[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]
[బడిలో ఇంగ్లీషు, లెక్కలు, తెలుగు వంటివి బాగా నేర్చుకుంటాడు వైనతేయ. సార్లు, మేడమ్ వాడిని అభిమానించేవారు. హరికథ కోర్సుకు జరిగిన ప్రాక్టికల్స్ పరీక్షలో వైనతేయకు ‘గజేంద్రమోక్షం’ అనే అంశాన్ని ఇస్తారు. క్లాసులో సింహాచల శాస్త్రిగారు, ఇంట్లో సదాశివ శాస్త్రిగారు వాడికి తగిన శిక్షణ ఇవ్వగా, వైనతేయ దానిని చక్కగా ప్రదర్శించి గురువున మెప్పు పొందుతాడు. హరికథ సర్టిఫికెట్ కోర్సు పూర్తయి, ‘ఎ’ గ్రేడ్ వస్తుంది. సదాశివశర్మగారు వైనతేయకి నాయక లక్షణాలు, నాయికా లక్షణాలు వివరించి, వాడి సందేహాలు తీరుస్తారు. ఒకరోజున మహతి ఆడిటోరియంలో వేదుల హనుమాయమ్మ భాగవతారిణి గారి హరికథా ప్రదర్శన జరుగుతుంది. సదాశివశర్మగారు, వకుళమ్మతో కలిసి రిక్షాలో వెళ్తాడు. హారికథని ఆస్వాదిస్తాడు. అందులోని మెళకువలను గుర్తించమని చెప్తారు సదాశివశర్మ. పబ్లిక్ పరీక్షలు బాగా రాసి, మంచి మార్కులతో పాసవుతాడు వైనతేయ. తిరుపతిని వీడాల్సిన సమయం వస్తుంది. శర్మగారు వాడికి రెండు జతల బట్టలు కొనిస్తారు. వకుళమ్మ స్వీట్లు చేసిస్తుంది. ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించిన ‘నవరసతరంగిణి’ అనే కావ్యాన్ని శర్మగారు వైనతేయకి కానుకగా ఇచ్చి, దానిని శ్రద్ధగా అధ్యయనం చేయమని చెప్తారు. ఓ రోజు దస్తగిరిసారు తిరుపతికి వచ్చి, అందరికీ వీడ్కోలు చెప్పి, వైనతేయను తీసుకుని ప్యాపిలికి చేరుతారు. అక్కడ్నించి తన ఇంటికి వెళ్తాడు వైనతేయ. అక్కకు పెళ్ళి కుదురుతుంది. వైనతేయ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాడు. సెలవలు పూర్తవుతాయి. దస్తగిరిసారుకు జలదుర్గం నుంచి బేతంచెర్ల హైస్కూలుకు బదిలీ అవుతుంది. కోనేటయ్యకూ, తిరుపాలమ్మకూ చెప్పి, వైనతేయని తనతో పాటు తీసుకువెళ్ళి అక్కడ హైస్కూల్లో చదివిస్తానంటాడాయన. కూతురు పెళ్ళికి పెదరెడ్డి డబ్బిచ్చినాడనీ, కానీ తమ పొలం తనఖా పెట్టుకున్నాడని కోనేటయ్య సారుకు చెప్తాడు. భవిష్యత్తులో ఆ భూమి విలువ చాలా పెరుగుతుందని, తొందరపడి పెదరెడ్డికి రాసిచ్చేయద్దని సారు వాళ్ళకు చెప్తాడు. – ఇక చదవండి.]
బేతంచెర్ల, డోన్ – నంద్యాల రైలుమార్గంలో, కర్నూలు – బనగానిపల్లె బస్సు మార్గంలో ఉంటుంది. ఒక మోస్తరు టౌన్ అనే చెప్పవచ్చు. ఇళ్లల్లో ఫ్లోరింగ్‌కు పనికివచ్చే స్లాబ్స్, వాటి పాలిషింగ్ పరిశ్రమలకు అ ఊరు ప్రసిద్ధి. స్లాబ్స్‌ని స్థానిక భాషలో ‘నాప బండలు’ అంటారు. ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలు. వాటి క్రింద అపారమైన ఈ నాప బండల గనులు ఉన్నాయి. వాటిని డైనమైట్లతో పేల్చి, తవ్వి, పలకలు, పలకలుగా చేస్తారు. కొంచెం, అంటే, రెండంగుళాల మందం ఉండేవాటిని గోడలు కట్టడానికి కూడ వాడతారు.
బేతంచెర్ల, బనగానిపల్లె, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాలు ఇవే కనబడతాయి. మొత్తం గోడను సిమెంట్ ప్లాస్టరింగ్ చేయాల్సిన పని లేదు, ఇటుక గోడలను చేసినట్లు. గోడ కూడ ఇటుక గోడ కంటే బలంగా ఉంటుంది. బండల మధ్య’గార’ అనీ సున్నం, బంక మట్టి కలిపిన మిశ్రమాన్ని బండలు అతుక్కునేందుకు వాడతారు.
ఇక మందం తక్కువ, అంటే కేవలం అంగుళం మందం ఉన్న పలకలను (slabs), పాలిషింగ్ యూనిట్లలో నున్నగా తళతళలాడేలా చేస్తారు. అవి నల్లగా మెరుస్తాయి. అలాంటి పాలిషింగ్ యూనిట్స్ బేతంచెర్ల, రంగాపురం, సిమెంట్ నగర్ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి. గనులతో, స్లాబ్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లలో వేల మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉంటారు.
పాలిష్ చేసి, ఫ్లోరింగ్‌గా పరచడానికి అనువైన స్లాబ్స్‌ను చదరపు డుగు ఇంత చొప్పన అమ్ముతారు వ్యాపారులు. బేతంచెర్ల రైల్వే స్టేషన్ల నుండి వ్యాగన్లలో, గుంటూరు, విజయవాడ, బెంగుళూరు, హైదరాబాదు, బళ్లారి, రాయచూరు లాంటి నగరాలకు ఎగుమతి చేస్తారు. పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లల్లో సైతం, బేతంచెర్ల స్లాబ్స్ నేల మీద పరిపించుకునేవారు. అప్పటికి ఇంకా ‘టైల్స్’ రాలేదు.
దస్తగిరిసారుకు శేషారెడ్డి నగర్ కాలనీలో బాడుగకు యిల్లు దొరికింది. బేతంచెర్ల శేషారెడ్డి మహాదాత అని పేరు పొందాడు. ఊరి నడిబొడ్డున ఐదెకరాల స్థలాన్ని ఆయన విరాళంగా ఇచ్చి, ఒక స్కూలు నెలకొల్పారు. అది ఎయిడెడ్ స్కూలు. దానికి ఆయన పేరే పెట్టారు.
దస్తగిరి సారు పని చేసేది జిల్లా పరిషత్ హైస్కూలులో.. అది కర్నూలు రోడ్లో ఊరి బయట ఉంది. కర్నూలు – కడప హైవే బేతంచెర్లకు కేవలం 28 కి.మీ ఉంటుంది.
వైనతేయను హైస్కూలులో చేర్పించాడు దస్తగిరిసారు, ఎనిమిదవ తరగతిలో. మామూలుగా అయితే, ఎలిమెంటరీ స్కూలు టీచర్లు సెకండరీ గ్రేడ్ క్యాడర్ అయినా, వారిని హైస్కూలుకు బదిలీ చేయరు. అప్పర్ ప్రయిమరీ స్కూలుకు, మహా అయితే, వేస్తారు. కానీ, ఇప్పుడు సారును, డెప్యుటేషన్ మీద, బేతంచెర్ల జడ్.పి.హైస్కూలుకు వేశారు.
ఆయన ఆరు, ఏడు తరగతులకు మాత్రమే వెళ్ళాలి. వైనతీయకు ఈ స్కూలు బాగా నచ్చింది. ‘యు’ షేప్‌లో ఉండే పెద్ద భవనం. ప్రతి తరగతికి రెండు సెక్షన్లున్నాయి. కొందరు టీచర్లు కర్నూలు నుంచి, కొందరు నంద్యాల నుంచి తిరుగుతారు. కొందరు బేతంచర్ల లోనే కాపురం ఉంటారు.
మొదటినుంచీ, వైనతేయకు తెలుగుతో బాటు, ఇంగ్లీషంటే కూడా ఇష్టమే. వాళ్ల ఇంగ్లీషు సార్ పేరు బుగ్గన రాకా సుధాకరరెడ్డి. ఆయన ఇంగ్లీషులో ఎమ్.ఎ. కూడా ప్రయివేటుగా చదివినాడు.
ఆరోజు ఇంగ్లీష్ క్లాసు జరుగుతుంది. ఆయనను పిల్లలు ‘రాకాసారు’ అంటారు. నాన్ డిటెయిల్డ్ టెక్స్ట్ అని ‘కాబూలీవాలా’ అనే పాఠం చెబుతున్నాడు సారు. అది రవీంద్రనాథ్ టాగోర్ వ్రాసిన బెంగాలీ కథకు ఆంగ్లానువాదం. సార్ ఇలా చెప్పాడు.
“ఈ కథను టాగోర్ 1892లో రాశారు. సాధన అన్న పత్రికలో ఇది ప్రచురించబడింది. ‘అనుబంధాలకు, ఆప్యాయతలకు దేశకాలాలనే అవధులు ఉండవు’ అని విశ్వకవి నిరూపించారు. డ్రైఫ్రూట్స్ అమ్ముకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఒక కాబూలీవాలా, ‘మినీ’ అన్నఐదేళ్ల పాపతో అనుబంధం పెంచుకుంటాడు. అంతే వయసు గల అతని కుమార్తె వాండ్ల దేశంలో ఉంటుంది. ఈ పాపలో తన కూతుర్ని చూసుకుంటాడు. కాబూలీవాలా పేరు రహమత్. పాప అతనితో స్నేహం చేస్తుంది. ఏదో గొడవలో ఇరుక్కుని, అతడు జైలుకు వెళ్లి తిరిగివచ్చేసరి కి, పాప పెద్దదయి ఉంటుంది. అతన్ని గుర్తుపట్టదు. పైగా అప్పుడామె పెళ్లి జరుగుతూ ఉంటుంది. చూశారా పిల్లలూ, ప్రేమ, అభిమానాలే మానవ జీవితాలకు ప్రాణం.”
వైనతేయకు సదాశివశర్మగారు ఒకసారి చెప్పిన ‘భావస్థిరాణి జననాంతర సౌహృదాని’ అన్న మాట గుర్తొచ్చింది. లేచి చెప్పాడు “సార్. దీనినే కాళిదాసు మహాకవి కూడ చెప్పారు” అన్నాడు. రాకా సారు ఆశ్చర్యపోయారు. “వెరీ గుడ్” అన్నారు.
“దీన్ని బట్టి, నీకేం అర్థమయిందిరా?” అని అడిగారు వాడిని.
“ఏ భాషలోనైనా మహాకవులు చెప్పేది విశ్వజనీనంగా ఉంటుంది అని” అన్నాడు.
వాడి భాష, ఉచ్చారణ, సారుకు అచ్చెరువు కలిగించాయి. కాబూలీవాలా, మినీల అనుబంధాన్ని గురించి ఎస్సే తయారు చేసుకోని రండని, తాను కరెక్షన్స్ చేస్తానని అన్నాడు.
స్టాఫ్ రూంలో తన తోటి టీచర్లతో వైనతేయ గురించి చెప్పాడు. మస్తానయ్య అనీ సోషల్ స్టడీస్ టీచరు ఇలా అన్నాడు
“వాడు చాలా తెలివైన వాడు. మన సెకెండరీ గ్రేడ్ దస్తగిరి సారింట్ల ఉంటాడు. హరికథలు చెబుతాడట. తిరుపతిలో హరికథ కోర్సు చదివాడట.”
తెలుగుసారు మల్లికార్జునప్ప అన్నాడు.
“అవును. తెలుగు పద్యాన్ని, రాగయుక్తంగా, శ్రావ్యంగా చదవగలడా పిల్లవాడు”
***
ఆ రోజు రాత్రి భోజనాలయిన తర్వాత దస్తగిరి సారుకు కాళ్లుపడుతూ కాబూలీవాలా కథ గురించి చెప్పాడు వైనతేయ. అతనితో పాపకు ఏర్పడిన అనుబంధం గురించి వ్యాసం 300 పదాలలో రాసుకురమ్మని సారు చెప్పాడని, తాను తయారు చేసినానని అన్నాడు.
“ఏదీ తీసుకొని రాపో, చూద్దాము” అన్నాడు సారు.
రఫ్ నోటు బుక్కులో తాను రాసిన వ్యాసాన్ని తెచ్చి చూపించాడు వాడు. గ్రామర్ తప్పులున్నాయి కొన్ని. కాని వ్యాసం కాబూలీవాలా మన కళ్ల ముందు కనిపించేలా రాశాడు.
సార్ అన్నాడు “దీనినే నీవు అభినయించి చూపించు.”
కాబూలీవాలా బైటికి కరుకుగా కనిపించినా, అతని మెత్తని హృదయాన్ని. తన పాపను మినీలో చూసుకోన్న వైనాన్ని, జైలు నుంచి వచ్చాక అతని మానసిక స్థితిని చక్కగా వర్ణించాడు వైనతేయ. దాదాపు ఏడెనిమిది నిమిషాలు పట్టింది.
“బాగుందిరా! ఇలాగే క్లాసుల్లో నీవు విన్న పాఠాలను హావభావాలతో వివరిస్తూండు” అన్నాడు సారు. వ్యాసంలోని చిన్నచిన్న వ్యాకరణ, స్పెల్లింగ్ దోషాలను సరిదిద్ది ఇచ్చాడు.
“సరేగాని ఇంగ్లీషు సారును ‘రాకా సారు’ అంటారు కదా! దాని అర్థం తెలుసా?”
“తెలియదు సార్.”
“సంస్కృతంలో ‘రాకా’ అంటే పున్నమ. రాకాసుధాకర అంటే పున్నమి చంద్రుడు. తెలిసిందా?”
వైనతేయకు తమ సారుది ప్రత్యేకమైన పేరని అర్థమై, సంతోషించాడు.
మర్నాడు రాకాసారు వ్యాసాలను పరిశీలించాడు. వైనతేయ వ్యాసం ఆయనను ఆకర్షించింది. తప్పులంతగా లేనే లేవు.
“నీవే రాసినావారా?” అనడిగితే
తానే రాసినానని, మా ‘దస్తగిరి సారు’ దిద్దినాడనీ చెప్పినాడు. వ్యాసం మళ్లీ చదివాడు రాకాసారు. అది వ్యాసంలా కాకుండా, ఒక నాటకంలోని సన్నివేశంలా ఉంది.
సారు దాన్ని పిల్లలతో చదివి వినిపించాడు.
వైనతేయ భయంభయంగా సారుకి చెప్పాడు. “సార్. మా సారు నన్ను ఈ అనుబంధాన్ని అభినయించమంటే, నిన్న చేసినాను.”
రాకాసారు చకితుడైనాడు. “నిజమా? ఏదీ ఇప్పడు మళ్లీ చేయి” అన్నాడు
వైనతేయకు తన గురువుల దయవల్ల సభాకంపం (స్టేజ్ ఫియర్) లేదు. కాబూలీవాలా క్యారెక్టర్‌ను వాడు హావభావాలతో వివరిస్తూంటే, సారు, పిల్లలు మైమరచి చూశారు.
దస్తగిరి సారు చెప్పినట్లు, పాఠ్యాంశాలనే తనదైన రీతిలో అభినయించి చూపడం ప్రాక్టీసు చేయసాగాడు.
ఇది ఇంగ్లీషు, తెలుగు, కొంతవరకు సోషియల్ స్టడీస్ లోని హిస్టరీ వరకు కుదురుతుంది. సైన్సు, లెక్కలు దీనికి పనికి రావు.
ప్యాపిలి మాదిరి కాకుండా, బేతంచెర్లలో మునిసిపాలిటీ వారి మంచినీళ్ల కుళాయిలున్నాయి. వీధికొకటి ఉంటాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకు వదులుతారు. ఒక గంట మాత్రమే. వాడుకనీళ్లుకు మాత్రం బోరింగులే.
కాశింబీకి ఒంట్లో బాగుండడం లేదు. కర్నూలు పెద్దాసుపత్రిలో చూపించారు. ఆమెకు గర్భసంచి తీసివేయాలని, పెద్ద డాక్టరు మనోహర రెడ్డి చెప్పాడు. ఆపరేషన్ తర్వాత ఆమెకు నాలుగైదు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు.
అల్లుడు వచ్చి కూతుర్ని దిగబెట్టి వెళ్లాడు. ఆమె కొన్ని రోజులు తల్లికి సేవ చేసింది. కానీ తన సంసారం వదిలి ఎన్నాళ్లుంటుంది పాపం! ఆమెకు ఐదేళ్ల చంటి పిల్లవాడున్నాడు. జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది.
దస్తగిరిసారు నెల రోజులు హాఫ్ పే లీవ్ పెట్టాడు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సంవత్సరానికి ఇరవై రోజులు మెడికల్ లీవు ఉంటుంది. వాడకపోయినా అది క్రెడిట్ అవుతుంది. అప్పుడు ఇరవై రోజులకు సగం జీతం వస్తుంది. కానీ దానికి రెట్టింపు క్లెయిం చేస్తే పూర్తి జీతం వస్తుంది. దస్తగిరి సారుకో రెండు నెలల కమ్యూటెడ్ లీవ్ డెబిట్ అయింది. అందువల్ల ఆ నెల రోజులకు పూర్తి జీతం వచ్చింది.
వైనతేయ తొమ్మిదో తరగతికి వచ్చాడు. యానాదుల దిబ్బ నుంచి వాళ్లమ్మను పిలిపిద్దామన్నాడు సారుతో. సారు ఒప్పుకోలేదు.
కాశింబీని మంచం దిగనివ్వకుండా గురుశిష్యులు ఇంట్లో పనులన్సీ చేసుకోపోసాగారు. అంట్లు తోమడం, ఇల్లు కసువు ఊడ్చటం, బట్టలు తకడం, నీళ్లు తేవడం, సమస్తమూ వైనతేయ చేసేవాడు. సారు వంటపని చేసేవాడు.
ఒకసారి దస్తగిరిసారుకు జ్యరం వచ్చింది. వైరల్ ఫీవర్ అని బేతంచెర్ల డాక్టరు, రామగిరి చెప్పాడు. మందులు రాసిచ్చాడు. పది రోజులు క్యాజుయల్ లీవ్ పెట్టాడు సారు.
అన్నీ తానై, గురువును, గురుపత్నిని కంటికి రెప్పలా చూసుకున్నాడు వైనతేయ.
కాశింబీ కన్నీళ్లతో, వాడిని దగ్గరకు తీసుకుని అంది.
“ఒరేయ్ నాయనా, ఏ జన్మలో రుణం రా ఇది? నాకు కొడుకులు లేని లోటు తీరుస్తాండావు గదరా!”
“మా సారు, నీవు, నాకు చేసిన దాని ముందర, నేను చేసేది ఏ పాటి అమ్మా!” అన్నాడు వాడు.
వాడికి వంట చేయడం కూడా బాగా వచ్చు. పొద్దున్నే ఇద్దరికీ కాఫీ కాచి ఇచ్చేవాడు. ఉగ్గాణి, ఉప్మా, లాంటివి చేసేవాడు. పప్పు, కూర, చారు అవలీలగా చేసేవాడు.
నాలుగు నెలలతో కాశింబీ కోలుకుంది. ఒకసారి కోనేటయ్య, తిరుపాలమ్మ వచ్చి నాలుగు రోజులుండి చూసి పోయినారు. రమణమ్మకు పాప పుట్టింది. దాని పేరు రోహిణి. దానికి సంవత్సరంన్నర.
వైనతీయ టెంత్ కొచ్చాడు. పబ్లిక్ పరీక్షలు కాబట్టి కష్టపడుతున్నాడు. రాకాసారు దగ్గరికి, లెక్కల సారు దేవదానం గారి దగ్గరికి సాయంత్రం ట్యూషన్‌కు వెళ్ళేవాడు. వారు వీడి దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకోనేవారు కాదు.
ఒకరోజు తెలుగుసారు మల్లికార్జునప్ప, పద్య భాగంలోని ‘రుక్మిణీకల్యాణం’ పాఠం చెప్పారు. అగ్నిద్యోతనుడనీ బ్రాహ్మణోత్తముని రుక్మిణీ దేవి శ్రీకృష్ణుని వద్దకు పంపడం; ఆమె సందేశాన్ని ఆయన పరమాత్మకు అందించడం, గౌరీ దేవి ఆలయంలో పూజకు వచ్చిన రుక్మిణిని శ్రీ కృష్ణుడు తన రథములో ఎక్కించుకొనిపోయి రాక్షస వివాహము చేసుకోవడం.. ఇదీ కథ.
అందులోని పద్యాలన్నీ మకరందాలు, అన్నీ నేర్చుకొన్నాడు వైనతేయ. తానే వాటికి రాగాలు కూర్చాడు.
‘ఆ యెలనాగ నీకు తగు..’ కల్యాణిలో; ‘ఘనుడా భూసురుడేగెనో..’ మోహనలో; ‘తగునీ చక్ర విదర్భ రాజసుతకున్’ తోడిలో; ‘వచ్చెద విదర్భ భూమికి..’ బిలహరిలో; ‘పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులన్ వధించి..’ మాల్కోస్‍లో ట్యూన్ చేశాడు.
ఆ పద్యాలను క్లాసులో తెలుగుసారు వాడితో పాడించేవాడు. వాడు పాడుతూంటే పక్క క్లాసు లోని పిల్లలు కిటికీ దగ్గరికొచ్చి వినేవారు.
ఇంగ్లీషులో నాన్ డిటెయిల్ టెక్స్ట్, ఛార్లెస్ డికెన్స్ వ్రాసిన ‘ఆలివర్ ట్విస్ట్’ ఉండేది. టెంత్ పిల్లల కోసం దాన్ని సులభ భాషలో కుదించారు (abridged). ఒక అనాథ పిల్లవాడు తన జీవితంలో పడిన కష్టాలను, హృదయాలను కరిగించే విధంగా వర్ణించాడు డికెన్స్. అందులో పన్నెండు ఛాప్టర్లు ఉండేవి. వైనతేయకు ఆ కథ హృదయానికి హత్తుకుంది.
డికెన్స్, ఈ నవలను ‘బాజ్’ అనే కలం పేరుతో రాశాడని ఇంగ్లీషు సారు చెప్పాడు. లండన్ నగరం లోని అధోజగత్‌ను ఆయన ఆవిష్కరించిన తీరు అనన్యసామాన్యం. పేదరికం నేరస్థులను ఎలా తయారు చేస్తుందో చూపించాడాయన.
అనాథ పిల్లలను చేరదీసి వాళ్లను జేబుదొంగలుగా తయారు చేస్తుంటాడు విలన్ (ఫాగిన్) నాన్సీ అన్న వ్యభిచారిణి ‘ఆలివర్’ను ఆదరిస్తుంది. ఆమెను చంపేస్తారు.
సమాజం లోని దుర్భర పరిస్థితులను చిత్రీకరించి, ఎందరివో మన్ననలను, విమర్శలను సైతం అందుకున్నాడు డికెన్స్.
ఆ రోజు హిందీ క్లాసు జరుగుతుండగా, అటెండరు మద్దిలేటి ఒక సర్క్యులర్ తెచ్చాడు. హిందీసారు రత్నకుమార్ దానిని పిల్లలకు చదివి వినిపించాడు.
“ఈనెల 22 న, ప్రీఫైనల్ పరీక్షలకు ముందు, పాఠశాల వార్షికోత్సవం జరుపుకుంటాము. దాని కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆసక్తిగల పిల్లలు తమ పేర్లను డ్రిల్లు సారు శ్రీ సత్రాజిత్తుగారికి రేపు సాయంత్రం లోపు ఇవ్వగలరు”
కొందరు పిల్లలు పాట, డిబేట్, మిమిక్రీ, ఏకపాత్రాభినయం, డాన్సు లాంటి కార్యక్రమాలకు తమ పేర్లను డ్రిల్లు సారుకిచ్చారు.
ఆ రోజు రాత్రి వైనతేయ దస్తగిరిసారుతో అన్నాడు. “సార్, నేను హరికథకు పేరు ఇస్తే బాగుంటుందా?”
“ఎందుకు బాగుండదురా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం చెద్దామని? అరగంట లోపు పూర్తయ్యేలా ఉండాల మరి!”
“నీవే చెప్పు సార్.”
“రుక్మిణీ కల్యాణం పద్యాలు బాగా ప్రాక్టీసు చేశావు కదా! దాన్నే హరికథగా మలచుకో.”
వైనతేయ మాట్లాడలేదు. “ఏమాలోచిస్తున్నావురా?” అనడిగాడు సారు.
వాడు సందేహిస్తుంటే, “పరవాలేదు చెప్పు” అని ప్రోత్సహించాడు.
“నాన్ డిటెయిల్డ్‌లో ఆలివర్ ట్విస్ట్ కథను హరికథగా మలచి చెబితే ఎట్లుంటుంది సార్?”
అబ్బురంగా చూశాడు సారు వాడి వైపు. “కానీ, చెప్పగలవా?”
“ముందుగా తయారు చేసి మీకు చూపుతాను. ఇంగ్లీషుసారుకు, తెలుగు సారుకు కూడా చూపిస్తా. కొన్ని పద్యాలు, పాటలు కూడా పెడతాను. ఇరవై నిమిషాలకు సెట్ చేస్తాను.”
సార్ ముఖం వెలిగింది! శిష్యున్ని గర్వంగా చూసుకున్నాడు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.