Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సర్జ్ ప్రైసింగ్!

[ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా విపరీతంగా పెరిగిన ధరల గురించి ఓ వ్యంగ్య రచన అందిస్తున్నారు శ్రీ సముద్రాల హరికృష్ణ.]

సోమనాథం సెక్రటేరియట్‌లో గెజెటెడ్ ర్యాంకులో ఆఫీసర్‌గా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు.

‘సర్వీసులో తెగ పని చేసి, అలసిపోయాను, శరీరానికి, బుర్రకీ విశ్రాంతి ఇస్తాను, కనీసం ఒక ఏడాది’, అని తీర్మానించుకున్నాడు- తనకు తానే, తనలో తానే!

చకచకా అమలులో పెట్టేశాడు, ప్రతి పనీ నిదానమే, ఆలశ్యమే! చేతిలో తాపీ లేని ‘తాపీ’ మేస్టారు అన్నమాట!

అడ్డు చెప్పడానికీ ఎవరూ లేరు, ఉండేది ఆయనా, ఆయన భార్యా ఇంట్లో!

పిల్లలిద్దరూ ఎన్నా-రైలే! అరుదుగా రైలెక్కే విమాన ప్రయాణాధికులే!

ఆయన చెప్పినా వినే ఘటం కాదులే అని భార్య పద్మావతి కూడా పెద్దగా ఏం కలగ చేసుకోలేదు, భర్తలో పెరిగిపోతున్న బద్ధక వైఖరిలో!

కానీలే, ఏదో రెస్టు తీసుకోవాలని ముచ్చట పడిపోతున్నారు, ఆయనకే విసుగు పుడుతుంది నాలుగు నెలల్లో, ఆయనే అప్పుడు మామూలు స్పీడుకి వచ్చేస్తారని ఆమె గారి ధీమా!

ధీమా భర్త మీద కాదు, ఆ మనిషి తొందరపాటు తత్వం మీద!

అదే అతి తొందరలో ఆయనను ఈ శపథం నుంచి బయట పడేస్తుందని!

***

రిటైరైన తరువాత వచ్చిన మొదటి పండుగ, వినాయకచవితి.

ఎప్పుడూ అన్నీ ముందే ఏర్పాటు చేసుకునే సోమనాథం, ఈ విషయంలో కూడా బధ్ధకించాడు తన నియమం ప్రకారం!

నిజానికి బద్ధకం అని అవతలి వాళ్ళు అనుకోవడమే కానీ, అతను దానికి పెట్టిన పేరు ఉద్యోగం తరువాత తీసుకుంటున్న, ‘విశ్రాంతి’ అనే!

అదేదో టీ షర్టు మీద క్యాప్షన్ రాస్తారే, “It’s not that I am lazy, I am just conserving energy”, – ఆ తరహాలో అన్నమాట!

అప్పటికీ భార్య గుర్తు చేస్తూనే ఉన్నది, “నేనే వెళ్ళి తెద్దును కానీ సమయానికి ఈ నడుం పట్టేసి అవస్థ పడుతున్నాను. తొందరగా వెళ్ళండి”, అని ముందరి రోజు పొద్దుటి నుంచీ!

అయ్యవారు వింటేనా?! అంగుళం కదిలితేనా?!

అప్పటికీ, ‘దేవుడి భయం’ కూడా పెట్టింది, పద్మావతి సరదాగా!

“చూసుకోండి, వినాయకుడి విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు, రావణుణ్ణే బోల్తా కొట్టించిన మహామేధావి ఆయన! ఆయన తలుచుకుంటే.., ఎందుకులేండి నా నోట అనటం విఘ్నాల గురించి! జాగ్రత్తగా ఉండాలి ఆయనతో” అని, నవ్వుతూనే!

సోమనాథం కూడా చిదానందంగా ఈజీ చైర్‌లో జోగుతూ, “ఏమీ ప్రమాదం లేదు!  నా పేరేంటి, సోమనాథం! అంటే శివనామం! నాకు చాలా కావల్సినవాడు గణపయ్య! మా అబ్బాయే అనుకో! నువ్వు నిదానంగా ఉండు, మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళి, ఫ్రెండు దగ్గర ఒక పని ఉంది, అది పూర్తి చేసుకుని అన్ని సామానులూ తెచ్చేస్తాను. ఎల్లుండి బ్రహ్మాండంగా చవితి పూజ చేస్తాను నిష్ఠగా”, అని హామీ ఇచ్చేశాడు!

కానీ ఆ‌ మధ్యాహ్నం పేపర్ చదువూతూనే నిద్రలోకి జారుకున్నాడు.

లేచి, ‘అబ్బా, బద్ధకంగా ఉంది, రేప్పొద్దున్నే వెళ్దాంలే’ అనుకుని ఆవలిస్తూ ఊరుకున్నాడు, టీవీలో సినిమా చూస్తూ!

***

మర్నాడు ఉదయం 8 గంటలకే బయల్దేరాడు సోమనాథం అన్నీ కొని తీసుకురావటానికి, ఓ రెండు సంచులు వేసుకుని తన కారులో.

స్నేహితుడితో ఒక ప్లాటు విషయం మాట్లాడాలని ఎప్పటినుంచో అడుగుతూ ఉన్నా, ఈ పండగ రోజు రమ్మన్నాడతను.

“మా ఇంటి దగ్గరే కదా, అయిదు నిమిషాల్లో చూద్దుగానివి, తరువాతి విషయాలు నేను మాట్లాడి సెటిల్ చేస్తాను ఆ ఓనర్‌తో”, అంటూ!

అందుకని,ముందు వాళ్ళింటికి బయలుదేరాడు.

మార్కెట్ దారిలోనే వెళ్ళడంతో, కాస్త కారు పక్కన ఆపి అన్నిటి రేట్లు కనుక్కున్నాడు. నిజమే మండిపోతున్నాయి ధరలన్నీ వినాయకుడి తండ్రిగారైన శివుడి కోపం లాగానే!

ఒక షాపు వాడిని అడిగాడు కూడా, ఉండబట్టలేక, “ఏవిఁటీ, ఇంతింత పేలుస్తున్నారు ధరలు”, అని!

“ఔను సార్ మాదీ వ్యాపారమే కదా, అందరి లాగానే మేమూనూ! అంత సర్ప్రైసింగు అయిపోతారేంటండీ సారూ, ఇది సర్జ్ ప్రైసింగ్  జమానానే కదా ఎందులోనైనా” అన్నాడు, జ్ఞానబోధ తరహాలో!

“మొన్న ఉగాదికి మా వూరుకి బస్ టిక్కెట్, మామూలుగా 300/-. 700/- కి అమ్మారండీ! తప్పేదేముందీ, పని అవసరం అట్లాంటిది, అడిగిందంతా ఇచ్చే వెళ్ళానండీ! మాకు మాత్రం మరి ఎక్కడ నుంచి వస్తాయి, ఏదో మీలాంటి వారి దగ్గర వసూలు చేసుకుంటూనే కదా! అయ్యా అదీ సంగతి, ఏమేమి ఇమ్మంటారు చెప్పండిక”, అన్నాడు చురుకుగా!

“సరేలే, ఇప్పుడే తీసుకుంటే నలిగిపోతాయి, ఒక గంటలో వస్తాను, అప్పుడు తీసుకెళ్తాను ఇంటికెళ్తూ” అన్నాడు సోమనాథం!

“మీ ఇష్టం అండీ, అప్పటి రేట్లూ, అప్పటి అమ్మకాలండీ బాబూ, ముందే సెలవిచ్చుకుంటున్నాను. ఆనక మీరు ఫీలై పోకూడదు, ఇంతింత రేట్లా అని!”, అన్నాడు షాపు అతను, సోమనాథం కారు దగ్గరకు వెళ్తూంటే!

“సరే సరే  తొందరగానే వచ్చేస్తానులే”, అంటూ సోమనాథం బండి స్టార్ట్ చేశాడు.

***

ఫ్రెండుతో మాట్లాడి తిరిగి రావటానికి, ట్రాఫిక్ వల్ల బాగా ఆలశ్యమై రెండు గంటల సమయం పట్టింది..

సోమనాథం అదే షాపు దగ్గర దిగాడు, ఎట్లాగూ పొద్దున చూశాం కదా అని!

అన్నీ అక్కడే దొరికే ఆల్ ఇన్ వన్ షాపు కాబట్టి, తన లిస్టు ఇచ్చాడు సోమనాథం. పది నిమిషాల్లో అన్నీ సిద్ధం చేసి బిల్ ఇచ్చాడు షాపతను.

ఆ ధరలు చూసి ఆశ్చర్యపోయాడు సోమనాథం!

అందులో ఉన్న ధరలు-

వినాయక విగ్రహం- 600/-

అరటిపళ్ళు- 12-  250//-

తమలపాకులు-10- 50/-

కొబ్బరికాయలు-2- 150/-

పత్రి –  200/-

మొత్తం: 1250/-

“ఇదేంటి పొద్దున చెప్పిన వాటికీ ఇప్పటికీ ఇంత తేడా ధరల్లో”, అన్నాడు నాథం, చాలా అన్యాయమిది అన్న ఓ అనాథ స్వరంతో!

“సారూ, నేను అప్పుడే చెప్పాను కదా, డిమాండుని బట్టే మార్కెట్ రేటు సారూ, అంతే! నేనేం చేయలేను. మార్కెట్ ఎటు పోతే అటే మా పోక! అదే సారూ, సర్జు సర్జు! ఒక్క ముక్క షెర్లిన్ వేయనియ్యండి సారూ -ఇట్లాగే ఆలోచిస్తూ ఉండిపోయారనుకోండి, ఇంకో అరగంటలో మీ ముందే ఇవే సామాను 1500/- కి అమ్ముతాను. మీరు, బాగా రెగ్యులర్ కస్టమర్ మాకు కాబట్టి అంటున్నానీ మాట – ఇదంతా సర్జ్ ప్రైసింగు సార్! ఇప్పుడంతా డైనమిక్,.. ధరల దగ్గర మరీనూ! మారిపోతునే ఉంటాయి, పైకి, పైపైకి! మన చేతిలో ఏమీ లేదు” అన్నాడు.

‘కావాలంటే తీసుకోండి లేదా మీ ఇష్టం’, అని మాత్రం అనకుండా, ఆ ధోరణిలో!

సోమనాథం లిస్ట్ అంతా మళ్ళీ తేరిపార చూసి, “ఇందులో పూలు లేవేఁ” అన్నాడు, కాస్త చిరాగ్గా!

‘సార్, గణపతి బప్పాతో వ్యవహారం, విసుగూ కోపం పనికి రావు! పూలు ఇప్పుడు అమ్మటం లేదు సారు” అన్నాడు!

“ఏం ఎందుకూ?!” అన్నాడు సోమనాథం,ఇంకేం తిరకాసు పెట్తాడో అనుకుంటూ.

“అంతే సారు, అదంతే, మా అసోసియేషన్ మూకుమ్మడి నిర్ణయం అది. రేపు పొద్దున ఆరు గంటలకే మొదలు పూల అమ్మకం. ఫ్రెష్‌గా ఉంటాయి దేవుడు గారికి, అందుకూ” అన్నాడు ఎందుకో చిన్నగా చిర్నవ్వు వెలిగిస్తూ!

నాథం, “అందుకా,లేక చివరి క్షణంలో రేటు నాలుగు రెట్లు చేసి ఒక్కో పూవుకి పదో పదిహేనో ధర పెట్టొచ్చనా!?”, అన్నాడు ఆ వాలకం అర్థమౌతుండగా నెమ్మదిగా.

షాపు వాడు సదానందంలా ముఖం వెలిగిపోతుండగా, “అయ్యా, సర్జ్ ప్రైసింగు గుట్టంతా ఇట్టే పట్టేశారు, మీకు నేను చెప్పేది ఏం‌మిగిలింది”, అని “ఆఁ చెప్పండయ్యా ఎన్ని తీసి ఉంచమంటారు పూలు, మీకు రేప్పొద్దుటికి”, అన్నాడు సోమనాథాన్ని ఆశ్చర్యపరుస్తూ!

చివర ఓ మాట కూడా అన్నాడు, “దాన్ని బట్టే అడ్వాన్సు మరి”, అని!

“అడ్వాన్సు దేనికీ, పూలకా!?” అని అడిగాడు క్లారిటీ కోసం.

అవునని తలూపాడు షాపతను.

“ఒకవేళ, ఏదో కారణం వల్ల నేను రాలేకపోతే, లేదా ఇంట్లో ఉన్న పూలతో సరిపెట్టేసుకుంటే- అప్పుడూ?!” అన్నాడు అగ్రిమెంట్‌లో తప్పు పట్టుకున్న వాడి ముఖంతో!

“మీ పైసలు ఫర్ఫెట్టే ఇంక”, అన్నాడతను.

“ఏంటీ ‘ఫర్ఫీటా’ ( forfeit)” అన్న సోమనాథాన్ని చూస్తూ అతను,” సారూ, మా రమేష్ అంటూంటాడు ఈ మాట, అదే- ఇంక‌ఆ పైసలు మీరు పోగొట్టుకున్నట్టే, అవును ఫర్ఫీట్టే!”

“చాలా బాగుంది “సర్జ్ క్షవరం”, అనుకోబోయి ఆపేశాడు నాథం, గణనాథుని వారికి తన పీనాసితనం చూసి ఆగ్రహం వస్తుందేమోనన్న అనుమానంతో!

***

సోమనాథానికి వినాయకుడు ఎట్టఎదుట కనిపించినట్లు అయింది!

పూజకు ముందే భగవత్ సాక్షాత్కారం!

రెండు దంతాలతో ఉన్నట్టు!

అవి పొడవటానికి వస్తున్నాయేమొ అని భయపడ్డాడు కానీ, పొడిచినది సామాన్ల రేట్లు!

పాత, ఎప్పటి సామానులే – ముచ్చటగా ఇప్పుడు కొత్త ‘సర్జు’ అనే లేబుల్‌తో, అని తొందరగానే గ్రహించాడు.

వినాయకుడి తప్పు ఏమీ లేదని, తన బద్ధకం వల్లే సర్జాసురుడి బారిన పడ్డాననీ గ్రహించాడు.

“బుద్ధి బుద్ధి స్వామీ క్షమించు క్షమించు”, అని లెంపలు వేసుకుని, గుంజీళ్ళు కూడా తీశాడు.

దయగల దేవుడు, తప్పక మన్నిస్తాడనుకుని తృప్తిగా మర్నాడు ఖరీదైన వినాయకుడికి ఇంకా ఖరీదైన పత్రితో పూజచేసి, నాలుగు ఉండ్రాళ్ళు ప్రసాదంగా తిని, ‘సర్జు’ ఉప్పెన నుంచి తేరుకోవటానికి కాస్త నడుము వాల్చాడు.

ఆ పగటి నిద్రలో కల కూడా కన్నాడు పాపం, భయభద్రజీవి!

మరు ఏడాది చవితికి అన్నీ ముందరి రోజే తెచ్చి పెట్టుకోవాలి అని శపథం పట్టినట్టూ, పట్టినట్టే‌ నిభాయించి సర్జ్ ఎటాక్ రాక‌ముందే కావలసినవన్నీ కొనిపెట్టేసుకున్నట్టూ, ఆ కల!.

ఒక్కటే దిగులు ఆయనకు,- ముందే చేసి ఉంచిన గణపతి విగ్రహం కొనాల్సి వచ్చిందే అని!

అప్పటికప్పుడు అచ్చులో పోసి, చేసి ఇచ్చిన వినాయకుడిని బియ్యప్పళ్ళెంలో పెట్టి తెచ్చుకోవటం ఇక నుంచీ మన రేంజ్ దాటిపోయింది కాబట్టి, సర్జ్ రేట్లతో!

‘గణేశ చతుర్థి సమీపిస్తుంటే, మట్టి ధర కూడా భూముల ధరల దారినే ఆకాశమార్గం పడేస్తాయి కాబోలు’, అని నిట్టూర్చాడు నిస్సహాయంగా!

‘సరేలే సర్దుకుందాం, ఏం చేస్తాం’ అనుకున్నాడు కలలో.

సరిగ్గా గడియారం గంట కొట్టడం, కల ముగియటం, నిద్ర లేవటం జరిగిపోయినై, ఒక్కసారే!

వినాయక వ్రతం చేసుకుని సోమనాథం నేర్చుకున్న ‘సర్జు’ పాఠం కథ ఇంతటితో సమాప్తం!

చదివీ, విన్న వారందరికీ వారివారి గ్రహణ శక్తిని బట్టి సర్జు జ్ఞానమూ లభించే ఉంటుంది!

సర్వేజనాః సుఖినోభవంతు!

శ్రీమద్రమారమణ గోవిందో హారి!

శివకుటుంబ సంబంధమైన పర్వంలో వైష్ణవ నామమా!?

మరి జరిగింది, ‘గోవిందా గోవిందే’ కదూ, అందుకూ!!

Exit mobile version