[శ్రీమతి గాడేపల్లి పద్మజ రచించిన ‘స్వర్గంలో సుందరమ్మ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఊరి వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తొంభై ఏళ్ళ సుందరమ్మ చనిపోయింది. ఆ రోజు ఊరు ఊరంతా ఆమె ఇంటి ముందు పోగయ్యారు. ఎవరన్నా వచ్చి సాయమడిగితే లేదు, కాదు అనకుండా సాయపడుతుంది. అన్నం తినబోతూ, ఎవరన్నా వచ్చి “అమ్మా ఆకలి” అంటే తనకు లేకపోయినా, మరేం పర్వాలేదంటూ తీసి పెడుతుంది. ఎవరింట్లో గొడవ జరిగినా, పెద్ద దిక్కులా పరిష్కరిస్తుంది సుందరమ్మ. అంత మంచి సుందరమ్మను మామూలు మనుషుల్లా మృత్యువు కబళిస్తుందని బహుశ ఎవరూ అనుకొని ఉండరు. అందుకే ఊరు ఊరంతా ఆ రోజు గొల్లుమంది. అందరు ఆమె కోసం బాధపడుతున్నారు. కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మునిమనుమలు అందరు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. సుందరమ్మ ఎవరికీ ఏ లోటు చెయ్యలేదు. తెలివితేటలు, లౌక్యము, గడసరితనము కలిసి తన వాళ్ళెవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా అడుగుడుగునా కాపలా కాసింది. ఆ రోజు తన వాళ్ళందరినీ వదిలి వెళ్ళలేక ఆమె ఆత్మ చాలా బాధపడింది.
అంతా మంచే కానీ చెడు ఏ మాత్రం చెయ్యని ఆమెను స్వర్గానికి తీసుకెళ్ళారు దేవదూతలు. ఆమె గురించి స్వర్గాధిపతి దేవేంద్రులవారికి విన్నవించారు. “రా, సుందరమ్మా ఇలా కూర్చో, రేపటి నుండి నీకు ఎలాంటి ఈతి బాధలు లేవు. స్వర్గంలోని వింతలు, విశేషాలు ఆస్వాదిస్తూ హాయిగా ఆనందించు” అన్నాడు దేవేంద్రుడు. ఆ మాటలకు పెద్దగా సంతోషపడలేదు సుందరమ్మ. ఒక భటుడు ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్ళాడు. హంసతూలికాతల్పం చూపించి విశ్రాంతి తీసుకొమన్నాడు. ఆమెకు తన వాళ్ళంతా గుర్తొచ్చి చాలా దిగులు వేసింది. అలా చూస్తూ నడక మొదలు పెట్టింది. ఎటు చూసినా సువర్ణమణి మాయకాంతులతో ధగధగ మెరిసిపోతోంది స్వర్గం. బంగారు ప్రాకారాలు, వజ్రపుకోటలు, రత్నాల అరుగులు కనివిందు చేస్తున్నాయి. ఓ ప్రక్క గంధర్వుల గానాలు, మరో వైపు దేవతల అద్భుతమైన సత్సంగాలు, ఇంకోవైపు ఆరవై నలుగు కళలు, కనువిందు చేస్తున్నాయి. గోమేధిక, పుష్యరాగాలతో అలంకరించబడిన కామధేనువు, కల్పవృక్షము పవిత్రంగా దర్శనమిచ్చాయి. సుఖసంతోషాలన్నీ అండపిండ బ్రహ్మాండాలుగా స్వర్గంలో ముత్యపుటుయ్యాలలో ఊగుతున్నట్లుగా అనిపించింది సుందరమ్మకు.
అలా నడుస్తూ దేవేంద్ర సభలోకి అడుగుపెట్టంది. అక్కడ దేవేంద్రుణ్ణి చూడగానే ఆయన దగ్గరకు వెళ్ళి, “నాకు నా వాళ్ళను చూడాలని ఉంది. వాళ్ళ మీద చాలా దిగులుగా ఉంది. నీకు చాలా శక్తులుంటాయి కదా! వాళ్ళను నాకు చూపించు” అని అడిగింది. దానికి ఆయన “ఒకసారి ఇక్కడకు వచ్చాక ఎవరైనా అంతా వదిలివేయవలసిందే. అదంతా మాయ. ఈ స్వర్గమే శాశ్వతం. హాయిగా అమృతం తాగు. ఆనందించు” అన్నాడు దేవేంద్రుడు. ఆ సమాధానం నచ్చలేదు సుందరమ్మకు. “ఇక్కడ ఆనందిచడానికేం ఉంది? ఈ చెట్లు, చేమలు, గట్టు, పుట్టలు నాకేం నచ్చలేదు. ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ నా కుటుంబం ముందు దిగదిడుపే. నా కుటుంబమంతా నా ప్రేమ మీద నిలబడి ఉంది. దాన్ని నాకు దూరం చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీ కామధేనువు, కల్పవృక్షం కోరికనవన్నీ ఇస్తాయి కదా! నన్ను నా వాళ్ళ దగ్గరకు చేర్చుమను” అంటు గొల్లుమంది సుందరమ్మ. ఆమె బాధ చూసి దేవేంద్రుల వారికి కించిత్తు బాధ కలిగింది. ‘అమృతం ఒకసారి రుచిచూస్తే ఆమె ఆలోచన మారుతుంది. అమృతం ఇవ్వమ’ని ఆజ్ఞ జారీ చేశాడు. ఆమె దానిని ప్రక్కన పెట్టి “ఇది మాలోకంలో మందు బాబులు తాగే మందులా ఉంది. నాకు అది వద్దు. నా కుటుంబం నాకు కావాలి. అంతే. దయచేసి నన్ను నా ఇంటికి చేర్చు” అంటూ ప్రాధేయపడింది. ఆమెను ఎలా సమాధాన పరచాలో అర్థం కాక మౌనంగా సభలోకి నడిచాడు దేవేంద్రుడు. సుందరమ్మను సభలోకి తీసుకెళ్ళారు భటులు.
సభలో ఎవరెవరో ఉన్నారు. కొందరు తనకు తెలిసినట్లు, ఎక్కడో చూసినట్లు అనిపించింది ఆమెకు. చిన్నప్పటి నుండి రకరకాల అనుభవాలతో లోకజ్ఞానం సంపాదించుకున్న ఆమెకు వాళ్ళు అవలీలగా గుర్తొచ్చారు. ముందు వరుసలో అష్టదిక్పాలకులు. కొంచెం వెనుకగా భారత, భాగవతాలు రాసిన కవిత్రయము దర్శనమిచ్చారు. ఆ ప్రక్కనే పోతన, శ్రీనాథుడు, ఇంకొంచెం వెనగ్గా సంఘసంస్కర్తలు కనిపించారు ఆమెకి. గురజాడ అప్పారావుగారు రాసిన పూర్ణమ్మ నాటకాన్ని తను చిన్నప్పుడు చూసింది. అది తన మనసు మీద చాలా ముద్ర వేసింది. అందుకే తన ఆరుగురు పిల్లలను బాగా చదివించింది. ఆ రోజుల్లో మూఢనమ్మకాలను పోగొట్టిన మార్గదర్శకులు ఈ మహనీయులు. వాళ్ళకు రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టింది. వాళ్ళకు తనెవరో తెలీదు. గొప్ప, గొప్ప మేధావులంతా ఒకే చోట ఉండడం తను వాళ్ళను స్వర్గంలో అలా కలవడం చెప్పలేని సంతోషం వేసింది సుందరమ్మకు.
వాళ్ళు సమాజానికి చేసిన మేలు సామాన్యమైనది కాదు. అందుకు బదులుగా వాళ్ళను ఇక్కడకు తెచ్చి ఇక్కడ ఉంచడం సబబు కాదు అనిపించింది ఆమెకు. వెంటనే దేవేంద్రుల వారితో, “మీకిది న్యాయం కాదు. స్వర్గం , స్వర్గం అంటు ఇలా వీళ్ళందరినీ ఇక్కడకు తీసుకొచ్చి అమృతం తాగించి ఇలా కూర్చోబెట్టడం ఏమన్నా బావుందా? ఇప్పటికీ భూమి మీద పరిష్కారంలేని సమస్యలెన్నో. వాటిలో పడి కొట్టుకుపోతూ తీరం కనబడక అల్లల్లాడుతున్న అభాగ్యులెందరో? వీళ్ళంతా ఇంకా భూమి మీద ఉంటే సమస్యలన్నీ చాలా వరకు పరిష్కరింపబడేవి. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. వీళ్ళకు ఓ పదేళ్ళ ఆయుద్దాయం ఇచ్చి తిరిగి భూమి మీదకు పంపండి” అంటూ చెప్పుకుపోతోంది సుందరమ్మ. అప్పుడు ఒక భటుడు కల్పించుకుంటు “ఇక ఆపమ్మా సుందరమ్మా. నువ్వు ఎక్కడున్నావో మర్చిపోతున్నావు. ఇది దేవసభ. ఇక్కడ నువ్విలా మాట్లాడకూడదు” అన్నాడు. “ఉండవయ్యా నువ్వు. నేను మాట్లాడేదాంట్లో తప్పేం ఉంది. మీరు చెప్పండి స్వామీ” అన్నది. దాంతో దేవేంద్రుడు “నువ్వు చెప్పేది తప్పేం కాదు. కానీ నాకా శక్తి లేదు. వీళ్ళలో ఎవరి ఆయువును నేను పెంచలేను. నేను ఇక్కడకు వచ్చిన వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వగలను అంతే. కాలస్వరూపమే సృష్టిని నడిపిస్తోంది. ఎవరైనా దానికి లోబడి ప్రవర్తించవలసిందే. తప్పదు. అయినా ఒక మామూలు వ్యక్తివైన నువ్వు ఇంత తెలివిగా ఆలోచిండం. స్వర్గాధిపతినైన నన్నిలా ప్రశ్నించడం, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ ప్రతిపాదన నాకు ఆమోదయోగ్యంగానే ఉంది. దీన్ని గురించి త్రిమూర్తుల ముందు ఒక ప్రతిపాదన ప్రవేశ పెడతాను. వాళ్ళందరి సలహాతో మా చట్టంలో కొన్ని మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను.” అన్నాడు దేవేంద్రుడు.
“ఆ ప్రయత్నం త్వరగా చెయ్యండి స్వామి. వీళ్ళందరికీ ఈ విషయం అర్థం అయిందనుకోండి, ఇక్కడ కూడా ఉద్యమాలు మొదలుపెడతారు. మరి మీ ఇష్టం” అన్నది బెదిరింపుగా సుందరమ్మ. దాంతో కలవరపడ్డాడు ఆయన. “లేదమ్మా సుందరమ్మా! వెంటనే త్రిమూర్తులను కలుస్తాను. వాళ్ళు సృష్టి, స్థితి, లయకారకులు కదా! కొంచెం బిజీగా ఉంటారు. నాకు కొద్దిగా టైం ఇవ్వు. ఇది పరిష్కారం అయ్యే వరకు నువ్వు ఇక్కడ తొందరపడి ఎలాంటి గొడవ చెయ్యకూడదు. ఇది నా ఆజ్ఞ” అన్నడాయన.
“అలాగే స్వామీ. మీ ఆజ్ఞప్రకారమే నడుచుకుంటాను. కానీ ఒక చిన్న కోరిక. నావాళ్ళెలా ఉన్నారో ఒక్కసారి చూపించండి స్వామి. అది చాలు నాకు” అన్నది. దాంతో తప్పలేదు ఆయనకు. “సుందరమ్మా! నీ వాక్చాతుర్యం నాకు అబ్బురంగా ఉంది. అందుకే నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. చూడు, నీ ఇళ్లు, నీ వాళ్ళంతా ఎలా ఉన్నారో” అంటూ ఆయన తన మాయాజాలంతో ఆమెకు కుటుంబాన్ని చూపించాడు. ఆనందంతో కళ్ళు పెద్దవి చేసుకుని ఆత్రంగా తన వాళ్ళందరినీ చూసుకుంది. ఇంట్లో పెద్దకొడుకు ఆమె స్థానాన్ని ఆక్రమించాడు. అందరికీ ఏవేవో సలహాలిస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. సుందరమ్మ ఫోటో హాల్లో పెట్టి దండ వేశారు. అందరు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఎవరూ ఫోటో వైపు కన్నెత్తి చూడడం లేదు. తనంటే భయపడే తన పెద్ద కోడలు అదే గదిలో తన ఫోటోకి ఎదురుగా సోఫాలో కాళ్ళు జాపుకుని కూర్చుని టి.వి. చూస్తోంది. చిన్న కోడలు కూడా అదే భంగిమలో కూనిరాగాలు తీస్తోంది. పిల్లలంతా సంతోషంగా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆ ఇంట్లో ఎక్కడా ఆమె లేని లోటు లేదు. ‘నేను లేకపోతే జీవితమే లేదని విలవిల్లాడిన పిల్లలంతా నేను లేకపోయినా బాగానే ఉన్నారు. ఎవరు లేకపోయినా జీవితమేమీ ఆగిపోదు’ అని అర్థమైంది ఆమెకు. అంటే అక్కడ తను చేయవలసింది ఏమ లేదు. తన పాత్ర ముగిసింది అని అర్థమైంది ఆమెకు. మరుక్షణం కుటుంబమంతా మాయమైంది. ఆమె ఆలోచనలోని మార్పు అర్థమై సంతృప్తిగా తలూపాడు దేవేంద్రుడు. మరుక్షణం తన బాధ్యత గుర్తుకొచ్చి త్రిమూర్తుల దగ్గరకు ప్రయాణ సన్నాహాలు చేసుకున్నాడు. తను లేకపోవడం వల్ల తన కుటుంబం అలా అయిందని, అదంతా దేవేంద్రుడి మాయ అని, మళ్ళీ తను తన వాళ్ళ దగ్గరకు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉండిపోయింది సుందరమ్మ.
