Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీహరి నవవిధ భక్తి

[ఆచార్య డాక్టర్ వడ్లకొండ సుధాకర రావు గారు రచించిన ‘శ్రీహరి నవవిధ భక్తి’ అనే పద్య కవితలను అందిస్తున్నాము.]

౧.⁠ ⁠శ్రవణ భక్తి — పరిక్షిత్తు మహారాజు:
హరికథామృతంబును చెవులార గైకొని,
హరినామ గుణలీలలాలించి వినుచు,
మరణంబు ముంగిటను మాధవుని స్మరించు
మహితాత్ముడై నిలిచె పరిక్షిత్తు భూప!
శుకముఖమున జాలువారె శుభభాగవత సుధ
చెవియొగ్గి సేవించి చిత్తంబు నింపి,
శ్రవణభక్తి సుధాసారమున్ చవిచూచి
భవబంధములు విడిచి హరిపదంబు చేరె.

౨.⁠ ⁠కీర్తన భక్తి — శ్రీశుక మహర్షి:
నారాయణ నామంబు నాదంబు చేసుకొని,
నారాయణ చరితంబు నానాజనులకు,
భక్తిరసామృతంబు భువనంబు నిండగా
భావంబుతో బోధించె భాగవతమును;
శుకముఖమునుండి జాలువారిన మాధురి
శ్రోతల హృదయముల సుధగా పరివహించె;
హరినామ కీర్తనామహిమను జగతికి
చూపిన మునివరుడు శుకుడై వెలసె.

౩.⁠ ⁠స్మరణ భక్తి — ప్రహ్లాదుడు:
తండ్రి క్రోధాగ్నిలో దహింపబడుచున్నను,
దావానలమధ్యను దగ్ధుడగుచున్నను,
గజకరంబున గాని గిరిశిఖరమున గాని,
విషధరముల నడుమన వెరువక నిలిచి,
“నారాయణ! నారాయణ!” యని నామస్మరణ
మానక చిత్తమున మాధవున్ నిలిపె;
బాలుడై యుండియు భక్తిపరాకాష్ఠయై
ప్రహ్లాదుడు హరిని ప్రత్యక్షము చేసె.

౪.⁠ ⁠పాదసేవన భక్తి — శ్రీమహాలక్ష్మి:
కమలవాసినియై కరుణారసపూర్ణయై,
కమలనాభుని చరణకమలములందు
నిత్యసేవాపరాయణురాలై నిలిచి,
చరణారవిందముల చింతనే సొమ్ముగా,
శ్రీవత్సవక్షసున శ్రీహరిని సేవించు
శ్రీదేవి భక్తికి శిరోమణియై వెలసె;
హరిపాదసేవయే పరమపదమని
లోకమునకు లక్ష్మి లోకమాత తెలుపె.

౫.⁠ ⁠అర్చన భక్తి — పృథు మహారాజు:
పుష్పంబులర్పించి పరిమళంబు చల్లి,
ధూపదీప నైవేద్య ధారలతోడ,
వేదోక్త విధిచేత విశ్వేశ్వరునర్చించి,
విశ్వంబునే విష్ణుమయంబుగ జూచి,
ప్రజల పాలనయందు ధర్మంబు పాటించి,
పూజాపరాయణుడై పుణ్యంబు గడించి,
అర్చనభక్తి మహిమకు ఆదర్శమై
పృథు నరపతి హరిపాదములు చేరె.

౬.⁠ ⁠వందన భక్తి — అక్రూరుడు:
మధురకు రథమున మాధవుని చేరుచు,
మార్గమున హరిరూప మదిలోన జూచి,
యమునాతీరమున యోగదృష్టి పొందగా
యదువీరుల దివ్యరూపములు గాంచె;
భక్తిపులకిత గాత్రుడై భువిపై పడిపోయి,
బాష్పజలంబులతో పాదములు కడిగి,
కరములు జోడించి కృష్ణుని వందించె —
అక్రూరుని భక్తికి అంతులే లేవు.

౭.⁠ ⁠దాస్య భక్తి — ఆంజనేయుడు:
రఘుకులతిలకుని సేవయే జీవనమై,
రామచంద్రుని కార్యంబు రమణీయ వ్రతమై,
సీతమ్మ జాడకై సింధువును దాటి,
లంకాపురంబును లంఘించి దహించి,
రామాజ్ఞయే శిరసావహించి నడచిన
రామదూతుడై వెలసె రణధీర హనుమ;
“దాసుడనే భావమే దైవసంపద” యని
దాస్యభక్తికి దర్పణమై నిలిచె.

౮.⁠ ⁠సఖ్య భక్తి — పార్థుడు:
పాండవకులతిలకుడై పార్థుడనై,
పార్థసారథియైన పరమాత్మతోడ
సఖ్యమున్ పొంది సౌహార్దంబు నిలిపి,
సంకటకాలమందు సర్వేశుని చేరి,
“నీవే గతి” యని నిగూఢభావముతో
నారాయణుని నమ్మి నడచె ధనుర్ధరుడు;
సఖ్యభక్తి సౌభాగ్యసారమున్ గ్రహించి
కృష్ణసఖుడై కీర్తిని గాంచె పార్థ.

౯.⁠ ⁠ఆత్మనివేదన భక్తి — బలి చక్రవర్తి:
వామనవటువై వచ్చిన వాసుదేవునికి
మూడు అడుగుల నేల ముచ్చటగా ఇచ్చి,
ఒక అడుగుతో భూమి, రెండవదితో గగనం
నిండగా నిలిచె నిఖిలాండకోటి;
“మూడవ అడుగెక్కడ?” మని మాధవుడడుగగా,
మదము విడిచి మహాబలి మస్తకమర్పించి,
తనదైనదంతయు తన్నుతానే సమర్పించి,
ఆత్మనివేదనకు ఆదర్శమై నిలిచె.

నవవిధ భక్తి మంగళము:
శ్రవణమున పరిక్షిత్తు, కీర్తనమున శుకుడు,
స్మరణమున ప్రహ్లాదుడు, పాదసేవ లక్ష్మి,
అర్చనమున పృథువు, వందనమున అక్రూరుడు,
దాస్యమున హనుమంతుడు, సఖ్యమున పార్థుడు,
ఆత్మనివేదనమున బలిచక్రవర్తి —
భక్తిమార్గముల తొమ్మిదింటి భాస్కరులై,
భవతాపముల బాపి భక్తుల పాలిట
భగవంతుని పాదపద్మములు చూపిరి.

శ్రవణ కీర్తన స్మరణాదులతోడను,
చరణసేవార్చన వందనాదులతోడను,
దాస్యసఖ్యాత్మనివేదనల మార్గములందు
నడచు జనులకు నారాయణుడే గతి;
భక్తియొక్క బీజంబు హృదయమున నాటిన
భాగ్యవంతుని హృదయమే భద్రాద్రియగును;
భక్తి పుష్పములు పూయగా భావఫలములు కాయగా
భవబంధములు తొలగి హరిపదంబు దొరుకున్!

శ్రీకృష్ణార్పణమస్తు!!

Exit mobile version