Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-32

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

82. శమ్యాక వృత్తాంతము!

లోకములో ధనమే సుఖఃశాంతులకు మూలమనే అభిప్రాయమన్నది. ఇది ప్రాచీన కాలంగా దాదాపుగా లోకములో అందరిలో ఉన్న అభిప్రాయం. దీనిలోని సత్యాసత్యాలు చెప్పడానికి ఈ కథ ఉద్దేశింపబడినది.

పూర్వం శమ్యాకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కుటుంబాన్ని త్యజించాడు. కూటికి, గుడ్డకు కటకటపడుతూ భీష్మపితామహుడి దగ్గరికి వచ్చాడు. అతడు భీష్మునితో మాట్లాడుతూ,  ఆ మాటల సందర్భంలో ఇలా అన్నాడు.

కలిమి, లేమి అనే ఈ రెంటిలో ఏది సుఖకరమైనది? అనే ప్రశ్నకు సమాధానం కొరకు ఆ రెండిలో ఏది ఉత్తమమో నిర్ణయించుటకు ఆ రెంటినీ త్రాసులో పెట్టి తూచగా, త్రూచులోని ముల్లు లేమివైపుకు మొగ్గింది. లేమి కలిమి కన్నా ఎట్లా ఉత్తమమో అంటావా! వినుము. ఆ రెండింటిలో గుణదోషాలను వివరిస్తాను. ధనవంతుడు ధనం కారణంగానే మృత్యు ముఖములో ఉన్నట్లుగా నిత్యం భయభ్రాంతులకులోను అవుతూ నిప్పు వలననో, దొంగల వలననో, కాకపోతే మరొక విధంగానో తన డబ్బు ఎప్పుడు నశిస్తుందో అనే తల్లడపాటుతో సుఖశాంతులకు దూరమై జీవనం సాగిస్తున్నాడు. అంటే ధనమే నరుడి సుఖశాంతులను హరిస్తుంది.

డబ్బు కారణంగా నరుడు కోపానికీ, ఆత్యాశకులోనై ముందు మనసు పాడు చేసుకుంటాడు. మనసు నిరంతరం కలతతో ఉన్నప్పుడు దిగులూ, విచారం తప్పవు. ఈ స్థితి దుఃఖము కాకుండా సుఖమా? కాదు. ఇక నిర్ధనుడు స్వేచ్ఛగా ఉంటాడు. భయపడడు. కపటాన్ని అంగీకరించడు. మాట మృదువుగా ఉండడంతో జనప్రియంగా మారతాడు. కావున లోకంలోని తీరుతెన్నులు గ్రహించి, మనకా కనిపించే డబ్బూ దస్కము కాలప్రభావాన నశించేవి అనే జ్ఞానముతో డబ్బు నుండి ముక్తి పొందటం ఎక్కడైనా, ఎప్పుడైనా తెలివితో కూడిన పని.

“ధనవత్త్వము దుఃఖకరం | బని కని తత్కాంక్ష విడుచు నతని కధనతా
జనితాత్మాధీనత్వం | బనుపమ సౌఖ్యంబు సేయు నక్షీణముగన్‌.” (12-4-38)

నరుడు డబ్బు కలిగి ఉండటం దుఃఖ హేతువు – అనే జ్ఞానం కలిగి, డబ్బు మీద కోరిక విడిచి పెట్టినపుడు ఆ లేమి కారణంగా తన ఆధీనంలో తాను ఉండగలడు. ఈ ఆత్మాధీనత్వమనేది ధనవంతుడికి అసాధ్యం. ముందు ధనానికై ఆధీనుడైతే తప్ప ఆధీనతత్వం కొనసాగదు. కావున ఆత్మాధీనత్వమనే ఒక్క లక్షణం వలన సాటిలేని సుఖశాంతులు మనిషి పొందగలగుతాడు. ప్రయోజనాలన్నీ లోకాన సామాన్యంగా ధనానికి ప్రతిరూపాలు. ధనాశ వదులుకుంటే, వేరే వదలవలసినది, ఏదీ లేదు.

భీష్మడు ధర్మరాజుకు చెప్పినది

శాంతి పర్వం చతుర్థాశ్వాసంలోనిది

లోకంలో ధనవంతులు పేదవారుంటారు. ఇందులో సుఖించేదెవరు? దుఃఖించేదెవరు? అని ధర్మజుడు అడిగిన ప్రశ్నకు భీష్ముడు వినిపించిన కథ.

అర్థానా మార్జనే దుఖం, ఆర్జితానాం చ రక్షణే
నాశే దుఃఖం, వ్యయే దుఃఖం కిమధిర్థం దుఃఖభాజనం.

There is pain in acquiring wealth, pain in preserving what has been acquired, pain in its loss and pain in its expenditure – why lave such a replicable sorrow?

83. మంకి యను బ్రాహ్మణుని చరిత్ర!

ఆశ, పేరాశలలో ఆశ మనిషికి తప్పకుండా ఉండాలి. పేరాశ లేదా తృష్ణ మనిషిని దుఃఖములో ముంచుతుంది. తృష్ణ అంటే తీరని దాహము. దాని నుండి విడువడమే సుఖం – ఈ మర్మాన్ని తెలిపేది మంకీ వృత్తాంతం.

మంకి అనే పేరుగల బ్రాహ్మణుడొకడు ధనాశతో జీవిస్తుండేవాడు. ధనార్జన కొరకే, అతడు పని నేర్వవలసిన కోడెదూడలను కొని, రెండింటిని ఒకే త్రాటితో కట్టి ఉంచాడు. ఆ దూడలు చురుకు పుట్టి హాఠాత్తుగా రెండు కలిసి పరుగెత్తుతూ బ్రోవలో పడుకొని ఉన్న పెద్ద ఒంటె మీదుగా ఒంటెకు అటు ఒకటి, ఇటు ఒకటి దాటుబోయాయి. వాటి ఆ అలజడికి ఆ ఒంటె కూడా లేచి పరుగెత్తుటం మొదలు పెట్టింది. ఆ ఎత్తైన ఒంటెను ఇరవైపులా యా కోడెల జంట మెటకున్న పలుపుత్రాటితో పైకి లేచింది. మెడకున్న పలుపే ఉరికాగా కోడలు రెండు చచ్చి వ్రేళ్ళాడాయి. క్షణంలో ఇదంతా జరిగిపోవటంతో ఆ మంకి విప్రుడు “అయ్యో!  రత్నాలవంటి కోడెలు క్షణములో శవాలుగా మారిపోయి ఒంటెకు అటునిటు వ్రేలాడుతున్నాయే” అని మనసులో నిర్వేదం పుట్టగా తనను జాలిగా చూస్తున్న జనంతో ,  “తొందరపాటు పక్షపాతం లేకుండా శ్రేష్ఠమైన బుద్దితో ఆలోచించి చూస్తే కార్యసిద్ధి జరగాలంటే మానవ యత్నం కంటే దైవబలమే ముఖ్యము. ఎక్కడయినా ఎప్పడయినా  మానవయత్నం ఫలించినట్లు కనిపించినా అది దైవానుగ్రహం తప్ప అన్యం కాదు” అన్నాడు.

ఇక్కడ నరుడు ధనాన్ని వాంఛించాడు. పెద్ద నష్టం సిద్ధించింది. దీనిలో అతడి ప్రమేయము లేదు. అంతా దైవ నిర్ణయము. అందుకే మరలా మంకి, “సుఖమే పరమార్థమయినపుడు, ఆ సుఖం  దైవదత్తం తప్ప పురుషప్రయత్నం వలన సాధ్యం కాదని తేలినపుడు నరుడు తన సర్వకార్యాలను, చేష్టలను నైపుణ్యాలను పక్కన పెట్టి, భారం దైవంపై మోపి, తాను భారం మీద వేసుకొకపోవడం సరియైనది. మనసుకి ఆహ్లాదం కావాలంటే అది కోరికల తీవ్రతతో నిండి ఉండరాదు. కోరికల తీవ్రతను మనసు నుండి తొలగించాలంటే ఏమి చేయాలి? సుఖదుఃఖాలు మనోధర్మాలు కాగా మనసును స్వాధీనపరచుకుంటే సుఖదుఖఃకాలు స్వాధీనం మయినట్లే! ” అనుకొని తన మనసులో.

“నీ మూలం బే నెఱిఁగితిఁ | గామమ! సంకల్పమునన కలిగెదు సంక
ల్పామర్శరహితమగు చే | తోముద్రం దాల్తు నేను దుది యది నీకున్‌.” (12-4-45)

“ఓ కోరికా! నీ మూలాన్ని కనుగొన్నాను. నీవు సంకల్పం నుండి జన్మిస్తున్నావు. కావున నేను సంకల్ప స్పర్శ ఉండని మనో ముద్ర వహించి నిన్ను నశింప చేస్తాను. మనసు సంకల్ప రహితంగా చేస్తాను. ముక్తి సాధిస్తాను. కోరికలు అనుచితాలు.”

“సొమ్ము గోరినయంతన సుఖము గలుగ; | దది యుపార్జింపఁగా సిద్ధియగుట నిజమె?
కలిగెనేని యనేక చింతల నొనర్చుఁ | జెడుట చావుతోఁ దుల్య మయ్యిడుమ యేల?” (12-4-47)

సుఖము ధనము వలన కలుగవచ్చును. కాని ధనము కోరగానే సిద్ధించదు. వాటికై యత్నించాలి. ప్రయత్నిస్తే సిద్ధిస్తుందని నిశ్చయముండేదు. సిద్ధిస్త సిద్ధించవచ్చును. లేకుంటే లేకపోవచ్చును. ఒకవేళ సిద్ధిస్తే ధనంతోపాటు వెతలూ ఉంటాయి. అసలు సిద్ధించలేదంటే ఆ ఓటమి చావుతో సమానం.

కాబట్టి అన్ని వైపులా దుఃఖాలనే కలిగించే సొమ్ముకై సంకల్పించటం ఎందుకు? కావున కోరికను తిరస్కరించటంతో నిజమైన సుఖమున్నది. కోరికలు లేని మనసు ముక్తయే అనుకొని ఓ కామమా! లోకములో ఇష్టనాశనం వలన కలిగే దుఃఖానికి, ధనార్జనకై పడే శ్రమకీ ఆర్జితమైన దానితో తృప్తిపడక ఇంకా ఇంకా ఆర్జించాలనే తపనకు నేనే మూలస్థానం. నీవు ఆవహించిన వాడిని మరేది పట్టదు. కాబట్టి నిన్ను విడువటంలోనే సుఖం లభిస్తుంది. నీవు ఆశ పెట్టిన కారణాన, తీవ్రంగా కష్టించి సొమ్ము ఆర్జించినా అనంతరం దాపురించే కష్టపరంపర దానిని దాచటానికి, రక్షించటానికి పడవలసిన పాట్లు మిగిలి ఉంటాయి. ఈ కామము చేతుల నుండి నరునికి  రక్షించలేము. కాబట్టి నిన్ను నిరసిస్తే దుఃఖం ఉండడం క్రొత్తగా యేదుర్దశా, దైన్యం ఆవహించదు. కావున ఓ కామమా!  నీ దృష్టి నీది కాని, నీ కన్ను పడిన వస్తువు సులభమో కాదో పట్టించుకోవు. దాని కోసం వెంపర్లాడి కష్టాలు కొని తెస్తావు. నీవు వెళ్ళే దారిలో వెళ్ళకుండా, నీకు దూరంగా ఉండి, నిన్ను రంగు ఏర్పడిన ఆకాశాన్ని తొలింగించినట్లు తొలగించి రూపుమాపుతాను. నీ వెంట  పరుగెత్తి, నాశం పొంది విసిగి వేసారి సంపూర్ణంగా తిరస్కరించాను. కామ తిరస్కారముతో నాలోని కోపం నశించింది. ఇంద్రియ నిగ్రహం కలిగింది. ఓర్పు నెలకొంది. ప్రాణుల యెడ కరుణా పాదుకొన్నది. ఇక నన్ను నీ తోబుట్టువులైన లోభము కూడా తోడలేదు. కోరికలు ఈడేరటం వలన కలిగే సుఖము, స్వర్గము లభించే సుఖముతో పోల్చినప్పుడు నిన్ను త్యజించినపుడు కలిగే సుఖము స్వర్గములో లభించే సుఖముతో పోల్చినపుడు నిన్ను త్యజించినపుడు కలిగే సుఖము ముందు తక్కువే. కావున నిన్ను శత్రువులా చంపి పరబ్రహ్మం యొక్క నగరంలో రాజు వలె జీవిస్తాను – అని అనుకొని అలాగే చేసి శాంతిని పొందినాడు.

మోక్షం సిద్ధించాలంటే, ముక్తి దారిలో నడవాలంటే ముందుగా కోరికలకు దూరంగా  ఉండాలి. కోరికలను శతృవులుగా భావించి కోరికలు నెరవేరటం వల్ల కలిగే సుఖము కన్నా, త్యజించినపుడే అధిక సుఖం.

డబ్బు మీద పేరాశకు లోనైన వాడు ఎప్పుడూ ఏ విధంగా సుఖం పొందుతాడు అన్న ప్రశ్నకు భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కథ.

శాంతి పర్వము చతుర్థాశ్వాసంలోనిది.

ఆశ లేని కూటికి ఆకలి లేదు.

There is no appetite for food un-hoped for.

84. అజగర చరిత వ్రతము!

నరుడికి శోకం ఎలా పోతుంది? కన్ను తెరిచినప్పుడు నుండి మూసేవరకూ మనిషి జీవితం దుఃఖమయము. ఈ దుఃఖన్ని పోగొట్టుకొని శాశ్వత ఆనందాన్ని పొందడానికి, అనాది కాలము నుండి మానవుడు ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. దుఃఖాన్ని పోగొట్టుకోవటం ఒకటి, శాశ్వత ఆనందాన్నిచ్చేది మరొకటి. ఈ రెంటిని పొందడానికి మనిషి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ శాంతిని అర్థము చేసుకొని పరిష్కరింప ప్రయత్నం చేసే కథ అజగర చరిత వ్రతము.

రాక్షస రాజయిన ప్రహ్లాదుడు అజగరుడనే పేరు గల బ్రాహ్మణుడని సమీపించి, తనకూ శాంతిని ఉపదేశించుమని అడుగగా, ఆ అజగరుడు ప్రహ్లాదునితో ప్రాణి – పుట్టుక కలిగినది. ప్రాణులు శాశ్వతం కావు. నశింపు సహజలక్షణం. పుట్టుట ఉన్నది అంటే గిట్టుట తప్పదు. జననము, మరణము రెండూ అనివార్యము.

ప్రవాహం సాగిపోతున్నప్పుడు, కొన్ని కట్టెలు తేలుతూ వచ్చి ఒకదానితో ఒకటి కలుస్తూంటాయి. సృష్టిలో బంధువులు, కుటుంబ సభ్యుల కలయిక కూడా అటువంటిదే. ప్రవాహంలో కట్టెల కలయిక, కట్టెల యిష్టం మీద ఆధారపడి జరుగలేదు. విడిపోవడం కూడా వాటి నిమిత్తము లేకుండానే జరుగుతుంది. ప్రవాహం వేగం – దిశ మీద ఇదంతా ఆధారపడుతుంది. అల్లాడే బంధువుల కలయికలూ, ఎడబాటులూ లోకములో జరుగుతుంటాయి. ఈ కలయికలతో ఎడబాటులతో నరుడికి సంబంధం లేదు. ఈ యథార్థాన్ని గ్రహిస్తే దుఃఖము ఉండదు. నేను ఈ సత్యాన్ని గ్రహించాను. కావున ప్రశాంతంగా ఉన్నాను. అలా ఉండటం చూచి నీవు నన్ను చేరావు. కాబట్టి ఇంకా చెబుతాను వినుము.

మే లర్థింపను గీడును | జాలింబడి తొలఁగఁ ద్రోవ సరిఁ దూష్ణీం భా
వాలంబిమనస్కుఁడనై | యాలంబుగఁ జేసి నడతు నయ్యిరుదెఱఁగున్‌ (12-4-58)

మేలు కావాలి అని కోరను. కీడు దాపురిస్తే దుఃఖించి దాని నుండి బయటపడడానికి ప్రయత్నిస్తాను. మేలు కీళ్ళను సరిసమానంగా చూస్తూ, సాక్షిగా చూచే మనస్సులో ఆ రెండింటి యెడ ఉపేక్ష వహించి జీవిస్తాను. నాకు రుచికర ఆహారమైనా, రుచిహీనమైన తెలికపిండి అయనా సమానమే. రెంటిని సమభావంతో భుజిస్తాను. మెత్తటి పడకైనా, కఠినమైన భూభాగమైనా ఆదరంతో శయనిస్తాను. మన సంరక్షణ ధ్యేయంగా చెట్టు పుట్ట గానీ చీనాంబరం గానీ సమభావంతో ధరిస్తాను.

నా కన్నులు మొదలైన ఇంద్రియాలు ఆకాశం మొదలైన విషయాలను పట్టించుకోవు. అనగా ఇంద్రియాలు నా ఆధీనములో ఉన్నాయి. నేను ఇంద్రియముల ఆధీనంలో లేను.

“ఓ రాజా! ఇంకా వివరంగా ఈ అజగర చరిత వ్రతమును వివరిస్తాను వినుము.”

“చలనమేది పుట్టుఁ జావునుం బిరువెట్టి | యామిషార్థిజనుల నపహసించు
చెలిమితోడ లేమికలిమి వాటింపని| రమణ నునికి యజగరవ్రతంబు.” (12-4-62)

భోగ భాగ్యాలు ఆశించి పాకులాడే జనసామాన్యాన్ని చూచి నవ్వుకొంటూ కలిమి లేములను రెండింటిని సమానంగా చూడటం అజగర వ్రతం. నియమ నిబంధనలకు లోనుగాకుండా భుజిస్తూ, సంచరిస్తూ, శయనిస్తూ, బ్రహ్మ నిర్దేశాన్ని పాటిస్తూ, అంతరంగాన ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండటం, నిత్యతృప్తి, శుభ్రత, ఓటమి సమభావం వంటి లక్షణాలు కలిగి ఉండి చిదానందానుభవం పొందటం అజగర వ్రతం.

వ్రతం అంటే జీవనం. ఈ అజగర వ్రతం యజ్ఞయాగాదుల వలన లభించేది కాదు. అంతకంటే గొప్పదైనది. ఇది పండితులకు మాత్రమే సాధ్యమగునది. అన్యులకు ఆచరణా యోగ్యము కానిది. శాంతికి మార్గమైనది” అని పలికాడు.

అజగరం అంటే కొండ చిలువ. పెద్దగా కదలిక లేకుండా పడి ఉండే ఓ పెద్ద పాము. దేహధారణ కొరకు తినటం, నిద్రించటం దీని పద్ధతి. అదే విధంగా కామత్యాగం చేసిన యోగి శరీరధారణ మాత్రం కోరకే ఆహారం స్వీకరిస్తూ మిగిలిన ప్రాపంచిక విషయాలలో అనాసక్తుడై ఉండే వాడు అజగరుడు.

మనిషి అజగరుడుగా మారగలిగిన నాడు శోకానికి దూరమై, మోక్షానికి దగ్గర కాగలడు. అజగరుడిని మోదఖేదాలు స్పృశించలేవు. ఎందకంటే అతడు వాటికి అనుభోక్తగా కాక సాక్షిగా, జరిగే దానిని చూచేవాడిగా ఉంటూ జీవన ప్రయాణం సాగిస్తాడు. అయితే ఇలాంటి వ్రతాన్ని ఆచరించడం సామాన్యులకు అంతగా సాధ్యం కాకపోవచ్చు. లౌకిక విషయాల యెడ అనాసక్తుడై తుష్ణీం భావంతో ఉండటం సామాన్యుమైన విషయం కాదు. అయితే సాధన ద్వారా, అజగరుడి నడతను ఆచరించగల నరుడికి పాపం, భీతి, శోకం వంటి మానసిక క్షోభలు దూరమై, వాటిపై విజయం లభ్యమై మోక్షం చేరువవుతుంది. అయితే ఆ సాధన ఎటువంటిదంటే ఇంద్రియాలను ఐహిక విషయాల నుండి తప్పించగలగటం మనస్సును ఏకాగ్ర బద్ధం చేయటం అన్నమాట.

భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది.

శాంతి పర్వము –  చతుర్థాశ్వాసం లోనిది.

(ఇంకా ఉంది)

Exit mobile version