ఏమిటిదీ? మనసు ఘనీభవించి
ఇంత ఘోరకలి చెవుల బడినా
మనసు స్పందనలు కోల్పోయి,
మౌన నిస్తేజ సంభాషణ?
మనసు కవాటాలలో శృతి తప్పిన తీగెల్లో
చేతనత్వం నశించిందా?
అంతరంగానికీ, బాహ్య ప్రపంచానికీ,
వారధి తెగిపోయి,వెన్నెల మెట్లెక్కలేక
చీకటి గుయ్యారంలో చతికిల బడిందా?
పలువిధాల సంచరీ భూతం కావాల్సిన మనసులో ఆ శూన్యాకాశ ఖాళీ ఏమిటీ?
అ, ఆ ల డాంబికాలతో అల్లిన అక్షరాలు
కుదురుగా కూర్చోవేం?
అన్యాయాన్ని కవిత్వీకరించాలంటే
కలం కుంచెతో గీద్దామంటే
కవిత్వానికింత మూతి ముడుపేం?
కళలలోని లలితం
నన్నర్థం చేసుకోదేం?!
లాలిత్యం ఓదార్చదేం!
నడ్డి విరిగిన నా ఆలోచనలు
కలంపోటుకైనా
కదల మంటున్నాయేం?
మనసు మూలను అంటుకున్న మమత
పొరలు, వెతల కరిగీ విచ్చుకోవేం?
రగలుతున్న జ్వాలలన్నీ, మనసు కాన్వాస్
పొగల సిరానద్దీ గీయదేం? పొగరా మదికి?
అచేతనమై పెన్నేం కదలదే? దిగులుసిరాతో
నింపానా? దివాంధ నయ్యానా?
లేక ఆమె ~ ఊపిరిలో నేనూ స్తంభించానా?
భాగవతుల భారతి గారిది ఖమ్మం. వారు గృహిణి. డబుల్ ఎం.ఎ (బిఎడ్) చేశారు. శ్రీవారు శ్రీనివాస్ గారు ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్. పాప భాగవతుల మానస.
కుటుంబ బాధ్యతల దృష్ట్యా టీచర్ ఉద్యోగం మానేసి.. నిత్యాగ్నిహోత్రమూ, వేదాధ్యయనము, స్వాధ్యాయం వైపు నడిచి… పౌరోహిత్యం నేర్చి, ఆడవాళ్లు పౌరోహిత్యం చేయకూడదా? అనే స్త్రీ సాధికారతతో పురోహితురాలు, అనే దిశగా వీరి ప్రయాణం సాగుతోంది. ఎంతోమంది విద్యార్ధులు, వీరి వద్ద మంత్రాల్నీ నేర్చుకుంటున్నారు.
పిల్లలకూ పెద్దలకూ స్వాధ్యాయం క్లాసెస్ జరుపుతూ ఉండటం. రచనలు చేయటం రెండూ రెండు కళ్ళుగా జీవన పయనం సాగిస్తున్నారు (దీనికి శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఉంది.).
పద్యాలూ, పాట, వచన కవితలూ వ్యాసం, కథలూ… అనేక పత్రికలో ప్రచురణ అయినాయి. మనీతో కూడిన బహుమతులతో పాటుగా… సన్మానాలూ అందుకోవటం… మరిచిపోలేని మధురానుభూతులు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్శిటీ లో వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా సన్మానోత్సవ కార్యక్రమం మరిచిపోలేనిది.