Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ సీతారామ కథాసుధ-8

[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]


~
మధ్యాక్కర
ఆ త్రిశంకుని స్వర్గగమన యజ్ఞమునకు రామి మౌని
పుత్రుల నూర్గుర చంపి పూర్ణపాపాశయుడైతి
పుత్రకులార ఆ మౌని పూర్వుడు కుపితుడు కాడు
క్షాత్రము శమము లేకున్న సర్వము మృత్యు తాండవమె. (71)

ఉ.
భావుకరీతి లేవెలుగు బాటల నొంటిగ పోవుచుంటి చి
త్తావధి నొక్క యచ్చర ఫలాత్తరసాలము నందు డిగ్గినన్‌
జీవన మోహమందితిని జేరిన చేరితి దేహదాసుడన్‌
భావజుడే జయించె నను వత్సరముల్‌ పది యేగె స్వప్నముల్‌. (72)

తే.గీ.
ఏటి తపము కామోత్సవమే జయించె
నన్ను నేనయి కోల్పోయినాను నిజము
గరిత మేనక స్వర్గమార్గమున నడిచె
వెర్రినయి జారిపోయితి వికలమతిని. (73)

తే.గీ.
ఎంత వేదనతో సంచలించినానొ
దేహభావము వీడని తీరు వలన
మరల తపమాచరింపగ తరలినాను
కాననములు కాననములు కాననములు. (74)

తే.గీ.
అదియు కొంతకాలము సాగె నంతలోన
ఒక్క సాంధ్యకాలమున నియుక్తి లేక
మనసులో రంభ కన్పించె మరల కలత
చెంద క్రోధము కలిగిన దంతలోన. (75)

తే.గీ.
ఆమె శిలయైన యట్లు నా కవగతమ్ము
కాగ ఇదియు కోరిక కదా? ఏల తపము?
ఏల ధ్యానము? కోరికలే మనమ్ము
నాక్రమించును ఫలమేమి? అనుచు తోచె. (76)

తే.గీ.
ఆ విధాతయే బ్రహ్మర్షివనుచు జెప్పె
ఆ వశిష్ఠుడే బ్రహ్మర్షివనుచు జెప్పె
ఏల ఈ బిరుదములు నా కిందు వలన
కలదె విశ్వమయస్థితి? కాంచలేను. (77)

కం.
ఈ కోపము లీ కోర్కెలు
లేకుండగ తపము జపము లేకుండగ ఆ
లోకింపగ ప్రభుశరణము
నాకిక దిక్కనుచు మనసునన్‌ నిశ్చితుడై. (78)

తే.గీ.
ఎడద శూన్యము చేసి భావించి విష్ణు
పదము చేరంగ నిష్క్రియాపరుడ నైతి
తుదకు శాంతము సిద్ధించె దురితదూర!
ఇపుడు నీవె లభించితి వెంత సుఖమొ. (79)

వచనము
ఇట్లు తన తపస్సాధన విశేషములను చెప్పుచున్న విశ్వామిత్రుని జూచి కించిదాశ్చర్య సంక్షోభ విస్మయభావ సమ్మిళిత చిత్తములతో రామలక్ష్మణులు భావన చేయుచుండ తరచి ఆలోచించుచుండ విశ్వామిత్రుడు ఒక నవ్వు నవ్వి వారితో ఇట్లనియె. మిథిలాపుర ప్రభువైన జనక మహారాజు తాను చేయుచున్న ఒక యజ్ఞమునకు రమ్మని మనను ఆహ్వానించినాడు. మనము ఆ రాజర్షిని దర్శించుటకు ఆ మహాయజ్ఞఫలమును పొందుటకు ఆ నగరమున కేగుచున్నాము. దారిలో గౌతమాశ్రమమును కూడ చూడవచ్చును. మిథిలలో శివ ధనుస్సును దర్శించ వచ్చును అని మిథిలా నగరము వైపునకు పయనమైన. (80)

(సశేషం)

Exit mobile version