Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-8

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

21. సక్తుప్రస్థ చరిత్ర!

ర్మరాజు అత్యంత వైభవంగా నభూతో నభవిష్యతి అన్నట్లుగా అశ్వమేధ యాగం చేశాడు. ముల్లోకాలు ఆనందించాయి. అతడి మీద దేవతలు తేనెల సొనలు జాలువారే పూలవానలు కురిపించారు. ఇంతలో ఒక ముంగిస కన్నం నుండి బయటకి వచ్చింది. అక్కడ ఉన్న ముని సంఘం, బ్రాహ్మణ సమూహం మధ్య ఆ ముంగిస నిలిచి, “ఈ అశ్వమేధ యాగం వీసమంతా కూడా సక్తుప్రస్థుడి మహాధర్మమును పోలదు” అని పలికింది. ఆ మాటలకు సభలోని వారు ఆశ్చర్యపోయారు.

బ్రాహ్మణులు దానిని సూటిగా చూస్తూ, “ఈ యజ్ఞంలో మంత్ర పఠనం, కర్మకాండా నిర్వహణం, వివిధ దానకార్యాలు అనేక త్యాగాలు లోకాల చేత శ్లాఘించబడ్డాయి. ధర్మరాజు యొక్క భక్తిశ్రద్ధలు, వినయ విధేయతలు, ప్రేమాభిమానాలు సమస్త దేవమునుల చేత ప్రశంసించబడ్డాయి. అందరూ అభినందించారు. ఇక ఈ మహా యజ్ఞంలో నీకు కనిపించిన లోటు ఏమిటి? అని అడిగారు.

అపుడు ముంగిస వారితో “పూర్వం కురుక్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు. అతడు కోపతాపాలు, కోరికలు లేనివాడు. పొలాలలో రాలిన గింజలను ఏరుకొని జీవించే ఉంఛవృత్తి ఆధారంగా జీవించేవాడు. అతడికి భార్యా కొడుకు, కోడలు తోడుగా ఉన్నారు. తపస్సు అతడి సంపద. ఇలా ఉండగా ఒకసారి అనావృష్టి ఏర్పడి, కరువు వచ్చింది. వరి, గోధుమ పంటలు నాశనమయ్యాయి. తిండి దొరకలేదు. అతడి ఇల్లాలి కొడుకు, కోడలు నివ్వరి ధాన్యము (విత్తకుండా గడ్డి వంటి మొక్కల నుండి పుట్టిన ధాన్యం) ఏ కొంచెమో ఏరుకొని వచ్చేవారు. పాపం వారి ఆకలి తీరలేదు. ఒకనాడు వారు నలుగురూ ప్రొద్దున నుండి సాయంత్రం వరకు తృణ ధాన్యం వెదికి తెచ్చారు. అది నాలుగు మానికల పేలపిండి అయింది. నిత్య శాస్త్రోక్త కర్మలు చేసి ఆ కాస్తా పేలపిండిని తలొక మానెడు సమానంగా పంచుకొని తినడానికి సిద్ధపడ్డారు.

అపుడు ఒక బాటసారి అయిన బ్రాహ్మణుడు అతిథిగా అక్కడికి వచ్చాడు. వారు నలుగురూ పర్ణశాలలోకి అతడిని తీసుకొని వెళ్ళి, సకల మర్యాదలు చేసి, కుశల భాషణం జరిపారు. ఆపై ఆ మునిశ్రేష్ఠుడు తన వంతు పేల పిండిని బ్రాహ్మణునికి చూపి, “వినయశ్రేష్ఠా! ఈ పేలపిండి పాపం చేసి సంపాదించినది కాదు. దీనితో ఆకలి తీర్చుకొనుము” అన్నాడు. అతడు అది ఆరగించాడు. కానీ తృప్తి పొందలేదు. అతడిని ఎలా తృప్తి పరచాలి. అనుకుంటుండగా, ఆ బ్రాహ్మణుడి ఇల్లాలు “నా వంతు పేలపిండిని సమర్పిస్తాను. మీరు బ్రాహ్మణుడి ఆకలిని తీర్చండి” అన్నది. అపుడతడు, “నోరు లేని జంతువులు, పక్షులూ వెదికి తెచ్చిన పిండితో తమ భార్యలకు పెట్టుతున్నాయి. అటువంటప్పుడు నీవంతు ఆహారం నేనే తీసుకోవటం తగునా?

“స్త్రీ సంతోషించు తెఱం, గాసపడని మనసు గలుగు నట్టియధముఁ డి

చ్చో సడిగనుఁ జని యచ్చో, గాసింబడు జముని భటులు గాఱియపెట్టన్.”

(అశ్వమేధపర్వము, చతుర్థాశ్వాసము, 228)

“తన భార్య సంతోషించే తీరు కోరని నీచుడు ఈ లోకంలో అప్రతిష్ఠ పాలవుతాడు. నరక లోకంలో యముని భటులు హింసిస్తుంటే బాధపడతాడు” అని పలికాడు. అపుడు ఆ ధర్మపత్ని,

“పతియ చుట్టంబుఁ బక్కంబు బతియ చెలియుఁ

బతియ తల్లియుఁ దండ్రియుఁ బతియ గురువుఁ

బతియ దైవంబుఁ గావున నతనిపని యొ

నర్చుటయ చూవె ధర్మంబు నాతి కరయ.”

(అశ్వమేధపర్వము, చతుర్థాశ్వాసము, 230)

“భర్తయే స్త్రీకి చుట్టము, బంధువు, మిత్రుడు, తల్లి, తండ్రి, గురువు, దైవము కాబట్టి పతిపని చేయుటయే ధర్మము. అదీకాక నీవు ఆకలితో మాడుతుంటే నాకుట భాగమేమిటి? భాగాన్ని తీసుకోవటం పాపం కదా! ఈ విధంగా నేను తిండి తింటానా? నా వంతు పేలపిండిని బ్రాహ్మణుడికి ఇవ్వుము!” అని ముని పత్ని తనవంతు ఆహారాన్ని ఇచ్చింది. అది స్వీకరించాడు. అతిథి తిన్నాడు కాని తృప్తి పడలేదు.

అతడి స్థితిని చూచి బ్రాహ్మణుడు చింతించుచుండగా కుమారుడు, “తండ్రీ! ఈ పిండిచేత అతిథిని తృప్తి పరచుము. తండ్రి చేయదలచిన పనిని చేయటం కొడుకు ధర్మం” అన్నాడు. అపుడు కొడుకుతో “కొడుకు ఎంత పెద్దవాడైనా అతడు తండ్రికి బాలుడే. బాలురకు ఆకలి ఎక్కువ. కావున నీ ఆహారం తీసుకోవటం తగిన పని” అన్నాడు. “తండ్రీ! తండ్రియే కుమారుడు అని వేదం చెబుతుంది. నన్ను కాపాడటం నిన్ను కాపాడు కొనుటయే. దయచేసి ఈ పిండిని అతిథికి ఇచ్చి నన్ను కాపాడుము” అన్నాడు.

దానికి ఆ ముని సంతోషించి, అతిథికి ఇచ్చాడు. తిన్నాడు కానీ తృప్తి పడలేదు. మునిశ్రేష్ఠుడు మరలా విచారించాడు. అది కోడలు గమనించింది. “దీనిని సమర్పించండి” అని అన్నది. “అయ్యో తల్లీ! ఆకలి చేత నీ అవయవాలు సత్తువ లేక సడలి పోయాయి. నీ మనసు వ్యాకులత చెందింది. ఈ పేలపిండిని ఎలా తీసుకోను” అన్నది. అపుడు కోడలు “మీరు నా గురువునకే గురువులు. ప్రాణాలు గానీ, అవయవాలుగానే మహాత్ముల సేవకే అంకితం కదా!” అన్నది. కోడలికి భర్త గురువు. ఆ గురువు తండ్రి అయిన మునీశ్వరుడు గురువే కదా. గురువు అనగా తండ్రి. ఈవిధంగా అన్ని కోడలి మాటలకు బ్రాహ్మణుడు సంతోషించి పేలపిండిని అతిథికి ఇచ్చాడు. అపుడు అతడి శరీరం నందు తృప్తి, ముఖములో సంతోషము కనబడ్డాయి.

అతడు మునీశ్వరుడితో “నేను యముడిని, నిన్ను చూడటానికి వచ్చాను. నీ సదాచార ప్రకృతిని చూసి మెచ్చుకున్నాను” అని హృదయ పూర్వకంగా అన్నాడు. “దేవతలు, యక్షులు, సిద్దులు నీ దానం చూసి ఆశ్చర్యంతో ఆకాశంలో నీకేసి చూస్తున్నారు” అని యముడు అంటుండగా దేవదుందుభులు మ్రోగాయి, పూలవాన కురిసింది.

మరలా యముడు “మునిశ్రేష్ఠా! నిన్ను చూడాలని సప్తర్షులు ఆరాట పడుతున్నారు. సకుటుంబంగా స్వర్గానికి విచ్చేయము. పుణ్యాత్మా! ఆకలి బుద్ధినీ, తేజస్సునూ చంపుతుంది. దయను నాశనం చేస్తుంది. ఈ లోక తత్వం తెలిసి భార్య అనీ, బిడ్డ అనీ చూడకుండా ఆకలినీ ఆశను జయించావు. నీ అతిథి సేవా పుణ్యం చేత బ్రహ్మనే నిన్ను చూడాలనుకుంటున్నాడు. త్వరలో నీకై విమానం వస్తుంది. మరొక మాటను వినుము.

“వినుము ప్రభూత దానములు విశ్రుత యజ్ఞములున్ సధర్మతా

వినుతికి నెక్కజాలవు; వివేకనిధీ! పరిశుద్ధ శోభితా

ర్జనమునఁ దెచ్చికొన్నది వరంబగుఁ బాత్రము నర్హకాలముల

గని లఘువస్తునేని నొసఁగ గను టుజ్జ్వల ధర్మమారయన్.”

(అశ్వమేధపర్వము, చతుర్థాశ్వాసము, 246)

“అనేక దానాలు, ప్రఖ్యాత యజ్ఞాలు, ధర్మబద్ధమైన ప్రశంసకు తగినవి కావు. సన్మార్గములో సంపాదించి కూడబెట్టినదే శ్రేష్ఠం. యోగ్యుడైన వానికి తగిన సమయంలో అల్ప వస్తువైనా దానం చేయగలగటం ఉత్తమ ధర్మం” అని అంటూ తన నిజరూపాన్ని చూపాడు. ఇంతలో బంగారు విమానం వచ్చింది. “ధర్మ పరాయణా! బ్రహ్మ విమానాన్ని పంపాడు. నీ భార్య కొడుకులు, కోడలుతో సహా విమానం ఎక్కండి” అని చెబుతూ, మరలా ముంగిస,

“దానినంతా నేను చూస్తున్నాను. కన్నం నుండి వెలుపలికి రాగానే ఆ పేలపిండి సువాసన వ్యాపించి అతిథి కాళ్ళు కడిగిన నీటి తడి అంటుకొని సక్యు ప్రస్ధుడి ధర్మ మహిమ వలన నా తలా శరీరం ఒకవైపు బంగారం అయినది. ఆనాటి నుండి నేను దాన కార్యాలు జరిగే చోట్లకు, పవిత్రమైన మున్యాశ్రమాలకు, యజ్ఞవాటికలకు తిరుగుతూ ఉన్నాను. రెండవవైపు బంగారం అవుతుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఎన్నో చోట్లకు వెళ్ళినప్పటికీ అలా కాలేదు. లోకంలో గొప్ప అశ్వమేధం మహాత్ముడైనా, ధర్మాత్ముడైనా ధర్మరాజు చేస్తున్నాడని, ఇక్కడ నా కోరిక నెరవేరుతుందేమోనని ఆశతో వచ్చాను. కానీ నాకేమీ విశేషం కనబడలేదు. అందుచేత ఉంఛవృత్తితో బ్రతుకుతూ సాటిలేని దానం చేసిన సక్తుప్రస్థుడి ధర్మంతో ఈ యజ్ఞం సాటిరాదు” అని పలికి ముంగిస ‘పశుహింసా రూపమైన యజ్ఞం కంటే, అహింసా రూపమైన యజ్ఞం గొప్పద’ని తెలిపింది.

కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అపురూపమైన ప్రేమానురాగాలు ఒకరి పట్ల ఒకరికున్న బాధ్యతలు, ఒకరికి ఒకరు చేసుకొనే అపూర్వ త్యాగాలు ఈ కథను ఆసక్తిగా చేశాయి. వైభవోపేతమైన సంపన్నుడి యజ్ఞయాగాలు కంటే, త్యాగపూరితమైన నడవడికల సామాన్యుడి జీవనమే ఆదర్శప్రాయమనీ, అతిథి సేవ అత్యంత పవిత్రమైనదని తెలిపింది.

మా తాతగారు చేసిన అశ్వమేధములో విశేషాలేమిటి? అని జనమేజయుడు అడుగగా వైశంపాయనుడు చెప్పినది. అశ్వమేధ పర్వము చతుర్థాశ్వాసం లోనిది.

No sacrifice is worth, the name unless it is a joy. – Gandhi.

22. కుంతీ చరితము!

యాదవ వంశరాజు అయిన శూరుడు తన పెద్దకుమార్తె పృథను, పిల్లలు లేని తన మేనత్త కొడుకైన కుంతిభోజుడికి ప్రియంతో పుత్రికగా ఇచ్చాడు. ఆ సుకుమారి కుంతిభోజుడి ఇంట్లో ఉంటూ బ్రాహ్మణులకు, అతిథులకు అన్నదానాలు, పూజా సత్కారాలు చేస్తుండేది.

ఒకసారి దుర్వాసుడు ‘భోజనం పెట్ట’మని వచ్చాడు, కుంతి అతడికి అతిథి పూజా సత్కారాలు చేసి భోజనం పెట్టింది. దానికి దుర్వాసుడు తృప్తి చెందాడు. “ఆపద్ధర్మంగా ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం చేత నీవు ఏ దేవతలను ఆరాధిస్తావో, ఆ దేవతలు నీవు కోరిన కొడుకులనిస్తారు” అని పలికి దివ్య మంత్రమున ఉపదేశించి వెళ్ళిపోయాడు.

ఇక్కడ దుర్వాసుడు ఒక సూక్ష్మదృష్టితో మంత్రము ఉపదేశించాడు. ఆపద్ధర్మంగా అంటే గత్యంతరం లేకపోయినప్పుడు పాటించదగిన న్యాయం. భవిష్యత్తుల్లో పాండవోత్పత్తికి వినియోగపడాలని అతడి ఉద్దేశం. అయితే మంత్ర శక్తి పరీక్షార్థం కుంతి దానిని ఉపయోగించింది. తెలిసీ తెలియని వయసు కలవాడికి మంత్రశక్తి వస్తే ఏం జరుగుతుంది?

విషాదాంత నాయకులైన, తన ప్రమేయం లేకుండానే ఒక మహాభారత యుద్ధమునకు కారణమైన కర్ణుడి వంటి దురదృష్టవంతుడి పుట్టుకకు బీజం పడుతుంది అని తెలుస్తుంది.

దుర్వాసుడి నుండి మంత్రం గ్రహించిన కుంతీదేవి బాల్య చాపల్యంతో మంత్ర శక్తిని తెలుసుకోవాలని తలంచి, ఒక రోజు ఒంటరిగా గంగకు వెళ్ళి స్నానం చేసి, మంత్రాన్ని జపించి, సూర్యునికి అర్ఘ్యమును ఇచ్చి “ఆదిత్యా! నాకు నీవంటి కొడుకును ఇమ్ము” అని కోరింది. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. “నీవు కోరిన వరమివ్వడానికి వచ్చాను” అన్నాడు. సిగ్గుతో, ఆశ్చర్యంతో, భయంతో, తొట్రుపాటుతో కుంతి “ఒక బ్రహ్మజ్ఞాని దయతో నాకు మంత్రం ఉపదేశించగా దాని శక్తి తెలుసుకోవాలనే కోరికతో త్రిమూర్తి స్వరుపుడైన నిన్ను అజ్ఞానం చేత రప్పించిన నా తప్పును క్షమించుము.

‘ఎఱుకలేమిఁ జేసి యింతు లెప్పుడు నప | రాధయుతలు సాపరాధ లయిన

వారిఁ గరుణ నెల్లవారును రక్షింతు’ | రనుచు సూర్యునకు లతాంగి మ్రొక్కె. (1-5-22)

తెలివి లేక స్త్రీలు ఎప్పుడు తప్పులు చేస్తారు. తప్పులు చేసిన స్త్రీలను దయతో అంతా మన్నిస్తారు” అని కుంతి నమస్కరించింది

“నీకు దుర్వాసుడు ఇచ్చిన వరం గూర్చి, మంత్రశక్తిని గూర్చి నాకు తెలుసు. నా దర్శనం వృథా కాదు. నీ కోరిక నేరవేరుస్తాను!” అని సూర్యుడు పలుకగా

ఏను మంత్రశక్తి యెఱుఁగక కోరితిఁ | గన్య కిదియు కోరఁగాదు నాక;

నాకు గర్భమయిన నాతలిదండ్రులుఁ | జుట్టములును నన్నుఁ జూచి నగరె? (1-5-24)

“నేను మంత్ర శక్తి తెలియక, ఇది పెళ్ళికాని స్త్రీ కోరకూడదని తెలియక కోరాను. నాకు గర్భం వస్తే నన్ను చూచి తల్లిదండ్రులు, బంధువులు నవ్వరా?” అని కుంతి పలుకగా సూర్పుడు ఆమెపై దయ తలచి “నీకు సద్యోగర్భం వలన కొడుకు పుడతాడు. నీ కన్నెతనం చెడదు” అని వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావంతో కుంతికి సహజ కవచకుండలాలతో ప్రకాశిస్తూ కర్ణుడు పుట్టాడు. తరువాత సూర్యుడు వెళ్ళిపోయాడు.

ఇలాంటి సంబంధాలలో ఇలాంటి సందర్భంలో పురుషులు ఎప్పుడు సురక్షితం. అన్ని బరువులు మోయవలసింది; అన్ని పరువులు పోగొట్టుకోవలసినదీ స్త్రీలే. అది మహాభారతమైనా, ఆధునిక భారతమైనా.

ఆపై కుంతి ‘దుర్వాసుడు నాకెందుకీ మంత్రము నుపదేశించాడు? ఆ మంత్రాన్ని పరిక్షించాలని, ఎందుకు సూర్యుడిని స్మరించాను? ఆ సూర్యుడం నాకీ సద్యోగర్భాన్ని ఎందుకిచ్చాడు? ఈ పుత్రుడు నాకు ఎందుకు పుట్టాడు? ఇంక లోకాపవాదాన్ని ఏ విధంగా తప్పించుకుంటాను? ఇప్పటికే ఈ విషయం లోకానికి తెలిసిపోయి ఉండదా? ఈ బాలుడిని ఎత్తుకొని ఇంట్లోకి వెళితే నన్ను నా బంధువులు దూషిస్తారు. కాని ఈ పిల్లవాడిని వదిలి పెట్ట బుద్ధి కావడం లేదు’ అని కుంతి పరిపరివిధాల దుఃఖించింది.  డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడింది.

ఇలాంటి సందర్భాలలో సాధారణంగా పెళ్ళికాని యే తల్లియైనా చేసే విధంగానే ఆమె కూడా, ఆ పిల్లవాడిని విడిచి పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది.

దుఃఖిస్తూ ఆలోచిస్తున్న కుంతి వద్దకు అమూల్యమైన రత్నలతో బంగారంతో నిండి ఉన్న ఒక పేటిక నదీప్రవాహంతో పాటు కొట్టుకొని వచ్చింది. అది సూర్యుడు పంపినది. ఆమెకు పరిష్కారం దొరికినది. పెట్టెలో ఆ బిడ్డడిని పడుకోబెట్టి, నదీమతల్లికి అప్పచెప్పింది

వివాహ పూర్వ సందర్భాలలో జరిగే యిలాంటి ఘటనల్లో పుట్టేవారి జీవితాలు చిరునామాలు లేకుండానే ఉంటాయి. పుట్టినవారు అనాథలుగా, అభాగ్యులుగా, అతి దీనమైన జీవితాలు గడుపుతుంటారు. దొరికింది తింటూ, వీలున్న చోట ఉంటూ బ్రతుకు భారం కాగా ఛీత్కారాలతో, అవమానంతో క్రుంగిపోతూ బతుకీడుస్తుంటారు. కొండొకచో వీరి నుండి అసాంఘికశక్తులు పుట్టుకొస్తుంటారు. ఎప్పుడో ఒకప్పుడు బురదను చీల్చుకు వచ్చిన పద్మంలా మహాత్ములు వస్తుంటారు.

కాని సాధారణంగా వివాహపుర్వ కలయికలు, చబ్బబద్ధం కాని కలయికలు, వివాహేతర సంబంధ కలయికలు ఎప్పటికే ప్రమాదలు తెచ్చేవే. తప్పక విపరీతాలు సృష్టించేవే. విషాదాంతంగా మిగిలిపోయేవే.

తెలిసీ తెలియక మంత్రం పఠించి, సూర్యునికి దగ్గరై పిల్లవాడని కన్న కుంతి జీవితాంతం దుఃఖం మోసింది. తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియక పెరిగిన కర్ణుడు జీవితాంతం అడుగడుగునా అవమానాల పాలయ్యాడు. తల్లికి బరువైన వాడు, నేల తల్లికి బరువై రథ చక్రాలు నేలలో కూరుకుపోగా మరణించాడు. కుంతీదేవి చచ్చేవరకు బ్రతికినా, బ్రతికినంత కాలం చచ్చింది. ఇలాంటి కథలు ఇలాగే ఉంటాయి.

అందుకే ఇలాంటి దుస్థితి ఊహించే కాబోలు కన్య పిల్లలు తప్పు చేయరాదని, ఆధునిక ప్రపంచానికి సందేశమీయ దలచి వ్యాసులవారు కుంతి పాత్రను, కర్ణుని పాత్రను అలా సృష్టించారేమో.

పురాణేతిహాసాలు గ్రహించి, అవగాహన చేసుకునే సంస్కారాలు ఉంటే పెళ్ళి కాకుండా తల్లులు అయ్యే కుంతీదేవులు, అనాథలుగా పుట్టే కర్ణులు ఉండరు కదా. సరే నదీమతల్లి ఒడి నుండి, కుంతి చేత విడువబడిన బిడ్డడు రాధ అనే స్త్రీకి లభించాడు. రాధేయుడిగా, సూతపుత్రుడిగా ఎదిగాడు. బంగారంతో, రత్నంతో రావటం చేత ‘వసుషేణుడు’ అను పేరు కూడా పొందాడు. అతడే కర్ణుడు.

ఆదిపర్వము పంచమాశ్వాసం లోనిది ఈ కథ.

– The future destiny of a child is always the work of the mother. – Napoleon.

(ఇంకా ఉంది)

Exit mobile version