[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
87. ఇంద్ర బలి సంవాదము (1)
ఒకనాడు దేవేంద్రుడు బ్రహ్మ వద్దకు చేరి, నమస్కరించి “బలి మహా సంపదతో వెలుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడా కనిపించడేమిటి” అన్నాడు. దానికి బ్రహ్మ “నీ ఆలోచనలో ఏదో కుట్ర దాగి ఉన్నది. నీవు అసత్యవాదిగా మారకు. అతడు గాడిద, ఒంటె, ఆవు, గుర్రము రూపములో ఎక్కడో ఉంటాడు. అతనిని చంపవద్దు” అన్నాడు.
దీనికి ఆ ఇంద్రుడు “నేనా పని చేయను. కేవలం వెళ్ళి మాట్లాడి వస్తాను” అని వెళ్ళి వెదుకగా, వెదుకగా గాడిద రూపములో నున్న సంతుష్టడైన బలి కనిపించాడు. అప్పుడు ఇంద్రుడు బలితో, “ఒకనాడు నీవు అంగరంగ వైభవంతో దివ్యంగా వెలిగి పోయేవాడవు. ఆనాడు దేవతలమైన మేము నీకు కొరగాలేదు. అంత గొప్ప వైభవం వ్యక్తం కాగా యజ్ఞం నిర్వహించిన నీవు యిలా ఉండటం చూచి నాకు దుఃఖం కలుగుతుంది” అన్నాడు అతడి దీనత్వాన్ని చూచి సంపూర్ణంగా ఆనందిస్తున్న ఇంద్రుడు.
ఇక్కడ ఇంద్రుని మాటలలో మనుషులైవరైనా ఉన్నతంగా బ్రతికి, ఊహకందని పతనం చెంది దీనంగా మారినపుడు చూడటం తటస్థిస్తే కలిగే భావోద్వేగం, సానుభూతి ఒక వాపు కనిపిస్తుండగా, తనకు నచ్చనివాడు అధః పాతాళానికి పడిపోతే కలిగే ఆనందంతో ఇతరులను, హింసించి ఆనందించటములో పొందే తృప్తి మరొక వైపు కనబడుతుంది.
ఇంద్రుడు మరలా, “నేడు ఊక తింటూ జివిస్తున్న నీవు, నీ తొలి వైభవాన్ని తలుచుకొని శోకిస్తున్నావా? లేదా?” ఉన్నదున్నట్లుగా చెప్పుమన్నాడు. ఇంద్రుని ప్రశ్న విన్న బలి “నీకు నా వైభవం కనిపించదు. అది అలా ఉండనీ, అల్పుల దగ్గర వ్యర్థ భాషణం అనవసరం. నీ దారిలో నీవు వెళ్ళు” అన్నాడు. ఇంద్రుడు బలిని విడువకుండా జంకూగొంకూ లేకుండా మరలా అదే ప్రశ్న వేశాడు. అప్పుడు బలి, “ప్రాణికోటి అంతా మంచు వలెనె కనిపిస్తుంది. మంచు వలెనె కరిగిపోతుంది. బుద్ధిమంతులు పుట్టి, గిట్టుల గూర్చి శోకించరు. ఈ మాత్రం తెలియదా!” అన్నాడు.
“పొరి నర్థంబు ననర్థము
మరణము జీవితము సుఖ సమాగమమును దు
స్తర దుఃఖసంగమంబును
దొరకొన నే నెపుడు సమత తోడన నిలుతున్” (12-4-394)
“లోకములో ప్రాణులకు మేలు కీళ్ళు, చావు బ్రతుకులు, సుఖదుఃఖాలు వచ్చి పడుతుంటాయి. నేను ఇవేవి సంభవించినా సమభావం వహిస్తాను. దాని ప్రభావం నాపై ఉండదు. లోకంలో బుద్ధి, వివేకం, సామర్ధ్యం గల వారూ, లేని వారూ అయిన నరులు ఉన్నారు. కాలము ఇరువురినీ హరించుతుంది. కాలుడి దగ్గర ఎవరి సామర్థ్యాలు పనికి రావు. దీనిని నేను నమ్ముతాను. కాబట్టి నాకు సంతోష విచారాలు లేవు. ఇప్పుడు నేను గాడిద ఆకారం ధరించాను. ఊక తింటున్నాను. కాబట్టి వెటకారాలు, వ్యంగ్యాలు పలుకుతున్నావు. ప్రస్తుతం నేను గుణాలు శాంతించినవాడిని – కోపం రాదు. నేను చక్రవర్తిగా ఉన్నప్పుడు ఇలా పలికావా? నేను నిన్ను, నీవు నన్ను ఎరుగని వారమా? ప్రాణుల జీవితాలలో వికాస, వినాశాలు విధి చేష్టితాలు. బలీయాలు. అయితే పెద్ద వారికి వివేకం, మంచీ చెడూ వేరు చేయగలిగే విచక్షణ ఉండాలి కదా. ఇతరులు దీనంగా ఉన్నప్పుడు ఎకసెక్కాములాడడం నీచుల పని. ఈ మిడిసిపాటు తగదు. నీవు నీ వజ్రాయుధం, నా చేతి పిడికిలి వ్రేటుకే నేలకు ఒరిగిపోవలసి వస్తుంది. అన్నట్లు ఇంద్రా, భయపడకు. ఈ మాట కేవలం పరిహాసానికి అన్నాను. నాకు మనసులో అహంకారం లేదు. విధికి ఎవరూ ఆతీతులు కారు. చివరకు నీవు కూడా విధి చేతిలో భంగపడతావు. కాబట్టి త్రుళ్ళిపడుట మానుకో” అన్నాడు బలి.
ఆ సమయాన ఆ రాక్షసరాజు శరీరం నుండి, ఒక వనిత ప్రకాశిస్తూ బయటకి వెడలినది. ఇంద్రుడు బలితో “ఎవరీమె?” అన్నాడు.
బలి “నాకు తెలియదు. నేవే అడిగి తెలుసుకో” అన్నాడు.
ఇంద్రుడు ఆమెను చూచి, “మాకు నీవు ఎవరివో తెలుపుము” అన్నాడు. అపుడు ఆ వనిత “ఇంద్రా! నాకు శ్రీ, భూమి, లక్ష్మి అనే మూడు పేర్లు ఉన్నాయి. నేను తెలియక పోవటం వింతేమి కాదు. ఏ లోకాలలో, ఏ యుగాలలో నన్నెగుగరు” అన్నది ఆ దేవి. ఇంద్రుడు “నీవు ఆ రాక్షస రాజును ఎందుకు విడిచి వెళుతున్నావు?” అన్నాడు. అప్పుడు లక్ష్మి, “సత్యం, ధర్మం, దమం, దానం అనే గుణాలు నాకు నెలవులు. అవి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. ఈ బలి పూర్వము అలాంటి వాడే. కాని ప్రస్తుత కాలాన అతడు అతిశయంతో బ్రహ్మణుల పట్ల, బ్రహ్మవిద్యా సంపన్నుల యెడ అసూయతో ఉండుట చేత అతడిని వదిలాను. ఇక అతడి దగ్గర ఉండలేను. నీ దగ్గర సంతోషంతో ఉండటానికి వస్తాను. ఇంద్రా! నీలో నేను చెప్పిన గుణాలతో పాటు వేద విహితాలైన ధర్మాలను ఆచరించే లక్షణము కూడానున్నది. కావున నిన్ను కోరి వరించి, నీ వద్ద నిలచి ఉంటాను. అయితే నీవు కూడా ఎప్పుడు ఏ విషయంలో పరాకు పడకుండా నిత్య జాగరూకుడవై ఉండాలి” అన్నది.
అపుడు సిరి తొలగిన బలి నిస్తేజుడయి, ఇంద్రునితో “ప్రస్తుతం తగ్గి ఉన్నానని ఉబ్బిపోకు. రాబోయే దేవాసుర సంగ్రామంలో గెలుస్తాను” అన్నాడు. ఇంద్రుడు “నీతో నాకేల వ్యర్ధ ప్రసంగము. బ్రహ్మకిచ్చిన మాట ప్రకారం నేను నిన్ను వదిలి వేస్తున్నాను” అని స్వర్గానికి వెళ్లిపోయాడు. బలి దక్షిణదిశగా వెళ్ళిపోయాడు.
పరిస్థితులు, విధి వికటించింనపుడు ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు కావడం; పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మటం మనం చూస్తూంటాము. ఉత్తములు ఆపత్సమయమున గంభీరంగా; నీచులు ఆనంద సమయంలో నీచంగా వ్యవహరిస్తుంటారు. యే కాలంలోనైనా, ఏ పరిస్థితులలోనైనా ఒక్కలా ఉండి ఇతరులను సమభావంతో చూడడం అవసరం అని ఈ కథ తెలుపుతుంది.
అలాగే దుఃఖం, అపజయం కలిగినపుడు మనిషి ఎలాంటి మానసిక స్థిరత్వాన్ని, సానుకూల దృక్పథాన్ని, గాంభీర్యాన్ని అలవరచుకోవాలో ఈ కథ తెలుపుతుంది.
వ్యక్తులు సిరిని ఎలా కోల్పోతారు అన్న ధర్మరాజు ప్రశ్నకు భీష్ముడు చెప్పిన కథ.
శాంతి పర్వము చతుర్థాశ్వసము లోనిది.
~
గతం న శోచామి కృతం స్మరామి.
I mourn not for the past; I remember the benefits done to me.
88. ఇంద్ర బలి సంవాదము (2)
మరొకసారి ఇంద్రునికి బలికి మద్య ఆసక్తికరమైన సంవాదం జరిగనది. కన్నీటి నావలో పయనించనిదే, కష్టాల సముద్రాన్ని దాటనిదే సంతోష తీరాలు చేరుకోలేము. సుఖం కలిగినపుడు సరే, కష్టాలు వచ్చినపుడు మనిషి పరిస్థితి ఏమిటి? అలాంటి పరిస్థితి ఎలా ఎదురుకోవాలి? ఎలా ఉండాలి. ఆ దుర్ధశను ఎలా దాటాలి? ఇలాంటి సందేహాలు ప్రతి కష్టజీవులకు వస్తుంటాయి.
మహాభారతం అవతరించింది, ఇలాంటి సందేహాలు నివృత్తి చేసేందుకే!
ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికైనా కావలసినది ధైర్యము. మనిషి అష్టలక్ష్ములలో యే లక్ష్మిని కోల్పోయినా పరవాలేదు. ధైర్యలక్ష్మిని కోల్పోరాదు. ధైర్యం మనోలక్షణం. ఇదియే ఆరోగ్యానికి మూలము. దురవస్థలు, చేటుకాలము సంభవించినపుడు మనిషికి కావలసినది ధైర్యము. గొప్ప ధైర్యముతో చేవగల గట్టి నిర్ణయం తీసుకున్న మనసు ఎటు వంటి కష్టనష్టాలనైనా, శోకాలనైనా అధిగమిస్తుంది.
“ధృతి యారోగ్యము నొసగును;
ధృతి యుజ్జ్వల లక్ష్మిదెచ్చు; ధృతికీర్తి సము
న్నతిజేయు; గాలగత్యవ
గతిగలిగిన గలుగుధృతి; వికారవిదూరా!” (12-4-421)
ధైర్యము అరోగ్యాన్నిస్తుంది. సిరుల నిస్తుంది. యశస్సును పెంచుతుంది. అయితే ఆ ధైర్యము కలగాలి అంటే నరుడికి కాలపు నడకను గూర్చిన జ్ఞానం ముందు కలగాలి. ఈ విషయాలను వివరించునది బలి ఇంద్ర సంవాదం!
దేవదానవుల యుద్ధం ముగిసింది. హరి ప్రభావంచే దేవతలకు గెలుపు సిద్ధించినది. ఇంద్రుడు మహా వైభవంతో అష్టదిక్పాలురతో, సమస్త దేవగణంతో ముల్లోకాలు విజయం చేస్తూ, సముద్రం పక్కన ఒక కొండ గుహలో ఉంటున్న విరోచునుడి కుమారుడైన బలిని చూశాడు. శత్రువు స్థితి అతడికి ఆనందం కలిగింది. ఎద్దుపుండు కాకికి రుచి కదా.
“ఓ బలి! నేడు నీవు హీన స్థితిలో ఉన్నావు. ఐశ్వర్యం కోల్పోయి, పరాజితుడవై యున్నావు. అయినా నీలో శోకము లేదు. ఈ నిర్వకారస్థితి నీకెట్లా కలిగింది” అని శతృవు ఓటమి చెంది దుఃఖిస్తే కాని పూర్ణజయం సిద్ధించదని భావించీ నీచకోటికి చెందిన దేవేంద్రుడు అడిగాడు.
బలి మౌనంగా చూపులో, మాటలో, ప్రవృత్తిలో, క్రియలో.. ఇలా ప్రతి కదలికలో ఉదాత్తడిలా గోచరించేసరికి, మరలా ఇంద్రుడు, “నీవు తపశ్శక్తి వల్లనో, పెద్దల పరిచర్య వల్లనో ఉదాత్తత పొంది మమ్మల్ని సరకు చేయటం లేదు. కారణమేమిటో తెలుపుము” అన్నాడు. దానికి బలి, “నీవు పలికిన ‘సరకు చేయుటలేదు’ అను మాట అశ్రద్ధతో, నిర్లక్ష్య భావంతో కూడినవి. నీ శక్తి సామర్థ్యాలు ఎవరికి తెలియవు? విధి చేష్టల వలన ఎవరికైనా హైన్యదైన్యాలు తప్పవు కదా. పూర్వం నీపై దండెత్తి నిన్ను ఓడించాను. నాడు అది నా ఘనత కాదు. నేడు నేను ఓడి దీనంగా ఉన్నట్లు కనిపిస్తున్నాను. ఇది నీ ఘనత కాదు. దానికి తిరుగులేదు. ఈ జ్ఞానంతో నరుడు ధైర్యంగా ఉండాలి” అన్నాడు.
ఇక్కడ బలి, తాను సాధించిన విజయాలకు కారణము తానని, అపజయాలకు కారణము దైవమని సామాన్యులు పలికే పలుకులు పలుకలేదు. జయాపజయాలు దైవాధీనాలు, విధికృతాలు అని తేల్చాడు. ఇంద్రుడు బలి మాములను ఆసక్తిగా వినసాగాడు. మరలా బలి “జీవితంలో సుఖదుఃఖాలు ఒక దాని తరువాత ఒకటి సంభవిస్తాయి. క్రమం తప్పదు. సుఖదుఃఖాలు కలగినపుడు ఉబ్బు, ఉమ్మలికలు ఉండరాదని పండితులు చెబుతారు. ఆ మాటలు మనము విన్నాము కదా. జీవితము ఎప్పుడూ ఒకే రీతిగా సాగదు. దుర్దశకు, మహర్ధశలకు దైవమే కారణం. మనిషికి సంపదలు. బంధువులు, సహయకులు, స్నేహితులు ఉన్నా చెడు కాలం వచ్చినపుడు, దుర్ధశ కలిగినపుడు ఇవేవి సాయానికి రావు. ఇది నరుడు గ్రహించాలి. పురుష కారము దైవము ముందు ఎంత? నరుడికి వాటిల్లే శుభశుభాలకు ముమ్మాటికీ కాలమొకటే కర్త. కాలమే నరులను పరిణతి వైపు పయనింప చేస్తూ ఉంటుంది. చెట్టున పండిన కాయ పండుగా కాలక్రమాన పరిణతి పొందినట్లుగా, కాల ప్రభావం చేత నరుడు పరిపాకం వైపు నడుస్తుంటాడు. ఇప్పుడు నేనున్న కాలము నాకు అనువైనది కాదు. నీ పై నాకు కోపం లేదు. నిజానికి నాకు వినోదంగా నైనా నీపై కోపం వస్తే, నీవు నా ముందు ఎంత? నేడు నీవు విజయంతో మదించి, అనాదరంతో ప్రవర్తిస్తున్నావు. కాని చేటు కాలము నిన్ను సమీపించబోతున్నది. కాలపు ప్రవాహంలో ఇంద్రులెంత? బ్రహ్మలే గతించారు. ఇక నీవు ఎంత.”
“క్రతువులు సేఁతయు, దేవ
వ్రతములు సల్పుటయు, వృత్తవంతుఁ డగుటయుం
గతమే కాలము ద్రోచుట?
కతర్క్యవర్తనము గాల మది గొనదు సుమీ!” (12-4-437)
“యజ్ఞాలు, వ్రతాలు నిర్వహించటం, శీలవంతుడై ఉండటం కాలగతిని మార్చలేవు. కాలప్రవర్తన ఊహకందనిది. కాలం దేనినీ సరకుగొనదు. కాలానికే అన్ని లొంగాలి. కాలం దేనికీ లొంగదు” అన్నాడు.
అప్పుడు ఇంద్రుడు బలికి గల జ్ఞానసంపత్తిని, స్థితప్రజ్ఞ స్థితిని చూచి తొట్రుపడుతూ, “బలీ! నీ మనసు వికారాలకు దూరంగా ధైర్యం, వివేకం, వినయం, శాంతి అనే సద్గుణాలకు నిలయంగా వెలుగుతుంది. ఈ నిర్వికాయమైన స్థితికి కారణమైన ధర్మం ఎట్టిదో?” అన్నాడు.
దీనికి బలి “నేను నా చిత్తాన గల గుణాలైన నిర్వికారత, ధైర్యం, జ్ఞానం మొదలయిన వానిని వేరొక చోటు నుండి తీసుకొని వచ్చానా? కాదు అవి నాలో స్వతహాగా యేర్పడినవే. నేను కాలతత్వాన్ని ఎరిగిన వాడిని. కావున నిర్వికారంగా, ధైర్యంగా ఉంటాను” అన్నాడు.
ఇక్కడ బలి మాటలు లోతుగా ప్రతి ఒక్కరు ఆలోచించవలసినవి. నిర్వకారత, ధైర్యం, జ్ఞానం ఎక్కడి నుండో తెచ్చుకోలేదు, నాలో ఉన్నవి అన్నాడు. ఆపత్కాలంలో నరుడు కోల్పోయేవి ఈ మూడు గుణాలే. అట్టి దుఃఖపూరిత సమయంలో నరుడు తనలోని ఈ గుణాలను మేలుకొలుపుకోగలిగితే కష్టాలు ఇట్టే పారిపోగలవు. భగవంతుడు స్వతఃసిద్ధంగా ప్రతి వ్యక్తిలో ఉంచినవి అవి. వాటిని పట్టుకోవడంలోనే ఉంది. నరుని ప్రజ్ఞ. మహాభారత వృత్తాంతాలు, సంవాదాలు, కథలు నరులలో వీటిని జాగృతం చేసుకోవాలని సూచిస్తాయి.
బలి మాటలకు ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు. మరలా బలి
“చిన్న చిన్న శకలాల రూపాన పెరిగి పెరిగి పెద్దదయ్యే కాలము ఒక వడ్డీ వ్యాపారి లాంటిది. వడ్డీ వ్యాపారి కూడా చిన్న చిన్న మొత్తాలతో ప్రారంభించి మిక్కిలి పెద్ద మొత్తానికి అధిపతి అవుతాడు. కాలమూ అంతే.. ముందు కష్టాలతో ప్రారంభించి, అనంతరం కళలతో, నిమిషాలతో, గంటలతో, దినాలతో.. అలా అలా పెరిగి పెరిగి చివరకు విశ్వంభరగా లోకమంతటా తానే అయి సర్వస్వాన్ని స్వాధీనం చేసుకుంటుంది. నరులందరూ అలా కాలాధీనులై పోతారు. కాలం ఒక నది. తన ప్రవాహ వేగంలో కొండను కోసి, తన దారిని తాను పొతుంది. తన గమనంలో నరుడిని లోగొని అణిచివేస్తుంది.
నరుడు కామ, క్రోధ, లోభాలు, శీలరాహిత్యం, వంటి దుర్గుణాల వలయంలో చిక్కుకొని, భీతిపరుడై కాలాన్ని గమనించలేకున్నాడు. తమ ముందు హఠాత్సంఘటనలు జరిగినప్పుడు, ‘అయ్యో! ఇంతకు ముందు చూచానూ చాలా బాగున్నాడు. ఇంతలో పోయాడే’ అనుకుంటారు, తప్ప ఆ సంఘటన తమకూ ఎంతో దూరాన లేదు అన్న ఆలోచన చేయరు.
మరి నరుడు ఏమి చేయాలీ? నరుడు మొదట అంతర్ముఖడై (తనలోకి తాను చూచుకున్న వాడై) భావాభావాలు గ్రహించి ఉనికీనీ లేమినీ తెలుసుకోవాలి. ఉత్తమ తపస్సు చేయాలి. జిజ్ఞాసువై కాల తత్త్వాన్ని అన్వేషించాలి. ‘తాను ఆత్మ కాని శరీరం కాదు’ అని తెలుసుకొని క్షోభాతీతుడు కావాలి. అపుడు నరుడు విద్వాంసుడై, కాల రీతి అతడికి అరచేతిలో ఉసిరికాయ వలె స్పష్టంగా కనిపిస్తుంది” అన్నాడు.
ఇంద్రుడు బలి జ్ఞానపరిపాకానికి చకితుడై “నీవు కాలపు నడకను గ్రహించి, పావన శీలముతో నిర్మల జీవనము గడుపుచున్నావు. నీవు కృతకృత్యుడవు. నీ జీవినం నీ నడత మానవ జాతికి శిరోధార్యమవుతుంది. నీకు త్వరలో మేలు కలుగుగాక” అని అబినందించి, దేవతలతో, ఋషులతో స్వర్గానికి వెళ్ళిపోయాడు.
దుర్దశ కలిగిన నరుడు ఎట్లా ఉండాలి? ఆ దశ ఎలా దాటాలి? అన్న ధర్మరాజు ప్రశ్నకు భీష్ముడు చెప్పిన కథ.
శాంతి పర్వము చతుర్థాశ్వాసం లోనిది.
~
ధైర్యం సర్వత్ర సాధకం.
Courage is in all things a means (of success).
89. ఇంద్ర నముచి సంవాదము
నముచి అనే రాక్షసుడుండేవాడు. అతడికి సంపదలు, వైభవం నశించిపోయాయి. అయినా చింతలేనివాడై, నిశ్చలుడై సుముద్రుని వలె ఏకాంతమున ఉన్నాడు. ఎదుటివారు బాధలు పడుతుంటే చూచి ఆనందించి, గాయాన్ని కెలికి బాధ పెట్టే మనస్తత్వం కలవాడైన ఇంద్రుడు వచ్చాడు. అతని అవస్థను చూశాడు.
“ఓ రాక్షసేంద్రా! పేదవైనావు. చుట్టారా బంధు జనము కూడా లేదు. దీనికి నీవు ఎంత దుఃఖిస్తున్నావో కదా” అని ఓదార్చబోయాడు. అపుడు నముచి,
“వలయు వస్తువు వగచిన వచ్చునయ్య?
రామి యొక్కటియే శరీరంబు నెదయుఁ
దాపమునఁ బొందు వగపున ధర్మ మేదు;
నింత యెఱుఁగుదు వగవ నే నేమిటికిని” (12-4-412)
వగపు నిష్ప్రయోజనం, వగచినంత మాత్రాన వలసిన పదార్ధం వస్తుందటయ్య. రాకపోవటయే గాక, శరీరానికి మనసుకు సంతాపం కూడా ఆ వగపు వలన కలుగుతుంది. కాబట్టి నేను దేనికి దుఃఖించను. ఓ దేవేంద్రా! సృష్టించిన వాడి ఏర్పాటు ప్రకారం, ఏ ప్రాణికి ఏది ఎప్పుడు లభించాలో ఆ ప్రాణికోటికి అది అప్పుడు, నీళ్ళు పల్లానికి ప్రాకివచ్చినంత సులభంగా ప్రయత్నరహితంగా వచ్చి చేరుతుంది. కావలసినదే అయినది. జరుగవసినదే జరిగినది అన్నది గట్టి నిర్ణయం. యోగ్యుడికి ఆనందం, దుఃఖం, సంపత్తి, విపత్తి వంటి ద్వంద్వాలు ఉండవు. ఒక కార్యం జరుగకూడదని దైవం నిర్ణయించి ఉంటే, ఇక నరుడు ఎంతటి ధైర్యశౌర్యాలు, బుద్ది సామర్ధ్యాలు చూపినా, ఆ కార్యం సఫలం పొందదు. ఇది గ్రహించిన వారికి భయం ఉండదు. మేలు కీళ్ళు కాలవశాన వస్తాయి. అవి కోరితే వచ్చేవి, వద్దంటే పోయేవి కావు. కావున వానిని గురించి చింతించ రాదు” అన్నాడు నముచి.
అతడి స్థితప్రజ్ఞతకు, చిత్తపరిణతిని ప్రశంసిస్తూ ఇంద్రుడు వెళ్ళిపోతాడు.
ఈ సంవాదం కూడా మనిషి యొక్క చిత్త పరిణితిని గూర్చి, దైవఘటన ముందు పురుష ప్రయత్నం ఏ పాటిదంటూ, ఎట్టి పరిస్థితులలో చింతించకుండా ఉండేలా నేర్పును సంపాదించడములో ఆనందం ఉందంటూ చెప్పిన కథ.
ఇలాంటి వృత్తాంతములే, మనిషి ప్రాపంచిక విషయాలలో ఒడిదుడుకులలో కష్టానష్టాల ఎదుర్కుంటున్నప్పుడు సేదదీర్చి, స్వాంతన చేకూరుస్తాయి.
భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది. శాంతి పర్వము చతుర్థాశ్వాసము లోనిది.
~
న చ దైవాత్పరం బలం
There is no power greater than of fate.
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
