[అవ్వారి శ్యామల రాణి గారు రచించిన ‘స్వ భావము’ అనే కథని అందిస్తున్నాము.]
“పిల్లలూ, ఎక్కడున్నార్రా!” అంటూ వైశాలి ఇంట్లోకి వచ్చింది. అరుంధతి బయటకు వచ్చి కూతురి చేతుల్లో నుంచి కూరగాయల సంచీ అందుకుంది.
“ఉండమ్మా, ఒక్క నిముషం” అంటూ వైశాలి ఆ సంచి లోంచి రెండు చాక్లెట్ బార్స్ తీసింది. అంతలోనే పరిగెత్తుకుంటూ వచ్చిన పిల్లల చేతిలో వాటిని పెట్టింది. అవి వాళ్లకు ఇస్తూ, “అమ్మమ్మకి చెరో ముక్క పెట్టండిరా” అంది. అంతే! పిల్లలిద్దరూ మొహం మాడ్చుకున్నారు. ఇంకాస్త గట్టిగా చెప్పేసరికి ఏడవడం మొదలు పెట్టారు.
అరుంధతి పిల్లలకి నచ్చజెప్పి, తనకు చాక్లెట్ వద్దని, వాళ్లనే తినమని చెప్పి ఆడుకోవడానికి పంపింది. ఇద్దరు సంతోషంగా తుర్రుమన్నారు.
అరుంధతి నెమ్మదిగా వచ్చి సోఫాలో కూర్చుంది.
వాళ్ళ బాధ ఐతే తీరింది కానీ తన మనసులోని బాధ మళ్ళీ రేగింది.
కొద్దిసేపటి క్రితం జరిగిన సంఘటనంత స్పష్టంగా తన చిన్ననాటి విషయాలు కళ్ల ముందు కదలాడ సాగాయి.
అరుంధతి 6-7 సంవత్సరాల పిల్ల. ఇంటికి పెద్ద కూతురు కావడంతో, చిన్నప్పుడే బాధ్యతలు నెత్తిన పడ్డాయి. తన కంటే చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళు దెబ్బలాడకుండా కాపలా కాయడం మొదలైన పనులు ఆమెకి తెలియకుండానే ఆమె భుజాలపై పడింది. తనది కూడా అల్లరి చేసే వయసనీ, మొండితనం చేసే వయసనీ మరచి పోయింది. తల్లి “నువ్వు మంచి పిల్లవి కదమ్మా!” అంటే చాలు సర్దుకు పోయేది.
జీతాల రోజు. తండ్రి వస్తూ వస్తూ రెండు పేస్ట్రీలు (అప్పట్లో వాటినే కేకులు అనేవారు) తెచ్చాడు. ఆ కాలంలో అది చాలా ఖరీదు. రెండు కొనడమే ఆయనకు తలకు మించిన పని. ఆ కేకులు చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో! అలా చూస్తుంటే చాలు కడుపు నిండిపోయేలా – పింక్, ఆరెంజ్ రంగులలో, పైన కొబ్బరి కోరు చల్లి… అది ఒక్కటి చేతిలో పెట్టుకుని తింటే ఉంటుంది మజా! ఇలా అరుంధతి ఆలోచిస్తుండగానే వాళ్ళ అమ్మ చాకు తేవడం, వాటిని చెరి మూడు ముక్కలు చేయడం జరిగిపోయింది. అరుంధతికి ఆ చిన్న ముక్క తినబుద్ధి కాలేదు. మనసుకి దక్కవలసిన తృప్తి యేదో లాగేసినట్టు అనిపించింది.
అరుంధతి ఎనిమిదో క్లాసులో ఉన్నప్పటి సంఘటన. ఆ సంవత్సరం పుట్టినరోజుకి మూడు నెలల ముందు నుంచే అమ్మకి చెప్పడం మొదలు పెట్టింది, పుట్టినరోజు నాడు తనకు ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలని, అది ఎవ్వరితో పంచుకోకుండా తానే మొత్తం తినాలని. అమ్మ సరేనంది!
పుట్టినరోజు ఇంకా వారం ఉంది. అమ్మకు మూడు పూటలా వాయింపే! ఎందుకంటే నాన్నను అడిగే ధైర్యం లేదు. అమ్మకి చివరకి విసుగొచ్చి “బాబోయి, నన్ను చావగొట్టకే!” అని గోల.
మొత్తానికి పుట్టినరోజు నాడు చాక్లెట్ చేతికి వచ్చింది. అమ్మ ఎలా సర్దుబాటు చేసిందో తెలియదు కానీ రెండు రూపాయల చాక్లెట్ మొత్తంగా తనకే తెచ్చి ఇచ్చి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. అరుంధతి దాన్ని చూసుకుని ఒకటే మురిసిపోవడం. చెల్లెలికి, తమ్ముళ్లకు కనిపించకుండా దాచి పెట్టింది.
ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అమ్మ పాయసం, మిరపకాయ బజ్జీ చేసింది తన పుట్టినరోజు స్పెషల్‌గా. అందరు కూర్చుని తినడం మొదలు బెట్టారు. అప్పుడు నాన్న, “అమ్మ ఏమి గిఫ్ట్ ఇచ్చింది?” అని అడిగితే “ఫైవ్ స్టార్” అని చెప్పింది అరుంధతి. అంతే!
నాన్న వెంటనే, “మరి ఎక్కడ అది?” అన్నాడు. “దాచుకున్నాను” అని చెప్పింది అరుంధతి. “తప్పు కదమ్మా! తినే వస్తువు ఏదైనా అందరితో పంచుకోవాలి కదా” అన్నాడు. అరుంధతికి చాలా సిగ్గేసింది. ఎప్పుడూ అందరికీ పెట్టిన తరువాతే, తీసుకునే అలవాటు ఉంది తనకి. అది ఏదైనా సరే. ఎప్పుడూ పంచుకోవడమే అలవాటు. ఇది మాత్రం ఏదో తీరని కోరిక లాగా మిగిలి పోయినందుకు కాబోలు, దాచుకుని తినాలన్న ఆలోచన వచ్చింది.
వెంటనే తెచ్చి, ముక్కలు చేసి అందరికీ ఇచ్చింది. కానీ తన ఆశ తీరనందు వలన కాబోలు, ఎంత ఆపుకున్నా ఆగక కళ్ళల్లో నీళ్ళు తిరగడం మొదలయ్యింది. అమ్మ ఇది గమనించింది. ఆమెకి అరుంధతి కోరిక తెలుసు కనక బాధగా చూస్తూ ఉండిపోయింది.
ఇలా ఎన్ని సంఘటనలో! ఇంటి పరిస్థితుల వల్ల చిన్నతనంలో సర్దుకు పోయినా అమ్మ దగ్గర మాత్రం గుణుస్తూ ఉండేది అరుంధతి.
అరుంధతి చిన్నతనమంతా పేదరికంలో గడిచింది. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి చిన్న ప్రభుత్వోద్యోగి తల్లి గృహిణి. నలుగురు సంతానాన్ని ఆ వచ్చే జీతంతో పెంచడం అంటే అదో యజ్ఞమే వారికి. అందరికి సరిపడే తిండి కానీ, బట్ట కానీ ఇచ్చే శక్తి లేదు. దానితో ఉన్న దాంట్లో పంచుకోవడం నేర్పారు. అది చాల మంచి విషయమే కాక ఎంత ముఖ్యమైనదో, తరవాత జీవన ప్రయాణంలో బాగా అర్ధం అయ్యింది. కానీ అన్ని విషయాల్లో భాగం పంచాలంటే ఎంత బాధో, అది అనుభవించిన వారికి తెలుస్తుంది.
చిన్నప్పటినుంచి తనకు ఒకే ఒక కోరిక – అది చాక్లెట్ కావచ్చు, స్వీట్ కావచ్చు, ఒక కేక్ కావొచ్చు లేదా ఒక పండు కావొచ్చు.. దానిని మొత్తంగా తాను ఒక్కర్తే తినాలని.
ఇదేమంత పెద్ద కోరిక కాదు, ఎవరికైనా చెప్పినా నవ్వుతారు – ఇదేమి కోరిక అని! కానీ తన ప్రాణానికి మాత్రం ఇది తీరని కొరికే. అందులో ఇప్పటి పిల్లలకైతే, ఈ బాధ అర్థం కూడా కాదు. ఎంత పేదవారైనా కూడా తల్లిదండ్రులు తమ శక్తికి మించి పాటుపడి పిల్లల కోరికలు తీరుస్తున్నారు. వాళ్ళు పడ్డ బాధలు, వారి పిల్లలు పడకూడదనుకుంటున్నారు.
కానీ అరుంధతి చిన్నతనంలో అలా ఉండేది కాదు. తల్లిదండ్రులు చాల స్పష్టతతో ఉండేవారు. మా శక్తి ఇది, మా స్తోమత ఇది, మేము ఇంతే చెయ్యగలం, ఇంతే ఇవ్వగలం అని చెప్పేవారు. సహనం ఉన్న పిల్లలు ఉన్న దానిలోనే సంతోషం వెతుక్కునే వారు. అది లేని పిల్లలు తమకు తాముగా కష్టపడి తాము కోరుకున్నవి పొందే ప్రయత్నం చేసేవారు.
పెద్దయి చదువు పూర్తి చేసుకుని ఒక ఉద్యోగం సంపాదించుకున్న రోజు, అరుంధతి సంతోషం పట్టరానంతగా ఉండింది. అబ్బా! ఇప్పుడు తనకు ఇష్టమైనవి కొనుక్కొని మొత్తంగా తినేయవచ్చు అన్నది ఆ సంతోషానికి కారణం. కానీ ఆ కలలు కల్లలు కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎన్నో లెక్కలు. పెళ్లి కోసం దాచాలి, తోబుట్టువుల చదువుల కోసం దాచాలి, ఎందుకు వృథా ఖర్చు అని ప్రతి పైసా లెక్క అడిగి తీసుకునేవారు అమ్మ. నాన్న. దాంతో స్వతంత్రించి ఏది కొనలేకపోయేది అరుంధతి. తమ్ముళ్లు, చెల్లి మాత్రం గోల చేసి డబ్బులు తీసుకుపోయేవారు.
అరుంధతి జీవితంలో తరవాతి దశ మొదలయ్యింది.. వైవాహిక జీవితం. చెప్పుకోదగ్గ బాధలేమి పడలేదు కానీ, గుర్తుంచుకోదగ్గ అనుభూతులూ లేవు. అత్త, మామ, ఆడపడుచు, మరిది.. అందరికి అరుంధతి భర్త సంపాదనే ఆధారం. పెళ్లయ్యాక, తన సంపాదన కూడా తోడయ్యింది. అత్తా, మామ కోడంట్రికం పెట్టలేదు కానీ కూతురులా కూడా చూసుకోలేదు. అరుంధతికి పెళ్ళైన ఇరవై ఏళ్లకు వారు పోయేదాకా కూడా, వారితో మనసు విప్పి మాట్లాడే చనువు రాలేదు.
భర్త, చిన్నప్పుడే మీద పడ్డ సంసార భారంతో వయసుకి ముందే పండిపోయాడు. ఒక ముద్దు, ముచ్చట లేక యాంత్రికమైన జీవితం గడిచింది.
ఇక అరుంధతి, తన సంతానం వైశాలి, రవిల మీదే ప్రాణాలన్నీ పెట్టుకు బతికింది. తనకు తన తల్లిదండ్రులతో, మిగతావారితో దొరకని చనువు – వారి అనుభవంలోకి రాకూడదని, తన సమయం మొత్తం వారికే కేటాయించి, వారితోనే గడిపింది. వారి ప్రతి అడుగులో అడుగు కలుపుతూ, వారికిష్టమైన జీవితం వారికి దొరికేలా చేయడంలో విజయం సాధించింది. వాళ్లిద్దరూ కూడా ఆమెతో చాల స్నేహంగా, ప్రేమగా ఉండేవారు. ఇప్పుడూ అలాగే ఉంటున్నారు. తన మనసులోని ఏ బాధైనా, సంతోషమైనా వారితోనే చెప్పుకోవడం! అలా చెప్పిన వాటిలో ఈ తీరని కోరిక కూడా ఉంది.
చిన్నప్పుడు వాళ్లకి ఏదైనా పెడుతున్నప్పుడు అనేవాళ్ళు, “అమ్మా! మేము పెద్దయ్యాక నీకు అన్నీ కొనిపెడతాము, ఎవ్వరితో పంచుకో అక్కరలేదు” అని. ఆ మాటలు వింటుంటే ఎంత సంతోషం వేసేదో!
జీవిత చరమాంకంలోకి వచ్చింది.. అత్త, మామ, భర్త కూడా దాటుకున్నారు. అరుంధతి రిటైర్ అయిపోయింది, పెన్షన్ వస్తుంది. కొడుకు విదేశంలో ఉన్నాడు. అక్కడికి పోయి ఉండలేక, కూతురు దగ్గర ఉంటున్నది. అల్లుడు మంచివాడే! చెప్పుకోదగ్గ కష్టం ఏం లేదు. కానీ ఆమె తిండి చపలం మాత్రం తీరలేదు. చేతిలో డబ్బున్నా, కొనుక్కోవాలంటే మొహమాటం. ఇంట్లో చేసుకుందామనుకుంటే, పిల్లలు ఏమనుకుంటారో అన్న సంశయం! ఈ వయసులో కూడా ఇంకా తిండి చపలం ఏమిటి అని అనుకుంటారేమో అని జంకు. ప్రతి రోజు ఎదురు చూస్తుంది. తన కూతురు పిల్లలతోపాటు తనకు కూడా ఏదైనా తెచ్చి ఇస్తుందేమో అని! కానీ ప్రతిరోజూ ఒకే మాట, “పిల్లలూ, అమ్మమ్మకి కొంచం పెట్టండి” అని. కూతురు దృష్టిలో అది చాల గొప్ప పెంపకం కావొచ్చు – తన పిల్లలకి పంచుకోవడం నేర్పుతున్నాను అని కానీ అమ్మ చిన్ని కోరిక అది ఎలా మర్చిపోయింది అనుకుంటే మాత్రం గుండె పిండేస్తుంది.
ఇవ్వాళ ఓర్చుకోలేక అనేసింది, “ఏమే, నాక్కూడా ఒకటి తెస్తే ఏమవుతుంది అని?” అంతే! “ఎందుకమ్మా నీకు మొత్తం ప్యాకెట్.. తింటే అజీర్తి చేసి మళ్ళీ వాంతులు, విరోచనాలు అని మొదలు పెడతావు. డాక్టర్ల చుట్టూ పరిగెత్తాలి. అదీ కాకుండా పిల్లలకి అంటే ఏదో తంటాలు పడి తెస్తాము కానీ అందరికి అంటే చూసుకోవాలి కదా!” అంది. అరుంధతి మనసు చివుక్కుమంది. మాట్లాడకుండా బయటకి వచ్చేసింది. రాత్రి అన్నం కూడా తినబుద్ధి కాకపోయినా, మళ్ళీ అదో గొడవ అవుతుంది అనీ, అదీ కాక తన షుగర్ లెవెల్స్ కూడా మారతాయి కనక కాస్త తిని పక్క ఎక్కేసింది.
ఆ రాత్రి అరుంధతికి నిద్ర పట్టలేదు. మనసులో ఆలోచనల హోరు, ‘నేను ఇలా ఆలోచించడం తప్పేమో? ఈ వయసులో ఇంకా ఈ చపలం ఏమిటి? ఈ కోరికలు ఏమిటి? వారి పిల్లలతో పాటు నాకు కూడా చెయ్యాలంటే నా పిల్లలకి తలకు మించిన భారం కాదా?’ ఈ ఆలోచనలు ఒక వైపు. మరో వైపు – ‘ఇప్పుడు కూడా కాకపోతే. ఇంకెప్పుడు తీరతాయి నా ఈ చిన్ని చిన్ని కోరికలు? జీవితంలో పెద్ద కోరికలు ఎలాగూ తీరకుండా పోయాయి.. ఇవి కూడా తీరవా? నేనెన్ని సర్దుబాట్లు చేసి ఉంటాను, నా పిల్లల కోరికలు తీర్చడం కోసం. అలాంటిది వాళ్లిద్దరూ కలిసి నాకు తృప్తి కలిగించలేరా?’. ఇలా రెండు రకాల ఆలోచనలు చుట్టముట్టడంతో తలంతా గోళంగా భారంగా అయిపోయింది. తెల్లవారుఝామున ఎప్పుడో నిద్ర పట్టింది.
లేచేటప్పటికి పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయారు. వైశాలి తయారవుతూ ఉంది. అరుంధతిని చూడగానే “ఏమ్మా ఇంత ఆలస్యంగా లేచావు? ఒంట్లో బాలేదా?” అని అడుగుతూ దగ్గరకు వచ్చి ఒళ్ళు ముట్టి చూసింది. అది అంత – ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అరుంధతికి ఏడుపు వచ్చేసింది. “లేదమ్మా బానే ఉంది, నిద్ర పట్టలేదు అంతే” అని బాత్రూం లోకి వెళ్ళిపోయింది. ‘దానికి నేనంటే ప్రేమే. కానీ బాధ్యతలు మీద పడడంతో అది ఏమి చెయ్యలేక పోతుంది’ అనుకుంటూ మొహం కడుక్కొని స్నానం చేసి వచ్చింది.
వైశాలి ఎదురుచూస్తూ ఉంది. అరుంధతి బయటకు రాగానే “అమ్మా! టిఫిన్, భోజనం టేబుల్ మీద సర్టి పెట్టాను. పూజ కాగానే టిఫిన్ తిని మందు వేసుకో. సాయంత్రానికి కూడా తగ్గకపోతే, నేను వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకు వెళతాను. ఇక నేను బయలుదేరతా అమ్మా, తలుపు వేసుకో” అంటూ ఆఫీస్‌కి వెళ్ళిపోయింది.
అరుంధతి పూజ ముగించుకుని, టిఫిన్ తిని టీవి ముందు కూర్చుంది. కానీ దాని మీదికి మనసు పోవడం లేదు. కాసేపటికి విసుగొచ్చి బయటకు వచ్చి వీధిలో చూస్తూ నిల్చుంది. రెండు వీధులవతల, తన చిన్ననాటి స్నేహితురాలు సుజాత ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ రిటైర్ అయిపోయారు. ఇద్దరు సరదాగా, కలివిడిగా ఉండే మనుషులు. పిల్లలిద్దరూ దూరంగా ఉన్నా, వాళ్ళని వాళ్ళు పూర్తిగా బిజీగా పెట్టుకున్నారు.
దాని దగ్గరకి కాసేపు వెళదామనిపించింది. ఉంటుందో లేదో అనుకుని, లేకపోయినా ఫరవాలేదు రెండు వీధుల అవతలే కదా అని ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది.
సుజాత ఇంట్లోనే ఉంది. అరుంధతిని చూడగానే సంతోషంగా ఎదురు వచ్చి లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్ళ ఆయన ఎక్కడికో పోవడానికి తయారవుతున్నారు. అరుంధతిని చూడగానే “ఎలా ఉన్నారండి” అంటూ పలకరిస్తూ సుజాతతో “ఇంకేం మీ ఫ్రెండ్ వచ్చిందిగా ఇంక నా మీద కంప్లైంట్ కొట్టేయ్యి” అని నవ్వుతూ బై చెప్పి వెళ్లిపోయారు.
సుజాత కూడా బయటకి వెళ్లి సాగనంపి వచ్చింది.
“ఎన్ని రోజులు అయ్యింది నిన్ను చూసి అరుంధతి? పేరుకి పక్క పక్క వీధుల్లో ఉంటాము.” అంది సుజాత. “ఎలా ఉన్నా ఆరోగ్యం ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు?”
“అంతా బావుంది. అందరు బాగున్నారు..”
“మరి నీ మొహం ఎందుకు అలా వాడిపోయి ఉంది” అనుమానంగా అడిగింది సుజాత.
“చెపుతాను, కానీ ముందు కొంచం టీ ఇవ్వవా”.
సుజాత తెచ్చిన టీ తాగుతూ మనసులో బాధ అంతా చెప్పింది అరుంధతి. సుజాత చాల శ్రద్ధగా వింది. “ఒక్క పది నిముషాలు కూర్చో, ఇప్పుడే వస్తాను” అంటూ లోపలికి వెళ్ళింది.
పదినిముషాల్లో తాళం కప్ప చేతిలో పట్టుకుని బయటకి వచ్చింది “పద, పద” అంటూ అన్యమస్కంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న అరుంధతి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. సుజాత తల దువ్వుకుని, చీర మార్చుకుని వచ్చింది.
“ఎక్కడికే? ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలని లేదు”.
“ఇప్పుడు నీ మూడ్ బాగవ్వాలంటే మనం బయటకి వెళ్లాల్సిందే. ఇవ్వాళ నేనేం చెపితే అది చెయ్యాల్సిందే” అంది సుజాత.
ఇద్దరూ బయటపడ్డారు. కబుర్లు చెప్పుకుంటూ నడవడం మొదలుపెట్టారు. కొంచం సేపు గడిచాక, హాయిగా అనిపించసాగింది అరుంధతికి. అలా బయట వీధుల్లో ఏ పనీ లేకుండా నడిచి ఎన్నేళ్ళయిందో, ఎప్పుడో చిన్నప్పుడు నడిచింది. అదే చెప్పింది సుజాతకి..
“అదే మన ఆడవాళ్లు చేసే తప్పు. మనకంటూ కాస్త సమయం తీసుకోము, ఆరోగ్యం చూసుకోము, ఇష్టాలు గమనించుకోము. ఇల్లు, పిల్లలు సంసారం.. ఈ రంధిలో పడి ఇదిగో అరవై ఏళ్ళు వచ్చేసరికి నీలా అవుతారు” అంటూ “ఇప్పటివాళ్ళు కాస్త నయం” అంది సుజాత.
విండో షాపింగ్ చేస్తూ నడుస్తున్నారు. చెరుకురసం బండి కనిపించింది. అరుంధతి నోట్లోంచి అప్రయత్నంగా వచ్చేసింది “చెరుకురసం, చెరుకురసం” అని.
“పద తాగుదాం” అని సుజాత అటువైపు నడక సాగించింది. “బావుండదే! ఈ వయసులో అలా రోడ్డు మీద నుంచుని ఎలా తాగుతాం” అంది అరుంధతి. అక్కడ నిల్చుని చెరుకురసం తాగుతున్న వృద్ధ దంపతులను చూపించింది. సుజాత. మారు మాటాడకుండా వెళ్ళి చెరుకు రసం తీసుకుంది. ఎన్ని రోజుల తరువాత తాగిందో! ఒక్కొక్క గుక్క నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగింది.
“ఇంకోటి తాగుతావా” అడిగింది సుజాత.
“అమ్మో! దీనికే ఏమైనా అవుతుందేమో అని భయపడుతున్నాను” జవాబిచ్చింది అరుంధతి.
“ఏమీ కాదు పద!” అంది సుజాత.
అక్కడనుండి కదలి నెమ్మదిగా నడక సాగించారు. అలా వీధుల్లోని దుకాణాలు చూస్తూ, రికామీగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే, వారికి వారి కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి!
ఉన్నట్టుండి సుజాత అడిగింది – “మన కాలేజ్ చూసొద్దామా?”.
అరుంధతి ఇప్పుడెందుకు అని అంటున్నా వినక ఒక ఆటోని పిలిచి ఎక్కింది. ఇద్దరూ ఆర్ట్స్ కాలేజి దగ్గర దిగారు. ఆ వాతావరణం చూడగానే ఆనాటి జ్ఞాపకాలు, స్నేహితులు, లెక్చరర్లు, చేసిన అల్లర్లు అన్నీ గుర్తొచ్చి యెడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు.
కడుపులో మంటూ ఉంటే టైమ్ చూసుకున్నారు. “బాబోయి, రెండవుతూ ఉంది” అంది అరుంధతి.
“అయితే! మనకేం పని ఉంది? ఏదైనా హోటల్‌కి వెళ్ళి భోంచేద్దాం” అంది సుజాత.
“హోటల్‌కి ఎందుకు దండగ. ఇంటికి వెళ్లిపోదాం” అంటున్న అరుంధతితో “నథింగ్ డూయింగ్” అంటూ మళ్ళీ బలవంతంగా హోటల్‌కి లాక్కెళ్లింది సుజాత.
అరుంధతి ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఎప్పుడో కొలీగ్స్‌తో కలిసి వెళ్లడమే కానీ, ఆ తరువాత హోటల్ కి రానే లేదు. పిల్లలు ఎప్పుడన్నా వెళ్ళినా, వాళ్ళతో వెళ్లబుద్ధి పుట్టక రానంటుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా అదే అలవాటై రమ్మని పిలవడం మానేశారు.
వాళ్ళకి ఇష్టమైనవి ఏవో ఆర్డర్ చేసి తిన్నారు. తిన్నంత సేపూ మాట్లాడుతూనే ఉంది అరుంధతి, ప్రవాహంలా మాటలు వస్తున్నాయి. స్నేహితురాలి కబుర్లు సుజాత నవ్వుతూ వింటూ ఉంది.
ఇద్దరూ సుజాత ఇల్లు చేరుకున్నారు. బయటకి వెళ్ళే అలవాటు తప్పిపోయినందుకు కాబోలు అరుంధతికి చాలా అలసటగా అనిపించింది. సోఫాలో కూర్చుని మాట్లాడుతూ ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తెలీదు.
ఎవరో చేతి మీద తట్టినట్టై కళ్ళు తెరిచింది. ఎదురుగా సుజాత కాఫీ కప్పుతో, టైమ్ చూస్తే ఐదున్నర. ఇంతసేపు ఒళ్ళు తెలీకుండా పడుకున్నానా అనుకుంటూ లేచి మొహం కడుక్కుని వచ్చింది.
కాఫీ అందించి పక్కన కూర్చున్న సుజాత నెమ్మదిగా అరుంధతి చేతిని తన చేతిలోకి తీసుకుంది. అరుంధతి చిన్నగా నవ్వింది. చాలా హాయిగా, తేటగా ఉంది ఆమె మొహం. తాను చెప్పనవసరం లేకుండానే తెలుస్తూ ఉంది, ఇవ్వాళ చేసిన పనులు ఆమెకి చాలా సంతోషాన్ని యిచ్చాయని..
నెమ్మదిగా సుజాత మాట్లాడడం మొదలు పెట్టింది. “అరుంధతీ! నేను చెప్పేది శాంతంగా విని, ఆలోచించు. నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్న స్నేహితురాలిని. నీ పరిస్థితులు, మనస్తత్వం రెండూ బాగా తెలిసిన దానిని.. నీ చిన్నతనం, వైవాహిక జీవితం యెలా గడిచిందో నాకు తెలుసు..
నీ గత జీవితాన్ని నువ్వు మార్చలేవు. వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా బ్రతకడం చాలా గొప్ప విషయమే కానీ, దాని వల్ల ఆ వ్యక్తి కోల్పోయే వాటి గురించి యెవ్వరూ ఆలోచించరు. నువ్వు ఏమేమి కోల్పోయావో నీకే తెలుసు. నీ పిల్లలకు కూడా అర్థం కాదు. వారి తప్పేమీ లేదు! దానికి కారణం ఇప్పటి తరం ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు. అది మంచికే వచ్చిందని నా భావన.
ఆ కారణంగానే, ఈ తరం తల్లిదండ్రులు తమ కోసం తాము కొంచం సమయం వెచ్చిస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు. తమ యిష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దానిని స్వార్థం అనుకోవడం లేదు. వారి సూత్రం చాలా సింపుల్, ‘మనిషి తాను సంతోషంగా లేకపోతే, ఇతరులని ఎలా సంతోష పెట్టగలడు’ అని. నిజమే కదా! కాబట్టి మంచిదే!
కానీ నువ్వు కాలంతో బాటు మారక అలాగే ఉన్నావు. వయసుకి మించిన పెద్దరికాన్ని తెచ్చి పెట్టుకున్నావు. నిజమే! నీకు తోడు లేదు. కానీ నీకు ఆరోగ్యం ఉంది. ఏదో వయసుతో వచ్చే బీ. పి., షుగర్ తప్ప నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నీ పనులు నువ్వు చేసుకోగలవు. ముఖ్యంగా నువ్వు ఆర్థికంగా ఎవ్వరి మీద ఆధారపడి లేవు. నీ పెన్షన్ నీకు వస్తుంది.
కానీ దానిని ఇప్పుడూ మనవళ్ళు, మనమరాళ్ళ కోసం దాచుతున్నావు. పిల్లల కోసం దాచవద్దని నేను అనను కానీ, నీ కోరికలు చంపుకుని దాచాల్సిన అవసరం లేదంటున్నాను..
ఏమన్నా తినాలంటే పిల్లలకి భయపడతావు. బయటకి వెళ్లాలంటే జనానికి భయపడతావు. ఆ భయం వదిలేయి. అప్పుడు చూడు నీ జీవితం యెలా ఉంటుందో! నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో. నీకు తెలుసు ఏది తినవచ్చు, ఎంత తినవచ్చు అని, దానిపై పిల్లల నియంత్రణ అక్కరలేదు.
బయటకి వెళ్ళి సినిమా చూడు, లైబ్రరీకి వెళ్ళు, పార్క్‌కు వెళ్ళు. ఇలా ఎప్పుడైనా నా దగ్గరకి రా. ఎవరేమను కుంటారో అని భయపడకు. ఎవరికీ నీ గురించి ఆలోచించే తీరిక లేదు. అంత తీరిక ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు!
ఎన్ని రోజులు ఉంటుందో ఈ జీవితం మనకు తెలీదు. ఉన్నన్ని రోజులు నీ జీవితాన్ని నీ చేతిలో ఉంచుకో! ఇదే నేను చెప్పేది.” అని ముగించింది.
నిశ్శబ్దంగా విన్నది అరుంధతి. ఒక ఐదు నిముషాల తరువాత లేచింది బయలు దేరతానని..
సుజాత గేట్ వరకు వచ్చింది సాగనంపడానికి, వీడ్కోలు చెబుతూ అరుంధతి చేతిలో ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ పెట్టి “ఇది అచ్చంగా నీకే” అంది.
తన చేతిలో చాక్లెట్ చూసిన అరుంధతి మొహంలో సంతోషంతో కూడిన నవ్వు కదలాడింది. దాన్ని ముద్దు పెట్టుకుని, స్నేహితురాలు చేసిన హితబోధ మనసుకెక్కిందని తెలుపు తున్నట్టు, చాక్లెట్ రేపర్ అక్కడే చించి, తింటూ ముందుకు అడుగు వేసింది.
