Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్టాంపులలో మల్లె సుగంధం

“మనసున మల్లెల మాలలూగెనే

కన్నుల వెన్నెల డోలలూగెనే”

అని ప్రియురాలి మనసు మల్లెల మాలలతో నిండిపోయినా

“తెల్ల చీర కట్టుకున్న దెవరి కోసము

మల్లెపూలు పెట్టుకున్న దెవరి కోసము”

అని తొలి రాతిరి భర్త ప్రశ్నించినా

“చల్లని వెన్నెల సోనలు – తెల్లని మల్లెల మాలలు మా పాపాయి బోసినవ్వులే మంచిముత్తెముల వానలు” అని పాపాయిని చూసి మురిసినా అది మల్లెల గొప్పతనమే!

మల్లెలంటే యిష్టపడని అతివలు నూటికో కోటికో ఒకరుంటారు. వేసవి పగలంతా మండుటెండలతో అలసి సొలసిన మనశ్శరీరాలు సాయంకాలం జడలలో ఇమిడిన మరుమల్లెల పరిమళంతో సేదదీరుతాయి. మల్లె సుగంధం చుట్టుప్రక్కల ఉన్నవారి మపస్సులనూ హాయి గొలుపుతుంది.

పెళ్ళిళ్ళలో పెళ్ళికూతురికి మల్లెలు, మరువం, కనకాంబరం వంటి వాటితో అల్లిన మల్లెపూల జడ ఉండి తీరాలి. మల్లెల పెళ్ళి మండపం మనోహరంగా, ఆహ్లాదాన్ని కల్గిస్తే వేలాడే మల్లె పూచెండులు సుమ సుగంధాలతో ఆనందం, ఆహ్లాదాలతో ముంచెత్తుతాయి. ధర ఆకాశాన్నంటినా సరే గుప్పెడు మల్లెలు కొనాలనుకునే వారెందరో.

ఇక వృక్ష శాస్త్రపరంగా చూస్తే మల్లెలు ఆలీవ్ కుటుంబానికి చెందుతాయి. దీని శాస్త్రీయనామం ‘జాస్మినం అఫిసినేల్’. మల్లెలలో ఒంటిరెక్క మల్లెలు, గుండు మల్లెలు, బొడ్డు మల్లెలు, దొంతర మల్లెలు వంటి రకాలున్నాయి. మల్లె కాడ పొడవు ఆధారంగా చూస్తే పొట్టి కాడ మల్లెలు, పొడవు కాడ మల్లెలు అని రెండు రకాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 రకాల మల్లెలు మనుగడ సాగిస్తూ పరిమళభరితం చేస్తున్నాయి.

మల్లెపూలు తలలో పెట్టుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. కళ్ళకు చలువ చేస్తుంది. వేడి చేయదు. జడల్లో విరిసి మురిసే మల్లెల పరిమళం చెవి మీదుగా పయనించి నాసికా పుటాలను తాకి ఆహ్లాదాన్ని యిస్తుంది. మెదడు చురుకుగా పని చేసి పని త్వరగా పూర్తిగా చేసే పని శక్తిని యిస్తుంది. మరి సంతోషమే సగము బలము కాదా!

కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి కాచిన మల్లెనూనె జుట్టును సువాసన భరితంగా ఉంచడమే గాక, జుట్టును రాలకుండా ఉంచుతుంది. పచ్చిపాలతో కలిపిన మల్లె ఫేస్‌ప్యాక్ ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. మల్లెపూలలోని ‘సి’ విటమిన్ ఔషధంగా పనికి వస్తుంది. మల్లెపూలను ఆయుర్వేద చికిత్సలో వాడతారు.

ప్రపంచవ్యాప్తంగా మల్లెపూలతో అత్తర్లు, సెంట్లను తయారు చేస్తున్నారు. మల్లె సాగు, వ్యాపారము, సెంట్ల తయారీ మొదలయినవి లక్షలాది మందికి జీవనోపాధిని కలిగిస్తున్నాయి.

ఈ మల్లెల సౌరభాన్ని జనజీవన స్రవంతిలో మల్లెల పాత్రని, ఎరిగిన భారత ప్రభుత్వ తపాలాశాఖ 2008 ఏప్రిల్ 26వ తేదీన మల్లెపూలతో స్టాంపులను విడుదల చేసింది. రూ. 5-00ల విలువగల స్టాంపులో మల్లె మొగ్గలు, విరిసీ విరియని మొగ్గలు, విరిసిన మల్లెపూలతో కూడిన చిరుకొమ్మ అందమైన మల్లెలను మన కళ్ళముందు నింపుతుంది.

రూ. 15-00ల విలువగల స్టాంపులో విరిసిన మల్లెలు కేసరాలతో సహా కనువిందు చేస్తాయి. విడివిడిగా స్టాంపులే కాకుండా ఈ రెండు స్టాంపులను కలిపి SE-TENANT OF 2 STAMPS గాను, మినియేచర్ షీటు కూడా విడుదల చేశారు. ఈ షీటును చూస్తుంటే మల్లెలు విరిసిన చిరుమల్లె పొదని చూసిన అనుభూతి కలుగుతుంది.

అన్నింటి కంటే విశేషం 2008లో విడుదలయిన ఈ స్టాంపులకి, మినియేచర్ షీట్లకి అద్దిన పరిమళం Fragrance of Jasmine ఈనాటికీ మన నాసికా పుటాలను ఆహ్లాదపరచడం. భారత తపాలశాఖ విడుదల చేసిన సెంట్ కోటెడ్ స్టాంపుల వరుసలో విడుదలయిన రెండవ స్టాంపులివి.

మల్లెల స్టాంపులు ఈనాటికి సుగంధభరితమయి ఆహ్లాదాన్ని అందించడం విశేషం. ఆకుపచ్చని స్టాంపుల వనిలో విరిసిన మల్లెల సుగంధం మనని ఏవేవో లోకాలకి తీసుకుని వెళుతుంది.

***

Image Courtesy: Internet

Exit mobile version