[రథసప్తమి సందర్భంగా ‘సూర్యారాధనం శ్రేయోదాయకం’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
నారాయణ స్వరూపమైన సూర్య భగవానుడు సృష్టి ఆరంభ నుండి ఆకాశంలో ప్రకాశిస్తూ వెలుగులను, ఉష్ణాన్ని లోకాలకు ప్రసాదిస్తున్నాడు. సూర్యునికి వందల వేల సంవత్సరాల నుండి అర్చనలతో కూడిన ఆరాధనలు జరుగుతున్నాయి. సంవత్సరమును దక్షిణాయణం, ఉత్తరాయణం అని రెండు భాగాలుగా విభజిస్తారు. దక్షిణాయణం తర్వాత సూర్యుడు ధనుస్సురాశి నుండి మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకరసంక్రమణం రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
ఉత్తరాయణ పుణ్యకాలాన్ని దేవయానము, దక్షిణాయనాన్ని పితృయానమని అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనప్పటి నుంచి పండుగలు మొదలవుతాయి. ఆ రోజుల్లో మొట్టమొదటగా వచ్చే పండుగ రథసప్తమి. ఈ పర్వదినాన్ని సూర్యజయంతిగా జనులు సూర్య భగవానుని అర్చిస్తారు. రానున్న ఆరు నెలలకాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.
సూర్య భగవానుడు ఉదయం వేళలలో బ్రహ్మాస్వరూపంగా, మధ్యాహ్నం వేళలో మహేశ్వరుని స్వరూపంగా, సాయంవేళలో విష్ణు స్వరూపంగా భావిస్తారు. దైవం కనపడడు గాని మానవుని యొక్క మాంస నేత్రాలకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఒకే ఒక్క చక్రం కలిగి ఏడు గుర్రాలు లాగుతున్న రధానికి అనూరుడు సారథిగా రథం నడుపుతుండగా అంతరిక్షంలో మనకు కనిపిస్తాడు. ఏడు గుర్రాలని ఛందస్సులు అని అంటారు. అవి గాయత్రి, త్రష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ లని పేర్లు. ఇవి నిత్యము వేగవంతమైన చైతన్యముతో పయనిస్తూనే ఉంటాయి. సప్తవర్ణాలు, సప్తఅశ్వములు, సప్త కిరణములు, సప్తవారములు, సప్తమితిథితో ప్రకాశించు సూర్యుని సప్త కిరణాలను సుషుమ్న, హరి, కేశ, విశ్వకర్మ, విశ్వవిద్యా, సంపద్వాసు అంటారు. ఇంద్రధనుస్సులో ఉండే ఏడు వర్ణాలూకలిస్తే మనకు ధవళ వర్ణం కనిపిస్తుంది. అలాగే సూర్యకాంతికూడా మనకు తెల్లని వెలుగులను పంచుతుంది. ప్రతి నిత్యము తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు. కానీ తూర్పున, పడమటిన కూడా సూర్యప్రకాశము 24 గంటలూ ఉంటుంది. ఆయనది అవిశ్రాంత ప్రయాణం.
“జపా కుసుమసంకాశం
కాశ్యపేయం మహాద్యుతిం
తమారిం సర్వ పాపఘ్నం
ప్రణతోస్మి దివాకరం”
ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ చీకటులను తొలగించి వెలుగులను పంచే సూర్య భగవానునికి నమస్కారము.
బ్రహ్మ సృష్టి ప్రారంభించింది తూర్పు దిక్కునే. సృష్టిలో భగవంతుని రూపాలన్నీ మనకు విగ్రహాల రూపంలో కనిపిస్తాయి. కానీ సూర్య భగవానుడు మాత్రము మన కన్నులకు కనిపించే ప్రత్యక్ష దైవము. ఈ సమస్త జగత్తుకు చైతన్యాన్ని కలిగిస్తూ జగతికి జాగృతిని కలిగించే దైవము. అందుకే ఉదయము లేచి ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానునికి నమస్కరిస్తే సమస్త దోషాలు, రోగాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం.
“ఆరోగ్యం భాస్కరాదిఛ్ఛేత్” అంటారు.
“ఆదిత్యో నమస్కారప్రియః”
కనుక మనము నిద్రనుంచి లేవగానే “ఓం ఆదిత్యాయనమః” అని తూర్పుదిక్కుకు తిరిగి నమస్కారాన్ని చేస్తే ఆ రోజు దివ్యంగా గడుస్తుంది అంటారు. “అహరహః సంధ్యాముపాసీత” అను ఉపనిషద్వాక్యము అననుసరించి త్రికాలములలో అర్చనలు, నమస్కారములు ఆచరించాలని వేదవచనము. నవగ్రహములకు అధిపతియైన సూర్యుని ఆరాధిస్తే గ్రహబాధలు తొలగిపోతాయంటారు.
మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య జయంతిని చేసి భాస్కరుని ఆరాధిస్తాము. సూర్యునికి ఇష్టమైన జిల్లేడు(అర్క)పత్రములను, రేగుపండ్లను తలపై, రెండు భుజాలపై పెట్టుకొని
“యద్యత్ జన్మకృతం పాపం
మయా జన్మజన్మసు సప్తస్తు
తన్మే రోగంచ శోకంచ
మా కరీ హంతు సప్తమీ”
అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు హరించిపోతాయని ఒక నమ్మకం. ప్రతినెలలో వచ్చే సప్తమికన్నా మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి అత్యంత విశిష్టమైనది. అంతేగాక ఈ సప్తమి ఆదివారం నాడు వస్తే మనకు అధికమైన ఫలితం కలుగుతుంది. సప్తమి అంటే ఒకటి నుండి ఏడు వరకు గల స్థానాలు పూరించేది. మనకు ఏడు రోజులు ప్రాముఖ్యత ఉన్నది. ఈ రథసప్తమి రోజు తులసి కోటముందు పిండితో అష్టదళ పద్మాన్ని వేసి దానిని ఎర్రచందనం కుంకుమలతో అలంకరించాలి. సూర్యుడు అరుణ వర్ణంలో ఉంటాడు కనుక ఎర్రని పూలతో పూజించాలి. జిల్లేడు రేగు, చిక్కుడులలో సౌరశక్తి అధికముగా ఉంటుంది. గోమయం కూడా వేడిని కలగజేస్తుంది. అందుకని ముందుగా ఆవు పేడతో చేసిన పిడకలపై ఆవు పాలు పొంగించి, క్షీరాన్నం వండాలి. ఆ తర్వాత చిక్కుడుకాయలతో రథాన్ని చేసి 12 చిక్కుడు ఆకుల్లో ఈ పొంగలి నుంచి పూజించి సూర్యునికి, పంచ భూతాలకు నివేదనపెట్టి ఆ ఐదు ఆకులను పొంగలితోసహా కాంతిమంతుడైన అగ్నిలో వేయాలి. ఆ రోజు నుంచి సూర్యుడు తన గమనాన్ని మళ్లించుకుంటాడని ప్రతీతి. చలి కొంచెం కొంచెంగా తొలగిపోతూ ఎండలో వేడి కొద్ది కొద్దిగా పెరుగుతుంది.
శివ కేశవులకు ఇద్దరికీ ప్రీతికరమైనది ఈ మాసం. గీతలో శ్రీకృష్ణ భగవానుడు మాసాలలో మాఘమాసాన్ని నేనేనని చెప్పాడు. రథసప్తమి రోజున ఆదిత్య హృదయస్తోత్రము, నవగ్రహ స్తోత్రము, సూర్యశతకం పారాయణచేస్తే అత్యంత శ్రేయోదాయకం. మయూరభట్టనే కవి సూర్యశతకాన్ని రచించి తనకు కలిగిన కుష్టు వ్యాధి నుంచి బయటపడ్డాడు. రావణవధకు పూర్వం శ్రీరామచంద్రుడు అగస్తుని ద్వారా ఆదిత్యహృదయ మంత్రాన్ని ఉపదేశం పొంది యుద్ధంలో విజయాన్ని సాధించాడు.
ఆంజనేయుడు సూర్యుని గురువుగా స్వీకరించి సమస్త విద్యలను పొందాడు. అరణ్యవాసంలో అందరి ఆకలిని తీర్చడానికి ధర్మరాజు సూర్యుని ఉపాసించి అక్షయపాత్రని వరంగా పొందాడు. సత్రాజిత్తు సూర్యోపాసన వలన శమంతకమణిని వరంగా పొందాడు.
సూర్యోపాసన వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానము కలగటమే కాక శత్రుపీడ సమస్తము నశిస్తుంది. అంతేకాక ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రము కూడా సూర్యోదయ కిరణాలలో ‘డి విటమిన్’ ఉన్నదని అందుకని సూర్యోదయం తరువాత ఒక 30 నిమిషాల పాటు ఎండలో నడిచినా, నిలబడినా శరీరానికి, మనసుకు ఆరోగ్యం చేకూరుతుందని వైద్యులు చెబుతున్నారు. సమస్త లోకములకు కాంతినిచ్చే సూర్యుని అద్భుత జ్యోతిశ్శక్తి మనకు ప్రాణశక్తిని, బుద్ధిశక్తిని ప్రేరేపిస్తున్నది. సూర్య నమస్కారాలు చేస్తే ఎటువంటి వ్యాధులు దరి చేరవని అనాది నుండి యోగ పండితులు చెబుతున్నారు. ప్రతి శుద్ధ సప్తమి నాడు మనం సూర్యుని ఆరాధించవచ్చు. సూర్యుడు ద్వాదశ ఆదిత్యుల రూపంలో పన్నెండు నెలలు పన్నెండు రూపాలలో సంచరిస్తూ ఉంటాడు. ఈ మాఘ మాసంలో అర్కుడు అని పేర సంచరిస్తాడు. ఈ సమయాన సూర్యోపాసన చేస్తే జనులు సర్వసుఖాలను, సౌభాగ్యాలను పొందుతారు. ఆరోగ్యమును మించిన ఐశ్వర్యము వేరు లేదు కదా! మనకు కోణార్క్, అరసవిల్లిలో సూర్య దేవాలయములు ఉన్నాయి. సకల శ్రేయోదాయకమైన రథసప్తమి నాడు అందరూ కర్మసాక్షి, స్వయంభువు అయిన ఆదిత్యుని ఆరాధించి ఆయురారోగ్య, ఐశ్వర్యాలను పొందాలి.
