Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-36

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

95. కపిల గోసంవాదము!

పూర్వం కపిలుడనే ముని ఉండేవాడు. ఒకనాడు నహుషునిచే పోషించబడే బలిష్ఠమైన ధేనువును చూచి “నీవు వేద స్వరూపిణివి కదా” అన్నాడు.

అక్కడే ఉన్న స్యూమరశ్మి అనే ముని కపిలుడి మాటలలో వేదాల పట్ల అగౌరవం చూసి, తాను సూక్ష్మాకృతిలో గోవులోకి ప్రవేశించాడు. ప్రవేశించి కపిలుడితో “పరివ్రాజకులకు వేదాలు డంబాలు కలిగిస్తాయి అన్నారు. నీకు ఆదరణీయము కాదా?” అన్నాడు. అపుడు ఆ గోవుతో కపిలుడు “అయ్యా! నాకు వేదాల విషయంలో ఆదరము లేదు. నీ అభిప్రాయాన్ని గ్రహించే నేర్పరిని కాను.  అయినప్పుటికీ నాకు తెలిసిన విషయములు చెబుతాను.

బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్న్యాసము అనే నాలుగు ఆశ్రమాలు దేవయానాలు. ఇవి సంసారులకు ఆచరణీయాలు. వేదం విధించిన ఆచారాలు ఆవశ్యకావశ్యాకాలు. కాని యక్షంలో హింస శుభప్రదమో, అనుభప్రదమో నీవే చెప్పు” అన్నాడు. అపుడు గోవులోని స్యూమరశ్మి “బ్రహ్మ యజ్ఞాల కొరకే పశువులను, ధాన్యాలను సృష్టించాడు. అంతే కాదు, తానే పునుకొని యజ్ఞాలు చేశాడు కదా. యజ్ఞం చేస్తే తప్ప, దేవలోక సుఖ హేతువైన దివ్యప్రాప్తి కలుగదు. యజ్ఞ నిర్వహణ. శ్రేష్ఠమయిన గృహధర్మము, సమస్త పాపహరము అట్టి దానిని హింస అని ఎలా అంటారు. అది యుక్తమా” అన్నాడు.

అపుడు కపిలుడు “ఆత్మ సుఖాన్ని కోరువాడు. ఇతర సుఖాలను కోరడు. అతడు శోక, కామ, సంగరహితుడు. ఇట్టి వాడికి పరలోకముతో పనేమిటి ? అది కోరడు. కాబట్టి అతడు మెక్షాన్ని పొంది, గృహస్థు ధర్మాలను విసర్జిస్తాడు” అన్నాడు. అపుడు స్యూమరశ్మి

“ప్రజలు దల్లిఁ జెందు పగిది గృహస్థ ధ
ర్మంబు నెల్ల యాశ్రమములుఁ జేరి
కాదె జీవనంబు గావించుకొను గృహ
యుక్తుఁ డోషధులకు నొడయుఁ డగుట” (12-5-312)

“గృహస్థుడు ఫలమునిచ్చి వెంటనే నశించిపోయే సస్యాదులైన ఓషదులకు ప్రభువు. అందువలన బిడ్డలు తల్లిని చేరినట్లే ఇతర ఆశ్రమాలకు చెందినవారు తమకు పోషకుడైన గృహస్థును ఆశ్రయించి జీవిస్తున్నారు. గృహము సమస్త కార్యాలకూ, ఫలాలకు నిధియైనది. సోమరులు వేదవిహిత కర్మలు విసర్జిస్తారు. దాని వలన సద్గతి నశిస్తుంది. గర్భాదానము మొదలైన సంస్కారము కలిగించే వేదవిహిత మంత్రాలు బ్రాహ్మణుడికి సమస్త సంపదలను కలిగించటము సుప్రసిద్ధమే. వేదాలను తిరస్కరించుట ఉచితమా?” అన్నాడు. అపుడు సూమరశ్మి “విప్రులు దేవతలందరినీ అమృతం త్రాగించిన రీతిగా వేదవిహితాలైన ఆచారాలతో తృప్తిపరుస్తారు. ఇక విప్రులు పాటించే ఆచారాలు ఎలా ఉంటాయంటే పండితుడు తనలోని పరమాత్మను పరిరక్షించడానికి దేవతలకు సహితం వీలు కాని నాలుగు ద్వారాలను గట్టిగా మూసివేస్తాడు. అనగా ఆత్మజ్ఞుడైన వాడు స్వర్ణరాశి పడి ఉన్నా పరిగ్రహించడు. కోపం వచ్చినా ఎదుటి వారిని పొడవటం, కొట్టటం వంటివి చేయక, తన ‘చేయి’ అనే వాకిలిని మూసి పెడతాడు. ఆత్మజ్ఞుడైన పండితుడు ఎట్టి స్త్రీనైనా తనతో విహరించటానికి ఒప్పుకోక తన భార్యతో తప్ప ఇతర స్త్రీలతో రమించక, ‘ఉపస్థ’ అనే ద్వారాన్ని బంధిస్తాడు. అదే విధంగా శరీర  ధారణకు ఎంత అవసరమో అంతే ఆహారం గ్రహిస్తాడు. పొట్ట నిండా తినడు. తనకేది ప్రాప్రమో దానికై తృప్తిపడతాడు తప్ప, రాని వాటిపై చాపల్యం చూపడు. అలా ‘ఉదర ద్వారాన్ని’ బంధిస్తాడు. అబద్ధం చెప్పక, పరనింద చేయక, క్రూర వచనాలు పలుకక, ఇతరులతో తగవులకు పోక, ‘హక్కు అనే ద్వారాన్ని’ బందిస్తాడు. ఈ నాలుగు ద్వారాలు మూసిన వాడే పండితుడు. ఉత్తమగుణ సంపన్నుడు. దీనికై తపస్సులు, యాగాలు, వ్రతాలు చేయవలసిన పని లేదు. వేదాలకు దాస్యం చేసే పని లేదు. ఇట్టి గుణసంపన్నుడైన బ్రాహ్మణుడు ద్వంద్వాలకు లొంగడు. ప్రతిష్ఠలకై పాకులాడడు. బ్రాహ్మణ్యాన్ని అనుష్ఠింప జాలని వాడే అపేక్షించి కర్మలకు అధీనుడవుతాడు” అన్నాడు కపిలుడు. స్యూమరశ్మి ధేనువులో నుండి బయటికి వచ్చాడు. “నేను ధర్మనిశ్చయం గ్రహించదలిచి, ఈ గోవులో దాగి మాట్లాడాను తప్ప మరేమి కాదు. ఓ మహాత్మా! నేను నిన్ను ఆశ్రయించాను. వేదాలు ప్రమాణాలు అన్న సంగతి గ్రహించిన తరువాత, ఆ వేదాలలో విధంచిన వర్ణాలకు ఆశ్రమాలకు తగిన ఆచారాలను నిర్వహించుట కలదు, పరిత్యదించుట కలదు. ఈ రెండింటిలో ఏది మిక్కిలి అనుష్ఠించ దగినదో స్పష్టంగా చెప్పుము” అన్నాడు స్యూమరశ్మి. అపుడు కపిలుడు, “జ్ఞానాన్ని ఆశ్రయించిన వాడు ఏ పని చేసినా వాడికి కీడు కలుగదు. జ్ఞానం లేనివాడు కోరికలకు దాసుడై, కర్మల చక్రభ్రమణములో పడి తురుగుతుంటాడు. అహంకారం, కోపం, ఆశ లేనివాడు శుభాశుభాలనే భేదదృష్టి పొందడు. అతడు త్యాగం కలిగి సర్వత్రా సమభావంతో సుఖ స్వరూపాన్ని దర్శిస్తు ఉంటాడు.” అని చెప్పాడు. అప్పుడు, స్యూమరశ్మి “వేద శాస్త్రాలు విధించిన త్రోవ వదలటం తప్పు దారిలో చరించటమే. పరిశీలిస్తే వేదాలను అంగీకరించకుండా ఉండటమే కీడుగా నాకు తోస్తున్నది. నా సందేహాన్ని తొలగించుము” అని పలుకగా, కపిలుడు అతడితో “వేదాలను ఎందుకు అంగీకరించరాదు. అవే కదా లోకానికి ప్రమాణాలు” అని అన్నాడు.

మరలా అతడు “అంతర్బహింద్రియాలలైన నిగ్రహం సాధించిన జ్ఞాన సంపన్నుడైన గృహస్థుడు మనసులో ఏవీ కోరడు. వేదాలలో చెప్పిన సదాచారాలు నిర్వహిస్తాడు. భూతదయతో, నిరహంకారిగా ఉంటాడు. అతడు వేదవిహితాచారాలు, కర్మలు చేస్తున్న ప్రాయశ్చత్తం చేయవలసిన పని లేదు.

ఇట్టి ఇంద్రియ నిగ్రహపరులు గృహస్థాశ్రమ వ్రతాలు నిర్వహించి శాశ్వతమైన మోక్షం పొందుతారు. ధర్మానికి బ్రహ్మచర్యము మొదలైన నాలుగాశ్రమాలు నాలుగు పాదాలుగా ఉన్నాయి. ఆ నాలుగు పాదాలపై నిలిచి ఉన్నది ధర్మమొక్కటే. ఎవరైతే సంతోషామృతంతో సుఖించే చిత్తుడో అతడు ఒకే రకంగా భావిస్తాడు. అతనికి చింతలు ఉండవు. దేనికి కలత చెందడు. మహాత్ములు ఆశను వర్ఝించి నాలుగవదైన సన్న్యాసాశ్రమం స్వీకరిస్తారు. వేదాలు యతిధర్మానికి అధిష్ఠానము జ్ఞానమని, దానికి అత్యంత సంతోష స్థితే మొదలనీ, మహాత్యాగమే స్వరూపమని, ఆనందమే పట్టుగొమ్మ అని చెబుతున్నాయి. బాగా ఆలోచిస్తే యే ఆశ్రమం సేవించదగినది కాదు. అంతఃకరణ శుద్ధి కలిగి ఏ ఆశ్రమంలో ఉన్నా పండితులు సంసార తీరం చేరగలరు. ఎవరు వేదభావాన్ని గ్రహించి వేదతత్వం తెలుసుకుంటారో, వారే వేదం తెలిసినవారు. మిగిలినవారు వేదపాఠకులు మాత్రమే. వారికి వేదరహస్యం తెలియదు. మోక్షం కావాలనుకునేవాడు ముందు కర్మఫలం త్యాగం చేయాలి. మనసును నిగ్రహించాలి. సంతోషంగా ఉండాలి. సాధకుడు ఈ మూడింటిని పొందాలి” అని పలికాడు కపిలుడు. స్యూమరశ్మి సంతోషించి సెలవు తీసుకున్నాడు.

శాంతి పర్వం పంచమాశ్వాసం లోనిది. ధర్మరాజునకు భీష్ముడు చెప్పినది.

The secret of all success is to know how to deny yourself. Prove that you can control yourself.

96. దేవానుచరుని కథ!

పూర్వం ఒక విప్రుడు యజ్ఞం చేయాలన్న తలంపుతో, ధనమునభిలషించి తపస్సు చేశాడు. కుండధారడనే దేవసేవకుడు, విప్రుడు తపస్సు చేస్తున్న చోటికి వచ్చాడు. వచ్చి “నీ కోరిక యేమి?” అన్నాడు. ఆ విప్రుడు “ధనం కొరకై తపస్సు చేస్తున్నాను” అన్నాడు. అపుడతడు నియమ పూర్వకముగా కుబేరుని బంటైన మణిభద్రుడు అనే యక్షుని తలచాడు. ఆ యక్షుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. “ఈ విప్రుడు నన్ను ఆశ్రయించి ఉన్నాడు. ఇతనిని ధనవంతునిగా చేయము” అన్నాడు. అంతట మణిభద్రుడు “ఎంత ధనం కావలెనని కోరినా ఇస్తాను” అన్నాడు.

అయితే కుండధారుడు ‘మానవుడు మరణశీలుడు, మానవత్వం స్థిరమైనది. కాదు. అన్ని ఆలోచనలో పడినవాడై ఇతడికి డబ్బెందుకు. ఈ భూసురుని చిత్తము ధర్మమార్గములో ప్రవర్తించాలి. అట్లా ప్రవర్తిస్తే అతనికి సమస్తమైన సంపదలు కలుగుతాయి’ అని నిశ్చయించుకొని, తన అభిప్రాయాలను యక్షునికి మృదువుగా వివరించాడు. దానికి యక్షుడు సంతోషించాడు. కుండధారుడు, దేవతలతో ధర్మమార్గములో ఆ విప్రుడు ప్రవర్తించేటట్లు అనుగ్రహించుమని కోరాడు. అలా ప్రార్ధించగానే అతడి మనసు తపస్సులో సంలగ్నమయింది.

ఆ బ్రాహ్మణుడు కుండధారునితో “ఇంత వరకు ధనాన్ని వాంఛించిన నాకు ఇపుడు నీ దయ వలన చిత్తం వివేకవంతమయింది. ఇంక నాకు ధనము అక్కరలేదు. ప్రీతితో తపస్సు చేయటానికి అనుమతించుము” అన్నాడు. అపుడు కుండధారుడు, “అయితే కానిమ్ము, ధర్మం ఆచరించుము” అన్నాడు. అలా చెప్పి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు దుంపలు, ఆకులు ఆహారంగా స్వీకరిస్తూ కఠినమైన తపస్సు చేశాడు. ఆ విప్రుడు క్రమంగా కంద, పత్రాలు కూడా వదలి నీటిని గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తప్ససు చేశాడు. అందుచేత అతని శరీరము, మనస్సు మనుష్యత్వాన్ని వదిలి దివ్యప్రభావానికి నెలవుతై విలసిల్లాయి. అలా తపస్సు చేసి సిద్ధిపొందాడు. సిద్ధి పొందిన తరువాత ఆ బ్రాహ్మణుడిలో “నన్నెవరు ఆశ్రయించినా ధనము నిస్తాను. రాజ్యమునిస్తాను. పాపాలు పొగొట్టుతాను” అన్న ఉత్సాహం అతిశయించింది.

అలా గొప్ప ప్రభావం కలవాడై దేవసేవకుని తలచాడు. అతడు ప్రత్యక్షమయ్యాడు. ఆ విప్రుడు అతడిని తపోమహిమ చేత, గంధపుష్పాల చేత పూజించాడు. సాష్ఠాంగ నమస్కారం చేశాడు. అపుడు కుండధారుడు సంతోషించి, “ఔరా! అర్ధకామాలు ధర్మాన్ని మించకుండా ఉన్నంత వరకే శ్రేయోదాయకాలు అవుతాయి” అన్నాడు. గీతలో కృష్ణుడు, ‘ధర్మావిరుద్ధః కామోస్మి భూతేషు’ – ‘నేను ప్రాణులలో ధర్మానికి విరుద్దం కాని కామమునై ఉన్నాను’ అన్నాడు. అందువలన అర్ధ కామాలకంటే ధర్మమే ప్రధానమని కుండధారుడు విశదపరిచాడు. తరువాత కుండధారుడు “నీవు పురుషార్ధాలలో శ్రేష్ఠమైన ఆ ధర్మాన్ని ఆచరించుము. యోగాన్ని సేవిస్తూ క్రీడించుము. దాని ద్వారా ఆత్మనిష్ఠుడవై విహరించుము” అని వెళ్ళిపోయాడు. ఇక ఆ బ్రాహ్మణుడు ఎదురు లేకుండా యోగ మార్గంలో విహరించాడు.

భీష్ముడు ధర్మారాజుకు చెప్పినది.

శాంతి పర్వము పంచమాశ్వాసం లోనిది.

97. జనకమాండవ్య సంవాదము!

మాండవ్యముని ఒకసారి జనక భూపాలుని కడకు వచ్చాడు. వచ్చి, ఆశ లేకుండా ఉండుటకు తగిన శిక్షణ ఇమ్మన్నాడు. అపుడు ఆ రాజు “సంపదలు దుఃఖనిలయాలు. నాకు దేనిపైనా ఆశ లేదు. అందువలనే మిధిలా నగరము తగలబడుతున్నా నాకు ఏమీ తగులబడినట్లు లేదు. (ఇది నీరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడిపోతున్నా ఏ భావం పొందని భావం వంటిది కాదు.)

కామసుఖం, దివ్యసుఖం ఆశ లేమి చేత కలిగే సుఖానికి ఈడు కావు. అర్థం సులభంగా లభించగానే గోవులో కూడా కొమ్ములు పెరిగినట్లు ఆశ కూడా పెరుగుతుంది. ఆశ ప్రభావం చేత కలిగే వీరు మా చుట్టాలు, అవి మా సంపదలు, ఇవి మా నెలవులు అనే మమకారం తొలిగిపోతే తృష్ణ అనే సాగరం ఎండి పోతుంది.”

“దొరకొన్న ననుభవించుచు
దొరకొనమికిఁ జింతనొంది దురపిల్లక ని
ర్భరుఁడై యున్ననుఁ దృష్ణకుఁ
జొరవచ్చునె యతని మనసు సువ్రతశీలా!” (12-5-376)

“దొరకని దానిని అనుభవిస్తూ, దొరకని దానికి చింతపడి దుఃఖించకుండా పరిపూర్ణుడై ఎవడు ఉంటాడో, అతని మనసులోకి తృష్ణ చేరదు. దుర్మతులు తృష్ణను విడువలేరు. శరీరం ముసలితనం పొందినా ఆశ మాత్రం ముదిమి పొందదు. అది ప్రాణాలు తీసే రోగము. ఎవడు తృష్ణను వదులుతాడో అతడు అత్యధిక సుఖము పొందుతాడు. నీవు సుఖదుఃఖాది ద్వంద్వాలకు వ్యాకులత చెందవద్దు. నిగ్రహముతో మనోబుద్ధ్యాదులతో కూడిన అంతఃకరణ సంపదను కాపాడుకొనుము. అలా చేస్తే ఆశ లేమి వలన నిత్య సుఖం లభిస్తుంది” అన్నాడు.

అతని మాటలు విని మాండవ్యుడు ఆశారహితపథంలో సంచరించాడు. ‘ఈ ఆశ ఎట్లా తొలగుతుందో మధురముగా వినిపించము’ అని ధర్మరాజు అడుగగా భీష్ముడు చెప్పినది.

మహాభారతం శాంతి పర్వం పంచమాశ్వాసం లోనిది.

ఆశయాభాధ్యతే లోకః కర్మణా బహుచింతయాః

The world is bound by desire, fate and much thinking.

He is well paid that is well satisfied – Shakespeare.

98. హరీతుని కథ!

పూర్వం హరీతుడనీ మునిశ్రేష్ఠుడు ఉండేవాడు. అతని దగ్గరికి పండితులు చేరి సన్యాస విధానం చక్కగా తెలుసుకోవాలని కోరారు. అపుడతడు వారితో “ఆత్మనిష్ఠతో ఉద్యుక్తమైన బుద్ధి కలవాడై సన్న్యాసి ఇల్లు వదలాలి. కోరికలు ఉండరాదు. తన మాటలలో, చూపులలో చిత్తములో ప్రజలకు ఏ విధమైన కీడు తలపెట్టరాదు. మిత్రత్వం, సమత్వం, దయ కలిగి ఉండాలి. పాడుపడిన ఇంటిలోనో, ఏకాంతమైన చోట గుడిలోనో, చెట్టు నీడలోనో, లేక కొండ గుహలోనో ఉండాలి. దంచటం, వండటం, బోజనం పనులు పూర్తి అయ్యే సమయం వరకు వేచి ఉండి భిక్షకు పోవాలి. తనపై ఎక్కువ ప్రీతి, గౌరవం చూపుతూ మితి మించి భిక్ష పెట్టేవారున్న చోటు వదిలి క్రొత్త చోటుకు వెళ్ళాలి. సదా ఆత్మ గతియందే రతిగలిగి ఉండాలి.” అని తెలిపాడు. దానికి పండితులు హరీతుని అభినందించి వెళ్ళిపోయారు.

‘ఏ విధమైన స్వభావం కలవాడు మోక్షం పొందగండో వివరించమ’ని ధర్మరాజు ప్రశ్నించగా “మితాహరం స్వీకరిస్తూ ఇంద్రియానీకాన్ని జయించి, మోక్షం కొరకై శాస్త్రాలలో చెప్పబడిన ఉత్తమ ధర్మాలను అనుష్ఠించే వాడికి బ్రహ్మపథం తంగేటి జున్ను వలె సులభసాధ్యం అయి ఉంటుంది. తంగెడు చెట్టు ఎత్తుగా పెరుగదు. దానిలోని తేనెతుట్టెను సులభంగా ఎవరైనా గ్రహించి అనుభవించవచ్చును. మరియు నీవడిగిన ప్రశ్నకు హరీతగీతలో పూర్తి సమాధానం కలదు” అంటూ భీష్ముదు పై హరీతగీత చెప్పిన సందర్భములోనిది హరీత కథ.

శాంతి పర్వం పంచమాశ్వాసం లోనిది.

99. వృత్రుడి కథ!

పూర్వం వృత్రుడనే రాక్షసుడుండేవాడు. తన రాక్షస సైన్యంతో సహా ఇంద్రుని పైకి సమరానికి వెళ్ళాడు. ఇంద్రుడు దేవతా సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. వృత్రుడు ఇంద్రుని ధీటుగా ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధం ఇంద్రునికి భీతి కలిగించింది. పర్వతాకారములో నున్న వృత్రుడిని చూచి ఇంద్రుడు గడగగా వణకసాగాడు. అపుడు ఆ రాక్షసరాజు తన మాయా శక్తితో ఇంద్రుని మూర్ఛితుని చేశాడు. అంతట వశిష్ఠుడు మొదలగు మునులు తనను పొగుడుతుండగా రథంతరసామ మంత్రాల ప్రభావంతో ఇంద్రుడిని మూర్ఛ నుండి తేరుకొనేటట్లు చేశాడు. ఆ యుద్ధం చూడడానికి త్రిమూర్తులు తరలి వచ్చారు. మునులు “త్రిమూర్తులు వచ్చారు. యుద్ధానికి సిద్ధం కమ్ము” అని ఇంద్రునితో పరికారు. వశిష్ఠుని ప్రేరణతో ఇంద్రుడు యుద్ధానికి తలపడ్డాడు. బృహస్పతి తక్కిన మునులతో ఇంద్ర విజయార్థమై ఈశ్వరుని ప్రార్థించారు. ఆ శంకరుని తేజము మహోద్ధతమై చలించే జ్వరంగా రూపొంది, వృత్రుడిని ఆక్రమించింది. ఆ కాలంలోనే విష్ణువు ఇంద్రుడిపైకి ఎత్తిన వజ్రాయుధంలో ప్రవేశించాడు. అపుడు రుద్రుడు, ఇంద్రునితో “ఈ రాక్షసుడు అరవై వేల సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశాడు. బ్రహ్మ వీడికి భయంకరమైన మహాబల ప్రసాదించాడు. అయితే వాడి బలము నా తేజస్సు చేత నశిస్తుంది. కాబట్టి ప్రయత్నించుము” అని పురికొలిపాడు. అంతట ఇంద్రుడు వృత్రుడని వజ్రాయుధంతో కొట్టాడు. దానితో రాక్షసుడు నేలకూలాడు. దేవతలు సంతోషించారు. పూల వాన కురిపించారు.

హరిహరులు ఏకమై రాక్షస సంహారములో పాలుపంచుకొని లోక కల్యాణం చేసినందుకు మంగళ వాయిద్యాలు మ్రోగించారు. ఆ పై వెన్నుని స్పర్శతో వృత్రుడి హృదయగత మాలిన్యం తొలగిపోయింది. అపుడతడు విష్ణుదేవుని చూశాడు. అతని చిత్తానికి శాంతి కలిగింది. ఇంద్రుడు వృత్రుని ఓడించిన పిదప, శివునికి ప్రణమిల్లి “మీ దయవలన పీడ తొలిగి సౌఖ్యం పొందాను” అని పలికి వెళ్ళిపోయాడు. అయితే ఇంద్రుడిని బ్రహ్మహత్యాదోషం వెంబడించింది. దానికి భయపడి అతడు తామరతూడులో ప్రవేశించాడు. అది మాత్సర్యంతో వెంబడించి, అక్కడ కూడా భయంకరంగా అతడిని చుట్టుముట్టి ఆక్రమించింది. ఇంద్రుడు బ్రహ్మహత్యాదోషం తనను పట్టుకొనడంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ ఆ దోషం తొలిగించే ఉపాయం ఆలోచించాడు. అతడు అగ్ని దేవుని దగ్గరికి వెళ్ళాడు.

చెట్లను గడ్డి మొక్కలను, స్త్రీలను, నీటిని తన సంకల్ప శక్తితో వచ్చేటట్లు చేశాడు. ఇంద్రునికి గల బ్రహ్మహత్యా దోషాన్ని నేను నాలుగు భాగాలు చేశాను. మీరు ఒక్కొక్క భాగము స్వీకరించాలి అని ఆదేశించాడు. అందుకు అగ్న్యాదులు “ప్రభూ మీ ఆన పాటిస్తాము. అయితే దీని వలన కలిగే పాపానికి మాకు ప్రాయశ్చిత్తమేది నిశ్చయించి చెప్పుము” అన్నారు.

అపుడు అగ్నికి ఓషదులకు, స్త్రీలకు నీటికి క్రమంగా ఈ రీతిగా వరాలు ఇచ్చాడు: “నీవు మండుకున్నప్పుడు నీలో హావిస్సులు వ్రేల్చిన వాడిలో నీ దోషం ప్రవేశిస్తుంది” అని అగ్నికి, “పండుగ కాలంలో మిమ్మల్ని భగ్నం చేసి, నరికి, పెకిలించే వారిలో మీ దోషం ప్రవేశిస్తుంది” అని ఓషధ వృక్షతృణములకు; “మీరు రజస్వలై ఉన్నపుడు మీతో రతి చేయువారిలో మీ దోషం ప్రవేశిస్తుంది” అని స్త్రీలకు, “మీలో మలమూత్రములు, కళ్ళెలు వదిలిపెట్టే వాడిలోకి మీలోని దోషం ప్రవేశిస్తుంది” అని నీటికి వరమిచ్చాడు. అందుకు అగ్ని మున్నగు వారు సంతోషించారు. ఇంద్రుని బ్రహ్మహత్యా దోషాన్ని ధరించారు. బ్రహ్మ ఆనుగ్రహంతో ఇంద్రుడు అశ్వమేధయాగం చేశాడు. సమస్తలోక పూజ్యుడు అయినాడు. అయితే వృత్రుడి శరీరం నుండి కారిన నెత్తురు బుడగలు పుట్టాయి. అవి పుట్టకొక్కలయ్యాయి. ప్రజలకు ఆహారపదార్థాలుగా అయ్యాయి. అవి రాక్షసజములు కావులు వలన తినడానికి తగనివయ్యాయి.

ఈ కథలో హత్యదోషము అంటినవాడి దుర్గతి ఎలా ఉంటుందో ఒక వైపు తెలియగా, మరోక వైపు అగ్నిని, ఓషద వృక్షాలను, జలాలను అనగా పవిత్రమైన వానిని ఎలా చెక్కగా వాడుకోవాలో, ఎలా దుర్వినియోగం చేయరాదో అప్రత్యక్షంగా చెప్పింది. వానితో సక్రమంగా వ్యవహరించకపోతే బ్రహ్మహత్యా దోషమని తేల్చి చెప్పింది. ఈ కథలో పర్యావరణ స్పృహతో పాటు స్త్రీలను యేయే సందర్భాలలో ఎలా చూసుకోవాలో కూడా తెలిపింది.

అందుకే మహా భారత కథలు శాస్త్రజ్ఞానాన్ని బోధించేవి.

భీష్ణుడు ధర్మరాజుకు చెప్పినది.

శాంతి పర్వము పంచమాశ్వాసం లోనిది.

(ఇంకా ఉంది)

Exit mobile version