుట్టూ చేరి, వారి కష్టాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసే గ్రద్దా, నక్కలాంటి వారి నుండి మనుషులు తమను తాము కాపాడుకోవాలి. అందరూ చెప్పేది వినాలి. తమ తెలివితేటలతో ఆపద నుండి బయట పడాలి. తగిన సంయమనం పాటించాలి. ముఖ్యంగా తమ కడుపే కైలాసమని భావించే, స్వార్థపరుల సంభాషణా చాతుర్యాములోని రహస్యము గమనించాలి.

ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ.

శాంతి పర్వము తృతీయాశ్వాసము లోనిది.

~

దుర్జనః ప్రియవాదీ చ నైతద్విశ్వాసకారణం।
మధు తిష్టతి జిహ్వాగ్రే హృదయేతు హాలాహలమ్॥

Though a bad man speaks soft words, that are no ground for confidence in him, it is honey on the tip of the tongue and poison in the heart.

~

78. పవనశాల్మలీతరు సంవాదము!

మహా బలవంతుడితో బలహీనుడు తలపడుటము, పగ పెట్టుకోవాలనుకోవటం మూర్ఘత్వం.

అట్లా చేస్తే పొట్టేలు కొండతో ఢీకొన్నట్టే. వాపును బలుపు అనుకోరాదు. అట్లా అనుకుంటే వైభవము కోల్పోయి అవమానాల పాలు కావటం తప్పదు.

హిమాలయాలలో ఒక బూరుగు చెట్టు ఉండేది. దాని బోదె చాలా గట్టిగా, ముదురు కొమ్మలతో పటిష్టంగా ఉండేది. ఒకనాడు నారదుడు వచ్చాడు.

“ఓ బూరుగు చెట్టా! ఇంత ఎత్తు, వైశాల్యముతో విస్తరించి, జంతువులకు, పక్షులకు ఆశ్రయం కల్పిస్తూ సేవ చేస్తున్నావు. సంతోషం. గాలి తాకిడికి ఎంతటి పెద్ద చెట్లైనా కూలిపోతాయి కదా. మరి నీవు కూలకపోవడానికి కారణము ఏమి?” అన్నాడు.

ఆ చెట్టు అతడిని గంభీరంగా చూసింది.

మరలా నారదుడు “గాలిదేవుడు నీకేమైనా చుట్టామా? లేదా నీవు అణిగిమణిగి ఉండుట చేత బ్రతికిపోయావా?” అన్నాడు.

అపుడు ఆ బూరుగు చెట్టు, “గాలిదేవుడి బలం నా బలానికి సాటిరాదు. అసలు చెప్పాలంటే అతడు నా బలంలో పద్దెనిమిదవ వంతు కాదు” అన్నది. అపుడు ముని “ఔరా! అలా మాట్లాడటం అవివేకం. గాలికి కొండలు కొట్టుకుపోతాయి. సమస్త జీవరాశుల నడకలు అతడి అధీనం కదా” అన్నాడు.

ఆ చెట్టు “పెద్ద బోదె, పెద్ద పెద్ద కొమ్మలూ ఉండి ఎదిరించ శక్యము కాని నాతో ఢీకొంటే అతడికి ఉన్న ప్రభంజనుడు అను పేరు అబద్ధం అవుతుంది” అని పొగరుగా సమాధానమిచ్చింది.

అప్పుడు నారదుడు “వెర్రిదానా!నీ బింకాలు మరిచిపోకు. నీవాడిన మాటలు గాలిదేవుడు తెలుసుకుంటాడు” అని వెళ్ళిపోయాడు. ఇంకేమి అతడికి కావలసినంత పని దొరికింది. గాలిదేవుడి చెవిన వేశాడు. దానితో గాలిదేవుడికి కోపం వచ్చింది. వెంటనే చెట్టు దగ్గరికి వచ్చాడు.

“ఒసే చెట్టా! నీవు మహా మొనగాడివా? నీ జోలికి వస్తే నా పేరే చెడిపేస్తావన్నవట. నీవే చెడిపోతావు జాగ్రత్త” అన్నాడు.

అప్పుడు ఆ బూరుగు చెట్టు “ఓ వెర్రివాడా! నేను అంతటి బలహీనుడినా? లోకములోని మిగతా చెట్లలా నన్ను ఎంచకు” అన్నది. దానికి వాయువు నవ్వుతూ, “ఒకనాడు బ్రహ్మ నీ నీడ పట్టుకు వచ్చాడు. ఆ ఉపకారం ఎంతో గొప్పగా అనిపించి నిన్ను ఆదరించాడు. అందుకు కదా నీవిప్పుడు మిడిసి పడుతున్నావు. అయినా అహంకారులకు మేలు జరిగినా, అది ఎంతో కాలము నిలుపుకోలేరు. రేపు కూడా ఇలాగే మాట్లాడు” అంటూ వెళ్ళిపోయాడు.

బూరుగు చెట్టు వాయుదేవుడితో ప్రతాపాలు పలికింది కాని దాని లోపల భయము మొదలైంది. ‘నా ఉనికిని కోల్పోతానో ఏమో? హోరున వచ్చే గాలికి నిజంగా నేను తట్టుకోగలనా? నా సత్తువ ఏమిటి? నా నోటి దురుసుతనముతో ఇంత దూరము తెచ్చుకున్నాను. నారదుని మాట కూడా మన్నించలేదు. మూర్ఖత్వము నడిపినట్టుగా నడిచాను’ అనుకొని విచారపడింది. మరలా తెలివిని తెచ్చుకున్నది. అతడిని ఒక విధంగానయితే ఓడించగలనని అనుకున్నది. చీకటి పడిన తరువాత ఆకులను, కొమ్మలను తనకు తానే విరుచుకున్నది. అట్లా తనకు తాను, ఇతరులపై పంతముతో మోడుగా మార్చుకున్నది. తన ప్రతినకు ధీటుగా గాలిదేవుడు వచ్చాడు. బూరుగు చెట్టును ఎగతాళిగా చూశాడు.

“ఛీ వెర్రిదానా! నేను చేయాల్సిన పనిని నీవే చేసుకున్నావు. నీ చుట్టు పక్కలందరికీ ఇదీ సాధనమని, మంచి పనీ అని చెప్పుము” అని బాగా ఎత్తిపొడుస్తూ వెళ్ళిపోయాడు. చెట్టు అవమాన భారంతో క్రుంగిపోయింది.

ముందు తప్పు చేయుట, తరువాత క్రుంగిపోవటం, తన శక్తి తాను తెలుసుకోకుండా మిడిసిపడుతూ తమ ఓటమి కూడా ఒక రకమైన గెలుపని పొంగిపోవటము వంటి మూర్ఖపు పద్ధతులు, అనాలోచిత విధానాలు, చర్యలు ఎంత చేటు కలిగిస్తాయో, చివరికి ఎంత దుఃఖాన్ని మిగులుస్తాయో యీ చిన్న కథలో మనకు తెలుస్తుంది.

తమను తాము శిక్షించుకుంటారు, ఖండించుకుంటారు, నశించిపోతారు, ఎదుటి వాళ్ళకి ఆపదలు తెస్తారు. కానీ ఉత్తముల ఘనతను గుర్తించని దురభిమానులు ఉంటారని, వారి నుండి జాగ్రత్త పడాలని కూడా యీ కథ మనకు తెలుపుతుంది.

కొందరు ఇతరుల ముందు తమ ఘనత గురించి డంబాలు, బింకాలు పలుకుతారు. మాటలతో ఎదుటి వాళ్ళను ఠారెత్తిస్తారు. కానీ అదంతా మేకపోతు గాంభీర్యమే. యే పరీక్షకు తట్టుకోలేరు. ఒక్కొక్కసారి పరీక్షకు ముందే చేతులెత్తేస్తారు. వీరంతా శబ్దవీరులు.

ధర్మరాజునకు భీష్ముడు చెప్పినది.

శాంతిపర్వము తృతీయాశ్వాసము లోనిది.

~

(ఇంకా ఉంది)

Exit mobile version