Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సూపర్ ఐడియా

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘సూపర్ ఐడియా’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

ఆ పోలీసతన్ని పైనుంచి కింద వరకు చూసిన జగదాంబ, “నువ్వు?” అడిగింది ముక్కు మీద వేలు పెట్టుకుని డౌట్‌గా చూస్తూ

“సరిపోయింది అక్కయ్యగారూ, నా బూటూ, హేటూ, షర్టూ ఫ్యాంటూ చూస్తే తెలియడం లేదూ. నేను పోలీసునే” చెప్పాడు కనకారావ్ టోపీ తీసి బుర్ర గోక్కుని మళ్ళీ పెట్టేసుకుంటూ.

“పైకి నువ్వేవిటో తెలుస్తోంది, కానీ లోపల నువ్వేవిటో తెలియదు కదా. అదే కూరగాయలైతే, గిల్లో గిచ్చో, ముచ్చిక విరిచో, చచ్చో పుచ్చో తెలుసుకోవచ్చు. కానీ మనుషులని ఎలా తెలుసుకోగలం” అంటూ కనకారావ్ వంక చూసింది జగదాంబ.

దాంతో కాస్త భయంగా రెండు అడుగులు వెనక్కి జరిగిన కనకారావ్, “అంటే ఇపుడు నా మెడ విరిచేసి నేనేవిటో తెలుసుకుంటారా అక్కయ్యగారూ” అన్నాడు అయోమయంగా చూస్తూ.

“భయపడకు అలా నేనెందుకు చేస్తానూ. ఈ కాలంలో అన్నిటినీ అందర్నీ సందేహించాల్సి వస్తోంది తమ్ముడూ.” అని క్షణం ఆగి “ఇది చిన్న ఇల్లు, నీ కుటుంబానికి సరిపోతుందంటావా. లేదు అంటే ముందే ఆలోచించుకో, ఇంట్లో దిగాక వంకలు పెడితే, నీకు తొడపాసం పెట్టేస్తాను” చెప్పింది ఎర్రగా చూస్తూ

“అలా ఏమీ లేదు అక్కయ్యగారూ, ఒంటికాయి సొంటికొమ్ములా నేను ఒక్కడినే ఉంటాను.” అన్నాడు తన చూపుడు వేలు చూపుతూ.

“అదేమిటీ! మరి పెళ్లి, పెటాకులు” అనుమానంగా చూస్తూ అడిగింది

“రెండూ అయ్యాయి. మా ఆవిడ నేను లంచాలు తీసుకుంటున్నానని, అందరిలో పరువు పరుపులా చించానని, ఛీ కొట్టి మరీ విడాకులు ఇచ్చి, పుట్టింటికి వెళ్ళిపోయింది. మా పాప ఆవిడతోనే ఉంటుంది. అంటే ఇపుడు నేను ఒక్కడినే ఉంటాను. అలాగే నేను ఈ మధ్యనే ఒక సిద్ధాంతిని కలిసాను. అన్ని వివరాలూ వివరంగా అడిగి, అతను చెప్పింది ఏమిటంటే, నా ఇంటి వాస్తు బాలేదట. అందుకనే నేను ఎవరి మీదైనా దొంగ కేసులు పెట్టినా, లంచం తీసుకున్నా ఇట్టే దొరికిపోతున్నానట. అందుకనే ప్రమోషన్ గట్రా లేకుండా ఇలా ఉన్నచోటే గుండ్రాయిలా పడున్నానట. పైగా త్వరలో సస్పెండ్ అయ్యే అవకాశం కూడా భేషుగ్గా ఉందని గట్టిగా బల్ల గుద్దకుండానే చెప్పాడు. పైగా నా మీద చెడు శక్తులు ప్రభావం కూడా ఉందట. వాటి నుంచి తప్పించుకోవాలంటే, ఉత్తర గుమ్మాలు ఉన్న ఇంటిని వెతుక్కుని అందులోనే ఉండమన్నాడు. అందుకనే ప్రస్తుతం ఉన్న ఇల్లు ఖాళీ చేసేసి, ఇదిగో ఇలా మీ ఇంట్లో పడి ఏడుద్దావని వచ్చాను”. చెప్పాడు

“అదేంటి తమ్ముడు అలా అంటావ్, ఈ ఏ.ఐ. కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతున్నావా.” అడిగింది బుగ్గలు నొక్కుకుంటూ

“ఎందుకు నమ్మను అక్కా , నేను మాత్రం మనిషిని కాదూ? పైగా నాకు కొంచెం డబ్బు పిచ్చి కూడాను. అందుకని తప్పకుండా నమ్ముతాను. మీరు ఇల్లు ఇవ్వండి అక్కయ్య, మీకు ఏ ఇబ్బందీ రాదు”. అని ఆవిడ చెవి దగ్గర మూతి పెట్టి “ఇప్పుడు మీరు చెప్పిన రెంట్ కంటే నేను ఒక ఐదు వందలు ఎక్కువే ఇస్తాను,హి,హి,హి” చెప్పాడు పళ్లికిలిస్తూ

వెంటనే కొంచెం దూరం జరుగుతూ, “నువ్వు మరీ మంచి మనిషిలా ఉన్నావు కానీ, ముందు ఆ గుట్కా మానేయి” అనేసి చీర కొంగు మూతికి అడ్డు పెట్టుకుంది.

“అక్క, ముందు,ముందు చూస్తావు నా మంచి తనం, ముందు ఇల్లు ఇచ్చి చూడు” అన్నాడు

“సరే, నేను మీ బావని అడిగి చెప్తాను కానీ, నువ్వు ఇంట్లో దిగిపోయినట్టే అనుకో” అనడంతో

“థాంక్స్ అక్కా”, అని ఓ మెలిక తిరిగి, గెంతుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఇంటికి వచ్చిన సుబ్బారావుకి టీ ని టీపాయ్ మీద పెట్టి, విషయం అంతా వివరంగా చెప్పింది. అంతా ఆకాశవాణిలో కథ విన్నట్టు ఆసక్తిగా విన్న సుబ్బారావ్, ఆఖరులో అతనికి ఇల్లు అద్దెకి ఇచ్చేది లేదనేశాడు.

దాంతో కోపంతో ఊగిపోయిన జగదాంబ, బర్రున ముక్కు చీదేసి, తర్వాత చీర కొంగుతో తుడుచుకుని “నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీకు నచ్చదు. అన్ని నిర్ణయాలూ మీరే తీసుకోవాలి. నేను బొమ్మలా తలాడించాలి. అయినా ఆ రోజు, మా అమ్మ మా బావని చేసుకొమ్మన్నపుడే చేసుకుని ఉంటే, సంవత్సరానికి మూడు నగలు, ఆరు పట్టుచీరలతో నేను లక్ష్మీదేవిలా మిలమిలా మెరిసిపోయేదాన్ని. మిమ్మల్ని చేసుకుని ఇలా వెలవెలబోతున్నాను” అని మళ్ళీ బర్రున ముక్కు చీది చెంగుతో తుడుచుకుని ఇంకా ఏదో అనేంతలో

“వద్దు, ఫ్లాష్‌బ్యాక్ తవ్వి, మాటల కవ్వంతో నా గుండె చిలకకు. విషయం మాట్లాడమని నీకు వినయంగా నా మనవి” దణ్ణం పెడుతూ నీరసంగా చెప్పాడు సుబ్బారావ్.

“ఎందుకు, ఆ పోలీసతన్ని వద్దంటున్నారు. అందరూ ఒక్కలా ఉండరండీ”.చెప్పింది.

“అది నాకూ తెలుసు. ఇతను ఎలాంటి వాడూ అని” అడిగాడు సుబ్బారావ్.

“మంచివాడే, పైగా మనవాడే. అంటే మన కులం వాడే. పైగా అక్కయ్యగారూ, అక్కయ్యగారూ అంటూ ఎంత ఆప్యాయంగా పిలిచాడో. ఆ పిలుపు వింటుంటే, చెవిలో కోడీక పెట్టి తిప్పుకున్నట్టు ఎంత హాయిగా అనిపించిందో, అతను సూపర్. అతనికి ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే నేనూరుకోను సరికదా, మిమ్మల్ని నా చీరకొంగుకి ఉరేస్తాను”. చెప్పింది సీరియస్‌గా.

“అది, మరీ, ఆ పక్కన పోర్షన్‌లో అద్దెకి ఉంటున్న గిరి ఏవంటున్నాడు”.అడిగాడు కాస్త సందేహంగా చూస్తూ.

“అతనూ మీలాగే కొంత వింతగా మాట్లాడుతున్నాడు. అతనికి మంచి పేరు లేదట. పైగా కొంచెం తేడా మనిషి, డబ్బు కోసం ఎంతకైనా దిగిపోతాడు అంటూ ఇంకా ఏవేవో అన్నాడు”. అని ఓ క్షణం ఆగి, “అతని గురించి మనకనవసరం, అవసరం అయితే ఏదో వంక పెట్టి ఆ గిరినే ఇల్లు ఖాళీ చేయించేద్దాం”. చెప్పింది కరాకండిగా.

“నువ్వెప్పుడు నా మాట విన్నావు కనుక, సరే నీ ఇష్టం వచ్చింది చేసుకో పో” విసుగ్గా అనేసాడు సుబ్బారావ్

అతను ఇంట్లోకి దిగిన మూడు వారాలకి, “ఆ పోలీసతను దిగాక, పైన ట్యాంకులో నీళ్లు త్వరగా అయిపోతున్నాయ్” అన్నాడు సుబ్బారావ్.

జగదాంబ, కక్కలేక మింగలేక బిత్తర చూపులు చూస్తూ “అవునండీ, అతని పక్క పోర్షన్ గిరి కూడా సణుగుతున్నాడు. ఆ పోర్షన్ లోకి ఎవరెవరో వచ్చి పోతున్నారట. ఒక జంటని అడిగితే, లాడ్జి కంటే చవకగా ఇప్పిస్తా అని అతను ఇక్కడకు తీసుకుని వచ్చినట్టుగా చెప్పారట” చెప్పింది.

“అంటే, మన ఇంటిని అద్దెకు తీసుకుని, అతను మినీ లాడ్జి చేశాడా” తెల్లబోయి చూస్తూ “ఇపుడు అర్ధవైందా వాడేవిటో” అడిగాడు.

“మరేం చేద్దాం” అంది జగదాంబ బేలగా.

“ఏం చేస్తాం, ఆలోచిద్దాం” అన్నాడు శూన్యంలోకి చూస్తూ.

తర్వాత ఇద్దరూ కూడబలుక్కుని వెళ్ళి “ఇల్లు ఇలా లాడ్జిలా అందరికీ ఇవ్వడం బాలేదు. అందునా పెళ్లి కాని వారినీ, జంటలనీ తీసుకు రావడం అస్సలు బాలేదు. మీరు మీ డిపార్ట్మెంట్‌కి చెడ్డ పేరు తెస్తున్నారు. కనుక వెంటనే వీలైనంత త్వరగా ఖాళీ చేసేయండి” అని సుబ్బారావ్ అనీ అనగానే,

తారాజువ్వాలా అంత ఎత్తున లేచి మండిపోతూ, “మీ మీద దొంగ కేసులు పెడతాను, మిమ్మల్ని లోపలేస్తాను. అలాగే నేను మీ కులం కాదు, పాడూ కాదు. మీ బలహీనత మీద దెబ్బ కొట్టాను. నాకు ఈ ఏరియా ఎం.ఎల్.ఏ. కూడా బాగా తెలుసు, ఈ నెల నుండి అద్దె కూడా సగవే ఇస్తాను, మీకు నచ్చింది చేసుకోండి, పొండి” అంటూ బెదిరించి దబీమని తలుపేసేశాడు. దాంతో ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, బెల్లం కొట్టిన రాళ్లలా కామ్‌గా వచ్చేసారు.

తర్వాత రెండ్రోజులకి, కానిస్టేబుల్ కనకారావ్ వర్షంలో తడిసిన కోడిపిల్లలా వణికిపోతూ వచ్చి“మీ ఇల్లు ఖాళీ చేస్తున్నాను అక్కయ్యగారూ. ఇదిగోండి మీ తాళం” అంటూ ఇచ్చేసి,నేల చూపులు చూస్తూ వెళ్ళిపోయాడు.

ఇంతలోనే అతనిలో అంత మార్పు ఎలాగబ్బా అని సుబ్బారావు, జగదాంబ ఒకరి మొహాలు ఒకరు విచిత్రంగా చూసుకున్నారు.

అంతలోనే గిరి వచ్చి, “నాలుగు నిమ్మకాయలు, పసుపు కుంకుమతో పాటు, రాత్రి మిగిలిన గోదుమ పిండితో చిన్న బొమ్మ తయారు చేసి, దానికి రెండు అగ్గిపుల్లలు గుచ్చి కిటికీలోంచి ఆ కనకారావ్ పోర్షన్‌లో పడేసాను. దాంతో వాడు పొద్దునే లేచి చూసి జడుసుకు చచ్చాడు. వెంటనే ఓ స్వామీజీని ఇంటికి పిలిచి శాంతి చేయించి ఇలా ఇల్లు ఖాళీ చేసి పారిపోయాడు” చెప్పడంతో ముగ్గురూ ఒకేసారి పకాల్న నవ్వుకున్నారు.

Exit mobile version