[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
85. యమ, కాల, మృత్యువు, భూసుర ఇక్ష్వాకు సంవాదము!
జపించదగిన అంశమును గురించి యముడికి, కాల పురుషుడికి, మృత్యుదేవతకు, బ్రాహ్మణుడికి, ఇక్ష్వాకు వంశ రాజుకు సంవాదం జరగింది.
భీష్ముడు ధర్మరాజుతో “అత్యధిక శుభ్రతతో వెలుగొందుతూ, దర్భలతో వ్యాప్తమైపూతమైన ఒక సమతలంపై పిడికెడు దర్భలు ధరించి ఆసీనుడై జ్ఞానేంద్రియాలను (కన్ను, ముక్కు, చెవి, చర్మం, నోరు), కర్మేంద్రియాలను (వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ) అన్య విషయాలలో సక్తంగా కాకుండా నిగ్రహించి ఏకాగ్రచిత్తుడై, మాత్సర్యం, గర్వం, దర్పం, దంభం మొదలగు వానిని తొలగించుకొని జపం చేయటానికి ఉద్యుక్తులై జపం నిర్వహించాలి. ఆ విధంగా నిష్ఠాభరితంగా నిర్వర్తించబడిన జపం ద్వంద్వాతీతమైన శాశ్వతమైన స్థానాన్ని – మోక్షాన్ని ప్రసాదిస్తుంది.” అని చెప్పాడు.
‘శౌచాది గుణము లెడలుట
నీచత్వము వాటిలంగ నిశ్చలమతి దు
ష్టాచరితమైన జపవిధి
నా చెప్పిన సుగతి లేదు నరకముఁ దెచ్చున్’ (12-4-131)
ఇట్టి జపం, శౌచం మొదలయి లక్షణాలు లోపించబడినట్లయితే మోక్షం మాట దేవుడెరుగు, నరకం ప్రాప్తిస్తుంది. అంటే లక్ష్యం, ప్రాప్యం రెండూ ఉన్నతంగా పరిశుభ్రంగా ఉండాలి. అపుడే ఫలితం శుభప్రదమవుతుంది. వేద పారంగతుడయిన కౌశికుడు బ్రాహ్మణుడు జపమును చేయవలసిన విధంగా చేసేవాడు. అతడు అలా వేయి సంవత్సరాలు నిష్ఠతో జపకర్మను చేయగా, ఆ జపానికి అధిదేవత అయిన సావిత్రీదేవి ప్రత్యక్షమై, వరం కోరుకొమన్నది. దానికి ఆయన జపకర్మలోని నిష్ఠను వరంగా కోరుకున్నాడు. అతని శ్రద్ధకు సంతోషించిన, ఆ దేవి, “నీ కోరిక నెరవేరుతుంది. ధర్మ దేవత, యముడు, కాలపురుషుడు నీ దగ్గరకి వచ్చి నీతో సంభాషిస్తారు” అని తెలిపి అదృశ్యమయింది.
ఇక ఆ కౌశికుడు దేవీ ప్రసాదలబ్దుడై నూరు సంవత్సరాలు జపకర్మను నిర్వహించాడు. అపుడు ఎంతో ప్రేమతో ధర్మదేవత ఆకారాన్ని ధరించి కౌశికుడి వద్దకు వచ్చింది. “ఓ కౌశికా! నీ జపకర్మ ఫలితంగా గొప్ప పుణ్యలోకాలు లభించినవి. సంతోషముతో నీవిక, నీ శరీరాన్ని మనసును విడిచి ఆ లోకాలకు చేరుకో” అన్నది. అపుడు కౌశిక ఋషి, “ఓ ధర్మమా! ఊర్ధ్వలోకాలు ఉత్తమమైనవే కావచ్చును. అయినప్పటకీ నేను నాయీ శరీరాన్ని దిగవిడిచి వెళ్ళవలసి వస్తే, ఆ లోకాలను అంగీకరించజాలను. ఎందుకంటే శరీరం నా జపకర్మకు అనుగుణమైనది. అట్టి ఈ అనుకుల దేహాన్ని ఎలా విడిచి పెట్టగలను” అన్నాడు.
కౌశికుడికి ఊర్ధ్వలోకాలు అంటే అనిష్టము కాదు. జపకర్మకు అనువైన, తపశ్చర్యకు సాధనమైన శరీరాన్ని విడిచి పెట్టటం అంటే అనిష్టం. అపుడు ధర్మం “ఎప్పటికైనా శరీరత్యాగము తప్పదు కదా. పైగా స్వర్గం అందమైనది కదా” అన్నది. కౌశికుడు, “నీవెన్ని చెప్పినా ఈ శరీరాన్ని విడిచి పై లోకాలకు వెళ్ళుటకు అంగీకరించను” అన్నాడు. వీరి మధ్యన సంభాషణ జరుగుచండగా, ధర్మదేవత, “నీవు శరీరత్యాగం చేయవు సరే. కానీ అదిగో యముడు, కాలపుషుడు, మృత్యువు ఇటే వస్తున్నారు.” అంది. ఆ పై ముందుగా యముడు, “నీ జపఫలితం సిద్ధించింది” అన్నాడు. కాలుడు “నీవు స్వర్గాన్ని అధిరోహించాల్సిన సమయం ఆసన్నమైనది. అందుకే నేను వచ్చాను” అన్నాడు.
మృత్యువు తాను కాలునిచే ప్రేరణ పొంది, కౌశికుడిని తీసుకొని వెళ్ళుటకు వచ్చినట్లు తెలిపినది. బ్రాహ్మణుడు వారికి స్వాగతం పలికి, అణుకువతో, ముగ్గురి మాటలను తిరస్కరిస్తున్న భావాన్ని కనబరచాడు. ఇది కౌశికుడికి జపనిష్ఠా తత్పరత వలన సిద్ధించిన ఆత్మవిశ్వాసం. అందుకే అతడిని యమాదుల ముందు నిర్భయంగా నిలబెట్టింది. వృత్తిపరంగా సిద్ధించిన అజేయమైన ఆత్మ శక్తి కలవారు. ఎవరి ముందు తలవంచరు. అందుకే “నేను మీకు ఏ పని చెయగలను?” అన్నాడు. సరిగ్గా అదే సమయాన దీర్ఘయాత్రలు చేస్తూ, ఇక్ష్వాకు మహారాజు ఆ ప్రదేశానికి యేతెంచి, ఆ నలుగురికి నమస్కరించాడు.
వారిలో ఆ కౌశికుడు ఆ రాజును అతిథిగా గౌరవించి, “నాకున్న దానికనుగుణంగా యివ్వగలను. మీ కోరిక తెలపండి” అన్నాడు. ఆ రాజు బ్రాహ్మణుడితో “రాజులు దానాలు చేస్తారు కాని తీసుకోరు. నీవే కోరుకో. నీ కోరిక తీరుస్తాను” అన్నాడు. ఆ అపుడు కౌశికుడు “సంసార చక్రానబడి వివిధ క్రియలలో ప్రవర్తించే వారు దానాలు స్వీకరిస్తారు తప్ప, సంపారాన్ని దూరంగా నివృత్తి మార్గాన ప్రపంచిక విషాయాల నుండి ఇంద్రియాలను, మనసును మరల్చి, నిగ్రహించి ఆత్మ జ్ఞానం కొరకు యత్నించటం నివృత్తి ప్రాపంచిక విషయాల నుండి మరల్చి జీవించే వారు దానం గ్రహిస్తారా? నా మనసులో యే కోరికలు లేవు. కాగా నీవు కోరుకొను. కాని ఈయగలవాడను. తప్పక ఇస్తాను. నీవే కోరుకో” అన్నాడు.
మరలా అతడే, సత్కారరూపాన ఇచ్చినది స్వీకరిస్తే స్వీకర్తకు యే కీడుండదు అని పలికాడు. అపుడు రాజు నీవు అంతటి దాతవే అయితే, “నీ జపఫలితం మొత్తం నాకిమ్ము” అన్నాడు. “జపఫలితంలో సగము ఇస్తాను. మొత్తం ఫలితం కావాలి అన్నా ఇస్తాను” అన్నాడు కౌశికుడు. అపుడు రాజు “ఇంతకీ ఈ నీ జపఫలితమేమిటి?” అన్నాడు. దానికి కౌశికుడు, “నేను కోరికలు లేనివాడిని. కావున జపఫలిత స్వరూప స్వభావాలను గూర్చి ఆలోచించలేదు. నేను దీని వలన ఫలమేమిటి అని ఇతరులను అడుగలేదు. దీనిని స్వీకరించము. ధర్మ తత్త్వవేత్తలు ఆ ఫల స్వరూపము ఎంతటిదో తెలియజేస్తారు” అన్నాడు.
ఇక్కడ దాతకు ఇచ్చే విషయం పట్ల, గ్రహీతకు తీసుకనే విషయం పట్ల అవగాహన లేదు. అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేటప్పుడు, కాస్తా ముందు వెనుకలు ఆలోచించుకోవడం భావ్యం. “ఫలితం తెలియని దాన ఫలాన్ని స్వీకరించను” అన్నాడు రాజు. అపుడు కౌశికుడు రాజు అయిన ఇక్ష్వాకును తప్పుపడుతూ, “ఓ రాజా! నీవు అడిగావు. నేను ఇచ్చాను. అడగటం, ఇవ్వటం రెండూ జరిగిపోయిన తరువాత నేను ఒల్లను అనటం సమజంసం కాదు. అట్లా అయితే సత్యవ్రత పాలనకు హానికరం కాదా! అట్లా తిరస్కరించటం సత్యానికి కొరతగా ఎంచటం కాదా!” అన్నాడు కౌశికుడు.
అపుడు ఇక్ష్వాకుడు, తాను క్షత్రియుడు. కాబట్టి క్షత్రియోచితమైన తగవులాట అనే కయ్యానికి దిగాడు. అప్పుడు కౌశికుడు “ఓ రాజా ఇస్తానని ఇవ్వక పోవటం, తీసుకుంటానని తీసుకోకపోవటం రెండూ మిక్కిలి అసత్యాలు. సద్బ్రాహ్మణుడనైన నేనూ, క్షత్రియుడనైన నీవూ సత్యావ్రత పాలనకు దూరంగా జరిగిపోవటం తగునా అన్నాడు. మరియు అతడే ఇలా అన్నాడు:
‘సత్యమ తపమును యజ్ఞము,
సత్యమ వేదంబు దాంతిశాంతులు నగుటన్
సత్యము దొఱఁగుట నిర్మల
నిత్యానుష్ఠానములును నిష్ఫలము లగున్.’ (12-4-151)
“సత్యము సర్వోన్నతమైనది. సత్యవ్రతపాలన చేస్తే తపస్సు చేసినట్లే. యజ్ఞం చేసినట్లే. వేదం తెలిసినట్లే. సత్యవ్రత పాలన నరుడిలో అరిషడ్వర్గాలను జయించగల శాంతిని కలిగిస్తుంది. అట్టి సకల ధర్మాచరణకు మూలకందమైన సత్యాన్ని విడిచి పెడితే ఇక జపహోమపూజాపుస్కరాల వంటి నిత్యానుష్ఠానాలు నిష్ఫలము అవుతాయి.” అన్నాడు.
ఈ వివాదమంతా వింటున్న ధర్మదేవత, యముడు, కాలుడు, మృత్యుదేవతలు వింటుండగా వారిరువురిని ఉద్దేశించి, “మీరీ తగవులాడు మానండి. ఓ భూసురా! నీవు దానఫలము, ఓ రాజా! నీవు సత్యవ్రత ఫలం పొందగలవు” అని పలకాడు. అదీ సమయాన స్వర్గము మానవాకృతి దాల్చి వచ్చి, మీరిరువురు సమాన ఫలాలు పొందగలరని తెలిపినది. అపుడు రాజు “ఈ బ్రాహ్మణుడు నేనిచ్చే దానము స్వీకరించాలి అనగా, విప్రుడు తపస్సు, అధ్యయనం ఈ రెంటి యందే ఆసక్తి చెడకుండా జాగ్రత్తగా కోరబోతున్నాను. నీవు మంచి పని యందే అనీ నిర్ధారణతో నా పుణ్యాఫలాన్ని దయతో దానంగా స్వీకరించుము” అన్నాడు.
రాజు దానగ్రహీతగా, ఎపుడు దానశీలిగా ఉండటం, రాజైన ఇక్ష్వాకు మింగుడు పడటం లేదు. అందుకే అతడు బ్రతిమాలుతున్నాడు. ఇలా విప్రుడిని దానాన్ని స్వీకరించే వాడిగా చేయాలనుకుంటున్న సమయంలో ఇద్దరు నరుల వికృత దుస్తులు, నగలు, ధరించి, వాదలాడుకంటూ వచ్చి, ఆ రాజును చూచి, “ఆ రాజు శాసకుడు” అంటూ అతడి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. వారి కథయిది.
వారిలో ఒకడు గోదానం చేశాడు. మరొకడు ఆ గోదాన ఫలితం తనకిమ్మన్నాడు. దాన కర్త ప్రేమతో దన ఫలాన్ని అర్థికి ధారపోశాడు. అయితే అర్థి తనకు ఆ ఫలితం చాలినది కాదు అన్న భావనతో చాలా మంచి ఆవుల జంటను కొన్నాడు. గోదాన ఫలగ్రహీత గోదాన ఫలంగా తనకు లభించినది అల్పమని భావించి, తాను స్వయంగా రెండు ఆవులను కొని, అర్హుడిని ఎన్నుకొని, ఆవుల జంటను అతడికి దానం చేసి, ఆ దాన ఫలాన్ని తనకు మూడు గోదాన ఫలాన్ని అర్పించిన వాడికి ఈయబోగా, అతడు స్వీకరిస్తానని అంగీకరించి, తరువాత స్వీకరించక తప్పించుకొని తిరుగుసాగాడు. ఆ తప్పించుకొని తిరిగే వాడికి, ఒకనాడు ఈయదలచిన వాడు గట్టిగా పట్టుకొని, గోదాన ఫలాన్ని స్వీకరించమని నిర్భంధించగా వారికి వాదుపుట్ట దానిని తీర్చమని ఇక్ష్వాకును ఆశ్రయించారు. రాజుకు జరిగింది చెప్పారు. రాజు మొత్తం విన్నాడు. ఆ ఇరువురలో మొదటివాడు “ఈతడు అర్థిస్తేనే నా గోదాన ఫలాన్ని తీసుకొమ్ము” అని అర్పించాను. నాకు మరలా ప్రతిగ్రహించే అభిప్రాయము లేదు. అయినపుడు ఇతడు నన్ను నిర్భింధించ వచ్చునా?” అన్నాడు. ఇక రెండువవాడు, “ఇపుడు తీసుకుంటాను అని ఒప్పుకొని తరువాత గోదాన ఫలాన్ని తీసుకోక పోవటం పాపమే అవుతుంది” అని అన్నాడు.
అపుడు కౌశికుడు “రాజా! విన్నవా నరుడి మాటలు” అని పలికి, “నీవు నా జపఫలాన్ని గ్రహించక పోతే చూడు నిన్ను శపిస్తాను” అన్నాడు. రాజు భయపడి ‘ఎన్నడు ఇతరుల నుండి దానం స్వీకరించని వాడిని, ఈ రోజు చేయి చాచవలసి వచ్చింది’ అనుకొని దానమిమ్మని చేయి చాపాడు. వెంటనే విప్రుడు వెక్కిండ్లు జపఫలితం ఇస్తున్నానంటూ రాజు చేతిలో నీటిని ధారగా పోశాడు. అపుడు ఆ రాజు బ్రాహ్మణుడి ముఖం చూచి “నా చేతిలో నీరు పడ్డాయి. నేను దానం తీసుకున్నాను. మన యిరువురి పుణ్యం సమానంగా ఉండవద్దా కాబడ్డి నేను చేసిన యజ్ఞ ఫలితం నీకిస్తాను తీసుకొమ్ము” అన్నాడు. అపుడు ఆ విప్ర వేషధారులిద్దరు వారిని ఉద్దేశించి, తాము అరిషడ్వర్గాలలోని కామ క్రోధాలమని, తాము ధర్మదేవత, యముడు, కాలుడు, మృత్యుదేవత అందరూ కలసి మీ ఇద్దరిని పరిక్షించామని తెలిపి, ఇదంతా పరీక్ష కొరకు జరిగినదే తప్ప నిజానికి దాన ప్రతిగ్రహణాలు అనేవి దైవము చేసే చేష్టితాలు గాని, మానవ క్రియలు కాబోవని తెలిపాయి.
అపుడు కౌశికుడు రాజుతో “నేను సావిత్రీదేవి నుండి శ్రద్ధను, శక్తిని జప నిర్వహణకై దానంగా స్వీకరించాను. ఇపుడు నేరుగా జపక్రియ చేసే పని లేదు. నా కోరికలు, యాచనలు అక్కరలు ఏదైనా ఉంటే అది జపం కొరకే. ఆ జపం అనవసరమే తీరిన నాకు దాన గ్రహణ అవసరము లేదు. అయినా ఇందరి పెద్దల ముందు నీవు ‘మన పుణ్యాలు సమంగా ఉండవద్దా?’ అంటూ దానమీయాలనుకున్నావు. ఇందరి ఎదుట నీ కోరికను భంగపరచటానికి వెరిచి, నీవు కార్యాన్ని నేను గ్రహించాను. నీ అభిష్టమార్గాన వెళ్ళుము” అన్నాడు.
ఆ బ్రాహ్మణుడు క్షత్రియులు ధర్మపుణ్యకార్య నిర్వహణలో చూపిన అరుదైన శ్రద్ధాభక్తులకా బ్రహ్మాదులు సంతోషించి పూల వాన కురిపించారు. ఆ సమయాన మానవాకారములో నున్న స్వర్గము వారిరువురిని చూచి, “మీరిద్దరు మహా సిద్ధిపొందారు. ఇక ఆలసించటం ఎందుకు? ప్రస్థానానికి నిర్మిలమైన చిట్ట చివర గొప్ప ప్రయాణానికి సిద్ధం కండి” అని పలుకగానే కౌశికుడు తన ఈర్ష్యాది బంధనములు తెంచుకొని అంతిమ యాత్రకు సిద్ధమయ్యాడు. దేవత లందరు తమ నెలవులకు వెళ్ళిపోయారు.
మొత్తం మీది బ్రాహ్మణక్షత్రియులిరువురు తమ కోరికలు నెరవేర్చుకున్నారు. ఒకరు ఆలోచన – మెదడు, మరొకరు శక్తి నిర్వహణ. ఈ రెండూ ఘర్షణ పడరాదు. పడితే దేశానికే ఉపద్రవం. ఘర్షణ వైపుకు పయనించినా మేధాభుజశక్తులు సమన్వయం పొందుట ప్రధానం, ఉచితం.
భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది.
శాంతి పర్వం చతుర్ధాశ్వాసం లోనిది.
It is more blessed to give than to receive. – Bible
86. ఇంద్ర ప్రహ్లాద సంవాదము!
ఇది కథ కాదు. ఒక వృత్తాంతం. మానవ జాతికి బ్రతుకు దారి చూపి, వ్యక్తిత్వ నిర్మాణంలో సహకరించే ప్రశంసనీయమైన, పఠనీయమైన అంశం. ఇలాంటివి చదవటంతో ఆనందం, విజ్ఞానం, వికాసము కలుగుతుంది అనుటలో అతిశయోక్తి లేదు.
సత్త్వగుణ సంపన్నుడు, ఇంద్రియ నిగ్రహశీలుడు, అహంకారం, క్రోధం విడిచిన వాడు దూషణ భూషణములను సమానంగా స్వీకరించేవాడు, మట్టిబెడ్డని బంగారాన్ని ఒకటిగా చూసేవాడు, విష్ణుపాదధ్యాన తత్పరుడు ప్రహ్లాదుడు. అట్టి అతడు ఒక చోట ఒంటరిగా ఉన్నాడు. అపుడు అతడిని పరీక్షించే నిమిత్తంతో ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. వచ్చి, ప్రహ్లాదునితో “నీకు సంపదలు లేవు. అయినా దుఃఖించవు, శత్రువులకు చిక్కుతానని భయపడవు. ఉపేక్ష పాటిస్తావు. ఇంత అమాయకుడవు అయినా వేమిటి? ఈ నిష్క్రియత్వమేల?” అని ఇంద్రుడు అన్నాడు.
దానికి ప్రహ్లాదుడు “కలిమిలేములను గూర్చి నీవు మాట్లాడావు. నిజానికి కలిమి, లేమి అనేవి రెండూ లోకాన ఉన్నాయి. కలిమి ఉండుట ప్రయత్నముండుట, లేమి – లేకుండుట, ప్రయత్నం లేకుండుట అనేవే అవి. అయితే ప్రయత్నించినంత మాత్రాన సంపద సిద్ధిస్తుంది అనటానికి వీలులేదు. అల్లా అనటం బేలతనమే” అన్నాడు ప్రహ్లాదుడు. మరల అతడే –
“తేరక యుండఁగఁ జేరుం
దేరంగాఁ బొలియు విధి యధీనంబులు గా
కారయ విత్తంబులు పురు
షారంభాయత్తములె? మహా బుద్ధినిధీ! (12-4-373)
సంపదలు యత్నించి ఆర్జించకున్నా తమంత తాము వస్తాయి. ప్రయత్నించి సమార్జించి, తెచ్చి ఉంచితే, ఊరక నశించిపోతాయి. కావున అవి విధికి లొంగి ఉండేవే గాని నరుడి ప్రయత్నానికి లొంగినవి మాత్రము కావు. అంతే దైవ సహాయము తేనిదే పురుషకార్యము పని చేయదు. మానవులకు సంతోషాలు, దుఃఖాలు వస్తుంటాయి. వీని రాకపోకలకు మానవుని ప్రమేయము లేదు. ఇవన్నీ ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు జరిపిస్తారు? ఆయా సమయం సమీపించినపుడు స్వయంగా విధాతే నరుడికి ఆయా సుఖదుఃఖాలతో, జయాపజయాలతో, ఆపత్సంపదలతో సంధానం కుదురుస్తు ఉంటాడు. ఇదంతా విధి ఆడించే నాటకం తప్ప మరొకటి కాదు.
నరుడు అహంకారిగా జీవించేటపుడు, విధి చేష్టితాన్ని కూడా తన చేతగానే భావించి, ఆ కర్మ ఫలితంలో తగుల్కుంటాడు. ఆ తగుల్కొనడానికి అతడి అహంకారమే మూలము అయితే ఆ అహంకారానికి లొంగని నరుడు మాత్రము విధి చేతను తనదిగా భావించడు కాబట్టి, అతనికి ఆ కర్మ ఫలితాన్ని త్రోసి వేసే శక్తి ఉంటుంది. శక్తి అతడి అహంకార శీలం వలన లభించింది.”
“విను విధికృత్యము లూరక
కనుఁగొనుచును సిద్ధ్యసిద్ధికల్పిత సుఖదుః
ఖ నిరూఢిఁ బొందకుండఁగ
మనముం దొలఁగించు వెరవు మహనీయ మగున్. (12-4-379)
కర్తయే విధి కాబట్టి ఆ విధి చేసే కర్మలను ఉపేక్షా భావంతో ఊరకనే చూస్తూ ఉండాలి. ఆ కర్మలు సిద్ధించినప్పుడును సుఖాన్ని, సిద్ధించనపుడు దుఃఖాన్ని పొందకుండా ఉండటం కొరకు నరుడు తన మనసును విషయాల నుండి తొగలగించే ఉపాయం కనుగొనాలి. నేను సృష్టిలోని ప్రాణుల అశాశ్వతాన్ని నమ్ముతూ ఉండటం చేత ఆ నమ్మకం నాలో భవబందాలు ఛేదించే నేర్పు కలిగించింది.
ఆ నేర్పు నాకు నిరంతరం ఆ పరిమిత ఆనందం కలిగిస్తున్నది. కావున ఇలా ఉండగలుగుతున్నాను. మరి వినుము. నరుడు దాంతి, శాంతి, ప్రతిజ్ఞ కలిగిన వాడైనపుడు అతడి చిత్తం ఏ విధంగానూ ఆయాసంతో అలిసిపోదు. నేనలాంటి వాడిని కాబట్టి చింతారహితంగా ఉంటాను” అన్నాడు.
అపుడు ఇంద్రుడు “ఏ ఉపాయంతో ఈ ప్రశాంతత పొందావో నాకు తెలుపుము” అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు –
“ఆర్జవంబు ప్రసన్నత యాత్మవత్త్వ
మప్రమాదంబు వృద్ధసేవాభినిరతి
మేలుసేయుఁ బ్రజ్ఞాశాంతిశాలి యగుట
కాలపాకంబుతోఁ దాన కలుగు ననఘ! 12-4-383)
నిష్కపటమైన ప్రవృత్తి, దయాగుణం, తాను శరీరం కాదు – ఆత్మ అనే భావము, పరాకు లేకుండా జాగరూకతతో వ్యవహరించటం, పెద్దల పరిచర్యలో నిజమైన ఆసక్తి, ఇట్టి గుణాలే నరుడికి శుభాన్నిస్తాయి. ఇక జ్ఞానం, శాంతి అనేవి కాల పరిపాకముతో క్రమంగా తమంత తామే నరునిలో చోటు చేసుకుంటాయి” అన్నాడు.
అంటే జ్ఞానం, శాంతి అనేడివి ఉన్నతమైన పరిపక్వమైన మానవ లక్షణాలు. ఇవి కాలముతో ముడిపడినవే తప్ప, తొందరపడితే వచ్చేవి కావు. కాగా అవి తమంతట తాము పొడచూపుతాయి. ఇంతటి ధర్మోపదేశాలు విన్న ఇంద్రుడు ప్రహ్లాదునికి నమస్కరించి తన నివాసానికి చేరుకున్నాడు.
కర్మలు, సంస్కార వశాన నరునికి మంచి చెడులు కలిగిస్తుంటాయి. అయినపుడు ఆ కర్మలకు కర్త నరుడోనో, కాదో నిశ్చయించుకోలేదు. ఇదే సందేహం ధర్మ రాజుకు కలిగి భీష్ముని ప్రశ్నించినపుడు తెలిసిన వృత్తాంతం ఇది.
శాంతి పర్వం చతుర్షశ్వాసంలోనిది.
~
Who so forsaketh all desires and goeth onwards free from yearnings, selfless and without egoism, he goeth to peace – Githa
Perfect peace dwell only where all vanity has disappeared – Buddha
When the mind becomes purified like a mirror, knowledge is revealed in it. Care should, therefore, be taken to purify mind – Sankaracharya
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
