Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్వాగత విన్నప.. సుమ పత్రము

[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘స్వాగత విన్నప.. సుమ పత్రము’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]

సంధించిన శరమా! కాదిది! ఆహ్వాన కరపత్రము!
పరమాత్ముని పావన పాదములు తాకిన ప్రార్థనా
సుమ పత్రము! ఆ హృదయపూర్వక ‘విరిపత్రము’
సంధించిన వారెవరు..!

శ్రీ హరి.. శ్రీకృష్ణావతారమున, అవతరించి
భూభారం తొలగించిన వైకుంఠ వాసుని.. బ్రహ్మ,
ముక్కంటి, దేవతలు, గరుడ, విద్యాధర, రుద్ర
మహర్షులు.. ద్వారకా నగరమునకు వచ్చి..
యాదవ కుల తిలకుని.. పారిజాత ప్రభలతో
వెలిగే ఆ పరంధాముని దర్శించి వేదసూక్తమున
స్తుతించి సర్వలో కేశ్వరా! విశ్వంభరాధీశ!
అవతారము చాలించి వైకుంఠ పురమునకు
వేంచేయ మని కోరి ప్రార్థించారు!

అపుడు పరంధాముడు వారి ప్రార్ధన మన్నించి
వారితో యాదవులందరనూ.. వారిలో వారికి
శతృత్వం కల్పించి.. వారందరినీ వారి వారి
స్థానాలకు పంపి వికుంఠమునకు ప్రవేశించగలనని
చెప్పి వీడ్కోలిపి పంపాడు.. వాసు దేవుడు..

ఆ పిదప యాదవులను ప్రభాస తీర్థానికి పంపగా
యదుకుల శ్రేష్ఠులందరు వారిలో వారు కలహించుకుని
పదునైన తుంగలతో కొట్టుకుని వారిని వారే
అంతం చేసుకుని వారి స్థానాలకు చేరారు.
బలరాముడు.. యోగ మార్గమున అనంతునిలో
కలిశాడు!

అప్పుడు శ్రీకృష్ణుడు బృందావనమున ఒక కల్ప
తరుచ్చాయలో విశ్రాంతిగా పడుకుని ,ఒక కాలి
మీద ఒకకాలు వేసుకుని వినోదంగా
ఆడిస్తున్నాడు!

ఆ సమయంలో ఒక బోయ లేడి కాలు వలె
ఉన్నదని భ్రమించి, శరమున బాణము
ఎక్కు పెట్టి సంధించెను. ఆ శర సంధానమున
ఒక విన్నప.. పత్రము. ఆ బాణము తాకి..
హాహాకారము చేసిన పరమేశ్వరుని చూసి
అపచార భావనతో, విధి బలీయమని తలచి
చింతించగా, మురారి నీవు నిమిత్త మాత్రునివి!
నీ అపచార మేమి.. లేదని అనంతుడు చెప్పగా,
ధైవాపరాధ భావనతో, కృష్ణ చరణములు తాకి
ప్రార్ధించి, ప్రాయోపవేశమున పరమాత్మను
చేరెను.. ఆ లుబ్దకుడు!

ఆ సౌగంధిక పుష్ప పత్రమును సంధించిన
బోయయూ కారణ జన్ముడే!.. పుష్కరాక్షుడైన
పురుషోత్తముడు ‘శ్రీకృష్ణావతారము’న.. దుష్టుల
అంత మొందించి భూ భారము తొలగించిన
కారణమున అవతార పరిసమాప్తి ‘విన్నపము’
తో శరసంధాన స్వాగత కరపత్రము! ఆ పత్రము

ఎక్కడ తాకినది? సుమ మాలికా విరి పత్రము
తాకిన తావు.. సర్వ లోక శుభ ప్రదము!
పదునాలుగు భువనాలు పరిపాలించు –
సృష్టి, స్థితి, లయ కారణ భూతుడైన, లోక నాయకుడు,
విశ్వంభరుని పావన ‘మందాకినీ’ ‘సలిల ప్రవాహా
దివ్య పాదము.! సకల భువనములలో ప్రాణులు
సేవించు మహిమాన్విత దివ్య చరణార
విందములు!

చరా చరములు, సప్త సాగరములు, నదీ ,నద
ములు.. తరులు.. గిరులు.. వనము లన్నియు
విశ్వ విభుని కృపా కటాక్షములే! ఆ దివ్య
చరణములు కొలువు తీరిన స్థల వైభవము..?
కల్పతరువు లైన పారిజాత వనాలు, మందార
కుసుమ, తరు సమూహములు, పావనబృందావన
వృక్ష ఛాయా పరివృతమైన,
సాగర మేఖల.. ప్రియసఖి వసుంధరా దేవి
అంక తల్పము! నీలాంబర ధారి.. ఆదిశేషుడు
విష్ణు భగవానునికి.. ఆత పత్రమై నిలిచి.. సహస్త్ర
ఫణియుత ఛత్రమై.. అదృశ్య రూపమున
వనమాల.. కౌమోదకము.. పాంచజన్యము
సుదర్శనము.. సారంగము.. నందకి ..
నారాయణ మంత్ర జపం చేయుచు
స్వామీ! పరమాత్మా!
గోవర్ధన గిరిధారీ! లక్ష్మీ వల్లభా! వైకుంఠ ధామము
నకు వేంచేయుమని భక్తి యుత విన్నపము..

కల్పతరువులు స్తుతి స్తోత్రములతో రాజీవ నేత్ర!
నీకివే.. మా సుమాంజలులు.. స్వామీ! కేశవా!
భూభారము తొలగించి దుష్టులను అణచిన
అవతార పురుషా! అని ‘ధ్యానముద్ర’లతో
సకల శోభాయమాన పరిమళ కుసుమ ‘లేపల్లవ
సుధావర్ష సౌరు’ లతో…
నారాయణార్చన.. అల వైకుంఠ ధామమునకు
వేంచేయు మోదేవ! ప్రార్థనా పూరిత మంగళా
హ్వాన వినమ్ర వినతి !
నభో మండలమున ఆ శుభ దృశ్యము వీక్షించు
ఇంద్రాది దేవతలు.. ఆగమ, నిగమ, నుతులచే
స్తుతించు చుండగా, అచ్చరలు, దేవ కాంతా
లలామలు భువి నందు తమ తమ కర్తవ్య
నిర్వహణ చేసి ,భగవానుని దివ్య సమ్ముఖున,
గోపికా.. రాసములతో ‘దివ్య సన్నిధి’కి చేరువై,
గోకులము వీడి, సాగరమున కల్పిత రణమున
దివి కేగిన సుర వనితలు ‘విష్ణు భగవానుని’
తలచి.. కీర్తించి.. నాట్యములు చేయుచూ..
హరి కీర్తనాలాపన. చేయుచున్నారు..!

దేవ లోక సుర వరులు.. స్వాగతా రాధనలతో,
‘నారాయణార్చన’ లతో వైకుంఠధామము నకు
వేంచేయ కోరుతూ స్వాగత నీరాజనములు
పట్టు చున్నారు!..

ఆకాశ మండలమున తమ తమ పరిధిలో
అధిష్టించిన మహర్షులు, ఋషులు, మునులు,
యతీంద్రులు హర్ష హృదయములతో భక్తిభావన
ముప్పిరి కొనగా సుస్వాగతం పలుకుతూ యజ్ఞ,
యాగాదిక్రతువుల.నిర్వహణలతో ‘యాగభోక్తను’
‘యజ్ఞ పురుషుని’ ఆహ్వాన స్వాగత క్రతువులను
నిర్వహిస్తున్నారు.!

‘కర్మసాక్షి’ ఆదిత్యుడు చతుర్వేదోక్త దీక్షతో
అరుణ రేఖా మయూఖ.. శుభ స్వాగతములు
పలుకుతూ.. అంబరమున.. శోభాయుత
‘చంద్రికా హిమ కిరణములు’పరచు
తారా నాథుడు ఇందుడు తారకలతో కూడి
విచ్చేయుమా ! ‘వికుంఠ మందిరమునకు పరమ
దయా సాగరా! పరంధామా!’ అని ప్రార్ధనా
విన్నపముల పారిజాత సుమ పూజలు చేసి ,
కేల్మోడ్చి ధ్యాన నిష్టలో, సుస్వాగత కౌముదులు
సుందరముగ వెద జల్లు చున్నాడు!

చతుర్ముఖ బ్రహ్మ వాణీ సహితముగా
పితా మహుని చూసి మున్నీటి మేఖిల సాగర
జలా భిషేకమున మందస్మిత సుందర వద
నార విందముతో నవరత్న ‘మేల్కట్టు’ పై నుండి
దయ చేయుమో స్వామి!
మాతా! ధరిత్రీ దేవీ!స్వామి తోడ్కొని రావమ్మ !
మమ్మేల.. !!
వైకుంఠధామము చేరగా స్వాగతము!

చంద్ర మౌళీశ్వరుడు సతీ సమేతముగా
సంతోషాంత రంగమున త్రినేత్రములలోన ….
ద్వినేత్రములు తెరచి నేత్ర శుభ స్వాగతము.
పలుకుచూ ప్రశాంత వదనమున
నిరీక్షించుచున్నాడు..!

మేఘనాధుడు మేఘ శ్యాముని కీర్తించి ‘మేఘ
ద్వారము’ తెరచి లక్ష్మీ నారాయణ నిలయము..
వైకుంఠ మార్గమున నవరత్న శోభిత కంబళులు
పరచి.. దేవపుష్పముల మార్గము నేర్పరచగా..
వైనతేయుడు సేవించ వచ్చుచున్నాడు! రావోయి
స్వామి! ఘన మేఘ రూపా!
రేపల్లె గోపికలు, గోపాలురు, గోవులు, అశ్వాది
గజసమూహములు, శిఖులన్ని దేవస్వరూపులుగ
మారి ఆహ్వాన గీతికలు పాడు చున్నారు!

నారద తుంబురులు పరవశించి విపంచి వాదన
సంగీత స్వర నాదార్చనల,పులకిత నేత్రములతో,
శ్రీహరి వైకుంఠాగమన దృశ్యము వీక్షించుచూ,
స్వాగత కీర్తనల ఆలపించుచూ, భక్తి రసా
స్వాదనమున కైమోడ్చి మొక్కుచూ
పరవశులవు తున్నారు!

దేవాధి దేవునకు నీలోత్పల, ఉత్పల , పద్మ
మాలికలతో, అరుంధతి,సావిత్రి మొదలైన
పతివ్రతామ తల్లులు భక్తి భావనతో , స్వామి
గళమున అలంకరించి స్తుతించు చుండగా,
దేవేంద్రాది.. ముక్కోటి దేవతలు మునిశ్రేష్టులు,
మహార్షులు, విధాత, ముక్కంటి పరమపురుషా!
పురుషోత్తమా! శ్రీ కృష్ణావతారము ఘనముగా
నిర్వహించి, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి
భూదేవి భారము.. తొలగించిన ఈశ్వరా!
వైకుంఠ ధామమునకు వేంచేయు మని కోరి
ప్రార్ధించగా… ‘శ్రీకృష్ణావతార’ పరిసమాప్తితో
వైనతేయ దివ్య వాహనము పైకెక్కి
చిరునవ్వుతో వైకుంఠమును చేరుకొనె
యోగ.. నారాయణుడు!…

దివి పై ఘన స్వాగత.. దేవ దుందుభులు
మ్రోగు చుండగా మంగళా శాసన వాద్యములు
ఇంపారగా సుమ వర్షా హ్వాన స్వాగత
సందోహముల.. జయ భేరులు మ్రోగించుచూ ,
మంగళ వాయిద్య ఘోషలతో.. అప్పరసల
నాట్యములతో.. గంధర్వుల గానామృతముతో
శుభకర మంగళ సుమధుర ధ్వనుల.. కర్ణా
నందమున ఇంపు నొసగగా ,దివ్య శోభాయమాన
దివిజ మార్గమున.. గరుడవాహనుడైన..
మందస్మిత సుందర వదనుడు అభయ
హస్తముతో అనుగ్రహ పూరిత అరవింద
నయనాలతో..
వేద స్తుతుల శబ్ధ శోభలతో.. పుండరీకాక్షుడు
నిజస్థానమునకు (స్వామి చరించుతావులన్నీ
వైకుంఠ ధామములే )తరలి.. అల వైకుంఠ
పురమున సుధా సరోవరము(సరస్సు)గల
ప్రాంతంలో.. మందార వనములో గల
సరోజ సౌధము వద్ద చంద్రకాంత శిలపై కంజాత
పానుపు వద్దకు తరలి.. నిజస్థానాన్ని
అలంకరించాడు ‘దశావతారమూర్తి’
విష్ణు భగవానుడు..లక్ష్మీ వల్లభుడు!
ప్రహ్లాద వరదుడు! కరుణా సముద్రుడు!
రఘుకుల దీపికా వతంసుని.. ఆ ప్రభువును
కనులు మూసినా.. తెరిచినా.. సర్వకాల
సర్వావస్థలయందు పరమ నారాయణ స్మరణ..
ధ్యానము.. నిరంతరం మనసునందు నిలుపు
ప్రాప్తి కలిగించమని.. సర్వము తానే అయిన
విశ్వంభరుని ప్రార్థిస్తూ.. పరమేశుని అనుగ్రహం
కోరుతూ.. ‘గుయ్యారము’ వంటి ఇహ
లోకమున మెలుగు రేఖలే.. నీ దాస్యము,
స్మరణము, కీర్తనము, శ్రవణము.. అనుగ్రహించ
వేడుతూ… ఓం నమో భగవతే వాసుదేవాయ..

***

గుయ్యారము = బందిఖానా
చంద్రికా సుమములు = వెన్నెల విరులు
లుబ్దకుడు = బోయవాడు
కౌముది = వెన్నెల, చంద్రిక

Exit mobile version