Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-35

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

90. దేవల జైగీషవ్య సంవాదము!

ప్రజలకు ఏ ఆచారం, ఏ శీలం, ఏ ధర్మం వలన ముక్తి దొరకుతుంది అన్నది చాలా పెద్ద సందేహము. తప్పక తెలుసుకోవలసిన అంశము. మహా భారతములో మనకు సమాచారము దొరుకుతుంది. ఇదే సందేహాన్ని ధర్మరాజు భీష్ముడిని అడిగినాడు.

భీష్ముడు ధర్మరాజుకు ‘దేవలముని జైగీషవ్యునికి’ మధ్య జరిగిన ఇదే విషయానికి సంబంధించిన సంవాదాన్ని వినిపించాడు.

జైగీషవ్యుడు అసితునితో “శాంతి సంపన్నులై ప్రియదర్శనులైన వారికి అనిన, మానావమానాలు, స్తుతినిందలు కలిగినపుడు రాగ క్రోధాలు, కృంగిపోవడం, పొంగిపోవడం లేక, కీడు తలపెట్టినవానికి అపకారం తలపెట్టక త్రిగుణాతీతంగా ఉండగలగటం జ్ఞానులైన వారికి గుణాలు. వీరే స్థితప్రజ్ఞులు.”

“ఒకటిగోరి దాని కుల్లంబు గందంగ | జాలిఁ బడమి, యేమి సంభవించె
నేని దానఁ దృప్తి నూనుట దప్పిన | పనికి వగవ కునికి భవ్యగుణము” (12-5-23)

కోరినది లభించని నాడు విచారించక పోవటం, మంచీ చెడులు రెండింటికీ తృప్తి నొందటం, అనుకున్నట్లుగా జరగని దానికి చింతించకపోవటం మేలైన గుణాలు. అంతరింద్రియ నిగ్రహం కలవాడు సన్మానాలను విషపానాలుగా, అవమానాలను అమృత పానాలుగా జీవిస్తాడు. సన్మానం కోరడు. అవమానికి కలత చెందడు. ఆత్మ తత్వమెరిగిన వారు నా వారు, పరవారు అన్న బేధబుద్దితోనుండరు. ఆ భావం చేత వారు సంతోషంగా ఉంటారు. జ్ఞానకర్మేంద్రియాలను జయించిన అలాంటి వాడితో చెలిమి సాధించటం దేవతలకు దుర్లభంగా ఉంటుంది అని తెలిపాడు.

ఇట్టి శీలం, ఆచారం, పరమధర్మం ముక్తికి మార్గమని తెలుపుతుంది. అంతే కాదు ఐహిక లోకములో కూడా ఇట్టి గుణాలు సంతృప్తికరమైన జీవన విధానాన్ని అందించి, ఆత్మ సంతష్టులుగా చేస్తాయి. కావున యీ చిన్న కథ నరజాతికి మేలైన మార్గం చూసేది.

శాంతిపర్వం పంచమాశ్వాసంలోనిది..

91. ఉగ్రసేన శ్రీకృష్ణ సంవాదము!

ఒకనాడు ఉగ్రసేన మహారాజు శ్రీకృష్ణుని చూచి “ప్రజలు నారదుని ఎంతో ఘనంగా ప్రశంసిస్తున్నారు. నిజానికి అతడు ప్రశంసార్హుడేనా?” అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “రాజా! నారదునిలో శాస్త్రజ్ఞానం, సదాచారం, అధికంగా ఉన్నాయి. అతడి హృదయంలో రవ్వంతైనా అహంకారం లేదు. అతడు శీలవంతుడు. దేహంలో యే విధమైన వికారం లేదు. మదమాత్సర్యాది గుణాలు లేవు. అతని పుట్టుక, తపస్సు, తేజస్సు, బుద్ధి, వినయం, నీతి చాలా ప్రసిద్ధి పొందాయి. అతడు ధీరుడు. మృదుభాషి. శఠత్వం, దీనత్వం, కోపం, లోభం వంటి దుర్గుణాలను అతడు ఈసడించుకుంటాడు. అతనికి ఈర్ష్య, గర్వము అసూయ, తిరస్కారభావం అనేవి లేవు. అలాంటి వాడు కీర్తికి పాత్రుడే కదా” అన్నాడు.

ఈ చిన్న గద్యములో సమాధానంలో కొండంత సందేశం ఉంది. ఎవరైతే యీ గుణాలు అలవర్చుకుంటారో వారే సకల జనులకు ప్రియులవుతారు. ఈ గుణాలు సమస్త ప్రాణులకు ఇష్టమైనవి కూడా. ఇలాంటి గుణ సంపద కలిగిన వాడు కాబట్టి శ్రీమన్నారాయణుని నిరంతరం హృదయ పద్మములో దర్శించుకోగలిగినాడు, త్రికాలజ్ఞుడు, సర్వజ్ఞుడు అయినాడు.

“ఎవరు సకల జనులకు ప్రియులు” అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముని సమాధానం.

శాంతిపర్వం పంచమాశ్వాసం లోనిది.

~

92. నారదుడు చెప్పిన కథ!

పూర్వము ఒక బ్రాహ్మణుడు రాలిన గింజలను ఏరుకొని తినటమనే ‘ఉంఛవర్తనము’ తో జీవించేవాడు. అతడు భార్యతో సహ అడవిలో ఉండేవాడు. అతడు యజ్ఞం చేయటానికి ప్రయత్నించాడు. యజ్ఞంలో పశుహింసను ఇష్టపడక ఫలమూలాలతో హవిస్సులను నిర్వహించాడు. అది శాస్త్ర విహితం కాదని తెలిసినా భర్త శపిస్తాడని భయపడి భార్య మౌనంగా ఉంది. ఇంద్రాది దేవతలు ఆ యజ్ఞ హవిస్సులను స్వీకరించరాలేదు. అగ్ని కూడా హవిస్సులను పచనం చేసే శక్తి కోల్పోయాడు. ఆ స్థితిలో అక్కడే తిరుగాడుతున్న జింక ఒకటి మానవ భాషలో అతడి భార్యను నిందించి ఆ బ్రాహ్మణుడి ఎదుట నిలబడి “నన్ను చంపి యాగం పూర్తి చేయమన్నది”

ఆయన నేనట్లు చేయనన్నాడు. ఆ జింక కొన్ని అడుగులు పోయి మరలా తిరిగి వచ్చి నేనిచ్చే దివ్యదృష్టితో చూడు. నేను చెప్పినట్లు చేస్తే నిన్ను మెచ్చుకోవడానికై దేవతలు విమానాలెక్కి వచ్చారు చూడుమన్నాడు. అపుడా విప్రుడు దివ్యత్వం కోరుకొని ఆ లేడిని హింసించడానికి పూనుకున్నాడు. ఆ హింస వలన అతడి తపస్సుకు ఉత్పాతాలు కలిగాయి. అపుడు జింక రూపంలో ఉన్న ధర్మదేవత “నేను నీ యజ్ఞ శ్రద్ధకు సంతోషించాను. ఉచితమైన హింస అహింసకు భంగకరం కాదు. అయితే యజ్ఞం పేరుతో తగని హింస ఎన్నడు చేయరాదు” అని చెప్పింది. అతడి భార్యను సమాధాన పరిచింది. అతడి తపశ్శక్తికి లోటు లేకుండా చేసింది. యాగం నిర్వఘ్నంగా సాగేట్లుగా వరమిచ్చింది.

ఈ కథను నారదుడు లోకంలో ప్రవర్తింప చేశాడు. ధర్మరాజుకి భీష్ముడు చెప్పాడు.

శాంతిపర్వము పంచమాశ్వాసం లోనిది.

93. చిరకారి కథ!

పనులు చేసేటప్పుడు తొందరపడకూడదు. తొందరపడకుండా చక్కగా చాలా కాలం ఆలోచించి చేస్తే ఓటమి కలుగదు. అంతే కాక అలా ప్రతి పని బాగా ఆలోచించి చేసేవాడికి తప్పకుండా ఆ కార్యంలో విజయం సిద్ధిస్తుంది. అంతే నిదానమే ప్రధానం. అయితే సహనం ఏ మాత్రం లేనివారు మంచి యేదో గ్రహించలేరు. వారు చక్కగా ఆలోంచించి, కుదురుగా కార్యాలు నిర్వహించే వానిని, జడుడు, అలసుడు అని నిందిస్తారు.

ఈ విషయాలను వివరిస్తూ కార్య నిర్వహణలో ఎలాంటి వాడు విజయాలు సాధిస్తాడో, తొందరపాటు లేనితనము ఎలాంటిదో వివరించే ఇతివృత్తం కలది.

పూర్వము మేధాతిథి అనే తాపసి ఉండేవాడు. అతని కుమారుడు చిరకారి. ఈ చిరకారి ఏ పనినీ తొందరపడి చేయడు. చక్కగా ఆలోచించి చాలా కాలం తరువాత ఆ పనిని నెరవేరుస్తాడు. అందుకే అతడిని ‘చిరకారి’ అని జనులు పిలిచేవారు. ఒకనాడు మేధాతిథికి యేదో ఒక కారణాన భార్యపై కోపం వచ్చింది. వెంటనే కొడుకును పిలిచి, ‘తల్లిని చంపుమ’ని ఆదేశించాడు. అలా చెప్పి ఎక్కడికో వెళ్లిపోయాడు.

ఇక యీ ముని కుమారుడు యే పనినైనా చాలా సేపు ఆలోచించి చేసే లక్షణం కలవాడు. అందుకే అతడు “మా తండ్రి ఆజ్ఞను ధిక్కరించలేను. అలా అని తల్లిని చంపుట యుక్తం కాదు. తండ్రి ఆలోచన తప్పించటానికి ప్రయత్నిస్తే సత్కర్మ వేత్తలైన పెద్దలు అలా చేయడం పాపమంటారు. తల్లి నెట్లాగైనా కాపాడాలి ఏవిదంగా చూచినా తల్లిదండ్రుల మధ్య ఈ పుత్రత్వం అనేది స్వేచ్ఛ లేనిదిగా ఉన్నది. ఈ పాపాన్ని తొలగించే ఉపాయమేమిటి? తల్లిని చంపితే నరకం వస్తుందని భావించి, మాతృ హత్యను విడిచి పెడితే పిత్రాజ్ఞను ధిక్కరించిన దోషము రాదా? ఆ దోషము నరకాన్ని ఈయదా? వంశం నిలపడటానికి గాను తల్లి నేల కాగా, తండ్రి అందులో బీజ వాపనము చేస్తాడు. అదీ వారి పద్ధతి. నేను తల్లిదండ్రులిద్దరికి సంబంధించిన వాడను. ఈ క్లిష్ట పరిస్థితులల్లో నేనిప్పుడు ఎవరిని వదిలి పెట్టను” అని ఆలోచించసాగాడు. మరలా “తండ్రియే నేనై పుట్టాను. జనకుని ఆజ్ఞను నెరవేరిస్తే కుమారుని పాపాలన్ని నశిస్తాయని కూడా విన్నాను. ఇంకా లేని పోని ఊహలెందుకు? తపస్సు, ధర్మం, విద్య, శ్రేష్ఠమైన దైవం – ఇవన్నీ తండ్రియే. తండ్రికి ప్రీతికలిగించే పని నెరవేరిస్తే, దేవతలందరు ప్రీతిపొందుతారు” అని యోచించి, ఇందలో తల్లి గుర్తుకురాగా, “అగ్ని అరణిని మధించటం వలన అందులో పుట్టుతుంది. అలాగే చేతులు, కాళ్ళు మొదలైన అంగాలతో కూడిన ఈ శరీరం తల్లి నుండే జనిస్తుంది. అంతే కాదు సహించశక్యం కాని గర్భధారణ క్లేశం, తన శరీరం యొక్క బాగోగులు చూచుకొనకుండా పడే కష్టాలు అయ్యో! తల్లికే ఎంతో ఎక్కువగా ఉంటాయి.”

“వచ్చిపోయి చూచువాఁడు గా కిడుమలఁ | బడునె తల్లిపోలెఁ బట్టితోడఁ
దండ్రి చెప్పు నిట్లు ధర్మశాస్త్రంబులు | నంబ గౌరవమున నధిక యగుట” (12-5-274)

తండ్రి బిడ్డ వద్దకు రాకపోకలు సాగిస్తూ, చూస్తూ ఉంటాడు. అంతే కాని తల్లి వలె బిడ్డ విషయాన్ని గాఢంగా పట్టించుకొని బాధపడడు. ధర్మశాస్త్రాలు కూడా తండ్రి కంటే తల్లి గౌరవములో గొప్పది అని తెలిపాయి కదా అనుకున్నాడు.

ఔను కాదో పది మంది ఉపాధ్యాయులు కంటె ఆచార్యుడు, నూరు మంది ఆచార్యుల కంటె ఒక తండ్రి, వెయ్యి మంది తండ్రుల కంటె ఒక తల్లి గౌరవములో గొప్పది అని ధర్మ శాస్త్రాలు పేర్కొన్నాయి. వేదము మాతృదేవోభవ అని తెలిపింది.

వేదాధ్యయన పరుడైన చిరకారి తన అనుభవసారముతో ఇలా ఆలోచించసాగాడు. “కన్న కొడుకు చిన్న వయసులో ఉన్నా, యుక్తి వయసు కలవాడైనా, వృద్ధుడైనా తల్లికి వాడి మీద ప్రేమ అతడిని రక్షించే బాధ్యత ఒకే రకంగా ఉంటాయి. తల్లి అనే వస్తువే ఈ లోకానికి మూలకారణం.”

క్షుద్ర జంతువులకు గురులకు నెమ్మెయిఁ | దలఁప నొక్కరూప తల్లి వలయు
నూఱఁడిల్లఁ గలదె యొండుసోటుల సువ | స్తువు నివాసమైన చోటఁ గాక! (12-5-276)

అప్పుడ యసమర్థుం డగు | నప్పుడ దుఃఖియగు శూన్యమై తోఁచు జగం
బప్పుడ మాతృవియోగం | బెప్పుడు వాటిల్లె నపుడ యెంతయుఁ దూలున్‌. (12-5-277)

ఇట్టి జనని వధించుట యెల్లభంగి | నధికపాప పయోరాశియందు ముంచు;
దీని నెఱుఁగండె పసులవాఁ డైన? వధకు | నేల తెంపు వాటిలుఁ? జేతు లెట్టులాడు? (12-5-278)

నీచ ప్రాణులకైనా, ఉత్తమ ప్రానులకైనా, ఏ రీతిగా ఆలోచించి చూచినా తల్లి ఒకే రీతిగా అవసరమై ఉన్నది. తల్లి మంచి సత్పదార్ధం ఉన్న చోట సుఖంగా ఉండగలం గానీ, అది లేని చోట ఉపశాంతితో జీవించటం సాధ్యమా. ఎవడికి తల్లితో ఎప్పుడు వియోగం కలుగుతుందో, వాడు అపుడే అన్ని విధాలా ఆశక్తుడవుతాడు. దుఃఖితుడవుతాడు. లోకం శూన్యం అయిపోతుంది. చలించిపోతాడు. ధనికుడికి, పేదవాడికి, బుద్ధిహీనుడికి పండితుడికి, బాలుడికి, బలహీనుడికి తల్లి జీవించి ఉండటమే సుఖహేతువు అవుతుంది. ఇలాంటి తల్లిని చంపటం అన్ని రీతులా మహాపాపమనే సముద్రములో ముంచి వేస్తుంది. ఈ సంగతి పసుల కాపరికి కూడా తెలిసినదే. మరి తల్లిని చంపే సాహసం ఎలా వస్తుంది? చేతులెలా వస్తాయి. అంతా ఇలా బహుకాలం బహువిధాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతడు యే పనినైనా తొందరపాటు లేక చేసేవాడు కావటం వలన, చాలా సమయం గడిపోయింది.

ఇక అతని తండ్రి మేధాతిథికి కోపం తగ్గిపోయింది. ఆవేశం శాంతించింది. ఆలోచనలో పడ్డాడు. ‘తొందరపడి భార్యను చంపమని కొడుకుకు ఆదేశించాను. అలా జరిగిపోయిందేమో’ అని చింతిస్తూ, దుఃఖించాడు. చేతులు కాలినాక ఆకులు పట్టుకోటమంటే ఇదే కదా.

మనుషులలో చాలా మంది ఇలాగే ఉంటారు. ఆవేశంలో అనాలోచినతమైన నిర్ణయాలు తీసుకుంటారు. తరువాత తీరికగా చింతిస్తుంటారు. మేధాతిథి అలాంటివాడే. మనుషుల్లో చాలా మంది చెడ్డవారు కారు. తాత్కాలికమైన కోపాతాపాలతో పనులు చేస్తుంటారు. మేధాతిథి ‘నా కొడుకు యే పనినైనా ఆచ తూచి చేసేవాడు. ఆలోచనా పరుడు. దేనికీ త్వరపడడు. నన్ను దుఃఖింప చేస్తాడా? వాడు ఉపాయశీలి’ అనుకున్నాడు.

మరలా కుమారుడి శీలాన్ని పదే పదే తలుచుకుంటూ ‘కుమారా! నీవు చాలాకాలం తల్లి కడుపులో ఉన్నావు. నిన్ను తల్లి ఎంతో కాలం పోషించింది. నేను నిన్ను తప్పుడు పని చేయమని పురికొలిపాను. అయినా నీవు తల్లి సేవలు తలుచుకున్నావంటే ‘చిరకారి’ అనే నీ పేరు సార్ధకమవుతుంది. నా తపసుకు నింద్ కలుగకుండా, నీకు మాతృ హత్యాపాపము తగులకుండా, సమస్త జీవులు నీ చిరకారిత్వమనే లక్షణము స్తుతింపగా, నీ తల్లి పట్ల ప్రీతి గూర్చువా’ అనుకుంటూ ఆశ్రమం చేరాడు.

అతడిని చూచి చిరకారి తన చేతనున్న ఖడ్గాన్ని తండ్రి పాదాల దగ్గర వదలి పెట్టి దండ ప్రణామం చేశాడు. మునిపత్ని కూడా ప్రణమిల్లింది. ముని ఇద్దరినీ కౌగిలించుకొని, ఆనంద భాష్పాలు కారుతుండగా ఆశీర్వదించాడు. మేధితిథి “ఒక కార్యం చేయవలసి వచ్చినప్పుడు ఆలోచించి ధీరత్వముతో మంచి చెడ్డలు నిర్ణయించుకొని, ఆ పని నెరవేర్చాలి. అయా పనులు చేసేటప్పుడు ఆలోచించి చాలా సేపు విచారించి ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు యోగ్యుడు, ఇతడు అయోగ్యుడు అని పరిశీలించి ప్రవర్తించే వాడే సచ్చరిత్రుడు” అని తెలిపి కుమారుడు చిరకారి యొక్క చిరకారిత్వం సఫలమైనందుకు శ్లాఘించాడు. కుటుంబంతో మరలా శాంతి నెలకొంది.

కుటుంబం తల్లి పాత్ర ఎలాంటిది, సృష్టిలో ఎంత గొప్పనైనదీ అన్న విషయంతో పాటు, యే కార్యాన్నైనా ఆలోచించి విచక్షణతో నెరపాలనీ, ఆవేశ కావేశాలతో తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిసే ఈ అద్భుతమైన కథ.

కుటుంబంలోని వ్యక్తులు, కార్యాలయాలలో అధికారులు, నిర్ణయాధినేతలైన దేశ నాయకులు బాగా తెలుసుకోవలసినది, అనుసరించ వలసినది.

త్వరితము సేయక కార్యము | చిరంతన విమర్శనముగఁ జేసి యొనర్పన్‌
ధరణీశ్వర! యోటువడఁడు | పురుషుఁడు; సిద్ధియును వానిఁ బొందు దృఢముగన్‌ (12-5-262)

పని చేసేటప్పుడు త్వరపడరాదు. తొందరపడకుండా యే పనినైనా చేస్తే ఓటమి ఉండదు. అట్లా చేసే వారికి, ఆ కార్యంలో తప్పక విజయం లభిస్తుంది.

కార్యాలను సమీక్షించటంలో అవసరమైనది బహుదీర్ఘ సమయమా లేక అత్యల్ప సమయమా అని అడిగిన ధర్మరాజుకు భీష్ముడు చెప్పన కథ.

శాంతిపర్వము పంచమాశ్వాసం లోనిది.

శనైః పంథా శనైః కంథాః
Slowly along the road, slowly through the quilt
The admonition nothing rashly is very where useful (Greek)

శనైః శనైః క్షిపేత్పాదం
Be careful in each step you take in any business.

94. ద్యుమత్సేనుడి కథ!

నేరము – శిక్ష అనే అంశానికి సంబంధించిన ధర్మాధర్మాలు చర్చింపబడిన కథ.

ఆలోచనలు శిక్షావిధానము యొక్క అమలుపై యెలా ఉంటాయో తెలుపబడినది. పూర్వము ద్యుమత్యేనుడు అను రాజు ఉండేవాడు. అతని కుమారుడు సత్యవంతుడు. వారిరువురి మధ్య ఆసక్తికరమైన మాటలు దొరిలాయి.

ద్యుమత్యేనుడు “నేరము చేసిన వారిని వధించటం ధర్మమని పండితులు చెబుతారు” అనగ, సత్యవంతుడు,”చంపటమే ధర్మమైతే, ఇంకా చేయరాని అధర్మ కార్యమేమి ఉంటుంది?” అన్నాడు అందుకు రాజు “దొంగలు, దుర్జనులు వధార్హులే. లేకపోతే వారికి బాధలు తెప్పవు” అన్నాడు. అందుకు సత్యవంతుడు “చంపటమనే శిక్షను వదలి మరొక దండనా విధానంతో శిక్షించటం మంచిది కదా” అని ఔదార్యముతో అన్నాడు.

రాజు “కుమారా! అలా ఎందుకు జరుగుతుంది.?తప్పు చేసిన వాడిని దండిచేటప్పుడు, చేసిన తప్పు ఏపాటిదో గమనించి అందుకు తగినట్లు చుర చుర చూడటమనే శిక్షగానీ, తీవ్రమైన మాటలతో మందలించటం గానీ, డబ్బు వసూలు చేయటం గానీ, శీరంలోని ఆవయావాలను వికృతం చేయటం గానీ చేయాలి. మరియు చంపదగిన వానిని చంపటమే కర్తవ్యం. రాజైన వానికి పక్షపాత బుద్ధి ఉండరాదు. అది పాపం. రాజైన వాడు ముందు తాను వినయంగా, సచ్చీలునిగా ఉండి, ఆ పై మంత్రులను, సేవకులను వినయపరులను చేయాలి. అలాంటి రాజు ఇహపర సుఖాలు అందుకుంటాడు.”

“దోష మరసి కామంబును | రోషంబును లేక తగిన రూపునఁ జేయం
బోషక మగు ధర్మమునకు | వైషమ్యవిహీనమైన వధము గుమారా!” (12-5-297)

తప్పు చేసిన వాడి తప్పును పరీక్షించాలి. కామక్రోథములు వదిలి పక్షపాతము లేకుండా వధార్హమైన నేరానికీ మరణదండన విధించాలి. దుర్మార్గులు, నేరం చేసిన వారు వధించబడటం చూస్తూనే ఉంటారు. కాని కామక్రోధలోభ గుణాలచే భయసందేహాలు లేకుండా నేరాలు చేస్తూ, ఇతరులకు అపకారం చేసే వారుంటారు. ఇట్టి స్థితిలో మరణదండన విధించకుండా అహింస అంటే ఆరాచకం ప్రబలుతుంది. ప్రజాపాలకుడికి ప్రజల పట్ల దయ ఉండి, అపకారం కలుగకుండా చూడాలి. కావున పాలకుడికి అహింస తగదు. ప్రజలను కాపాడటమే అధినేతలకు అహింస అవుతుంది” అన్నాడు. అయితే అవసరమున్న చోట రాజు కఠినంగా ఉండి, అహింస విడనాడి, ప్రజలను రక్షించాలి. లేకుంటే అధినేతల అధికారుల సాధువర్తనము నేరగాళ్ళను నేరాలు చేయటములో నిర్భీతిని కలిగిస్తుంది. కాబట్టి అవసరమైన చోట అతి కఠినమైన దండనలు ఉండాలి.

ఈ కథని శిక్షలను అమలు పరిచే అధికారులు, న్యాయమూర్తులు, చట్టాలు చేసేవారు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అన్నిటి కంటే ప్రజారక్షణయే పరమార్థమని గ్రహించాలి. అయితే ఆజ్ఞా పరిపాలనా వ్రతము, మంచి చేసి చూపించడము ముందు తాము మంచివారుగా మారటం, సమాజంలోని నేరాలను తగ్గంచటంలో పాత్ర వహిస్తాయి. విద్య, ఉత్తమ కుటుంబ నేపథ్యం, పెంపకం, మానవతా మూల్యాలను ప్రతి చిన్న హృదయం లోకి చొప్పించేలా చేయటం, అన్నిటికన్నా మించి దుష్టులు మంచి విని ఆచరించాలనుకోవడం, మారాలనుకోవటం నేరాన్ని తగ్గిస్తంది.

భీష్ముడు, దర్మరాజుకి చెప్పినది.

శాంతి పర్వం పంచమాశ్వాసం లోనిది.

దండో దశగుణో భవేత్
A stick has ten uses.

(ఇంకా ఉంది)

Exit mobile version