Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్వయంసిద్ధ – మహిళ

[అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘స్వయంసిద్ధ – మహిళ’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

దేశ సంస్కృతిని, నాగరికతను కాపాడేది మన స్త్రీలు. అనుసృతంగా వస్తున్న అలవాట్లను దీక్ష, పట్టుదలతో ఆచరిస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది. స్త్రీ అన్నది సకార, తకార, రకారముల కలయిక. అంటే ఆమె సత్వరజస్తమోగుణములకు ప్రతీక. ధర్మశాస్త్రాలలో ప్రధానంగా చెప్పబడే మనుధర్మశాస్త్రం “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” అని చెప్పింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారని చెప్పారు. స్త్రీని అబల, అతివ, తరుణి, పడతి, మహిళ అని అనేక పదాలతో పిలుస్తారు. కానీ మహిళ అనే పదం ప్రశస్తంగా వినిపిస్తుంది. ‘మహి’ అంటే ధరిత్రి. ‘క్షమయా ధరిత్రి’ అని స్త్రీని ప్రశంసించారు కదా. భూదేవికి ఉన్న సహనము, ఓర్పు ఆమెలో ఉన్నాయి. కనుకనే మహిళగా ప్రసిధ్ధి పొందింది.

ఆధునిక కాలంలో మానవ సాంఘిక జీవనంలో ఎన్ని మార్పులు వచ్చినా జాతి ప్రాచీనతను, ఆదర్శాలను ఒక్క స్త్రీ మాత్రమే రక్షించగలదు. ప్రాచీనకాలంలో స్త్రీలకు విద్యావకాశాలు లేవు. అయినా వారు వినికిడి జ్ఞానంతో చారిత్రాత్మక, వేదాంత, వైద్య, పౌరాణిక సంఘటలను పాటలరూపంలో తరువాత తరాలకు అందించారు. దీనికి ఏ విధమైన పాండిత్యము, విశ్వవిద్యాలయాల శిక్షణ అవసరము లేదు. జీవితమనే పాఠశాలలో అనుభవాలనే పాఠాలతో నేర్చుకున్నారు. మనకి లభించిన వేద సంపద సమస్తము గురుముఖతః నేర్చుకున్నదే కదా!

“ముఖే ముఖే సరస్వతి” అంటారు

ప్రాచీనకాలంలో మహిళలకు భావదాస్యం లేదు. వారి మనోభావాలను ఏ విధమైన జంకుగొంకులు లేకుండా బయటపెట్టే వాళ్ళు. అది మహిళల యొక్క స్వాభిమానాన్ని తెలియజేస్తుంది. స్త్రీలు గృహలక్ష్ములుగా సంసారచక్రాన్ని సమర్ధించడమే కాక వేదాధ్యయనం చేసిన వారు కూడా మనకు కనిపిస్తారు. గార్గి, మెత్రేయి వంటి వారు యజ్ఞ యాగాలు, జపతపాలు, హోమాలు చేసే అర్హతను కూడా పొందారు.

కానీ మధ్యయుగంలో రాజకీయ వ్యవస్థలు పరిపాలన, విదేశీ దండయాత్రల ప్రభావం వారి స్థానాన్ని కుదించాయి. అప్పుడే స్త్రీ ఇంటికి, వంటింటికి మాత్రమే పరిమితం అనే ఆంక్షలు విధించారు. ఒకప్పుడు ఇంటికి ఆమే రాణి, యజమానురాలు. కాని మధ్యయుగం రాజరికవ్యవస్థల కారణంగా స్త్రీ అణచివేతకు గురయింది. మాతృస్వామ్య వ్యవస్థ పోయి పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. స్త్రీలు పురుషాధిక్యానికి లోనై ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఆ తరువాత కందుకూరి, గురజాడల వంటి సంస్కర్తల ప్రభావంతో చదువుకుని రాణించటం ప్రారంభించారు. మహిళలు ముందుకు వస్తున్నతీరు చూసిన ఒక కవి “లేచింది నిద్రలేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం” అన్నారు. స్త్రీ తన శక్తియుక్తులను ప్రకటిస్తే పురుషుడికి ఏమాత్రం తీసిపోదు. ఆధునిక కాలంలో మహిళల సామర్థ్యాన్ని గొప్పతనాన్ని గుర్తించిన ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ మహిళా దినోత్సవం అని ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది.

మహిళాసాధికారతను చాటటం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమైంది. అమెరికాలో 1908 సంవత్సరంలో తక్కువ పని గంటలు, మెరుగైన జీతం కోసం, ఓటుహక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శనచేశారు. వారి కోరికలను గుర్తించిన అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

ఆ తరువాత క్లారా జెట్కిన్ అనే మహిళ 17 దేశాల ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్’ అనే సదస్సులో మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆమె ప్రతిపాదనకు అన్ని దేశాల మద్దతు లభించింది. ఆనాటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపటం ఆరంభమైంది. 1975 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించి ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించింది. 1975-85 సంవత్సరాలను అంతర్జాతీయ మహిళా దశాబ్ద సంవత్సరంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరము మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపటానికి ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క నినాదం తీసుకు వస్తున్నది ప్రభుత్వం. స్త్రీలకు అండగా ఎన్నో సంస్కరణలను చేపట్టింది. ఈ సంవత్సరం ‘గివ్ టు గైన్’ అనే నినాదాన్నిచ్చింది. పదిమందికి ఏ విషయంలోనైనా, ఏరూపంలోనైనా సహాయపడటం అని దానికి అర్థం.

అలా చేస్తే మనకొచ్చే లాభం ఆత్మసంతృప్తి. అంతకు మించిన ఆనందం వేరేమి ఉంటుంది. అదే గివ్ టు గైన్ ఉద్దేశ్యం మనుషులలో మానవతను పాదుకొలపటమే.

ప్రధాన మంత్రులుగా దేశరక్షణ బాధ్యతను నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతిగా దేశాభివృద్ధి కృషి చేస్తున్నారు. అంతరిక్షానికెగిసిన కల్పనా చావ్లా, సునీతావిలియమ్స్ వంటి వాళ్ళు ఎందరికో స్ఫూర్తిదాయకులు. ‘బేటీపడావో’ అన్ననినాదంతో ఆడపిల్లలు విద్య నేర్వాలన్నారు ప్రధాని. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగన్నది సత్యం. ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, పైలట్లుగా, రైలింజన్ డ్రైవర్లుగా, ఆటో, బస్సులు నడిపుతూ తమ ప్రతిభను చాటుతున్నారు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీని చత్రపతిగా పెంచిన జిజియాబాయివంటి మహోన్నత వ్యక్తిత్వం గల మహిళలు ఎందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. సంగీత, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్యా, వైజ్ఞానిక, వ్యాపార, పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక, రక్షణ, సేవా రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు నేటి మహిళలు. దేశప్రగతిలో తమకు సాటి లేదనిపించుకుంటున్నారు.

అయినప్పటికీ మహిళల పట్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఏమాత్రం తగ్గలేదు. పరువు హత్యలు పెరిగాయి. ఏ పేపర్లో చూసిన అమ్మాయిల ట్రాపింగ్ అంటూ వెలువడే వార్తలే అధికం. అందులో నేటి ప్రసార మాధ్యమాలు సైతం స్త్రీని ఒక ఆట వస్తువుగా చూపుతున్నాయి. సున్నితమైన మనస్సు గల మహిళలను దుర్మార్గురాలుగా చిత్రిస్తున్నాయి. అరవైసంవత్సరాల ముదుసలి నుంచి ఆరునెలల పసిపిల్ల వరకు ఎవ్వరినీ వదలటంలేదు మానవమృగాలు.

ప్రభుత్వం మహిళల రక్షణ కోసం నిర్భయ, దిశా వంటి చట్టాలు, షీ టీమ్‌లు ఏర్పాటు చేసింది. ఈ చట్టాలు స్త్రీల రక్షణకు ఎంతగానో దోహదకారిగా ఉన్నాయి. వీటి అమలు వలన ప్రజలకు ప్రభుత్వం పట్ల నమ్మకం, చట్టం అంటే గౌరవం, పోలీసు వ్యవస్థపట్ల భరోసా పెరిగింది.

అయినప్పటికీ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాక మహిళలు తమను తామే రక్షించుకోగల ‘స్వయంసిద్ధలు’ గా ఎదగాలి. తమను తాము రక్షించుకోవటం కోసం ఆత్మస్థైర్యానందించే కరాటే, బాక్సింగ్ వంటి విద్యలలో ఆడపిల్లలకు శిక్షణ ఇవ్వాలి. ఆడపిల్ల పిల్లిలా కాక పులిపిల్లలా మారాలి. మానవమృగాలను చీల్చి చెండాడే స్థాయికి రావాలి. కామాంధులు కనుమరుగైన వేళ స్వేచ్ఛగా మహిళ తల ఎత్తుకొనే స్థితిని ప్రభుత్వం కల్పించిన రోజు నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భయం భయంగా కాక ధైర్య స్థైర్యాలతో మహిళ ముందుకు దూసుకుపోవాలి. ఈ సత్యాన్ని తమ శక్తియుక్తులను తెలుసుకొని ఇతర భేషజాలకు పోకుండా నూతన ప్రపంచ స్థాపన కోసం మనసా-వాచా-కర్మణా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నప్పుడే నిజమైన మహిళా సాధికారత సిద్ధిస్తుంది. నూటయాభై సంవత్సరాల క్రితమే ‘ఆధునిక మహిళ దేశచరిత్రను తిరగరాస్తుంద’న్న గురజాడవారి మాటలు అక్షర సత్యం.

కుటుంబానికి స్త్రీయే కేంద్ర బిందువు. పెద్దల పట్ల గౌరవాదరాలు, వినయ విధేయతలు, దయాదాక్షిణ్యాలు, అతిథి అభ్యాగతులపట్ల ఆదరం, బంధుప్రీతి, పిన్నవారిపట్ల ప్రేమభావన వీటన్నింటిని చూపగలిగినది ఒక్క స్త్రీయే. చీకటింట్లో దీపం కాంతిని ఇస్తుంది. కానీ చీకటి వెలుగులు, కష్ట సుఖాలను దరిచేయకుండా తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడేది స్త్రీయే. అందుకే పెద్దలు ఇంటికి దీపం ఇల్లాలే అంటారు.

Exit mobile version