Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ ఆలయ దర్శనం

[ఇటీవల ఖమ్మం లోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ ఆలయం దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

మ్మం లోని శ్రీ చందాల కేశవదాసు కళాపరిషత్ వారు పద్యగాన పోటీలను నిర్వహిస్తూ, నన్ను ఒక న్యాయనిర్ణేతగా ఆహ్వానించారు. సంస్థ కార్యదర్శి శ్రీ సుబ్బరాజు గారు నా మిత్రులు. సభ చివర చందాల కేశవ దాసుగారి గురించి ప్రసంగించవలసిందిగా, సంస్థ అధ్యక్షులు జగన్మోహనరావుగారు కోరారు.

ఖమ్మం దగ్గరే కదా, అదే రోజు ఉదయాన్నే బయలుదేరుదామనుకున్నాను. కానీ అలా వద్దని, నాకు రూము బుక్ చేశామని ముందురోజు రాత్రి ఖమ్మం చేరుకొమ్మని వారి సూచన. 22 జూన్ సాయంత్రం 4 గంటలకు మా యింటి దగ్గర 290 నం. సిటీ బస్సెక్కి హయత్ నగర్ బస్టాండు చేరుకున్నాను. రాజధాని ఎ.సిలు, సూపర్ లక్సరీలు వస్తున్నాయి. అన్నీ ఫుల్. వీకెండ్ కారణమయి ఉండొచ్చు. సరే, సూర్యాపేట వరకు వెళితే అక్కడ ఖమ్మం బస్సును పట్టుకోవచ్చు అనిపించింది. ఇంగ్లీషు ‘క్యాచ్’ అన్నక్రియను తెలుగులోనికి అనువదిస్తే అలా ఉంటుందిమరి. కానీ, విజయవాడ బస్సులు ‘అతని కంటే ఘనులు!’. అంటే ఖమ్మం బస్సుల కంటే రష్‌గా ఉన్నాయి. కిం కర్తవ్యతావిమాఢుడినై ఆలోచించు చుండ, అందంగా, తెల్లగా మెరిసిపోతూ ఒక బుల్లి బస్సు వచ్చింది. అసంకల్పితంగా చేయి ఎత్తాను. ఆపాడు. అది భద్రాచలం పేపర్ బోర్డ్ వారి స్టాఫ్ బస్సు. “ఎక్కడికి సార్?” అని అడిగి, నా గమ్యం తెలుసుకొని, ఎక్కమన్నాడు చోదక సహాయకుడు. ఆ బస్సు సూర్యాపేట, ఖమ్మం మీదుగా భద్రాచలం వెళుతూంది. మూడు వందలు అడిగితే ఇచ్చాను. సీట్లు చాలా సుఖంగా ఉన్నాయి (ప్రయోగం తప్పనిపిస్తూంది కదూ! ఈ సారికి పోనిద్దురూ!). టు-సీటర్ నేనొక్కణ్ణే! “ఔను లే! ఔను లే! ఈ సుఖమే సుఖమూ!” అని ఈలపాట రఘురామయ్యగారి పాట పాడుకుంటూ కూర్చున్నా. వాయు వేగ, మనో వేగాలంటారు చూడండి, అంత స్పీడు! ‘దారిలోనే రామైక్యం చెందించడుకదా!’ అని భయం బొడవె. దారిలో ఒక్క పది నిమిషాలు నకిరేకల్ వద్ద ఆపాడు. అక్కడ నా యిష్టసఖులున్నాయి. అవేనండీ, మిర్చి బజ్జీలు! వేడిగా వేస్తున్నాడు. రెండు తిని టీ తాగాను. కేవలం 3 గంటల్లో ఖమ్మం చేరింది బుల్లెట్ బస్సు. కాని ఖమ్మం ఇంకా 4 కి.మీ. ఉండగా, గేరు రాడ్ పట్టేసింది! కాసేపు దానితో కుస్తీపట్టారు. అప్పుడు రాత్రి 8 కావస్తోంది. బస్సులు కేవలం ఏడెనిమిది మంది కంటే లేము. వాళ్ళ సంస్కారం ఎంత మంచిదంటే, మూడు ఆటోలను ఆపి, మమ్మల్ని ఎక్కించారు. ఆటోవాళ్లకు డబ్బు కూడా ఇచ్చారు.

నేను పాత బస్టాండ్ దగ్గర అరుణ్ లాడ్జ్‌కి వెళ్లాలని ఆటో అబ్బాయితో చెప్పాను. సరిగ్గా అక్కడ దింపాడు. గుడ్ బాయ్! ఆ లాడ్జ్ చిన్నది. క్రింద రిసెప్షన్. పైన ఒకటే ఫ్లోర్. పది రూములు. లిఫ్ట్ ఒక్క ఫ్లోర్‌కెలా ఉంటుంది? నాక్కూడా ఒక్క ఫ్లోర్ ఎక్కడానికి ఇబ్బంది లేదు. రెండు ఫ్లోర్ల వరకు ఓకే. తర్వాత మోకాళ్లు మొరాయిస్తాయి. రూం నాట్ బ్యాడ్. ఎసి ఉంది. స్నానం చేసి, క్రిందికి వెళ్లాను. ఆ రోడ్డు ఇరుకు. సుమారు పది పన్నెండు టిఫిన్ బండ్లున్నాయి. అన్నింటిలో ఇడ్లీ, దోసె మాత్రం ఉన్నాయి. ఒక బండి మీద పొగలు కక్కే నాలుగు ఇడ్లీలు, కొబ్బరి, టమోటొ చట్నీలు, కారంపొడితో తిన్నాను. మనసు ఇక చాలంటూంది. కాని జిహ్వ దాని మాట వినదు. ‘దోసె తినమని’ మారాం చేయసాగింది. పాపం దాని మాట కూడా వినాలి కదా! ఆనియన్ దోసె కూడా చాలా బాగుంది. ఇంతా చేసి మొత్తం నలభై రూపాయలే! చీప్ అండ్ టేస్టీ!

రాత్రి హాయిగా పడుకొని ఉదయం 6 గంటలకు లేచాను. శర్కరరహిత ఫిల్టర్ కాఫీ తెప్పించుకొని తాగాను. సుబ్బరాజు గారి ఫోన్. “సార్, శుభోదయం. పోగ్రాం పది గంటలకు. కాని ఐ.ఎస్.టి. ప్రకారం 11 అవుతుంది. ఖమ్మం పట్టణంలోని ఒక గుట్టమీద నరసింహస్వామివారు ఒక గుహలో స్వయంభువుగా వెలిశారు. వెళ్లి దర్శనం చేసుకొని రండి ఈలోగా” అన్నాడు.

“తమ్ముడూ! సుమారు ఎన్ని మెట్లుండవచ్చు?” అనడిగాను. ‘వందో నూటయాభయ్యో అయితే ఓ.కె’ అనుకోన్నా మనసులో.

“మెట్లు ఎన్నున్నాయో తెలియదుగాని, వెహికల్ పైన గుడి వరకు వెళుతుంది సార్. చక్కని ఘాట్ రోడ్ ఉంది” అన్నాడు సుబ్బరాజు.

‘తండ్రీ! నరసింహ! కరుణించావా? వస్తున్నా! వస్తున్నా!’ అని స్వామితో చెప్పాను. ఏడున్నరకు ఆటో ఎక్కాను. దర్శనం చేసుకుని వచ్చేంత వరకూ వెయిట్ చేయాలని, తర్వాత నన్ను భక్త రామదాసు కళాక్షేత్రం దగ్గర డ్రాప్ చేయాలని చెప్పాను.

“150 రూపాయలివ్వండి బాబాయ్” అన్నాడు. తెలంగాణ అయినా కృష్ణాజిల్లా ప్రభావం భాషలో, తిండిలో, మేనర్స్‌లో కనబడుతుంది. పునుగులు, పెసరట్టుప్మా, ఎట్సెట్రా.

20 నిమిషాలలో ఘాట్ రోడ్ ఎక్కడం ప్రారంభించింది ఆటో. ముందు రోజు వర్షం పడింది. చల్లగా ఉంది. కాని ఉక్కపోత! స్వామివారి పేరు స్తంభాద్రి లక్ష్మీనరసింహుడు. త్రేతాయుగం నాడే స్వామి అక్కడ వెలిశారని ఐతిహ్యం. స్తంభం అన్న ప్రకృతి నుండి కంబం అన్న వికృతి వచ్చి అదీ ఖమ్మంగా మారిందని ప్రతీతి. ప్రకాశం జిల్లాలో ‘కంభం’ అన్న పట్టణం ఉందండోయ్! ఆ ఊరి చెరువు చా..లా పెద్దది. మా కర్నూలు జిల్లాలో ఎవరైనా అతిగా తింటే, ‘వాడిది కడుపా, కంభం చెరువా?’ అని అంటారు హస్యంగా.

స్వామివారు యథాప్రకారం గుహ లోనే ఉద్భవించారు. నేనెక్కడికి వెళ్లినా ఆయన నన్ను వదలడు. నేనెలాగూ ఆయన్ను వదలననుకోండి. ‘త్వమేవాహం న సంశయః’. గుహ మీద విశాలమైన బండరాయి. దాని మీద గాలిగోపురం కట్టారు. ముందు విశాలమైన కారు పార్కింగ్. ఘాట్ రోడ్ వెంట నాలుగడుగుల ఎత్తున్న ప్యారాపెట్ వాల్.

అక్కడి నుంచి చూస్తే ఖమ్మం నగరం విశాలంగా విస్తరించి కనబడింది. చుట్టూ పచ్చని చెట్లు. అక్కడక్కడ ఉన్న బండలకు తెల్లని చారలు వేశారు.

అర్చన టికెట్టు 30/- రూపాయలు. ఆదివారం కాబట్టి జనం బాగానే ఉన్నారు. క్యూ లైన్లో ముందుకు సాగాను. దారిలో ఏకశిలా సంభవ ఆంజనేయ స్వామి పార్శ్వముఖుడై దర్శనమిచ్చాడు. ముఖమంటపమంతా పురాతన రాతిస్తంభాలతో అలరారుతూన్నది. అవి పెద్ద కళాత్మకంగా లేవుగానీ ఏదో తెలియని ఒక పవిత్ర ప్రభావం వాటి ‘antiquity’ వల్ల నాకు కలిగింది. గర్భాలయం లోకి ప్రవేశించాను.

అహోబిలం లోని గుహ కంటే విశాలంగా ఉంది స్తంభాద్రి గుహ. గుహ గోడకు స్వామివారు స్వయంభువులై సింహరూపంతో ప్రకాశిస్తున్నారు. క్యూ మెల్లగా కదులుతూంది. నాలో భక్త్యుద్వేగం మొదలయింది. కంటినిండా నీరు. గద్గద స్వరంతో స్వామివారిని ఇలా ప్రార్థించాను.

“వందేహం ఘోర ఘోర ప్రబలతర
మహా గండ భేరుండ సింహా, వ్యాఘ్రాశ్వక్రీడ,
శాఖామృగ, వరఖగ రాడ్భల్లూ కాద్యష్ట వక్రమ్
ద్వాత్రింశత్కోటి బాహుం, హలముసల గదా శంఖ
చక్రాదిహేతీ ర్భిభ్రాణం, భామ దంష్ట్రం, శరభ
ఖగ గఖాన్ భక్షయంతం నృసింహమ్”

అర్చక స్వామికి అర్చన టికెట్టు అందించాను. పక్కన గుహ భాగంలో మూడడుగుల నల్లని స్వామి విగ్రహం సర్వాలంకారశోభితమై ఉంది. కొంచెం ఇటుగా ఉత్సవమూర్తులు వేంచేసి ఉన్నారు. నా గోత్రనామాలనడిగి, చక్కగా స్వామివారి నామాలను సుస్వరంగా ఉచ్చరిస్తూ అర్చన చేశాడాయన. ఆయనతో బాటు నేనూ పలికాను. నాకవి కంఠతః వచ్చు. రకరకాల పూలు, తులసి దళాలతో అరనసాగింది.

చివరగా స్వామివారికి మంగళహారతి ఇచ్చాడు స్వామి. నేను స్వామివారి మంగళాశాసనం లోని ఒక భాగాన్ని చెప్పాను.

“జగజ్జన్మాది లీలాయ జగదానందహేతవే
జగచ్ఛక్షుర్నివా సాయ శ్రీ నృసింహాయ మంగళమ్
హిరణ్యస్తంభ సంభూతి ప్రఖ్యాత పరమాత్మనే
ప్రహ్లాదార్తి ముషే ఖ్వాలా నరసింహాయ మంగళమ్”

హారతి వెలుగులో నరసింహుడు జాజ్వల్యమానుడైనాడు. తీర్థం, శఠగోపస్పర్శ, ప్రసాదం స్వీకరించి, మహదానంద తరంగిత హృదయంతో వెలుపలికి వచ్చాను. ధన్యోస్మి నృసింహా పరబ్రహ్మ! బయట ముఖమంటపంలో ఒక యాగానికి ఉపక్రమిస్తున్నారు ఋత్విక్కులు.

మహామహిమాన్వితంబైన నారసింహ సుదర్శన హోమమని తెలుసుకున్నాను. కాసేపు అక్కడ కూర్చునాను. హోమగుండానికి ఎదురుగ్గానే స్వామివారి శేషవాహనం ఉంది. ఇత్తడితో చేయబడి ఏడు శిరస్సులతో కళాత్మకంగా ఉంది. దానిపైన ఒక చిన్న మంటపం ఉంది. గర్భ గుహ ముందు గరుత్మాన్ ముకుళిత హస్తుడై నిలిచి ఉన్నాడు. ఆయన వెనుక నృసింహ మూలమంత్రాన్ని ఒక గ్లాస్‍ఫ్రేమ్‍లో పెద్ద అక్షరాలతో రాసి పెట్టారు.

“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రమ్, మృత్యుమృత్యుం నమామ్యహం”

32 బీజాక్షరాలు గల అత్యంత ప్రభావాన్వితమైన మంత్రమది. దానిని నిత్యం జపిస్తే నృకేసరి కటాక్షం లభించి సకల శుభావాప్తి అవుతుంది. ఇంకో మంటపంలో స్వామివారికి సన్నాయి సేవ జరుగుతూ ఉంది. ఆ విద్వాంసుడు అత్యంత ప్రతిభా సంపన్నుడు. వెళ్లి అక్కడ కాసేపు కూర్చున్నాను. కొంచెం విన్న వెంటనే నాకు ఆ కీర్తన ఏదో అవగతమయింది. అది అన్నమాచార్యుల వారు రాసిన నృసింహ కీర్తన. మధ్యమావతి రాగం. ఆది తాళం. మృదంగ విద్వాంసుడు చక్కగా అనుసరిస్తున్నాడు.

“వేదములే నీ నివాసమట విమల నారసింహా
నాదప్రియ, సకల ఒక పతి నమోనమో నరసింహ”

భక్తి తరంగాలు దేవాలయమంతా వ్యాపించాయి. నాదప్రియుడైన హరిని వారు తనియింప చేశారు. వారిరువురినీ అభినందించాను.

గుడి బయటకి వచ్చాను. అప్పుడి ఒక కొత్త కారుకు పూజ చేసి, ఒక శిలావితర్దిక మీద కూర్చున్న స్వామి దగ్గరకు వెళ్ళి నమస్కరించాను.

“స్వామీ! ఈ స్థలపురాణమును గురించి తెలుసుకోవాలని ఉంది. దయచేసి చెప్పండి” అని అభ్యర్థించాను.

“మంచిది నాయనా!” అన్నారాయన. నిరంతర నృసింహసన్నిధానవవర్తనుడైన ఆ అర్చకుని వదనం శాంత గంభీరమై ఉంది.

అర్ధ నిమీలిత నేత్రుడై ఆయన ఇలా చెప్పారు – ముందుగా స్వామిని ఇలా స్తుతించారు.

“ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరమ్
భవాబ్ధి తరుణోపాయం శంఖచక్రధరం పరమ్”

“స్తంభాద్రి లక్ష్మీనారసింహాప్రభువు ప్రహ్లాదుని రక్షించేందుకు ఒక స్తంభం లోంచి బయటకు వచ్చిన ప్రదేశం ఇదేనని ఐతిహ్యం. గుట్ట మీద ఒక పురాతన స్తంభం ఉంది. దీనిని స్తంభాద్రి, స్తంభ శిఖరి, కంభంమెట్టు అని అంటారు. దీనిని నరసింహగుట్ట అని కూడా అంటారు. పూర్వము మౌద్గల మహర్షి ఈ స్తంభాద్రి ప్రాంతంలో హరిని గూర్చి తపస్సు చేయగా, స్వామి లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చాడట. ముని కోరిక మీరు ఇక్కటి గుహలో కొలువు తీరాడట.

ఖమ్మం కోట నిర్మాణ సమయంలో కాకతీయ చక్రవర్తి స్వామివారికి ఆలయం నిర్మించారని చరిత్ర. అసలు ఈ కొండ మొత్తం ఒక స్తంభాకారంలో ఉంటుంది. హరిభట్టు అనే ఖమ్మం ప్రాంత కవి తన వరాహ పురాణం ఈ క్షేత్రాన్ని మనోహరంగా వర్ణించాడు.

మంటపంలోని స్తంభాలన్నీ కొండలను తొలిచి చేసినవే. రాతితో నిర్మించిన ఏకశిలాధ్వజస్తంభం అపూర్వం. ఇంకో విశేషం, స్వామివారు దక్షిణాభిముఖులై దర్శనమిస్తారు. గర్భగృహం పక్కనే లక్ష్మీ దీవి ఒక ఉపాలయంలో కొలువుదీరారు” అన్నారు.

“అవును స్వామి! అమ్మవారిని దర్శించుకొన్నాను.” అన్నాను.

“ధ్వజస్తంభం పక్కనే ఆంజనేయ స్వామి, గుట్టపై సుబ్రహ్మణ్యులవారు, శ్రీ వెంకటేశ్వరుడు ఉపాలయాలలో కొలువు తీరి ఉన్నారు. వర్షాకాలంలో నీరు గుహలో ప్రవేశించి, స్వామివారి నాభి వరకు వస్తుంది. ఇంకో విశేషం ఇక్కడ షిరిడీ సాయిబాబా విగ్రహం నల్లరాతితో చెక్కారు. ఇలా ఎక్కడా ఉండదు. ధ్వజస్తంభంపై ఒక పక్షిరూపం చిత్రించబడి ఉంటుంది. మరో పక్క చేపరూపం. కొండ రెండుగా చీలినట్లున్నప్రాంతంలో కోనేరు ఉంది. అన్ని వేళలా దానిలో నీళ్లుంటాయి. కొన్నిసార్లు ఆ కోనేటి నీరు అంతర్గత మార్గాల ద్వారా గుహలో ప్రవేశించి స్వామివారి పాదాలను తడుపుతుంది. కొండ మీద అడవిలో సర్పాకారంలో ఉన్న ఎన్నో శిలలు దర్శనమిస్తాయి. మీరు మెట్ల మార్గం ద్వారా వస్తే ఈ పర్వత శోభను బాగా గమనించవచ్చు” అని ముగించారు అర్చకస్వామి.

ఆయనకు పాదాభివందనం చేసి 50 రూపాయలు దక్షిణ ఇచ్చాను. ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహత్మ్యము’ అన్న పద్యప్రబంధాన్ని రాస్తున్నానని సవినయంగా ఆయనకు చెప్పాను. ఆయన సంతోషించి, నా కావ్యంలోని రెండు పద్యాలను వినిపించమని కోరారు.

సీ:
నారసింహుని నిద్రనాదరించెడు గుహ
పాతాళమట్టుల పాముల బస
జ్యోతి చక్రము బోలి శోభిల్లు తేజము
ఆత్మయోగుల కెపుడు నాటపట్టు
సకలధర్మంబులకు తాను పరమధర్మ
మెట్టి భయముల కాశ్రయ మీని వీడు
సకలశృతిశాస్త్ర సుపురాణ సంస్తుతంబు
సాధుజనులకు శరణమౌ శౌరి యిల్లు
తే.గీ.:
తెలియు గమ్యంబు జ్ఞాన జితేంద్రియులకును
ప్రళయ క్లేశంబు జేరని ప్రాపు; మిగుల
విస్మయంబుల నెలవైన విష్ణు నిలయ
మట్లు సుభగత్వ యోగ్యంబునై వెలుంగు
ఆ.వె.:
సురలకైనను ఘన యోగివరులకైన
దేవ దేవుని మహిమంబు దెలియ వశమె?
తనదు మహిమంబు విష్ణుండు తానె యెఱుగు
ఎఱుగనన్యుల కది సాధ్య మెపుడు గాదు

అర్చక స్వామి “నాయనా, నీవు ధన్యుడవు. స్తంభాద్రి నారసింహ కరుణా కటాక్షసిద్ధిరస్తు” అని నన్ను ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదం పులిహోర రెండు పాకెట్లు తీసుకోని తిన్నాను. అదీ నా బ్రేక్‌ఫాస్ట్.

ఆటోలో భక్తరామదాసు కళాక్షేత్రానికి సరిగ్గా పది గంటలకు చేరుకున్నాను.

Exit mobile version