Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-9

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

23. కృపాచార్యుని కథ!

పూర్వం గౌతముడనే పేరతో ప్రసిద్ధుడైన ముని ఉండేవాడు. అతడికి పుట్టిన వాడు శరద్వంతుడు. బాణాల సమూహాలతో పుట్టాడు. వేదాలు చదవడానికి ఇష్టపడక, ధనుర్వేదాన్ని సాధించాడు. మహా నిష్ఠతో భయంకరమైన తపస్సు చేశాడు. దేవేంద్రుడు ఎప్పటిలాగే ఆ తపస్సుకు భయపడి ‘జలపద’ అనే యౌనవతిని పంపించాడు. ఆమె అతని దగ్గరికి వచ్చింది. ఆ కాంతను చూచి శరద్వంతుడు మన్మథ బాణాలచే పీడించబడి, మన్మథ రాగంలో మైమరిచాడు.

ఆ సమయంలో అతని చేతిలో ధనుర్బాణాలతో పాటలు వీర్యం కూడా జారిపడింది. అది తెలిసి, శరద్వంతుడు ఆశ్రమం విడిచి వెళ్ళి వేరొక చోట తపస్సు చేసుకొంటూ ఉన్నాడు. ఆయన వీర్యం ఒక రెల్లు గుంటలో రెండు భాగాలుగా పడింది. ఒక కొడుకూ, కూతురు పుట్టారు. తరువాత అక్కడికి శంతన మహారాజు వేటకై వచ్చాడు. రెల్లు పొదలో ఉన్న పిల్లలనూ, జింక చర్మాన్ని ధనుర్బాణాలను చూశాడు. వీరెవరో ధనుర్వేద పండితుడైన బ్రాహ్మణ సంతానమని తలచి, వారిని కృపతో తీసుకొని వెళ్ళాడు. వారే కృపాచార్యుడు, కృపిగా పెరిగారు.

పవిత్రుడైన శరద్వంతుడు వచ్చి, వారు తమ సంతానమని తెలిపి, కృపాచార్యుడికి ఉపనయన సంస్కారం చేశాడు. అదే విధంగా బ్రాహ్మణుల వద్ద కుమారుడిని వేదాలు చదివించాడు. ఆత్మజ్ఞానం కలవాడిగా చేశాడు. చదురంగబలాలతో సంబంధం ఉన్న ధనుర్వేదాన్ని, నానా విధ అస్త్రశస్త్ర నైపుణ్యాలను పెంపొందింప చేశాడు. భీష్ముడు కృపాచార్యుడిని కురుపాండవులకు గురువుగా నియమింపచేసాడు.

సవిశేషముగ ధనుర్వే | దవిశారదు లైరి కడు జితశ్రములై పాం

డవ ధృతరాష్ట్రాత్మజ యా | దవు లాదిగ రాజసుతులు తత్‌కృపుశిక్షన్‌ (1-5-192)

పాండవులు, కౌరవులు, యాదవులు మొదలైన రాజకుమారులు కృపుని శిక్షలో శ్రమను జయించి విలువిద్యలో గొప్ప పండితులయ్యారు.

అవును! గొప్పగురువు లభిస్తే, ఉత్తమ శిష్యులు పుట్టుకొని వస్తారు కదా.

ఆదిపర్వం పంచమాశ్వాసం లోనిది.

24. ద్రోణచార్యుల కథ!

పూర్వం భరధ్వాజుడు అనే ఒక ముని ఉండేవాడు. సచ్చరితుడు, త్రిలోక వందితుడు అయిన ఆ మహాముని గంగాతీర ప్రాంతం వద్ద తపస్సు చేస్తూ ఒకనాడు స్నానానికై గంగానదికి వెళ్ళాడు. ఎదురుగా విలాసంగా జలకాలాడుతూ, గాలి చేత చీర తొలగగా, స్వచ్ఛమైన కాంతితో హొయలు చిలికిస్తున్న ఘృతాచి అనే అస్సరసను చూశాడు. మన్మథుడు ప్రకోపించగా కామించాడు. ఆ క్షణంలో అతడికి వీర్య స్ఖలనం అయింది. ఆ వీర్యాన్ని తెచ్చి కలశంలో ఉంచాడు. బహుశా స్నానార్థమై వెళ్లిన ఆ ముని చేతి ద్రోణంలో సంగ్రహించి కలశంలో ఉంచి ఉండవచ్చు. ఆ కలశం  నుండి ధర్మతత్పరుడు, పుణ్యాత్ముడు అయిన ద్రోణుడు జన్మించాడు.

ఇది ఇలా ఉండగా భరధ్వాజుని మిత్రుడైన పాంచాల దేశపు రాజైన వృషతుడు భయంకరమైన తపస్సు చేశాడు. అతడికి వీర్య స్ఖలనం అయింది. దానిని పాదాలతో కప్పి వేశాడు. అందులో నుండి మరుత్తుని అంశంతో ద్రుపదుడు జన్మించాడు. వృషతుడు ఆ బాలుడిని భరధ్వాజాశ్రమంలో ఉంచి, పాంచాలరాజ్యం పాలిస్తూ ఉన్నాడు. ద్రుపదుడు, ద్రోణుడు కలిసి ధనుర్వేదం, సకల వేదాలు నేర్చుకున్నారు. అటుపై ద్రుపదుడు పాంచాల రాజు అయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుని వద్ద ఆగ్నేయాస్త్రం మొదలుగా గల అనేక దివ్యాస్త్రాలను పొందాడు. భరధ్వాజుని ఆజ్ఞ మేరకు కృపాచార్యుని చెల్లి అయిన కృపిని పెండ్లాడాడు. వారికి అశ్వత్థామ పుట్టినాడు.

పరశురాముడు బ్రాహ్మణులకు తృప్తి మేరగా ధనం పంచుతున్నాడని ఒకనాడు ద్రోణుడు విన్నాడు. ధనాపేక్షతో అతడి దగ్గరికి వెళ్ళినాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. అపుడు పరశురాముడు “ద్రోణా! ఉన్న ధనమంతా బ్రాహ్మణులకు పంచినాను. ఇక భూమిని కశ్యప మహర్షికి ఇచ్చినాను. ఇక అస్త్రశస్త్రాలు మిగిలి ఉన్నాయి. కావలసినవి తీసుకొనుము, తప్పక ఇస్తాను” అనగా ద్రోణుడు,

ధనములలో నత్యుత్తమ | ధనములు శస్త్రాస్త్రములు; ముదంబున వీనిం

గొని కృతకృత్యుఁడ నగుదును | జననుత! నా కొసఁగు మస్త్రశస్త్రచయంబుల్‌. (1-5-201)

“ధనాలలో మిక్కిలి మేలైనవి అస్త్రశస్త్రాలనే ధనాలు. వానిని స్వీకరిస్తాను. నాకిమ్ము” అని తెలిపి, దివ్యాస్త్రాలను వాటి ప్రయోగ మర్మాలను, మంత్రాలతో పాటుగా పొంది, విలువిద్యను అభ్యసించి, గురువుగారి దగ్గర సెలవు తీసుకోని వెళ్ళివాడు.

ఆపై ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. “మిత్రమా! నేను ద్రోణుడిని, నీ బాల్య మిత్యుడిని” అంటూ పలకరించాడు. రాజులు మత్తులు కదా. అంగబల, అర్థబల అహంకారముతో “మన ఇద్దరి మధ్య అంతరం తెలియకుండా మాట్లాడడం తగునా? అయినా బీద బ్రాహ్మణులకు, మహారాజులకు స్నేహం ఎట్లా కలుగుతుంది? నోరు మూసుకొని నా కోట దాటుము” అన్నాడు దృపదుడు. “అయ్యో! బ్రాహ్మణుడు ఎక్కడైనా చెలికాడు అవుతాడా? ధనవంతునితో దరిద్రుడికి, పండితునితో మూర్ఖుడికి, ప్రశాంతునితో క్రూరుడికి, వీరునితో పిరికివానికి, కవచరక్షణ కలవానితో రక్షాకవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఎలా కలుగుతుంది?” అన్నాడు.

ధనాపేక్షతో వచ్చిన ద్రోణుని ద్ర్రుపదుడు హేళన చేశాడు. ద్రుపదుడు తనను ధనపతిగా, తత్వవేత్తగా, ప్రశాంతునిగా, వీరునిగా, సజ్జనునిగా పేర్కొని ఆత్మప్రశంస చేసుకొంటూ, ద్రోణుడిని దరిద్రునిగా, మూర్ఖునిగా, క్రూరునిగా, దుర్మార్గునిగా నిందించాడు. ద్రోణుడి మనస్సు చివుక్కుమంది. అతడి మాటలు ద్రోణుడి మనసును పుండు చేశాయి.

ద్రుపదుడు అంతటితో ఆగక,

సమశీలశ్రుతయుతులకు | సమధనవంతులకు సమసుచారిత్రులకుం

దమలో సఖ్యమును వివా | హము నగుఁ గా; కగునె రెండు నసమానులకున్‌. (1-5-205)

“సమానమైన స్వభావం, విద్యకలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచి నడవడి కలవాళ్ళకు స్నేహం, వివాహం యేర్పడతాయి. కాని సమానులు కాని వాళ్ళకు ఏర్పడతాయా? కయ్యానికి వియ్యానికి సమజోడు కావాలి. అంతేకాదు. రాజులకు అవసరాలను బట్టి రాజులకు మిత్రత్వ శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. అందుచేత మావంటి రాజులకు మీ వంటి పేద బడుగు బ్రాహ్మణుడితో ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి స్నేహం ఏర్పడదు” అని తిరస్కరించి పంపివేశాడు.

ద్రోణుడు అవమాన భారంతో భార్యాపిల్లవాడితో, శిష్సులతో, అగ్నిహాత్రంతో హస్తినాపురం చేరుకున్నాడు. బంతి ఆటలో బంతి బావిలో పడగా, దిక్కు తోచక బిక్కముఖాలు వేసుకొని ఉన్న కురుబాలలను సమీపించి, తన ధనుర్విద్య ద్వారా బంతిని విచిత్రంగా బయటకి తీసి, తద్వారా భీష్ముడి కంటబడి, అతడి మెప్పును పొంది కౌరవ పాండవ బాలురకు గురువుగా నియమితుడయ్యాడు. కాలక్రమేణ హస్తినాపురంలో కౌరవ పాండవులకు పూజ్యనీయుమైన గురువుగా అవతరించాడు.

అధికార, ధన మదము స్నేహమును లెక్కించదని, ధనికుడి ముందు దీనుడైన పండితుడు అవమానించబడడంలో ఆశ్చర్యం లేదని, ఎంతటి వారలైనా అంతరాలు చూసుకోకుండా ముందుకు వెళితే అవమానాలు ఎదురవుతాయని ఈ కథ తెలుపుతుంది.

అయితే విద్యా సుగంధాలను, పాండిత్యకాంతులను గుర్తించక, ద్రుపదుడు అనాగరికంగా ద్రోణుడితో ప్రవర్తించినా భీష్ముడు గుర్తించాడు.

తన పిల్లవాడి ఆకలి తీర్చడానికి ఒక గోవును మిత్రుడైన ద్రుపదుని అడగడానికి వెళ్ళి ద్రోణుడు అవమానించబడడం మంచిదే అయింది.

లేదంటే అతడు భీష్ముడి వద్దకు వచ్చేవాడు కాదు. ద్రోణుడు వంటి ఉత్తమ గురువుకు అర్జునుడు వంటి శిష్యుడు లభించేవాడు కాదు. మహా భారత గాథలో అనేక మలుపులు తిప్పిన ఘట్టాలలో అతడు పాత్ర వహించే వాడు కాదు. ప్రపంచానికి గురుశిష్య సంబంధ ప్రత్యేకత తెలిసేది కాదు. జనమేజయుడు వైశంపాయనుడికి చెప్పినది.

ఆదిపర్వం పంచమాశ్వాసం లోనిది.

~

వరమసిధారా తరుతల వాసో వరమిహ భిక్షా వరముపవాసః।

వరమపి ఘోరే నరకే పతనం న చ ధన గర్విత బాంధవ శరణం॥ 

Better is the edge of a Sword, or to live under a banyan tree – better is to beg, to starve, or even to fall into the dreadful hell, than to depend on a purse-proud relation.

~

25. ఏకలవ్వుడి కథ!

ఇతిహాసంలో ఒక విద్యార్థి కన్నీటి గాథ. పుట్టుకయే కొలమానంగా ఒక విద్యా జిజ్ఞాసువును విద్యకు దూరం చేసిన, దుర్మార్గపు సామాజిక కట్టడికి సంబంధించిన కథ. పవిత్రమైన గురు-శిష్య సంబంధానికి మకిలి పట్టించిన కథ. కృషి, సంకల్పం ఉంటే పాఠశాలలు, గురువులు, విద్యాభ్యాసాలు లేకుండానే ఘనమైన విద్యలు పొందవచ్చని నిరూపించిన కథ.. ఏకలవ్య కథ. ఇది ఒక పార్శ్వం.

అయితే యే కాలంలోనైనా సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా వ్యవస్థలు అప్పటి వారు యేర్పరుచుకున్న; ఆ కాలపు వాళ్ళు, ఆ కాలపు ధర్మాన్ని అనుసరించి చేసుకున్న చట్టాలు, నియమ నిబంధనల ఆధారంగా నడుస్తాయి. అవి తరువాతి కాలములో తప్పుగా, దోషభూయిష్టంగా కనబడతాయి. ఆ కాలంలో ఆ నియమ నిబంధనలకు బలైన వారిని చూస్తే వ్యవస్థచే మోసగించబడిన వారిగా, వంచించబడిన వారిగా కనబడతారు. అలాంటి వారిలో ఏకలవ్యుడు ఒకడు. యోగ్యుడు అయినప్పటికీ, విద్యార్జనకై ఆ కాలానికి తగిన అర్హతలు లేవు. ఇది తప్పా? ఒప్పా? న్యాయమా? అన్యాయమా అన్నది వేరే విషయం. ఇది మరొక పార్శ్వం.

ఈ రోజుల్లో కూడా కొందరు యోగ్యులైన వారు విద్యాభ్యాసానికి దూరము అవుతున్నారు. తక్కువ యోగ్యత కలవారు, అర్హులైన వారు విద్యలు గడిస్తున్నారు. అందులో ఎవరైనా కడుపు మండి దొంగదారిలో విద్యాభ్యాసం చేస్తే, పట్టుబడితే వారి సర్టిఫికెట్లు, డిగ్రీలు వెనక్కు తీసుకోబడుతున్నాయి. అంటే వారి బొటన వ్రేలు కోసేసినట్లు.

ఇక కథలోకి వస్తే.. ద్రోణాచార్యుడు భీష్ముడి ఆజ్ఞ మేరకు కౌరవపాండవ కుమారులకు గురువు అయినాడు. తన కుమారుడైన అశ్వత్థామతో పాటుగా కురు పాండవ కుమారులకి విలువిద్యతో పాటు, గదా, ఈటె, కత్తి, తోమరం, కుంతం, శక్తి మొదలైన అనేక ఆయుధ విద్యలను నేర్పించసాగాడు. అర్జునుడు పట్టుదలగా అస్త్ర విద్య అభ్యసించి గురువు ప్రశంసలందుకున్నాడు. అర్జునుడికి గల గురుభక్తికి ద్రోణుడు సంతోషించి ప్రపంచంలో మేటి విలుకానిగా చేయ నిశ్చయించుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది.

హస్తీనాపురానికి దగ్గరలో ఒక చిన్న రాజ్యం. దానికి హిరణ్యధన్వుడు అనే ఎఱుక రాజు. అతని కొడుకు ఏకలవ్యుడు. ఒకనాడు ఏకలవ్యుడు ద్రోణుడి దగ్గరికి వచ్చి, “శిష్యునిగా చేర్చుకొనుము, విలువిద్యను నేర్పుము “ అన్నాడు. ఏకలవ్యుడు ఎఱుక వాని కుమారుడని, ఆనాటి సామాజిక నిబంధనలకు అతడికి విద్య నేర్పడం విరుద్ధమని శిష్యుడిగా స్వీకరించలేదు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణుడి అనుమతిని పొంది అడవికి వెళ్ళాడు.

వినయమున ద్రోణురూపు మన్నున నమర్చి | దాని కతిభక్తితోడఁ బ్రదక్షిణంబుఁ

జేసి మ్రొక్కుచు సంతతాభ్యాసశక్తి | నస్త్రవిద్యారహస్యంబు లర్థిఁ బడసె. (1-5-232)

వినయముతో ఏకలవ్యుడు ద్రోణుని మట్టి బొమ్మను చేసి, దానికి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఎడతెగని సాధన బలం చేత తానే విలువిద్యా రహస్యాలన్ని గ్రహించాడు. ఏకలవ్యుడు స్థిరభక్తి కలవాడు, గురుముఖతః విద్య నేర్చుకోకున్నా, భక్తి శ్రద్ధలతో అధిక విద్యను సంపాదించవచ్చునని, విద్యార్థనకు గురు సాన్నిధ్యం కంటే గురుభక్తియే ముఖ్యమని నిరూపించాడు. మేటి విలుకాడు అయ్యాడు. ఒకనాడు కౌరవపాండవులు ద్రోణుని అనుమతిని పొంది అడవికి వేటకై వెళ్ళారు. వారు వేటకుక్కలతో భటులతో వెళ్ళి అడవిలో తిరుగసాగారు. ఇలా తిరుగుతుండగా, ఒక వేటకుక్క పరుగెత్తి ఒక చోట ఒంటరిగా బాణాలు వేస్తున్న ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి మొరిగింది. అతడు ఏడు బాణాలను ఒక్కటిగా చాకచక్యంగా సంధించి దాని నోటిని కట్టి వేశాడు. అది కురుకుమారుల దగ్గరికి పరుగెత్తుకొని వచ్చింది. దానిని చూసి ఆశ్చర్యపడి, అలా కొట్టిన వారెవరా? అని ఆశ్చర్యపడుతూ, ఆ విలుకాడికై వెదుకుతుండగా ఒక చోటు నల్లని దేహంతో, జింక చర్మాన్ని ధరించి, పదునైన బాణాన్ని పట్టుకొని అస్త్రవిద్యలో లోటు లేని ఏకలవ్యుడిని చూశారు. వారిలో మాత్సర్యం పెరిగింది “నీవు ఎవరవు? ఎవరి వద్ద విద్య నేర్చుకున్నావు?” అని అడగారు. నేను ఎఱుకల వాడిని, హిరణ్యధన్వుని కుమారుడిని, ద్రోణుడి శిష్యుడిని. నా పేరు ఏకలవ్యుడు” అని బదులిచ్చాడు. వారంతా రాజ్యానికి తిరిగి వచ్చారు.

ఆపై అర్జునుడు ఏకాంతంగా ద్రోణుని కలిసి “విలువిద్యలో నీకంటే అధికులు లేనట్లుగా నేర్పుతానన్నావు. ఇపుడు నాకే కాదు. ఈ ముల్లోకాల కంటే అధికుడైన ఎఱుకను చూశాను” అన్నాడు. ఏకలవ్యుని విద్యా నైపుణ్యం అర్జునునికి ఆశ్చర్యం కలిగించింది, మాత్సర్యం కలిగించింది. పైగా ఏకలవ్యుడు నేను ద్రోణుని శిష్యుడిని అనటం, అర్జునుడికి విచార కారణమైనది. అందుకే చాలా జాగ్రత్తగా గురువును అలా అడిగాడు. ద్రోణుడు ఆశ్చర్యపడి, ‘చూద్దాం రమ్మ’ని అర్జునుడిని తీసుకొని వెళ్ళాడు. వారి రాకను తెలుసుకోని ఏకలవ్యుడు, మునికి ఎదురువచ్చి, పాద నమస్కారం చేసి, తన శరీరాన్ని మొత్తం సంపదను అర్పించి “నేను మీ శిష్యుడను. మిమ్మల్ని సేవించి, ఈ విద్య నేర్చుకున్నాడు” అన్నాడు. “అయితే నాకు గురుదక్షిణ ఇమ్ము” అన్నాడు ద్రోణుడు.

“ఇది నా దేహం. ఇది నా ధనం. ఇది నా సేవక సమూహం. వీటిలో మీకేది ఇష్టమో కోరుకోండి. ఇస్తాను. దీనికి తిరుగులేదు” అన్నాడు ఏకలవ్యుడు. అలా తనకు ఉన్నదంతా సమర్పించి, అత్యున్నత గురుభక్తిని చాటుకోగా ద్రోణుడు, “బాణాలు వేయడంలో ఉపయోగించబడే నీ కుడి చేతి బొటన వ్రేలును నాకు గురు దక్షిణగా ఇమ్ము” అన్నాడు.

ఏకలవ్యుడు వినయంతో ద్రోణుడు అడిగిన కుడిచేతి బొటన వ్రేలును ఇచ్చాడు. అలా చేయడం ద్వారా బాణాన్ని కూర్చటంలో నేర్చు లోపించి ఏకలవ్యుడు విలువిద్యా సంపద కోల్పోయాడు. అర్జునుడు సంతోషించాడు. “విలువిద్యలో ఇతరులు నీకంటే అధికులు కాకుండా నీకు నేర్పుతాను” అన్న ద్రోణుడు – అర్జునుడికి ఇచ్చిన మాటను నిజం చేశాడు.

మరియు గురుపులు జిజ్ఞాసువులైన విద్యాప్రియులైన విద్యార్థుల పట్ల ప్రేమను కలిగి ఉంటారని అన్న మాటను అబద్ధం చేశాడు.

ఆదిపర్వం పంచమాశ్వాసంలోనిది.

~

(ఇంకా ఉంది)

Exit mobile version