[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
103. ఉపరిచరవసువు కథ!
ఉపరిచరవసువు అను ఒక రాజు ఉండేవాడు. అతను ఆచార పరాయణుడు. సత్యసంధుడు. ఇంద్రియ నిగ్రహపరుడు. విష్ణు భక్తుడు. రాజనీతి కుశలుడు. సజ్జనాదరుడు. యజ్ఞయాగాదులంటే భక్తి కలవాడు. అతడు తపస్సు చేయాలనుకొని నిశ్చయించుకొని అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఒకనాడు దేవేంద్రుడు అతని దగ్గరికి వచ్చాడు.
“వసురాజా! నాతో స్నేహము చేయుము. నాతో ఉండము. మా నగరానికి వస్తూ, పోతూ ఉండము. ఈ భూమిని కూడా పాలించుము. నీ తపోనిష్ఠకు మెచ్చి, దివ్యత్వాన్ని కూడా ఇస్తున్నాను. దీనిని స్వీకరించి లోకాల రాకపోకలు సాగించుము” అంటూ రత్నఖచిత దివ్యవిమానాన్ని బహుకరించాడు. ఇంద్రుని మాట కాదనలేక వసురాజు అలాగే స్వీకరించాడు. వసువు అనే పేరు గల ఆ రాజు విమాన క్కి అలా తిరగచం చేత ఉపరిచరుడు అనే ఖ్యాతిని పొందాడు.
ఇదిలా ఉండగా కల్పారంభములోమరీచి మొదలైన మునులూ, చిత్తుడు, శిఖండి, స్వాయంభువుడు అనేక సంవత్సరాలు విష్ణువు గూర్చి తపస్సు చేశారు. ఆ దేవుడు వారికి అదృశ్యరూపములోవారి ఎదుట నిలిచి, “మీరంతా ధర్మశాస్త్రాలు రచించటంలో సక్తులై నన్ను ఆశ్రయించారు. సరస్వతి మీలో నిలవాలని ఆజ్ఞాపించాను. మీ వలన ధర్మశాస్త్రం లోకాలకు మేలును కలిగించేటట్లు వృద్ధి చెందుతుంది. అంగీరసుడికి బృహస్పతి పేర ఒక మేధావి జన్మిస్తాడు. అతని ద్వారా శాస్త్ర గ్రంథాన్ని నెలకొలపండి” అని ఆజ్ఞాపించి, మరలా ఉపరిచర వసువు అనే ఒక మహారాజు జన్మిస్తాడు. అతడు మీరు రచించబోయే ధర్మ శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి యోగ్యుడు. బృహస్పతి నేర్పగా అతడు నేర్చుకొని శాస్త్రప్రకారం ఆచరిస్తూ యజ్ఞయాగాలు ఆచారాలకు నాయకుడు అవుతాడు. అతడు నా భక్తుడు. గౌరవించదగిన వాడు అని చెప్పి విష్ణువు వెళ్ళిపోయాడు.
ఒకసారి అశ్వమేధయాగం చేశాడు. అందులో మరీచి మొదలైన సప్తర్షులు, మరికొందరు ఋత్విక్కలుగా పాల్గొన్నారు. బృహస్పతి దర్శకత్వం వహించాడు. బ్రహ్మపుత్రులైన ఏకతుడు, ద్వితుడు, త్రితుడు సదన్యులుగా ఉన్నారు. అయితే వసుమహారుజు జీవహింసకు వ్యతిరేకి. కావున అశ్వమేధములో పశుసంహరానికి అంగీకరించలేదు. దానికి బదులుగా అరణ్యకాలలో చెప్పబడిన మహామంత్రాలను పరమనిష్ఠతో విష్ణుమూర్తిని ఉద్దేశించి పలికాడు. దయాపరుడైన విష్ణువు, వసురాజుకు మాత్రమే కనబడేటట్లుగా వచ్చి, తనకు ఉద్దేశించబడిన హవిర్భాగాన్ని స్వీకరించి వెంటనే వెళ్ళిపోయాడు. దానితో ఆధ్వర్యం వహిస్తున్న బృహస్పతికి కోపం వచ్చి, కన్నీరు కారుస్తూ వసువుతో, “అందరు దేవతల వలెకాక విష్ణువు తనకిచ్చే హవిర్భాగాన్ని ప్రత్యక్షంగా కాక అధృశ్యడై స్వీకరించాడు” అని చెప్పాడు. రాజును ఊరడించాడు. ప్రజాపతి పుత్రులు బృహస్పతితో “ఎందుకయ్యా! అనవసరంగా అలుగుతావు. విష్ణువు తన హవిర్భాగాన్ని తాను తీసుకొని వెళ్ళాడు. అతనిని దర్శించటం అందరికీ అవుతుందా? బ్రహ్మమానస పుత్రులమైన మాకే సాధ్యం కాలేదు. అతడి దర్శనం కోరి ఒకమారు తపస్సు చేశాం. అపుడు అశరీరవాణి “క్షీర సముద్ర మధ్య భాగములో ఒక శ్వేత ద్వీపము ఉన్నది. అక్కడికి వెళ్ళండి. ఆ ద్వీపంలో మిక్కిలి తెల్లని రంగువారు, చెమట పట్టని వారు, జితేంద్రియులు, పరిమాళాలు చిమ్మే శరీరం కలవారు, నిరాహారులు, హరిభక్త పరాయణులు అయిన నరులు ఉంటారు. ఆ నరులకు విష్ణుమూర్తి తన తేజోరూపము చూపిస్తుంటాడు. అప్పుడు చూడగలిగితే మీరు చూద్దారుగాని” అని ఆకాశవాణి చెప్పింది. దానితో సంతోషించి ముగ్గురము బయలుదేరాము.
శ్వేతద్వీపానికి వెళ్ళి, ఆకాశవాణి చెప్పనట్లుగా ఉన్న మానవులను చూశాము. అటువంటి విశిష్టమైన శరీర రూపము ఏ లోకంలో, ఏ జంతువులకు ఉండవు. ఏకాగ్ర చిత్తముతో ఆ విష్ణు భక్తుల చెంత నిలివగా వేయి మంది సూర్యుబింబాల వెలుగులతో ప్రకాశించే ఒకానొక దివ్యకాంతి స్వరూపాలు ప్రత్యక్షమయ్యాయి. మేము వెంటనే జయహే విష్ణు! జయహే విష్ణు! జయము! జయము! అని జయ జయ ధ్వానాలు చేశాము. ఆ సమయంలో మేమాతడి దివ్యరూపాన్ని స్పష్టంగా చూడటం, సాధ్యంకాక మేము నివ్వెరపాటు చెంది ఉండగా, ఒక భూతం ఆకాశపుటంచు నుండి విష్ణుమూర్తిన దర్శించలేకపోయామే అని ఖేదపడకండి ఈ శ్వేత శరీరులైన దివ్యపురుషులను దర్శించారు.
విష్ణుమూర్తిని దర్శించినట్లే. కావున సంతృప్తి చెందండి. ఇంతకాలము మీరు ఆచరించిన నియమనిష్ఠలు, తపస్సులు, దానాలు, ఇవన్నీ విష్ణుమూర్తిని దర్శనం ఇప్పించాయా? తదేక భక్తితో, దీక్షతో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, అప్పటికి ఈ విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది. కానీ అలా తొందరపడితే దొరకుతుందా? అది అంత తేలిక విషయము కాదు. అని చెప్పగానే మేము ముగ్గురము తిరిగి వచ్చాము. విష్ణుమూర్తుల వారి పద్ధతి ఇది. కాబట్టి కనిపించకపోయేడే అని నీవు అలగవలసిన పని లేదు. ఈ యజ్ఞనం ఏ లోటు లేకుండా పూర్తి చేయము. అని ఏకతుడు, ద్వితుడు, త్రితుడు చెప్పేసరికి బృహస్పతి శాంతించి యజ్ఞం పూర్తి చేశాడు.
ఆ వసుమహారాజు పుణ్యాత్ముడై పరిపాలన సాగించాడు. కొంత కాలానికి అతడు సశరీరంగా బ్రహ్మలోకం చేరుకున్నాడు. భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది.
శాంతి పర్వము షష్ఠాశ్వాసము లోనిది.
104. హయగ్రీవుని కథ!
ప్రళయ కాలంలో యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణుమూర్తి మేల్కొన్నాడు. జగత్తులను సృష్టిద్దాం అనుకున్నాడు. అనుకోవడమేమిటి అహంకారం ఆవిర్భవించించి దానికి బ్రహ్మ అని పేరు యేర్పడింది. విష్ణుమూర్తి నాభి కమలం నుండి ఇట్లా జన్మించిన ఆ బ్రహ్మదేవుని సృష్టికి శ్రీకారంగా నాలుగు వేదాలను సృష్టించాడు. ప్రళయవేళ యోగనిద్రా సమయాన విష్ణుమూర్తిలో లీనమయిన సత్త్వరజస్తమో గుణాలలో మొదలుగా సత్వగుణం ఆవిర్భవించింది. బ్రహ్మ ఆ సత్వగుణములోనే ఉన్నాడు. తరువాత వెలువడిన రజస్తమో గుణాలు రాక్షసులు అయ్యాయి.
ఇంతలో మధువు, కైబభుడు అనే రాక్షసులు అహంకరించి, నాలుగు వేదాలను అపహరిచుకొనిపోయి గట్టిగా కట్టేసి పాతాళములో పారవేశారు. దానికి బ్రహ్మ చింతిస్తూ “నాకు బలమూ, చూపూ, ఆధారము అన్నీ వేదాలే. అవి నశిస్తే నేనింక జగత్తును ఎలా సృష్టిస్తాను? ఈ ఆపదల నుండి నన్ను తప్పించే వాడెవరు?” అనుకొని విష్ణుమూర్తిని బహువిధాలుగా స్తుతించాడు. ప్రళయ జలధిలో నిదురిస్తున్న విష్ణువు హయగ్రీవరూపం ధరించాడు.
గుర్రపు తల, వివిధ వర్ణాలతో ప్రకాశించే శరీరము – ఈ రూపములో వేదాన్వేషణకు ఉపక్రమించాడు. హయగ్రీవ రూపములో విష్ణువు పాతాళనికి వెళ్ళి అక్కడ సుదీర్ఘంగా ప్రణవధ్వని చేశాడు. అది విన్న మధు కైటభులు మహాప్రతాపముతో అటు వైపు వచ్చారు. వచ్చి, ప్రణవధ్వని వినిపిస్తున్న వైపు పరుగులు తీశారు. అపుడు హయగ్రీవుడు మరొకవైపు వెళ్ళి, వేదాల కట్టు విప్పి, బ్రహ్మకు అప్పగించాడు. ఆపై ఏమి ఎరుగని వాని వలె శేషతల్పం మీద శయనించాడు. అక్కడ పాతళంలో ఓంకారం వినిపించిన వైపు పరుగున వెళ్ళిన మధుకైటభులకు అక్కడ ఎవరూ కనబడలేదు. వాళ్ళు మునుపు దాచిన ప్రదేశానికి వెళ్ళి గబగబా తిరిగారు. వేదాలను దాచిన చోటు వెదికారు. అవి కనిపించలేదు. అంతటా గాలించారు.
యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి కనిపించారు. వీళ్ళు యుద్ధానికి ఆహ్వానించారు. కయ్యానికి కాలుదువ్వారు. విష్ణువు వారిద్దరిని సంహరించాడు. ఆ విధంగా జగత్తును సృష్టించటంలో ఉన్న ఆటంకం తొలగించగా, బ్రహ్మ సృష్టి చేశాడు. ఆ నాటి నుండి హయగ్రీవ రూపం మహిమన్వితమైనది. వేదాలు కూడా విష్ణువును ఆశ్రయించి యున్నవి. వేదాలు, యజ్ఞాలు, సకల పుణ్యకార్యాలు, పంచభూతాలు అన్నీ విష్ణు స్వరూపాలే.
శాంతి పర్వము షష్ఠాశ్వాసము లోనిది.
105. భృగు నామక విప్ర చరిత్ర!
గంగానది దక్షిణ తీరమున మహాపద్మమనే మహానగరంలో భృగుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మనిత్యుడు. సత్యవ్రత పరాయణుడు. అహింసాపరుడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు. తన కర్మాచరణ పట్ల తృప్తికలవాడు. అక్రోధనుడు. న్యాయంగా లభించే ధనంతో దేవ, పితృకార్యాలు, అతిధి సత్క్రియలు, మిత్రకార్యాలు నిర్వర్తించేవాడు. అతనికి లోకం చేతమన్ననలు పొందిన వినయవంతులైన కుమారులున్నారు.
అతనికి ఎప్పుడూ నేను ధార్మికుడిని ఎలా అవుతాను? నాకు ఆత్మనిష్ఠ ఎలా కలుగుతుంది? అన్ని ఆలోచనలతో ఉండేవాడు. అలా ఉండగా ఒక ఉత్తమ బ్రాహ్మణుడు తన ఇంటికి అతిథిగా వచ్చాడు. భృగువు అతిథి మర్యాదలన్నీ యథావిధిగా జరిపాడు. ఆపై “అయ్యా! నా భక్తి విషయం నీకు వినిపిస్తాను. మేలైన సలహా చెప్పుము. నేను నియమ నిష్ఠలతో ఆత్మావలోకనానికి కూర్చుంటాను. కానీ, నాకు సిద్ధించటం లేదు. త్రిగుణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆత్మ సందర్శనంచే అఖండమైన ఆనందాన్ని పొందాలని ఉన్నది! దానికి మార్గాన్ని ఉపదేశించండి” అని అడిగాడు. అప్పుడా సద్భ్రాహ్మణుడు “ఓ భృగూ! నేను నీవలెనే ఆత్మదర్శనం కొరకు ప్రయత్నించి సఫలం కాలేక జారిపోతున్నాను. మోహం అడ్డు వస్తున్నది. ఆ శుభ సందర్శనకు సరియైన దారి ఏదో మరి. వ్యక్తులు కొందరు బ్రహ్మచర్యము, గృహస్థ ధర్మాచరణము, తపస్సు, నిష్కర్మత్వం, యజ్ఞం, దానధర్మం వంటి వాటి ద్వారా ఆత్మ సందర్శన పొందుతూ ఉంటారు. మరి కొందరు తల్లిదండ్రుల సేవలో, భక్తిలో మంచి శీలంతో శాంతి స్వభావంతో, ఇంద్రియ నిగ్రహముతో, సత్యవాక్య నియమంతో, ఆహింస వ్రతంతో ముక్తి పదం పొందుతారు. మోక్షం కావాలని అనుకోగానే అందరికీ అది లభిస్తుందా! ఒక విషయం చెబుతాను, వినుము.
నైమిశారణయ్ములో గోమతీ నదీ తీరములో మహా పద్మమనే తటాకం ఉన్నది. దాని ఒడ్డున ఒక సర్పం నివసిస్తున్నది. ఈ తటాక ప్రాంతంలోనే మాంధాతృడు మొదలగు వారు పూర్వం తపస్సులు చేసి, ఇహ పర శ్రేయస్సులు పొందారు. ఆ పవిత్ర స్థలంలో ఒక నాగరాజు ఉన్నాడు. అతని పేరు పద్ముడు. ధర్మశీలుడు. దయాశీలి. సజ్జనులను గౌరవించేవాడు. అతిథి సేవాతత్పరుడు. అతిథులకు అతడంటే ఇష్టం. ఆ పద్ముడిని దర్శించుము. అతడు నీ కోరిక తీరుస్తాడు” అని అతిథి చెప్పాడు.
దానికి భృగువు “నాకు జ్ఞానోదయమైనది.” అని తెలిపి, “ఈ రాత్రి నా నివాసములోనే ఉండిపో” అని చెప్పగా, అభ్యర్థన అంకీకరించి, తెల్లవారి భృగువు అనుమతి గైకొని వెళ్ళిపోయాడు. ఆ తరువాత తన ప్రయాణానికి కాలసిన యేర్పాట్లను సరైన పద్ధతిలో చేసుకొని, పుణ్యతీర్థాలను సేవిస్తూ, నైమిశారణ్యంలో ప్రవేశించి, గోమతీ నదీ తీర్థం చేరి, మహాపద్మమనే సరస్సు గట్టు మీద ఉన్న నాగేంద్ర మందిరము చూశాడు. ఇంతలో నాగేంద్రుని భార్య ఎదురు వచ్చి భృగువును ఆహ్వానించింది. అతిథి పూజలు చేసింది “మీరు యే పని మీద ఇక్కడికి వచ్చారో చెప్పండి. ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను” అన్నది. “నీ భర్త ఎక్కడున్నాడు తెలుపుము. నీ భర్తను కలిసి వెళ్ళడానికి వచ్చాను” అన్నాడు. “ఓ మునీ! నా భర్త ప్రతి నెలా ఒక వారం సూర్యరథ వహనానికి వెళతాడు. నెల వారి వంతు రావటంతో ప్రస్తుతం సూర్యరథాన్ని మోయటానికి వెళ్ళాడు. ఏడెనిమిది రోజులలో వస్తాడు. నా భర్త చేసే ఉద్యోగం ఇది. అందు వలన నీ కోరిక ఏమిటో చెప్పుము. తీరుస్తాను” అన్నది ఆ పతివ్రత.
“అమ్మా! నీ భర్తను దర్శించటం కంటే నాకు వేరే కోరిక యేమీ లేదు. ఆ నాగరాజు వచ్చే వరకు ఆ వనములో ఉంటాను. రాగానే నాకు తెలుపండి” అని భృగువు తెలిపి, గోమతి పుణ్యారణ్యములో జపము చేస్తూ, నిరాహారుడై ఉన్నాడు. అట్లా ఉండగా ఆ నాగరాజు బందువులు అతడి భార్య పుత్రులతో కలసి వచ్చి, భృగువును తీయని మాటలతో “నీవు ఆహారం తీసుకోనక నేటికి ఆరు నాళ్ళైంది. మేము అతిథి పూజాప్రియులము. ధర్మలోపం జరుపకుండా, మా ఆతిథ్యము స్వీకరించుము. మా కోరిక మన్నించి అన్నమో ఫలములో, కందమూలములో తిని మమ్మల్ని రక్షించుము” అన్నారు.
అపుడా భృగువు “అంత మాటలు ఎందుకు? నేను సర్పరాజు కొరకు చూస్తున్నను. అది సిద్ధించే వరకు నాకు ఆకలిదప్పులు ఉండవు. నేను అలిగి రాలేదు. ఒక నియమంతో ఉన్నాను. నన్ను బాధ పెట్టుట ఎందుకు? మీకు ధర్మం విరోధం కలిగించని పూచీ నాది. మరొక రెండు రోజులు గడిస్తే నా వ్రతం కూడా పూర్తి అవుతుంది. కాస్తా గౌరవంతో వేచి చూడండి. ఎనిమిదవ రోజు ఆ సర్పరాజు రావాలి. ఒకవేళ రాకపోతే మరునాడు మీరు కోరినట్లు హాయిగా యిష్టపడి భుజిస్తాను. దీనిని మీరు అంగీకరించండి” అని చెప్పగా వారు అలాగేనని వెళ్ళిపోయారు. సర్పరాజుకు సూర్యరథం మోసే పని అయిపోవడంతో, సూర్యానుమతితో వచ్చేశాడు.
సర్పరాజు భార్య అతడిని సాదరంగా హార్వనించి, అర్ఘ్యపాద్యములిచ్చింది. అతడు సంతోషించి “దేవీ! దేవతా పూజలు, అతిధి పూజలు యధావిధిగా జరుగుతున్నాయా? నేను ఊరిలో లేను కదా! అని మునుపటి పద్దతి తప్పిపోయి ఏమయినా మార్పులు, పోరపాట్లు జరిగాయా!” అని ప్రేమగా అడిగాడు. “స్వామీ అన్ని ఎప్పటిలాగే మీరు శిక్షణయిచ్చిన మాదిరిగానే జరుగుతున్నాయి.” అని పలికింది. మరలా తానే, “గురువుల పట్ల శిష్యులకు, వేద తత్పరత పట్ల బ్రాహ్మణులకు, లోకరక్షణ రాజులకూ, న్యాయంగా ధనం సంపాదించడం వైశ్యులకు, పై ముగ్గురిని సేవించటం శూద్రులకు. రాజాజ్ఞను శిరసావహిచడం భటులకు! సర్వాశ్రమాల వారికి ఉపకరాము అందించే గ్రుహస్థాశ్రమం వేరు.
ప్రేమ అందరికీ. వ్రతం ఏకాంతంగా హాయిగా తపస్సు చేసుకుంటూ ఇంద్రియాలను జయిస్తాను, కోరికలను జయిస్తాను అనే బుద్ధి కలిగి ఉండటం యోగులకు వ్రతం.
పాతివ్రత్యం భార్యలకు వ్రతం. అయితే ఒక విషయం. మీరు వెళ్ళిన తరువాత మీ దర్శనానికై ఒక విప్రుడు వచ్చాడు. మీరు లేక పోవటంతో, మీరు వచ్చేంత వరకు నిరాహారుడై వనములో వ్రతం చేస్తూ ఉన్నాడు. మేము ఎంతగా పిలిచినా, భుజించమన్నా రాలేదు. తినలేదు. ఏడెనిమిది నాళ్ళుగా నిరాహరుడై జపిస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి పలకరించండి” అన్నది. దీనికి నాగరాజు కుపితుడై “నేనెవరి దర్శనానికో వెళ్ళటమా? అసంభవం. దేవతలు, రాక్షసులు, తక్కిన వారు నా పట్ల ఎంతో గౌరవాదరాలు కలిగి ఉంటారు. వాడెవడి దర్శనానికో నన్ను వెళ్ళమంటున్నావేంటి?” అన్నాడు. “ధీర శాంత చిత్తుడా! నీ రాక కోరకు ఆశతో ఎదురు చూస్తున్న ఒక బ్రాహ్మణుడి కోరికను తీర్చక పోవటం మీవంటి ధర్మచిత్తునకు న్యాయమా? ఒక బ్రాహ్మణుడిని నిరాశపరిచి ఆ పాపాగ్నిలో నీ ముక్తినీ, నీ ఔచిత్యాన్ని, నీ దయను, నీ ధార్మిక పాండిత్యాన్ని తగలబెట్టుకుందువా? మౌనం వలన ధృఢజ్ఞానం, దానం వలన అధ్యుదయం, ఆశలు తీర్చినందు వలన నరకాలు తప్పిపోయి, సుఖములభిస్తాయని పెద్దలు చెబుతుంటారు. తొలకరి వాన కొరకు చాతకము ఎదురు చూసేటట్లు, నీ రాకకై ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు కోపం చాలించము” అని భార్య చెప్పింది.
“దేవీ! ముక్కు ముఖం తెలియని వాడిని చూడటానికి వెళ్ళమని చెప్పగానే రోషం పొడుచుకొని వచ్చింది. అనవసరంగా గర్వపడ్డాను. ధర్మాన్ని తెలియచేసావు. నా ప్రతిష్ఠను కాపాడావు.”
“కార్తవీర్య దశముఖ ప్రముఖులు జమ
దగ్ని తనయ రాఘవాదులైన
పురుషవరులచేతఁ బొలియరే సక్రోధ
వృత్తిఁ గాన యలుకవిడుపు మేలు” (12-6-589)
క్రోధం కారణంగా కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో, దశకంఠుడు రాముడి చేతిలో సమసిపోయారు. ఇఁకా చాలామంది కోపం వలన దెబ్బతిన్నారు. కోపాన్ని వదలుకోవటం మేలు. నీవంటి భార్య దొరకటం వలన గొప్ప ప్రమాదం నుండి తప్పించుకొనగలిగాను. లేకపోతే మహాకూపములో పడి నశించి పోయేవాడిని. యిప్పుడు యీ అతిథి దగ్గరికి వెళతాను” అని చెప్పి, భార్యను మెచ్చుకొని, భృగుడున్న చోటుకి వెళ్ళాడు.
ఇద్దరు పరస్పరం కుశలాలు మాటలాడుకున్న తరువాత సర్పరాజు, “నా రాకకై నిరిక్షిస్తూ నిరాహార దీక్షతో ఉండటానికి కారణేమిటి? నీ కోరిక యేమిటో చెప్పు తీరుస్తాను. మా వాళ్ళు చెప్పగానే వచ్చాను” అన్నాడు.
“లోకస్తుత్యా! నా కోరిక తరువాత చెబుతాను. నిన్ను మరొకటి అడగనా?” అన్నాడు విప్రుడు. “నీవు అడగవలెనని అనుకొంటున్నది అడుగుము” అన్నాడు. సర్పరాజు. అపుడా విప్రుడు “ఓ సర్పరాజా! నీవు సూర్య రథాన్ని మోయడానికి వెళ్ళినప్పుడు నీవు చూచిన, విన్న అద్భుతాలు యేమైనా ఉంటే, నాకు చెప్పాలి” అన్నాడు. అప్పుడు సర్పరాజు “ఆశ్చర్యాలన్నిటికి నిలయం సూర్యుడే. అతడి నుండి సకల ప్రాణికోటి జన్మిస్తుందంటే ఇంతకంటే ఆశ్చర్యమేముంది? వాలఖిల్యాది ఋషులు, సిద్ధులు, దేవతలు సూర్యడి కిరణాలలోనే చెట్టు కొమ్మల మీద పిట్టలున్నట్లు ఉంటారు. సూర్యగోళం నుండి వెలువడే వాయువు గోళం మధ్యలో ఉండే దట్టమైన కాంతితో కలిసి, వర్షం కురుస్తుంది. సూర్యుడు వర్షాలు కురిపిస్తాడు. మళ్ళీ అతడే తన కిరణాలతో నీటి నంతటిని వెనక్కి లాగుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యరరమేముంది? సూర్యుడి వేడి తగ్గితే ప్రజలలో ఆత్మనిష్ఠ శాశ్వతంగా ప్రకాశిస్తుంది. సూర్యుని వలన భూమిలో విత్తనాలు మొలకెత్తుతున్నాయి. శ్రీహరి సూర్యమండలంలో ప్రకాశిస్తుంటాడు. ఇంతకంటే ఆశ్చర్యమేముంది. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. శ్రద్ధగా వినుము. ఒక రోజున మధ్యాహ్నం ఆకాశంలో ఒక పురుషుడు ఎదురయ్యాడు. ఆయన తేజస్సు సూర్యుడితో పోటీపడుతుంది. ఆకాశాన్ని పగలగొట్టేస్తాడా? అన్న తేజస్సుతో ఉన్న ఆ పురుషుడికి సూర్యుడు చేయి సాచాడు. ఆ సమయంలో ఇప్పటి దాకా రథం మీద ఉన్నవాడు సూర్యుడు? లేదా ఇప్పుడు వచ్చిన వాడు సూర్యుడా?” అన్న సందేహం మనకు కలిగి పరస్పరం గుసగుసలు పోతు చివరికి నేనే మా ప్రభువును, ఇతడెవరిని అడిగాను అప్పుడు మా ప్రభువు దయ నిండిన కన్నులతో, వచ్చినవాడు సురయక్షగరుడ గంధర్వకిన్నరుడో కాదు.. నిశ్చలమైన మనసుతో ఉంఛ వృత్తితో జీవించే బ్రాహ్మణుడు. నిశ్చలమైన నియమాలు కలవాడు. కందమూల ఫలోదక మారుతాలు మాత్రమే ఆహారంగా స్వీకరించేవాడు. నిరాకాంక్షుడు. సర్వభూత హితుడు. మూనీశ్వరుడు. ఇలా సిద్ధిపొందాడు” అని సూర్యుడు స్పష్టం చేశాడు. “ఓ భృగూ ఇలాంటి అద్భుతం చూడగలిగాను, వినగలిగాను” అని పద్ముడు చెప్పాడు.
“ఓ పద్ముడా? నీవు చెప్పినది అద్భుతాలే. నేనింక వెళ్ళి వస్తాను” అని భృగువు అన్నాడు. అతడి మాటలకి పద్ముడు ఆశ్చర్యపడుతూ, “ఎంతో కష్టపడి వచ్చావు. నాకై కష్టపడి వేచావు. ఇంత వరకు నీకు చేసినదేమీ లేదు. చెట్టు కింద కాపురం ఉన్న వాడివలె, ఉన్న పళాన్న దులుపుకొని వెళుతున్నావు. ఇందకు నీ కోరిక ఏమిటో చెప్పలేదు. అడుగు తీరుస్తాను” అన్నాడు. పద్ముడు. అప్పుడు భృగుడా
“భోగివర! యిది యిట్టిద భూతములును
నీవు నేనును సర్వగతావిశిష్ట
విధములము వేదితవ్యంబు విదితమయ్యె
నిట్టి సందర్శనము వ్రతమింక నాకు” (12-6-617)
నీవు, నేను ఈ ప్రాణికోటి, పంచభూతాలు అంతటా వ్యాపించి యే భేదము లేని వారము – అభిన్నులము. సమానులము. తెలిసికొనదగినది, తెలిసిపోయినది ఇదే. తత్వ్తదర్శనము – సర్వసమతా దృష్టి ఇక పైని నా వ్రతము. నీ దయవలన నేనే నిశ్చయానికి రాగలిగాను. నీకు నమస్కరించి సెలవు తీసుకొంటున్నాను.” అని పలికి వీడుకోలు తీసుకొన్నాడు.
ఈ పుణ్యకథ జనకుడి గృహములో భార్గవుడు నారదుడికి తెలిపాడు. నారదుడు ఇంద్రుడికి చెప్పాడు. అతడు వసువులకు, సకల భూతాల పట్ల సమభావాన్ని కలిగి ఉండాలని వసువులు నాకు చెప్పారని, పరమధర్మమేది అని ధర్మరాజు అడుగగా భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
సమస్త భూతాలను సమదృష్టితో చూడగలగడం, నిష్కామత్వం ఉత్తమ ధర్మం, ఉత్తమమైన ఆనందానికి నిలయం అన్నది ఈ కథ తెలుపుతుంది.
శాంతి పర్వం షష్ఠాశ్వాసము లోనిది.
A man who is aware
…..
He sees the path the lord trod
And grips the hand of god – Thornton wilder
What is necessary to change a person is to change his awareness of himself – Abraham Maslow.
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
