[తాత మోహనకృష్ణ గారు రచించిన ‘స్వర్గానికి దారి’ అనే కథని అందిస్తున్నాము.]
“ఏమండీ..! ఏమిటండీ ఎప్పుడూ అదే మాట్లాడుతారు..?”
“నన్నేం చేయమంటావు చెప్పు..! నాలుగు పదుల జీవితం అయిపోయింది. ఇంక చెయ్యడానికి ఏమీ లేదు.. మనకున్న ఒక్క అబ్బాయి కోసం బ్యాంకులో డిపాజిట్ వేసి ఉంచాను.. బాగా చదివించు..” అన్నాడు భర్త కృష్ణ.
“అయినా ఇప్పుడు ఎక్కడకు వెళ్తారు..? తింటే ఆయాసం, తినకపోతే నీరసం కదా మీకు..”
“అదే నీ ధైర్యం కాబోలు.. చూసుకుని తింటానులే.. నాకేమి కాదు. చూస్తూ ఉండు.. ఏదో రోజు నా కోసం ఎవరో వస్తారు.. నన్ను తీసుకుని వెళ్తారు.. అప్పుడు నువ్వు ఎంత పిలిచినా, నేను ఇంక పలకను..”
“ఎక్కడికి వెళ్లాలని మీ కోరికో..?” అడిగింది భార్య రంభ.
“ఈ భూలోకంలో..ఈ ఇంట్లో అంతా బోర్, అలా స్వర్గలోకానికి వెళ్లి, అక్కడ అందరికీ హాయ్ చెప్పి.. రంభతో అక్కడే ఉండిపోతాను..”
“ఏదో అలా అనుకుని ఆనందపడండి.. ఇంట్లో రంభ లాంటి నన్నుపెట్టుకుని.. ఎక్కడో ఉండే వారి కోసం ఎందుకో ఆరాటం..? ఏం చేస్తాం.. చివరికి నా దగ్గరకే వస్తారు లెండి.. ఈ రంభ దగ్గరకి”
‘ఆ రంభతో నీకు పోలికా..? ఎలా చూసినా లేదు.. అందం, నెమ్మదితనం అసలే లేదు.. ఆ పేరు నీకు ఎలా పెటారో మరి..?’ అని మనసులో అనుకున్నాడు కృష్ణ
“ఏదో గొణుక్కుంటున్నారు..?”
“ఏం లేదు.. ఏమో ఏమైనా అద్బుతం జరుగుతుందేమోనని..!”
“అంతా మీ భ్రమ.. మీకు నేనే ఎక్కువ, పెట్టింది తిని ఉండండి అంతే.. అయినా మీ ప్రయత్నం నేనెందుకు కాదనడం.. మళ్ళీ భర్తని అన్నానని నాకెందుకు అపవాదు”
ఈలోపు లోపల నుంచి అక్కడకు వచ్చిన కొడుకు రవి..
“నాన్నా..! మీ ఇద్దరి మాటలు నాకు అంతగా అర్ధం కాలేదు.. మీరు స్వర్గానికి వెళ్తే, నాకు అక్కడ నుండి చాలా బొమ్మలు తీసుకురండి.. అక్కడ అన్నీ గొప్పగా ఉంటాయి అంట కదా..”
“మీ నాన్న ముందు వెళ్ళని, వెళ్ళాక అప్పుడు మనం మేఘసందేశం పంపుదాం లే..” అంది పెళ్ళాం రంభ వెటకారంగా.
సంవత్సరాలు గడుస్తున్నాయి.. కృష్ణ ఆరోగ్యం రోజు రోజుకు తగ్గుతూ ఉంది. అతనికి సేవ చెయ్యడానికి భార్య చాలా చిరాకు పడడం మొదలుపెట్టింది. అంతటితో ఆగక, భర్తను నిర్లక్ష్యం చెయ్యడం మొదలుపెట్టింది. ఒక భార్యగా అందించాల్సిన ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఎంతసేపూ మొగుడిని సాధించడం, సినిమాలు చూడడం తప్ప వేరే ధ్యాసే లేదు.
‘నా భార్యలో మార్పు వస్తుందేమోనని అనుకోవడం నా భ్రమ. ఇక నేను నా గురించి ఆలోచించుకునే టైం వచ్చింది. స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఎలా..? అనే పుస్తకంలో చాలా విషయాలు ఉంటాయని తెలిసింది..’ అనుకున్నాడు కృష్ణ.
కృష్ణ లైబ్రరీకి వెళ్లి అక్కడ దొరికిన ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ దివిలో రంభ కోసమే తన ప్రయత్నం అంతా. తన చిరకాల కోరిక, రంభతో తన శేషజీవితం స్వర్గంలో ఉండడమే. దానికి స్వర్గలోకానికి వెళ్తే, స్వర్గస్థులైన ఎందరో మహానుభావులను కూడా కలుసుకోవచ్చు. ఈ జీవితానికి ఇంకేమిటి కావాలి..? దానికోసం ఆ పుస్తకంలో ఉన్నట్టు రంభ జపం చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు కృష్ణ.
ఒక అనువైన ప్రదేశానికి వెళ్లి, అక్కడే తన తపస్సుకి నాంది పలికాడు. వెళ్ళే ముందు తన భార్యని, పిల్లోడిని ఆఖరిసారిగా చూసుకున్నాడు.
ఎన్నో రోజులు ఆ తపస్సు చేసాడు. చాలా రోజుల తర్వాత రంభ ప్రత్యక్షమయ్యింది.
“కృష్ణా..! నీ తపస్సుకు మెచ్చాను.. ఇక కళ్ళు తెరువు..”
“రంభా..! వచ్చావా..! నా కోసం వచ్చావా..”
“ఈ రంభ కోసం చాలా మంది తపస్సు చేసారు. కానీ నీ లాంటి మానవుడు.. నా కోసం తపస్సు చెయ్యడం నాకు చాలా ఆనందంగా ఉంది”
“ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది రంభా..”
“అయినా.. కట్టుకున్న భార్యని కాదని, ఇలా స్వర్గానికి నిచ్చెనలు వెయ్యడం ఎందుకో..?”
“నీకు తెలియని కథ కాదు నాది. అయినా చెబుతాను. నీతో మాట్లాడుతూ ఉంటే, మనసుకు చాలా హాయిగా ఉంది..
చిన్నప్పటినుంచి నేను రంభ గురించి చూసిన సినిమాలు, విన్న కథలు నన్ను బాగా ఆకర్షించాయి. రంభ లాంటి పెళ్ళాం రావాలని ఎన్నో కలలు కన్నాను. అలా కలలు కంటూ.. ముప్పయి వచ్చాయి ఒంటిమీదకి. చివరికి, ఎలాగోలా నాకు పెళ్ళి చెయ్యాలని.. ఇంట్లో ‘రంభతో నీకు పెళ్ళి’ అని చెప్పారు. అమ్మ చెప్పింది కాబట్టి.. అమ్మాయి నిజంగా రంభ లాగే ఉంటుందని అనుకున్నాను. ఇంక నా ఆనందానికి అవధులు లేవు. మొదటి రాత్రి.. పెళ్ళాం రంభను దగ్గరగా చూసేసరికి అర్థమైంది.. పెళ్ళి చెయ్యడం కోసం అందరూ నన్ను వెర్రివాడిని చేసారని. మొత్తం మీద, బాధ్యత తీర్చుకోడానికి ఇంట్లో నన్ను ఈ రంభకి ఇచ్చి పెళ్ళి చేసారని అర్థమైంది.
పెళ్ళైన తర్వాత, ఎప్పుడూ నన్ను భర్తగా చూడనేలేదు. ఎన్నో ఆశలతో పెళ్ళి చేసుకున్న నాకు, అన్నీ షరతులతో కూడిన జీవితమే. ఏదో పెళ్ళి చేసుకున్నాము కదా.. పిల్లలు లేకపోతే అందరూ అడుగుతారని.. అంతే తప్ప నాతో ఎప్పుడూ సరదాగా లేదు. ఎప్పుడో మా ఆవిడకి నా మీద కలిగినా ప్రేమకి ప్రతిరూపంగా మాకో అబ్బాయి పుట్టాడు. అక్కడితో సంసార జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది మా ఆవిడ. ఆఫీస్‌లో ఎప్పుడూ టెన్షన్స్‌తో ఉండే నాకు.. ఇంటికి వచ్చిన తర్వాత కుడా మనశ్శాంతి కరువైంది. అలా, మానసికంగా నాలో నేను కుంగిపోయి..ఇలా అనారోగ్యం తెచ్చుకున్నాను.
నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎవరికోసమో నా జీవితం బలి చేసుకోవడం దేనికి..? చివరి ప్రయత్నంగా నీ కోసం తపస్సు చేసాను..”
“నీది చాలా గొప్ప జాతకం కృష్ణ.. అందుకే, నేనే నీ కోసం వచ్చాను”
“నాది అంత గొప్ప జాతకమే అయితే, నాకు ఈ కష్టాలు ఏమిటి రంభ..? ప్రేమ చూపని భార్య, మాట వినని కొడుకు.. నాకు జీవితం మీద చాలా విరక్తి కలుగుతోంది.. నన్ను నీతో స్వర్గానికి తీసుకెళ్ళు..”
“నీ జీవితం అలా ఉంది కనుకే, నా కోసం తపస్సు చేసావు.. నేను నీ కోసం వచ్చాను.. ఇది మంచికే కాదా..”
“అయితే నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్తావు కదా రంభా..?”
దానికి రంభ నవ్వుతూ..
“నువ్వు చాలా మంచివాడివి.. నీ కోరిక తప్పక తీరుస్తాను. నువ్వు ఇల్లు వదిలి మూడు మాసాలు అవుతోంది.. ఇప్పుడు నువ్వు లోకం దృష్టిలో చనిపోయావు.. చూడు మీ ఇంట్లో అందరూ అలాగే అనుకుంటూ ఉన్నారు. ఇక ఈ భూలోకంతో నీ ఋణం తీరినట్టే. నీ కోరిక మీదట నీ తదుపరి జీవితం అంతా స్వర్గం లోనే. ఒక్కసారి స్వర్గంలో అడుగుపెట్టిన తర్వాత, నువ్వు పూర్తి ఆరోగ్యవంతుడవు అవుతావు.. నీ కోరికలు అన్నీ తీరుతాయి.. తథాస్తు..” అంది రంభ.
