[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘స్త్రీ శక్తి అంటే?’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
అది పల్లె వెలుగు బస్సు. ఆ బస్సు విశాఖపట్నంలో ఉదయం 7 గంటలకి బయలుదేరితే, శ్రీకాకుళం జిల్లా మందస వెళ్లేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది. సర్కారు వారి ఉచిత బస్సు పథకం పుణ్యమా అని, బస్సు బాగా రష్‌గా వుంది. అలాగే కుక్కుకుని వెళ్తున్నారు ప్రయాణీకులు.
అది పల్లె వెలుగు బస్సు కాబట్టి, చెయ్యి ఆపితే ప్రయాణీకులని ఎక్కించుకోవాలి. ఆపకపోతే డ్రైవర్ మీద కంప్లైంట్ వెళ్తుంది. డ్రైవర్‌కి ఈ ప్రహసనం ఇబ్బందిగా వున్నా, ఆపక తప్పదు. గమ్యం చేరే సమయం లేటు అవుతూ ఉంటుంది. అక్కడ డిపో మేనేజర్‌కి సంజాయిషీ తప్పదు. బస్సు నిండు గర్భిణిలా వెళ్తూ, ఎప్పుడు కదలనని మొరాయిస్తుందో? అని ఒక పక్క భయం.
ఓవర్ లోడ్ వల్ల, దారిలో రోడ్ మీద గుంటలో పడితే, తిరగబడుతుందేమో అని భయం ఒక పక్క. ఇలా వత్తిడిలో వున్నాడు డ్రైవర్ సుభాష్. ఇక కండక్టర్ రాజు సంగతి చెప్పక్కర్లేదు. రోజూ ఆడవాళ్ళతో యుద్ధాలు అయిపోతున్నాయి అతనికి.
ఇంట్లో పెళ్ళాం ఒక్క దానితో పడలేక పోతుంటే.. ఈ బస్సులో తిక్క తిక్క ప్రశ్నలేసే ఆడాళ్ళని ఎలా తట్టుకోవాలా అని అతను రోజూ బెంబేలు పడుతున్నాడు.
తగరపు వలసలో ఎక్కేరు నూకాలు, రాజమ్మ. వాళ్ళు ఇద్దరూ తోడికోడళ్లు.
కండక్టరు విచిత్ర విన్యాసాలు చేసుకుంటూ చెట్టుకొమ్మ పట్టుకుని ఎగిరే కోతిలా, రాడ్ పట్టుకుని, ప్రతి ప్రయాణీకుడి, ప్రయాణీకురాలి దగ్గరకు వెళ్లి వాళ్లకి టికెట్ ఇస్తున్నాడు. ఆడవాళ్లయితే మరీ ఇబ్బంది. వాళ్ళ ఆధార్ కార్డు చూడాలి, సున్నా టికెట్ చింపి ఇవ్వాలి. నరకం చూస్తున్నాడు కండక్టర్.
“సర్దుకోండి.. సర్దుకోండి..” అంటూనే వున్నాడు. ఎవరూ పట్టించుకోవడం లేదు.
భోగాపురం వచ్చేసరికి, నూకాలుకి, రాజమ్మకి కండక్టర్ వెనుక సీటు దొరికింది. దొరికింది అనడం కంటే, వాళ్ళ దౌర్జన్యం వల్ల ఓ రెండు ఆడ జీవాలు నలగ లేక బస్సు దిగేసినట్లు వుంది.
విజయగర్వంతో సీట్లో కూలబడ్డారు. ఇంక బాతాఖానీ మొదలు పెట్టేరు.
కండక్టర్‌కి వాళ్ళ మాటల రొద చిరాకుగా ఉంది. కానీ, వాళ్ళ నోట్లో నోరు పెట్టలేక ఊరుకున్నాడు. అతను రోజూ, ఇలాంటి ఆడవాళ్ళని చూస్తూనే ఉంటాడు. పైగా ఫ్రీ బస్సు పథకం పెట్టేక, ఆ పరిస్థితి మరింత పెరిగి పోయింది.
తన వెనుక సీట్లో కూర్చుంటే.. వీళ్ళ రొదకి, టికెట్ అకౌంట్ వేసుకోవడం అతనికి ఇబ్బంది.
“వదినా.. మా సెల్లి గౌరిని వచ్చేటప్పుడు నాతో వచ్చేమన్నాను” అంది నూకాలు.
“ఇప్పుడెందుకు?” అంది రాజమ్మ.
“కితం నెల్లో, దాని మొగుడు కొత్త గొలుసు సేయించేడు వదినా, అది వచ్చి ఒక రోజు మా ఇంట్లో ఉండి, మా ఆయనకీ సూపిత్తే.. మళ్ళీ నెలకయినా, నాకు సేయించమని అడుగుదావని.” అంది నూకాలు.
నూకాలు చెల్లెలు ఉండేది పలాసలో.
“అయితే.. తిరిగి వచ్చేటప్పుడు ఎక్కుద్దా” ప్రశ్నించింది రాజమ్మ.
“ఎందుకూ.. ఎల్లేప్పుడే కబుర్లు సెప్పుకుంటూ మందస ఎల్దాము, వచ్చేయమన్నాను. ఎలాగూ నువ్వు పలాసలో దిగుతావు కదా. దానికి నా పక్కనే సీటుంటది కదా..” అంది.
“నువ్వు పలాస ఎల్లేది జీడిపప్పుకే కదా!” అంది నూకాలు, రాజమ్మని ఉద్దేశించి.
“అవును వదినా.. స్టాకు అయిపోయింది. మళ్లీ తెచ్చుకోవాలి” అంది రాజమ్మ.
“వదినా. నేను ఎల్లుండి ఎల్తాను. వీలయితే, నాకు ఓ 10 కేజీలు తెచ్చియ్యే.. ఈరోజు మందస యెల్లి పోతున్నాను కదా” అంది నూకాలు.
“నీకు జీడిపప్పు తెస్తాను కానీ, నువ్వు వచ్చేటప్పుడు నాకు సీటు పెట్టి వుంచు.. మరి నాకు కూడా నువ్వు తెచ్చిన సరుకులో కొంత ఇత్తావు కదా!” అంది రాజమ్మ.
సరేనంది నూకాలు.
నూకాలు మందస నుండి వచ్చేటప్పుడు పాలకోవా తెచ్చుకుంటుంది. ఇదివరకు వాళ్ళాయన వెళ్ళేవాడు. వెళ్లినా 20 కేజీల సరుకు ఒకసారి తెచ్చేవాడు. ఇప్పుడు బస్ ఫ్రీ అవడంతో తనే వెళ్తోంది, పైగా దఫాకి 10 కేజీలు సరుకే తెచ్చుకుంటోంది.
మందసా పాలకోవాకి తగరపు వలసలో డిమాండ్. అలాగే, పలాస జీడిపప్పుకి తగరపు వలసలో మంచి కొనుగోళ్లు ఉంటాయి. ఆ ఆడాళ్ళు ఇద్దరికీ, తగరపువలస హై వే మీద జీడిపప్పు షాపులు వున్నాయి. అక్కడ జీడిపప్పుతో బాటు, మందస పాలకోవా కూడా అమ్ముతారు. వీళ్ళే కాదు, ఈ రకం వ్యాపారాలు చేసే వాళ్ళు చాలామంది వున్నారు. బస్సు ఫ్రీ అవడంతో మగవారి కంటే ఆడాళ్ళు ఎక్కువ తిరిగేస్తున్నారు ఇప్పుడు.
ఇంతలో నూకాలు దృష్టి పక్క వైపు వున్న ముందు వరస సీట్లో కూర్చున్న లక్ష్మి మీద పడింది.
“ఏటే లచ్చీ.. నువ్వెక్కడికీ?” అంది.
“మా ఒదిన కొడుకు నరసీపట్నం కాడినుండి అడ్డపిక్కలూ, ఆకాకరకాయలూ తెచ్చేడు. అవి టెక్కలి తీసుకెళ్తన్న ఒదినా. టెక్కలిలో ఆటికి మంచి రేటు. అక్కడ మార్కెట్౬లో అమ్ముకుని, ఓపాలి మా యక్క నర్సిని సూసి, రేత్రికి గాని, రేపు గాని తిరిగొచ్చేత్తాను” అంది డ్రైవర్ సీటు వెనుక కూలేసిన మూట చూపిస్తూ.
“అలాగే, వచ్చేటప్పుడు అక్క పెట్టిన అప్పడాలు తీసుకొత్తను”.. అని ముసి ముసినవ్వులు నవ్వింది లక్ష్మి.
“మీ యక్క అప్పడాలు బాగా పెడతాదా?” ప్రశ్నించింది నూకాలు.
“అవును, మా యక్కని అప్పడాలు పెట్టమన్నాను. పెట్టింది. ఓ 500 అప్పడాలు నరశీపట్నం తీసుకెల్లాలి” అంది లక్ష్మి.
ఆమె విశాఖపట్నం బస్టాండ్‌లో ఎక్కింది. బస్సు రాగానే ఎక్కిపోయిందేమో, ముందు సీటు దొరికింది.
లక్ష్మి అక్క నర్సమ్మ ఉండేది టెక్కలిలో.
“పోన్లే.. మంచిదే. ఎలాగూ బస్సు టికెట్ లేదు కదా” అంది నూకాలు.
పడుతూ లేస్తూ బస్సు ఒక్కో వూరు దాటుతోంది.
టెక్కలిలో లక్ష్మి తన కూరగాయల మూటతో దిగిపోయింది. అలాగే, రాజమ్మ పలాసలో దిగిపోయింది. తన అజెండా తనకి ఉంది కదా. పలాసలో నూకాలు చెల్లి బస్సు ఎక్కింది. నూకాలు పక్కన, రాజమ్మ దిగిపోయిన సీటు ఆక్రమించుకుంది. మరో అరగంటకి బస్సు మందస చేరింది.
బస్సు షెడ్ లోకి తీసుకెళ్లి పెట్టేడు డ్రైవర్. వాళ్లకి ఓ గంట రెస్టు. ఈ లోపల భోజనం చేసి, మళ్లీ తిరుగు ప్రయాణానికి అదే బస్సుకి రెడీ అవుతారు.
గంట గడిచేక బస్సుని తెచ్చి విశాఖపట్నం వెళ్లే బస్సులు ఆగే స్లాట్‌లో పెట్టేడు డ్రైవర్.
బస్సు ఎక్కిన కండక్టర్‌కి మళ్లీ అదే సీట్లో కూలబడిన నూకాలు, వాళ్ళ చెల్లి కనపడ్డారు.
“యేటి, మీరు బస్సు దిగలేదా?” అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కండక్టర్ రాజు.
“దిగి, భోజనం సేసి, 20 కిలోల పాలకోవా కట్టించుకుని ఎక్కీసినాము బాబూ” అని ముసి ముసి నవ్వులు నవ్వుతోంది నూకాలు.
జతగా నవ్వుతూ, మెడలో మొగుడు కొత్తగా చేయించిన బంగారు గొలుసు చూసుకుంటోంది ఆమె చెల్లి గౌరి.
విస్తుపోవడం రాజు వంతు అయింది.
మళ్ళీ ప్రయాణీకులతో.. అదీ ఆడ ప్రయాణీకులతో యుద్ధానికి సిద్ధం అయిపోయాడు రాజు.
‘స్త్రీ శక్తి ఆంటే.. ఇదా?’ అని మనసులో గొణుక్కున్నాడు.
ప్రభుత్వ పథకం. పాటించక తప్పదు కదా. సంస్థ ఆదాయం తగ్గిపోయినా, ఈ వెసులుబాటు నూకాలు, గౌరి, రాజమ్మ, లక్ష్మి లాంటి వాళ్ళు విచ్చలవిడిగా తమ వ్యాపార అవసరాలకి, అనవసరపు తిరుగుళ్ళకి వాడేసుకుంటున్నా, నిశ్శబ్దంగా చూడాల్సిందే అతను.
శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ A.P.E.P.D.C.L లో పర్సన్నల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించి, పదవీ విరమణ చేశారు. వారిని 9440602019 అనే నెంబరులో సంప్రదించవచ్చు.
