Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సృష్టి విలాసం

[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘సృష్టి విలాసం’ అనే కవితని అందిస్తున్నాము.]

సాయం సంధ్యవేళ అరవిరిసే
పారిజాత పూల సోయగాలు
పరిమళపుతావి ఆస్వాదిస్తూ
పిట్టగోడనానుకొని పరికిస్తూ
చూస్తుంటే ఆ వేళలో చిట్టిపిట్ట
లేతరెమ్మపై కూచుని చిన్ని రెక్కలల్లార్చి
కునికిపాట్లు పడుతున్నది పిట్టరాక
గమనించి, నిదురచెదిరి పోతుందని
సడిచేయకచూస్తున్నా! ప్రతిరోజూ
పిట్టరాక! ఎదురుచూపుతో నేను!
కొమ్మ ఆవలదూరపు రెమ్మన ఒక
చిన్న పక్షిరాక పక్షముల రెపరెపలు
పిట్ట చెలిమికై చిన్నపలకరింపులు
నెమ్మదిగా ఆ పిట్ట జట్టుపట్టగా
ముచ్చటగా చూస్తున్నా! మందారకొమ్మపై
ముచ్చట్ల కిచకిచలు మల్బరీ చెట్టుపైన
ఫలాల విందులు ఆరగింపు
కువకువలు! జంటగాఎగిరేటి ఆ రెక్కల
రెపరెపలు! కనుల విందుగా నేను గుట్టుగా
కనిపెడుతూ, ఔరా! ప్రకృతి చిత్రము!
బ్రహ్మ సృష్టి విలాసము!
నిరవధికపు ఆ చెలిమి! ఆ కూరిమి!
దేవపుష్ప వల్లరిపై
ఊయలలూగే మురిపెము!
ముక్కుముక్కు చేర్చి ఊసులాటలెన్నెన్నో!
పుల్ల, పుడకా చేర్చి కట్టెను చక్కని గూడు!
చిట్టి చిట్టి గుడ్లను పొదిగేటి పిట్టకు
ఆహారం తెచ్చి నోటికందిస్తూ!
గుడ్లనుండి పక్షికూనలు వచ్చెను!
ఆ కూనలు, ఆమ్ము, కొరకు నోరు తెరచు
సవ్వడితో అమ్మ తెచ్చువాటినీ గుటుక్
గుటుక్ మని తింటూ పోతుపిట్ట
గూటికాపు కొన్నాళ్ళకు పిల్లలు
రెక్కలొచ్చి ఎగిరిపోయె! ఆ పిట్టలు
మనకంటే ఎంతెంతో నయం కదా!
ఎంత వయసు వచ్చినా పనిచేయని
వారెందరో! శ్రమ విలువ తెలియక
బ్రతికే వారెందరో! పక్షుల జీవనము
చూసి బ్రతుకు తెరువు నేర్వవలె

……
వల్లరి=లేతకొమ్మ.. చిరుశాఖ

Exit mobile version