[భట్టు వెంకటరావు గారు రచించిన ‘‘సుమతీ శతకం’లో చేరని మరికొన్ని పద్యాలు’ అనే రచనని అందిస్తున్నాము.]
నీతిశతకాలలో ‘సుమతీ శతకం’ పొందినంతగా జనాదరణ పొందిన శతకం మరొకటి మనకు లేదు. సుమతీ శతకానికి ప్రస్తుతం లభ్యమౌతున్న ఒక తాళపత్రప్రతి కరుటూరి అచ్చన అనే వ్యక్తి, ప్రమోదూత నామ సంవత్సరం, ఫాల్గుణమాసం, బహుళపంచమీ శుక్రవారం (ప్రమోదూత సంవత్సరాలు మనకు 1990-91, 1930-31, 1870-71, 1810-11, 1750-51.. ఈ వరసలో వచ్చాయి. వాటిల్లో ఫాల్గుణమాసం, బహుళ పంచమి శుక్రవావారానికి 1811వ సంవత్సరం ఫిభ్రవరి నెల 15వ తారీకు సరిపోయింది) వరకు వ్రాసి ఉంచుకున్న ప్రతి అందుబాటులో ఉంది. ఈ తాళపత్రప్రతిలో 115 పద్యాలున్నాయి. ప్రస్తుతం ముద్రణలో లభ్యమౌతున్న ‘సుమతీ శతకం’లో చేరని పద్యాలు 40 ఇందులో ఉన్నాయి. ఈ 40 పద్యాలలో అశ్లీలార్థం కలిగినవి, ప్రత్యేకించి ఒక కులానికి గుణాన్ని ఆపాదించేవిగా ఉన్న15 పద్యాలను మినహాయించగా మిగిలినవి 25 పద్యాలు ఉన్నాయి. ఈ 25 పద్యాలలోంచి తీసుకున్న 10 పద్యాలతో ఒక వ్యాసం ‘సుమతీ శతకం’ లో చేరని పద్యాలు అనే శీర్షికతో 5/5/2025 సోమవారం నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ‘వివిధ సాహిత్యం’ పేజిలో ప్రచురించబడింది. అవి పోగా మిగిలిన 15 పద్యాలకు సంబంధించిన వివరాలు ఈ వ్యాసం. తాళపత్రప్రతిలోని పద్యం క్రమసంఖ్యను ప్రతి పద్యం నాల్గవ పాదం చివర బ్రాకెట్లలో సూచించాను.
కం.
అనఘా! విను వుద్యోగికి
ధనముండెను కీర్తియుండె తగచోటుండెన్;
వనరగను నిరుద్యోగికి
ఘనకీర్తులు రెండు లేవు, ఘనముగ సుమతీ! (19)
రాజాశ్రయం పొంది ఆ రాజు కొలువులో పని చేసే ఉద్యోగికి డబ్బు, ఇల్లు, కీర్తి అన్నీ ఉంటాయి. ఉద్యోగం లేని వ్యక్తికి అవి ఉండవు అని భావం. చివరి పాదంలో ‘ఘనానికి’ సంబంధించిన పునరుక్తి దోషం పద్యం నడకను ఒకింత కుంటు పరిచింది తప్పితే, ఇప్పుడు ముద్రణలో లభ్యమౌతున్న ‘సుమతీ శతకం’ లోని పద్యాలకు ఎందులోనూ తీసిపోని పద్యం ఇది!
కం.
నిరతము బోటితొ పొందును,
పరకాంతలతోటి చెలిమి బలయులతోడన్
విరసము, మూర్ఖుల సరసము,
కొరగానివి హాని వచ్చు గురుతుగ సుమతీ! (45)
భాష పరంగాను, నీతిబోధకంగాను ‘సుమతీ శతకం’ పద్యాల ముద్ర నూటికి నూరుపాళ్లు ఉన్న పద్యం ఇది! బాధ్యత మరిచి కాలం వృధాగా గడపడం, తనకంటే బలవంతులతో స్పర్ధలు పెంచుకోవడం, తగినంతగా తెలివిలేని వ్యక్తులతో సరసమైన సంభాషణ చేయబూనడం పనికిరానివి, హాని కలిగించేవిగా గుర్తించాలి – అని భావం.
కం.
సిరి దనకు వచ్చినప్పుడు
సిరికిందగు చిహ్నలెల్ల చేయగ వలదా;
సిరి గూర్చి పోవ దలచిన
సిరి కడపట జేరు నదియు సిద్ధము సుమతీ! (49)
చాలా మంచి భావంతో కూడుకున్న పద్యం ఇది. ‘సిరి’ అంటే డబ్బు అన్న అర్థంలోనే కాకుండా ‘భగవంతుని కృప వలన కలిగే మంచి కాలం, కలిసివచ్చు కాలం’ అన్న అర్థంలో ఆలోచిస్తే, ఆ కలిసి వచ్చే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మనిషి యోగ్యత ఉంటుంది. ఒకసారి ఆ కాలం దాటిపోయాక, మరొకసారి ఎదురు చూసినా అటువంటి కాలం రాదు సరికదా, ఎంతగా ఎదురు చూస్తే అంతగా దూరం జరిగి పోతుంది. కనుక, లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా ఉన్న రోజులలోనే, ఆ కటాక్షం వీలైనంత ఎక్కువ కాలం తన మీద ప్రసరించి ఉండే జాగ్రత్తలను మనిషి తీసుకోవాలి – అని భావంగా చెప్పే పద్యం ఇది.
కం.
తెరువైన చేను దున్నకు
కరువైనను బంధుజనుల కడనుండకుమీ
నెనరైన ఆత్మ విడువకు
చెరపకుమీ యన్నసుతుల సిద్ధము సుమతీ! (58)
అందరూ నడిచే మార్గంగా ఉన్న ప్రదేశాన్ని దున్ని, వ్యవసాయం చేయాలనే ఆలోచన మంచిది కాదు. కనుక ఆ పని చేయవద్దు. ఎంత కష్టంలోను, డబ్బు లేమిలోను బంధువుల ఇంటికి చేరి ఎక్కువ రోజులు ఉండే ఆలోచన చేయవద్దు. నెనరు – ఆత్మకు ప్రియమైనదిగా అనిపించే వస్తువులను, మనుషులను, పనులను వదిలిపెట్టే ఆలోచన చేయవద్దు. అన్నను, కొడుకుల వరస వ్యక్తులను చెడుమార్గం పట్టించే పనులు చేయవద్దు – అని పై పద్యం భావం.
కం.
వినయము కంఠాభరణము
ఘనమగు దానంబు అధిక కరభూషణమౌ;
విను కర్ణాభరణము హరి
యన హరి కీర్తనలె వాక్కు భూషలు సుమతీ! (62)
వినయము మెడ చుట్టూ ధరించే ఆభరణం వంటిది. చేతికి దానం ఆభరణం. హరికీర్తన వినడం చెవికి ఎలాగైతే ఆభరణం అవుతుందో అలాగే, ఆలాపించే నోటికి వాక్భూషణం అవుతుంది – అని భావం.
కం.
ధనపతితో సఖుడయ్యును
యనయంగా శివునకును భిక్షమెత్త వలసెన్
తనవారి కెంత గల్గిన
తనభాగ్యము లేక గలదె తథ్యము సుమతీ! (65)
సాక్షాత్తు కుబేరుడే మిత్రుడైనప్పటికీ శివుడికి ఆహారం కోసం బిచ్చమెత్తడం తప్పలేదు. అందువలన తన మిత్రులకు, బంధువులకు ఎంత కలిమి ఉన్నా తన నుదుటిన బ్రహ్మ వ్రాసినంత మటుకే తనదిగా మిగులుతుంది గాని అంతకు మించి ఏమాత్రము కలగదు – అని భావం.
కం.
కాదన్నవాడె కరణము
వాదణచినవాడె రెడ్డి వసుధీశు కడన్
లేదన్న వాడె చనవరి
గాథలు పెక్కాడు వాడె కావ్యుడు సుమతీ! (67)
తన మాట తప్ప మరొకరి మాటను చెల్లనివ్వని నేర్పరి కరణము. ఊరిలో వ్యక్తుల మధ్య వచ్చే తగాదాలను తీర్చగలిగేవాడు ఆ ఊరికి పెద్ద దిక్కుగా భావించబడే రెడ్డి. రాజు సమక్షంలో ఆ రాజు మాటగా తానే ‘కాదని’ ‘లేదని’ ‘కుదరదని’ చెప్పగలిగినవాడే చనువు గలిగిన ఆంతరంగీకుడు. ఎన్నో కథలను కల్పించి చెప్పగలిగిన నేర్పున్నవాడే ‘కావ్యుడు’ – అనగా గ్రంథకర్త – అని భావం.
కం.
ఇంపెరుగని సతి గవయకు
పెంపెరుగని రాజు గొల్వ పెద్దరికముతో
కంపుడిగిన పువు ముడుచుట
సంపెంగకు తుమ్మెదేగి చచ్చుట సుమతీ! (68)
తానంటే ఇష్టం లేని స్త్రీతో సాంగత్యాన్ని కోరడము, తనను ఆదరించి తన వృద్ధిని కోరని రాజును పెద్దమనసుతో సేవించాలనుకోవడము అనే పనులు, వడలిపోయి, సువాసనను పోగొట్టుకున్న పూవులను తలలో ధరించడంతో సమానం. మకరందం కోసం తుమ్మెద సంపెంగ పూవును చేరి అక్కడ మాటేసి వుండే పాము నోటిలో పడి ప్రాణాలు పోగొట్టుకోవడంతో సమానమైనవి అని భావం.
కం.
పాలం గలిసిన జలములు
పాల విధంబుననె నుండు పరికింపంగా
పాల చవి జార్చునట్లౌ
చాలని నరుపొందు సేయ జనదుర సుమతీ! (92)
పాలలో కలిసే నీళ్ళు పాల రూపాన్నే పొందుతాయి. కాని పాల రుచిని చెడగొడతాయి. అలా నీళ్ళు కలవడం వలన పాలకే నష్టం జరుగుతూ ఉంది. ఆ విధంగానే సమానమైన అర్హత కలిగిన వ్యక్తితోనే స్నేహమైనా, సహజీవనమైనా చేయాలి. అలా కానప్పుడు అది మొదటి వ్యక్తికి నష్టం కలిగించేదే అవుతుంది – అని భావం.
కం.
ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిం
గారవముల మరి మీదట
భూరి శుభమ్ముల నదిచ్చు భువిలో సుమతీ! (95)
ధీర చిత్తులైన వ్యక్తులకు సహాయం చేయడం, సారవంతమైన కొబ్బరి నీళ్ళను తాగిన విధంగా, ఎంతైనా ఉపయోగాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని కలగజేసి మంచి రూపాన్నిచ్చి గౌరవాన్ని పెంచుతుంది. ఉత్తరోత్తరా ఎన్నో శుభాలకు అది కారణం అవుతుంది – అని భావం.
కం.
హరునైన విష్ణునైనన్
సురపతి సుతుడైన చంద్రసూర్యుని కైనన్
సురకాని వ్రయము శాయక
తరుణులు డాయంగనీరు తథ్యము సుమతీ! (102)
‘సురకాని’ అనే మాటకు ‘కానిలో నాల్గవ వంతు’ అని అర్థాన్ని ‘శబ్దరత్నాకరం’ చెప్పింది. శంకరుడంతటివాడైనా, విష్ణుమూర్తికి అపరావతారంలా అనిపించేవాడైనా, శౌర్యంలో అర్జునుడితో సమానమైనవాడైనా, సూర్యచంద్రులతో సమానమైన కాంతితో వెలిగేవాడైనప్పటికీ, డబ్బు ఖర్చుపెట్టి సంతోషపెట్టని మగవాడిని స్త్రీ దగ్గరకు రానీయదు – అని పై పద్యం భావం.
కం.
బలు విద్యలెన్ని గలిగిన
కులవిద్యకు వన్నె దెచ్చు కొంకక ధరలో
విలు విద్య పరశురాముని
కులవిద్యయె? యెంచి చూచుకొనగా సుమతీ! (108)
మిగతా విద్యలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ విద్యలు కులవిద్యతో సాధించాల్సిన పనులకు సహాయపడేవై, కులవిద్యకు బలాన్ని చేకూర్చేవిగా ఉంటాయి తప్ప వేరు కాదు అని పరశురాముడికి సంబంధించిన వృత్తాంతాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ పద్యంలో చెప్పబడింది. విలువిద్య – అనగా క్షత్రియ ధర్మం – పరశురాముడి కుల విద్య కాదు. తన కుల విద్యకు సంబంధించిన ఒక సంఘటనతో ఉత్పన్నమైన పరిణామంలో, తన క్రోథాన్ని తీర్చుకోవడాని, మాట చెల్లించుకోవడానికి, ఆలంబనగా చేసుకున్నటువంటిది. ఘోరమైన తపస్సుతో రుద్రుడిని మెప్పించి దివ్యాస్త్రాలను పొందాడు పరశురాముడు. అస్త్ర విద్యలో అతడిని మించినవారు లేరు.
కం.
పులినాకి విడుచు దైవము
గలకాలము; దైవరహితకాలంబైనన్
కలుషించి గొడ్డు గరుచును
తలపోయగ దైవవశము తప్పదు సుమతీ! (110)
రెండవ పాదంలో ‘దైవరహిత కార్యంబైనన్’ అని మూలంలో ఉంది. దానిని ‘దైవరహిత కాలంబైనన్’ అని పద్యంలో విషయానికి అనువుగా సవరించాను. దైవం తోడుగా ఉన్న రోజులలో ఎంతటి ఘోర ప్రమాదం నుండైనా చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడతాడు మనిషి. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులు నాకినట్లుగా, మనిషిని ‘పులి నాకి విడవడం’ అన్నది జరిగే పని కాదు. ప్రకృతి విరుద్ధం. అయినప్పటికీ దైవం కరుణిస్తే అది జరుగుతుంది. దైవం యొక్క దృష్టి ఏ మనిషిపై నుండి మరలి పోతుందో ఆ మనిషిని రోజూ మచ్చికగా ఉండే గొడ్డు కూడా అకారణంగా మీద పడి గాయ పరుస్తుంది. కనుకనే, జరిగే విషయాలపై మనిషికి ఎంతగా పట్టు ఉన్నదని అనుకున్నప్పటికీ, ఆ ఆలోచన నిజానికి మిధ్యగానే పరిణమిస్తుందని పై పద్యంలో సహజమైన పోలికతో చెప్పబడింది.
కం.
దారిద్రమె కుల నాశము
దారిద్రమె హీనబలము దారిద్ర్యమ్మే
నేరముల కెల్ల మూలము
దారిద్ర్యము దుఃఖకరము తథ్యము సుమతీ! (114)
మనిషికి దారిద్ర్యాన్ని మించిన కష్టం మరొకటి లేదు. సకల అనర్థాలకు అది కారణమవుతుంది. మనిషిలో బలం తగ్గడం, కుల క్షయం జరగడం డబ్బులేమి వలన సంభవిస్తాయి. తప్పనిసరి పరిస్థితులలో నేరానికి సైతం పాల్పడేలా దారిద్ర్యం చేస్తుంది. దారిద్ర్యాన్ని మించిన దుఃఖకారి మరొకటి లేదు – అని భావం.
కం.
కలిమియె కులమున కధికము
కలిమియె బలవర్ధనము కలిమియె కులయు
క్తుల కెల్ల మూల కందము
కలిమియె సుఖకరము తలపగానిల సుమతీ! (115)
మనిషికి దారిద్ర్యం ఎలాగైతే హాని కలిగిస్తుందో, దానికి పూర్తిగా భిన్నంగా కలిమి కుల వృద్ధికి, శారీరక బలానికి, సుఖానికి, సకల సౌభాగ్యానికి కారణమౌతుంది అని ఇందులో భావం.
మొదట్లోనే చెప్పినట్లుగా ‘సుమతీ శతకం’ ముద్రిత ప్రతులలో లేకుండా కరుటూరి అచ్చన తాళపత్ర ప్రతిలో మాత్రమే ఉన్న 40 పద్యాలలో, అశ్లీలార్థకాలు, అన్యథా విపరీతార్థకాలు కాకుండా, సర్వజనీనాలు సుబోధకాలు అయినట్టి 15 పద్యాలు పైవి. నాకు తెలిసినంతలో, నేను శోధించి చూడగలిగినంతలో ఈ తాళపత్రప్రతిలోని పద్యాలను ఇప్పటి వరకు, చిన్నదైనా సరే, వ్యాఖ్యతో ఎవ్వరూ ప్రకటించ లేదు.
కం.
వ్రాలా శభ్రలు తప్పులు
చాలంగా గలవు శబ్దసంగ్గతు లెరుగన్
గేలింబెట్టక తిట్టక
పోలంగ్గా దిద్దరయ్య బుధజనులారా!
‘వ్రాయడంలో చలా తప్పులు దొర్లినాయి. శబ్దసంగతులు పెద్దగా తెలియనివాడిని. యెగతాళి చేయక, తిట్టక, దయచేసి సరిచేసుకుని చదువుకోండి భుధజనులారా!’ – అని అన్ని పద్యాలకు చివరన కరుటూరి అచ్చన తన మాటగా పై కందపద్యంలో వినయంగా చెప్పుకున్న మాట. ఆయన మాటే ఇక్కడ, ఈ వ్యాసం చివరలో, నా మాట కూడా!
A retired employee. Interested in Telugu literature.
