Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీమద్రమారమణ-8

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[వైనతేయ ఐదవ తరగతి పెద్ద పరీక్షలు పూర్తవుతాయి. జూన్/జూలై నెలల్లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య పాఠశాలలో చేరాలి. అందుకని సెలవలలో ఊరెళ్ళి తల్లిదండ్రులతో గడిపి, వచ్చేటప్పుడు దస్తగిరిసారును తీసుకురమ్మని చెప్తారు ఆంజనేయశర్మ. రెండు బస్సులు మారి ముందు ప్యాపిలి చేరుతాడు వైనతేయ. దస్తగిరిసారు ఇంటికి వెళ్తాడు. వాడొచ్చాడని కాశింబీ ప్రత్యేక వంటలు చేస్తుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత సారుకు పాదసేవ చేస్తుంటే, ఆయన ఏవైనా కీర్తనలు పాడమంటాడు. కాశింబీ కూడా వచ్చి కూర్చుంటుంది. అన్నమాచార్య కీర్తన ‘గోవింద గోవింద యని కొలువరే గోవిందా యని కొలువరే’ పాడతాడు. మర్నాడు యానాదుల దిబ్బకు వెళ్తాడు. తల్లిదండ్రులు, అక్క ఎంతో సంతోషిస్తారు. అక్కడ ఉన్నన్నీ రోజులు ఇంటి పనులు చేస్తూ, పశువులను మేతకు తీసుకువెళ్తాడు వైనతేయ. బెంగుళూరు నుంచి రెడ్డి గారి కూతురు కౌసల్య, అల్లుడు మహిపాల్ రెడ్డి వచ్చారని తెలిసి నాన్నతో బాటు శేషశయనారెడ్డి గారింటికి వెళ్తాడు వైనతేయ. కౌసల్య ఒక పాట పాడమంటే, ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే’ పాడతాడు. కౌసల్య, మహిపాల్ మెచ్చుకుంటారు. తండ్రి చూడకుండా, వైనతేయకు వంద రూపాయలిస్తుంది కౌసల్య. బాగా చదువుకోమని చెప్తుంది. వారం తర్వాత దస్తగిరిసారుతో కలిసి, కౌతాళం చేరుకుంటాడు వైనతేయ. మర్నాడు బస్సు, రైలు ప్రయాణలు చేసి, తిరుపతి చేరుకుంటారు. ‘బైరాగిపట్టెడ’లో ఉన్న తమ తోడల్లుడు సదాశివశర్మ గారింటికి తీసుకువెళ్తారు  ఆంజనేయశర్మగారు. ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాకా, ఉదయం కాఫీలు తాగుతూండగా, ఉత్తరాలలో వైనతేయ గాత్రం వినాలనుకుంటారు సదాశివశర్మ. అన్నమయ్య కీర్తన పాడతాడు వైనతేయ. సదాశివశర్మ గారు అబ్బురపడతారు. వాడిని సంగీతనృత్య కళాశాలలో చేర్చేందుకు, పక్కవీధిలోని మున్సిపల్ హైస్కూలులో ఆరవ తరగతిలో చేర్పించడానికి తాను చేసిన ఏర్పాట్ల గురించి చెప్తారు. ఆయన సూచించినట్లుగా, వైనతేయకు ఒక సైకిల్ కొనిస్తాడు దస్తగిరిసారు. దేవస్థానం వారి సంక్షేమ వసతిగృహంలో చేరతాడు వైనతేయ, ప్రతి రోజూ ఉదయం పూట, ఆదివారాలు తన వద్దకు రమ్మని, తాను వాడి విద్యకు మెరుగులు దిద్దుతానని చెప్తారు సదాశివశర్మ. దస్తగిరిసారు, ఆంజనేయశర్మ గారు తిరుగుప్రయాణమవుతారు. – ఇక చదవండి.]

తిరుపతి వేంకటేశ్వరుని సన్నిధిత, వైనతేయ సంగీత విద్యాభ్యాసాలు మొదలయ్యాయి. తన కోసం, దస్తగిరిస్తారు, ఆంజనేయ శర్మ స్వామి, వల్లెలాంబమ్మ, సదాశివశర్మ స్వామి, వకుళమ్మ చివరికి పెద్ద రెడ్డి బిడ్డ కౌసల్య, ఎంత ఇదిగా శ్రద్ధ తీసుకుంటున్నారో వాడికి బాగా తెలుసు. వాళ్లందరూ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, బాగా విద్య నేర్చుకొని, వాళ్ల పేరు నిలబెట్టాలని మనసులో నిర్ణయించుకున్నాడు వాడు.

బైరాగిపట్టెడలోని మున్సిపల్ హైస్కూలు పెద్దదే. దాదాపు వెయ్యి మంది విద్యార్థులున్నారు. ఆరవ తరగతిలో మూడు సెక్షన్లు ఉన్నాయి. వైనతేయను ‘బి’ సెక్షనులో వేశారు. దాని కాసు టీచరు మునిరెడ్డి సారు. ఆయనకు కోపం ఎక్కువ. పిల్లలు అల్లరి చేసినా, సరిగ్గా చదవకపోయినా, ఎడాపెడా బాదేస్తాడు.

వైనతేయ ఒద్దిక, వినయం ఆయనకు నచ్చినాయి. మొదట ‘వీడు కొంచెం అతి వినయం ధూర్త లక్షణం’ టైపులా ఉన్నాడని అనుకొన్నాడు. కాని క్రమంగా, ఆ వినయం తెచ్చిపెట్టుకున్నది కాదని, వాడి సహజ భూషణమని ఆయనకు అర్థమైంది.

సంక్షేమ వసతి గృహం మాత్రం అంత బాగుండదు. దోమలు. మరుగుదొడ్లు తక్కువ. స్నానాలు ఆరుబయటే చేసేవారు. కొళాయి దగ్గర బట్టలు ఉతుక్కుని అక్కడ కట్టిన తాళ్ళ మీద ఆరేసుకొని, ఆరింతర్వాత ‘చెంబు ఇస్త్రీ’ వాడే చేసుకునేవాడు. వాడికి కుసుమన్న, గోవిందరాజులు అన్న స్నేహితులు ఏర్పడ్డారు.

పార్ట్ టైమ్ కోర్సు ప్రారంభమైంది. మొదటి రోజు ‘హరికథా పంచానన’ శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు వచ్చారు క్లాసుకు. పుంభావ సరస్వతిలా ఉన్నారాయన. పొట్టిగా, కొంచెం లావుగా ఉన్నారు. ప్రసన్నమైన ముఖం. విద్వత్తుకు రూపం వస్తే ఆయనలా ఉంటాడు.

“అబ్బాయిలూ! మీరంతా హరికథ నేర్చుకుందామని వచ్చినారు. దాన్ని బట్టే మీ తల్లిదండ్రుల, గురువుల సంస్కార విశేషం తెలుస్తూన్నది” అన్నారాయన.

“పూర్వజన్మ సుకృతం ఉంటేగాని సంగీత విద్య లభించదురా. భగవద్దత్తమైన వరాలలో గాత్రం కూడ ఒకటి. సాధన చేస్తే మెరుగుపడుతుంది కాని, అందరికీ రాదు. సాహిత్యం, సంగీతం, పూవు పరిమళం వంటివి. మీరు బాగా పుస్తకాలు చదవాలి. క్లాసు పుస్తకాలు కాదు. మన ఇతిహాసాలు, కావ్యాలు, గీత, ప్రబంధాలు. కథంటేనే సాహిత్యం. దాన్ని సంగీత రూపకంగా మలిస్తే హరికథ.”

వైనతేయ శ్రద్ధగా వింటున్నాడు.

“మొట్టమొదటి హరిదాసు ఎవరో చెప్పగలరా, ఎవరైనా?”

ఎవరూ స్పందించలేదు.

“నారద మునీంద్రుడు తొలి హరిదాసు. అపూర్వ సంగీతజ్ఞుడాయన. నారాయణ నామ సంకీర్తనం చేస్తాడు నిరతం. మన తెలుగు పౌరాణిక సినిమాల్లో నారద పాత్ర ఒక మంచి పాటతో ప్రవేశిస్తుంది. మహానుభావులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడ ఒక సినిమాలో నారద పాత్ర పోషించారు. అది ఏ సినిమా?”

ఒక అమ్మాయి లేచి చెప్పింది – “భక్తప్రహ్లాద సార్.”

“మంచిది తల్లీ! సార్ అన్న సంబోధన వద్దు. ‘గురువుగారు!’ అనండి. నీ పేరమ్మా?”

“అమృతవల్లి గురువుగారు.”

“మీది ఏ ఊరు?”

“శింగనమల అండీ!”

“ఒక్కొక్కరూ మీ పేరు, ఊరు, తల్లిదండ్రుల పేరు, గరువుల పేర్లు చెప్పండి”

మొత్తం పదకొండు మంది విద్యార్థులు. అమృతవల్లి ఒక్కతే ఆడపిల్ల.

వైనతేయ వంతు వచ్చింది. లేచి నిలబడి – “నా పేరు వైనతేయ గురువుగారు” చెప్పాడు.

“చక్కని పేరు. గరుత్మాన్ పేరు.”

“మాది ‘యానాదుల దిబ్బ’. కర్నూలు జిల్లా ప్యాపిలి దగ్గర.”

పిల్లలందరూ నవ్వారు!

సింహాచలశాస్త్రిగారు వారించారు. “ఎందుకు నవ్వుతున్నారు? తప్పు!” అని మందలించారు.

“మా నాయన పేరు కోనేటయ్య. మా అమ్మ తిరుపాలమ్మ. మా గురువులు దస్తగిరిసారు, ఆంజనేయశర్మ స్వామి.”

“సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడి పేర్లే నాయనా తల్లిదండ్రులవి. ఆంజనేయశర్మగారిని గురించి విన్నాను. గొప్ప విద్యాంసుడు.”

వాడు యానాదుల పిల్లవాడని శర్మగారికర్థమైంది. ‘వీణాపాణి వాణి ఎవర్ని కరుణిస్తుందో ఊహించలేము’ అనుకున్నారాయన.

“పిల్లలూ, జాగ్రత్తగా వినండి. మొదట ఒక వినాయక స్తుతితో మన పాఠం ప్రారంభిద్దాము.” అని

కనకాంగి రాగం, ఆది తాళంలో, త్యాగరాజస్వామి వారి కీర్తన, ‘శ్రీగణనాథం భజామ్యహం’ అన్న దానిని పాడుతూ అభినయించసాగాడా అపర సరస్వతి. చిన్నగా అడుగులు వేస్తూ, హస్త చాలనం చేస్తూ, ఆయన పాడుతూ, ఆడుతూ ఉంటే, పిల్లలు మైమరచిపోయారు. చిడతలు లేవు. వాయిద్య సహకారం లేదు. కానీ ఆయన గొంతు మధుర గంభీరంగా ఉంది.

“రంజిత నాటక రంగతోషణం

శింజిత వరమణిమయ భూషణం

ఆంజనేయావతారం సుభాషణం

కుంజరముఖం త్యాగరాజ పోషణం”

అని ఆయన లయాన్వితంగా నర్తిస్తుంటే ముగ్ధుడైనాడు వైనతేయ.

“నాయనలారా! హరికథను ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన మహానీయుడు ఎవరో తెలుసా?”

ఆయన గురించి ఆంజనేయ శర్మగారు వైనతేయక చెప్పి ఉన్నారు. వాడు లేచి,

“శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసులవారు” అన్నాడు.

“మంచిది. ఇంకా?”

“…….”

“తర్వాత పరిమి సుబ్రహ్మణ్యం భాగవతార్ గారు. ఇది ఒక విశిష్ట కళారూపం అని ఎందుకంటాము? ఒకే పాత్రధారి మూడుగంటల పాటు కథాగానం కావిస్తాడు. కథలోని అన్ని పాత్రల్లోకి ఆయనే పరకాయ ప్రవేశం చేసి, అన్ని రసాలనూ పోషిస్తాడు. వదనంలో సాత్త్వికమును, కాళ్ళతో నృత్యమును, చేతులతో ఆంగికమును పండిస్తాడు. ఆయన ఆహార్యం ఆకర్షణీయం. మధ్యలో పిట్టకథలతో, హాస్యాన్ని జొప్పిస్తూ, సమాజంలోని చెడును విమర్శిస్తూ, వ్యక్తిత్వవికాస బోధన చేస్తాడు”

ఆయన మాటల్లో ‘వ్యక్తిత్వవికాస బోధన’ అన్నది వైనతేయ మనసుకు హత్తుకొంది. దాని మీద వాటికి అవగాహన లేదు కాని ఆ పదబంధం వాడికి నచ్చింది.

“హరికథ వేదాల నుంచి పుట్టిందిరా పిల్లలూ! మహాపండితులు శ్రీ జమ్మలమడక మాధవరాయశర్మ గారు, హరికథకు మూలం సామగానమే అని చెప్పారు. కొందరు ‘నారద భక్తి సూత్రములు’ దీనికి మూలమన్నారు. ఇంకొందరు యక్షగానమే రూపాంతరం చెంది హరికథ అయిందన్నారు.

భాగవతాన్ని వ్రాయమని నారదుడు వ్యాసునికి ఉపదేశించారు. శుకశౌనకాది, సూత, సనక, సనందనాది మహర్షులు భాగవతాన్ని హరికథారూపంగా గానం చేశారని ‘నాట్యకళ’ అన్న పత్రికలో పాతూరి ప్రసన్నంగారు తెలిపారు.

తంగిరాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ‘క’ అంటే బ్రహ్మమనీ, ‘థ’ అంటే ఉండునది అనీ వివరించారు. దేనియందు పరబ్రహ్మ ముండునో, దానిని తెలియబరచేదే కథ. హరికథ. నారాయణదాసు గారిలా సెలవిచ్చారు –

‘ఆస్తిక్యమును, ధర్మాధర్మములను, సర్వజనమనోరంజనముగ నృత్యగీత వాద్యములతో నుపన్యసించుట హరికథయనబరగును.’

దాసుగారు చెప్పినట్లు, హరికథలో ఉండుకున్న ముఖ్యమైన అంశములు 3.

1) దైవభక్తి 2) సత్యము 3) భూతదయ.

హరికథ మహారాష్ట్ర దేశంతో 17వ శతాబ్దంలో ‘అభంగ్’గా అవతరించిందంటారు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం ఈ పక్రియ ఉంది. అక్కడ వీటిని ‘హరికథా కాలక్షేపాలు’ అంటారు. మన హరికథల కీర్తిని ఇనుమడింప చేసిన మహనీయుల గురించి తర్వాత చెప్పుకుందాం” అని ముగించారు సింహాచల శాస్త్రిగారు!

***

రోజూ సూర్యోదయాత్పూర్వమే నిద్ర లేస్తాడు వైనతేయ. కాల్యములు, కృత్యములు తీర్చుకుని సదాశివశర్మగారింటికి వెళతాడు. అంత ఉదయాన్నే, మరుగుదొడ్ల దగ్గర, కుళాయిల దగ్గర రద్దీ ఉండదు.

కౌతాళంలో, ఆంజనేయశర్మ గారింట్లో ఎలా కలసిపోయి, వాళ్ళింటి పిల్లవాడుగా మసిలాడో, అట్లా ఇక్కడ కూడా ఉంటున్నాడు. కూరగాయలు తేవడం, కిరాణా సామాన్లు తేవడం, అమ్మగారు వకుళమ్మగారికి సహాయంచేయడం, చొరవగా చేస్తాడు.

సరిగ్గా ఆరుగంటలకు శర్మగారిల్లు చేరుకొన్నాడు వైనతేయ. ఆయన స్నానం చేసి, సంధ్యావందనం, నిత్యపూజ చేసుకుంటున్నాడు. వకుళమ్మ వాటికి కాఫీ ఇచ్చింది. తాగుతూ ఉండగా చెప్పింది

“నాయనా, పెరట్లోని తులసి కోటలో కొత్త మొక్క నాటాలిరా! తులసి చెట్టు ఎండిపోయింది. రెండిళ్ల అవతల తిప్పయ్య శెట్టిగారింటి పెరట్లో తులసి మొక్కలు లేచాయట. ఒకటి తెచ్చి..”

“సరే అమ్మా!” అన్నాడు. వెళ్లి జాగ్రత్తగా మొక్క చుట్టూ తవ్వి, వేర్లు విడిపోకుండా, మట్టిపెళ్లతో సహా తీసి, దాన్ని క్రింద భాగాన రెండు చేతులతో పట్టుకొని తెచ్చాడు. అడుగు ఎత్తు పెరిగింది మొక్క.

దాన్ని జాగ్రత్తగా తులసికోట పక్కన దించాడు. ఎండిపోయిన పాత మొక్కను పీకి, నాలుగంగుళాల మేర మట్టిని తొలగించాడు. శర్మ గారింటి ఎదుట వాళ్లకు పాలుపోసే రత్నమ్మని అడిగి పచ్చని పచ్చిపేడ దోసిటి నిండా తెచుకున్నాడు. ఒక మూలన నిమ్మ చెట్టుంది. దానికింద ఉన్న మంచి మట్టిని తవ్వి తెచ్చి, పేడతో కలిపి, తులసికోట దగ్గర పెట్టుకొన్నాడు. తెచ్చిన తులసిమొక్కను క్రింది మట్టిపెళ్లతో సహా కోటలో జాగ్రత్తగా అమర్చి, దాని చుట్టూ పేడ కలిపిన ఫ్రెష్ మట్టిని వేసి, చేతులతో గట్టిగా వత్తాడు. కొళాయి దగ్గర ఒక మగ్గుతో నీరు పట్టుకొచ్చి ఆ మట్టిని తడిపాడు. చిట్టి తులశమ్మ చక్కగా కోటలో ఒదిగి, గాలికి తల ఊపసాగింది.

“అమ్మా! వచ్చిచూడండి!” అని వంటింటి దగ్గరికి వెళ్లి వకుళమ్మను పిలిచాడు. ఇడ్లీ కోసం రోట్లో కొబ్బరిపచ్చడి రుబ్బుతున్న ఆమె లేచి వచ్చిచూచింది.

“అప్పుడే తేవడం, నాటటం కూడ అయిపోయిందా రా?” అన్నదామె ఆశ్చర్యంగా. “అసాధ్యునివి రా నీవు!” అని మెచ్చుకుంది.

వాడి ముఖం బంతిపువ్వయింది. చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్లాడు. శర్మగారి పూజ అయిపోవచ్చింది. దేవుళ్లకు హారతి ఇచ్చి, మంత్రపుష్పం చదువుతున్నాడాయన సుస్వరంగా.

“ఓం తద్భహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్పురోన్నమః” అంటూ సాగుతున్న మంత్రపుష్పం ఆ పిల్లవానిలో వైబ్రేషన్స్‌ను కలిగించింది.

చివర స్వస్తిమంత్రం చదివాడాయన – ‘యస్యస్మృత్యాచ..’ అంటూ. దానిలో “మంత్రహీనం క్రియాహనం భక్తిహీనం మహేశ్వరా! యత్పూజితం మయాదేవ! పరిపూర్ణం తదస్తు మే” అన్న మాటలు వాడిలో ఆలోచనలను రేకెత్తించాయి.

దేవుని గూటి దగ్గరికి వెళ్లి, శర్మగారిచ్చిన తీర్థం తీసుకోన్నాడు. ప్రసాదం పటిక బెల్లం ముక్కను నోట్లో వేసుకున్నాడు. తీర్థం ఇచ్చేటప్పుడు ఆయనతో బాటు, “అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం శ్రీమహవిష్ణుపాదోదకం పావనం శుభం!” అనే శ్లోకాన్ని పఠించాడు. శర్మగారు దేవతార్చన ఎంతో బిగ్గరగా చదువుతూ చేస్తారు. రోజూ విని వాడికి ఆ మంత్రాలు, శ్లోకాలు చాలా మటుకు నోటికి వచ్చాయి.

వాడు చివర్లో ‘పావనం శుభం’ అంటే, శర్మగారు. “శిరసా గృహ్నమి” అన్నాడు. వాడు ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూస్తే, ఆయన నవ్వి, “ఇది ‘పాఠాంతరం’ రా!” అన్నాడు.

పాఠాంతరం అంటే ఇంకో ప్రత్యామ్నాయం. ఆ విషయం వైనతేయకుతెలుసు.

శర్మగారు మడి పంచె విడిచి, ఇస్త్రీ ధోవతి ధరించారు. చెక్క సోఫాలో కూర్చున్నారు. వకుళమ్మ ఆయనకు ఇత్తడి గ్లాసులో కాఫీ తెచ్చి ఇచ్చింది. “మరి నీవు?” అన్నాడాయన సహధర్మచారిణి పట్ల సాదరంగా చూస్తూ.

“తెచ్చుకుంటానండీ” అని ఆమె లోపలికి వెళ్లింది.

“నీవు తాగావా వైనతేయ?”

“వస్తూనే అమ్మ ఇచ్చింది స్వామి!”

“నిన్న హిందోళ రాగాన్ని గురించి చర్చిస్తున్నాం కదా!”

“అవునండి. దానిలో, ‘ప’, ‘రి’ స్వరాలు లేవని చెప్పారు” అన్నాడు వాడు వినయంగా.

కొన్ని ఆంజనేయ శర్మగారు చెప్పినవే, వాడికి తెలిసినవే. కానీ పొరపాటున కూడా “నాకు తెలుసు” అనో, లేదా, “కౌతాళం స్వామి చెప్పారు” అనో అనడు. ఉత్తమ విద్యార్ధి లక్షణం అది.

“మోహన రాగం లాగే, ఇది కూడా ఐదు స్వరాలున్న, జనరంజకమైన, ప్రసిద్ధమైన రాగం నాయనా. ఇది మనోధర్మ సంగీతానికి అత్యంత అనుకూలమైన రాగం. కరుణ, భక్తి, శృంగార రసాలు దీనిలో అద్భుతంగా పండుతాయి.

8వ మేళకర్త అయిన హనుమత్తోడి జన్యరాగం హిందోళం. త్యాగరాజుల వారి ‘సామజ వరగమనా’ అన్న కీర్తన దాని లోనే చేశారు స్వామివారు. సదాశివబ్రహ్మందుల వారి ‘భజరే గోపాలం’ కూడా ఇదే.”

వైనతేయ శ్రద్ధగా వింటున్నాడు

“హిందోళం ఔడవరాగం అంటే, ఆరోహణలో, అవరోహణలో కూడా.. ఐదు స్వరాలే ఉంటాయి. హిందూస్తానీ సంగీతంలోని ‘మాల్కోస్’ హిందోళానికి సమీపంగా ఉంటుంది.

‘లవకుశ’ సినిమాలో ఘంటసాలవారు ‘సందేహించకుమమ్మా! రఘురాము ప్రేమనూ, సీతమ్మ’ అన్న పాటను హిందోళంతో స్వరపరచారు. అట్లే, ‘రామకథను వినరయ్యా’ కూడా. అన్నమయ్య ప్రసిద్ధ కీర్తన ‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు’ కూడా హిందోళమే.”

శర్మగారు, వకుళమ్మ అప్పుడపుడు మంచి సినిమాలకు కూడా వెళ్తుంటారు.

ఇటీవలే, భానుమతి గారి సినిమా ‘అంతా మన మంచికే’ మినీ ప్రతాప్ థియేటరులో వస్తే వెళ్లారు. వారి వెంట తప్పకుండా వైనతేయ ఉండాల్సిందే! వాళ్ళు రిక్షాలో వెళుతూంటే, వీడు తన సైకిల్‌పై వారిని అనుసరిస్తాడు.

వాటికి సడన్‌‌గా అందులోని భానుమతి పాట గుర్తొచ్చింది.

“స్వామి, మొన్న మనం పోయినాము కదా! ఆ సినిమాలో, ‘నేనె రాధనోయీ, గోపాలా!’ అన్న పాట హిందోళమే కదా!” అనడిగాడు నమ్రతగా.

“అవునురా. బాగా గమనించావు!” అని మెచ్చుకున్నాడాయన శిష్యుడిని.

“స్వామీ! ‘సందేహించకుమమ్మా’ పాటలో, పంచమం (ప), రిషభం (రి) స్వరాలు ఉన్నాయి కదా!”

“అవును. అవి హిందోళంలో లేవు. కాని ఘంటసాలవారు కారణజన్ములు. వాటిని వాడుతూ, హిందోళాన్ని అద్భుతంగా పోషించారు. దాని ఒరిజినాలటీ దెబ్బ తినకుండా.”

“నిజమేనండి” అన్నాడు వాడు. వాడి కళ్ల ముందు అమరగాయకుడు ఘంటసాలవారు సాక్షాత్కరించారు.

“నిన్న కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి పద్యం ‘భావోద్యానమునందు’ పాడి వినిపించాను నీకు. హిందోళంలో దానిని రాసుకున్నావు కూడా. సాధన చేశావా మరి?”

“చేశానండి”

“ఏదీ, పాడు.”

‘సాంధ్యశ్రీ’ లోని పద్యమది. ‘త్వమేవాహం’ అన్న అద్వైతాన్ని ప్రేయసీప్రియుల ప్రేమలో ఆవిష్కరించాడా మహాకవి. దాన్ని అర్ధం చేసుకునే వయసు కాదు వైనతీయది. కాని సాహిత్యం సరళం. శార్దూల వృత్తం.

గొంతు సవరించుకొని, శర్మగారికి మొక్కి పద్యాన్ని ప్రారంభించాడు. హిందోళాన్ని పలికించటానికి ముందుగా చిన్న ఆలాపన మనసులో చేసుకున్నాడు.

“భావోద్యానమునందు కొత్త వలపుం పందిళ్ళలో కోరికల్

తీవెల్ సాగెను పూలు బూచెను రసాద్రీ భూత తేజమ్ముతో

నీవే నేనుగ నేనెనీవుగ లతాంగీ ఏకమై పోదమీ

ప్రావృణ్ణీ రద పంక్తి క్రింద పులకింపన్ పూర్వ పుణ్యావళుల్”

వాడి గొంతులో హిందోళం అందాలు చిలికింది. ఎక్కడా శృతి తప్పలేదు. మూడవ పాదంలో, “నీవే నేనుగ నేనె నీవుగ లతాంగీ”అన్న చోట వాడు పలికించిన భావం వాడి వయసుకు మించింది.

“బాగుంది. కాని, ‘తీవెల్ సాగెను, పూలు పూచెను’ అన్నచోట కొంచెం ఆరోహణ ఉండి ఉంటే బాగుండేది” అన్నాడాయన. అక్కడే వింటున్న వకుళమ్మ నవ్వుతూ, “అంత చిన్నపిల్లవాడితో ఇటువంటి పద్యాలు పాడించక పోతేనేం?” అన్నది.

ఆయనా నవ్వాడు. “కేవలం హిందోళం కోసమే వకుళా! అయినా హరికథకుడికి అన్ని రసాలూ కరతలామలకం కావాలి. వీడేం తక్కువవాడు కాదు. ‘నీవే నేనుగ నేనె నీవుగ లతాంగీ’ అన్న దాన్ని ఎంత భావయుక్తంగా పాడాడో చూడు” అన్నాడు.

ఆమె వాడి తల నిమిరి, వెళ్లిపోయింది.

“ఈ రోజుకు చాలిద్దాం. టిఫిన్ తిని వెళ్లు” అన్నాడాయన. రోజూ టిఫిన్ శర్మగారింట్లోనే. ఆదివారాలయితే, భోజనాలు కూడా!

“స్వామి! ఒక సందేహం!” అన్నాడు శిష్యుడు. వాడి ముఖంలో అడగవచ్చునో లేదో అన్న వ్యగ్రత.

“చెప్పు నాయనా.”

“దేవతార్చన చివర, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అన్నారు కదా! అవన్నీ లేని పూజ పూజ అవుతుందా?”

శర్మగారు కాసేపు మౌనం పూనారు.

“నాయనా నీ ప్రశ్నలో చాలా లోతైన వేదాంతం ఉంది. జాగ్రత్తగా విను.”

వైనతేయ అప్రమత్తుడైనాడు.

“భగవంతుడు ఈ పూజలకు, మంత్రాలకు అతీతుడు. కేవలం భక్తికి మాత్రమే లోబడతాడు. మరి ‘భక్తిహీనం’ అని ఎందుకన్నారు?’ అని నీవనవచ్చు. భక్తిని కూడ దాటిన తాదాత్మ్య స్థితి అన్న మాట. ఈ పూజలు, అష్టోత్తరాలు, అభిషేకాలు, మన మానసిక సంతృప్తి కోసం చేసేవే. వీటిని ఇంగ్లీషులో rituals (రిచుయల్స్) అంటారు నాయనా. తెలుగులో ‘తంతు’ అంటాము. పరమాత్మ మీద మనసును లగ్నం చేయకుండా, ఇవి ఎన్ని చేసినా, ఆయన లభించడు. లగ్నం అవడానికి ఇవి కేవలం సాధనాలు. నీకు ఆ మధ్య ‘శ్రీ కృష్ణతులాభారం’ హరికథ గురించి నేర్పించాను. అందులో, నారదులవారు శ్రీకృష్ణుని భార్యలకు చివర్లో ఉపదేశం చేస్తాడు”

“గుర్తుంది స్వామి. ఆ పద్యం ఎంత బాగుంటుంది!” అని

“సర్వేశ్వరుండగు శౌరికింకరుజేయ

ధనమున్నదే భక్తి ధనముగాక”

అంటూ పాడాడు వైనతేయ.

“అదీ! అర్థమైంది కదా! మన కావ్యాలు, నాటకాలలోని పద్యాలను నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి నాయనా! కథాగమనంలో సందర్భశుద్ధిగా వాటిని ఒప్పించి, ప్రేక్షకులను అలరించాలి” అన్నాడాయన.

వకుళమ్మగారు గురుశిష్యులద్దరికీ ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి వడ్డించింది. వాడు నాలుగిడ్లీలు తిని, “ఇక చాలమ్మా” అంటే ఆమె వినలేదు.

“అదేం తిండిరా, పిల్లవాడివి! ఇంకో రెండు తిను!” అని కొసరి తినిపించింది.

టిఫిన్ చేసి హాస్టలుకు వెళ్లిపోయాడు..

(ఇంకా ఉంది)

Exit mobile version