[స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగు కృష్ణకుమారి గారు రచించిన ‘స్వతంత్ర భారతం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
దిగజారిన మధ్యతరగతి నెమ్మదిగా
ఎగువ మధ్యతరగతిగా మారడం
ఆడవాళ్ళు చదువులూ ఉద్యోగాలు
మొదలెట్టి రాకెట్లా దూసుకెళ్ళడం
అద్దె ఇళ్ళల్లో మగ్గిన ఎందరో
సొంతగూడుకి లోన్లు పొందడం
ఏ రోజూ ఆగని ధరల పెరుగుదలలూ
బ్రహ్మంగారు చెప్పినట్టు పాలు, నూనే
మూటకట్టి అమ్మడాలు, చిల్లర
దుకాణాలు మాయమయి సూపర్
దుకాణాలు వెలవడం..
తమ ప్రాణాలు పెట్టి చదువులు చెప్పే
ఉపాధ్యాయుల విలువలని కార్పొరేట్
విషవలయం తన పరిధిలోకి లాక్కొని
విద్యని అమ్మి కోట్లు గడించడం
ఖాయిలా బాటలో ప్రభుత్వ
పరిశ్రమలూ..
చిన్న చిన్న పరిశ్రమలని ఆదుకోక
ప్రభుత్వమే గుత్తాదిపత్యానికి
జోహార్లు చెప్పడం..
పెళ్ళిళ్ళ అంగడిలో మగపిల్లల
విలువ కిందకి పడి, ఆడపిల్లల
కోరికలు అమాంతం పెరగడం
పెరిగిన వోటు విలువలూ
సాగుతున్న భూఆక్రమణలూ
విద్యావంతుల విదేశీ వలసలు
కాలం వడిలో డే బై డే..
చదువులూ ఉద్యోగాల్లో ముందంజ ఎంత వేసినా,
ఆగని స్త్రీల నడిరోడ్డు పరాభావాలూ..
కమనీయంగా ఇంటిపెద్దల్లా
నీరాజనాలందుకున్న పెద్దలందరూ
వృద్ధాశ్రమాల్లో కార్చే కళ్ళనీళ్ళు
ఓ స్వతంత్రమా, నువ్వే ఓ
కంట కనిపెట్టు? అసమదీయులు
ఎవరో? తసమదీయులు ఎవరో?