[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
79. నాడీ జంఘుడి చరిత్ర! (కాశ్యప గౌతమాఖ్యానం)
పూర్వం ఒక బ్రాహ్మణుడు, తనకు వారసత్వముగా వస్తున్న కుల వృత్తిని వదులుకున్నాడు. ఒక బోయ స్త్రీని పెండ్లాడినాడు. బోయవారితో కలిసి, మద్యమాంసాలని ముదుగుతూ, మృగములను భయంకరముగా వేటాడుతూ, పాపాలపుట్టగా మారిపోయాడు. సుఖాలకు మరగి డబ్బు సంపాదించడానికి తగిన పద్ధతులను ఆలోచించసాగాడు.
అప్పుడు కొంత మంది కోమట్లు వ్యాపార నిమిత్తము మరొక దేశానికి పోసాగారు. బ్రాహ్మణుడు వారితో కలసిపోయాడు. అలా పోతుండగా ఆ బిడారును ఒక ఏనుగుల గుంపు అడ్డుకుంది. అందులో ఒక అడవి ఏనుగు పిచ్చెత్తినట్లుగా అయిపోయి, బిడారులోని జనాన్ని నేల మీద పడ వేసి తొక్కి తొక్కి చంపింది. గుంపు చెల్లాచెదురయింది. ఆ బ్రాహ్మణుడు భయం కొద్దీ దిక్కుతోచక పరుగెత్తాడు.
ఉత్తరం వైపుగా చాలా దూరం పోయి, ఒక దోవను చూచాడు. ఆ త్రోవలో వెళుతూ దట్టంగా ఉన్న ఒక మర్రి చెట్టును చూశాడు. అది చాలా ఎత్తుగా బాగా వెడల్పుగా ఎంతో గుండ్రంగా అందంగా ఉన్నది. అక్కడ అతడి కాసేపు నిలబడాలి అనిపించింది. ఆ చెట్టు క్రిందకి వెళ్ళాడు. అడవి పూల వాసన అతడి అలసట పోగొట్టింది. అతడు సేదతీరాడు. ఇంతలో అక్కడికి ఒక కొంగ వచ్చింది. ఆ కొంగ బ్రహ్మదయను నోచ్చుకున్నది. నాడీజంఘుడు, రాజధర్ముడు అనేవి ఆ కొక్కెర పేర్లు. ఆ మర్రి చెట్టు మీద ఆ కొంగ ఉండేది. ఆ కొంగ బ్రాహ్మణుడిని చూచింది. కొంగ “ఓ పురుషోత్తమా! ఎక్కడి నుండి రాక, ఎక్కడికి వెళుతున్నావు. నాకు తగిన అతిథివి.నీ సంగతులు చెప్పుము” అని అడుగగా, “నాది మధ్య దేశము. నా పేరు గౌతముడు. నేను ఉత్తమ బ్రాహ్మణుడి కుమారుడను. నేను సోమరిపోతునై వేదాధ్యయనం వంటి మా జాతి కర్మలను మానేశాను. కామంలో పడి ఒక బోయదానిని పెండ్లాడినాను. బీదరికంతో విసిగిపోయాను. వర్తకానికై ఒక బిడారుతో కలిసి మరొక దేశానికి వెళుతున్నాను.
కాలు తీసి కాలు పెట్టులేనంత దట్టంగా ఉన్న ఆడవులలో, కొండలలో ఒక అడవి ఏనుగు మా బిడారి మీద పడి అందరినీ చంపబోయింది. ఆ గుంపులోని వారంతా పరుగెత్తారు. నేను అడవి పరుగెత్తి, పరుగెత్తి త్రోవ తప్పాను. నా అదృష్టం కొద్దీ నీవు ఉండే ఈ మర్రిని చూశాను” అనగా ఆ కొంగ “మంచిది, నీ బీదతనాన్ని పోగొట్టుతాను. నీవు బాధపడకుమ” అని, మంచి రుచిగా ఉండే గంగానదిలోని చేపలను కాల్చి తెచ్చింది. తీయటి అడవి పళ్ళు తెచ్చి పెట్టింది. అతిధి బ్రాహ్మణుడు తృప్తిపడేటట్లు భోజనం పెట్టింది. ప్రొద్దుపోవటంతో, చిగురాకులతో, పూలతో ఒత్తుగా పక్కను సిద్ధం చేసింది, కొంగ ఇచ్చిన ఆ చక్కని ఆతిథ్యాన్ని చూచి బ్రహ్మణుడు సంతోషించాడు. ఆ రాత్రి ఆ ఇద్దరు హాయిగా నిదురపోయారు. తెల్లవారగానే కొంగ ఆ బ్రాహ్మణుడిని చూచి
“విను! మిత్రుండును రజతముఁ | గనకము బుద్ధియును నాల్గుకారణములు మ
ర్త్యు ని దారిద్ర్యము వాయుట | కని దేవగురుండు సెప్పె నన్నిటిలోనన్ (12-3-484)
మనిషి పేదరికం పోగొట్టడానికి స్నేహితుడు, వెండి, బంగారము, ఆలోచన నాలుగింటిని కారణములుగా బృహస్పతి చెప్పినాడు. మిత్రుడు గొప్పవాడు. కశ్యపుడి సంతానం వాడినైన చెలిమి చేస్తూ, ఉంటే సిరిసంపదల యోగ్యుడవు కావా? ఇక్కడికి దగ్గరలో, మూడామడల దూరములో మధువ్రజము అను పట్టణం ఉన్నది. అక్కడ నాకు విరూపాక్షుడు అనే మిత్రుడు ఉన్నాడు. నీవు అతడి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షస రాజును ఆశ్రయించుము. అతడితో నేను పంపినట్లు చెప్పుము. అతడు సంతోషించి మణి హారాలతో నిన్ను సత్కరింస్తాడు.” అని అంది.
ఆ బ్రాహ్మణుడు కొంగ చెప్పినట్లుగా వెళ్ళి, విరూపాక్షుడిని చూశాడు. తనను నాడీజంఘుడు మిత్రుడిగా పరిచయం చేసుకొని “డబ్బు కోరి వచ్చాను” అన్నాడు. విరూపాక్షుడు ఆ బ్రాహ్మణుడిని చూచి, ‘ఈ బ్రాహ్మణుడు నీచుడిగా అనిపిస్తున్నాడు. సంగతేమిటో అడిగి తెలుసుకోవాలి’ అనుకొని, “నీ వంశం, నీ చదువు, నీ నడవడి ఉన్నదున్నట్లుగా చెప్పుము” అని అడిగాడు.
ఆ బ్రాహ్మణుడు ఉన్నదున్నట్లుగా తనను గూర్చి పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. అపుడు విరూపాక్షుడు ఎలాంటి వికారాలకు లోను కాకుండా, “ఈ బ్రాహ్మణుడు ఎట్టి వాడైతేనేమి, నాడీజంఘునితో స్నేహమే యీ బ్రాహ్మణుడి యోగ్యతను తెలుపుతుంది. కావున ఇతడికి కరువుదీరా ధనమునిస్తాను” అని నిర్ణయించుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు అవసరానికి తగినట్లుగా తిండి, బట్టలను సమకూర్చుకోటానికి భృత్యులను నియమించాడు.
కార్తీక పౌర్ణమి నాడు బంగారు పళ్ళాలతో వేలకొలది బ్రాహ్మణులకు సంతర్పణలు చేసి, కానుకలు ఇచ్చాడు. అట్లాగే విరూపాక్షడు ఈ బ్రాహ్మణుడికి కూడా ఎన్నో సేవలు చేశాడు. కడుపు నిండా కమ్మని భోజనం పెట్టాడు. మోయలేనంతగా బంగారాన్ని, రత్నాలను ఇచ్చాడు. బ్రాహ్మణుడు దానిని ఆనందంగా పుచ్చుకున్నాడు. బరువుగా ఉండటంముతో భుజాలు, చేతులు మార్చుకుంటూ బరువు వలన వీపూ, మెడా రెక్కలు నొప్పి పుట్టగా గబగబా అంగలు వేస్తూ నాడీజంఘుడు ఉండే మర్రిచెట్టు వద్దకు చేరుకున్నాడు.
అతడిని చూచి కొంగ సంతోషించింది. తన రెక్కలతో విసిరి అతడి బడలిక పోగొట్టింది. ఆకలి తీర్చింది. రాత్రి అయింది. నాడీజంఘుడు తగిన సేవలు చేసి హాయిగా నిదురపోయాడు. దుష్టబ్రాహ్మణుడు మాత్రం నిదురపోలేదు. మరునాటి ప్రయాణంలో తన తిండిని గురించి ఆలోచించాడు. కొంగ ఒళ్ళు బాగా క్రొవ్వి కండపట్టి ఉన్నది. ఇది ఒళ్ళు తెలియకుండా నిదురపోతున్నది. దీనిని మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసిపట్టుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచించాడు. బట్టను లాగి బిగించి కట్టుకుని రెండు చేతలతోనూ కర్రను బాగా గట్టిగా పట్టుకొని మెడ మీద చితకబాదినాడు. ప్రాణం పోయిందని రూఢీ చేసుకొని ఈకలన్నీ బాగా పెరికి వేశాడు. పీకను చీల్చాడు. పేగులు బయటకిలాగి మాంసాన్ని పొందికగా మూట కట్టాడు.
అంతలో విరూపాక్షుడు నిద్రలేచి, “మాంసం కంపు కొడుతున్నది. ఏం ముప్పు మంచుకువస్తున్నదో ఏమో మనసులో కలతగానున్నది” అని తన వారితో అన్నాడు. భయంతో వణికిపోతూ జాము ప్రొద్దెక్కగా రాజధర్ముని గుర్తు తెచ్చుకున్నాడు. ‘నా మిత్రుడు ప్రతి నిత్యం ప్రొద్దున్నే వచ్చేవాడు ఇవాళ ఎందుకు రాలేదో ఏమో? బ్రాహ్మణుడు నీచుడని అపుడే అనుకున్నాను ఈ తుచ్చుడు ఏం తలపెట్టాడో ఏమో? నా మిత్రుడు అసలే కల్మషం ఎరగని వాడు. అందరినీ నమ్ముతాడు’ అని విచారపడుతూ లోతుగా ఆలోచించి పరివారాన్ని పిలిచి “కొంగను వెతకండి” అని పురమాయించాడు.
ఆ పరిజనం వెళ్ళి వెదికి, కొంగ డొక్కను గుర్తుపట్టి వెంటనే, ఆ సంగతి రాజుకు చెప్పారు. వాళ్ళు ఆ బ్రాహ్మణుడిని వెదికి పట్టుకున్నారు. వెంటనే రెక్కలు విరిచి కట్టి రాజు ముందుకు తెచ్చారు. విరూపాక్షుడు “ఇతడు చేసిన మేలు మరచినాడు. వీడిని నా ఛాయలకు తేకండి. వీడిని వెంటనే చంపితినండి. లేకపోతే మానవేయండి. ఏం చేసినా సరే ఈ కృతఘ్నుడిని నా ముందుకు ఎందుకు తెచ్చారు?” అని రాజు అనగానే, రాక్షసులు ఆ బ్రాహ్మణుడని శరీరాన్ని పట్టణం అవతలికి తీసుకొని వెళ్ళి, అతడి శరీరాన్ని చిన్న చిన్న కండలుగా కోసి ఆ కండల నుండి రక్తం చిందుతూ ఉండగా పడదోశారు.
అంతలో ఆ పాపి శరీరాన్ని తినటానికి నకనకరాడుతున్న కడుపుతో కుక్కల మంద వచ్చిపడింది. అంత ఆకలితోనూ ఆవి ఆ పాపాత్ముడి శరీరాన్ని ముట్టుకోకుండా వెనక్కుతిరిగి వెళ్ళిపోయాయి.
అంతే దుర్మార్గుడి, కృతఘ్నుడి శవం చివరకు కుక్కలు కూడా ముట్టవు. పైగా రోత పడతాయి. వేదాలలో తెలుపబడిన ఈ విషయం ఇక్కడ నిరూపించబడినది. విరూపాక్షుడు నాడీజంఘుడి డొక్కను తెచ్చి స్నేహితులతో కలిసి, తాను గౌరవంగా తలకొరివి పెట్టడు. అప్పుడు ఇంద్రుడు వచ్చాడు. విరూపాక్షుడు ఇంద్రుని చూచి, దీనంగా “నా మితృడిని బ్రతికించవా” అని ప్రార్థించాడు. విరూపాక్షడి ప్రార్ధన విన్న ఇంద్రుడు, “నీ మిత్రుడు బ్రహ్మకు కూడా మిత్రుడని నీకు తెలియదా? అతడిని గూర్చి ఏడవటం ఎందుకు? అతడు ప్రతినిత్యము తన దగ్గరకు రావాలని బ్రహ్మ కోరుకుంటాడు. తరచూ రానందుకు బ్రహ్మ విచారించేవాడు. అతనికి ఇల్లాంటి దశ పట్టిందంటే అతడు స్నేహితుడువట వలన. నీవు స్నేహితుడవట వలన. నీవు స్నేహితుడవగుచటే ఈ కొంగకు తలకొరివి పెట్టావు. నీవు దహన సంస్కారం ముగించి ఇలా వచ్చావో లేదో ఆ వెంటనే ఆ చితిమంట దగ్గరలో ఆవు తన తూడకు ఎంతో ప్రేమగా పాలిస్తుండగా చిన్న పాల చేపు రాగానే నోటి నుండి నురగ తుంపర జారిపడింది. ఆది సుడిగాలికి ఎగిరి చితి మీద పడింది. ఆ నురగ పడిందో లేదో నాడీజంఘుడు మరలా బ్రతికాడు. మునుపు రూపంలో వస్తున్నాడు. ఇలా జరగడానికి కారణం బ్రహ్మదేవుడి మహిమే కదా” అని ఇంద్రుడు అంటుండగా కొంగల రాజు వచ్చాడు. ఇంద్రుడు బ్రహ్మ మాట ప్రకారం బ్రాహ్మణుడిని తాళ్ళతో కట్టించాడు. రాజధర్ముడు బ్రాహ్మణుడికి తన వలిన కలిగిన బాధను చూచి తట్టుకోలేక అతడిని విడిపించుమని కోరాడు. వెంటనే బ్రాహ్మణుడిని విడిచి పెట్టి కొంగ కోరిక తీర్చాడు. విరూపాక్షుడు ఆజ్ఞతో అతడి ధనాన్ని కూడా బ్రాహ్మణుడికి ముద్రశుద్ధిగా అప్పచెప్పారు. ఆ బ్రాహ్ణణుడు నాడీజంఘుని పొగుడుతూ ధనం మూటను మోసుకొంటూ వెనక్కు తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు. ఇంద్రుడు స్వర్గానికి, విరూపాక్షుడు తన పట్టణానికి, బకరాజు మర్రిచెట్టు వైపు వెళ్ళిపోయారు.
“ఆరయ మిత్ర ద్రోహము | దారుణమగు పాతకము గృతఘ్నత కంటెన్;
వైరము గొని విడువవలయు | నా రెండు దెఱఁగుల వారి నాప్తుల నైనన్.” (12-3-525)
నిజానికి ఆలోచిస్తే స్నేహితుడికి కీడు తలపెట్టడం, చేసిన మేలు మరిచిపోవటం కన్నా మించిన మహా పాపం. రెండు రకాల వారు మన మంచి కోరుకునే వారైనా సరే – వైరం పెట్టుకొని వారిని వదులకొనటం మంచిది.
“మిత్త్రుం డైహికములు నా | ముత్త్రికములు నైన భద్రములు దలకొలుపున్;
మిత్త్ర ధనంబులలోనను | మిత్త్రుఁడ యెక్కు డనుమాట మెత్తురు ప్రాజ్ఞుల్.” (12-3-526)
స్నేహితుడు ఇహరపలోక సౌఖ్యాలు రెంటినీ సమకూర్చగలడు. మిత్రుడు, ధనం ఈ రెంటిలో మిన్న అంతా మెచ్చుకుంటారు పెద్దలు. ఎరైనా మేలు పొందాలంటే మంచి కులంలో పుట్టినవాడు, సుగుణాలు కలవాడు, మంచి స్నేహం కావాలనుకొనే వాడు అయిన స్నేహితుడితో పొత్తు పెట్టుకోవాలి. అతడు నొచ్చుకోని రీతీలో నడుచుకోవాలి.
చేసిన మేలు మరిచిపోవటం, మిత్రుడికి కీడుతలపెట్టటం – అనేవి రెండు మహా పాపాలు. అందుచేత మంచి మిత్రుడిని సంపాదించటం, ఇతరులకు మేలు చేయటం అనేవి ప్రధానం అని ఈ కథ తెలుపుతుంది. నీచస్వభావం గల వాడికి ఎంత సేవ చేసినా కృతజ్ఞత చూపడు. పైగా కృతఘ్నడిగా ఉంటాడు. బ్రాహాణుడిని చంపిన వానికైనా పాపనిష్కృతి ఉంటుంది. కాని చేసిన మేలు మరిచిపోయిన వాడికి మాత్రం పాప విముక్తి ఉండదు.
అంటూ భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కథ
శాంతి పర్వము తృతీయాశ్వాసములోనిది.
~
ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధి ముపైతి పశ్చాత్।
దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానామ్॥
దుర్జనుల యొక్కయు, సజ్జనుల యొక్కయు స్నేహం దినము యొక్క పుర్వభాగము (ప్రాతఃకాలము) నందును, ఉత్తరభాగం, (సాయంకాలం)నందునున్న నీడవలె మొటిమొదటి పెద్దదిగా, పిమ్మట తక్కువగా, మొదలు కొంచెము తరువాత పెద్దదిగా వుండును. కుజనుల స్నేహము ప్రాతః కాలపు ఛాయ, సజ్జనుల స్నేహము మధ్యాహ్నము నీడ వలె నుండును.
80. సేనజిద్వృత్తాంతము!
ఇష్టానిష్టాలు హృదయంలో కలుగకుండా చూడగలుగటమే మోక్షప్రదమయిన ధర్మం. ఇది చెప్పటానికి చాలా సులభమయినది. ఆచరణలో అత్యధికులకు ముఖ్యంగా సామాన్యులకు అసాధ్యమయినది. శుభాశుభాలు, ప్రియాప్రియలు వంటి ద్వంద్వాలు దృష్టిలో మానవునికి జీవరాశులన్నిటికి సంక్రమించినవి. అయితే జ్ఞానబలం గల విశిష్ట మానవుడు మాత్రం యీ ద్వంద్వాలకు అతీతంగా తన మనసును నిలుపగలుగుతాడు.
ప్రియాప్రియులు మనసులో కలుగకుండా జీవించటం ఎలా సాధ్యము? ఎప్పుడు మానవుడికీ స్థితి సిద్ధిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం మహాభారతం సేనజిద్వృత్తాంతం ద్వారా అందించినది.
సేనజిత్ అనే రాజుగారికి పుత్రుడు మరణించాడు. శోకముతో యున్నాడు. అలా ఉన్న సమయాన అతడి స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడు అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి, “ఎందుకిలా విలపిస్తున్నావు? పుట్టినవారు సృష్టిలో గిట్టక తప్పదు కదా. నీ కొడుకు ఒక్కడే చనిపోయినట్లు, ఈ బాధ నీ ఒక్కడికే కలిగినట్లు దుఃఖించడం మూర్ఘత్వం సుమా. ఆలోచించుము. దుఃఖించకుము” అన్నాడు.
సేనజిత్ మిత్రుడి మాటల తీరుకు అచ్చెరువు పడి, “నీవు ఏ విధంగా శోక రహితుడువయ్యావు? మరణమెంత సహజమో, శోకము అంత సహజము కదా” అన్నాడు. దానికి విప్రుడు –
“కదియుం గాష్ఠముఁ గాష్ఠము | నదిలో మఱికొంత సేపునకుఁ బాయును నె
మ్మది నట్లుగఁ దలఁపఁగ వల | వదె పితృ పుత్రాది బంధు వర్గము నధిపా! (12-4-10)
రాజా! నది ప్రవహిస్తూ ఉండగా, ఆ ప్రవాహంలో ఒక కర్ర మరొక కర్రను చేరుకుంటుంది. ఆ చేరిక ప్రవాహ వేగం అనుమతిచినంత వరకే. కొంత సేపటికి ఆ చేరిక రెండు కర్రలు విడిపోతాయి. కలయిక ఎంత సహజమో, ఎడబాటు అంత సహజమే. భూమి మీద సంబంధ బాంధవ్యాలను అవి తండ్రి కొడుకులకు చెందినవైనా, ఆలుమగలకు చెందనవైనా ఆ ప్రవాహంలోని కర్రల కలయిక వలెనే చూడాలి. కలయికలూ, ఎడబాటులా యాదృచ్చికంగా మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. మరొక ముఖ్యమయిన విషయం మానవుడికి ఎవనికయినా, తనకు తానే అన్యం, శాశ్వతం కాదు. అటు వంటిపుడు తన వారు, తన సంతానం, బంధువులు సుఖప్రాప్తికి కారణం కానే కారు. ఈ వివేకముతో నాకు భిన్నులయిన జనుల మీద ప్రేమను పెంచుకొను. ప్రేమ లేనపుడు వియోగం వలన శోకం ఏర్పడదు. కాబట్టి నన్ను యే దుఃఖము దరి చేరదు.
అనగా మానవునికి మనసే సుఖదుఃఖాలను అనుభవానికి తెస్తుంది. కాబట్టి మనసులో ఇతర జనులయెడ వారు ఎవరైనా సరే స్వసంతానమైనా, బంధువులైనా ప్రీతి యేర్పడకుండా నిగ్రహించుకోనగలిగితే వారితో ఎడబాటు కలిగినపుడు శోకము కలుగదు. దానికి ‘తనకు తానే మార్గము’ అనే జ్ఞానము మూలంగా నిలుస్తుంది. ఆ మూల జ్ఞానాన్ని మనసున నిలుపుకొనగలిగితే ముక్తి సులభం. రాజా! వివేచించి చూస్తే మానవుడికి లోకాన సుఖదుఃఖాలు క్రమంగా కలుగుతాయి. అంతే కాని సుఖదుఃఖాలలో ఏ ఒక్కటీ నరుడిని తాకదు. కావున సుఖధఃఖాలు పొందినపుడు సంతోషం, సంతాపం పొందకుండా ఉండాలి. మానవుడు ‘ఇది నాది’ అన్న భావంతో ఏ పదార్థాన్ని మనసులో నిలుపుకుంటాడో అపుడు ఆ పదార్థం అనేక వాసనలను భావనా జనితమైన సంస్కారాలను కలిగిస్తుంది. అది నశించినపుడు మానవుడు శోకించక తప్పదు.
“వినుము, పురాతన జన్మం | బునఁ జేసిన యట్టి కర్మముల ఫలములు ప్రా
జ్ఞునినైనఁ బొందు వానికి | మనుజేశ్వర! మందు ధైర్యమహిమయ చుమ్మీ.” (12-4-14)
పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలు మిగిలి ఉంటే, అవి తప్పక ఈ జన్మలో నరుడిని చేరుతాయి. ఈ కర్మఫలాలు అనుభవం విషయంలో పామరుడైనా, పండితుడైనా ఒకటే, మరి కర్మఫలితాల అనుభవానికి నివారణౌషధమే లేదా ఉంది గొప్ప ధీరత్వముతో స్వీకరించటమే, ఆ నివారణ మార్గము.
కారణకార్య సంబంధాన్ని ఎవరమూ ఆపలేము. కారణము కర్మ అయితే, కార్యము ఫలము అన్నమాట. కావున ఆశించి దొరకలేదని దుఃఖించటం కంటే అసలు ఆశనే వదులుకుంటే అదే ఆనందం. ఇది పలాయన వాదం, ఓటమిని అంగీకరించి, సర్దుకుపోవటం కాదు.
ఒకసారి పింగళ అనే వేశ్య తన ప్రియుని కోరకు ఎదురు చూస్తూ చాలా సమయం గడిపింది. అయినా అతడు రాలేదు. అపుడా వేశ్య ‘నేను నా ప్రియుని కొరకు పిచ్చిదాన్ని అయ్యాను. అయితే నాకీ పిచ్చి పట్టిన వెంటనే, నా ప్రియుడికి ఈ పిచ్చి పట్టే వీలుందా! లేదు. కాబట్టి ఈ భ్రమను వదులికొని ఒంటి కంబంతో ఒప్పి ఉన్న ఈ నా శరీరమనే ఇంటిలోని తొమ్మిది వాకిళ్ళు (నవరంధ్రాలు) బాగా మూసుకొని నిదురపోతాను. చెంతకు చేరిన వాడినే ప్రియుడు’ అనుకొని, ‘ఇతరుల పై కోరికలు, తృప్తితో మనసున యే దిగులూ లేకుండా ఉంటే సుఖాలు నన్ను చేరుకుంటాయి. ఆశయే ఇంద్రియలోలుని చేసి మనిషిని కృంగదీస్తుంది. ఇంద్రియాలు జయించి మనిషి ఓటమి పాలుకావడానికి కోరికయే కారణం. మనిషి వినాశనానికి ఆశ ఒక్కటే హేతువు. కాబట్టి నేను ఆశను వదులుకొని, వినాశనానికి దూరంగా, సుఖంగా జీవిస్తాను. నిరాశ ఒక్కటే సుఖదాయిని’ అని పలికి తగిన మనఃప్రవృత్తితో శాంతంగా నిద్రించింది. అయితే ఇందులో నిరాశావాదం తొంగి చూస్తున్నట్లున్నా, వాస్తవ పరిస్థితులకు తగినట్టుగా జీవితాన్ని సర్దుకోవడం కనిపిస్తుంది. మనసుకు వచ్చే ఆపదలను తొలగించుకోవాలంటే మనసును పరిస్థితులకు తగినట్లుగా సంసిద్ధం చేసుకోవాలని తెలుస్తుంది. తృప్తి అనేది జీవితంలో ఒక భాగంగా ఎంచుకోవాలి. విప్రుడి మాటలు, బోధలు విన్న సేనజిత్ కలత తీరి సుఖంగా జీవించాడు.
ధర్మరాజా! ఈ కథలోని అంతరార్థాన్ని గ్రహించి క్లేశము వీడి జీవించు అని భీష్ముడు చెప్పిన సందర్భంలోనిది.
ఆచరణలో క్లిష్టమైనా, ప్రయత్నిస్తే సుఖాన్నిచ్చేది. శాంతిని కలిగించేది.
శాంతి పర్వం చతుర్థాశ్వాసంలోనిది.
~
When we have not what we like, we must like what we have – Conte
ఆశాశా పరమం దుఃఖం నిరాశ పరమం సుఖం.
Desire upon the desire (causes) the greatest sorrow, contentment the greatest happiness..
81. తండ్రీ కొడుకుల సంవాదము!
జీవరాశులు నశించిపోయే కాలం దాపురించింది. ఈ పరిస్థితిలో ఏమి చేయాలన్నది మానవ జాతికి చెందిన ఉత్తములను పట్టి పీడిస్తున్న సందేహము. ఈ సందేహాన్ని తీర్చేది తండ్రీ కొడుకుల సంవాదము.
పూర్వము ఒక బ్రాహ్మణ కుమారుడు, మేధావులలో శ్రేష్ఠుడైనవాడు ఉండేవాడు. అతడు వేదాధ్యయనపరుడు. అతడి పేరు మేధావి. ఒకనాడు అతడు తండ్రిని చేరి, “లోకంలో ప్రజలకు ఆయువు త్వరత్వరగా తీరిపోతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నా వారు ఏ పద్దతిలో ఏ మార్గాన మేలు పొందగలుగుతారు?” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు అతడి తండ్రి “ఓ పాపరహితుడా! పెండ్లి చేసుకొని భార్యను పొంది, సంతతిని కని, యజ్ఞాలతో దేవతలను తృప్తి పరిచి ఆ తరువాత శాంతిని పొంది, సంసారాన్ని చాలించి, అడవికి వెళ్ళి ప్రశాంత జీవనం సాగిస్తూ మోక్షాన్ని సాధించాలి. ఆ విధంగా మృత్యువును గెలవగలడు” అన్నాడు.
ఒక తండ్రి ఒక కుమారుడికి చెప్పే సమాధానం ఇలాగే ఉంటుంది. సంప్రదాయబద్దమైన పూర్వచార వ్యవస్థ నుండి వచ్చిన వ్యక్తి తన కుమారుడికి, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమాలను గురించి వివరించాడు. ఆయితే యువతరం అనుభవ తరం. పెద్దతరం మాటలు అంత త్వరగా వినదు. ఈ గతానుగతకమైన సమాధానాన్ని ఆ మేధావి స్వీకరించే స్థితిలో లేడు. అందుకే తన తండ్రితో మేధావి, “తండ్రీ! కాలము నీ అధీనములో ఉన్నట్లు మాట్లాడుతున్నావు. కాని మానవుడు తల్లి గర్భమున ప్రవేశించునప్పటి నుండి అతడిని మృత్యువు వెంటాడుతుంది. ఇగిరిపోయే నీటిలోని చేపవంటి వాడు మానవుడు. ఆలుబిడ్డలు అంటూ తాపత్రయపడే మనిషిని మృత్యువు అడవిలో ఆదమరిచి నిదరించే మనిషిని పులి కొనిపోయే అంత సులభంగా అపహలిస్తుంది.
మానవుని జీవితంలో మూడు విధములైన కార్యాలు ఉంటాయి. 1. చేసినది 2. చేస్తూ ఉన్నది 3. చేయాల్సినది. ఈ మూడు కార్యాలలో మనిషి నిమగ్నుడై ఉంటాడు. అయితే ఈ మూడు ఒకే కాలం యొక్క అంశాలే. ఈ మాటలలో మనిషి ఉన్నా మృత్యువు అతడిని నిర్ధయగా కబళిస్తుంది. కాబట్టి కాలాన్ని మనిషి ఏమీ చేయజాలడు. ఏమీ అనజాలడు. కాలానికి మనిషి అధీనుడు తప్ప మనిషికి కాలము ఆధీనము కాదు” అన్నాడు.
తండ్రి సమాధానము పరంపరాగతము పైన ఆధారపడి ఉంటే, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమ క్రమము తప్పకుండా సాగి పోతుంది అనే ధైర్యము, కాలమహిమ తెలిస్తే నిలువదు అంటున్నాడు. తనయుడు మనను తీరికగా కార్యక్రమ నిర్వహణ చేసుకొనివ్వదు కాలము, అది అజేయమైనది. ప్రాణుల జీవితమంతా కాలాధీనమే అయినప్పుడు ఆలుబిడ్డలు, యజ్ఞ నిర్వహణం వంటి సంప్రదాయిక పథాన మోక్షాణ్వేషణ చేయటం కంటే మరొక మార్గం వెదకవలసిన అవసరం ఉందని అంటాడు.
మరలా అతడే తండ్రితో,
“భీరుఁడు శూరుఁడు జడుఁడు వి | శారదుఁ డబలాత్మకుండు సబలుండన లే
దేరినయిన మృత్యువు దు | ర్వారంబై యపహరించు వైదికవర్యా! (12-4-24)
మృత్యువు ఎదురు లేని బలం కలది. దాని ముందు అందరూ సమానులే. ఆది పిరికివాడిని, నిర్భయుడిని, అజ్ఞానిని, విజ్ఞానిని, అతిబడుని, సబలుడిని, – అందరినీ ఒకే విధంగా కబళిస్తుంది. కాలం ముందు ప్రాణులన్నీ సమానులే. కాలమహిమ అప్రతివిధేయమైనది. పుణ్యాతుడవైన ఓ తండ్రీ! ఈ సంసారం మరణానికి అడ్డుకట్ట. దానికి వ్యతిరేకంగా, అనాసక్తంగా కోరికలు లేకుండా జీవించటం స్వర్గం. ఈ జ్ఞానంతో సంసారమనే త్రాటిని త్రెంచుకొనుము.
ఆసక్తితో కూడిన జీవితమే సంసారము. అది మృత్యు మార్గము. నిజానికి మోక్షమంటే మరణ రాహిత్యము. సుఖదుఃఖాలు రెండూ నాకు సమానమే. కేవలం శాంతి మాత్రం నాకు మిగులుతుంది. సంతతి ద్వారా ఆ మృత్యు తత్వము. అదే మోక్షం అనుకొంటే చెల్లదు. ఎందుకంటే నేనే సంతతిగా పుట్టటం జరుగుతుంది. తప్ప వేరే కాదు. నన్ను నేను జన్మింప చేసుకుంటూ దాని నుండి ఆ సంతతి నుండి మోక్షాన్ని ఆశించటం ఉచితం కాదు. పైగా అలా ఆశించటం సంతతి మీద నేరం మోపటం అవుతుంది. సంతతి ప్రయోజనం ఆత్మ మోక్షమే అనటం సంతానం మీద అభియోగం మోపటమే.
“విను పశుయజ్ఞము హింసన | మనంతఫలదంబు గా; దహంకృతిసహితం
బనఘా! వాఙ్మనసనియమ | మను యాగం బిచ్చు నవ్యయానందంబున్.” (12-4-28)
పరంపరగా కొనసాగుతూ వస్తున్న యజ్ఞం హింస తప్ప మరొకటి కాదని, హింస ఆనంద ఫలితాలను ఇవ్వలేదు. పైగా అది అంహకార సూచనగా కనిపిస్తుంది. నిజమైన యజ్ఞమంటే వాక్కునూ, మనసును నిగ్రహించుకోవటమే. నిగ్రహం ద్వారానే శాశ్వతానందం లభిస్తుంది. ఇది కొత్త యజ్ఞం. కావున నీవు మనో వికారాలను, అరిషడ్వర్గాలను విసర్జించి, ఏకాంత ప్రదేశాన నిశ్చల మనస్కుడవై, నిన్ను నీవు తెలుసుకొనుము. అదే మేలు. ఇతరములన్నీ వ్యర్థములు. కావున త్యజించుము” అని చెప్పాడు.
తండ్రి అలాగే చేసి శాశ్వత సుఖం పొందాడు.
అమృతత్వం సాధించాలంటే జ్ఞానమార్గమన పయనించాలి. ఆత్మ జ్ఞానంతో ముక్తి పొందాలి. ఆ ముక్తి ప్రాప్తికి వికారహితమైన మనసు అవసరం. ఏకాంత వాసం అభిలషణీయం. ఇది ప్రయోగవాదియైన కుమారుడి బోధ. సంప్రదాయవాదియైన తండ్రిపై ప్రయోగవాదియైన కుమారుడి భావము పై చేయిగా ఉండటం ఈ కథలో విశేషము. ప్రగతి సూచకం కూడా.
భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది.
శాంతి పర్వము చతుర్థాశ్వాసంలోనిది.
~
Solitude is a wonderful thing when one is at peace with oneself and when there is a definite task to be accomplished. – J. W. Goethe
~
పురుషుడే భోగమున్ విడిచి పొందు నిరామయ శాంతి సౌఖ్యముల్
~
“ప్రవిమల కందమూల ఫల పంక్తుల జీవికఁ చేయుముర్విపై
నవసవపల్లవంబుల నొనర్పుము పానుపు లెమ్ము పాపనా
టవికిని పోవుము.”
~
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
